మంగళగిరి నులక మంచం
ఆ రోజు ఆదివారం .
పిల్లలందరూ తీరికగా బొమ్మలాటలు ఆడుతూ... ఉండగా..
పాప,బాబు కూడా కొబ్బరి ఆకులతో రెండు బొమ్మలు చేసి.. అమ్మ చక్కగా కుట్టి ఇచ్చిన బట్టలు కట్టి..పెళ్లి కూతురు,పెళ్లి కొడుకు ని ముస్తాబు చేసి.. ఆ బొమ్మలకి పెళ్లి చేయాలనుకున్నారు.
అంతకన్నా ముందుగా తాము అలంకరించిన బొమ్మలని అందరికి గర్వంగా చూపాలని కూడా పాప,బాబు తొందర.
డాక్టర్ గారి కల్యాణి.. వాళ్ళ అక్క పంపించిన బార్బీ బొమ్మని తీసుకొచ్చి పెద్ద టెక్కు కొడుతుంది. కళ్ళు ఆర్పే బుట్ట గౌన్ బొమ్మకంటే మన తాటాకు బొమ్మే అందంగా ఉంటుంది. ఆ బొమ్మ మొఖాన బొట్టు కూడా లేదు. అయినా సరే ఆ బొమ్మని చంకనేసుకుని వచ్చి గొప్పలు పోద్ది. ఆ గొప్ప ని ఒప్పుకుంటామా ఏమిటీ.. ? వెంకటేశ్వరావు మిషన్ దగ్గర నుండి కత్తిరింపు లో మిగిలిన ముక్కలు పట్టుకొచ్చి పట్టు కుచ్చులు పెట్టి అమ్మ కుట్టి ఇచ్చిన బొమ్మ బట్టలు ఎంత బాగున్నాయి.!? ఆ ఆర్పుడు కళ్ళ రబ్బరు బొమ్మ అసలు బాగోలేదు కదా..అన్నాయ్ అంది పాప. తన మాట ఒప్పుకుని తీరాల్సిందే అన్నట్లు.
బాబు..ఏమో అయోమయంగా తల ఊపాడు.. అలా ఒప్పుకోకపోతే పాప ఊరుకోదు మరి. బాబుకి పిల్లలతో గొడవ పడటమంటే భయం.పాప కేమో తేల్చుకుందాం..రా ..అనే టైపు.
అన్నం తిని ఎప్పుడెప్పుడు బొమ్మలాట ఆడుదామా అని ఎదురుచూస్తున్న పాప మనసులో మాట పసి కట్టిన అమ్మ "ఇలా చెప్పింది. "ఇప్పుడు ఎండగా ఉంది. ఆటలకి వెళ్లొద్దు. ఇంట్లోనే కూర్చుని ఆడుకోండి అని చెప్పింది.
బుద్దిగా తల ఊపింది పాప. అలా పాప బాబు.. ఆటల్లో మునిగి పోయారు.
అమ్మ ఇంట్లో పనులన్నీ ముగించుకుని వరండాలో మంచం వేసుకుని పడుకుంది. పనులు చేసి చేసి అలసి పోయి ఉందేమో, అందులో తలంటు పోసుకుని ఉంది. తల ఆరినట్లు లేదు ఒత్తైన జు ట్టుని..నేల మీద జీరాడేటట్టు. అలా వెనక్కి వేసుకుని పడుకుండి పోయింది.
వరండాలోనే కూచుని ఆడుకుంటున్న పాప,బాబు బొమ్మల పెళ్లి ఆట ఆపి లక్క పిడతలు అన్నీ చేర్చి వంట కార్యక్రమం మొదలెట్టారు. పాప గ్లాసుతో నీళ్ళు తెచ్చింది. బియ్యం కూడా తెచ్చింది. వంట ఇంట్లోకి వెళ్లి శబ్దం కాకుండా డబ్బాలు వెదికి కంది పప్పు పట్టుకొచ్చింది. మరి పెళ్లి అంటే పప్పు అన్నం వండాలి కదా అన్నాయ్! అంటూ ఆరిందలా చెప్పింది. అవునని తల ఊపాడు బాబు.
సరే ఇన్ని తెచ్చాం కదా.. ఉత్తిత్తి పొయ్యి మీద వంట చేయడం ఎలా.. నిజంగానే పొయ్యి పెడదాం..అంది పాప.
అమ్మో కాలుతుంది నాకు భయం. అమ్మ కొడుతుంది కూడా అన్నాడు బాబు.
అమ్మ నిద్రపోతోంది గా .. ఈ లోపులో పొయ్యి వెలిగించడం నేర్చుకుందాం..అంది పాప. అమ్మ మంట దగ్గరికి వెళితే చెయ్యి కాలుతుంది అని అసలు పొయ్యింటి వైపే వెళ్ళ నీయదు. ఇప్పుడేమో..పాప నిజంగానే మంట వెలిగించి అన్నం కూర వండుతానంటుంది. ఆపేది ఎలా !? అని ఆలోచిస్తున్నాడు బాబు.
పాప పిల్లిలా లోపలి వెళ్లి అగ్గిపెట్టె కోసం పొయ్యింట్లో వెతికింది. కనబడలేదు. పాపకి అందకుండా పైన కిటికీలో పెట్టి ఉంచింది అమ్మ. పాపకి ఎప్పుడు ఆసక్తి. చిన్న అగ్గిపుల్ల గీయగానే మంట ఎందుకు వస్తుంది..? పొయ్యి వెలిగించడానికి గడ్డి చుట్ట ఎందుకు పెడతారు? కందికట్టె ఎందుకు అలా వామి వేసి పెడతారు? నెక్కలం నుండి తాతయ్య జీతగాళ్ళతో.. బండి మీద మామిడి పుల్లలు వేసుకొచ్చి అలా కొండ ఆకారంలో గూడు కట్టి ఉంచి వెళతారు ఎందుకమ్మా!అని ప్రశ్నలు మీద ప్రశ్నలు అడిగేది. అమ్మ మాట్లాడేది కాదు.
"కూతురు కందికంపతో, సీమ తుమ్మ పేళ్లతో, పొగ వచ్చి ఇబ్బంది పడుతుందని.. మీ తాత బాధపడిపోయి.. మామిడి పుల్లలు గూడు కట్టి వెళతాడు" అని చెప్పేది నానమ్మ.
పాపకి అగ్గి పెట్టె దొరకలేదు. అంతలో గుర్తుకువచ్చింది..ఇంట్లో ఇంకో చోట అగ్గి పెట్టె ఉంటుంది. పడమటింట్లో గూట్లో దీపం పెట్టె దగ్గర అగ్గిపెట్టె ఉంటుంది అని పాపకి తట్టింది.
అక్కడ అగ్గిపెట్టె ఎందుకు ఉంటుంది అంటే..అమ్మ రోజూ చీకటి పడుతుండగానే.. కాళ్ళు చేతులు కడుక్కుని..పడమటింటిలోకి వెళ్లి గూటిలో ఉన్న ప్రమిదలో ఆముదం పోసి వత్తి వేసి వెలిగించి.."ఇరుగు చల్లన,పొరుగు చల్లన, మా ఇంట బిడ్డ-పాప పాడి పంట చల్లగా ఉండాలి” అనుకుంటూ దణ్ణం పెట్టుకుని వచ్చి తర్వాత బుడ్డి దీపాలు రెండు, ఇంకో పెద్ద లాంతరు వెలిగించు తుంది కదా!
ఇప్పుడు అక్కడ పెట్టి ఉన్న అగ్గిపెట్టె తెచ్చి పొయ్యి వెలిగించాలి అనుకుని అక్కడికి వెళ్ళింది. పాప చిన్నది కదా! అక్కడా అగ్గిపెట్టె అందలేదు. ముక్కాలి పీట వేసుకుని ఎలాగోలా అగ్గిపెట్టె అందుకుని వరండాలోకి వచ్చింది.
అంతలో అమ్మ నిద్రలో కదిలింది. అమ్మ లేచేస్తుంది. అయ్యో! ఇవాళ కూడా అగ్గిపుల్ల వెలిగించి మంట ఎలా వస్తుందో చూడటం కుదిరేటట్టు లేదు అని దిగులుపడింది పాప.
బాబు,పాప ఇక్కడే ఉన్నారుగా, ఎక్కడికి వెళ్లొద్దు ఇక్కడే ఆడుకోండి అని చెప్పేసి మళ్ళీ కళ్ళు మూసుకుంది అమ్మ.
అమ్మ నిద్ర పోయింది అని నిర్దారించుకున్నాక పాప అగ్గిపుల్ల గీసింది. అమ్మ అంటించినట్లు పుల్లలు అంటుకోవడం లేదు. ఏం చేయాలబ్బా! అని ఆలోచించిది.
బాబు..అన్నీ చూస్తూ కూర్చున్నాడు. గాలి వస్తుంది కదా,అందుకే అంటు కోవడంలేదు. మంచం క్రిందకి వెళదాం రా..అంటూ..బాబుని పిలిచింది.. బాబు పాప ఇద్దరూ మంచం క్రిందకి చేరారు. కంది పుల్లలు ముక్కలు చేసి పాత పుస్తకం తెచ్చి కాగితాలు ముక్కలు చేసారు. అవన్నీ గుట్టగా పోసి అగ్గిపుల్ల గీసి ఆ కాగితాల కుప్పకి అంటించింది పాప. మంట రాజుకుంది.. అమ్మయ్య..నాకు పొయ్యి వెలిగించడం వచ్చేసింది అంది సంతోషంగా.
మెల్లగా మంట రాజుకుని నులక మంచంకి అంటుకుంది. అసలే రంగు రంగుల మంగళగిరి నూలుతో అల్లిన నులక మంచం అది. ఆ మంచం పై అమ్మ బొంత వేసుకుని పడుకుని ఉంది.నూలు మధ్య నుంచి బొంత అంటుకుని అమ్మకి సెగ తగిలింది.. మంట ప్రాకి నేల మీద జీరాడే అమ్మ జుట్టుకు అంటుకుని ఉండేది కూడా
ఉలికి పడి అమ్మ లేచింది. మంచం క్రిందకి తొంగి చూసింది.. మంచం క్రింద దొంగ పిల్లుల్లా పాప బాబు పడుకుని గడ్డం క్రింద చేతులు ఉంచుకుని ఆసక్తిగా మంట వైపు చూస్తూ కనిపించారు. అమ్మ కంగారు పడి మంచం లేపి పిల్లల ఇద్దరినీ చేతులు పట్టుకుని ఇవతలకి లాగి గబా గబా మంచి నీళ్ళ కుండ లేపి ఆ మంట పై గుమ్మరించింది.
మంట ఆరిన తర్వాత పిల్లలు వైపు చూసుకుంది.బిక్కు బిక్కు మంటూ నిలబడ్డ పాప,బాబు వద్దకు వచ్చి.. వాళ్ళకి ఎక్కడన్నా కాలిందేమో అని కంగారుగా చూసుకుంది. ఏమి కాలేదు. అమ్మయ్య ! అని నిట్టూర్చి ..
బాబు.. ఈ పని ఎవరు చేసారు? అని గద్దించి అడిగింది. బాబు మాట్లాడలేదు. పాప వైపు అనుమానం గా చూసి ..ఓహో..ఇది నీ పనా! నీతో చస్తున్నాననుకో! అన్నీ వెదవ సందేహాలే! మంట ఎలా వస్తుందో కనుక్కున్నా వన్న మాట. ఇంకో సారి అగ్గిపెట్టె అంటుకున్నావో .. వాత పెడతాను జాగ్రత్! అంది అమ్మ హెచ్చరికగా
ఆ మాట ప్రకారమే అమ్మ ఎపుడు పుట్టింట్లో వంట గది వైపే అడుగు పెట్టనీయ కుండా పెంచింది.
పదిహేడు ఏళ్ళు నిండే టప్పటికి పెళ్లి అయి అత్తా గారింట్లో పొయ్యి వెలిగించడమే!
పాపకి ముప్పయి ఏళ్ళ అప్పుడు .."అమ్మ" కి బాగోకుండా వచ్చింది , కేన్సర్ అని తెలిసి అన్ని రకాల ట్రీట్ మెంట్స్ ఇప్పించినా ఆ మహమ్మారికి తలవంచక తప్పదని తెలిసి పాప,బాబు,చెల్లి ఎంతో ఏడ్చారు.పాప అయితే.. బిడ్డని,భర్తని,ఇంటిని మరచి అమ్మని చూసుకుంటూ మూడు నెలలు అలాగే ఉండి పోయింది. పాప కి ఉన్న బాయ్ కట్ హెయిర్ స్టైల్ పెరిగి పోతూ ఉన్నా కూడా అమ్మని ఒదిలి పార్లల్ కి కటింగ్ కి వెళ్ళడం ఇష్టం లేక పోయింది. కటింగ్ కి వెళ్లి వచ్చే లోపు అమ్మ చచ్చిపోతే అని భయం.దగ్గర లేకపోతే అమ్మని ఎవరు చూస్తారు అన్న బాధ కూడా! అప్పుడు ఆ అన్నయ్యే స్వయంగా చెల్లికి క్రాప్ చేసాడు. అది అన్నచెల్లెళ్ళ అనుబంధమే కాదు.. అమ్మ పై ప్రేమ కూడా.
ఇంతకీ ఆ పాప చెప్పేది ఏమిటంటే.. అమ్మ పడుకున్న మంచం క్రింద దూరి..మంట వెలిగించడం నేర్చుకున్న పాప అదే నులక మంచం పై "అమ్మ" పడుతున్న విపరీతమైన బాధ ని చూసింది. ఇరువది ఏడు రోజులు చెంచా మంచి నీళ్ళు కూడా మింగుడు పడక నిరాహారంగా ఉండి కూడా తానూ మరణిస్తే బిడ్డల మంచి-చెడు ఎవరు చూస్తారు అన్నట్లు బిడ్డల వైపు ప్రేమ దృక్కులతో చూస్తూ.. ఉండేది.
క్రమేపీ ఆ కళ్ళ ల్లో జీవం తగ్గి గాజు కళ్ళు గా మారిపోయి.. మరణం కోసం ఎదురు చూస్తున్నట్లు ఉండేది. విజయదశమి వెళ్ళిన మర్నాడు సాయంసమయంలో వీధిలో దేవుడి ఊరేగింపు జరుగుతుంది.అమ్మ చూస్తానని అడిగింది. బాబు పాప అమ్మని వరండాలోకి తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టి చూపించారు. ఆరోజు రాత్రి నాన్న మందు తాగి వచ్చి అమ్మను తిడుతున్నాడు. ఆ స్థితిలోకూడా తల్లిని తిడుతున్న తండ్రిపై అసహ్యంతో పాటు తమ జీవితంపై విరక్తి వచ్చేసింది. అమ్మా! నాన్న ఎవరినమ్మా తిడుతున్నాడు అని అడిగింది పాప. “నన్నే” శక్తి కూడదీసుకుని అంది అమ్మ.ఆ మాట వెనుక జీవితకాల వేదన కష్టాలున్నాయి పితృస్వామ్య పీడన వుంది. అమ్మ కనుల చివర ఒకే ఒక కన్నీటి చుక్క. అది చూసిన పాపకు గుండెలు పగిలేలా పెళ్ళున దుఃఖం. తల్లి తలకు చెరోవైపు కూర్చుని పాప బాబు గతాన్నంతా తల్చుకుని పొగిలి పొగిలి ఏడ్చారు. ఆ రోజు రాత్రి తల్లి బాధ చూడలేక పాప ఇలా అడిగింది.."అమ్మా! ఎప్పుడు చచ్చిపోతావు అమ్మా..అని.
అమ్మ పడుకుని ఉన్న మంచంకి తిన్నగా మంచం వేసుకున్న పాప బాబు పడుకుని ఉన్నారు. బాధతో మగత నిద్ర పోయారు.
మధ్య రాత్రి బాబుకి మెలుకువ వచ్చి..అమ్మ వైపు చూసాడు. దగ్గరకి వెళ్లి చూసాడు.అమ్మ ఊపిరి ఆగిపోయింది.మంగళగిరి నూలుతో అల్లిన నులక మంచం పైనే అమ్మ ప్రాణం వదిలింది.
బాబు చెల్లి దగ్గరికి వచ్చి ..అమ్మా..! అమ్మ చచ్చిపోయింది అని చెప్పాడు. పాప పెద్దగా ఏడ్చింది. అమ్మా..! ఏ బిడ్డా అడగ కూడని మాట అడిగాను కదమ్మా ‘’అని కుమిలి కుమిలి ఏడుస్తుంది.. ఇప్పటకీ కూడా.
చిన్నప్పుడు తెలియక అమ్మ పడుకున్న మంచం క్రింద నిప్పు అంటించిన పాప ..పెద్దయ్యాక అమ్మ అంటే చాలా ఇష్టం పెంచుకుంది. అయితే సంప్రదాయానికి విరుద్దంగా అమ్మని సాగనంపడానికి మరుభూమి దాకా వెళ్ళ లేక పోయింది. బాబు మాత్రం అమ్మ చితికి నిప్పు అంటించి వెక్కి వెక్కి ఏడ్చాడు.
( పాప బాబు ఎవరో కాదు.. నేను, అన్నయ్య, అమ్మ జ్ఞాపకంతో.. దుఃఖభారంతో..)
అమ్మంటే ఏమిటో తెలియాలంటే ఒక అమ్మగా మారాలి కదా! అమ్మ ప్రేమతో పాటు అమ్మ కష్టాలు కన్నీళ్ళు అర్దం కావాలి కదా! (సూపర్ మామ్ అన్న ఓ..బ్లాగ్ ఫ్రెండ్ కామెంట్ కి స్పందించి ఈ పోస్ట్)
11 కామెంట్‌లు:
బాగుంది.మాతృత్వం మీ వరం, అదే అదృష్టం, మాకదిలేదు మరి.
మీ రచనలు అన్నీ బాగుంటాయి. అయితే వాటిల్లో కొన్ని మరీ బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ..చేతికి అయిదు వ్రేళ్ళు సమానమైనవే! కానీ బొటన వ్రేలు విలువ మిగిలిన వాటితో పోల్చలేం అలాగే మీ ఈ రచన కూడా. మనసుని తాకింది.
baadha anipinchindi kaani baavundi baagaa raasaru vanaja garu
."ఇరుగు చల్లన,పొరుగు చల్లన ,మా ఇంట బిడ్డ-పాప పాడి పంట చల్లగా ఉండాలి."ఈ మాట చాలా బాగుందండీ .పోస్ట్ గురించి ఏం కామెంట్ చెయ్యాలో తెలియడం లేదు.బాధ కలిగింది..
వనజ గారు,మీ అక్షరాలు నేరుగా మనసుని తాకాయి.
అక్కా మీ అమ్మ గూర్చి చదివి చాలా బాధగా ఉంది.
తన ఆత్మకు జ్ఞానం కలిగి సంతోషంగా ఉండాలి
స్పందించడానికి మాటలు రావడం లేదు.. తేరుకోవడానికి నిముషం పట్టింది.. తల్లి మనసు తల్లి కే తెలుస్తుంది..కాని అందరూ ఇలా ఉండరు.. కాలానుగుణంగా మారిపోతూ వుంటారు..
ఎంత హృద్యంగా రాసారో...వనజ గారూ!
ఇలాంటి అద్భుతమైన రచనలు ఇంకా రావాలని కోరుకుంటున్నాను....
కష్టే ఫలే మాస్టారూ.. మీరు అన్నట్టు మాతృత్వం ..నిజంగా వరం. నా మటుకు నాకు అత్యంత ఆనందకర క్షణాలు ఏవంటే.. మా అబ్బాయి పుట్టిన క్షణాలు అని చెపుతాను.
ఈ పోస్ట్ మీకు నచ్చినందుకు ధన్యవాదములు.
@ వైష్ణవి.. మీకు ఈ పోస్ట్ నచ్చినందుకు సంతోషం,మీ అభిమాన పూర్వక మైన వ్యాఖ్యకు మనసారా ధన్యవాదములు.
@చెప్పా లంటే ..మంజు గారు.. థాంక్ యు వెరీమచ్!
సామాన్య గారు.. అలా దీపం పెట్టి పితృ దేవతలకి నమస్కరించుకునే వారంట . ఇప్పుడు ఇవన్నీ ఎవరికీ పడుతున్నాయి చెప్పండి. మీ స్పందనకి ధన్యవాదములు.
@ చిన్ని.. మీ స్పందనకి బహుదా కృతజ్ఞతలు
@ శశి కళ గారు.. :( :( మీ స్పందనకి ధన్యవాదములు.
ఓలేటి గారు.. మీ స్పందనకి థాంక్ యు సో మచ్..సర్ .మీ వ్యాఖ్య చూసి మళ్ళీ విషాదం లోకి వెళ్ళిపోయాను.
@ శ్రీ గారు.. మీకు ఈ పోస్ట్ నచ్చినందుకు మరీ మరీ ధన్యవాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి