27, జూన్ 2013, గురువారం

అమ్మ చెప్పే కమ్మని కబుర్లు

ఓ ..  పది రోజులు పాటు దేశ సంచారం  చేద్దామని మా వర్కర్స్ ని కూడా ఇంటికి పంపించేసి .హాయిగా లేపాక్షి, రాయలసీమ అంతా తిరిగివద్దామని ప్లాన్ వేసుకున్నాం. ఎందుకో ఆ ప్రయాణం వీలుపడక పోయే సరికి నీరసం ముంచుకొచ్చింది.  ఛీ .. వెధవ జీవితం .అని తిట్టుకుంటూ.. తెగ బోర్ కొట్టి చచ్చిపోతున్నాను ..  వచ్చి ఓ ..నాలుగు రోజులు ఉండెళ్ళు తల్లీ ! అని నా ఫ్రెండ్ ని పిలిచాను.  తను వచ్చింది. బోలెడు సినిమాలు, కబుర్లు మధ్య ఇద్దరం కలసి  మన బ్లాగర్స్ వ్రాసిన కథలని చదువుతూ ఒక్కొక్కటి వరుస క్రమం లో ఉంచుతున్నాము.  చదువుట ఎక్కువైంది   కాబట్టి ఈ మధ్య ఏమి వ్రాయాలని అనిపించడం లేదు .. వేరే ఏదైనా చదవాలని ఆసక్తి లేదు, కొన్నాళ్ళపాటు బ్లాగ్ వ్రాతలకి విరామం ప్రకటించాలని అనుకుంటూ ఉన్నాను. ఓ రహస్యం చెప్పాలి,  అలా అనుకునప్పుడల్లానే మంచి మంచి పోస్ట్ లు వ్రాసినట్లు గుర్తు .. వరుసగా కొన్ని జ్ఞాపకాలని వ్రాసుకోవాలనిపిస్తుంది. 

 రాత్రి  హాల్లో పడుకుని నా ఫ్రెండ్, నేను  తక్కువ సౌండ్ తో  సరాగమాల (రేడియోలో వచ్చే పాత పాటల కార్యక్రమం) వింటూ ముచ్చట్లు చెప్పుకుంటూ అలా గోడల వైపు చూస్తున్నాను. ఒక ప్రక్క గోడకి నేను చాలా ఇష్టంగా తగిలించిన వాల్ పీస్ కనబడింది. ఆ పీస్ ని అలా గోడకి తగిలించి ఓ ..పది ఏళ్ళు అయింది. ఆ పీస్ మీద నా చూపులు ఆగిపోయాయి

ఒక జ్ఞాపకం అలా... నా కళ్ళ ముందు కదిలింది.  కొన్ని కన్నీళ్లు కూడా బయటకి వద్దామా- వద్దా .. అనుకుంటూ మొహమాటపడుతున్నాయి.  ఏమిటి ఇంతలోనే ఆ కన్నీళ్లు?  అంది నా ఫ్రెండ్.

అదిగో . ఆ వాల్ పీస్ చూసి అన్నాను . నిజానికి అది వాల్ పీస్ కాదు, అలా నేను తయారు చేసుకున్నాను.  అది ఒక   ఆర్టిఫీషియల్  ఫ్లవర్ .బొకే.  తను లేచి వెళ్ళి  గోడకి  తగిలించి ఉన్న దానిని తీసుకువచ్చింది. అది చేతిలోకి తీసుకుని పదేళ్ళ క్రిందటి ఆ సంగతి గుర్తు చేసుకున్నాను.

*********************

సాయంత్రం అయిదింటికి ఆడుకోవడానికని వెళ్ళిన అబ్బాయి ఎనిమిది గంటలు దాటినా ఇంటికి రాలేదు అమ్మ ఇంట్లోకి బయటకి తిరుగుతూ అబ్బాయి కోసం ఎదురు చూస్తుంది. ఒకవేళ క్రికెట్ ఆడటానికని కాలేజ్ గ్రౌండ్స్ కి వెళ్ళారా? లేక రాజేష్ తో కలసి సృజన్  వాళ్ళ ఇంటి దగ్గర క్యారమ్స్ ఆడుతున్నారా? లేక గోరా హరి తో కలసి సినిమాకి వెళ్ళాడా? ఇంకా ఇంటికి రాడేమిటి ?   ఆలస్యం అవుతున్న కొద్ది అమ్మకి లోలోపల  కంగారు. ఇంటికి రానీ .. వీడి పని చెపుతాను. ఎన్నిసార్లు చెప్పినా పొద్దుపోయిందాకా  ఫ్రెండ్స్ తో ఆటలు మానుకోడు,  పోనీ వెళితే వెళ్ళాడు కొంచెం లేట్ అవుతుంది అమ్మా .అని  పోన్ చేసి అయినా చెప్పవచ్చుగా ... అన్నీ నిర్లక్ష్యమే! అని కోపంగా అనుకుంటూనే ..ఇంకా రాడేమిటీ .. అని  ఇంటి ముందు గేటు ని దాటుకుని దూరంగా రోడ్డు వైపు చూస్తూనే ఉంది.

నిమిష నిమిషానికి   వరండాలోకి వచ్చి చూస్తూనే ఉంది. బిడ్డ వస్తున్న జాడ లేదు తొమ్మిది,పది,పదకొండు గంటలు అవుతుంది.  పదవ నంబరు బస్, 23 వ నంబర్ బస్ లు , ఉయ్యూరు  బస్ లు కంకిపాడు బస్ అన్నీ ఒకదాని వెనుక వెళ్ళి పోతూనే ఉన్నాయి.  ఏ బస్ లోను అబ్బాయి దిగి రావడం లేదు. వాడిదగ్గర డబ్బులు కూడా ఎక్కువలేవు. ఎక్కడ ఉన్నాడో ఏమి చేస్తున్నాడో, మొన్నీమధ్య ఎప్పుడో తమ చుట్టాలబ్బాయిని ఎవరో పట్టుకెళ్ళి మద్రాస్ లో వదిలిపెట్టారని విన్నది అలా ఏమైనా జరగలేదు కదా ! అమ్మకి ఏడుపు వచ్చేస్తుంది.  కొడుకు ఫ్రెండ్స్ లో ఎవరి ఇంటికైనా పోన్ చేసి కనుక్కోవాలన్నా వారి నంబర్స్ తన దగ్గర లేవు. ఎప్పుడు ఇలా చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏమో ..!?  అమ్మకి కంగారు.

ఈ మధ్య పెత్తనాలు ఎక్కువైపోయాయి. చెప్పినమాట వినడంలేదు. ఈ రోజు ఇంటికి రానీ...   వీడి కాళ్ళు విరకోట్టాలి అనుకుంటూ..  కారుతున్న కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ .. కనిపించని దేవుడిని వేడుకుంది . నా బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి వచ్చేటట్టు చేయి తండ్రి ! అని.

పదకొండున్నర దాటింది. అప్పటిదాకా అమ్మ బయట బాల్కనీలో నిలబడే ఉంది. ఇంకో పది నిమిషాలు గడిచాయి బస్ దిగి మెల్లగా నడుచుకుంటూ వస్తున్న కొడుకుని చూసి ప్రాణం లేఛి వచ్చినట్లు అయ్యింది అమ్మకి. వెంటనే కోపం వచ్చింది. అబ్బాయి మూడు అంతస్తులు మెట్లెక్కి వచ్చేటప్పటికి అమ్మ ఇంట్లోకి వెళ్లి ... కావాల్సిన వస్తువు కోసం వెదికింది. కోపం,ఏడుపు కలగా పులగం అయిపోయి .. గబా గబా ఓ వస్తువు పట్టుకుని వరండాలో .వచ్చి నిలబడింది. అబ్బాయి చెప్పులు విడిచి స్టాండ్ లోకి  పెట్టి .. అమ్మా.. అమ్మా .! .సారీ అమ్మా.. !  అంటూ ముందుకు వచ్చాడు

ఏరా ! ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్లావు ? ఆడుకోవడానికని కదా వెళ్ళావు ..ఇప్పుదు టైం  ఎంతైంది ? నిన్ను నేను ఎక్కడని వెదకాలి? అసలు  భయం ఉందా నీకు ..? అని అడుగుతూనే చేతిలో ఉన్న అట్లకాడతో దబ దబ ..ఒక అయిదు నిమిషాలు పాటు బాదేసింది. అబ్బాయి అలా నిలబడి దెబ్బలు తింటూనే ఉన్నాడు కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అమ్మ చప్పున చేతిలో అట్లకాడ అక్కడ పడేసి ఎక్కడికెళ్ళావ్ .్పోన్  చేసి అయినా చెప్పవచ్చు కదా ! నేను ఎంత కంగారు పడుతున్నానో .. అని ఏడ్చింది.

అమ్మా.. ఫ్రెండ్స్ అందరూ ..ఎగ్జిబిషన్ కి వెళదామన్నారమ్మా ! ఇంట్లో చెప్పలేదు అంటే .. త్వరగానే వచ్చేద్దాం పర్లేదు వెళదాం అని అన్నారు. అక్కడికి వెళ్ళాక .. అక్కడ అన్నీ చూస్తూ టైమే తెలియలేదు అన్నాడబ్బాయి.

"నీ దగ్గర ఎక్కువ డబ్బులు కూడా లేవు ఫ్రెండ్స్ రమ్మన్నారని వెళ్ళి పోవడమేనా? అలా  వెళ్లకూడదని నీకు చెప్పానా లేదా .. అసలు ఈ మధ్య చెప్పిన మాట వినడం లేదు ".. అని మళ్ళీ అట్లకాడ  తీసుకుని రెండు దెబ్బలు వేసింది.
"నేను అసలు వెళ్ళేవాడిని కాదమ్మా ..  ఇదిగో .. ఇందు కోసం వెళ్ళా ".. అని వెనుక దాచుకున్న చేతులు చాచి ముందు పెట్టాడు. అప్పటి దాకా కోపంలో ఉన్న అమ్మ గమనించలేదు . ఎన్ని దెబ్బలు వేసినా చేయికూడా అడ్డుపెట్ట కుండా చేతులు  వెనుకకి దాచుకున్నాడని. అప్పుడే తెలిసింది ఆ..  సంగతి. చప్పున ఆ చేతిలొఉన్న వస్తువుని చూసింది ..

ఏమిటిది ? అడిగింది కళ్ళకి ఎదురుగా కనబడుతున్న వస్తువుని చూసి.

అప్పుడు అబ్బాయి ఇలా చెప్పాడు . "అమ్మా ! రేపు  మదర్స్ డే  కదమ్మా ! నిన్ను విష్ చేసి నీకు ఇవ్వాలని ఇది  తెచ్చాను " అన్నాడు

అంతే ! అమ్మ చేతిలో అట్లకాడ అప్రయత్నంగా క్రిందపదిపోయింది  . కోపంలో బిడ్డ ఒంటిపై పడ్డ ఎర్రటి వాతలని చూస్తూ ....అబ్బాయిని దగ్గరకి తీసుకుని   గట్టిగా ఏడ్చింది.

అమ్మా ! ఏడవకమ్మా ! ఇంకెప్పుడు నీకు చెప్పకుండా బయటకి వెళ్ళను .. అంటూ .. అమ్మ కన్నీళ్లు తుడిచి .. బుగ్గపై  ఓ .ముద్దు  పెట్టి .్ హ్యాపీ మదర్స్ డే " అమ్మా! అన్నాడు. అప్పుడు టైం  చూస్తే రాత్రి జీరో అవర్స్ .. ఆ రోజు మదర్స్ డే !

అమ్మ కళ్ళ లలో సంతోషం,దుఖం రెండూ పోటీ పడ్డాయి. బిడ్డని కొట్టినందుకు తనని తానూ తిట్టుకుంటూనే ..

"అవును ..ఇది ఎలా కొన్నావ్ ? నీ దగ్గర డబ్బులు లేవు కదా !? " అడిగింది ఆరాగా .

"మా ఫ్రెండ్ ని అడిగి డబ్బు అప్పుగా తీసుకున్నా నమ్మా ! రేపు నువ్వు ఇస్తావుగా ఇచ్చేస్తా ".అని  చెప్పాడు .

ఆ రోజు అబ్బాయి విష్ చేస్తూ  అమ్మకిచ్చిన గిఫ్ట్ ఇది ...




 ఈ.. జ్ఞాపకం .. నాకు చాలా ఇష్టమైనది ... అంటూ చెప్పాను ..నా ఫ్రెండ్ కి

నాకు మా అబ్బాయి నుండి ఎన్ని గిఫ్త్స్ అందుకున్నా ... ఈ గిఫ్ట్ .. చాలా చాలా విలువైనది  అపురూపమైనది
చాలా జాగ్రత్తగా చూసుకుంటాను

ఆ తర్వాత ఒ..పది మదర్స్ డే లు అయ్యాయి. ఎవరన్నా .. ఈ రోజు మదర్స్ డే అని  గుర్తు చేస్తే .." ప్రతి రోజూ మదర్స్ డే ".. నే అని చెప్పేం తగా ఎదిగిన   నా కొడుకు ని చూస్తే  ఆనందం

ఈ రోజు ఉదయం ... నా కొడుకుతో మాట్లాడుతూ ..ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ .. రాత్రి కూడా ఏడ్చాను . "చిన్నీ" ... అంటే .. తనూ  నవ్వుకుంటూ ఇప్పుడు కూడా ఏడుస్తావు కదమ్మా  ! అన్నాడు .

నిజంగానే .ఆ  రోజు సంగతి గుర్తు చేసుకుంటూ  నవ్వుకుంటూనే  మళ్ళీ ఏడ్చాను   ఎండావానా కలబోసినట్లు.
మా  అత్తమ్మ , నా ఫ్రెండ్ ఒకటే నవ్వు ....

 తనతో ... మాట్లాడుతూనే .. తర్వాత   ఏదో ఒక విషయం పై తనని మందలిస్తూ ఉంటే .. మారుమాట్లాడకుండా వింటూ .. " మా అమ్మ తిడుతుంది చూడండి " అన్నట్లు చూస్తూ, నానమ్మకి పిర్యాదు చేస్తూన్నట్లుగా,  మౌనంగా వింటున్న నా కొడుకు చిత్రం  ..ఇది.


:) ...

(ఈ మధ్య ఒకరు అడిగారు .. మీ అబ్బాయి కబుర్లు వ్రాయడం లేదేమిటీ .అని . అనుకోకుండా ఇలా మనసు పొరలు చీల్చుతూ ..వచ్చేసింది . ఈ విషయం పంచుకోవడం  మహదానందం    నేను నా కొడుకుని కొట్టిన నాలుగు సార్లు లో ఇది ఒక సందర్భం )  

13 కామెంట్‌లు:

జలతారు వెన్నెల చెప్పారు...

మనసుని కదిలించే జ్ఞాపకం. అబ్బాయి ఇచ్చిన గిఫ్ట్ అపురూపమైనది కదా? నా దీవెనలు నిఖిల్ కి. :) (ఎంత బాగా రాసారో ఈ టపా)

Dantuluri Kishore Varma చెప్పారు...

Very touching and nice.

Niru చెప్పారు...

మీ ఈ బంధానికి బీటలు వెయ్యని కోడలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానండి.ఎందుకంటే పెళ్ళికి ముందువరకు,అబ్బాయిలు అమ్మకూచిలే.అ తరవాత కూడ మీరు మీ అబ్బాయి ఇలానే సంతొషంగా వుండాలని కోరుకుంటున్నానండి .అందరు అలా మారిపొతారని అననుగాని,మారినవాళ్ళని చుసాను..అందుకే మనసుండబట్టలేక చెప్పాను..తప్పుగా అనుకోకండి..మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి...

సి.ఉమాదేవి చెప్పారు...

అమ్మఅన్నది అంత మంచిది అమ్మ ఒక్కతే!
పిల్లలను కొట్టినా,దండించినా బాధ అమ్మకే కదా!











Sent from http://bit.ly/f02wSy

Sharma చెప్పారు...

పెళ్ళికి ముందు అబ్బాయిలందరూ అమ్మ కూచీలు అంటే ఏకీభవించలేను . సహజంగా తనకంటూ నాది అనేది ఒకటి ( అంతదాకా అన్నీ కంబైండ్ కదా అబ్బాయి , అమ్మాయిలకి ) ఏర్పడేది ఆ పెళ్ళితోనే . అప్పుడు సహజంగా కొన్ని అనుకోని మార్పులు వస్తుంటాయి ఆ అబ్బాయి , అమ్మాయిలలో . అలా మనకూ ఏర్పడ్డాయన్నది , మనం మరచిఫొకుంటే , ఆ మార్పును చక్కగా ఆహ్వానించగలం . ఆనందాలను అనుభవించగలం ఎప్పుడంటే , వాళ్ళ స్వవిషయాలలో మనం ప్రవేశించనంతవరకు . ఇది మాత్రం మరువకూడదు పెద్దలైనవారు . మరిస్తేనే సమస్యల వలయంలో చిక్కుకొని , విషాదవదనులై , అన్య మనస్కులైపోతారు . తస్మాత్ జాగ్రత్త సుమా !

అజ్ఞాత చెప్పారు...

కొంచెం బాధాకరమే అయినా, అద్భుతమైన జ్ఞాపకం.

ranivani చెప్పారు...

మీ జ్ఞాపకం హృదయాన్ని కదిలించిందండీ .దృశ్యాన్ని కళ్ళముందుకు తెచ్చేసారు .బావుంది .

మాలా కుమార్ చెప్పారు...

మీ జ్ఞాపకం టచీగా వుంది.అమ్మకు ఇలాంటి జ్ఞాపకాలు తప్పవేమో:)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జలతారు వెన్నెల గారు థాంక్ యు సో మచ్
నిఖిల్ తరపున కూడా మీకు ధన్యవాదములు

కిశోర్ వర్మ గారు థాంక్ యో సో మచ్

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Niru మీ స్పందనకి ధన్యవాదములు . మీరన్నది నిజమే! అయినా మార్పుని ఆహ్వానించగల సత్తా నాకు ఉంటుందని అనుకుంటాను అలాంటి విశాల దృక్పధం అలవర్చుకోవడానికి సిద్దంగా ఉన్నాను :)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ఉమాదేవి గారు ..థాంక్యూ ! అమ్మకి అలాంటి జ్ఞాపకాలే మధురం కదా!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Sharma గారు థాంక్ యు సో మచ్ అండీ !
Bonagiri గారు థాంక్యూ సో మచ్
@ నాగరాణి గారు థాంక్యూ సో మచ్ అండీ !!

శోభ చెప్పారు...

కదిలించే జ్ఞాపకం.. అమ్మతనాన్ని అనుభవించడంకన్నా సంతృప్తి ఇంకేముంటుందండి జీవితానికి... మీరు అదృష్టవంతులు...

నీ జ్ఞాపకాల్ని పొదివిపట్టుకున్న అమ్మని చివరికంటా పొదివి పట్టుకుంటావని ఆశిస్తూ.. గాడ్ బ్లెస్ యూ నిఖిల్...!