25, జనవరి 2025, శనివారం

బనలతా సేన్ -జీవనానంద దాస్

 జీవితం మరీ నిసృహగా యాంత్రికంగా మారినప్పుడు నాలోనన్ను నేను వెతుక్కుంటాను.అది ఎలా అంటే చలి పాదాల ద్వారా ప్రవహించి నేనున్నానంటూ గుర్తు చేసినట్లు. 

రోజంతా ఏం చేస్తుంటావ్ ఎప్పుడూ తీరికలేనట్టూ హడావిడి సంభాషణ చేస్తావ్ అంటారు. నిజానికి వారితో సంభాషణించడం నాకు మీదు మిక్కిలి ప్రయాస. అనేక వస్తు సంచయాల మధ్య ఆరోపణల బాంధవ్యాల మధ్య వారు అసంతృప్తిగా వుంటారు. వాళ్ళతో మాటలంటే విముఖత నన్ను వారి లోకానికి పరిమితం చేస్తారని. 

నిజానికి నాకు ఇంటి పని వంట పని గంటన్నర సమయంలో ముగిసిపోతుంది. 50+ లోకి వచ్చేసరికే నా కొడుకు రిటైర్మెంట్ జీవితం తీసేసుకో.. అని బలవంత పెట్టాడు. చేయడానికి ఏ పని లేదు. అంతకు ముందు పుస్తకాలు చదవడం కోసం రోజుకు రెండు గంటలు అయినా నిద్రను త్యాగం చేసేదాన్ని. అదృష్టవశాత్తు నాకిప్పుడు బాగా చదువుకునేంత తీరిక. అనేకం చదువుతుంటాను. నా అదృష్టం బావుంటే రోజు మొదట్లోనే నాకు తృప్తి నిచ్చిన రచన నా పాలబడుతుంది. లేదంటే లేదు.. రోజంతా చదువుతూనే వుంటాను. 

ఆఖరుగా నన్ను నేను వెతుక్కోవాలి అనుకున్నప్పుడు.. ఠాగూర్ ని తెరుస్తాను. లేదా ఖలీల్ జీబ్రాను ను తెరుస్తాను. లేదా ప్రకృతిలో నడుస్తాను. 

నిజంగా చెప్పాలంటే ఓ కెమెరా భుజాన వేసుకుని  ఆకలిదప్పులు లేకుండా అలా నడుచుకుంటూ పోవాలని.. వనవాసి లా ఆ గుర్రం మీద కూర్చునే..  ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ మార్మికతను అర్థం చేసుకోవాలని. 

ఊహలు ఆశలు ప్రపంచం లో వున్న సౌందర్యాన్ని వీక్షించాలని  మస్తిష్కంలో గాఢంగా నింపుకోవాలని.. .. నిశ్శబ్దంగా మాయమవ్వాలనీనూ. 

ఎక్కువ ఊహలు కొంచెం అనుభవం మరికొంచెం అనుభూతి. 

గంగిగోవు పాలు గరిటెడైనను చాలు. 

పుస్తకాలకు పాపలకు  సంగీతానికి సన్మిత్రులకూ .. నేను సన్నిహితం. ప్రకృతి కి మరింత సన్నిహితం.

బనలతా సేన్ - జీవనానంద దాస్ కవిత వినండీ.. 


చుట్టూరా ఇంతకు మునుపు లేని  దట్టమైన మంచు కమ్ముకుంది.. నా మనసును వనలతా సేన్ కమ్ముకున్నట్టు. జీవనానంద దాస్ గురించి వింటుంటే  నా హృదయానికి మునుపెన్నడూ తెరుచుకోని కొత్త ద్వారాలు తెరుచుకున్నట్టు వుంది. పసుపు పచ్చని బెంగాలీ నేత చీరలో ఆకుపచ్చ రవికతో వనలతా సేన్ మసక చీకట్లో దడి మీద పూచిన బీర పువ్వులా అనప పువ్వులా దృశ్యాదృశ్యంగా గోచరించింది. జలపాతం లాంటి ఆమె కేశపాశంపై మిణుగురులు తారట్లాడుతున్నట్టు కనిపించింది. ఒక అడవి పువ్వు తన పరిమళంతో పరిసరాలను మత్తులోకి చేయిపెట్టి తీసుకువెళుతున్నట్టు వుంది. వనలతా సేన్ నాకొక పురా సంస్కృతి. ఆధునిక స్త్రీ జాతి ఎప్పుడైనా తనను తాను వెతుక్కుంటూ వెళితే లభించే గుప్తనిధి. నా రాబోయే కథలో వనలతా సేన్ నాయిక. 

జీవనానంద దాస్ గురించి నేస్తం P.సింహాద్రమ్మ గారి మాటల్లో వింటుంటే నాకు కలిగిన అనుభూతి ఇది. 

కవిత్వాన్ని అర్థం చేసుకోవడం ఆకళింపు చేసుకోవడం అన్వయించడం అనుభూతి ని మన మాటల్లో వర్ణించి చెప్పగల్గడం.. అనేది ఒక కళ. ఆ కళాకృతి సింహాద్రమ్మ గారు. నాకు ఎంత నచ్చేసినారో! 

జీవనానంద దాస్ నా పైన ఆకాశంలో ఎగురుతూ వుండొచ్చు.. ఆయన్ని ఈ రోజంతా నా హృదిలోనూ మది లోనూ నింపుకున్నందుకూ.. 

మాట్లాడటం వొక అనుభవం. అనుభూతిని అనుభవంలోకి తెచ్చుకున్న అనుభవం. 

మేడమ్.. P.సింహాద్రమ్మ గారూ.. 

Thank you so much.. నా రోజు ని ఫలప్రదంగా మార్చినందుకు.




కామెంట్‌లు లేవు: