8, నవంబర్ 2025, శనివారం

ఖాళీ గూళ్ళు

 


ఖాళీ గూళ్ళు - వనజ తాతినేని 


ఒకప్పుడు వారిద్దరూ గూటి లోని దీపాల్లా 

కువకువలాడేవారు. 

వారు నవ్వితే ఆవరణంతా దీపాలు 

వెలిగించినట్లు వుండేది. 

దీపం కింద నీడలా అరుగుపై  మనుషుల సడి

చిత్తడిగానూ వుండేది 


చీకటి దినాల్లో కూడా వారిరువురే 

నిలువెత్తు దీపాల్లా వెలుగుతూ నలుగురికీ

త్రోవ చూపేవారు. దారినపోయే వారిని నిలేసి 

నాలుగు మాటలు చెప్పేవారు.

ఆపన్నహస్తం అందించే వారు.


ఇప్పుడేమో ఇల్లు శిధిలమైంది.

గడచిపోయిన కాలం ఆనవాళ్ళుగా ఈ రెండు దీపాలు 

రెండు గూళ్ళుగా మారి అస్థిత్వపు జ్ఞాపకాలతో 

నిట్టూర్చు విడుస్తున్నాయి. 


కలల దీపాలను కరెన్సీకి అమ్ముకోవాలని 

తెలియని గూళ్ళు  లేమితో  కళ తప్పాయి 

కలతపడ్డాయి. ఎవరో వచ్చి ఆ ఇంటి వెలుగుల్ని

చేయి పట్టుకుని లాక్కెళ్లారు.

ప్రేమలను కొల్లగొట్టుకు పోయారు 


వృద్ధాప్యం ఒడ్డుకు విసిరివేయబడ్డ గూళ్ళు 

బిడ్డల జ్ఞాపకాలను  భూషణంగా ధరించాయి 

నీళ్ళింకిన కళ్ళలో మసక దీపాలు పెట్టుకుని 

మిణుకు మిణుకు మంటూ ద్వారబంధం దగ్గర

పడిగాపులు కాస్తున్నాయి . 


మసిబారిపోయిన ఖాళీ గూళ్ళు దీపాలు లేక 

వెలవెలా పోతున్నాయి. దీపం పెట్టే చేయి కోసం

ఎదురుచూస్తున్నట్టున్నాయి. ఎప్పుడైనా జాలిపడిన

వెన్నెల దీపం ఆ గూళ్ళ ను తాకి ఓదార్చి వెళ్ళేది.


నవ్వూ తుళ్ళు లేని ఆ ఎడారి హృదయాలు చేసిన

 వేడుకోళ్ళు అభ్యర్ధనలు ప్రార్ధనలు అన్నీ ముగిసిపోయాయి.

చమురు ఆవిరైపోయింది ఒత్తి కొడిగడుతుంది. 

ఎగదోసే చేయి కోసం  నిరీక్షిస్తుంది.


ప్రేమ దాహంతో దహించుకుపోతున్నాయి గూళ్ళు. 

పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలు చాయా మాత్రంగా నైనా 

తమను ఆలింగనం చేసుకుంటారని. 

ఏ తలుపును తడితే ఏం జరుగుతుందో అని జంకు. 

చివాట్లు గిరాట్లు ముద్రలు పడతాయని

 

అయినవాళ్లు ఇరుగుపొరుగు సంధించే ప్రశ్నలను 

ఆరోపణలను నాలుగు దిక్కులకు విసిరిపడేసి 

గడిచిపోయిన రోజులను రాలి పడిన ఆకులతో 

లెక్కించుకుంటూన్న గూళ్ళకి.. నవరాత్రులు దీపావళి  

కార్తీకదీపాలు ధనుర్మాస పారాయణం మాఘ స్నానాలు 

ఏమీ లేవు, రోజులన్నీ ఒకటేలా ఆవరించిన శూన్యం మినహా.

 

సర్వవాంఛలూ ఆశలూ అస్తమించి నిరాశ 

అంధకారం కబళించింది గూళ్ళను. 

అందుకే అవి  అలక పూనాయి. దీపమెలగని

 రాతి దీపపు సమ్మెల్లా తమను తాము బహిష్కరించుకుని 

గోడలో మరుగున పడిపోయాయ్, జీవితాల్లో వెలుగు లేని గూళ్ళు 

దీప తోరణాలను ఎలా వ్రేలాడ తీయగలవు? 

 

పురాతన గృహాలు పునరుద్ధరణ కోసం 

పనికొస్తాయేమో కానీ.. పురాతన ప్రేమలు 

వెగటు పుట్టిస్తాయి కాబోలు

ఏ దీప కళికల కాంతుల్లో జీవితాన్ని సంపూర్ణం 

చేసుకోవాలనుకున్నారో ఆ దీప కళికలు ఎక్కడో 

దేదీప్యమానంగా వెలుగుతుంటాయి. అలా వెలుగుతూనే 

వుండాలని ఈ గూళ్ళు సదా దీవిస్తుంటాయి. 


దీపం హృదయాలను వెలిగించేది నిజమే అయితే 

ఈ గూళ్ళు ఎందుకు బోసి పోతాయ్

ఆ హృదయాలు ఎందుకు శిలాసదృశ్యంగా మారతాయ్  

కాని పనులు భుజాన వేసుకునేది మోయలేని భారాన్ని 

తలకెత్తుకునేది ఎవరనీ? అమ్మనాన్నలంటే అలుసు. 


అరుదుగా పలకరిస్తూ వచ్చే మనుషుల ఔదార్యానికి

శాపగ్రస్తమైన ఆ ఇల్లు  తమకు సంప్రాప్తించిన 

ఆ భాగ్యానికి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. 

కనుచెమరింతల మధ్య వారి అడుగుల్లో వదిలిపెట్టి 

వెళ్ళిన కాస్తంత దయను వెదుక్కుంటుంది.


సూక్ష్మాతి సూక్ష్మంగా ఓ సందేశాన్ని బట్వాడా చేస్తాయి గూళ్ళు

దేవుడి ముందు దీపం వెలిగినా వెలగపోయినా 

ప్రాంగణంలో దీపాలు పెట్టకపోయినా తల వెనుక 

దీపం పెడతారని జీవితం యొక్క అంతిమ ఆశ అని.

శీతకన్ను వేయొద్దని. 


*************

2025 నవంబర్ 6 వ తేది “ది ఫెడరల్ తెలంగాణ” లో “నేటి మేటి కవిత” గా ప్రచురితం.


కామెంట్‌లు లేవు: