13, జులై 2013, శనివారం

తృతీయ ప్రకృతి


ఒక ప్రయాణికుడిని రైల్వే  స్టేషన్  నుండి  తన ఆటో లో ఎక్కించుకుని వచ్చి ఐదు  నక్షత్రాల హోటల్ ముందు ఆపాడు శేషు.  డాబుగా ఉన్న ఆ బాబు చేతిలో చిన్న బ్రీఫ్ కేస్ ని పుచ్చుకుని "ఈ లగేజ్ ని రిసెప్షన్ వరకు తెచ్చిపెట్టు, నీకు అక్కడ ఆటో ఫేర్ ఇచ్చేస్తాను " అంటూ సమాధానం కోసం చూడకుండా ముందుకు వడి వడిగా నడుచుకుంటూ వెళుతున్న అతని వెనుకనే లగేజ్ తీసుకుని వెళుతూ  ఇచ్చేదేమో చిల్ల గింజంత చేయించుకునేదేమో ఝామంతా " అని ఓ ముతక సామెతని కాస్త నాగరికం చేసి తిట్టుకుంటూ నడిచాడు శేషు 


రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రయాణికుడి లగేజ్ ని అక్కడ పెట్టి ఆతను ఇచ్చే డబ్బు కోసం ఎదురుచూస్తూ చుట్టుపక్కలంతా చూస్తూ మళ్ళీ ఏదైనా కిరాయి దొరికితే బాగుండు. ఆటో బాడుగ ఇచ్చేస్తే బియ్యం,కూరాకుకి తప్ప ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు చుక్కేసి రెండు రోజులైయింది.   నాటుసారా పూటుగా కొట్టి ఓ అరకోడిని  ఇగురేసి తిని పక్కలో పెళ్ళాంతో ముద్దు ముచ్చట్లు ఆడితే గాని ఈ రోజు తెల్లారగూడదు మరీ సరదా సంతోషం లేని చప్పటి  బతుకైపోయింది అని మనసులో అనుకుంటూ . . సూటు బాబు ఇచ్చిన డబ్బుని లెక్కెట్టుకుంటూ మెట్లవైపు చూసాడు.


 కావాలని జడ ఊగేటట్టు నడుస్తూ బిగుతుగా కట్టిన క్రేప్ చీరలోనుండి స్పష్టంగా కనబడే వెనుకభాగాన్ని అటు ఇటు కదుపుతూ వయ్యారంగా మెట్లెక్కుతున్న ఒక మనిషిని చూసాడు . ఆ నడక కాదు కాని  వెనుక భాగం నుండి చూడగానే అదే విధమైన నడక ఎక్కడో చూసినట్టు గుర్తు ..ఎవరబ్బా ఈ నడక నాకు తెలిసినట్లు ఉంది అనుకుంటూ గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేసాడు . వెంటనే శేషు కి ఆ రూపం గుర్తుకుతెచ్చుకోడానికి ప్రయత్నిస్తూ   ఆలోచిస్తున్నాడు కానీ ఊహకి అందడడం లేదే?  అనుకుంటూ ఆలోచిస్తూనే ఆమె వైపే చూస్తున్నాడు ఆ వగలాడి మెట్ల చివర మలుపు తిరుగుతూ రిసెప్షన్ వైపు చూసింది . వెంటనే శేషు గొంతు నుండి "మధూ "అన్న కేక వెలువడింది . మెట్లెక్కి ఆమె వైపు గబా గబా వెళ్ళాడు  శేషు తన వెనుక రావడం చూసి ఆమె చీర కొంగుని తలపై కప్పుకుని పరిగెత్తుతూ వెళ్ళి ఒక రూం తాళం తీసి అందులోకి వెళ్ళి తలుపు వేసుకుంది . శేషు మూసిన తలుపు వరకు వెళ్ళి మధూ మధూ..తలుపుతీయి అని తలుపు కొట్టసాగాడు. 


ఒక ఆటో అతను హోటల్లో బస చేసిన ఆమె వైపు చూసి కేకలు పెట్టడం వెనుకనే పరిగెత్తడం చూసి   హోటల్ మేనేజర్ ,ఇద్దరు ముగ్గురు సర్వర్ లు  హడావిడిగా వచ్చి  శేషు ప్రక్కన నిలబడి  " ఏమిటి ఇక్కడ న్యూసెన్స్ .. అలా అరచి గొడవ చేయకూడదు మీకు కావాల్సిన మనిషి లోపల ఉంటే .. రిసెప్షన్ లో వెయిట్  చేయండి .. ఆమెకి చెప్పి పర్మిషన్ తీసుకుని  లోపలకి పంపమంటే  నిన్ను పంపుతాం " .. అంటూ అతనిని అక్కడి నుండి లాక్కెళ్ళే  ప్రయత్నం చేశారు . 


"మేనేజర్ గారు ఒక్క సారి నా మాట వినండి .. లోపలకి వెళ్ళి తలుపేసుకున్నది ..నా అన్న కొడుకు అండీ. వాడు ఇల్లు ఒదిలిపోయి మూడేళ్ళయ్యింది . ఆళ్ళమ్మ పోయె ప్రాణాలు నిలుపుకుని ఆడి  కోసం ఎదురుచూత్తా  ఉంది . ఆడిని తీసుకెళ్ళి ఆళ్ళమ్మకి చూపిత్తే పేనం నిలిపినట్టు . ఒకసారి ఆడిని  మీరైనా పిలవండయ్యా .మీకు పుణ్యం ఉంటది "వేడుకున్నాడు . 


"ఈ రూం లో మగవాళ్ళు ఎవరు లేరే! ఉన్నది ఇద్దరూ ఆడవాళ్ళే ! ఇక్కడ జరుగుతున్న పెళ్ళి కోసం వచ్చారు . నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావో .. వెళ్ళెళ్ళు " కసురుకున్నాదు. 


"అయ్యా..నేను అబద్దం చెప్పట్లా, సత్య ప్రమాణకంగా చెపుతున్నా .. నీళ్ళోసుకున్న మా ఆడదాని మీదొట్టేసి చెపుతుండా ..లొపలికి పోయి తలుపపేసుకుంది... మా మధు గాడే ! అయిదుగురు అన్నదమ్ముల మధ్యన అందరికీ కలిపి ఒకే ఒక మగపిల్లగాడు వారసుడు. మా ఆశలన్నీఆడిపైనే,   వాడిని  కాస్త బయటకి పిలవండయా, ఆడితో నే మాట్టాడతాను " అన్నాడు 


"ఈ రూమ్లో ఉన్నది ఆడాళ్ళు అయితే మగాడు అంటాడేమిటి ఒకసారి కిందకి వెళ్ళి రిజిస్టర్ తీసుకురా, ఇప్పుడే తేల్చేద్దాం. ఈ న్యూసెన్స్ ఇలాగే వుంటే ముందు నా ఉద్యోగం ఊడుతుంది అంటూ "నువ్వు ప్రక్కకి రావయ్యా " అంటూ శేషుని కారిడార్ చివరికి లాక్కుని వెళ్ళాడు . 


మేనేజర్ ప్రక్కకి లాక్కెళ్ళినా చూపంతా ఆ గది తలుపుల వైపే ఉంచి జేబులో ఫోన్ తీసి రెండు  మూడుసార్లు ఫోన్ చేసి "తొందరగా మన వాళ్లందరినీ  తీసుకుని వచ్చేయండి "అని చెప్పాడు . 


క్రింద నుండి రిజిస్టర్ తెచ్చి ఈ రూం లో ఉన్న వారి పేర్లు మిస్ మధుబాల ,ఇంకొకరి పేరు మిస్  ప్రీతం  అని చెప్పాడు . "హా.. నేను చెప్పాలా .. ఆ మధు యే నా అన్న కొడుకు మధు "అన్నాడు శేషు . 


ఇంకొకతను వచ్చి మేనేజర్ ని పక్కకి తీసుకుని వెళ్లి చెవిలో ఏదో గుస గుసగా చెప్పాడు. 


ఆతను శేషు దగ్గరకి వచ్చి "నేను ఆ రూమ్లో ఉన్న వారికి క్రిందికి పిలిపిస్తాను క్రిందకి వెళదాం రా.. ఇక్కడ ఉంటే మిగతా రూమ్లో ఉన్న వాళ్ళకు డిస్ట్రబెన్స్ "అంటూ .ముందుకు నడిచాడు  


వాళ్ళిద్దరూ లిఫ్ట్ లో  క్రిందికి వచ్చేసరికి   బిల బిల మంటూ మూడు ఆటోల్లో ఇరవై మంది దాకా దిగేసి శేషుని చుట్టేశారు "ఏడ ఉండాడు రా మన మధు గాడు చూద్దాం పదండి" అని తోసుకుని ముందుకు వెళ్ళారు. తన బలగం చూసేసరికి శేషు కి దైర్యం వచ్చింది .. "నేను చూపిస్తా పదండి "అంటూ ఇందాక మూసుకున్న  తలుపులు ముందే నిలబడి  "మధూ ..ఓరి మధూ బయటకి రారా ఇయిగో మీ అమ్మ కూడా వచ్చింది బయటకి రారా " అని కేకేస్తూ తలుపులు బాదాడు. ఆ చప్పుడుకి ప్రక్క రూం ల వాళ్ళు  తలుపులు తెరుచుకుని తలని బయటకి పెట్టి బయట జరుగుతున్నదానిని ఒక క్షణం చూసి మళ్ళీ తలుపేసుకున్నారు. హోటల్ మేనేజర్ మరో తాళం తీసుకుని వచ్చి రూం తలుపు తీసి లోపల ఉన్న ఆమెని బయటకి రప్పించాడు 


బయటకి వచ్చిన ఆమెని చూసి శేషు పిలిస్తే వచ్చిన వాళ్ళందరికీ ఏమి అర్ధం కాలేదు . శేషు వదిన ఒక్క ఉదుటున ముందుకు వచ్చి ముసుగేసుకుని ముఖం దాచుకున్న ఆమెని చూసింది అనుమానంగా కాళ్ళు చేతులు వంక చూసింది  అమాంతం ఆమెని వెనక్కి తిప్పి వీపు మీద ఉన్న పెద్ద పుట్టుమచ్చని చూసి  "ఒరేయ్ ..కొడుకా " అంటూ చీర ముసుగుని లాగి పడేసింది జడని పట్టుకుని లాగింది తలకి పెట్టుక్కున విగ్ పడిపోయి ఒంటి పైన చీర లేకుండా నిలబడ్డ ఆమెని చూసి  "మధూ  ఏంట్రా ఈ వేషం ? ఇన్నేళ్ళు ఎక్కడికి పోయినావురా?  తోటి పిల్లగాళ్ళతో కలిసి పేజేక్ట్ వర్కు కనీ పోయినవ్ అందరూ తిరిగి వచ్చిరి . నువ్వు ఇంకో ఇద్దరు పిల్లకాయలు అంతు లేకుండా పోయారు నీ కోసరం  ఎదురు చూసి చూసి అలుపొచ్చింది . మీ నాయన ఉండ  నాలుగు కుంటలు అమ్మి ఆడని ఈడని తిరిగి తిరిగి మంచాన పడ్డాడు ఎలుకలాళ్ళ కులంలో పుట్టినా  చెట్లెంబడా పుట్టలెంబడా తిరగనీయకుండా  బడికి పంపితిమి ఇంజినీరింగ్ చదువు చదివావు .. ఇదిగో నాలుగ్నెల్లల్లో ఉజ్జోగం వస్తదని కడుపు నిండి పోయే మాటలు చెప్పి మాయం అయిపోయావు .మళ్ళీ ఇట్టా కనబడ్డావు ! ఆ ఏడుకొండల సామి దయతల్చి మళ్ళీ ఇట్టా కనబడేటట్టు  చేసాడు. ఇంటికి పోదాం రా..బిడ్డా " చేయి పట్టుకు అడిగింది . 


ఆప్ కౌన్ హై .. ఆప్కీ  బాత్  సంజీ  నహీ " అంది మధు 


"ఇదేంటి వీడు ఇలా మాట్టాడతాడు మన మధు గాడు  కాదా " అడిగాడు శేషు అనుమానంగా . "


“మై మధు బాల .. మే గుజరాత్ సే ఆయీ .. ఏ లోగ్ క్యా బాత్ కర్ రహే హై   .. అడిగింది ఆమె . 


బాడ కావ్ ! కన్న తల్లి గుర్తుపట్టి ..ఇంటికి పోదాం రా బిడ్డా అని పిలిస్తే  నాటకాలు ఆడతన్నావా నాటకాలు!!  నువ్వు చీర గట్టి బొట్టు కాటుక పెడితే ఆడముండవై పోతావేమిటిరా, తాళ్ళతో కట్టుకెళ్ళి చెట్టుకి ఉరేత్తా,నోరు మూసుకుని రా . మేనమామ ఆమె జాకెట్ పై చెయ్యేసి  పుచ్చుకుని  ముందుకు లాగుతూ అన్నాడు ."


 మేనేజర్ సాబ్ యే లోగ్  కౌన్ హై, ముజే పరేషాన్ కర్ రహే హై!  పొలీస్ కో బులావో " చెప్పింది ఆమె కీచు  గొంతుతో ..  


ఒరేయ్ నరసింహా, ఈడు  మన మధుగాడేనురా,  ఆ  కాళ్ళు చేతులు ఆ ముక్కట్లు అన్నీ ఆడే ! ఈడికి ఇదేమి పొయ్యేకాలం ? కొజ్జా వేషం వేసుకుని తిరుగుతున్నాడు. ఈడి  కోసం అంతా అల్లలాడిపొయారు కందా !  చదవేస్తే ఉన్న మతి పోయిందంట ఈడిని ఇంటికి తీసుకొచ్చి నలుగురిలో ఊయించుకోడం కన్నా ఆడి ని అట్టాగే వదిలేత్తే మంచిది " అన్నాడు వెంకయ్య ముందు చూపుగా 


"ముందు ఆడిని ఈడ నుండి తీసుకుని పోదాం పదండి" అని  ఆమెని బలవంతంగా లాక్కెళ్ళి ఆటోలో వేసి  పారిపోకుండా అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు కూర్చున్నారు 


ఇదంతా చోద్యంగా చూస్తూ అర్ధం అయ్యేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు, అయ్యో!  ఇదేమిటి తమ హోటల్లో దిగిన ఆమెని బలవంతంగా లాక్కెళ్ళారు అర్జంటుగా పోలీస్ స్టేషన్కి చెప్పాలి ఈ విషయం అంటూ  హడావిడి పడ్డాడు హోటల్ మేనేజర్ 


****** 


"అయ్యా ! మధూ .. చెప్పిన మాట ఇనరా!  ఆడాళ్ళ బట్టలే ఎసుకుంటానని గోల చెయ్యకురా ! నిన్ను బలవంతంగా ఎత్తుకొచ్చినమని పోలీసోళ్ళ సతాయింపు, మన పేట లో ఉంచినందుకే  ఊరుకునట్లా ,మన కులపోళ్లలో ఇట్టా ఎవరైనా చేసినారా ఇదెంత తప్పు ? ఆడు ఇక్కడ ఉండాలంటే  తప్పు కట్టాలి ..లేకపోతే పేట నా కొడుకులందరూ  ఇట్టాంటి కొజ్జా  వేషం యేసి కులం పరువు తీయరు ? అని  పంచాయితీలు పెట్టినారు  నువ్వు సూత్తా ఉండావ్ కదా ! మీ నాయన పెద్ద మనుషుల కాడ  లచ్చ రూపాయలు తప్పు కట్టి వచ్చాడు నువ్వు మగాడిగా గుడ్డ గడితేనే, మీసం పెంచితేనే ఈ పేటలో ఉండనీయడానికి ఒప్పుకుంటారట . నువ్వు చీర కట్టి పూలు పెట్టి అందరిని బాయ్యా, అక్కయ్య అంటే మళ్ళీ మన కులం పెద్దోళ్ళు తప్పేత్తారు రా .. ఏం  జరిగిందో ఏమో అన్ని మర్చిపోయి మాములుగా ఉండరా “ బతిమిలాడింది తల్లి . 


 "అమ్మా నే చెపితే వినవేమ్టి ! నేను ఇప్పుడు మధు ని కాదు, మధుబాలని . నేను అమ్మాయిగా మారిపోయి మూడేళ్ళు అయింది మీరందరూ ఇప్పుడిట్టా మదూ మధూ...   అని పిలుస్తా ఉంటే నాకు ఎలర్జీ ! నేను అమ్మాయిని మధుబాల అని పిలువు " చెప్పింది ఆమె 


చేతిలో ఉన్న కొత్త పేంటు చొక్కాని విసిరి పారేసి “నా ఖర్మ రా.. పుట్టినప్పుడు మగ లంజ కొడుకువుగానే పుడితివి గదరా,పదేళ్ళు వచ్చేదాకా తాడిచెట్టుని నిలబెట్టినట్టు నిలబెట్టి నేనే నీళ్ళు పోసినాను కదరా! గడ్డలు మీసాలు వచ్చినాయి ఇంకా నువ్వు ఆడగా ఉండింది ఎక్కడరా .."  అడిగింది . 


