4, నవంబర్ 2013, సోమవారం

డిస్ లైక్ ఎఫ్ బి


ఒక వ్యక్తి తెలియని వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపితే .. వారు ఆ రిక్వెస్ట్ ని తిరస్కరించి .. ఈ వ్యక్తీ ఎవరో నాకు తెలియదు అని రిపోర్ట్ చేస్తే ..  facebook వారిని బ్లాక్ లో ఉంచుతుందని ఈ రోజు ఒక క్రొత్త విషయం తెలిసింది .

ఈ మధ్యనే రెండు దఫాలుగా facebook ఫ్రెండ్స్ లిస్టు ని వడపోసి  నిక్కమైన మిత్రులనుకున్నవారిని  ఉంచాను . రోజుకో నాలుగైదు ఫ్రెండ్ రిక్వెస్ట్ లు వచ్చి పడుతున్నాయి .  అన్నిటిని నిశితంగా చూసి  ఆలోచించిన తర్వాత కాని వారిని  నా ఫ్రెండ్స్ లిస్టు లోకి  ఆమోదిస్తూ ఆహ్వానం పలుకుతున్నాను. . అనాలోచితంగా కొంత మందిని మన స్నేహితుల లిస్టు లో చేర్చుకోవడం వల్ల ఒక చిన్న చేదు అనుభవాన్ని   చవిచూసాను మరి . ఆ విషయం ఏమిటంటే ..   ..
మేడమ్.. మా వర్కర్స్  పిలుపు . ఇదిగో ఇలాగే ఈ ఇంటర్నెట్ తో మమేకం అయిపోయానేమో .. వినిపించుకోలేదు .

వర్క్ జరుగుతున్న ప్రక్కనే చైర్ వేసుకుని కూర్చుని పేపర్ చదువుకుంటున్న మా నాన్న గారు .."అమ్మాయ్ ! ఎవరో వచ్చారు చూడు " అని గట్టిగా పిలిచారు .

నేను నాతోపాటు నాకు ఇంటి పనులలో, కస్టమర్స్ వచ్చినప్పుడు చీరలు చూపడం, చక్కగా మడతలు వేసి సర్దడంలో సాయంగా ఉండే అమ్మాయి ఇద్దరం వరండాలోకి వచ్చాము.

ఎదురుగా అపరిచిత ముఖం, చూస్తున్న మాకు ఆశ్చర్యం . ఎందుకంటే సాధారణంగా నా కస్టమర్స్ అందరూ స్త్రీలే ఉంటారు . ఎదురుగా ఉన్నది పురుషుడు. ఏదో అడ్రెస్స్ వెతుక్కుంటూ వచ్చారు కాబోల్సు అనుకుంటూ ..

"చెప్పండి ?"   అన్నాను నేను

చేస్తున్న వర్క్  శారీ పైనా ? అని అడిగాడతను  
ఓహో.. ఈ రోజు  ఈ పురుషపుంగవుడు నా మైండ్ తినడానికి వచ్చినట్టు ఉన్నాడనుకుని .. "కాదండి" ఓన్లీ బ్లౌస్ మాత్రమే" అని చెప్పాను .

 "ఇంత హెవీగా  వర్క్ చేయిస్తున్నారు .  మీ  స్వంతానికా ? "  చిరాకు పుట్టించే ప్రశ్న.

కొంచెం విసుగ్గా ముఖం పెట్టి .. ‘కాదండీ కస్టమర్ ఆర్డర్ పై చేస్తున్నాం’. చెప్పాను .

‘ఇంత హెవీగా ఎలా వచ్చింది రెడీమేడ్ వర్క్ పీస్ తెచ్చి అటాచ్ చేస్తున్నారా?’

‘కాదండి ..ఆ డిజైన్ ని  అలా హెవీగా  కనిపించేటట్లు  చేయడమే  ఈ బెంగాలి వర్కర్స్ చేసేపని’అన్నాను

వర్కర్స్ తో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటే వారు రెండు పొడి మాటలలో సంభాషణ ముగించేవేసారు . అతను నిలబడి వర్క్స్ చూస్తున్నాడో , లేక అనేక అనుమానాలతో అక్కడే ఇబ్బందిగా నిలబడి ఉన్న నన్ను చూస్తున్నాడో అర్ధం కాలేదు .

మా నాన్నగారు ప్రశ్నార్దకంగా చూస్తున్నారు . నేను వచ్చినతనితో మాట్లాడేది లేనట్లు లోపలి రాబోయాను.

మళ్ళీ ప్రశ్న "మీరు శారీస్ సేల్స్ చేస్తారా?"

"లేదు"  టపీమని అబద్దం  చెప్పి లోపలి వచ్చి .. " అవును.. ఈ శాల్తీని  ఎక్కడో చూసినట్లు ఉంది " అనుకుని గుర్తుతెచ్చుకునే ప్రయత్నం చేసాను .

వెంటనే గుర్తుకు వచ్చేసింది ..ఈ ముఖం facebook లో చూసాను  అని గుర్తుకు వచ్చి ఇతనిది ఎక్కడో కదా ! ఇలా మా ఇంటి ముందు ఏమిటీ? అనుకుంటూ అనుమానంతో  బయట గేట్ దగ్గరికి వెళ్లి చూసాను .

నా సహాయకురాలు అతను ఎంబ్రాయిడరీ గురించి తెలుసుకోవడానికి వచ్చినట్లు లేదు మిమ్మల్నే చూస్తూ కనిపించాడు, మీకు అతను తెలుసా ? అని అడిగింది

లేదే ! అదే నాకు అనుమానంగా ఉంది . పైగా మా నాన్న గారు గమనిస్తున్నారు .. మనకి తెలిసిన బాపతు అయితే కాదు అని బయటకి  దృష్టి సారించి చూస్తే... మా ఇంటికి కొంచెం అవతలగా నిలబడి ఫోన్ చేసుకుంటూ కనిపించాడు .

నేను లోపలకి వచ్చేసి .. వెంటనే  facebook ఓపెన్ చేసి చూసాను . సందేహం లేదు అతనే !  నేను వేసిన పోస్ట్ లకి అతిగా కామెంట్ చేస్తున్నాడని అన్ ఫ్రెండ్ ని చేసి పడేసాను . అంతకు ముందు కూడా నాకు అతని నుండి కాల్ వచ్చింది . నా నంబర్ ఎలా తెలుసనీ అడిగాను . అందుకు సమాధానం లేదు . "కవిసంగమం"  ప్రచురించిన కవితలలో నా కవిత ఉంది అప్పుడు అడ్రెస్స్ తో పాటు మొబైల్ నంబర్ కూడా  ఇవ్వల్సినదిగా కోరడంతో  నంబర్ ఇవ్వడం జరిగింది  ఆ కవిత చదివి చాలా మంది ఆ నంబర్ కి కాల్ చేసి అభినందించడం,నేను చాలా సంతోషించడం జరిగింది .

అలాంటిది వేరొకరు ఇలా నా నంబర్ తెలుసుకుని పదే పదే కాల్ చేయడం నాకు నచ్చలేదు . అతను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేసాను . ఒకసారి కాల్ చేసి  "మేడమ్.. మా ఆఫీస్ పనుల వల్ల నేను విజయవాడ వస్తున్నాను . మిమ్మల్ని కలవడానికి మీ ఇంటికి వస్తాను ' అని అడిగితే "సారీ అండీ ..నేను మీరు వచ్చే రోజు ఊర్లో ఉండటం లేదు .  మా మరిదిగారు విదేశాలు నుండి వచ్చారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలసి వేరే పోగ్రాం ప్లాన్ చేసుకున్నాం " అని చెప్పి సున్నితంగా తిరస్కరించాను . అతనేదో సాహిత్య సేవకుడేమో కూడా, మీ రచనలు వేస్తానంటూ ఒకటే ఫోన్స్, ఇక భరించలేక ఆ నంబర్ ని బ్లాక్ చేసేసాను .

ఇవన్నీ గుర్తు చేసుకుంటూ  "ఇప్పుడు ఈ వెధవ వెతుక్కుంటూ ఇంటిదాకా వచ్చాడు . కొంచెమైనా సంస్కారం లేకుండా "  అని తిట్టుకున్నాను .

అందుకే మా స్త్రీలు వ్యక్తిగత వివరాలు, చిరునామాలు ఇవ్వడానికి వెనుకాడతారు అనుకున్నాను  బ్లాగర్ గా పరిచయం అప్పుడు కూడా నేను చిరునామా ఇవ్వడానికి భయపడలేదు . భయపడటం నా లక్షణం కాదు . అడ్రస్ తెలిసినంత మాత్రాన , ఫోన్ నంబర్స్ తెలిసినంత మాత్రాన ఇలా సంస్కారం లేకుండా ప్రవర్తిస్తూ వ్యక్తిగత పరిచయాలు కోసం ప్రాకులాడతారా?  అనుకుంటాను. ఎదుటివారు సంస్కారవంతులుగా ఉండటం చేతకానప్పుడు వారిని ఎలా ఫేస్ చేయాలో, ఎలా త్రుంచి వేయాలో కూడా నాకు తెలుసు.

నాకింకో అనుమానం నా లాగా  ఇంకొందరిని కూడా అతను అలా ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు కూడా ! తమ రచనలు ప్రచురిస్తారని స్త్రీలు ప్రలోభ పడతారా? నాకైతే అసహ్యం  వేసింది . ఇలాంటి అనుభవం నాతోపాటు మరికొందరికి ఉండవచ్చు . నాతోపాటు కాస్తో కూస్తో వ్రాయ గల్గిన అందరి ఫ్రెండ్స్ లిస్ట్ లోను అతను ఉన్నాడు.  నేనైతే అతని ప్రవర్తన నచ్చడం లేదని  అతనికి చెప్పి మరీ బ్లాక్ చేసేసాను .

 ఆన్ లైన్ స్నేహాలలో ముఖ్యంగా  మన  అభిప్రాయాలు, మన ఆలోచన విధానం, స్పందించే  మనసు  వీటిని బట్టే  ఒక అభిప్రాయం ఏర్పడుతుంది తప్ప వ్యక్తిగత పరిచయాలు పెంచుకోవడానికి ప్రయత్నించేవారి  పట్ల   అసహ్యం కల్గుతుందన్నది నిజం

ఇలాగే వ్యక్తిగత పరిచయాలు పెంచుకుని ఫోన్ నంబర్స్ ఇచ్చుకుని సోషియల్ నెట్వర్క్స్ లో  జరిగే విషయాల గురించి  చర్చించుకుని .. ఒకరి గురించి మరొకరు మూడవ వ్యక్తి దగ్గర చెప్పుకుని అవి వారి నుండి వీరికి,  వీరి నుండి వారికి చేరి ఆ చేరవేసే వ్యక్తి పురుషుడు  అని తెలిసి  ఆశ్చర్య పోయాను అటువంటి విషయాలు  facebook లో జరిగాయి ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ అసహ్యకరంగా తిట్టుకున్న కొందరిని చూస్తే భయం, అసహ్యం రెండు కల్గాయి నాకు  నా ఫ్రెండ్ ఒకరు ఇలాంటి గొడవల వల్ల అకౌంట్ డీయాక్టివేట్ చేసుకుంది .  ఆమె నన్ను పదే పదే హెచ్చరిస్తూ ఉంటారు . "జాగ్రత్తమ్మా" అని

నేను నీలా అంత ఓపెన్ గా ఉండను ఎక్కడ ఎలా ఉండాలో  అలా మాత్రమే ఉంటాను, మితిమీరితే తోకలు ఎలా కత్తిరించాలో నాకు తెలుసులే అని నవ్వేసాను కాని .. ఈ విషయం ఆమెకి చెప్పే సమయం రాలేదు

అటువంటి పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం కూడా .

అలాగే  పర్సనల్ చాట్ చేయడం కూడా  ఇబ్బందికరం వీలైనంత చాట్ కి దూరంగా ఉండండి .. ఎంత మంచి స్నేహమో అయితే తప్ప స్వవిషయాలు పంచుకోకండి

ఎవరైనా ఇబ్బందికరంగా కామెంట్ చేస్తే ఆ కామెంట్ ని తొలగించేయండి , నిర్మొహమాటంగా హెచ్చరించండి , వారి తీరు మార్చుకోకపోతే బ్లాక్ చేసేయండి .  

ముక్కు ముఖం తెలియని వ్యక్తుల నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే .." నో" చెప్పేయండి.

మీ వాల్ పై ఎవరూ పోస్ట్ చేయకుండా సెట్టింగ్ మార్చుకుని జాగ్రత్త పడండి.

రచనలు ప్రచురిస్తాం , జాబ్స్ ఇప్పిస్తాం , మా ప్రాంతాలకి వస్తే  మమ్మల్ని సంప్రదించండి ఎటువంటి సాయం కావాలన్నా మమ్మల్ని అడగండి లాంటి మాటలు  గురించి  ఆలోచించకండి.

ఎవరి పనులు వారు చేసుకుని ఎవరి జాగ్రత్తలో వారు ఉండటం మంచిది .  ఎటువంటి ప్రలోభాలకి లోను కావద్దు .

ఫ్రెండ్స్ ..తస్మాత్ జాగ్రత్త. facebook లోను , ఇక్కడ  కూడా ఉన్న ఫ్రెండ్స్ కి కొంత మందికి  చాలా విషయాలు తెలుసు.  దుష్టులకి దూరంగా ఉండండి . మీ మానసిక శాంతిని పోగొట్టుకోకండి. లైక్స్ ఇవ్వలేదని ,కామెంట్స్ పెట్టడం లేదని దూరంగా తోసేసేవారిని మీరే మీ లిస్టు నుండి తీసి పడేయండి.  లైక్ చేయకపోతే దాడి  చేసే మనస్తత్వం ఉన్నవారితో అసలు ఫ్రెండ్షిప్ చేయకండి   పోయేది ఏమి లేదు ఒక  ఆన్ లైన్ స్నేహం అనే ముసుగు తప్ప .

బాహ్య ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో  ఆన్ లైన్ స్నేహాలలోను అవే ఉన్నాయి .  ప్రాంతీయ తత్వం, కులం, మతం తమ వారే గొప్ప వారు అనే భావనలు  ఇలా చాలా ఉన్నాయి . అనకాపల్లి  నుండి ఆస్టిన్ వరకు లేదా విజయవాడ నుండి వాషింగ్టన్ వరకు  ఇలాగే ఉన్నారు . కాకపొతే దారులే మారాయి అంతే !

20 కామెంట్‌లు:

Meraj Fathima చెప్పారు...

వనజా, ప్రతి అడుగూ ఆలోచించి వేయండి.
ఇంతకంటే ఏమి చెప్పగలను అన్నీ తెలిసిన నెచ్చలికి.

Hima bindu చెప్పారు...

నిజమేనండీ !ఏమవుతుందిలే అని" అనాలోచితంగా కొంత మందిని మన స్నేహితుల లిస్టు లో చేర్చుకోవడం వల్ల ఒక చిన్న చేదు అనుభవం" తగులుతూనే వుంటాయి అక్కడి నుండి మనం నిశబ్దంగా తప్పుకోవడమే (unfriend )చేసేయ్యడమే.బాగా రాసారు ఆలోచించదగిన విషయాలు

Unknown చెప్పారు...

Like minded కాకుండా ఊరికే అనవసరంగా విసిగించి కాలయాపన చేస్తూ చొప్పదంటు ప్రశ్నలతో ఊదరగొట్టేవాళ్ళను కాలక్షేపరాయుళ్లను unfriend చేసి స్నేహితుల జాబితానుంచి తొలగించాలి!అవ్యాజ నిష్కల్మష స్నేహాలను పెంపొందించుకోవాలి!

అజ్ఞాత చెప్పారు...

నేను బ్లాగుకు ఇచ్చినంత విలువ ఫేస్ బుక్ కు ఇవ్వను.ఎప్పటికైనా,ఏనాటికైనా ఫేస్ బుక్ చాలా ప్రమాదికారే మేడం!

Zilebi చెప్పారు...


హమ్మయ్య ఊరట కలిగించారు !

చాలా కాలం గా అబ్బే మనమూ ఫేసు పుస్తకం లో లేదే అని బాధ పడే గ్రహాన్ని!
ఈ మధ్య బాతా ఫణి కబుర్ల వారు ఆయ్ ఫుటో లు లేని ఒక ప్రొఫైలు ఒక ప్రోఫిలా అని సవాలు లేవదీసారు !

మీ టపా చదివాక ఈ గ్రహమే బెటరు అని పించేస్తోంది !!

All that glitters is not Gold! సో బి ఆన్ గార్డ్ ఫార్ వి ఆర్ గోల్డ్!!

చీర్స్
జిలేబి

అజ్ఞాత చెప్పారు...

బావుంది.ముఖపుస్తకమొక మానసిక బలహీనతేమో! ఇటువంటివాళ్ళూ వుంటారు.

నాగరాజ్ చెప్పారు...

అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలు అని సామెత ఉండనే ఉంది కదండీ. మీ ఈ పోస్టు చాలామందికి హెచ్చరికలా పనిచేస్తుంది.

శ్యామలీయం చెప్పారు...

దుష్టులకి దూరంగా ఉండండి అని మీ టపాలో చూడగానే, నాకు మా అమ్మగారి మాటలు గుర్తుకు వచ్చాయి. ఆవిడ తరచుగా "దుష్టులకి దూరంగా ఉండాలి" అని అంటూ ఉండేవారు.

మీ బ్లాగులో, మీకు ఇష్టమైన బ్లాగుల పట్టికలో శ్యామలీయం బ్లాగును చేర్చినందుకు అనేక ధన్యవాదాలు.

బ్లాగుల్లోనూ, బయటా కూడా కొందరి హెచ్చరికల కారణంగా నాకు ఫేస్‌బుక్ అంటే ఒక రకమైన భయం కలిగింది. అందుచేత ఇంతవరకూ దానిజోలికి పోలేదు.

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

చాల మందికి ఉపయోగపడే, జాగ్రత్త పడేట్టు చేసే వ్యాసం వ్రాసారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మానవాళి మంచికి ఉపయోగించాలి .

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మెరాజ్.. తప్పకుండా ! ఇతరుల అనుభవాల నుండి నేను నేర్చుకుంటూనే ఉంటాను థాంక్ యూ !

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

హిమబిందు గారు థాంక్ యూ సో మచ్ .

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సూర్య ప్రకాష్ మీ అభిప్రాయమే నా అభిప్రాయం . థాంక్ యూ.

@Ahmed chowdary గారు :) థాంక్ యూ

Shabbu చెప్పారు...

ప్రసుత పరిస్తితులు చాల చక్కగా చెప్పారు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జిలేబీ గారు మీరే రైట్ అన్నమాట . థాంక్ యూ సో మచ్.

@కష్టేఫలే గారు మానసిక బలహీనత కాదండీ. మానసిక బలహీనతలు ఉన్నవారు ఉంటారని అర్ధం అవుతూ ఉంది అంతే!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

నాగ్ రాజ్ గారు .. ఇలా చెప్పడం నా ధర్మం అనుకున్నాను. పాపం కొంతమంది అమాయకంగా మాయమాటలకి బలి అవుతారేమో..అన్న ఆలోచనతో నా అనుభవాన్ని వ్రాసాను. థాంక్ యూ సో మచ్ అండీ !

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శ్యామలీయం గారు .. ధన్యవాదములు

rajasekhar Dasari చెప్పారు...

మేడమ్ ఈ విషయంలో ఆడ మగ తేడా లేదు. ఒక సారి చాట్ లో (సామాన్యముగ చాట్ చేయను) ఒక వ్యక్తి తగిలాడు,ఆ ప్రశ్నలు ప్రవర్తనను బట్టి గే అని అర్థం అయ్యింది. అలాగే fbలో ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే ఎవరని చూశా, కామన్ ఫ్రెండ్ గా నాకు బాగా తెలిసిన అతని పేరు ఉన్నది. నాకు తెలిసి అతను అలాంటి వాళ్ళతో స్నేహం చేయడు, ఒకవేళ చేసినా అంత పబ్లిక్ గా చేయడు, ఎందుకంటే ఆ అమ్మాయి నగ్నంగా ఉన్న ఫొటోనే పెట్టింది. ఇహ అకౌంట్ లోకి వెళితే ఆది నిజంగా ఒక స్త్రీ అక్కౌంటేనా లేక ఎవరైన ఆ పేరుతో పెట్టారో అర్థం కాలేదు. కాబట్టి మీ పోస్ట్ జాగ్రత్తగా ఉండమని మరొక సారి గుర్తుచేస్తుంది.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Shabbu Thank you !

rajashekhar dasari .. గారు స్నేహ హస్తం ఇస్తున్నారు అనుకుంటే నమ్మడం చాలా కష్టంగా ఉంది . అవునండీ..జాగ్రత్త అవసరం . వ్యాఖ్య ద్వారా మీరింకో కోణాన్ని చూపినందుకు ధన్యవాదములు.

అజ్ఞాత చెప్పారు...

ప్రస్తుత సమాజంలో మనుష్యుల నుంచి హుందా అయిన ఆశించలేకపోతున్నాం...మనుష్యులు ఇలా తయారయ్యారే అనుకోవడం తప్ప!!... ఏ విధంగా చూసినా మానసికంగా వికలాంగులైపొయారు మనుష్యులు...

అజ్ఞాత చెప్పారు...

ఫేస్‌బుక్‌ని కూడ పొదుపుగా వాడుకుంటే ఉపయోగమే.
తెలియని వ్యక్తులతో, అనవసరమైన విషయలాలో తలదూరిస్తే, సమయం వృధా అవడమే కాకుండా లేనిపోని సమస్యలు వస్తాయి.
ముఖ్యంగా యువత ఇది గుర్తుంచుకోవాలి.