మన చూపుకి అందినంతవరకు కొంత స్పష్టంగానూ మరి కొంత అస్పష్టంగానూ చూస్తూ ఉంటాం . రెక్కల చూపు .. ఈ పదం వినగానే ఏదో అర్ధం అయి కానీ భావన . చూపులకి రెక్కలు వస్తే .. మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లి ఏది చూడాలనుకుంటే అది చూసి రావచ్చు . అలా చూపులకి రెక్కలు లేవు కాబట్టే మనకి నిరీక్షణ. కొన్ని కథలని వివరంగానూ కొన్ని కథలని సూచనా ప్రాయంగాను పరిచయం చేస్తున్నాను .
ముఖ్యంగా మార్పు వెనుక మనిషి కథ చదివి మన జీవితాల్లో వస్తున్న మార్పుకి అనుగుణంగా మనం కూడా సర్దుకుపోవాల్సి ఉందని ఈ కథ చెపుతుంది. చక్కటి కథ . శ్రీ లక్ష్మి గారి కొడుకు రాజుకోడలు రమణీ విదేశాలలో ఉంటాడు. ఆమెకి కొడుకు కూతురు పింకీని ప్రేమగా హత్తుకోవాలని చిట్టి పొట్టి కబుర్లు చెప్పుకోవాలని ఆరాటం . రాజు నాలుగైదేళ్ళ తర్వాత మాతృదేశం వచ్చి ఇక్కడ వాతావరణంలో ఇమడలేక మంచి నీళ్ళు కూడా కొనుక్కుని తాగుతూ నాలుగురోజులైనా ఉండకుండా తిరిగి వెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పుడు తల్లి ఇచ్చిన స్వీట్స్ జంతికలు కూడా లగేజ్ ఎక్కువైందని వదిలేసి వెళ్ళిపోతాడు . పుట్టినప్పటి నుండి ఇక్కడ పెరిగిన వాడే కదా ! అంతలోనే విదేశాల అలవాటుతో ఇక్కడ ఉండలేనని వెళ్ళాడు అని శ్రీ లక్ష్మి తలచుకుని బాధపడుతుంది . కొన్నాళ్ళకి ఆమె పుట్టి పెరిగిన ఊరు కొనసీమకి భర్త తో సహా వెళుతుంది. నగర జీవనానికి అలవాటైన వాళ్ళు అక్కడ బురదతో నిండిన నేలలో నడుస్తూ చిరాకు పడుతూ కరంటు లేక దోమకాటు ని భరిస్తూ వారం రోజులు ఉందామని వెళ్ళిన వాళ్ళు ఒక్క రోజుకే తిరిగి ప్రయాణ మవుతూ మార్పు వెనుక మనిషి పరిగెత్తాల్సిందే అనుకుంటారు . సౌకర్యానికి అలవాటు పడిన మనుషులు వేరొక చోట జీ వనానికి అలవాటైన మనషులు కొన్నేళ్ళ తర్వాత తిరిగి వచ్చినప్పుడు అతిధులై ఆ వాతావరణంలో ఇమడలేక ఇబ్బంది పడుతూ సొంత గూటికి చేరుకోవాలనుకోవడం మార్పు వెనుక మనిషి పరుగులు తీయడం తప్పదని ఈ కథ చెప్పింది .
కంచె కథ .. ఈ కాలానికి అవసరమైన కథ. తల్లి బిడ్డని అన్ని వేళలా కంచె అయి కాపాడుకోవాలని చెప్పిన కథ . చిన్నప్పుడే ఇంటి ప్రక్కతనిని ప్రేమించి పెళ్లి చేసుకుని బస్తీ కి వచ్చేసిన నాగమణి వాళ్ళమ్మ నోరుగల మనిషి . ముగ్గురు పిల్లలని స్కూల్లో జేర్పించి పైసా ఫీజ్ కూడా కట్టకుండా సంవత్సరాలు గడిపేస్తూ ఉంటుంది . దయతలచి పరీక్ష ఫీజ్ కూడా ఎవరో ఒకరు కట్టేస్తూ ఉంటారు . ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఆమెని వదిలేసి వేరొక స్త్రీ తో ఉంటూ కుటుంబాన్ని గాలికి ఒదిలేసినా నాలుగిల్లల్లో పని చేసుకుంటా పిల్లలని పెంచుకునే ఒంటరి తల్లి ఆమె . నాగ మణి ఎనిమదవ తరగతి చదువుతూ ఉండాగానే అబ్బాయిలతో స్నేహం చేస్తూ వాళ్ళతోపాటు స్కూల్ టెర్రస్ మీద టీచర్లకి దొరికిపోతుంది . తల్లిని పిలిపించి బిడ్డని జాగ్రత్తగా పెంచుకోమని చెపుతారు టీచర్లు . ఆ మాట విన్న నాగమణి తల్లి ఆవేశంతో ఆ పిల్లని కొట్టబోతుంది. మర్నాటి నుండి తనే స్వయంగా స్కూల్ దగ్గర ఒదిలిపెట్టి మళ్ళీ స్కూల్ వదిలే సమయానికి వచ్చి వెంట తీసుకుని పోతూ .. బిడ్డ ఏ ప్రేమ ఆకర్షణ వలలో చిక్కకుండా ఏ తోడేళ్ళ బారిన పడకుండా కాపాడుకుంటుంది. రచయి త్రి ఈ కథని బాగా వ్రాసారు . కథ మన కళ్ళ ముందు దృశ్య రూపంలో కదిలిపోతుంది.
ఇంకో కథ గోవు మాలచ్చిమి. సరోగ్రసీ మదర్ గా అవతారమెత్తిన పేద మహిళ కథ నవ మోసాలు మోసి తనది కాని తన బిడ్డని అమ్ముకునే తల్లి యొక్క మనోభావాలని సున్నితంగా సృశించిన ఈ కథలో వెంకటలక్ష్మి నారాయణ భార్యాభర్తలు ఉన్న అరెకరం పోలమమ్మి గల్ఫ్ దారిన పట్టిన నారాయణ వెళ్ళిన కొన్నాళ్ళకే చావు తప్పి కన్ను లోట్ట బోయి నట్లు గోడకి కొట్టిన బంతిలా తిరిగి వచ్చేస్తాడు. చేసిన అప్పులు , చేయడానికి పనిలేకపోవడం ,ఆటో అద్దెకి తీసుకుని నడపడం ద్వారా వచ్చే డబ్బు ఆ ఆటో అద్దెకి సరిపోవడంతో పిల్లలు కూడా పస్తులున్దాల్సి రావడంతో దగ్గర బంధువు మల్లేష్ చెప్పిన మాటలు విని భార్య గర్భం ని కూడా తొమ్మిది నెలలు పాటు అద్దె కి ఇచ్చే పని కి ఒప్పిస్తాడు . తొమ్మిది నెలలు మోసి పండంటి బిడ్డని కనీ డబ్బిచ్చిన వారి చేతిలో పెడుతుంది ..దానితొ వారి ఆర్ధిక బాధలు తీరిపోతాయి . వెంకట లక్ష్మికి ఉపాధి దొరుకుతుంది . కానీ డబ్బాశ తో మరొక మారు ఆమెని బిడ్డని కనీ ఇమ్మనడానికి భర్త సమాయతం చేస్తుంటే ... ఆమె ముందుకు కదలక కాళ్ళు దిమ్మ కట్టి పోయినట్లు అక్కడే పాతే సినట్లు నిలబడుతుంది కట్టు కొయ్యకి కట్టేసిన ఆవు దాని చుట్టూ బాధగా తిరుగుతూ ఉంటుంది . ప్రతి ప్రసవం మనిషికి పునర్జన్మ లాంటిది పుట్టబోతున్న బిడ్డపై ప్రేమతో తల్లి వాంతులని వికారాలని భరిస్తూ తొమ్మిది నెలలు మోసి పురిటినొప్పులు భరించి బిడ్డని కంటుంది . ఎవరో డబ్బు విదిల్చేసి పేగు బంధాన్ని తెంచేసి ఆ బిడ్డని లాక్కేలుతుంటే ఏమీ కానిదానిలా చూస్తూ ఉండటం మాత్రు హృదయం భరిచడం ఎంత కష్టమో స్త్రీకి మాత్రమే తెలుసు . అందుకే కట్టు కొయ్య చుట్టూ తిరిగే గోవు మాలచ్చిమి తో వెంకట లక్ష్మిని పోల్చి మూగ వేదనని మన కళ్ళకి చూపించారు .
ఈ కథల సంపుటిలో టైటిల్ కథ రెక్కల చూపు . చాలా దుఃఖ పెడ్తుంది కథ . సావిత్రి భర్త యాదగిరి రిక్షా త్రొక్కుతూ ఉంటాడు. సావిత్రికి మేనమావ అవుతాడు . ఇంకో సంతానం లేని సావిత్రి తల్లి కూడా వారి దగ్గరే ఉండేది ఒక రోజు సినిమాకని వెళ్లి జరిగిన యాక్సిడెంట్ లో సావిత్రి భర్త కూతురు చంద్రకళ ఇద్దరూ అక్కడికక్కడే చనిపోతారు . దెబ్బలు తగిలి కొన్నాళ్ళు మంచం లో ఉండి సావిత్రి తల్లి చనిపోతుంది . చంద్రకళ కాకుండా సావిత్రికి ఇంకో ఇద్దరు కొడుకులు ఉంటారు . వేంకటేశు ,శ్రీనివాసు . సావిత్రి బీడిలు చుట్టుకుంటూ వచ్చే ఆదాయంతో ఇండ్లలో పని చేస్తూనూ పిల్లలిద్దరిని పోషిచుకుంటూ గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటూ ఉంటుంది వారికి స్కాలర్ షిప్ కూడా రావడంతో ఇబ్బందేమీ లేకుండానే జరిగిపోతుంది . వేంకటేశు తెలివికలవాడు పదవతరగతి వరకు చదువుకుని సిమెంట్ ప్యాక్టరీలో పనికి వెళ్ళే వాడు . కొన్నాళ్ళ తర్వాత పనికి వెళ్ళడం మానేసి ఏవేవో పుస్తకాలు చదువుతూ ఉండేవాడు . అప్పుడప్పుడు కొన్ని రోజులపాటు ఇంటికి రాకుండా కూడా ఉండేవాడు . ఒకసారి అలా వెళ్ళినవేంకటేశు ఇక ఇంటికి తిరిగి రాదు . అందరూ సినిమాల పిచ్చితో ఏ బొంబాయి కో వెళ్ళాడని అనుకుంటారు కొన్నాళ్ళకి ఒక ఉత్తరం వస్తుంది . అది చదువుకుని తల్లి సావిత్రి కన్నీరు మున్నీరు అవుతూ ఉంటుంది . ఆ ఉత్తరాన్ని చిన్న కొడుకుకి తెలియకుండా చూరులో దాసీ ఎవరు లేనప్పుడు కొడుకు వ్రాసిన ఉత్తరం తీసి చదువుకుంటూ ఉంటుంది . ప్రతి రోజు కొడుకు వస్తాడనిఎదురు చూస్తూ ఉంటుంది , ఆ ఉత్తరం కూడా వానకి తడిసి అక్షరాలూ మసక బారినా అలాగే ప్లాసిక్ కాగితంలో చుట్టి దాచుకుంటుంది . శ్రీనివాస్ పదవ తరగతి పాసై ఆ ఊర్లోనే కరంట్ పనికి వెళుతూ ఉంటాడు . మధ్యలో ఆతను కూడా ఏవో పుస్తకాలు చదువుతూ ఉంటాడు , తల్లి ఆ పుస్తకాలు చదవడం చూసి తొట్రు పడతాడు . పరీక్షలు అయినాక పుస్తకాలు చదవడం ఏమిటంటే జగ్గన్న ఇచ్చాడని చెపుతాడు జగ్గన్న అంటే వేంకటేశు దోస్త్ కదా ! ఏం చెప్పిండు అని అడుగుతుంది . తొందరలోనే అన్న వస్తాడని చెప్పాడని చెపుతాడు. కానీ వెంకటేసుకి బదులు అర్ధరాత్రి వేళ పోలీసులు వస్తారు . భయంతో తలుపు కాదు కదా కిటికీ తలుపు కూడా తీయనివ్వదు సావిత్రి . తెల్లవార్లు భయంతో వణికిపోతూ సూర్యోదయంకి తలుపులు తీస్తారు . ఇంటి వెనుకప్రక్క ఒక గొనె సంచీని చూస్తారు అందులో రక్త సిక్తమైన వెంకటేష్ బట్టలు పెన్ , డైరీ ఇవి కనబడతాయి . జరిగింది అర్ధమై సావిత్రి కూలబడిపోతుంది . ఆమె చూపు చివర వేంకటేశు శ్రీనివాసు లాంటి ఎందఱో కనబడతారు . ఈ కథ చదివాక మరే కథ చదవలేము. దుఃఖంతో హృదయం భారమవుతుంది. పేద కుటుంబాల లోని పిల్లలు ఎంతో కొంత చదువుకుని కుటుంబానికి ఆధారం కాకుండా విప్లవ సాహిత్యం చదివి పోరు బాట పట్టి అకాల మరణం పాలవుతున్న తీరుని ఎంతో హృద్యంగా, నర్మ గర్భంగా చెప్పారీ కథలో.
విద్యల వ్యాపారాన్ని విద్యని కొనుకునే వారి గురించి ఆలోచింపజేసే విధంగా చెప్పిన కథ అంగడి . స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళ యినా పేదవారికి చదువు అందని ద్రాక్ష ఎందుకవుతుందో చెప్పే కథ . వెనుకబడిన కులాలు తరగతుల వారికి పాఠశాలలో ఉచిత విద్య లభిస్తుందని చెప్పేదెవరు ? వారికి తెలిసేది ఎలా అని దిగులు పడతారు . పేదవాడి రిజర్వేషన్స్ మీద పడి ఏడిచే అగ్ర కులాలవారికి సరైన్న మార్కులు రాకపోయినా ఇంజినీరింగ్ సీట్ కొనుక్కోగల స్తోమత ప్రవల్లిక లాంటి కుటుంబీకులకి ఉంటుంది కానీ చంద్రిక లాంటి పిల్లలు బాగా చదువుతున్నా కాలేజీ మెట్లు ఎక్కే పరిస్థితులు లేని వారి ఆర్ధిక స్థితిగతులు ఎప్పటి మారవు చదువు అంగటి సరుకే అని చక్కగా చెప్పారు రచయిత్రి.
వందేమాతరం పాట సరిగా పాడకపోతే గాంధీ తాతకి కోపం వస్తుంది కదు నాన్నా ! అప్పుడేమో ఇంగ్లీష్ వాళ్ళతో యుద్ధం చేయలేక ఓడిపోతే మనం మళ్ళీ వాళ్ళ క్రిందే పని చేయాల్సి వస్తుంది . అందుకే పాట చక్కగా పాడాలని మాస్టారు అన్నారు అవునా నాన్నా ! అని అమాయకంగా ప్రశ్నించినప్పుడు తన మాటలకి మురిసి పోయి గుండెలకి హత్తుకుని తన బుగ్గల మీద ప్రేమగా ముద్దెట్టుకున్నాడు తండ్రి . ఆనాడు అమాయకంగా అడిగిన మాటలు ఇప్పుడు గుర్తొచ్చిన పరమేశానికి చేతికి తడిగా తగిలింది చెంప . ఇలా ముగుస్తుంది కథ . స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశకాలు దాటాయో లేదో మళ్ళీ మనం విదేశీ వ్యాపారుల కబంధ హస్తాలలో చిక్కుకుపోతున్నాం. మల్టీ నేషనల్ మార్కెట్ ట్రెండ్ మన చిన్న వ్యాపారస్తులని ఎలా నామ రూపాలు లేకుండా చేస్తున్నతీరుని ఆలోచింపజేస్తూ వ్రాసిన కథ ఆరోహణంలో అవరోహణం. అందరూ తప్పక చదవాల్సిన కథ .
ఈ రెక్కల చూపు సంకలనంలో మొత్తం పద్దెనిమిది కథలున్నాయి . వస్తువు దృష్ట్యా అన్నీ మంచి కథలే ! ఏ కథకి ఆ కథ బావుంటుంది . కొన్ని సహానుభూతినీ కల్గిస్తే కొన్ని కథలు ఆలోచింపజేస్తాయి . సుభద్ర గారి చూపు చాలా విశాలమైంది . కనుకనే ఇప్పటి సామాజిక అంశాలన్నింటిని కథలుగా మలిచారు . చాలా కథలు ఆమె అనుభవంలో నుండి వచ్చినవిగా కూడా తోస్తుంది . సుభద్ర గారి రచనలలో స్త్రీల జీవితాల్లో తిష్ట వేసి ఉన్న వేదనని దానికి కారణమైన పురుష అహంకారాన్ని సున్నితంగా విమర్శిస్తూ సాగే ఒక స్త్రీ గొంతుక ఉంది . ఈ సంపుటిలో కథలన్నీ కూడా స్త్రీల జీవితాలలో ఉండే అసహాయత, అంతులేని వేదన కల్గి ఉన్నాయి . కానీ విశేషం ఏమిటంటే స్త్రీలు దుఖాన్నీ మోస్తూనే అవసరమైనప్పుడు ఆత్మ విశ్వాసంతో దైర్యంగా బ్రతికి తీరాలనే తపన కల్గి ఉంటాయి .
మనిషికి హితం కల్గించేదే సాహిత్యం అంటారు . అలాంటి సాహిత్య ప్రయోజనమే ఈ కథలలో అంతర్లీనంగా ఉంది . ఆమె కథలని సమీక్షించే వయసు అనుభవం కూడా నాకు లేదు . కథలు చదివిన తర్వాత నాకు కల్గిన స్పందనకి ఈ అక్షర రూపం . కొండని అద్దంలో చూపించే ప్రయత్నం మాత్రమే ఇది . అందరూ తప్పకుండా చదవాల్సిన కథలు ఇవి అని మాత్రం చెప్పగలను