" నేను బొంబాయిలో ఆడదానిగా మారిపోయా .." చెప్పింది 


ఏం  మాట్లాడాలో తెలియక గోడకి ఆనుకుని వెక్కి వెక్కి ఏడ్చింది వెంకమ్మ. పేటలో ఉంటే కులపెద్దలు తప్పేత్తారని ఊరికి దూరంగా ఒంటి నిట్టాడి  ఇల్లు కట్టి అందులోకి మార్చారు ఆమెని 


"ఏమే! రమణా వాడు ఎవరు చెప్పినా ఇనడం లేదు.  ఆడు చెప్పింది నమ్మడానికి  రుజువు చేసుకోవాలన్నా ఒంటి   మీద చెయ్యేయనీయటల్లేదు  ఆడు ఎందుకట్టా మారాడో! అసలు ఆడ మనిషో కాదో కనుక్కోవే!" అంటూ  పెళ్ళాం  రమణ  కి చెప్పాడు శేషు.


రమణ టవున్లో పుట్టి పెరిగింది చదివింది పదవ తరగతే కాని చిన్నప్పటి నుండి చదువుకున్న వాళ్ళందరి మధ్య తిరగడం అస్తమాను టీవి చూడటం మూలంగా కాస్త లోక జ్ఞానం ఎక్కువే. 

మధు ని ఇంటికి పిలిచి ప్రేమగా పలకరించింది "మధుబాల మధుబాల అంటూ పిలిచి ..నువ్వు చాలా అందంగా ఉన్నావు " అని మెచ్చుకుంది. కాసేపు సినిమా కబుర్లు ఈ  కబుర్లు చెప్పింది . 


"అబ్బ నువ్వు ఎంత మంచిదానివి చిన్నమ్మా ! నాకు బాగా నచ్చావ్ ! మా బాబాయి నిన్ను కట్టుకుని మంచి పని జేశాడు " అంటూ ఎదురు పొగిడింది మధు . అలా మాటా మాటా కలిసిన దగ్గర్నుండి చిన్నమ్మా ! చెరుకు గడల జడ వేయవా అని ఒకసారి ,  నీ చీర చాలా బాగుంది నేను కట్టుకోనా అని ఒకసారి,నేను బాడీలు కొనుక్కోవాలి సిటీకి పోదాం పద అని ఇంకో సారి రోజూ రమణ చుట్టూ తిరిగేది  మధుబాల. 


కోటేరేసినట్టు ఉండే ముక్కు సోగ కళ్ళు ఎర్రటి పెదాలు  కాస్త మొరటుగా  ఉన్న గడ్డం తో బిగుతుగా కట్టిన బట్టలతో సన్నగా పిడికెడంత నడుముతో  కులుకుతూ  నడుస్తున్న ఉన్న ఈడిని చూస్తే కొజ్జా గా కావాలని మారినాడు అని ఎవరూ  అనుకోనే అనుకోరు అలా వున్నాడు వీడీతో మంచిగ ఉండి  అసలు విషయం రాబట్టాలి అనుకుంది రమణ.


రమణ తో బాగా చనువు పెరిగాక మధూ ..నువ్వు ఎందుకు ఇలా మారిపోయావ్ అని అడిగింది రమణ . 


అబ్బ ఉండు చిన్నమ్మా! ఈ  పింక్ రంగు బాడీ జాకెట్ లో నుండి  బాగా కనబడతుందా ? ఇవిగో నా గాజులు నా హెయిర్ బాండ్ లు బాగున్నాయా .. ? అంటూ మోచేతులదాకా వేసుకున్న గాజులను జుట్టు నిండా తగిలిచ్చుకున్న రంగు రంగుల హెయిర్ బేండ్ లని చూపించేది. 


చాలా బాగున్నాయి కానీ మధూ.. చెప్పు మధూ ! నాక్కూడా మగవాడిలా మారిపోవాలని ఉంది అని కాళ్ళకి బంధం వేసింది


  “ఎట్టెట్టా ..నీకు  అట్టా అనిపిచ్చుద్దా ! అయితే నా కథ చెపుతా విను” అంటూ ప్రక్కకి వచ్చి దగ్గరిగా కూచుంది. కొంచెం బెరుకుగా అయిష్టంగా  దూరంగా జరిగి  చెప్పు  మధూ  అంది రమణ . 


 మధుబాల  గొంతు సవరించుకుని నిజమైన మధు గా మారింది ఆ గొంతులో వినసొంపు అయిన మాట టవున్ లో చదువుకున్నాళ్ళ మాటలా మారి " చిన్నమ్మా ! చిన్నప్పుడు నుండి నాకు ఆడవాళ్ళు లా ఉండటం ఇష్టం మా అమ్మ నా చేయి పట్టుకుని ఎంత సన్నంగా ఉన్నాయిరా నీ ఏళ్ళు  అరకాసు ఉంగరం అయితే సరి పోను, అరచేయి చూడు మెత్తంగా పూవులా  ఉంది అనేది, నా కాళ్ళు రుద్ది స్నానం చేయిస్తూ ఆడపిల్లల కాళ్ళు రా నీయి మువ్వల పట్టీలు పెడితే బావుండేది అంటుండేది  ఆ మాటలు అన్నీ నాలో అట్టాగే ఉండి పోయినాయి. కాలేజ్ లో ఏ ఆడపిల్ల జడ చూసినా అందంగా డ్రస్ వేసుకున్న వాళ్ళని చూసినా నాకు అలాగే ఉంటే బాగుండేది అనిపించేది నాలో దాక్కుని ఉండే కోరిక పెరిగి పెద్దదైపోయి నేను ఆడదానిగా మారితే బావుండేది అనిపించింది నా చదువు పూర్తిఅయి ప్రాజెక్ట్ వర్క్ కి ముంబాయి వెళ్ళడం అక్కడ నలబై రోజులు ఉన్నప్పుడు  అక్కడ నాకు హిజ్రాలు తో పరిచయం కల్గింది. వాళ్ళతో అప్పుడప్పుడూ మాట్లాడుతుంటే వాళ్ళల్లో చాలా మంది పుట్టుకతో హిజ్రాలు కాదు    ఆడవాళ్ళగా మారిపోవాలనే కోరికతో ఇల్లు వదిలి పారిపోయి వచ్చినవాళ్ళు, ఆపరేషన్ చేయించుకుని ట్రాన్స్ జండర్ గా మారిన వాళ్ళు  ఉన్నారు. ఇంకా అనేక రకాలుగా మారినవాళ్ళు, బలవంతంగా  మార్చబడిన వాళ్ళు హిజ్రాలు అని  తెలిసింది .  అవన్నీ విన్నాక నేను అలాగే మారిపోవాలనుకున్నాను.  నాకు పరిచయం ఉన్న హిజ్రాలే నన్ను ఒక డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్ళాడు ఇరవై వేల రూపాయాల ఖర్చుతో  నేను అమ్మాయిగా మారిపోయాను . అనేక రకాల హార్మోన్  ఇంజక్షన్ ల ద్వారా ఆడవాళ్ళలా మారడం ఏమంత కష్టం కాదు . నేను ఇప్పుడు మగాడినే కాదు ఆడదానినే ! చూడు నాకు సన్ను సంకా అన్నీ ఉన్నాయి అంటూ జాకెట్ విప్పేసి కట్టుకున్న  చీర విప్పేసి దిశ మొలతో ఎదురుగా నిలబడ్డాడు.  


మధు రూపం చూసి  రమణకి భయం వేసింది.  చప్పున ప్రక్క గదిలోకి వెళ్ళిపోయి “నేను నమ్మానులే! ముందు గుడ్డలు కట్టుకో ! ఇలా కొజ్జా వాడిలాగా బతకడానికి సిగ్గేయడం లేదా" అడిగింది 


భలేదానివి చిన్నమ్మా! అలా అంటా వెందుకు ? శివుడు రెండుసార్లు ఆడదాని అవతారం ఎత్తాడంట . విష్ణు మూర్తి  అమృతం కోసం మోహిని అవతారం ఎత్తలేదా ! అర్జునుడు  వనవాసంలో విరాటుడి కొలువులో బృహన్నల వేషం వేయలేదా !? హిజ్రాలని మమ్మల్ని వెలివేయకూడదు తెలుసా !  నిజమైన హిజ్రాలకి కొన్ని దైవ శక్తులు  ఉంటాయట అని కొందరి నమ్మకం.   లేక లేక పుట్టిన బిడ్డలకి మా లాంటి వాళ్ళ చేత దీవెనలిప్పిస్తే మంచిదని పెద్దపెద్ద ధనవంతులు  బాగా డబ్బు ఇచ్చి మమ్మల్ని  ఇంటికి తీసుకునిపోతారు.   అలాగే  విందు వినోదాల సమయాలలో మమ్మల్ని తీసుకెళ్లి ఆడించి  పాడించి సంతోష పడతారు. మాకు ఒక గుడి ఉంది "బాహుచర మాత " అన్న గుడి .  అప్పుడప్పుడు మేము అక్కడికి వెళతాము అని వివరంగా చెప్పాడు. అది చెపుతున్నప్పుడు అతని గొంతులో గర్వం తొణికిసలాడింది. 


రమణ నోరు తెరుచుకుని మధు చెప్పే మాటలని వింటూ ఆశ్చర్యంగా చూస్తుంది.


మధు అంతలోనే మాట మార్చి మళ్ళీ మధుబాలగా మారిపోయి .. " ఎవరు ఎట్టా బతకాలనుకున్నారో అలాగే బతకనివ్వాలి .  నేను ఇలాగ ఉండానని మా అమ్మ ఏడ్చి గోల పెట్టుద్ది , నాన్న కి కోపం వచ్చుద్ది ,  అక్కయ్య అసహ్యంగా చూసుద్ది . బావ తప్పుకుని తప్పుకుని తిరుగుతాడు నాకిక్కడ కాళ్ళు చేతులు కట్టేసినట్లు ఉంది. నేను మా వాళ్ళ దగ్గరికే పోతాను  బాబూ! అంది  పైట తిప్పుకుంటూ


  "అవన్నీ ఎందుకు కానీ మీ అమ్మ అయ్యా నలుగురిలో తలెత్తుకోలేక బయట ముఖం చూడట్లా ..!  అయిపోయింది ఏదో అయిపోయింది నువ్వు అదివరకటిలా మాములుగా ఉండు  ఇంకో వారంలో మీరు కొత్తింట్లోకి  పోతున్నారు కదా! అక్కడైతే కులపోళ్ళ కట్టుబాట్లు ఏవి ఉండవ్, మీ అందరూ కలసి ఒకే ఇంట్లో ఉండొచ్చు” చెప్పింది. 


"ఆలోచించి చెపుతా చిన్నమ్మా ! అని వెళ్ళిపోయింది మధు. 


ఆ రాత్రి మధు చెప్పిన విషయాలన్నిటిని  పూస గుచ్చినట్టు  శేషుకు చెప్పింది  అంతా  విని ఈడు ఇక్కడ కుదురుగా ఉంటాడని నేననుకోను.  మగవాళ్ళు కనబడితే మీద మీద పడతాన్నాడు అంట. ఆడాళ్ళు నీల్లోసుకుంటుంటే  వీపు రుద్దుతా అని బాత్రూమ్ లలో   జొరబడుతున్నాడని చెపుతా ఉండారు . ఈడు  ఇక్కడే ఉంటే  ఈడి  మూలంగా అందరూ తన్నులు తినాల. తప్పు కట్టాలా .  వాడిని  పోనిస్తేనే  మంచిదని అన్నకి జెప్పినా!  వీళ్ళకి ఒక గ్రూప్ ఉంటది మన బెజవాడలో కూడా బేరేజీ మీద, వన్టౌన్ లోను కాసుక్కూకుని ఉంటారు.  ఇలాంటి వెధవ నాకొడుకులందరూ షాపు లెంబడి తిరుగుతా  ఉంటారు, నానా  రకాల చేష్టలు చెత్తా ఉంటారు. వాడిని మనం బలవంతంగా ఇంటో  ఉంచుకోవడం మంచిది కాదు. వాడి దోవన వాడిని పోనిచ్చి  వాడి ఖర్మ అట్టా ఉందను కోవడమే ! మా వదినకి నచ్చ జెప్పాల . లేకపోతే చేపల యాపారంలో కష్టపడి  సంపాయించింది అంతా కులం వాళ్లు వేసే తప్పు లెక్కకి కట్టాల్సి వచ్చుద్ది “ ఆలోచనగా అన్నాడు శేషు. 


"అదీ నిజమే ..బావా " అంది  రమణ 


ఒక వారం తర్వాత నరసింహ కొత్త  ఇంట్లోకి మారాడు కక్కా -ముక్కతో విందు జరగబోతుందగా .. “అమ్మా!నాకు ఈ ఫేంట్  చొక్కా ఎందుకు తెచ్చావే ? అక్కకి తెచ్చినట్టు నాకు చీర జాకెట్ ఎందుకు తేలేదు ? అవి తెచ్చి ఇస్తేనే నేను ఉంటాను లేకపోతే  నేను పోతాను” అంటూ రభస మొదలెట్టింది మధు 


“అయ్యా.. నీకు దణ్ణం పెడతానురా, చుట్టాలందరి ముందు నా పరువు తీయకు ఇప్పుడు ఈ పేంట్ చొక్కా వేసుకో రేపు చీర జాకెట్ కొనిపెడతా అంటూ గడ్డం పుచ్చుకు బతిమలాడింది తల్లి. “ నాకు ఈ బట్టలు వద్దు పో”అంటూ పేంటూ చొక్కా విసిరి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మధు ఆడదానిలా నడుస్తూ. 


 కళ్ళల్లో నీళ్ళు నింపుకుని కోడలోచ్చి సింగారంలా  తిరగాల్సిన ఈ ఇంట్లో ఈడి  ఆడ  చేష్టలు ఏమిటో! అనుకుంటున్న వెంకమ్మ  వద్దకి వచ్చి " పోతే  పోయాడు వెధవ నా కొడుకు, వాడి గురించి ఇక మర్చిపొవే! " అంటూ  భార్య భుజం మీద చెయ్యేసి చెప్పాడు ఓదార్పుగా నరసింహ.


తెల్లారి “చిన్నమ్మా ! ఓ చిన్నమ్మా !! “అనుకుంటూ వచ్చింది మధు 


“ఏమిటి మధూ  ఆ కేకలు, అన్నం పెట్టనా ? “అడిగింది రమణ 


“వద్దు చిన్నమ్మా ! మా "గురు"  నన్ను వెతుక్కుంటూ ముంబాయి నుండి ఇక్కడికి వచ్చాడు నేను ఆయనతో కలసి బొంబాయి కి పోతున్నా! అక్కడ నాలా డాన్స్ చేసేవాళ్ళు పాటలు పాడేవాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు లేకుండా పోయారంట, నేను వెళ్ళిపోతా .. అక్కడే హ్యాపీగా బతుకుతా . మాయదారి సంత మాయదారి సంత అని .. మా శేషు బాబాయి గాడు  నన్ను హోటల్ లో చూసి ఉండకపోతే ఇదంతా ఉండకపోవును కదా ! “ అని మెటికలు విరిచి తిప్పుకుంటూ జడ ఊపుకుంటూ వెళ్ళి పోతున్న వాడి వంక చూసి వీడు ఆడ మగ కాని మూడవజాతి, తృతీయ ప్రకృతి.   నాకెట్టాంటి  పుడతాడో !?  అనుకుంటూ కడుపు మీద చెయ్యేసుకుని భయపడింది రమణ. 


(2005 లో వ్రాసిన కథ)

7 కామెంట్‌లు:

Goutami News చెప్పారు...

మీ బ్లాగుని పూదండ తో అనుసంధానించండి.

www.poodanda.blogspot.com

అజ్ఞాత చెప్పారు...

తృతీయ ప్రకృతి బాగా పెరిగింది. బహుశః రాజకీయాలనుంచి దిగుమతి అయిందేమో :)

shan చెప్పారు...

మూడో జాతి మనిషిగా మారడంలో తల్లిదండ్రులూ కొంతవరకూ కారణం అవడం బాధాకరం. మగ పిల్లల్ని అడ పిల్లలతో పోల్చడం, ఆడపిల్లల్ని మగపిల్లలతో పోల్చడం తెలియకుండానే వారిలో కొన్ని భావనల్ని నాటడం జరుగుతోంది. నాకు తెలిసిన ఒక మహిళా ఉద్యోగి తన కొడుకు మూడో జాతిగా మారడంతో ఎంత వ్యధ అనుభవించిన్దొచూశా. ఈ సమస్యని చక్కగా చూపారు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కష్టేఫలే మాస్టారూ ! అవునండీ ప్రకృతికి విరుద్దమైన పోకడలు బాగా కనబడుతున్నాయి. ఏమిటో ఈ వింత ఆనందం !? దూరంగా మెసలాలి అనిపిస్తూ ఉంది. ఇది రియల్ స్టోరీ మాస్టారూ.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Shan గారు మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. మీ వ్యాఖ్యకి మరీ మరీ ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

నా బ్లాగ్ ని పూదండతో అనుసందానించానండీ.ధన్యవాదములు

Visala Appidi చెప్పారు...

మూడవ జాతికోసం చెయ్యాల్సిందిచాలావుంది.పెరిగిపోతున్న వాళ్ళ సంఖ్యా ,వాళ్ళ ఆర్ధికపర్స్తితి చాలా బాధగా వుంది.ఐనా అసలు మూడవ జాతి వాళ్ళు వాళ్ళు కాదేమో .ఆడవాళ్ళని హింసించి బ్లాక్ మెయిల్ చేసి ,వీడియోలు తీసి బెదిరించే వాళ్ళు మానసిక నపుంసకులు.