22, జనవరి 2025, బుధవారం

డప్పుల బండి

 డప్పుల బండి 

వాడు స్త్రీల దేహాలను తమ  చూపుల భాషలోకి కొలతల్లోకి మార్చుకుంటాడు. ప్రేమకు దర్పణంగా వున్న ఆమె గుండెలను తమ వాడి అయిన  చూపుతో గుచ్చి గుచ్చి చంపుతాడు. 

పచ్చని వనంలా వున్న దేహ ఆవరణలోనికి వాడు బందిపోటు దొంగలా ప్రవేశిస్తాడు. ఆమె అస్థిత్వం పై జులుం ప్రదర్శిస్తూ తన పురుషత్వపు కొరడా ఝళిపిస్తాడు. 

మరులుగొన్న మృగంలా ఉన్మాదంతో దాడి చేయడంతో ఆగక  పైశాచికత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తాడు. నేరాలను కొత్తపుంతలు తొక్కిస్తాడు. 

మరొకచోట..

ఏడడుగులు నడిపించాల్సిన వాడే 

ఏడు కట్ల సవారి పై పడుకోబెడతాడు 

మోజు తీరాక ప్రిడ్జ్ లో ముక్కలు ముక్కలుగా 

సర్దేస్తాడు. ప్రెషర్ కుక్కర్ లో ఉడకబెట్టేస్తాడు. 


ఆ వార్తలను మహోగ్రహావేశాలతో డప్పులబండి వాడిలా చానల్స్ వినిపిస్తాయి. అలసి ఆగిపోతాయి మరొక మేత అందేదాకా.

 స్త్రీ జీవితమంటే ...ఇంత అల్పం స్వల్పం గా మారిపోనున్నాయ్యా ?  స్త్రీలు దేహం గేహం మనసు హృదయం లేని ఆట బొమ్మలై పోయారా!? 

వ్యవస్థ లన్నీ వేశ్య కన్నా హీనంగా అమ్ముడు పోయాక.. అతివకు న్యాయం జరిగేది ఎక్కడ?ఈ ఆక్రోశం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిందా? 

మనుషుల మధ్య 

దయ కరుణ ప్రేమ జాలి లాంటివి కనుమరుగైకామం కోపం ఉద్రేకం ఉన్మాదం పైశాచికం భీభత్సం లాంటివి కులం లా మతంలా వాదంలా జెండా ఎగరేస్తున్నట్టు వుంది. 


ఎంతైనా.. 

డప్పులబండి.. కాలమే నయం. లోకం ఇంతగా చేవ చచ్చి లేదు. వెనక్కి పోదాం పదండి. 





కామెంట్‌లు లేవు: