19, ఫిబ్రవరి 2013, మంగళవారం

తంతుగా మిగిలిపోతున్న " మాంగల్యం తంతునానేనా"


ప్రేమలు - పెద్దలు = పెళ్లి

పెద్దలు  -  ప్రేమ = పెళ్ళిళ్ళు

ప్రేమలు - పెళ్ళిళ్ళు = ?

ఏమిటీ. ఈ ఈక్వేషన్స్ అంతా..తిక మక గా ఉన్నాయి. ఈమెకి ఏమైనా తిక్క ఉందా..? అనుకోకండి. నేను చెప్ప బోతున్నది..  ఒక ముఖ్య విషయం. పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఏదో ఒక రోజు ఈ పై మూడు చాయిస్ ల లో ఏదో ఒకటి ఎదుర్కోక తప్పదు కాబట్టి.

చాలా కాలం నుండి నేటి తరం పెళ్ళిళ్ళు ని గమనిస్తున్నాను. కొన్ని సార్లు షాక్ కొట్టినట్లు ఉంటాయి. నిర్ణయాల తప్పిదాలు వల్ల  వివాహాలు వైఫల్యం చెందుతున్నాయి. కారణం పిల్లలు లేదా పెద్దలు ఎవరైనా కావచ్చు.

నా చిన్నప్పటి ఫ్రెండ్ కి ఇద్దరు కూతుర్లు. తనని నేను కలసి చాలా సంవత్సరాలు దాటింది మా ఇద్దరి మధ్య దూరం ఓ..నాలుగు కిలోమీటర్లు అంతే!  వాళ్ళ ప్రక్కనే నాకు ఒక పరిచయస్తురాలు ఉన్నారు ఆమె చెప్పింది.. రాణి మీరు ఫ్రెండ్స్ అంట కదండీ అని. నేను తనని గుర్తు చేసుకుని అవునని చెప్పాను. 

మా పరిచయస్తురాలి ఇంటి ప్రక్కనే ఉంటున్నారని అనగానే   నేను తనని కలవాలని వెళ్లాను.  నేను ,వాళ్ళ ప్రక్క ఇంటి ఆమె ఇద్దరం కలసి ఎంత సేపు పిలిచినా .తను బయటకి రాలేదు. ఇంట్లోనే ఉంది. కానీ బయటకి రాలేదు. నేను చాలా నోచ్చుకున్నాను. తిరిగి వచ్చేసాను. మళ్ళీ ఎప్పుడు వెళ్ళకూడదు.కనిపించినా మాట్లాడ కూడదు అని నిశ్చయం చేసుకున్నాను.

తర్వాత రోజు రాణి నుండి నాకు ఫోన్ వచ్చింది. అంతకు ముందు రోజు బయటకి రాక పోవడానికి కారణం చెప్పింది. తనకి ఇద్దరు కూతుర్లు. పెద్ద అమ్మాయి..సాఫ్ట్ వేర్ జాబ్  చేస్తుంది. చడువుకునేటప్పటి నుండి తన క్లాస్ మేట్ తో ప్రేమలో ఉంది. వారు ఇద్దరు ఒకరు మద్రాస్ లో ఇంకొకరు బెంగళూరు లో జాబ్ చేస్తున్నారు. పెళ్లి ప్రయత్నాలు మొదలెట్టే టప్పటికి ఆ అమ్మాయి తన ప్రేమ గురించి చెప్పింది. తండ్రి తల్లి ఇద్దరు ఒప్పుకోలేదు. వేరే కులం,అదీ కాకుండా ప్రేమ పెళ్లి మాకు ఇష్టం లేదు అన్నారు. ఆ అమ్మాయి ఇంట్లో వారిని ఒప్పించడానికి ఒక సంవత్సరం పాటు ప్రయత్నం చేసింది. వీళ్ళు వీలు కాదు..పొమ్మన్నారు.

 ప్రేమించిన అతని తల్లిదండ్రులు పూనుకుని వారి వెళ్లి రంగ రంగ వైభవంగా చేసారు. పెళ్లి జరుగుతుందని తెలిసి కూడా వీళ్ళలో చలనం లేదు. అబ్బాయి కుటుంబం అంతా విద్యాధికులు.ఆస్తిపరులు.సంస్కార వంతులు. అయినా సరే  కులబేధం వల్ల కూతురిమీద ప్రేమని చంపుకున్నారు. నేను తనని కలవడానికి  వెళ్ళిన రోజే వారి పెద్ద అమ్మాయి పెళ్లి. అవమానం తో లోకానికి ముఖం చూపించ లేక బయటకి రాలేకపోయాను. ఎంత పని చేసింది.?  మా చుట్టాల్లో తల ఎత్తుకుని మేము ఎలా తిరగాలి అంది?

నేనైతే జాలి పడ్డాను. బంధువులు,లోకం,కులం ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే.. ఆ అమ్మాయి ని  ప్రేమించిన అతనితో కాకుండా వేరొకరికి  ఇచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి సంతోషంగా ఉండగలదా? అడిగాను. పెద్దల మాటలకి విలువ ఇవ్వవడ్డ్డా? అంది రాణి. ఆ అమ్మాయి పెళ్ళయి మూడేళ్ళు అవుతున్నా ఆ అమ్మాయి వైపు కన్నెత్తి చూడలేదు మాట్లాడ లేదు ఆ అమ్మాయి మాత్రం అత్తవారింట్లో అందరితో కలసి పోయి సంతోషంగా ఉంది.

ఇక్కడ : ప్రేమలు - పెద్దలు = పెళ్లి

అదే ఇంట్లో రెండో అమ్మాయి.. ఆ అమ్మాయి ఇంజినీరింగ్ పూర్తీ అయింది. తల్లిదండ్రుల సంగతి తెలిసి కూడా ఈ పిల్లా ప్రేమలో పడింది.అక్క పెళ్ళికి మీరు ఒప్పుకోలేదు. నా పెళ్ళికి మీరు ఒప్పుకోకపోతే చచ్చిపోతాను అంది. అప్పుడు పిల్ల వాళ్ళ బాబా యి జోక్యం చేసుకుని .." మీ అక్క చూస్తే అలా చేసింది. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? మన కుటుంబాలు తలెత్తుకుని తిరగాలా వద్దా..? "అన్నాడంట. ఎలాగైతేనేం ఆ..అమ్మాయి మనసు మార్చి వేరొక అతనితో..వాళ్ళకి తగిన హోదా..ఆస్తి-అంతస్తు కులం చదువు,మంచి ఉద్యోగం ఉన్న అబ్బాయితో పెళ్లి కుదుర్చుకుని మొన్న డిసెంబర్ లోనే చాలా ఆడంబరంగా  పెళ్లి చేసారు. అమ్మాయికి బోలెడు నగలు,చీరలు..కారులు..అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మనసులో  మాత్రం కట్టుకున్న వాడు లేడు .

పెళ్ళైన తర్వాత మొదటి రాత్రి  చేసుకున్న అతనితో..తన ప్రేమ సంగతి చెప్పేసింది. నువ్వు నన్ను టచ్ చేస్తే చచ్చిపోతాను. నాకు శ్రీకాంత్ మాత్రమె కావాలి అని చెప్పిందట. పాపం.. ఆ నూతన వరుడు నిర్ఘాంత పోయి..ఆ ఇంటి నుండి బయట పడి.. ఆ అర్ధ రాత్రి సమయం లోనే పది కిలోమీటర్ల దూరంలో ఉన్న  తన ఇంటికి  నడుచుకుంటూ వచ్చేసాడు. తెల్లవారి పెద్దల సమక్షంలో  పంచాయితీ మొదలు.

అబ్బాయి చెపుతున్నది తప్పు. ఆతను అనుమానం పిశాచి. అమ్మాయి గురించి పెళ్ళికి ముందే ఎంక్వయిరీ  చేసాడు. అదేదో సినిమా. మజ్ను అనుకుంటా.. ఆ సినిమాలో లాగా. అందుకే అమ్మాయి అతనిని వద్దనుకుంటుంది.. అని అమ్మాయి వైపు వాళ్ళు తమ వాదన వినిపిస్తున్నారు.

ఇలా ఇప్పటికి రెండు నెలలు గడచి పోయాయి. నా స్నేహితురాలు ఒకటే ఏడుపు. పెద్ద అమ్మాయి లాగా ఇంట్లో నుండి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోక పోయిందా.. ? మేము బలవంతం చేసామని ఒప్పుకుని తర్వాత ఇలా చేసింది. కావాలనే చేసింది.. అని చెప్పింది. రాణి మాటల్లో నాకు నిజం బోధపడింది. ఆ అమ్మాయి తల్లి దండ్రుల మీద కక్ష సాధింపు చర్య గానే పెళ్ళికి ఒప్పుకుని తర్వాత ఇలా చేసింది

ఫలితం ..విడాకులు. తర్వాత ఆ అమ్మాయిని ప్రేమించిన వాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడా లేదా అన్నది సందేహమే.! కానీ ఆమెని వివాహం చేసుకున్న అబ్బాయి పరిస్థితి ఏమిటి?

ఇక్కడ : పెద్దలు  -  ప్రేమ = పెళ్ళిళ్ళు

ఇక్కడ పెద్దల పొరబాటు వాళ్ళ మూర్కత్వపు పట్టుదల వల్ల ..ఒక పెళ్లి రెండు పెళ్ళిళ్ళు కావాల్సి ఉంది.

నాకు ఇప్పుడు చప్పున ఒక మాట గుర్తుకు వస్తుంది. ఆ మాట   మా అబ్బాయి అన్నాడు. 

 "   పెద్దవాళ్ళుపిల్లల ఇష్టాలకి విలువ ఇవ్వకపోతే.. ఇంకొకరి లవర్ ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది "    అని . 

ఆ మాటలో అర్ధం తెలిసి  నేను షాక్ అయ్యాను. నిజమే కదా!

చదువులు వల్ల, ఉద్యోగాల వల్ల  అమ్మాయిల అబ్బాయిల పరిచయాలు ప్రేమలు, ప్రేమలు అనుకునే  ఆకర్షణలు ఇవన్నీ సర్వ సాధారణం అయిపోయాయి.

 మొన్న ఈ మధ్య మా అబ్బాయి కి ఒక మ్యాచ్ వచ్చింది. అబ్బాయిని అడిగి చెపుతాను అన్నాను. నువ్వు చెపితే అబ్బాయి కాదంటాడా..? అని అడిగారు. మన పెంపకం మీద మనకి నమ్మకం మంచిదే! కానీ వాళ్ళ మనస్సులో ఏముందో తెలుసుకుని వాళ్ళకి నచ్చినట్లే చేయడం అన్ని విధాల మంచిది కదా అని చెప్పాను.

పెద్దల మనసులో ఉన్నట్లు జరగడం చాలా కష్టం. అందుకే పిల్లల ఇష్టా ఇష్టాలకే ప్రాధాన్యత  ఇచ్చి వివాహాలు జరిపించడం వల్ల పెళ్ళిళ్ళు అనే మాటని తగ్గించి పెళ్లి తో.. వాళ్ళ జేవితాలని ముడి పడేటట్లు  చేయడం పెద్దల కర్తవ్యమ్ అంటాను నేను.

మొన్న ఒక ఫ్రెండ్ మాట్లాడుతూ.. పెళ్లి అనేది కూడా ఒక గాంబ్లింగ్. లక్  ఉంటె సక్సెస్ .. లేదా ఇక అంతే ! అంది.

అవగాహన , సర్దుబాట్లు, రాజీ పడటం,  జీవితాంతం ఒక బంధం కి కట్టుబడి ఉండాలనుకోవడం లాంటివి దాదాపు అసాధ్యం అనే చెప్పాలి ఏమో.!  అమ్మయిలకైతే నగలు,చీరలు,కారులు ,ఉన్నత ఉద్యోగి,విలాసవంతమైన జీవితం..అత్తమామలు లేని వేరు కాపురం కావాలి అనే కోర్కెలు బల పడుతున్నాయి అంటే తిట్టుకుంటారే మో కాని ఇది నిజం.

ఇక అబ్బాయిల కైతే.. అందం,చదువు కావాలి, వీలయితే కట్నకానుకలు కావాలి. పెళ్ళికి ముందు ఎలా ఉన్నా.. పెళ్లి అయిన తర్వాత చక్కగా సంసారం చేసుకుంటే చాలు అనే దోరణి లో మగ పిల్లలు సర్దుకుపోతున్నారు అంటున్నారు

 కాని ..   ఇద్దరిలో ఉన్న ఇగో వల్ల , ఆర్ధిక స్వాతంత్ర్యం  వల్ల చాలా సమస్యలు  మాత్రం ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి అన్నది నిజం/  అన్నింటిని అందరికి అన్వనయించడం కూడా పొరబాటే అవుతుంది కూడా.! ఇవి అన్నీ మన చుట్టూ జరిగే విషయాలలో కొన్ని కోణాలు మాత్రమే !

అంతులేని ఈ  ప్రేమలు - పెళ్ళిళ్ళు  వల్ల సమాజం  లో చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.

కేవలం తంతుగా మిగిలిపోతున్నది  " మాంగల్యం తంతునానేనా" మంత్రం {శ్లోకం )  అనుకోవాల్సి వస్తుంది
   

తల్లి దండ్రులు..  ! మీ పిల్లలపై అతిగా ఆశలు పెట్టుకోవద్దు. ఆ ఆశలు నిరాశలయి.. మీరు భంగపడటం మాత్రం ఖాయం అనుకుంటున్నాను.  హాప్యీ గా వాళ్ళ పెళ్లి వాళ్ళ ఇష్టం అనుకుంటే .. అంతా  సంతోషమే కదా !!..

26 కామెంట్‌లు:

Anil Atluri చెప్పారు...

తెలిసిన పెద్దలకి కారెక్టర్ సర్టిఫికెట్టు ఇవ్వగలం.
కాని వారి పిల్లలకి మాత్రం ఆ సాటిస్‌ఫేక్టరి అన్న సర్టిఫికేట్ ఇవ్వగలిగిన రోజులు కావివి!

అజ్ఞాత చెప్పారు...

ఆ ఇంటి నుండి బయట పడి.. ఆ అర్ధ రాత్రి సమయం లోనే పది కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి నడుచుకుంటూ వచ్చేసాడు.

అంత కన్నా పాపం ఏమి చేయగలడు. సానుభూతి చూపడం తప్ప ఎవరు మాత్రం ఏమి చేయగలరు .. ఓ బలి పశువు.. :-(


"మీ పిల్లలపై అతిగా ఆశలు పెట్టుకోవద్దు. ఆ ఆశలు నిరాశలు అయి.. మీరు భంగపడటం మాత్రం ఖాయం అనుకుంటున్నాను. హాప్యీ గా వాళ్ళ పెళ్లి వాళ్ళ ఇష్టం అనుకుంటే .. అంతా సంతోషమే కదా !!.."

దురదృష్టమేమిటంటే అలా చేసుకున్న వారు కూడా సుఖంగా ఉండడం లేదండీ ఈ మధ్య. ప్రతీ సంవత్సరం పెరుగుతున్న విడాకుల రేటే అందుకు ఉదాహరణ.ఒకటి మాత్రం వాస్తవం. అబ్బాయిలు చాలా భ్రమలలోనుండి బయటకి రావాలి.

సినిమాలలో చూపించే ఆదర్శ వివాహాలు, ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా .. జీవిత భాగస్వామికి ఏదో ఒక కష్టం రాగానే మళ్ళీ ఒక్కటై ఆదుకోవడాలు లాంటి రొమాంటిక్ కథలన్నీ ఇక మీదట వెండి తెరపై మాత్రమే చూడగలం అనిపిస్తుంది నాకు.

మన పాలసీలలో కూడా మార్పు రావాలి. అబ్బాయిలకు తళ్ళిదండ్రుల సమ్రక్షణ అనేది పెళ్ళి తరువాత కష్టమైన విషయంగా మారిపోతోంది. తల్లిదండ్రులు ఆస్థిని పిల్లలకు పంచేసి, తమను ఎవరో ఒకరు చూసుకుంటార్లే అనుకోవడం మానెయ్యాలి. ఎలానూ మనకు సామెత ఒకటి ఉండనే ఉంది, "అడ్డాల నాడు బిడ్డలే కానీ, గడ్డాలనాడు కాదని" (సామెత ఇదివరకూ వినని వారికోసం -- ఉయ్యాలలో ఉన్నప్పుడు మన బిడ్డలు కానీ, గడ్డాలు వచ్చి పెద్దవారైనాక మన బిడ్డలు కాదు అని) .

ఇప్పుడు అటు తల్లిదండ్రులను సంతృప్తి పరచలేక, భార్య మాట కాదనే శక్తిలేక, వేరు కాపురం పెట్టి అప్పుడప్పుడు తల్లిదండ్రులను చూడడనికి వచ్చే పిల్లలు బోలెడు. ఈ విషయం గురించి నేను కొంత మందిని అడిగితే వారి సమాధానం నాకు మొదట ఆశ్చర్యంగా అనిపించింది. తరువాత అవునేమో కదా అనిపించింది... ఆడపిల్లలు తమ తల్లిదండ్రులను వదిలి అబ్బాయితో రాగా లేనిది, మగాడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో వస్తే తప్పేముంది. ఏం మేం చేయడం లేదా త్యాగాలు అని. నా దగ్గర దానికి సమాధానం (సంతృప్తికరమైనది) లేదు. ఈ సమాజములో మగవారికి కొన్ని భాద్యతలు ట్రెడిషనలుగా వస్తున్నాయి, అవి నిర్వర్తించాల్సిన అవసరం మగాడికి ఉంది అని తప్ప. కానీ, సమాజములో ఆడా మగల పాత్రలు విపరీత మార్పులకు లోనవుతున్న ఈ కాలములో .. ఆ సమాధానం ఎంత వరకూ సూటవుతుంద?

ఇక మగవారి పరిస్థితి మాత్రం ఘోరంగా తయారయ్యింది. తల్లిదండ్రులను చూసుకోకపోతే చట్ట ప్రకారం నేరం, ఒక వేల తల్లిదండ్రులను చూసుకోవడం భార్యకు ఇష్టం లేకపోతే, అతన్ని ఇబ్బంది పెట్టడానికి భార్యకు బోలెడన్ని చట్టాలు అండ. (ఆ చట్టాల ఉద్దేశ్యం ఇది కాకపోయినా, ఇలా ఉపయోగిస్తే అడ్డుకోవడం కుదరదు). నేను చెప్పేది ఒక్కటే, తల్లిదండ్రులపై దయలేని పుతృండు ... పుట్టనేమి, గిట్టనేమి అనేదో సామెత చెబుతూ ఉంటారు కదా. ఈసారి ఎవరైనా మగాడు అలా చేయడములో ఇబ్బంది పడుతూ ఉంటే ... ఇలా వాడు ఎందుకు మారిపోయాడో పూర్తిగా తెలీకుండా ఈ సామెతను వాడేయకండి. వాడి కష్టాలు వాడివి.
----------------------------------------------------
కాస్త పెద్ద కామెంటే. పరిధి దాటినట్టనిపించినా, మీ టపాకు సంబందం లేదు అనిపించినా డిలీట్ చేసేయండి.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

అనిల్ గారు మీరు అన్నట్లు పిల్లలని వాళ్ళకి నచ్చినట్లు నడుచుకునే స్వేచ్చ ఇచ్చినా.. వారికి సంతృప్తి ఉంటుందని చెప్పడం కష్టమే! ఎందుకంటే వారికి ఏం కావాలో వారికె తెలియడం లేదు మరి.

మీ వ్యాఖ్య కి ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శ్రీ కాంత్ గారు.. మీ వ్యాఖ్య కి హృదయపూర్వక స్వాగతం.

సమాజంలో నెలకొన్న విపరీత దోరణి ని గురించి విపులంగా చెప్పారు. నిజానికి మీ వ్యాఖ్య నా తదుపరి పోస్ట్ అయి ఉండేది. చాలా సంతోషం అండీ! ధన్యవాదములు.

Geethanjali చెప్పారు...

తల్లిదండ్రులను ప్రేమించే సంతానం , వారిని ఎదురించి మనఃస్తాపం తేలేరు ,,,..
అలాగే అర్ధం చేసుకునే జీవిత భాగస్వామి విషయంలో తొందర పడుతున్నారేమో అని భయపడే తలిదండ్రులు ,,
ఇలా ఎన్నో ,, వీరిరువురి మధ్య ఒక సంయమనం వచ్చి అందరి జీవితాలు ఆనంద తుల్యం కావాలి అని మనసారా కోరుకుందాం .


ఎన్ని చెప్పినా మధ్య తరగతి కుటుంబాలలో మార్పులు రావడం అంత సులువు కాదు , ఎందుకంటే అభిమానాలు ఎక్కువ,, బాధ్యతలు ఎక్కువే,,


పెళ్ళి అనేది ఒక అందమైన మలుపుగా ఉండాలని ఆశపడే అమ్మాయిలు ,, డబ్బు ఆర్ధిక స్వాంతంత్ర్యమ్కే కానీ అదే జీవితం కాదని అర్ధం చేసుకునే యువత,,పిల్లల ఇష్టాలను గౌరవించి, తప్పు బాటలో వెళితే సరిదిద్దే తలిదండ్రులు మన సమాజం లో ఇంకా ఉన్నారని ,, మనసారా ఆశిద్దాము .

అందులో ఒకరు ఈ commentని ఇప్పుడు చూస్తునారు :) కదూ

Padmarpita చెప్పారు...

ఆలోచనాత్మక పోస్ట్. శ్రీకాంత్ గారి కమెంట్ సందేశాత్మక విష్లేషణ చాలా బాగుందండి.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

గీతాంజలి.. కోసూరు

మీరు చెప్పినది నూటికి నోరు శాతం నిజం. పిల్లల ఇష్టా ఇష్టాలని అభిప్రాయాలని నిశితంగా గమనించాలి.సంయమనం తో.. వారికి కావాల్సిన దేదో.. అది వారికి అందించే బాట లోకి వెళ్ళడానికి మార్గం ని సులభతరం చేయాలనుకోవాలి. అసలు ఆ మార్గమే మంచిది కాదంటే.. పిల్లలు వినరు కదా! మంచి తల్లిదండ్రులు అనిపించుకోవడం చాలా కష్టం. అల్లుడు,కోడలు వచ్చాక మరీ కష్టం.

మీలా చక్కని దృక్పధం ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు తయారవ్వాలని కోరుకుంటున్నాను.

మీ కాంప్లిమెంట్ కి మనసారా ధన్యవాదములు. మంచి భాద్యత గల తల్లి అనిపించు కోవడానికి లైఫ్ టైమ్ కృషి చేస్తాను. :) థాంక్ యు !!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

పద్మార్పిత గారు.. మీ స్పందనకి ధన్యవాదములు. ఎలా ఉన్నారు? థాంక్ యు సో మచ్!!

అజ్ఞాత చెప్పారు...

స్వానుభవమయితే కాని తత్వం వంటపట్టదు. మనం చేయగలది లేనపుడు ఊరుకోవడమంత ఉత్తమం లేదనుకుంటా. చక్రం ఆగదు, తిరుగుతూ ఉంటుంది, ఆశాజీవులం కదా! వేచి చూద్దాం.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"పెళ్లి అనేది కూడా ఒక గాంబ్లింగ్. లక్ ఉంటె సక్సెస్ .. లేదా ఇక అంతే !"
మీ ఫ్రెండ్ చెప్పిన మాట నిజమేనండీ..

కొందరు ఎన్ని గొడవలోచ్చినా ఏమైనా కలిసే వుంటారు.. కొందరు చిన్న సమస్యలకే విడిపోయి ఎంత ప్రయత్నించినా మళ్ళీ కలవలేరు ...

కాకపోతే మన సమాజంలో ఎన్ని సమస్యలు వచ్చినా విడిపోవటం కంటే కలిసి ఉండాలని ప్రయత్నం చేసే వాళ్ళే ఎక్కువేమో అనుకుంటాను...

చెప్పాలంటే...... చెప్పారు...

anni garugutunna vishyaale chepparu....nenu kudaa alaane nasta poyaanu maatalu paddanu...rendo ammayi chesinatle naaku okaru tagilaaru anekante tagilinchu kunnanu..anadam correct...dabbulu paruvu anni nasta poyaanu pelli chesi adigi mari chesanu appudu evaru lerani pelli aina ventane aa abbayi estam ledani godava modalu munde chepte naku e golaa undedi kadu maatalu tappa ledu dabbulu nasta poyaanu jivitam lo chaalaa nasta poyaanu aa pelli cheyadam mulam gaa...aalochanaatmakamaina post..srikanth gari comment kudaa...

చంద్ర చెప్పారు...

ఆప్యాయతలు అనురాగాలు కులం, హోదా ల గోడల మధ్య నే ఉంటాయి. అవి చాల మందమైన బలమైన గోడలు . లోపలి కి ప్రవేశ అర్హత లేకపోతే మీకు గోడలే కనిపిస్తాయి.
పిల్లలను పెంచడం, చదువు చెప్పించడం, లాంటి బాద్యత నే పెళ్లి కుడా అని తల్లితండ్రుల అభిప్రాయం. మా జీవితం మా ఇష్టం అని పిల్లల ఆలోచన.
మనం మంచా చెడా అనేది మనం చేసే పనుల మీద కాదు, పెద్దలు అయితే పిల్లలు చేసే పనుల మీద, మగ వాళ్ళు అయితే బార్యలు చేసే పనుల మీద ఇలా ఉంటుంది మన దగ్గర.
ఇది సమిష్టి బాద్యత అనే భావమా? లేక అనవసర బరువా?
ఒకరితో కలిసి ఉండడం అనేది భౌతిక, మానసిక అవసరం. పెళ్లి దానికి ఒక రూపం. మంచి రూపం అయితే అవ్వోచు. కాని అది ఎవరి పేరు ప్రతిష్టలకు సంబంధించి కాదు. అలాగే విడి పోవడం కుడా. మనం అలా అనుకోనంత వరకు వరకు చాల పెళ్ళిళ్ళ లో మీరు చెప్పిన మూడు ఈక్వేషన్ ల లో ఏదో ఒకటి ఉంటుంది.

Narsimha Kammadanam చెప్పారు...

ప్రేమ -పెల్లి అని ఒప్పించి చేసుకుంటె పర్వాలెదు కాని "లేచిపోయి" పెళ్ళి చెసుకునె వాళ్ళు మరీ దారుణంగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు లేచిపోదాం తర్వాత రావాల్సిన పెట్టుబడులు అవె కదలి వస్తాయి ఒక పాపనో -బాబునో ముందుపెడితే వారే కరిగి పోతారు అని....ఇలాంటి లెచిపొయిన వారికి చాలా మటుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి అప్పుడు ఈ జంట హక్కు-అని అమ్మాయి తరపు కుటుంబం మీదకి వస్తారు,ఇక్కడ ఇవ్వలేక కాదు వీరి ఆత్మ గౌరవాన్ని తన్ని-నమ్మకాన్ని వమ్ము చేసి-వెళ్ళినప్పుడు బాధ్యత లేని వెళ్ళకి,ఇప్పుడు హక్కు ఎలా ఉంటుంది అని.అసలు కథ ఇవ్వాలేరు అని తెలిసిన కొద్దిరొజులకి విడాకుల తంతు ,మొదలౌతుంది-ఈ లాజిక్కే "ఈ మధ్య ప్రేమ వివాహం చేసుకున్న జంటలే ఎక్కువగా విడాకులకి అప్లై చెస్తున్నారు"అనే మాటకి మూలం.

పెద్దలు కుదిర్చిన వివాహం లో గొడవలొస్తే పట్టించుకునే పెద్దలు అదే ప్రేమ పెళ్ళి విషయం లో పట్టించుకోక అనుభవించండి అని చూస్తున్నారు(ఎంతైనా వారికీ అహం ఉంటుంది అది కాస్తా దెబ్బతిన్నది కనుక ఇలానె ఉంటుంది మరి!).నాకు తెలిసి ఈ మధ్య ఆడ-మగ విషయం లో నిజాల కంటే ఈగో లే ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి కనుక ఈ విడాకుల తంతు పెరుగుతుంది కాని తగ్గేలా లేదు!.ఈ విడాకులు ఇద్దరి జీవితాలను కాదు ఒక కుటుంబాన్ని కొన్ని జీవితాలని నశనం చేస్తాయి,ఈ ప్రభావం ఆ జంటకే పరిమితం అయితె కాస్తైనా మేలు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కష్టేఫలి మాస్టారూ.. మీ యాత్రా విశేషాలు చూసాను. మీరు ఇంకా నూతన ఉత్సాహంతో మంచి కబుర్లు వ్రాసేయండి. :)

మీ వ్యాఖ్య కి ధన్యవాదములు. ఎవరి కాళ్ళు తడిస్తే వాళ్ళకే తడి అని..అంటారు కదండీ. నిజమే! చూస్తూ ఊరుకోవడమే! ఎవరి గురించి ఎంతగా ఆలోచించినా చెప్పినా ప్రయోజనం శూన్యం లా ఉంది కూడా.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాజీ గారు.. మీ స్పందన అమూల్యం. మరి యొక పోస్ట్ వ్రాయించింది ఈ పోస్ట్. విలువలు మారిపోతున్నాయి. స్వార్ధం వల్ల కుటుంబాలు వేదన పడుతున్నాయి. అదే బాధగా ఉంది. థాంక్ యు అండీ !

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

చెప్పాలంటే మంజు గారు.. :( :( ఇంకా నేను ఏమి వ్యాఖ్యా నిన్చాలేను. సో సారీ !!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

చంద్ర గారు మీ స్పందన కి ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

నరసింహ గారు .. మీ స్పందనకి ధన్యవాదములు.

భారతి చెప్పారు...

అందరూ ఆలోచించాల్సిన విషయాన్నీ చక్కగా ప్రస్తావించారు. చాలా మంచి పోస్ట్.

ప్రవీణ చెప్పారు...

మంచి టపా వనజ గారు. సమాజం, వ్యవస్త ఎప్పుడు మారుతూనే వుంటుంది. మన మైండ్సెట్ దానికనుగుణంగా మారాల్సిందే.

హితైషి చెప్పారు...

ఈ మధ్య యువతరం ని బాగా పరిశీలిస్తున్నారు అని తెలుస్తుంది . అన్నీ పాయింట్స్ ని విడమర్చి చెప్పారు బాగుంది.

నిరంతరమూ వసంతములే.... చెప్పారు...

వ్యాసం బాగుంది వనజా గారు. తంతుగా మారుతున్న నేటి
వివాహవ్యవస్థ మీద మంచి అవగాహనతో వ్రాశారు. అభినందనలు!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

భారతి గారు.. మీ వ్యాఖ్య కి ధన్యవాదములు. .తల్లిదండ్రులు కూడా మారాలి అప్పుడే కొన్ని విపరీత దోరణి లను ఆపగాల్గే అవకాశం ఉంటుంది

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ప్రవీణ గారు .. మీరన్నట్లు మైండ్ సెట్ మారాలి . కానీ యువతరం వారికి ఎం కావాలో అది అందుకున్నాక కూడా అనుకున్నట్లు జీవించలెకపొతున్నారు.
ప్రేమో,ఆకర్షణొ , ఎం కావాలో తెలియదు. ఫలితంగా కుటుంబం విచ్చిన్నం అయిపోయే స్థితి లో ఉన్నామ్. ఒంటరి పిల్లలు,ఒంటరి తల్లులు ఎక్కువైపొతున్నారు. ఫ్ఛ్. :(

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

హితైషి ... పరిశీలన ఎక్కువయింది నిజమే! థాంక్ యు!!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సురేష్ గారు.. ఈ జనరేషన్ వారికి మన జనరేషన్ చెప్పేది అర్ధం కాదు. వాళ్ళకి అర్ధమయ్యేటట్లు చెప్పే అవకాశం ఇవ్వరు. అందుకే పిల్లల మనసును కనిపెట్టే రహస్య విద్యని నేర్చుకోవాలండీ తప్పదు. !! :)

మీ స్పందనకి ధన్యవాదములు.