20, మార్చి 2019, బుధవారం

మురికి భాషపై ఒక వాక్యం

స్త్రీల కోసం.. నేను సైతం వొక వాక్యమవుతాను.

కవిత్వంలో స్త్రీలకొక భాష లేకపోవడం, వారు పురుషుల భాషలోనే కవిత్వం చెప్పాలనుకోవడం.. ఒక రకంగా ఫెయిల్డ్ ల్యూర్ అని చేకూరి రామారావు గారు వాఖ్యానించినట్లు గుర్తు.
ఎవరన్నా కాకున్నా నేనిపుడు అదే అంటున్నాను. ప్రత్యక్షంగా పురుషులు వాడినంత తేలికగా స్త్రీలు  అశ్లీలభాషను వాడలేరు. నిత్యజీవనంలో ఎంతో  నలిగిపోతేనో తప్ప వారికి అశ్లీలభాషను వాడేంత రాటుదేలరు.
నిజానికి ఈ అశ్లీలభాష వాడటం అనేది పురుషులకు వారికి లభించిందనుకున్న స్వేచ్ఛకావచ్చు, ఆధిపత్యభావజాలం కావచ్చు, వాచాలత కావచ్చు, మానసిక జాఢ్యం కావచ్చు.. లేదా అసహనాన్ని వ్యక్తీకరించే తీరు కావచ్చు.
స్త్రీలను వారి లైంగిక అవయవాలను సంభోగ క్రియ పుట్టుకకు మూలమైన అవయవాలని టార్గెట్ చేసుకుని వారి వాచాలతను చాపల్యాన్ని చాటుకున్న ఆనాటి సాహితీ స్రష్ట్రల నుండి ఈ నాటి వీథి బాలల వరకూ చేస్తున్నదదే! ఇక ఫేస్ బుక్ గోడలపై యథాలాపంగా చూసినా కనిపించేవి ఈ అశ్లీలభాషే.
అందుకు విరుగుడుగా స్త్రీల నుండి కవిత్వమో వ్యాసమో నిరసనో యేదో వొకటి రాగానే పురుషుల భద్రలోకం వులికిపడుతుంది. నాలుకల ఆయుధాలను బయటకుదీయటం మొదలవుతుంది.

ద్వేష వ్యక్తీకరణను కాదు ద్వేషానికి కారణమైన మూలాలను చూడండి అని నేను ఈ విషయంలో చెప్పలేను క్షమించండి. ఏ పురుషుడైనా యింకొక పురుషుడిని తిట్టాల్సివస్తే  అశ్లీల భాషలోవారి స్త్రీలను దూషించడం పరిపాటి అయిపోయింది.స్త్రీలు కూడా మరొక పురుషుడిని తిట్టడానికి ఆ వ్యక్తి తాలూకూ స్త్రీలను తమ అశ్లీలభాషలోకి లాగి తమ కుతి తీర్చుకోవడం అనేదాన్ని నేను కూడా తీవ్రంగా నిరసిస్తాను.
మగవాడు అంటే నువ్వంటావా అని సన్నాయినొక్కులు నొక్కొద్దు. ఒకటి అంటే నాలుగువినడానికే సిద్దపడి అనగల్గాలి మరి.అందుకే అమ్మలను అక్కచెల్లెళ్ళను ఆలిని పిల్లలనూ మీ మీ ఆనవాలమైన భాషల్లోకి లాక్కండి.
మీ పురుషభాషలను కనిపెట్టి ఆ భాషలో తిట్టుకుని మీ వాచాలతను చాటుకోండి.

ఒకటి చెబుతున్నాను.. స్త్రీలు మగవాడి వ్యక్తిగత ఆస్తులు కాదు..  ఈ మాటనగానే మీ పుచ్చిపోయిన మెదళ్ళు యేం ఆలోచిస్తాయో నాకు తెలుసు. స్త్రీలు ఎవరి ఆస్తులు కాదు. ప్రతి స్త్రీ తనకు తానే వొక సైనికురాలు. మీ మదం అణచడానికి... మీరు వుపయోగించే భాషలోనే తిట్టాల్సిన అవసరం లేదని తెలుసుకునే క్రమంలో వున్నారు.
ఫేస్ బుక్ గోడలపై యెందుకు..? ఇళ్ళకు వెళ్ళి  మీ అమ్మను చెల్లిని భార్యని ఇంకెవడో యేదో అన్నాడని గర్వంగా చెప్పుకోండి. అపుడు మగవాడిగా మీకు పదవోన్నతి లభించినట్లు. చెప్పలేకపోతే మీ తలను భూమిలో పాతేసుకోండి. స్త్రీలను అణచేకొద్ది తిరగబడతారు... అది భావవ్యక్తీకరణలో కూడా.. దైర్యాన్ని ఆయుధంగా చేసుకుని మరీ...అని మర్చిపోవద్దు. తర్వాత అసలు ఆడదేనా అది ఆశ్చర్యపోవద్దు కూడా.
ఇక అన్ ఫ్రెండ్ చేయడం వ్యతిరేకించడం  అనేది కూడా నిరసన తెలపడానికి వొక మార్గమే తప్ప భావజాలాన్ని నిరసించడమే తప్ప ద్వేషించడం కాదు. ఇలా వొకరినొకరు ద్వేషించుకుంటే భావజాలం మారిపోతుందా... ?  శతాబ్దాల భావజాలాన్ని ఇంత త్వరగా వొడపోసి పారేయడం అంత తేలిక కాదు. సంస్కారం మర్చిపోయి హద్దులు దాటినపుడు మందలింపు తప్పుకాదు..అమ్మలు పిల్లలను మందలించినట్లు మందలించాలి అని నేనూ  అనుకుంటూ...
పశు పక్ష్యాదులుకి  మన మురికి  భాష అర్ధం కాకపొతే మరీ బావుంటుంది అని ఆలోచన చేస్తూ ..

కామెంట్‌లు లేవు: