బాల్యం మళ్ళీ చివురించిన జ్ఞాపకం. - వనజ తాతినేని
బాల్యాన్ని జ్ఞాపకం చేసుకోవడమంటే శిఖరాగ్రం చేరుకున్నాక లోయలోకి తొంగి చూడటం.
ఈ చిత్రం చూడగానే నేను నడిచొచ్చిన దోవలు మదిలో మెదలడం.
వేసవి సెలవుల తర్వాత బడి తెరిచినాక దబిడీదిబిడీ వానల్లో కిందపడి పగిలిన నేరేడు కాయలను ఏరుకోవడం.
నున్నటి తార్రోడు మీద రాలిపడిన ఎర్రటి తురాయి పూల సౌందర్యాన్ని చూసి ఉత్సాహపడటం
జోరున కురుస్తున్న వానలో తడుస్తూ ఆనందంగా గంతులు వేయడం
వగరు చింతపూతను కోసుకుని దూసుకుని తినడం ఆకాశంలో తిరిగే తూనీగలను అందుకోవాలని ఎగరడం పండు తాటికాయల కోసం వెదకడం. ప్రతి పండక్కీ ఎర్ఱమట్టి ఆవుపేడతో అలికిన నేల నాముతో వేసిన అందమైన ముగ్గులు గడపలకు పసుపు కుంకుమలు అలంకరించిన ఎర్ఱ ముందార పూలు. శ్రావణమాసం పేరంటాలు జాజిపూల పరిమళాలు.
వినాయక చవితికి మట్టి బొమ్మ చేయడం పత్రి పోగేయడం కష్టం అనిపించే సబ్జెక్టు పుస్తకాన్ని అన్నంటికైనా పైన పెట్టడం వినాయకుడికి పైకి నాలుగు దణ్ణాలు లోపల వందల దణ్ణాలు పెట్టుకోవడం, మధ్యాహ్నం భోజనం తిన్నాక ఆకుపచ్చ కాగితంలో చుట్టిన చాక్లెట్ లని జేబులో వేసుకుని
బత్తాయి కాయ ఒలుచుకుని తింటూ పరిగెత్తడం, డాక్టర్ గారి కుక్క అన్నయ్య పిక్క పట్టి కరవడం. దీపావళి కి స్వయంగా మతాబులు చేసుకోవటం, టపాసులు పేల్చడం దివిటీలు తిప్పడం.
కార్తీకమాసంలో పున్నాగపూలు ఏరుకోవడం దండలు అల్లడం, దడుల మీద పూసే కాశీరత్నం పూలరంగు చూసి లోకాన్ని మరిచిన మైమరపు, వనమ్మత్తయ్య వాళ్ళ చెట్టు జామకాయలు దొంగతనంగా కోసుకోవడం, నేతి బీరకాయల సేకరణ
బీర పువ్వుల గుమ్మడిపూల పచ్చదనం అనపపూల సౌంద్యర్యం చూసి అబ్బ ఎంత బావుందో కదా అనుకోవడం, మునుసబు గారి తోటలో వనభోజనాలు. ఉసిరికాయలు ఏరుకోవడం. దట్టంగా మంచు పడేటప్పుడే గొందిలో రేగుచెట్టు కిందకు పరిగెత్తడటం, ఛీ ఈ కాయలు బాగోలేదు అంటూ శ్రీరావమ్మ గారి గంగరేగు చెట్టు కాయలు కోసం పరుగులు పెట్టడం. కోతికొమ్మచ్చి ఆడటం కాలో చెయ్యో విరగగొట్టుకోవడం గోలీలాటలో తొండి చేసినవాళ్ళకు గురి చూసి గోలీతో కొట్టడం. ప్రతి సంక్రాంతికి మా గోడలు తెల్ల చొక్కా తొడుక్కోవడం, సంక్రాంతి సెలవులకు అరిసెలతో పాటు పండు చింత కాయలు ఏరుకొని తినడం తేగలు కోసం కొట్టుకోవడం. భోగి పండ్ల పేరంటం. కనుమ రోజు చెఱువులో జరిగే కోడిపందాలాట చూడటం రంగులరాట్నం ఎక్కడం సర్కస్ ఆట చూడటం కోతి చేష్టలకు పడి పడీ నవ్వడం, తర్వాత వచ్చే శివరాత్రి తిరునాళ్ళ కోసం ఎదురుచూడటం. ఉగాది పండుగ రోజు మాంసం కూర వండుకోవడం ఆ రోజు మాత్రమే కూరలో ధనియాల ఆకు వేయడం, మామిడి కాయలు తినడం మునక్కాయలు కాయడం కూడా అప్పుడే! ఎండలు ముదరకముందే గచ్చకాయలు గురివింద గింజలు సేకరణ ఎండలు ముదిరాక చిట్టీతకాయలు సీమతుమ్మ కాయలు. సెలవులు ఇచ్చాక ముంజెకాయలు మామిడి పండ్లు తెగ లాగించేయడం రాజేశ్వరి టీచర్ దగ్గర కాన్వెంట్ చదువు
అంజయ్య మాష్టారు గారి దగ్గర ప్రెవేట్ సుబ్బారావు బాబాయ్ దగ్గర ప్రెవేట్. రేడియోలో వచ్చే క్రికెట్ కామెంటరీ వినడం . ప్రత్యేకంగా కనబడే డబ్బాలో వచ్చే నెస్ కెఫే కాఫీ పొడి తో బొగ్గులపొయ్యి మీద మా ఎర్రగేదె పాలతో కాచిన కాఫీ.. రుచి. అంతటి రుచి జనరంజని లో పాటలు వినడం.
మార్కెట్ లో శ్రావణమాసంలో వచ్చే చామంతి పువ్వులు పెరట్లో సంక్రాంతి దాక ఎందుకు పూయవు అనే ఆశ్చర్యం.చిట్టి చేమంతి పూల సౌందర్యం సువాసన. కనకాంబరాలు మరువం మన దొడ్లో మాత్రమే వుండటాన్ని గర్వంగా భావించి తల ఎగరేసి తిరిగిన రోజులు సంక్రాంతికి విరగబడి పూసే బంతిపూలు జనవరి నెలాఖరులో వచ్చే కందుల బస్తాలు ధాన్యం బస్తాలు చిలకడ దుంపలు.
శివరాత్రి తర్వాత వచ్చే జంట ఉల్లిపాయల్ని పురికొసలతో కట్టి దూలాల మీద వేలేడేయడం జగ్గయ్యపేట దోసకాయలు వీసెలుకు వీసెలు కొని గోనె పట్టాల మీద పరవడం. బంగాళాదుంప కూర వండుకోవడం గొప్పగా భావించడం, బుడమేరు వాగులో ఆటలాడటం పిచ్చుకగూళ్ళు కట్టడం, చెలమలు తవ్వడం తియ్యని మంచినీళ్లు తాగడం. నట్టింట్లో దూలాలకు ఆనేటట్లు పోసిన పైరు శెనక్కాయలు. మా రాములోరి గుడి, నేను దగ్గరగా చూసిన పులి. మా నేస్తురాలు కళ్యాణి బావిలో పడి చనిపోవడం.🥲. మా కుటుంబం యొక్క పచ్చటి వైభోగం తర్వాత దశ తిరగబడి అనుభవించిన కటిక దారిద్ర్యం. మా నీటి కష్టాలు కన్నీటి అవమానాలు అన్నీ నా బాల్యం తాలూకు చేదు తీపి జ్ఞాపకాలు అనుభవాలు. ఇప్పటికి ఇవీ. మళ్ళీ వస్తాను.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి