అర్థ సత్యం - వనజ తాతినేని
కొన్ని వస్తువులు పని చేస్తున్న శబ్దాలు తప్ప
మనిషి పిట్ట అలికిడి లేని ఇల్లు
పిల్లలు వారి స్నేహితులతో పార్టీలోనో
పబ్ లోనో
భార్య తన స్నేహితుల మధ్య నో షాపింగ్ మాల్ లోనో
ఎవరికీ ఎవరితోనూ సంబంధం లేదు కరెన్సీతో తప్ప.
సంపాదించే క్రమంలో.. కోల్ఫోయినవి కళ్ళ ముందు సాక్షాత్కారం
ఇప్పుడు తన కోసం ఎవరూ తీరికగా
లేరు. తన ఉన్నతికి ఈర్ష్య పడుతున్న శత్రువులు మిత్రులు రూపంలో
తన చుట్టూ ఈగల్లా మూగే బంధువులు
మధువు మగువ కూడా నిషా నివ్వడం మానేసి చాలా కాలమైంది.
మాటా మంతీ కష్టం సుఖం అనుభూతి అనుభవం
పంచుకోవాల్సిన వాళ్ళు వేరొకరితో పంచుకోవడం సాధారణమైపోయింది
అలసినది ఒంటరిది నా మది
తెర చాప అనే ధనం బ్రతుకు పడవకు సౌఖ్యమే కానీ
కట్టి పడేసే బలమైన లంగరు గొలుసు ఇల్లు మాత్రమే
కాల నది ప్రవాహంలో పగులుబారిన ఓటి పడవ నడక ఇది
నడి రేతిరి
వీధి దీపాలైనా వొకటికొకటి తోడుగా నిలబడి నట్లు వుంటాయి కానీ .. మనిషికి మనిషి తోడు వొక భ్రమ. నడి వయసు యాతన
పండోరస్ పెట్టె తెరుచుకుంది. లోన దాగిన evil విడుదలకు నోచుకుంది.
తేనెటీగల్లా చుట్టేసిన జ్ఞాపకాలు
ఇంకొన్నాళ్ళు వుండకూడదా అని నాన్న నిశ్శబ్దంగా కార్చిన కన్నీరు
తన సౌఖ్యం కోసమే అనుక్షణం తపించిన తల్లి
తన పిలుపు కోసం ఎదురు చూస్తూ చూస్తూనే శాశ్వతంగా మూగబోయిన వారి మొబైల్ ఫోన్లు
ఆలస్యమైపోయింది.వగచి ప్రయోజనం లేదు
ఏదైనా మాయా తివాచీ దయ తలిస్తే బాగుండును
కరుణ కు కాణాచి అయిన వారి ఒడిలో కాస్తంత సేదతీరడానికి పరుగులు నెమ్మదించడానికి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి