6, ఫిబ్రవరి 2013, బుధవారం

మై స్పేస్ అమ్మలక్కల కబుర్లు 6

మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం . నా స్నేహితురాళ్ళు  రమ, వైష్ణవి, నేను కలసి మరొక ఫ్రెండ్ ఇంటికి లంచ్ కి వెళుతున్నాం బెంజ్ సర్కిల్ దగ్గర బస్ దిగి మాచవరం వైపు వెళ్ళడానికి  ఏలూరు రోడ్ వైపు వెళ్ళే బస్ ఎక్కాము.

ఆ టైం లో బస్ లు తక్కువ సంఖ్యలో వస్తూ ఉంటాయి. రద్దీగా ఉన్నా కూడా బస్ లో మాత్రమే  ప్రయాణం చేయాలి అని తీర్మానించుకు కూర్చున్న మా  ముగ్గురికి ఆటో లో  హాయిగా కూర్చుని ప్రయాణించే సౌలభ్యం లేకపోయింది. 
అదే మాట నేను అంటూ..ఈ  బస్ లో వేలాడే ఖర్మ పట్టింది. హాయిగా కూర్చుని వెళ్ళవచ్చు కదా?  అన్నాను 

ఇక్కడ వేలాడి  అయినా వెళతాం. ఆటోలో గమ్యస్థానం కి వెళతామో లేదో అని భయం . అంది రమ.

మరీ అంత భయం పనికి రాదండీ తెల్లవారి లేస్తే ఆటోలో పడి  ప్రయాణించే వాళ్ళు ఎందరు.? అందరికి ప్రమాదాలు ముంచు కోస్తాయా? అంది..రమ ని ఉద్దేశ్యించి వైష్ణవి.

ఆటో ల్లో ప్రమాదం రాదు.. ఎదురుగా చూడు ప్రమాదం కనబడుతుంది అన్నాను.

వాళ్ళు ఇద్దరు ఎదురుగా చూసారు."దిక్కుమాలిన దృశ్యాలన్నీ నీ కళ్ళ కే కనబడతాయి అని నవ్వారు. వాళ్ళు నవ్వవలసినంత విషయం ఏమంటే..ఒక ఇరవయి సంవత్సరాల యువతి లూజ్ హెయిర్ తో..చెవులకి లాంగ్ హేన్గింగ్స్ పెట్టుకుని బస్ లో మాకులాగానే వేలాడుతూ కనబడింది.లో వెయిస్ట్ జీన్స్ ఫాంట్ ,టైట్ టీ  షర్ట్ వేసుకుంది. కాళ్ళకి హై హీల్స్ వేయడం వల్ల అందరికన్నా  చట్టూ ఉన్న ఆడవారి అందరికన్నా ఎక్కువ ఎత్తుగా కనబడుతుంది ఆమె అలంకరణ కన్నా ఆమె వస్త్రధారణ చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఇంతలో టికెట్ తీసుకోవడానికి కండక్టర్ వచ్చాడు. దాదాపుగా ఆమెని ఒరుసుకుంటూనే టికెట్ అడిగాడు. ఆ అమ్మాయి భుజానికి ఉన్న బేగ్ తీసి డబ్బు ఇచ్చి టికెట్ తీసుకునే వరకు అతని ముఖం ఆ అమ్మాయి వక్షస్థలం మీద ఆనినట్లే ఉంది. "చూస్తున్నావా? అని నా వైపు కను సైగ చేసింది."నేనేమిటి..అందరూ ఆ దృశ్యమే చూస్తున్నారు అన్నాను." నిజంగానే అందరూ ఆ అమ్మాయినే చూస్తున్నారు కూడా .

నాకు మాత్రం పురుషులు తడిమే చూపులనుండి తప్పించుకుని వచ్చి   అదేదో సబ్బుతో ప్రెష్ గా   స్నానం చేసి  చూపుల,ఆలోచనల మురికిని వదిలించుకుని హాయిగా నవ్వే  స్త్రే నటించిన వ్యాపార ప్రకటన గుర్తుకు వచ్చింది.
స్త్రీలు రోడ్డుపై నడుస్తుంటే వెంటాడే చూపులు, గుచ్చి గుచ్చి ఆబగా చూసే కళ్ళు,సొల్లు కార్చుకునే రకాలు గురించి  నాతొ పాటు స్త్రీ జాతి అందరికి కొద్దిగా గొప్పో తెలుసును. అలాగే  స్త్రీలు  అంతా తిట్టుకునే తిట్లు తెలుసు.కానీ  ఈకాలంలో ఇలాంటి వస్త్రధారణ చేసుకుని రద్దీగా ఉండే బస్ లలో ప్రయాణించే అమ్మాయిలకి ఎలాంటి ఇబ్బంది ఉండదా!? కండక్టర్ ఉశ్వాస నిశ్వాస లు  కూడా  తెలిసే విధంగా ఉంటే   కూడా ఆమె గమనించుకోదా  !?

 హి భగవాన్! ఎందుకు ఈ అమ్మాయిలూ ఇలా తయారవుతున్నారు? కోపం, ఆవేదన నాకు.
ఆ అమ్మాయి వైపు చూస్తూనే ఉన్నాను. పని ఉన్నాలేకున్నా కండక్టర్ బస్ ముందుకి వెనక్కి తిరుగుతూనే ఉన్నాడు.

ఆ అమ్మాయి అదే నిర్లక్ష్యంతో..చేతిలో ఉన్న మొబైల్ నొక్కుకుంటూ ఉంది.

రామవరప్పాడు రింగ్ వస్తుంది.  సిగ్నల్ పడ్డాయి. మళ్ళీ మేము అలాంటి దృశ్యమే చూదాల్సి వచ్చింది. మేము ప్రయాణిస్తున్న బస్ కి ముందు.. కొన్ని బైకులు ఆగి ఉన్నాయి. ఒక బైక్ పై  ముందు పురుషుడు మధ్యలో చిన్న బిడ్డని  కూర్చో పెట్టుకుని వెనుక  కూర్చున్న  యువతి కనిపించారు. ఆ యువతి చుడీదారు ధరించి ఉంది.కనీసం ఆమె ధరించిన సిల్క్ చుడీ దార్ కి కి లైనింగ్ కూడా లేదు. ట్రాన్స్పరెంట్ గా ఆమె దేహం వీపు భాగం  మొత్తం.. కనబడుతూ ఉంది.కాళ్ళు అటువైపు ఇటువైపు వేసుకుని కూర్చుండటం వల్ల ఆమె తొడ  భాగం అంతా అసహ్యంగా కనబడుతూ ఉంది.  పైగా ఆమె లోదుస్తులు కూడా కనబడుతూ ఉంటె.. మేము ప్రయాణిస్తున్న బస్ లోని వారందరూ ఆలాగే చుట్టుప్రక్కల ఆగి ఉన్న వాహనాలలో,వాహనాల పై ఉన్నవారందరి దృష్టి ఆమె వైపే ఉంది.

 ఇంతలో మాకు ప్రక్కనే సీట్లో కూర్చున్న ఒక  అరవై ఏళ్ళ స్త్రీ  గట్టిగా మాట్లాడ సాగింది. 'ఛీ ఛీ.. ఏమి మనుషులండీ! ఒంటి మీద గుడ్డలు కూడా కప్పుకోవడం రాని ఆడ కూతుర్లు రోడ్డు మీద పడితే ఎవడు పడితే వాడు చెయ్యి వేయడా? వాడు చెయ్యి వేసాడు..రేప్  చేసాడు అని  గగ్గోలు పెట్టె ముందు..మనం ఒంటి నిండా బట్టలు కట్టుకోవాలి అని తెలియదా! అదేమంటే.. మా ఇష్టం వచ్చిన బట్టలు కట్టుకునే హక్కు మాకుంది అంటారు. నీకు ఆ హక్కు ఉంది నువ్వు ఎట్టా  ఉండా చూసి ప్రక్కకు పోవడానికి వాడికి మంచి చెడు జ్ఞానం తెలిసిన వాడయి ఉండవద్దూ.. ! రోడ్డు అన్నాక నాలుగు రకాల మనుషులు తిరుగుతూ ఉంటారు. అందరూ చూసి తల తిప్పుకుని వెళ్లి పోయే వారే ఉంటారా? ఓ సారి చెయ్యేసి చూద్దాం అనుకునే అలాగా నాయాళ్ళు ఉంటారు.  మనం చదువుకుంటున్నాం కదా .కాస్తయినా ఇంగిత జ్ఞానం ఉండొద్దూ....ఇంట్లో అమ్మ-నాన్న చెప్పిన మాట వినరు.అందం అంతా విప్పేసుకుని తిరగడంలోను,విరబోసుకుని తిరగడంలోను ఉందనుకుంటారు. మన కట్టుబొట్టు సంస్కారంగా ఉంటె కదా మగవాడు గౌరవం ఇవ్వడానికి.  ఇక ప్రతి వాడు నోరు పారేసుకుంటాడు..ముళ్ళు వెళ్లి అరటి ఆకు మీద పడ్డా..అరటి ఆకు వెళ్లి ముళ్ళు మీద పడ్డా అరటి ఆకు కే  నష్టం అని ఊరికే అనలేదు...  అంటూ ఏకబిగిన మాట్లాడే సింది.

వింటున్న వాళ్ళలో అధిక శాతం మంది అవును కదా! ఆడపిల్లలకి ఎవరు చెప్పలేకపోతున్నాం.మన జాగ్రత్తలో మనం ఉంటే  నయం కదా అనుకోవడం లేదు అంటూ ఒకరు వ్యాఖ్యానించారు.

గ్రీన్ లైట్ వెలగడంతో బస్ ముందుకు కదిలింది. ఇందాక మాట్లాడిన పెద్దావిడ  మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తున్నాను.ఇంత దైర్యంగా ఎవరైనా  చెప్పగలరా!? చెపితే నేటి తరం వారు వింటారా? చాదస్తం .. వీళ్ళకి  మోడర్నిజం  గురించి ..ఏం  తెలుసు ? అంటూ గడ్డి పరకల్లా తీసి పారేస్తారు. వాళ్ళు  అలా  అంటూ  ఉంటే  ఇక ఏం చెప్పగలం.? అనుకున్నాను.

మేము దిగాల్సిన స్టాప్ వచ్చింది.ముగ్గురుం దిగేసి.. నడుచుకుంటూ వెళుతూ.. "ఆ పెద్దావిడ బాగా కడిగేసింది కదా! అన్నాను.

" ఏమిటి కడిగేసేది?  ఆమె పూర్వ కాలం మనిషి. అలాంటి వారు ఎంత మంది చెప్పినా ఈ కాలం అమ్మాయిలూ వింటారా ఏమిటీ! మా ఇష్టం అంటారు"  అంది రమ.

ఎవరయినా   తమ వ్యక్తీగతమైన  ఇష్టాలని వేరొకరి కోసమో, సమాజం కోసమో వదులుకునే ప్రసక్తి లేదు అనుకుంటే  వారు సమాజం నుండి ఎదురయ్యే ఇబ్బందులని కూడా ఎదుర్కొనడానికి  సిద్దంగా ఉండాలి కదా! అన్నాను.

"ఆలోచించాల్సిన విషయమే " అని నవ్వింది వైష్ణవి.

స్వేచ్చా,స్వాతంత్ర్యం అవసరమే! అవి సరిగా ఉపయోగించుకునేంత కాలం బాగానే ఉంటుంది. మితిమీరి తీసుకుంటే .. ?? అని ఆలోచిస్తూ.. ప్రశ్నించుకుంటూ

నాకే గనుక ఒక ఆడపిల్ల ఉంటె.. అమ్మో!  వద్దు .. అనుకుని భయపడ్డాను.

ఎందుకంటే నా ముందు తరం  స్త్రీలు, వారు ఎదుర్కున్న   సమస్యలు చూసాను. వారి తరం అంతా కొంత వరకు ఏమి తెలియని అమాయకత్వంలోనే బ్రతికారు. ఒకవేళ వారి సమస్యల గురించి  తెలిసినా పెదవి దాటి బయటకి రానీయక తప్పని సరి పరిస్తితులనుండి తప్పించుకోలేని,తెగువ చూపలేని తరం వారిది.  నా తరం వారి సమస్యలు చూసాను.ఇప్పటి తరం కి అప్పటి తరంకి మధ్య నలిగిన తరం మాది. కాస్తంత చదువులు,ఇంటాబయటా చాకిరి,సంపాదించినా ఆర్ధిక స్వాతంత్ర్యం లేకపోవడం,కుటుంబం కోసం కొవ్వొత్తిలా కరిగిపోవడం..అనుకునే తరం మాది. ఇక ఇప్పటి తరం వారి తెంపరితనం మితిమీరినట్లు అనిపించుకుంటున్న స్వేచ్చ..అలా కాలగమనం లో మార్పులు సహజమే అనుకోవాలా? లేక పెరుగుట విరుగుట కొరకు అనుకోవాలా? ఏమో నేనే చెప్పలేను.అంతా అస్పష్టం.

  (నేను వ్రాసిన  ఈ పోస్ట్ వాస్తవం.సమాజంలో పదుగురు, పదుగురి అభిప్రాయాలు కలవాలని లేవు. ఎవరి అభిప్రాయాలు వారివి.  కానీ నడకలో మాత్రం  అందరూ కలిసే వెళతాం. లాభాలు-నష్టాలు అనుభవించే వారికే తెలుస్తాయి కదా! )

18 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మీ బాణీలో బానే ఉంది. అమ్మో ఇంతకి మించి ఏమయినా అంటే మళ్ళీ ఉతికేస్తారు బాబూ! గప్ చుప్

Ayyagari Surya Nagendra Kumar చెప్పారు...

నమస్తే అండీ
మీకు కలిగిన ఈ అనుభవంతో నేటి స్థితిని మీరు విశ్లేషించినది అక్షరాల జరుగుతున్నదానికి అద్దంపడుతోంది. అలవిమీరిన స్వేచ్చా ప్రకటనం వలన స్త్రీ పురుష బేధంలేకుండా అటు వ్యక్తిగతంగానూ ఇబ్బందులెదుర్కొంటున్నారు, సమాజమూ ఇబ్బంది పాలౌతోంది. ప్రతి మనిషీ సంస్కారవంతమైన సమాజంకోసం కొంత నియతితో కూడిన జీవనానికి కట్టుబడాల్సి ఉంది. అది వస్త్ర ధారణ కావచ్చు, భావ ప్రకటనం కావచ్చు లేదా కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు ఇలా ఏవైనా.....
//ఎవరయినా తమ వ్యక్తీగత మైన ఇష్టాలని వేరొకరి కోసమో, సమాజం కోసమో వదులుకునే ప్రసక్తి లేదు అనుకునే వారు సమాజం నుండి ఎదురయ్యే ఇబ్బందులని కూడా ఎదుర్కొనడానికి సిద్దంగా ఉండాలి కదా! అన్నాను.

"ఆలోచించాల్సిన విషయమే " అని నవ్వింది వైష్ణవి.//

అవును గీత దాటితే ఇబ్బందులు ఎదుర్కోడానికీ సిద్ధపడాలి మరి.

భారతి చెప్పారు...

స్వేచ్చా,స్వాతంత్ర్యం అవసరమే! అవి సరిగా ఉపయోగించుకునేంత కాలం బాగానే ఉంటుంది. మితిమీరి తీసుకుంటే .. ???" అవునండి ... ఇది నిజంగా అందరూ ఆలోచించాల్సిన విషయమే.

anrd చెప్పారు...


నిజమేనండి, ఈ రోజుల్లో ఇలాంటివెన్నో జరుగుతున్నాయి.

నగరాలలో జరిగే పబ్ పార్టీలు, రేవ్ పార్టీలలో ఉత్సాహంగా పాల్గొంటున్న స్త్రీలు పురుషుల గురించి, మీడియా ద్వారా తెలుస్తోంది కదా !

కొందరు పెద్దవాళ్ళేమో తాము వివాహం చేసుకున్న భాగస్వాములు తమకు నచ్చలేదంటూ విడాకులిచ్చి వేరే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు... పిల్లలకు మంచి చెడు నేర్పించవలసిన పెద్దవాళ్ళే ఇలా ఉంటే ఇక పిల్లలకు ఏం చెబుతారు ?

సమాజంలో జరుగుతున్న ఇలాంటి సంఘటనలను చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది.

అయితే ఈ రోజుల్లో కూడా చక్కటి ఆదర్శభావాలు కలిగి ఉన్న పెద్దవాళ్ళు ఎందరో ఉన్నారు.

ఆదర్శ భావాలతో చక్కటి ప్రవర్తనతో సమాజానికి ఉపయోగపడుతున్న యువత ( ఆమ్మాయిలు, అబ్బాయిలు ) కూడా ఎందరో ఉన్నారు.

వివేకానందుల వారు చెప్పినట్లు సత్యం, పవిత్రత, నిస్వార్థత , ఇనుపకండలు ,ఉక్కునరాలు కలిగిన వ్యక్తులు ఇప్పుడు సమాజానికి ఎంతో అవసరం.
ఇలాంటి వ్యక్తుల వల్ల సమాజం తిరిగి చక్కటి మార్గంలో పయనించాలని ఆశిద్దాం.

నవజీవన్ చెప్పారు...

ఆధునిక కాలం లో మనం పాశ్చ్యాత సంస్కృతి ని అరువు తెచ్చుకున్నంత కాలం ఈ పాట్లు తప్పవు. కాని ఆ సంస్కృతి ని గౌరవించే వాళ్ళు ఎంత మంది ఉంటారు. చలం గారి పంథా లోనే మాట్లాడుకుందాం. స్త్రీ వాదం చాలా గొప్పది. స్త్రీ ఈనాడు పురుషునితొ సమానం.
స్త్రీ కి 100% స్వేచ్చ ఉండాలి నా ఉద్దేశ్యం లో. మరి ఆ 100% స్వేచ్చ దాటి వెళ్ళే వారు ఏ లెక్క లోకి వస్తారు. భారత స్త్రీ భారత మాత అంత గొప్ప గా ఉండాలి. భారత సంస్కృతి కి నిదర్శనంగా మారాలి. ఇది మన సంప్రదాయం తో వచ్చిన గౌరవం. ఒక్కపుడు చూడీదార్స్ వేసుకుంటేనే రోడ్డు మీద అదోలా చూసేవారు జనం. ఇప్పుడు అమ్మాయిలు టీ షర్ట్స్ వేసుకొని బయటకు వస్తున్నారు. వీరందరూ నేను గౌరవించే నా తోటి భారతీయ స్త్రీ లే కదా.

నేను వేషదారణ కు వ్యతిరేకంగా మాట్లడటం లేదు. స్త్రీలు ఎలాంటి వస్త్రదారణ తోనైనా బయటకు రావచ్చు. వారికి ఆ స్వేచ్చ ఉంది. కాని అశ్లీలత ను, అసభ్యతను జనాలలో పబ్లిసిటీ చేసే విధంగా వేషదారణ చేసుకోని బయటకు వచ్చి ఇది స్వేచ్చ అంటే ఎలా ...

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కష్టేఫలే మాస్టారూ.. అప్రియంగా అనిపించే విషయమైనా ప్రియంగా చెప్పాలంటారు కదండీ! అందుకే కాస్త సున్నితంగా చెప్పాను . మీరు గట్టిగా మాట్లాడితే విషయం ఉన్నట్లే కదా! మాస్టారూ.. ఉతికేయడం ఉండదు లెండి.

స్పందనకి ధన్యవాదములు .

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

నాగేంద్ర శర్మ గారు.. సమాజం లో బ్రతుకుంటాం కాబట్టి మన హితం కోరుకుంటూనే సమాజ హితం కోరడం కోసం ఆలోచించేటట్లు అయితే విపరీత స్వేచ్చా భావనకి లోనవరు.సున్నితంగా అనిపించే విషయాలే ఒకోసారి విపరీత దోరణి కి దారితీస్తాయి కాబట్టి. మీ స్పందనకి ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

బారతి గారు.. సోషియల్ బిహేవియర్ తెలియకుండా ప్రవర్తించేవాళ్ళు అజ్ఞానులు కన్నా ప్రమాదకరం. స్పందనకి ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

అనూరాధ గారు చక్కటి ప్రవర్తన, సంస్కారం కలిగిన యువతే మన ఘన సంస్కృతికి ఆనవాలు కావాలండి. కానీ మనం విభిన్నంగా చూడాల్సి వస్తుంది అందుకు చాలా విచారంగా కూడా ఉంది.

స్పందనకి ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

నవజీవన్ గారు..మీ స్పందనకి ధన్యవాదములు.

ఆధునిక వస్త్ర ధారణా కన్నా మన చుడీదార్ వస్తధారణ చాలా సౌకర్యంగా ఉంటుంది. పాశ్చాత్య నాగరికత మన వారిని వేలంవెర్రిగా మారుస్తుంది.ఎక్కడికో ఈ పయనాలు? దేశంలో ప్రముఖ IIT ల లో జీన్స్ టీ షర్ట్స్ తప్ప ఇంకే వస్త్రధారణ ఉండదని విన్నాను. ఉన్నత చదువులు ఉన్నత సంస్కారం నేర్పాలి కాని దేశీయత ని దూరం చేయకూడదు కదా! ఏది అవసరమో.. మన యువత గుర్తించుకుంటే మంచిది. గొర్రెల మంద కాకూడదని కోరుకుందాం.

స్వేచ్చ అంటే ఏమిటో..గుర్తెరిగి మసలుకోవాలని ఆకాంక్షించడం తప్ప ఏం చెప్పగలం?

Hima bindu చెప్పారు...

"నా తరం వారి సమస్యలు చూసాను.ఇప్పటి తరం కి అప్పటి తరంకి మధ్య నలిగిన తరం మాది. కాస్తంత చదువులు,ఇంటాబయటా చాకిరి,సంపాదించినా ఆర్ధిక స్వాతంత్ర్యం లేకపోవడం,కుటుంబం కోసం కొవ్వొత్తిలా కరిగిపోవడం..అనుకునే తరం మాది."అక్షరాలా నిజం !

శశి కళ చెప్పారు...

manchi vishayam cheppaavu vanja akka.aalochinchaalsina vishayam

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

చిన్ని గారు.. మీ స్పందనకి ధన్యవాదములు.

Unknown చెప్పారు...

peddamma!!! antha sarrigga cheapparu
bayata paristhutulu eala unnay ani.... madhayalo konni chinna chinna english padalu kuda leakunda motham mana telugu lo rayandi..

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శశి కళ .. తప్పకుండా ఆలోచించండి.. మీ స్టూడెంట్స్ కి డ్రెస్ సెన్స్ గురించి క్లాస్స్ తీసుకుంటూ ఉండండి. మీ స్పందనకి ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

భవ్య ! నీ వ్యాఖ్య చూసి చాలా సంతోషం .ఎందుకంటే మన కుటుంబ సభ్యుల నుండి నేను అందుకున్న మొదటి వ్యాఖ్య ఇది. మన వాళ్ళు అందరూ చదువుతారు కానీ వ్యాఖ్య చేయలేదు. అందుకే సంతోషం.

ఇక నుండి చిన్న చిన్న ఆంగ్ల పదాలు కూడా దొర్లకుండా తెలుగులోనే వ్రాయటానికి ప్రయత్నిస్తాను సరేనా?

చెప్పిన విషయం నచ్చినందుకు ధన్యవాదములు.

జయ చెప్పారు...

ఇది మామూలు విషయం కాదు వనజ గారు. ప్రతి రోజూ ఇబ్బందిగా ఎదుర్కొనే అంశాలు ఇవి. ఇటువంటి వాళ్ళు తక్కువే. కాని ప్రతి ఒక్కరి మీద ఎంత ప్రభావం చూపిస్తోందో.ముఖ్యం గా కట్టుబాట్లలో ఉండే అమ్మాయిలు ఎన్నో సమస్యలని ఎదుర్కొంటున్నారు. ఆడదానికి ఆడదే శతృవు అని ఊరకే అనలేదు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జయ గారు.మీ స్పందనకి ధన్యవాదములు. మీరన్నది నిజమే! కొందరి వల్ల అందరు ఇబ్బంది ఎదుర్కునే పరిస్థితి దాపురించింది . ప్యాషన్ కి పేరు మారి పోతుంది ఆధునికత పేరుతో ప్రొవొకింగ్ పరిపాటి అయిపొయింది :(