31, డిసెంబర్ 2014, బుధవారం
ఐ యాం ఆల్వేస్ ఏ లూజర్
29, డిసెంబర్ 2014, సోమవారం
రచయిత గారి భార్య
"అలా వెళ్ళిపోతారేమిటండి కాస్తాగి ఈ గోడ ప్రక్కనున్న బెంచీపై కూర్చోండి " అభ్యర్ధన.
"నా మాట మన్నించినందుకు ధన్యవాదములు " అన్న మాటలు వినబడ్డాయి.
తల పైకెత్తి చూసాను. పేరు తెలియని ఒక చెట్టు. అది రోడ్డు ప్రక్కగా ఉన్న ఇంటి ఆవరణలో గోడ ప్రక్కన పెరిగి ఉంది. సుమారు ఏడడుగుల ఎత్తు ఉంటుందేమో ! అయిదడుగుల ప్రహరి గోడపైన చిక్కని కొమ్మలతో పచ్చగా విస్తరించి ఉంది. దాన్నిండా అందమైన పువ్వులు కొన్ని, మొగ్గలు కొన్ని. తేలికైన పరిమళం. అదివరకెన్నడూ అలాంటి చెట్టుని చూడనందుకేమో నేను సంభ్రంగా లేచి చెట్టుని చూస్తూ నిలబడ్డాను. "నేను నచ్చానా? " అడిగింది చెట్టు . ఎవరైనా కనబడతారేమో ననుకుంటూ వెతుక్కుంటున్నాను. చెట్టు పై కూర్చుని మాట్లాడుతూ నన్ను ఆట పట్టిస్తున్నారని నాకనుమానం వచ్చింది కూడా !
"చెట్టు ఎక్కడైనా మాటాడుతుందా అని మీ అనుమానం, ఆశ్చర్యం కదా ! " అడిగింది
"నిజంగానే నేను మాట్లాడుతున్నాను అలాగే నా బిడ్డలైన ఈ పువ్వులు మాట్లాడతాయి. నేను మీకొక కథ చెప్పాలి, వింటారా? " అడిగింది చెట్టు
నేను అయోమయంగానే తల ఊపాను
చెట్టు చెప్పడం మొదలెట్టింది.
ఆమెకి నేనంటే చాలా ఇష్టం. నాక్కూడా ఆమెంటే చాలా చాలా ఇష్టం. ఇరవయ్యేళ్ళ నుండి కన్నబిడ్డలకన్నా ఎక్కువగా నన్ను సాకినందుకు మరీ మరీ ఇష్టం. ఆమెది పువ్వులాంటి మనసు. అందరూ పచ్చగా ఉండాలని ఆకాంక్ష. పెళ్ళి చేసుకుని భర్తతో ఈ ఇంట్లో అడుగుపెట్టిన మర్నాడే రాళ్ళతో రప్పలతో నిండిన ఈ ఖాళీ స్థలాన్ని శుభ్రం చేసింది.
" ఇక్కడ మొక్కలేం అంతగా రావు. రాతి నేలకకదా మొక్కలు నాటడం శుద్దదండగ ' అంటున్న భర్తతో పుట్టింటి నుండి ఇష్టంగా తెచ్చుకున్న నా వేరు మొక్కని నాటుతూ " ఆశనే విత్తనాన్ని నాటి చైతన్యమనే నీరుపోసి సంస్కారమనే ఎరువు వేసి మొక్కలని పెంచితే జ్ఞానమనే ఫలాల్ని అందివ్వవచ్చు" అని అంది.
ఆమె ఆశ వమ్ము కాలేదు. మండే ఎండలని, బెట్టని తట్టుకుని నేను బ్రతికి చిగురులు వేసాను. ఆమె ప్రతి రోజూ నా దగ్గర కూర్చుని ఎన్నో కబుర్లు చెప్పేది ఆకు ఆకుని తడిపి స్నానం చేయిస్తుంది. నేను ఆరోగ్యంగా ఎదిగి పూలు పూస్తున్నాను .
నా పూలంటే ఆమెకి చాలా ఇష్టం. పూవుని తెంపుతూ " ఏం చేయనురా కన్నా ! ఇంత అందమైన స్వచ్చమైన, పరిమళభరితమైన నిన్ను మీ అమ్మ నుండి వేరు చేయాలని లేదు. కానీ నువ్వు నా బలహీనత " అంటూ సున్నితంగా త్రుంచి ఒకటి దేవుని పటం ముందుంచి, మరొకటి తన జడలోనూ తురుముకుంటుంది. పటంలో ఉన్న దేవుని పాదాల దగ్గర కన్నా ఆ నీలాల కురులలో దాగడం కూడా నాకూ చాలా ఇష్టం. అందుకే నా ప్రాణ శక్తినంతా ధారపోసి రోజుకొక రెండు పువ్వులనైనా ఆమెకి కానుకగా ఇస్తూనే ఉంటాను. రెండేళ్ళకి నాతో పాటు ఆ ఇంట్లో ఇద్దరు బిడ్డలూ పెరగసాగారు. వారి నవ్వులూ నా పువ్వులూ ఆమెకి అత్యంత ఇష్టం, మా ముగ్గురికి ఎండా వానకి గొడుగయ్యేది,ఆకలి వేస్తే ఆమ్మయ్యేది,ఇరుగుపొరుగుకి మంచి నేస్తమయ్యేది.
పువ్వు మాట్లాడసాగింది. మాట్లాడటం నిజమా అబద్దమా అన్న సంగతి ఆలోచించడం మానేసి మిగతా కథ వినడంలో ఆసక్తిగా చూసాను.
" రోజులో తలదువ్వుకునే సమయంలో తప్ప మిగతా రోజంతటిని ఆమెనే అంటిపెట్టుకుని ఉండే నాకు తల్లిమీద ఉండే ప్రేమకన్నా ఆమె పైనే ప్రేమ ఎక్కువైంది. అది చూసి అమ్మ నవ్వుకునేది. నిజానికి అమ్మ ఒడిని దాటి ఇంకో అమ్మ ఒడిని చేరిందని అక్కడ కూడా అంతే భద్రంగా ఉంటుందని చెట్టు అమ్మకి తెలుసు. అందుకే వాడిన పువ్వులో పోయే ప్రాణాన్ని మళ్ళీ విచ్చే ప్రతి పువ్వులోనూ నింపుకుని ఆమెని చేరి మురిసేదాన్ని. సుతి మెత్తని మనసున్న తల్లి. అంత మంచి తల్లికి అలాంటి భర్త ఎలా దొరికాడో ! అతని మనస్తత్వం అర్ధమయ్యాక అయిదారేళ్ళుగా ఆమె అతనిని ఎలా భరిస్తుందో ? అనుకునేదాన్ని. విషవాయువులని దిగ మింగి స్వచ్చమైన గాలిని ఇచ్చే మా అమ్మ లాగే ఆమె ఎన్నో గరళాలని మింగి నవ్వుతూ బ్రతుకుతుంటుందనుకునేదాన్ని .
ఆమె చేసే ప్రతి పని కళాత్మకంగా ఉంటుంది . ముంగిట వేసే ఐదు చుక్కల ముగ్గైనా, చిత్రంలో బంధించిన నీటి తళ తళలలో కదలాడే చంద్ర బింబమైనా సరే , చెట్టు చిత్రమైనా, నా చిత్రమైనా అందరూ ముచ్చటగా చూడాల్సిందే! చక్కగా పాడుతుంది, కవిత్వమూ వ్రాస్తుంది. తనలాంటి మగువుల మనఃశరీరాల బాధలకి అక్షరరూపం ఇస్తుంది . మొదట్లో ఆమె వ్రాసిన ప్రతి అక్షరాన్ని చదివి అభినందించినతను, ఆమె రచనలు అప్పుడప్పుడూ పత్రికల్లో అచ్చవడాన్నిఏమాత్రం భరించలేకపోతున్నాడు. ఆమె వ్రాసిన ప్రతిదాన్ని బాగో లేదని తెలివిగా నమ్మించి ఏదో కొద్దిగా సరిచేసి అతని పేరుతొ పత్రికలకి పంపడం చేసాడు. అవి అచ్చయి అతనికి కొంత గుర్తింపు తెచ్చిపెట్టాయి. రచయితగా పేరు సంపాదించడం అతనికి బాగా పొగరునిచ్చింది. మద్యానికి అలవాటు పడ్డ మనిషికి పేరాశ కోసం ప్రాకులాడే మనిషికి పెద్ద తేడా ఏమి ఉండదన్నట్లు" అందరికి సున్నిత హృదయం ఉన్న కవిగా, కథకునిగా అతనికి పేరు వచ్చేసింది కానీ, నిజానికతను అలా నటిస్తూ ఉంటాడంతే ! ఆ పేరు వెనుక దాగిన ఆమె బాధామయ గాధలెన్నో ! వాటినే ఆమె అక్షరాలుగా వ్రాస్తుందని ఎవరికీ తెలుసు ?
అతను ప్రతిరోజూ తనదైన శైలిలో ఆమెని హింసిస్తూనే ఉంటాడు కానీ ఒక రోజు జరిగిన సంఘటన గుర్తుకు వస్తే మాత్రం నాకు దుఃఖం ముంచుకొస్తుంది. గుర్తు చేసుకుంటూ పువ్వు ఏడుస్తుంది. ఏడుస్తూనే కొనసాగించింది
"అతనిలో మళ్ళీ ఇంకో అనుమాన బీజం మొలకెత్తింది.అది మొక్కై పెరిగి వటవృక్షంలా వేళ్ళూనుకోవడానికి ఎంతో కాలం పట్టదు. నలుగురి ముందు మాటల్లో స్వర్గం చూపిస్తూ, గది గోడల మధ్య చేతలలో నరకం చూపిస్తుంటే మొదటిది అనుభవించడం మరీ నరకం" అని.
ఇప్పుడతను ఆమె చిన్ననాటి స్నేహితుడు ఆకాష్ తో ఉన్న పరిచయాన్ని అనుమానిస్తున్నాడు. వారిద్దరూ బాల్య స్నేహితులు. ఇటీవలే ఎక్కడో కలిసారు. ఇద్దరూ పుస్తకాల పురుగులే, అప్పుడప్పుడూ మాటలతో కన్నా రంగులతోనూ, కుంచెతోనూ భావాలు కలబోసుకుంటారు. అతనికది ఏమాత్రం ఇష్టంలేదు. వందల మైళ్ళ దూరంలో ఉన్నతనితో అక్రమ సంబంధం ఎలా పెట్టుకుంటుందో అన్న ఆలోచనైనా లేని మూర్ఖర్వంతో ఆమెని అసహ్యంగా తిడుతూ, కొడుతూ ,తాగుతూ, సిగెరెట్ తో శరీరాన్ని కాల్చుతూ, రాత్రంతా నరకం చూపించాడు.
ఆమె తన కష్టాన్ని పెదవి దాటి బయటకి రానీయదు. తనలోనే కుమిలిపోయేది. ఆమెని ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనీయడు పదుగురిలో మాట్లాడనివ్వడు. ఎవరితో మాట్లాడినా వాళ్ళతో నీకేం పని అని సతాయిస్తూ ఉంటాడు, అనుమానంతో ఆమెని చంపుకు తింటాడు. చేసిన ప్రతి పనికి ఒంకలు వెదికి చేయి చేసుకుంటాడు. పిల్లలని ఆమెకి చేరువ కానీయడు. నీ పెంపకంలో వాళ్ళు చెడిపోతారంటూ వారిని దూరం చేసి తల్లిపై ప్రేమ లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతను అప్పుడప్పుడూ కథకులతో చర్చలంటూ ఊర్లు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు కదా ! ఇప్పుడైతే అర్ధరాత్రుల వరకు మేలుకుని చాటింగ్ లు చేస్తూ ఉంటాడు కదా ! అయినా ఆమె ఏమి అనదు. అతనిది మాత్రం సమాజంలో రచయిత కున్న భాద్యత ఆమెది మాత్రం విచ్చలవిడితనమా? ఏమిటో ఈ బేధాలు? బాధగా నిట్టూర్చింది పువ్వు
"తర్వాత ఏం జరిగింది చెప్పు ? " నా ఆరాటం
మొన్నటికి మొన్న ఏం జరిగిందో చెప్పనా.. ఆ రోజు నరక చతుర్ధశి. ఆ రోజు కూడా ఆమెకి సెలవు లేదు ఇక్కడంతా ఆ రోజు దోసెలు కోడి కూర తినడం ఆనవాయితీ. అవి చేయలేదని అలిగి పడుకున్నాడు. సాయంత్రం వచ్చి దోసెలు, కోడి కూర చేసి ఇస్తానని సర్ది చెపుతూనే రెండు రకాల టిఫిన్ లు చేసి టేబుల్ పై పెట్టి స్నానానికి వెళుతూ ఆగీ "వేడి చల్లారి పోతున్నాయి పోయి తినండి " చెప్పింది. మంచంపై పడుకుని ఉన్నతను ఉన్నపళంగాలేచి ఆమె పొట్టలో కాలితో ఎగిరి తన్నాడు ఆ తన్నుడుకి వెళ్లి గుమ్మం వెలుపల పడింది. దారిన పోతున్న ఒకరిద్దరు ఆ విషయాన్ని గమనించారు కూడా ! నాకే గనుక నడిచే వీలుంటే వెళ్లి అతన్ని కుమ్మి పడేయాలన్నంత కసి రేగింది . ఇలా జరిగేటివన్నీ చూస్తుండే ఆమె చిన్న కూతురు "నాన్నకి కోపం ఎక్కువ, కోపం వస్తే విచక్షణ ఉండదు, చూసి చూడనట్టు వదిలేయమ్మా" అంది. మరి అలాంటి మొగుడిపై ఆమెకి మాత్రం కోపం రావద్దూ .. అని విసుక్కున్నాను.
"పిల్లలకేం ? అలాగే అంటారు వాళ్ళకి కూడా పెళ్ళయి ఇలాంటి భర్త వస్తేనే కదా బాధంటే ఏమిటో తెలిసేది అని అనుకుని .. ఛీ ఛీ .. నే నెందుకిలా ఆలోచిస్తున్నాను. నా బిడ్డలకే కాదు పగవాళ్ళ కి కూడా జన్మ జన్మలకి ఇలాంటి భర్త రాకూడదు" అనుకుంటూ కారే కన్నీటిని తుడుచుకుంది.
ఆఫీసుకి వెళ్ళేటప్పుడు మాత్రం బస్టాండ్ వరకు మోటారుసైకిల్ పై దిగబెడతానని తయారవుతాడు. ప్రక్కింటి వాళ్ళు చూస్తున్నట్లనిపిస్తేనూ,ఇంకా వీధిలో ఎవరైనా నడుస్తున్నా వాళ్ళ దృష్టినాకర్షించేలా "లంచ్ బాక్స్ తీసుకున్నావా? పర్స్ మర్చిపోయావేమో చూసుకో! మొబైల్ తీసుకున్నావా? అంటూ శ్రద్దగా అడుగుతుంటాడు. చూసే వారందరికీ " భర్తంటే అలా ఉండాలనుకునేటట్లు నటించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఆమె మాట్లాడకుండా మౌనంగా ఉంటే "అయినా మొగుడితో చెప్పడానికి ఏం కబుర్లు ఉంటాయి అదే ప్రియుడితో మాటలైతే ఊటబావిలో నీళ్ళులా ఊరుతుంటాయికాని " కత్తితో గుచ్చినట్లు మాటలు. ఆ మాటలకి ఆమె విల విల లాడిపోతుంటే చూసి ఆనందించే పైశాచికం. బస్ ఎక్కించి కదిలేటప్పుడు చెపుతుంటాడు "జాగ్రత్త " అని. అందులో ఎన్నో హెచ్చరికలు .
నిజానికి అతనికి భార్యపై ప్రేమని అసల్నమ్మలేం, ఆమెని బస్ స్టాండ్ లో దిగబెడుతూనే అనుమానంగా చుట్టూ గమనిస్తాడు. ఆమెకి పరిచయం ఉన్న వ్యక్తులు కానీ , స్నేహితులు కానీ ఎవరైనా ఆమెని పలకరిస్తే ఇక ఆరోజు సాయంత్రమింట్లో కన్నీటి కిటికీని తెరవాల్సిందే ! ఆ మాటల్లో నిగూఢమైన అర్ధాలేవో ఉన్నట్లు అపరాధ పరిశోదన మొదలెడతాడు. ఇవన్నీ చూస్తున్న నాకు మాను మాకుని కానే కాను అని మనుషులు పాడిన పాట గుర్తుకొస్తుంది . ఈ మగువలకన్నా మాను లైనా ఎంతో హాయిగా ఉన్నాయనుకుంటాను. మహా అయితే నీరందక ఎండిపోతాము ,ఏ తుఫాన్ గాలికో కొమ్మలు విరిగిపోతాయి, ఏ గొడ్డలి వేటుకో బలైపోతాం తప్ప అంత కన్నా ఏముంటాయి అనిపిస్తుంది.
ప్రక్క ఊరిలో టీచర్ గా పనిచేస్తున్న రమ చాలా సరదా మనిషి . జీవితంలో ఎప్పుడూ కష్టాలు కన్నీళ్లకే చోటుంటే ఏం బావుంటుంది. వాటిని భరించడానికి నవ్వనే టానిక్ ఒకటుందని మర్చిపోయావు, రా.. ఇలా నా ప్రక్క సీట్లో కూర్చో! అంటూ చొరవచేసి చేయి పట్టుకు కూర్చోబెట్టుకుని ఎన్నో కబుర్లు చెపుతూ, హాయిగా నవ్విస్తూ ఆమె ప్రయాణ సమయాన్ని ఆహ్లాదం చేస్తూ ఉంటుంది. ఒక రోజతను ఆమె రమతో మాట్లాడుతూ ఉండటం గమనించాడు. " అదొట్టి బిచ్. దానితో నీకు స్నేహం ఏమిటీ ? నువ్వు దానితో తిరిగితే నేను తలెత్తుకుని తిరగలేను. నా స్నేహితులు నిన్ను కూడా ఆ గాటనే కట్టేస్తారు " మనసులో ఉన్నదానిని సమాజానికి అంటగట్టే చాతుర్యం అతని సొత్తనుకుంటా! అతనిని చూస్తే నాకు భలే ఆశ్చర్యం.
ఇప్పుడామె కాస్త ఆలస్యంగా బయలుదేరి రమ టీచర్ ఎక్కే బస్ ని ఎక్కకుండా జాగ్రత్త పడుతుంది. ఇంకో రోజు దానితో స్నేహం వద్దన్నానా? నా మాటంటే లెక్క లేదే? నీ పని ఇలా కాదంటూ ఒకేసారి నోటికి, బెల్ట్ కి పని చెపుతాడు . చూస్తున్న నేను కన్నీళ్ళు కారుస్తుంటాను. మళ్ళీ అతనే గాయాలని కట్టు కడతాడు, రెండు వీధుల అవతలున్న ఆమె పెద్దమ్మని పిలుచుకు వస్తాడు. మీ అమ్మాయి చూడండి, ఎలాంటి స్నేహాలు చేస్తుందో ? మీ అమ్మ చూడండి ఎలా వాదిస్తుందో ? అని లేనిపోనివి నూరిపోస్తూ పెద్దమ్మ, పిల్లల దగ్గర దొంగ ఏడుపులు ఏడుస్తూనే వంకరగా ఆమె వైపు చూస్తూ నవ్వుతాడు. ఆమె జీతమంతా తను తీసుకుని చిల్లర పైసలు విసిరేస్తాడు సాహిత్య సభల నిర్వహణకి , సంకలనాల అచ్చులకి అన్నింటికీ డబ్బు ఇవ్వాలి. ఇటీవలే క్రొత్తగా కట్టిన ఇంటి కోసం అయిన అప్పులు,పిల్లల చదువుల కయ్యే ఖర్చులు ఇవ్వన్నీ అతనికి పట్టవు ప్రభుత్వ ఉద్యోగయిన అతను ఎందుకో సేలపు పెట్టి ఇంట్లో కూర్చుండటం వల్ల ఇల్లు నిత్య రణరంగంగా మారిపోయింది.
ఎప్పుడూ లేంది ఆమె నన్ను కూడా పట్టించుకోవడం మానేస్తుంది. ఆమె పని చేసే ఆఫీస్ పల్లెలో ఉంటుంది. ఆమె, ఇంకో ఇద్దరు స్టాప్. ఆమెకి సెలవు కావాలంటే రెండు రోజులు ముందు హెడ్డాపీస్ వారికి చెప్పి అనుమతి పొందాలి. కొత్త ప్రభుత్వాల హామీలతో పెన్షన్ దారుల వివరాలు కంప్యూటర్ లో పొందు పరిచే పనిలో నాలుగు రోజులు నుండి ఆమెకి ఒకటే పని ఒత్తిడి. మొన్న ఆఫీసులో వర్క్ లోడ్ ఉండి రాత్రి ఎనిమిదిన్నర వరకు పని చేయాల్సి వచ్చింది . సాయంత్రం నుండి అతను ఒకటే పోన్లు రాత్రి తినడానికి నువ్వు వచ్చి వంట చేస్తే కాని కుదరదని ఆజ్ఞలు , నిన్నా అంతే ! పగలల్లా ఆఫీస్ లో పని చేసి ఆమె ఇంటికి వచ్చి ఇంట్లో పని చేసి నడుం వాలుద్దామనుకుంటే చెప్పా పెట్టకుండా నలుగురి స్నేహితులని వెంటబెట్టుకుని నాన్ వెజ్ తీసుకుని వచ్చి బిర్యానీ చేయమని పురమాయింపు . అసలే పిరీయడ్స్ టైమ్. నడుం పీక్కూ పోతుంది. అయినా చేయక తప్పలేదు. అతనికి స్నేహితులు సరదాలు, పార్టీలు వేటీకి లోటుండకూడదు. పాపం ! ఆమె నిన్నటి పని అలసటతోనే ప్రతి రోజు పని మొదలెట్టాలి . సూర్యుడిలా అలసిపోకుండా ఉద్యోగినికి ఏమైనా ప్రత్యేకత ఉంటే బావుండుననుకుంటాను.
అతనీరోజు సాయంత్రం నాలుగున్నరకే సతాయింపు మొదలు పెట్టాడు ఈ రోజూ కూడా ఆలస్యంగా వస్తున్నావా? నాకు ఆకలవుతుంది అని. అప్పగించిన పని పూర్తీ కాలేదన్న సంగతి చెప్పి "మీరు ఈ రోజుకి ఎలాగో సర్దుకోండి . బయట నుండి తెచ్చుకుని తినేయండి" అని చెప్పింది . ఆమెనే చూస్తున్న అసిస్టెంట్ కి "మా వారికి రెండు పూటలా వేడి వేడిగా చేసి వడ్డించాలి, ప్రొద్దున చేసినవి రాత్రికి తిననే తినడు. బయట తినడం తన వల్లకాదంటాడు. అలా అని ఇలాంటి అత్యవసర సమయాలలో కూడా మా అత్తగారు చిన్న సాయమన్నా చేయదు " తన అసిస్టెంట్ తో చెప్పింది విసుగ్గా . ఆమెకి ఆ మాత్రం కోపం రావడం నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఈ మనుషులకి ఏమిటో ఈ గొప్ప ? నాలాగా అతనుకూడా పరమ సోమరిపోతు. ఆమె వండి వార్చి వడ్డిస్తే తప్ప నోటికి పని చెప్పనని కోతలు కోస్తాడు. ఆకలవుతుంటే దానిని తీర్చుకునే వేరే మార్గమే లేదా ? ఒంక కాకపొతేనూ మరీ !
ఆమె ఆఫీసులో పని ముగించుకుని బయటకోచ్చేసరికి రాత్రి ఎనిమిదిన్నర అయ్యింది బయట జన సంచారమే లేదు . అంతలో కరంట్ పోయింది బస్ స్టాప్ లో ఉన్న మెడికల్ షాప్ ప్రక్కన నిలబడింది. ఆ షాప్ ముందుకి వెళ్లి వెలుగులో నిలబడి ఉండటం కూడా ఆమెకి ఇబ్బందే ! ఆ షాప్ ఓనర్ చూపులు త్రేళ్ళుజెర్రులు ప్రాకినట్లు ఉంటాయి.ఉద్యోగం చేసే ఆడవాళ్లంటే చిన్న చూపు. మా ఇళ్ళల్లో ఆడాళ్ళు మగ తోడు లేకుండా కూరగాయల మార్కెట్ కి కూడా వెళ్ళరు అంటూనే కనబడిన ప్రతి ఆడమనిషిని వొంకర చూపులు చూస్తాడు.
బస్ కోసం వెయిట్ చేస్తూనే పదే పదే సమయం చూసుకుంటుంది. సెల్పోన్ లో చార్జింగ్ కూడా అయిపోవస్తుంది ఇరవై నిమిషాలు గడచిపోయాయి. అంతలో తెలిసినతను అటుగా వచ్చాడు" ఏం మేడమ్ ! ఇంతాలస్యమయింది ? " అంటూ పలకరించాడు. సమాధానం చెపుతూండగానే.. అతను కాల్ చేసాడు. బస్ కోసం వెయిటింగ్ అని చెప్పింది మళ్ళీ బస్ వస్తున్నప్పుడు కాల్ చేస్తే "బస్ వస్తుందండీ" అని చెప్పి కట్ చేసి క్రింద పెట్టి ఉంచిన సంచీ తీసుకోవడానికి ఒంగింది. స్టాప్ లో ఎవరు లేరనుకుని ఆ బస్ ఆపకుండా దూసుకు వెళ్ళిపోయింది. "అయ్యో ! మీరున్నది గమనించకుండానే బస్ లాగించేసాడు ఇక ఇప్పుడేమి బస్ లు కూడా రావు మేడమ్ నేను డ్రాప్ చేస్తాను రండి" అని బండి వైపు దారి తీసాడు పరిచయస్తుడు.
ఇంటి దాక వచ్చి దిగబెట్టనవసరం లేదు. వెళుతున్న ఆ బస్ ని అందిస్తే చాలని ఒకింత భయపడుతూనే అతని బండి ఎక్కి కూర్చుంది. అతను బైక్ ని ఎంత స్పీడుగా నడిపినా ఆ బస్ మధ్యలో ఎక్కడా ఆపకుండానే సిటీలోకి ప్రవేశించింది. "ఇక ఇక్కడిదాకా వచ్చేసాం కదా మేడమ్. ఇల్లు దగ్గరే కదా! ఇంటి దగ్గర దింపుతాను పదండి" అని. ఇంటి దగ్గర డ్రాప్ చేసాడు,
ఆమె ఇంటికి వెళ్ళే లోపే ఆమె బస్ స్టాప్ లో ఎవరెవరితో మాట్లాడిందో ఎవరి బండి ఎక్కి వచ్చిందోనన్న సమాచారమంతా మెడికల్ షాపతనికి కాల్ చేసి తెలుసుకున్నతను వీధి గేట్ దగ్గరే నిలబడి సెగలుగక్కుతూ ఉన్నాడు. ఇంటిదాకా వచ్చిన పరిచయస్తుడిని మర్యాద కోసం టీ త్రాగి పోదువుగాని రమ్మని లోపలి పిలిచింది.
అతను వచ్చి కూర్చున్నాడు ప్రిజ్ద్ లో పాలు కూడా లేవు బయటకి వెళ్లి తెమ్మని అడిగితే ఏం విరుచుకుపడతాడోననుకుని గ్రీన్ టీ చేసి ఇచ్చింది . ఆతను వెళ్ళగానే ఆమె అమ్మని అమ్మమ్మని ఏడుతరాల ముందు వాళ్ళని కూడా వదలకుండా తిట్టడం ఆరంభించాడు ఆమె అవన్నీ మౌనంగానే వింటూ స్నానానికి వెళ్ళింది. ఈ లోపు బయటకి పోయి బిర్యానీ పొట్లం పట్టుకుని వచ్చి తింటూ కూర్చున్నాడు . ముద్ద ముద్దకి ఆమెని అసహ్యంగా తిడుతూ తింటే కానీ అతనికి ఆకలి తీరలేదు.
చేయి కడుక్కునివచ్చాక " ఏమండీ అంత కోపంగా ఉన్నారు ? ఏమిటీ విషయం ? ఏమైనా ఉంటే శాంతంగా మాట్లాడుకుందాం రండి " అంది పిచ్చితల్లి. గది తలుపులు మూసేసి " ఏం మాట్లాడతావే నువ్వు ? నేను ఫోన్ చేసినప్పుడు ఎందుకు తీయలేదు నువ్వు " ఆ ఇరవయ్యి నిమిషాల టైం లో ఎవడితో పడుకున్నావ్ చెప్పు ? ఆ విలేఖరి గాడి తోనేనా? అంటూ బెల్ట్ తీసి వంద దెబ్బలకి తక్కువ గాకుండా కొట్టాడు. వెనక్కి తోసి పదే పదే కడుపులో కుమ్మాడు. బెల్ట్ బకిల్ తీసుకుని నుదురు పై గుచ్ఛాడు తలని మంచం కోడుకి వేసి బాదాడు. కురులలో చిక్కుని ఉన్న నేను చిక్కని రక్తంతో తడిచి ఎర్రబడిపోయాను.దెబ్బల శబ్దానికి ప్రక్క గదిలో ఉన్న చిన్నమ్మాయి, అత్తగారు వచ్చారు. అమ్మాయి వాళ్ళ నాన్నని బయటకి తోసి ఆమెని మంచం పై కూర్చోబెట్టి రక్తం తుడుస్తుంటే కొడుకుని మందలించడం కూడా చేయని అత్తగారు గదంతా చిక్కగా చిమ్మిన రక్తపు మరకలని శుభ్రం చేయడం మొదలెట్టింది.
ఇలా కొట్టడం ఇది మొదటి సారి కాదు ఆఖరిసారి అవదనికూడా ఆమెకి తెలుసు. తలకి తగిలిన గాయానికి కట్టు కడుతూ రక్తంతో తడిచిన నన్ను తీసి కిటికీ బయటకి విసిరేసింది ఆ పిల్ల. నేను వచ్చి చెట్టు అమ్మ ఒడిని చేరాను . "చూసావా అమ్మా ! మనకన్నా సుకుమారమైన మనసున్న ఆమె బాధలు ఎలా ఉన్నాయో ! " అని ఏడ్చాను.
"ఊరుకో తల్లీ ! ఈ లోకంలో చాలామంది మగువుల స్థితి ఇలాగే ఉంటుంది. లెక్కలేనటువంటి పువ్వులని నలిపెసినట్లే ఆడవాళ్ళ జీవితాలని నలిపేయడం ఈ మనుష్యలోకంలో సర్వసాధారణం" అని ఓదార్చింది ఆమె కూతురు ఆమె ప్రక్కనే పడుకుని ఓదార్చుతూనే ఉంది. ఆమె రాత్రంతా తల్లిని, తండ్రిని తలుచుకుని ఏడుస్తూనే ఉంది. ఆమెని చూస్తున్న నేనూ,నా అమ్మ కూడా ఏడుస్తూనే ఉన్నాము
ఉదయాన్నే తలకి కట్టిన కట్టు కనబడకుండా దానిపై మఫ్లర్ చుట్టుకుని బయటకి వచ్చింది. రాత్రి అన్ని దెబ్బలు తిన్నా ఈ రోజు డ్యూటీకి హాజరవక తప్పటం లేదు. రోజూ లాగా నాదగ్గరికి వచ్చి నన్ను తుంచనూలేదు కురుల ముడవనూ లేదు. ఆమెని బస్ స్టాండ్ దగ్గర దించడానికి అతను బైక్ తీసి నుంచున్నాడు. ఆమె నావైపుకి రాకుండా అటువైపుకి వెళ్ళడం గమనించి "పువ్వు పెట్టుకోవడం మర్చిపోయావ్ !" అని గుర్తు చేసాడు. ఆమె "వద్దులెండి " అంది.
చెప్పొద్దూ నాకు చాలా దిగులేసింది బాధలో ఉన్న ఆమెకి నేను సమీపంగా లేనందుకు , ఇంకా ఎంతో ఇష్టమైన నా పైన కూడా ఆమెకి విరక్తి కల్గినందుకు. అతను వడి వడిగా నా సమీపానికి వచ్చి నన్ను త్రుంచాడు. మొదటిసారిగా అతని స్పర్శ చవిచూసాను "అబ్బ ఎంత మొరటుదనం ? " అనుకున్నాను . ఆమెకి నన్నివ్వగానే మౌనంగా అందుకుని ఓ మారు నా వాసనని ఆఘ్రాణించి చిన్నగా పెదవులతో ముద్దాడింది. బాధ నిండిన ఆమె మోహంలో చిన్న నవ్వు విరబూసింది. మెల్లగా తలలో తురుముకుంది. ఆ మాత్రం సామీప్యతకే నేను మురిసిపోయాను.
ఆఫీసుకి చేరుకొని కుర్చీలో కూర్చుని రాత్రి జరిగినదానిని గుర్తుచేసుకుని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చింది. ఓదార్చడానికి ఎవరు లేని ఆ ఆఫీసు గదిలో ఆమె రోదన అరణ్య రోదనే అయింది. భుజంపై తట్టి స్పర్శతో నేనున్నాను అనే భరోసా కల్గించడానికి నేనొక మనిషిని కాలేనందుకు మొదటిసారిగా దేవుడ్నితిట్టుకున్నాను. ఆమె బాధల్లో సహానుభూతి చెందడం తప్ప నాకేం చేతనవును ? అయినా ఏదో చేయాలని ఆవేశం , ఆక్రోశం అతన్ని శిక్షించి తీరాలనే కోపం ముప్పేటలా నన్ను చుట్టేసాయి అయినా కురులు దాటి బయటకి రాని స్థితిలో ఉన్నాను కదా !
మధ్యాహ్నం దాకా పని చేసుకుంటూనే ఏడుస్తూ ఉంది . తర్వాత ఏదో నిర్ణయం తీసుకున్నదానిలా కళ్ళు తుడుచుకుని పైకి లేచింది. బేగ్ తగిలించుకుని రోడ్డుపైకి వచ్చి నిలబడింది.
మెడికల్ షాపతను మిట్టమధ్యాహ్నం తలకి మఫ్లర్ చుట్టుకున్న ఆమెవంక విచిత్రంగా చూస్తున్నాడు. ఆమె మఫ్లర్ని తీసి నడిరోడ్డుపై విసిరి పడేసింది. ఎప్పుడో ఒకసారి వచ్చే బస్ కోసం ఎదురు చూడకుండా ఆటోని పిలిచింది ఎక్కి కూర్చుని పోలీస్ స్టేషన్ కి పోనీయ్ ! అంది .
నాకు భలే ఆశ్చర్యంగా ఉంది. ఆటో దిగి సరాసరి ఎస్సై ముందు నిలబడింది. ఎస్సై ఆమెని గుర్తించి "మీరు ఫలానా రచయిత గారి భార్య కదా ! ఏమైంది మేడం ! ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా ? అంటూ
ఈ లోపు సార్ కి ఫోన్ చేయమంటారా ? అంటూనే అతనికి రింగ్ చేయడం మొదలెట్టాడు .
మీరు ఆయనకీ కాల్ చేయకండి. పేపర్, పెన్ ఇవ్వండీ ! నేను కంప్లైంట్ వ్రాసి ఇవ్వాలి కదా ! నేను కంప్లైంట్ చేస్తున్నదే అతని మీద శారీరక హింస, మానసిక హింసకి గురి చేస్తున్నాడని. ఈ సాక్ష్యం చూడండి అంటూ తగిలిన గాయాన్ని చూపింది. మీరిప్పుడు గృహ హింస యాక్ట్ పై కేసు నమోదు చేసి ఎఫ్ ఐ ఆర్ నకలు ఇవ్వాలి" అంది.
అతని క్రూరత్వం గురించి లోకానికి చెప్పడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్లిందని, ఇన్నేళ్ళకైనా ఆమె సహనానికి తెరపడినందుకు నాకు చాలా ఆనందమనిపించింది. ఎస్సై చేతిలో పెన్ జారి క్రింద పడింది. ఆమె ఆ పెన్ ని అందుకోవడానికి క్రిందకి ఒంగింది. జడ ముందుకు జారింది . కురులమధ్య ఇరుక్కుని ఉన్న నేను పెనుగులాడి స్వేచ్చగా బయటకొచ్చి ఆమె పాదాల మీద పడి ఇష్టంగా ముద్దాడాను.
ఇన్నాళ్ళూ ఆమె సుతి మెత్తని భావాలని, బాధమయమైన గాధలన్నింటినీ అక్షర రూపం చేసుకుంటే వాటన్నింటిని తన రచనలుగా చెప్పుకుని రచయితగా పేరు సంపాదించుకున్నతని గురించి, ఆమె గురించి అంటే ఆ రచయిత గారి భార్య కథని చెప్పానని మీరు మనఃస్పూర్తిగా నమ్మితే చాలు. ఇన్నేళ్ళూ కన్నబిడ్డలా సాకుతున్నందుకు కృతజ్ఞతతో నా తల్లి జన్మ, రోజూ దేవుని పాదాల వద్దకి కి చేర్చినందుకు నా జన్మ కూడా సార్ధకమైనట్లే ! " అని కథ ముగించింది పువ్వు .
నేను పనిచేసే పత్రిక కోసం ఓ రచయిత ఇంటర్వ్యూ తీసుకుందామని ఆ వూరు వచ్చి ఆ రచయిత అడ్రెస్స్ వెతుక్కుంటుంటే ఆడబోయిన తీర్ధం ఎదురయినట్లు రచయిత భార్య కథ తెలిసాక ఇక అతని ఇంటర్వ్యూతో పనేంటి ? అనుకుంటూ వెనక్కి తిరిగాను. తానూ చెప్పిన కథ విన్నందుకేమో చెట్టు కృతజ్ఞతగా తన పువ్వులని నాపై రాల్చింది. కథ లాంటి వాస్తవాన్ని నేను నమ్మినందుకు ఓ పువ్వు నా హృదయానికి దగ్గరగా ఇష్టంగా చొక్కా గుండీ కి చిక్కుకుంది.
గాయం - వేలసంధర్భాలు
ప్రత్యాహారం
18, డిసెంబర్ 2014, గురువారం
సారంగ లో రచయిత గారి భార్య
24, నవంబర్ 2014, సోమవారం
A Mother Wish
చిన్ని..! బంగారం.. !!
ఇలాంటి పుట్టిన రోజులు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని ..
చైతన్యవంతమైన జీవన గమనం తో..
స్ఫూర్తి కరమైన మార్గంలో నడుస్తూ..
సుఖసంతోషాలతో..ఆయురారోగ్యములతో.. పుత్ర పౌత్రాభివృద్దితో
యశస్విభవ గా దేదీప్యమానంగా వెలుగొందాలని ..
మనసారా దీవిస్తూ..
భగవంతుని కరుణా కటాక్షములు అన్నింటా లభించాలని కోరుకుంటూ...
హృదయపూర్వక శుభాకాంక్షలు .. ప్రేమతో "అమ్మ "
11, నవంబర్ 2014, మంగళవారం
పార్టీషన్స్ Vs పార్టనర్
భారతీయ స్త్రీల ప్రేమలో పార్టీషన్స్ ఉంటాయి కానీ పార్టనర్స్ (ఉండరు) ఉంటారా?
స్త్రీ ప్రకృతి కి మరో రూపం . మనో బాహ్య పర్యావరణం అంతా ప్రేమ మయం . పురుషుడిలో ఆమె సహ భాగం అదే అర్ధనారీశ్వర తత్త్వం . ఈ ఆకళింపు తోనే వాస్తవ పరిస్థితులను బట్టి ఈ పోస్ట్ వ్రాయాలనిపించింది
నేను "ఆరెంజ్" చిత్రం బాగా బాగా నచ్చిందని చెపితే కొందరు నన్ను విచిత్రంగా చూసారు . మరి కొందరు "మాకంతగా బాగా అనిపించలేదే !? అంటూనే మీరు చెప్పారు కాబట్టి మళ్ళీ ఒకసారి చూస్తాం" అన్నారు .
ప్రేమ ఎప్పుడూ శాశ్వతంగా, స్థిరంగా ఒకరి పైనే ఉండటం సాధ్యం కాదు . ఈ కాన్సెప్ట్ అందరికి అర్ధమైనా అందరూ ఒప్పుకోరు కదా!
కేవలం ఒకరే ఒకరిని శాశ్వతంగా ప్రేమించడం అనేది సాధ్యం కానిపని. అలా అని చెప్పారంటే అది అతిశయం అన్నా కావాలి లేక మోసం చేసుకుంటున్నారని అయినా అనుకోవాలి. అన్నీ నిజాలు మాట్లాడే "ఆరెంజ్ " హీరో నచ్చాడు . ఆఖరికి అదే హీరో సినిమా ఆఖరిలో వివాహానికి కట్టుబడి ఉండటానికి ఒప్పుకోవడం నచ్చింది
ఇందాకనే "చిన్నారి పెళ్ళి కూతురు " చూసి కనులు చెమర్చాయి . అనుబంధాలు ఎంత సున్నితమైనవి . ఒక చోట తెగి పోయి మరొక చోట పెనవేసుకుంటాయి .
ఒంటె కి కడుపులో నాలుగు భాగాలు ఉంటాయట. అలాగే స్త్రీ జీవితంలో (ప్రేమలో ) కూడా అనేక భాగాలు ఉంటాయి
జన్మనిచ్చిన తల్లిదండ్రులని, తోబుట్టువులని, ఇంటిని, తువ్వాయిలని , పువ్వులని అన్నింటిని ఎంతగానో ప్రేమిస్తారు . మూడుముళ్ళు పడగానే భర్తని ప్రేమిస్తారు. అత్తింట్లో అడుగుపెట్టాక అందరిని తనవారిగా భావిస్తూ అనుబంధం పెంచుకుంటారు . తర్వాత పుట్టిన బిడ్డలని ప్రాణప్రదంగా ప్రేమిస్తారు . తర్వాత బిడ్డలా బిడ్డలని ప్రేమిస్తారు . స్త్రీ ప్రేమ ఇలా రూపాంతరాలు చెందుతూ వృద్దిలో ఉంటుంది.
అందుకే స్త్రీ లైఫ్ లో పార్టీషన్ ఉంటాయి కానీ పార్టనర్స్ ఉండరు . " పార్టనర్స్ " ఉండటానికి లైఫ్ ఏమి బిజినెస్ ఎగ్రిమెంట్ కాదు కదా !
అందుకే .. లైఫ్ పార్టనర్ అంటారు . పురుషుడికి కూడా లైఫ్ పార్టనర్ "యే" ఉండాలి "లు " కాదు ఉండాలంటే ఉతికి ఆరేసేయాలి
మనభారతీయ సంప్రదాయం "ధర్మేచ, అర్ధేచ , కామేచ, త్య యేషా నాతి చరితవ్యా , నాతి చరామి" అర్ధం కూడా ఇదే కదా !
పార్టనర్స్ ని మెయిన్ టైన్ చేసే మహానుభావలకి / మహాను భామిని లకి ఈ అర్ధం తెలియక కాదు. ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలు వారికి. అందుకోసం కట్టుకున్న దానిని / వాడిని నట్టేట్లోనూ ముంచేస్తారు. అవమానాల పాలు చేస్తారు . వీరిది ఆకర్షణ అనాలా !? మరి నిజమైన ప్రేమ అనాలా? వీరిని ఆమోదించే తల్లిదండ్రులు వారి పరివారానికి ఆత్మ విమర్శ చేసుకుంటే ఈ సత్యాలు బోధపడకమానవు.
అయినా "మన వాళ్ళు చేస్తే మనకి అసలు తప్పు కాదు " మన పిల్లలకి ఇలాంటి స్థితి వస్తే ఇటివంటివి తప్పు. ఎప్పుడు మారతారు రా బాబూ ఈ జనం !?
అసలైన ప్రేమ రూపం ఏమిటి ? ఇలా ప్రశ్నలు వేసుకుని ఆలోచన చేసి చూడండి. ఒకే ఒక ప్రేమ ఎందుకు సాధ్యం కాదో కూడా తెలుస్తుంది వివేకం తో తన కుటుంబంతోనే ప్రేమని ఎలా విస్తరింప జేసుకోవాలో చెపుతుంది తప్ప తగని వ్యామోహాలకి, పైత్యాలకి "ప్రేమ" అనే పేరు పెట్టుకోవద్దని చెపుతుంది. ప్రేమ అనేది ఎండమావి లాంటిదని చెపుతుంది.
"ఎన్నాళ్ళు ప్రేమిస్తానో తెలియదు, ఎప్పుడూ కలసి ఉంటానని చెప్పలేను" అనే నిజాయితీ పరుడు కూడా కమిట్ అయి పెళ్ళికి అంగీకరిస్తాడు . దటీజ్ మేరేజ్ కమిట్ మెంట్ అందుకే "ఆరెంజ్ " చిత్రాన్ని ఇంకోసారి చూసేయండి. :) ఎందుకు నచ్చలేదో , నచ్చిందో మీలోనే దాచేసుకోండి . నా అభిప్రాయంతో ఏకీభవించక పోయినా పర్లేదు .
29, అక్టోబర్ 2014, బుధవారం
ఏక్ దిల్ వాలాకి... దర్ద్
ఈ పాట పరిచయానికి ముందు .. క్రిందటి పోస్ట్ "ఓ .. గీతం వెనుక " తర్వాత ఈ వివరణ. నచ్చిన పాట పరిచయం .
చాలా కాలం తర్వాత ఓ పాట నన్ను బ్లాగ్ లో ఓ పోస్ట్ వ్రాయించింది ఆ పాట ఎప్పుడూ వింటూ ఉంటాను . ఎందుకో ఈ రోజు ఆ పాట వింటూంటే .. చూస్తూంటే భావేద్వేగంతో కదిలిపోయాను . ప్రతి గీత రచన వెనుక ఆ కవి భావేద్వేగం ఉండకపోవచ్చు . ఆతను సాధారణంగానే వ్రాసి ఉండవచ్చును. కానీ తెరపై ఆ గీతం కథకి సంబంధించినదయి .. చూస్తున్న ప్రేక్షకుడిని కదిలిస్తుందన్నది నిజం . ఈ పాట చూస్తున్నప్పుడూ నేను అలాగే ఫీల్ అయ్యాను . కన్నులు చెమర్చాయి . పాటలో నటుడి నటన నభూతో న భవిష్యత్.
ఆ పాటకి ముందు సభని ఉద్దేశించి .. ఈ మాటలు ఉంటాయి . (అది ప్రసంగం కాదు అతని దృష్టిలో )
నేను ఒక నాయకుడు , రాజకీయవేత్త, సమాజ సేవకుడు ని కాదు ఇతరుల నుండి పేరు పొందటం కోసం ఈ టికెట్ కొనడడానికి. నాకు నా ప్రతిభా పాటవాలని ,నా గొప్పలు మీ మీద రుద్దబడ తాయని, చప్పట్లతో స్వాగతిస్తారని .పూల మాలతో అలంకరిస్తారని తెలిస్తే బహుశా నేనెప్పటికీ ఇక్కడికి వచ్చేవాడిని కాదు .
ఒక సోదరుడు ఇంకొక సోదరుడి కడుపు నింపుతాడు అంటే అతడు తన భాధ్యత నిలబెట్టు కుంటున్నట్టు. అది ఇతరులపై దయ చూపడం కాదు. నేను ఈ (అనాధ పిల్లలకి) నిరాశ్రయులకి కొంచెం ఇచ్చానంటే అది నా వారి కోసం, నా సోదరుల కోసం ఇచ్చినట్లు. ఎందుకంటే నేను కూడా వీరిలాగే ఒక నిరాశ్రయుడినే. ఊహ తెలిసినప్పటి నుండి అమ్మ ఒడి లేదు , నాన్న నీడ లేదు ,పుట్ పాత్ ఒడి, ఆకలి పేదరికమే తోడు నాకు.
నా ఒంటరితనం , తన్నులు ,సమాజం నుండి చీత్కారాలు , ప్రజల తిట్లు . ఇలాంటి స్థితిలో నా బాధని పంచుకునే వారు ఒకరు దొరికారు . వారికి నా పరిస్థితి మీద జాలి కల్గింది . ప్రేమతో వారు నా తలపై చేయి వేసారు . నేను ఏడుస్తూ ఉండిపోయాను. వారు పాట పాడి నా గాయ పడిన హృదయానికి మందు పూసారు . ఆ (ఓదార్పు ) మందు ప్రభావం వల్ల బతికి ఉన్నాను . లేదంటే ఎప్పుడో చనిపోయి ఉండేవాడిని . ఆ పాట .. ఆ పాట గాయపడిన నా హృదయాంతరాలలో ఇంకా వినిపిస్తూనే ఉంది . మరచి పోలేదు నేను.
నేనెప్పుడూ ఆ పాటని గల్లీలోనూ , చౌరస్తాలలోనూ పాడనూ లేదు . కానీ అప్పుడప్పుడూ నేను పోగొట్టుకున్న, నా బాధని పంచుకున్న వారు గుర్తు వచ్చినప్పుడు , జీవితం పట్ల విరక్తి కల్గినప్పుడూ అప్పుడప్పుడూ (కూనిరాగం ) పాడు కుంటాను . ఈ రోజు నేను అదే పాట మీరు అనుమతి ఇ చ్చినట్లయితే . మీ ముందు.ఉంచుతాను .. .
మళ్ళీ ఇక్కడ విషయం ఆపేసి బ్లాగర్ ని మీ ముందుకు వచ్చేసానండోయ్! ఇక్కడి దాకా వ్రాశానా ! ఇక్కడ ఒక చిలిపి ఆలోచన వచ్చింది . ఈ సంభాషణ ఏ పాటకి ముందు ఉందొ ఏ చిత్రం లో ఉందొ .. ఊహించండి ..
ఇది ఒక హిందీ చిత్రంలో పాట . (క్లూ .. ఇంత వరకే )
*********************
రెండో భాగంగా పాట పరిచయం
నా కెంతో ఇష్టమైన "muqaddar ka sikandar " చిత్రంలో ఓ .సాతిరే పాట
కళ్యాణ్ జీ - ఆనంద్ జీ స్వరకల్పన అమితాబ్ నటన ..పోటాపోటీగా ఉంటాయి . పదే పదే వెంటాడక మానదు
ఈ పాట స్వరకల్పన పై ఒక వివాదాస్పద వ్యాఖ్య కూడా ఉంది .
"నజరత్ పతే ఆలీఖాన్ " దాతా పియా లిల్లహ్ కరమ్ ఆజ్ కర్దే .. ట్యూన్ ఆధారంగా స్వరకల్పన చేసారని ..
అనంత సంగీతసృష్టిలో అనేకానేక స్వరాలూ కలగాపులగం కాకమానవు. కొంతమంది సృజనని అనుసృజని చేసి అంతకన్నా మంచి సంగీతాన్ని అందించిన తీరు జనులకి హర్షణీయమే కదా, ఎందుకు ఈ వివాదాలు అనిపించింది
ఏది ఏమైనా పండిత పామరులని రంజింపజేసే సంగీతంకి అందరం బానిసలమే కదా !
ఈ పాట వింటున్నప్పుడు .. కిషోర్ కుమార్ గళం భావాలు ఒలికించిన తీరు కి " ఫిదా " అయిపోయాను
అంజాన్ గీత రచన గొప్పదనం తెలియాలంటే మూలమైన హిందీ లోనే ఆ పాట సాహిత్యాన్ని ఆస్వాదించడం మంచిది . అంత మధురం గా ఉంటుంది .