16, నవంబర్ 2025, ఆదివారం

నాలో నేను

 నిన్ను నీవు తెలుసుకోవాలంటే.. 

నీతో నువ్వు అంతర్యుద్ధం చేయాలి

మెదడుకి పట్టిన మురికిని కడుక్కోవాలి

నిన్ను నీవు గాయపర్చుకోవాలి 

నిన్ను నువ్వే ఓదార్చుకోవాలి

తొడుక్కున ముసుగు తొలగించుకోవాలి.

నిశ్శబ్దంగా నీతో నువ్వు మాత్రమే వుండగల్గాలి. 

అనుభవమూ అనుభూతి పాతవే అని గ్రహించాలి


నువ్వు నువ్వుగా మిగలగల్గాలి అంటే.. 

భావోద్వేగాలను అణచుకున్న మనిషివైనా కావాలి

కాలానికి ఎదురొడ్డి నిలిచిన మనిషివైనా అయివుండాలి. 

రహస్యంగానైనా నిన్ను ఆరాధించే

బలగమైన్నా కలిగివుండాలి. 

మెట్టనేలలో మొండిగా నిలిచి   తుఫాన్ గాలి తట్టుకున్న 

చెట్టువైనా అయివుండాలి

రాగద్వేషాలు అద్దుకున్న  దేహ వస్త్రాన్ని  సవుడు సున్నం వేసి 

ఉడకబెట్టి పరిశుభ్రంగా ఉతికి ఆరేయాలి. 

పాము కుబుసం విడిచినట్టు జ్ఞాపకాలనూ అనుభవాలను 

బలవంతంగానైనా విసర్జించాలి. 

కామెంట్‌లు లేవు: