20, ఫిబ్రవరి 2023, సోమవారం

కుల వృక్షం కథ మరొకసారి

 కుల వృక్షం కథ .. ఆస్ట్రేలియా నుండి వెలువడే తెలుగు మాసపత్రిక "వీధి అరుగు" లో ఆణిముత్యాలు శీర్షికన ప్రచురింపబడింది. 




కథ ను మిత్రులందరూ చదవగలరని ఆశిస్తూ.. ధన్యవాదాలు


3, ఫిబ్రవరి 2023, శుక్రవారం

వెనుకెలుగుతో


గుర్తుకొచ్చినప్పుడల్లా నోట్లో నీరూరినట్లు

ఆలోచనలో నువ్వూరుతూనే ఉంటావ్

రెండు గుండెల దరుల మధ్య ఒరుసుకుంటూ వెళ్ళి 

ఒంటరిగా ప్రవహిస్తున్న నది వద్దకి తోడెళతాను

అసంగత విషయాలేవో ముచ్చటించుకోవాలని

ఆణువణువూ దర్పణమైన తనలో

నన్ను చూసుకోవాలని


నదిలోనువ్వేం వదిలేస్తావ్ ...

కానిదేదో వదిలేయ్ ..ఒక పనైపోతుంది.

ఎవరో విసిరిన చెణుకులు తగులుకునే ఉన్నాయి

వదలడమంటే .. మనకి కష్టం కల్గించే వాటిని వదలడమా ...

ఇష్టమైన దానిని ఇష్టంగా వదలడం కాదా !

ఒదిలేసాక కొంత దూరం ముందుకు నడుస్తాను

ఇంకా ముందుకు పోలేక వెనక్కి రాలేక

అగమ్యగోచర పధాన ఆచూకీ వెదుకుతూ అవస్తపడతాను


నది నల్లదనాన్ని వెలిగించాలని మిణుకు మిణుకు మనే

తారల తాపత్రయాన్ని చూస్తూ ఉంటాను

రాని వసంతం కాసిని పూలనీ రాల్చనట్లు

ఎంతకీ రాలని పలుకులు కోసం నిరీక్షిస్తాను

కంఠ స్వరం పై మౌనం నాట్యంజేస్తూ

మాట బిడ్డలు లేని గొడ్రాలవుతుంటే

నిశ్శబ్ధ నీరవాలని వింటూ

నీ ధ్యానంలో మునిగిపోతాను


చీకటి చిక్కనైంది మనసులో కూడా

వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళానేమో

వచ్చేటప్పుడు ఈడ్చుకుంటూ మోసుకొస్తాను

నాతో పాటు నిన్నువెలుగులా

ముందు నా నీడతో ఏళ్ళ తరబడి ఇదే దృశ్యం

అక్కడ ఒదిలింది నిన్నా నన్నా !?


02/11/2015.




2, ఫిబ్రవరి 2023, గురువారం

వారు వారే

వారు వారే

ఇంట్లో ప్రదర్శించిన దానితో తృప్తి చెందక 
మిగుల్చుకున్న వికృతపు చొక్కా తొడుక్కుని
చెప్పులో కాలు పెడుతూనే చుట్టుపక్కల గోడలని దాటి 
మరీ వెతుక్కునే ఆకలి చూపులు
అంతటితో ఆగవు సరికదా
అందరూ వారి కోసమే ఆరేసుకుని
ఉంటారనుకున్నట్లు
రోడ్డుపై పరికింతలు


వరుసలలోనూ  సందోహాల మధ్యనూ
అవకాశం దొరికితే వంటరితనంలోనూ  
శరీరాల తాకిడికై వెంపర్లాటలు 
జేబుదొంగలు కూడా సిగ్గు పడే వీరి లాఘవం 
నడుము వంపులని సృశిస్తూనో 
గుప్తంగాలు రాపిడిచేస్తూనో 
పైపైన పలికే “సారీ” లతో
పోనీలే ! పాపం పొరబాటు అన్నాడుగా అనుకున్నా

ఒక్క క్షణం అయోమయం తర్వాత
నిజాన్ని గుర్తించి  ఏది అబద్ధపు ముసుగో
ఎవరు మేకవన్నె వ్యాఘ్రమో తెలిసి
అమ్మో! ఈసారి అయినా జాగ్రత్త పడాలనుకుంటాం
వయసు ఉడిగేదాకా


పర స్త్రీ అనాటమీ లో
అమ్మ అనాటమీ చూడలేని
అనాగరిక సంతతి వారిది
అరుచిల అనాటమీలో
ఏదీ  రుచించని 
వికృత అభిరుచి వారిది
వారు వారే ఎన్నటికిమారని వారు వారే 

(ద్వేష వ్యక్తికరణ రూపాన్ని కాదు ద్వేషించే కారణం చూడాలి)  

(ఈ కవితలో కనిపించే ద్వేషం కేవలం నా ఒక్క దానిది మాత్రమే కాదు. ఎందరో ఆడ కూతుర్లు పైకి వెల్లడించుకోలేక నిత్యం మృగాల చూపులను, వారి వికృత చేష్ట లను భరించవలసి రావడం అవమానకరం,ఆవేదనా భరితం. ఇది స్త్రీలందరి సమస్య. అందుకే వాడిగా వ్రాయవలసి వచ్చింది.అలాంటి వారు మారతారనే ఆశతో..ఈ కవిత )