31, మే 2022, మంగళవారం

జీవన పరిమళం

 జీవన పరిమళం

వెనుదిరిగి చూడకు. ఆ త్రోవతో నీకిక పనిలేదు. 

సీతాకోకచిలుక వెనుదిరిగి చూసుకుంటుందా

మనసు హెచ్చరించింది

నిజమే మరి

ఆనంద నృత్యాలు  విషాద సమయాలు దీర్ఘంగా కొనసాగవు.

మనమంతా పథికులం 

 కొలది హృదయాలు  కొలమానం లేని కలలు 

చెరపనలవికాని జ్ఞాపకాలు

నీటిలో అలలు లాంటి మనో మాలిన్యాలు

మోసుకుంటూ ముందుకే నడవాలి

పరిమళాన్ని జల్లుకోని తుమ్మెదలా  చలిస్తూనే వుండాలి. 

సంకోచం జంకు భయం అన్నీ మనసువి 

గుండెతో దైర్యం తో అడుగులేస్తూనే వుండాలి. 

దీపం కింద చీకటి సహజమైనట్టే 

మనిషి చెట్టుకు చిగురాశను ఊతగా తొడుక్కోవాలి

అదే జీవన పరిమళం.


.

29, మే 2022, ఆదివారం

ఊహలెంత సత్యం




ప్రియమైన నీకు…. 

 చిన్నితల్లీ..   నాయనమ్మ నీకు వ్రాస్తున్న రెండో ఉత్తరం ఇది. 

 నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఒక మధురమైన ఘట్టంలా రికార్డ్ చేయాలని వుంటుంది కానీ చేయలేను. పసిపిల్లలకు ప్రతిది ఆశ్చర్యంగా తోస్తుంది అందుకే వారు అనేక ప్రశ్నలు అడిగి పెద్దలను విస్మయపరుస్తారు అనుకుంటానెపుడూ.ఇప్పుడు  అనుక్షణం నిన్ను చూస్తూ.. పసితనం మనిషికి అద్భుతమైన వరం కదా.. కాలం చెక్కిన గుర్తుల వెనుక అవి మాయమైన తెల్లకాగితాలు కదా అనిపిస్తూంది. 


బంగారూ.. చీకటి పడ్డాక బ్యాక్ యార్డ్ లోకి వెళ్ళగానే మినుకు మినుకు మనే నక్షత్రాలను చూసి స్టార్స్ అని ఒకింత ఆశ్చర్యంతో  చెప్పలేని సంతోషంతో నీవు అనడం చూసి నేను యెంత మురిసిపోయానో.. అది మాత్రమే కాదు ఉదయిస్తున్న సూర్యుడికి “స్వామీ” అని చేతులు జోడించడం, రాత్రివేళ  చందమామను చూసి “దా దా” నీ చిట్టిచేతులతో పిలవడం చూస్తే ఏదో చెప్పలేని ఆనందం.  సైకిలు యెక్కి బయటకు వెళ్ళి తిరిగిరావలనే ఆకాంక్షను చలిగాలుల బూచి చూపి నేను వాయిదావేయడం నువ్వేమో చెట్లఆకుల కదలికలను చూసి కొద్దిపాటి భయం ప్రదర్శించే చూపులతో  “అమ్మో గాలి” అనడం. ఇలా ప్రతి విషయం నాకు అపురూపమే.


పచ్చదనాన్ని ప్రకృతిని పరిరక్షించుకోవాలనే  ఆకాంక్ష వున్న నేను.. నిన్ను మొక్కల దగ్గరకు తీసుకువెళ్ళి వాటికి గుడ్ మార్నింగ్ చెప్పించి ఆకులను స్మూత్ గా టచ్ చేయిస్తూ.. చెట్టూ ఐ లవ్ యూ అని  నీతో చెప్పించడమూ,  కేవలం స్క్రీన్ మీదనే కాకుండా  అనంత ఆకాశాన్ని మబ్బులను పక్షులను వాన ను సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలను ఎడతెగక తిరిగే విమానాలను విరబూసిన పూలను మంచును ఇంటి ముందు ముగ్గులను దీపకాంతుల మధ్య దైవమందిరాన్ని నీకు పరిచయం చేయడం నా బాధ్యత కూడా.ఏ రాగమో తెలియక పోయినా ఏ భాష రాకపోయినా గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గరళమాధుర్యానికి పరవశిస్తూ రాగాలు ఆలపిస్తూన్న నిన్ను చూసి నాకెంతో మురిపెం. అలాగే Nora En pure బీట్ కి లయబద్దంగా కాళ్ళు కదుపుతూ  రిథమిక్ గా  ఊగిపోవడం చూస్తే కూడా అమిత ఆశ్చర్యమూ ఆనందం. నీ బోలెడన్ని  ఆశ్చర్యాలు నేను అనుభవించడం కూడా  ఆనందమే! ఇలా రోజు మొత్తం  సూర్యుడు చుట్టూ తిరిగే భూగోళంలా మనుమరాలు చుట్టూ తిరిగే నాయనమ్మను అయిపోయాను. 


 నీ సాన్నిహిత్యంతో మనసుకు తొడిగిన నైరాశ్యాన్ని కడిగేసుకుని  నువ్వు ఇంకొంచెం పెరిగిన తర్వాత నన్ను అడగబోయే ప్రశ్నలను ఊహించుకుంటూ  ప్రియమైన నీకు ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. ఈ ఊహలో సత్యమెంతో మధురం కూడా అంతే! నువ్వు నన్ను ఇలా అడుగుతూ వుంటావన్నమాట. నేను నీకు సమాధానం చెపుతుంటాను.


******


 “నాయనమ్మా!  రాత్రంతా నక్షత్రాలు ఎందుకు అలా  మెరుస్తున్నాయి”


చీకట్లో దారి కనబడక మనం ఇబ్బంది పడుతుంటామని   దేవుడు మనకు దారి చూపడానికి ఇచ్చాడమ్మా అంటాను నేను. 

ఉహూ.. అంటావ్ పెద్ద ఆరిందలా.


మరో రోజు..


 “ నాయనమ్మా! రోజూ సూర్యుడు ఎందుకు వస్తాడు, సాయంత్రం మాయమైపోతాడెందుకు”


చిన్నితల్లీ..  మిష్టర్ సూర్య ఎక్కడికీ వెళ్ళడమ్మా అతనికి చాలామంది పిల్లలు. వాళ్ళ ఊరికి కూడా వెళ్ళి వస్తాడంతే!

 

 “నాయనమ్మా! వాన ఎందుకు కురుస్తుంది. కాసేపటికి

 మాయమై అది ఎక్కడికి వెళుతుంది?"


 “పూల చెట్లకు, పండ్ల తోటలకు, పొలాలకు  దాహం అవుతుందని దేవుడు వాటికి నీళ్ళు పోస్తాడమ్మా  ఎందుకంటే ఆయన వాటిని  ఎంతగానో ప్రేమిస్తున్నాడు.


” నాయనమ్మా! నువ్వు నన్ను కూడా ఎప్పుడూ ప్రేమిస్తావా!  నేను  ఎంత అల్లరి  చేసినా తిట్టకుండా ప్రేమిస్తావా!? అని అడుగుతావు.


చిన్ని తల్లీ! నా బంగారు కొండా! నువ్వు నాకెప్పటికీ ప్రియమైన దానివి. ఎల్లప్పుడూ నా బిడ్డవి, ఎప్పటికీ మరియు ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే వుంటాను. దేవుడు మన అందరినీ ప్రేమించినట్లే నేనూ నిన్ను అమితంగా ప్రేమిస్తాను బంగారు తల్లీ! అంటాను.


అపుడు నీవు నన్ను ఎత్తుకోమని చేతులు చాపుతావు. నేను నిన్ను ఎత్తుకోగానే నా మెడ చుట్టూ చేతులు చుట్టేసి “ ఐ లవ్ యూ నాయనమ్మా” అంటూ ముద్దులు  పెడతావు. నా హృదయం అమృతం సేవించిన ఆనందంతో ఊగిపోతుంది.  చిప్పిల్లిన కళ్ళతో..   “హృదయాలను వెలిగించే దేవుడు కల్మషం ఎరుగని పసి మనసుల్లోనే కదా వున్నాడు కదా” అంటాను మీ నాన్నతో.  “అవునమ్మా” అంటాడు మీ నాన్న. 


నాకు తెలియని నా పసితనం నాకు తెలిసీ మీ నాన్నకు తెలియని మీ నాన్న పసితనం ఇప్పుడు మా ఇద్దరికీ తెలిసిన నీ పసితనపు ముచ్చట్లు ఇలా భద్రపరచడం నాకెంతో ఇష్టమైన వ్యాపకం కూడా. నువ్వు పెరిగి పెద్దయ్యాక వీటిని చూసి సంతోషిస్తావ్. ఫోటోగ్రాఫ్ లు వీడియోలతో పాటు ఈ లేఖలను కూడా నీ పిల్లలకు చూపించి నీ బాల్యాన్ని వారికి పరిచయం చేస్తావు కదూ! బాల్యం మధురమైనది ఎంతో స్వచ్ఛమైనదని అప్పుడు నువ్వు కూడా అనుకుంటావు. 


              శుభాశీస్సులు బంగారు తల్లీ.. ప్రేమతో నాయనమ్మ. 



(175 మంది రచయితలు వ్రాసిన లేఖాసాహిత్యం పుస్తకరూపంలో ‘’ జ్యోతి వలబోజు’’ గారి సంపాదకత్వంలో


‘’ ప్రియమైన నీకు’’ వెలువడింది. అందులో నేను వ్రాసిన లేఖ ఇది. 






19, మే 2022, గురువారం

రాతి సీతాకోకచిలుక

ఒకప్పుడు వానాకాలం వస్తుందంటే 

కళ్ళు కలల సీతాకోకచిలుకలయ్యేవి 

ఊహలను మాలలుగా అల్లడం అలవాటేమో

తుది మొదలు సృహ లేని కాలం అది


రాతి పుష్పాలపై  తుంటరి తుమ్మెదలు 

ప్రదక్షిణలు చేసి చేసి విసిగిపోయినట్లు

మధువుకై శోధించి స్వప్నించి శోష పడి

వరుణుడిని అర్ధించి  కడకు

అమృతంతో తడిసిన పూలరెక్కలపై  విహరించి  

తూలి తూగి సోలిపోతాయని..


పూల గోష్ఠి కి తుమ్మెదల చెవులనుండి రక్తం కారిందని

మకరందం గ్రోలే సీతాకోకచిలుకలు 

పూల రంగులకు మూర్చిల్లి తమ అయిదు నెలల ఆయువును  త్యాగం చేసాయని.. 

తుమ్మెదలకు పరిమళాన్ని జల్లుకునే పనిలేదనో

 ఇలా యేవేవో.. ఊహల మాలలు


వయస్సు పడమటికి వాలుతుంటే

ఇతర ప్రాణులు అర్దం చేసుకున్నట్టు

వెలుగు నీడల భాషను  అర్దం చేసుకోలేని 

మనిషి నని తప్పటడుగుల నాడే

కాలం ఆగిపోయి వుంటే 

యెంత బాగుండేదని ఓ అత్యాశతో పెనుగులాట.. 


నిత్యం రంగుల పండుగను చూస్తూ 

యెగరలేని రాతి సీతాకోకచిలుకను నేను 

అకాల వృద్దాప్యపు చొక్కా తొడుక్కున్న 

నత్తగుల్లను నేను.

18/05/2022.



12, మే 2022, గురువారం

కథ కాదు.. జీవితం.

 అతడు - ఆమె సిరీస్ లో మరో మైక్రో కథ.


కథ కాదు.. జీవితం.


‘’ఒక వాచాలుడి, స్వామి ద్రోహి ఆట కట్టించాలనుకున్నా కానీ  వీలుకాలేదు ఆ కసి తీరలేదు ‘’ కచ్చగా  అన్నాడు ప్రియురాలి ముందర నిలబడి యుద్దానికి సిద్దపడుతూ.. 

 

“ప్రజలకు విధేయుడిగా సేవకుడిగా వుండవలసిన నువ్వూ స్వామి భక్తిని విశ్వాసాన్ని బాగానే ప్రదర్శిస్తున్నావు గా” అందామె బోల్డ్ గా బెరుకు లేకుండా. 


అతని పౌరుషం సందిగ్దంలో పడింది. కటువుగా అన్నాడు “ ఇదేమాట నా భార్య అని వుంటే చెంప పగిలి వుండేది”


“అలా ఎన్నిసార్లు జరిగిందో.. అందుకే ఆమె గృహహింస కేసు పెట్టింది”  దెబ్బతో నీరుగారి పోతాడనుకుని అపోహ పడింది ప్రియురాలు. 


అతని చెయ్యి ఆమె చెంపను బలంగా తాకింది. ఆమె నివ్వెరపోయి చూస్తుండగానే..నిలువెత్తు అహంకారానికి యూనిఫామ్ తగిలించుకుని “ కారుచౌకగా శరీరాలను కొనగల్గిన నన్ను  ఒక శరీరం ప్రశ్నించడం అస్సలు నచ్చదు, బి కేర్ పుల్” టకటక నడుస్తూ  వెళ్ళిపోయాడు. 


“ఆడదంటే శరీరమేనా!?” భంగపడింది.జీవితాన్ని ఫణంగా పెట్టినందుకు విచారపడింది. 


కథ కాదు జీవితం. ఒక్క ప్రశ్నకు పైన వన్నియునూ అనే సమాధానం.


లేనిది కోరేవు

ఉన్నది వదిలేవు

ఒక పొరపాటుకు యుగములు వగచేవు… తెరపై పాట నడుస్తుంది. 


****************


hydrangea flowers.. మొగ్గ విచ్చినది తడవు నేల రాలేవరకూ.. ఎన్ని రంగులుగా మారుతుందో.