21, మార్చి 2015, శనివారం

పాట తోడు

పాట తోడు  



(చినుకు మాసపత్రిక లో మార్చి 2015 సంచికలో ఆచ్చు అయిన  నా కథ )

వేగు చుక్క పొడిచింది. దానికి పోటీగా చుట్టు ప్రక్కల తెరుచుకున్న ఇళ్ళ తలుపులు మధ్య నుండి విద్యుత్ దీపాల వెలుగులు.  స్నానాల చప్పుళ్ళు,  హారతి ఇస్తూ మ్రోగే గంట చప్పుళ్ళూ కార్తీకమాస ప్రత్యేకతని చెపుతున్నాయి. 

"అయ్యో ! ఈ రోజు గుళ్ళో ప్రదక్షిణలు చేయడానికి ఆలస్యం అయిపోతుంది  నేనెళ్ళేటప్పటికే గుడి ఆవరణమంతా దీపాలు పెట్టేస్తారు.  వేసిన ముగ్గులని, పెట్టిన  దీపాలని త్రొక్క కుండా ప్రదక్షిణ చేయడం ఒక పరీక్షన్నమాటే.. మనసులో అనుకుంటూ పూజ బుట్ట పట్టుకుని బయటకి అడుగుపెట్టాను నేను. 

విజయదశమి రోజున శివాలయంలో ప్రదక్షిణలు మొదలెట్టాను . నా కొడుకుకి హెచ్ వన్ అప్రూవైతే ఏబయ్యిఒక్క రోజులు ప్రదక్షిణలు చేస్తానని మనసులో అనుకున్నాను. ఆ మొక్కు చెల్లించడానికి గాను రోజు గుడికి వెళుతున్నాను నాకు మనుషులపై నమ్మకం పోయి చాలా ఏళ్ళయింది. నా కష్టం-సుఖం, నా దుఃఖం.. అంతా మౌనంగా భగవంతునికే చెప్పుకోవడం, ఎవరో ఒకరి రూపంలో ఆయన ఉండి సాయం చేస్తాడని నమ్మికవల్ల కావచ్చు నేను నా ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ నా వెన్నుముక పైనే నిలబడి ఉన్నాననుకుంటా! ఇన్నిచ్చిన భగవంతుడికి మనమేమివ్వగలం .. ? హృదయం తప్ప , అలాగే ఇతరులకి చేసే  చిన్న చిన్న సాయాలు తప్ప  అని iఅనుకుంటూనే ఉంటాను.  అలా తెల్లవారుఝామునే లేచి గుడికి వెళుతున్న నన్ను కొందరు వింతగా చూస్తారు. బారెడు పోద్దేక్కేదాకా నిద్ర లేవని  కొంతమంది పుణ్యమంతా మీదే అంటూనే లోలోపల ఏడుస్తూ ఉంటారు. వీటన్నింటిని  మననం చేసుకుంటూ మా వీధి చివరలో మలుపు తిరిగాను.     

మంచుతెరల మధ్య నిశ్శబ్దంలో నడక హాయిగా ఉంది . అంతకన్నా హాయిగా చెవులకి సోకుతున్న నాదం.  "అబ్బ .. ఎంత బావుంటుందో..అతని గానం.   ఎవరిచ్చారీ శక్తి?   తరువుని నిలువెల్లా నరికి తనువంతా గాయాలు చేసినా.. సరే,  గాలి నింపుకుని తీయని  నాదాన్నిఅందించే త్యాగగుణం  వాయువుదా లేక వెదురుదా.. లేక అతని ప్రాణ శక్తిదా? "  గాలి అలల్లోకి ప్రవహింపజేస్తూ అతని  స్వరం ఏదో లోకాలలోకి లాక్కేళ్ళుతుంది.  అతనిని చేరడానికి ఒక పర్లాంగ్ దూరంలో ఉండగానే  వినరావడం  మొదలైనతని గానం  అతన్ని దాటేసిన ఒక పర్లాంగ్ దూరం నడిచే  వరకు  వినిపిస్తూనే ఉంటుంది. నిజానికి అతని గాలి పాట వినడం నాకొక వ్యసనం అయిపొయింది. తమ ఇంటికి రెండు పర్లాంగ్ ల దూరంలో ఉండే గుడికి వెళుతూ ఉండే దారిలో రహదారి ప్రక్కనే కళ్యాణ మండపం ముఖ ద్వారం  ప్రక్కగా పన్నాయి చెట్టు క్రింద అతని వాసం. చిరుగు బొరుగు బట్టలతో  రెండు మూడు పొరలతో కప్పుకున్నఅతని బక్క చిక్కిన కాయం ,  సంస్కారం లేని జుట్టు. అభావమైన ముఖంతో ఒంటరిగా అతను. అతని చెంత మురళి పాట.  ఆపాట శృత సంగీతంలా ఉండదు, తపనపడి నేర్పు సాదించినట్లు ఉంటుంది     రాత్రుళ్ళు కూడా అక్కడే నివాసం.  వీధిలైట్ కాంతిలో పన్నాయి చెట్టు మొదలుకి ఆనుకుని కూర్చుని  ప్రపంచానికి తనకీ సంబందమేమి లేనట్లు అరమోడ్పు కనులతో తన్మయత్వంతో పాడుకుంటుంటే చూసి కించిత్ ఈర్ష్య కలుగక మానదు. బతకడంలో ఉన్న ఆనందాన్ని అతను మనసారా  అనుభవిస్తున్నట్లు ఉంటుంది నాకు . 

భద్రమైన బ్రతుకులో ఇమిడి ఉన్నాకూడా  .. ఇంకా ఏవేవో కావాలనే కోరికలు, అవి తీరాలని భగవంతుడిని వేడుకోవడానికి  వెళ్ళడంలో కూడా పరుగులు తీస్తున్న  నాకూ.. అతనికి మధ్య ఉన్న తేడా ఏమిటో కూడా నాకు బాగానే తెలుసు. ఇలా  ఆలోచిస్తున్న కొద్దీ నా పై నాకే చికాకు కల్గింది 
గుడిలోకి వెళ్ళబోతుండగా
 "అమ్మా పాత చీరలు ఇస్తానన్నారు " అడిగింది ఒక భిక్షుగత్తె.  
"అడుక్కోవడానికి  అప్పుడే తెల్లారిందా? అయినా ఇంటికొస్తే పాత చీరలిస్తానన్నాను కానీ ఇక్కడకి తీసుకొచ్చి ఇస్తానన్నానా? " విసుక్కున్నాను. అంతటితో ఆపానా ? అదీ లేదు . "ఇలా అడుక్కుతిని తినడానికి అలవాటు పడిన వీళ్ళు పని చేసి బ్రతకాలనుకోరు.  ఇలా అడుక్కుని తినడం నామోషి  అని కూడా అనుకోరు " అని నేను, మరో భక్తురాలు దీనోద్దరణ గురించి మాట్లాడుకుని  తర్వాత మా కోర్కెలు తీర్చమని శ్రద్ధతో నలబయ్యి ఒక్క  ప్రదక్షిణలు చేసాము . 
బయటకి వచ్చేటప్పుడు నన్ను చీరలడిగిన అమ్మాయిని పిలిచి .." నాతొ ఇంటికి రా .. చీరలిస్తాను " అని పిలిచాను . "ఇప్పుడోస్తే.. డబ్బులన్నీ పోతయి, మీ ఇల్లు నాకు తెలుసుగా  మజ్జేనం వస్తా .. అప్పుడియ్యి" అంది . 
"ఇప్పుడోస్తేనే ఇస్తా .. లేకపోతే ఇవ్వను  మధ్యాహ్నం ఊరేళుతున్నా" అబద్దం చెప్పాను . 
తన బదులు నాలుగేళ్ళ కూతురిని అక్కడ కూర్చోబెట్టి.. "వచ్చే వాళ్ళందరిని ధర్మం చేయమని అడుగు. అడగకపోతే ఎయ్యరు" అంటూ అయిష్టంగానే నా వెంట వచ్చింది 
నా వెనుక నడుస్తున్న ఆమెని "నీ పేరేమిటీ? "అడిగాను .
 "గౌరి"  
"మీ ఆయన ఏం జేస్తాడు? "  
"రిక్షా తోక్కుతాడు పుల్లుగా తాగుతాడు . ఇంటికొస్తే వస్తాడు లేకపోతే లేదు. పెళ్ళాలకి తక్కువైతేగా, ఇద్దరు బిడ్డలని పెట్టుకుని ఏడకని పనికి పోనూ !? పిల్లలని తీసుకొత్తే పనికి రావద్దంటారు మీబోటి అమ్మలు. అందుకే ఇట్టా గుడి ముందు కూర్చుని అడుక్కుంటున్నా " అడక్కుండానే చెప్పింది . 
ఇంటికి వచ్చాక నాలుగు చీరలు జాకెట్లు ఇచ్చాను. "నే పోతానమ్మా " అంటే ఆపి  
 "నిన్ను గుడి ముందు నాలుగేళ్ళ నుంచీ చూస్తున్నా ! అడుక్కోవడం నామోషీ అనిపించట్లేదా ?   మేము కార్లలో తిరిగే వాళ్ళమే ఇంకా ఏమిటేమిటో కావాలని ఇంకా ఇంకా ఇవ్వాలని  గుళ్ళు చుట్టూ తిరుగుతున్నాం, మీకు తిండి కూడా జరగడం లేదే ? అయినా  ఒక్కసారి కూడా  గుడిలోకి వచ్చి దణ్ణం పెట్టుకోవు మరి  నీ బతుకు ఎట్టా మారుద్ది ? అన్నాను. 
 "పుట్టించిన ఆయనకే ఉండాలమ్మా మేమేం చేయగలం ? "అంది 
"ఇవన్నీ కాదుగాని .. నీకు గౌరవంగా బ్రతికే దారి చూపిస్తే అడుక్కోవడం మానేస్తావా? " అడిగాను 
"ఆ మానేస్తా " అంది . "మాట తప్ప కూడదు " తర్జనగా వేలు చూపిస్తూ అన్నాను . 
"తప్పను"  ఏం చేయాలి చెప్పండి ? 
"ఇప్పుడు కాదు .. రేపు నేను గుడికొచ్చే టైం కి .. శుభ్రంగా స్నానం చేసి, తల దువ్వుకుని . గుడి దగ్గరకొచ్చి ఉండు " అని చెప్పాను . తల ఊపుకుంటూ వెళ్ళిపోయింది 
 తెల్లవారి అన్నట్టుగానే నీట్ గా తయారై నా కోసం ఎదురు చూస్తూ కూర్చుంది " సుబ్బారావు కొట్టుకి వెళదాం ..రా" అంటూ  కొట్టుకి తీసుకు వెళ్లాను . 
ఒక ఇరవై కొబ్బరి కాయలు, కర్పూరం పేకెట్లు , సంబ్రాణీ కడ్డీల పేకెట్ లు , ఆవు పాల పేకెట్ లు, గంధం ,విభూది పొట్లాలు అన్నీ కలిపి లెక్క రాయించి  డబ్బులు ఇచ్చేశాను .  ఇంకో మూడువేలు పెట్టుబడిగా అతని దగ్గరే ఉంచమని ఎప్పుడు ఏ సరుకు కావాలన్నా ఇమ్మని చెప్పి కొన్న సరుకు నంతటిని  తీసుకుని "గుడి దగ్గరకి వెళదాం పద "అన్నాను . నా వెనుకనే వచ్చింది . గుడి ముందు ఒక పట్టా పరిపించి గౌరీ చేతనే అన్నీ సర్ధించాను .  "ఇప్పుడు  ఇక్కడ  కూర్చో ! కొబ్బరి కాయ ధర ఇంత, కర్పూరం ధర ఇంత అని నీకు తెలుసు కదా ! అసలు ధర మీద కొంత  లాభం వేసి అమ్మడం నేర్చుకో !  "అన్నాను . ఎదురుగా ఉన్న బడ్డీ కొట్టతను  తన వ్యాపారం దెబ్బ తీస్తున్నాని నా వంక గుర్రుగా చూస్తున్నాడు . 

గుళ్ళో పూజారి దశరధ స్వామి వచ్చి "హేమ గారు  భలే దారి చూపిచ్చారు గా " అంటూ నా పై ప్రశంసలు . గుళ్ళో హారతిచ్చే సమయానికి వంద రూపాయల లాభం కళ్ళ జూసింది గౌరీ . కళ్ళలో వెలుగుతో  ఇక ఇట్టాగే బతుకానమ్మా ! అంది . సాయంకాలం సాయిబాబా గుడి దగ్గర , శనివారం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కూడా పూజ సామాను పెట్టుకో, తులసి దండలు తెచ్చి అమ్ముకో అంటూ పూజారి గారు, నేను ఆమెకి  సలహాలు ఇచ్చాం 
నెల తిరిగే టప్పటికి వ్యాపారంలో చాలా మెలుకువలు నేర్చుకుని నా దగ్గర కూడా ఎక్కువ లాభం తీసుకునేంత ఎదిగిపోయిన గౌరిని చూసి నవ్వుకున్నాను.  ప్రతి రోజూ ఆమె కూడా  తెల్లవారుఝామునే నాతో పాటు ప్రదక్షిణలు చేయడం మొదలెట్టింది. 

"మంచి చేయాలంటే మనసే కాదండి ఓపిక కూడా ఉండాలి . మీరు ఓపికగా ఎన్నో సార్లు చెప్పి చెప్పి నందువల్లనే .. ఆమెకి గురి కుదిరింది " అని దశరధ స్వామీ అంటుంటే "డబ్బులయితే మేమైనా ఇచ్చేవాళ్ళమేనండీ ! దరిద్రులని బాగుచేసేంత  మీకున్నంత  ఓపిక,తీరిక  మాకు లేదులెండి అనే వాళ్ళు కొందరు మూతి విరుపు, ముక్కు విరుపుతో.  

 అవన్నీ  వింటూ "అభిషేకానికి రెండువందల మిల్లీ లీటర్ల పాలిచ్చి  సంకల్పం చెప్పేటప్పుడు ఇరవై మంది పేర్లు చెప్పి  వంద కోర్కెల చిట్టా విప్పే వీళ్ళు  నా లాంటి బ్రాహ్మణుడికి  దానమివ్వడం తప్ప  ఆకలితో అలమటించే వారికి ఒక రూపాయి కూడా దానమియ్యరు, ఎంగిలి చేత్తో  కాకిని కూడా తోలరు."  అంతా మాటల తీపే హేమగారు "అంటూ ఉండేవాడు దశరధస్వామి.   
 అలా గౌరీ యాచన చేయడం మానేసి  గౌరవంగా బ్రతకడం నేర్చుకుంది. 
నాకైతే  లోలోపల చాలా గర్వంగా ఉండేది.  నాలో  నిత్యం ఉండే అసహనం, చిరాకులు తగ్గి కొంత ప్రశాంత రావడం మొదలైంది. అది భక్తీమార్గంలో లభించే సాంత్వన కావచ్చు, అతని పాట వినడం కావచ్చు , లేదా గౌరీ జీవితంలో వచ్చిన మార్పు వల్ల కావచ్చు .
కార్తీక మాసం అయిపోవచ్చింది.  రాలుతున్న పన్నాయి పూల కోసం, అతని పాటని మరింత సమీపంగా  వినడం కోసం నేను గుడికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడూ రెండుసార్లు ఆ వైపునే నడవడం మొదలెట్టాను.  ఒకరోజతనిని  పలకరించి  పేరడిగాను . ఒక్క క్షణం  నా వైపు చూసి "రంగ" అని చెప్పి తన గానంలో తానూ మునిగిపోయాడు. అప్పుడప్పుడూ అతనికి నా చేతిలో ఉన్న పండో, ప్రసాదం ఇస్తేనో... తీసుకోవడంలో  కొంత అయిష్టం గమనించి .. ఇవ్వడం మానేసాను. ఎవరిని అగౌరవ పరచడం నా అభిమతం కాదు కాబట్టి .       
         ఆ రోజు ...ఎందుకో .. అతని పాట వినబడటం లేదు. ఆశ్చర్యంగా ఉంది . దారెంట నడుస్తూనే అతను కూర్చుని ఉండే చోటు వైపు చూసాను. అతను ఇంకా లేచినట్లు లేదు.  పాపం ! ఆరోగ్యం బాగొలేదేమో ! అతనికి నా అన్న వాళ్ళు ఎవరు లేనట్లున్నారు , హాస్పిటల్ కి ఎవరు తీసుకువెళతారు? ఆలోచిస్తూనే గుడికి చేరుకున్నాను గుడి బయట గౌరీ కనబడలేదు ఈ రోజు గురువారం కదా ! సాయిబాబా గుడి దగ్గర ఉండుంటుంది.. అనుకుంటూ గుడి లోపలకి వెళ్లాను. ఇంటికి వెళ్ళేటప్పుడైనా అతని పాట వినిపిస్తుందేమోనని చూసాను. నిరాశ మిగిలింది. ఆ రోజంతా ఏదో చికాకు.  రాత్రి పడుకునేటప్పుడు చౌరాసియా సీ డి ప్లే చేసుకుని వింటే కానీ మనసుకి స్థిమితంగా ఉన్నట్లు అనిపించింది. శుక్రవారం ,శనివారం కూడా అతని పాట వినబడలేదు, గౌరీ కనబడలేదు, చెప్పలేని దిగులేసింది . అనుకున్న ప్రకారం నా ప్రదక్షిణ వ్రతం పూర్తయింది . 
కార్తీక మాసం అయిపొయింది.  తర్వాత రోజు నేను వేకువనే గుడికి వెళ్ళడానికి  బద్దకించాను. మళ్ళీ ఓ నాలుగు రోజుల తర్వాత  వచ్చిన సోమవారం రోజున  వేకువనే గుడికి బయలుదేరాను రోడ్డు మీదకి రాగానే అతని వేణు గానం మృదుమధురంగా వినవచ్చింది. సంతోషంతో కొంచెం వడి వడిగా అడుగులు వేసి రోడ్డుకి ఈవల వైపునే  నిలబడి కాసేపు ఆగి మరీ అతని పాట విని గుడికి వెళ్ళాను. చెప్పులు విప్పి కాళ్ళు కడుక్కుంటూ ప్రక్కకి చూసాను అక్కడ  గౌరీ కూర్చుని ఉంది. ఆశ్చర్యం, కోపం రెండూ . పూజా సామాగ్రి అమ్ముకోవడానికి బదులు ఒక సత్తు గిన్నె పట్టుకుని వచ్చే పోయే వాళ్ళని ధర్మం చేయండయ్యా అంటూ యాచన చేస్తుంది 
"గౌరీ !ఇన్నాళ్ళు ఎక్కడ కెళ్ళావ్? మళ్ళీ ..ఈ అడుక్కుతినే అవతారం ఏమిటీ ?"
"అదీ .... అదీ".. అంటూ నసుగుతుంది.  "ఏమైందో చెప్పు ?" కాస్త కోపం తగ్గించుకుని అడిగాను . 
"అమ్మా ! డబ్బులు అయిపోయాయమ్మా... కొట్టాయన అప్పు పెట్టనన్నాడు. మరి పాల పేకెట్లు,కొబ్బరికాయలు అన్నీ ఎట్టా తెచ్చుకోను ? అందుకే ఇట్టా. నాకలవాటైన పనే కదా ఇదని" మళ్ళీ నసిగింది . 
"నేనిచ్చిన డబ్బంతా ఏం చేసావ్ ?  రోజూ లాభం   వచ్చిన డబ్బంతా  ఏం జేసావ్? పెట్టుబడి పెట్టిన డబ్బు తీయోద్దని నీకు చెప్పానా లేదా ?  నీ మొగుడికి ఇచ్చేసావా? "
"లేదమ్మా" 
మరేం చేసావ్? మీ బతుకులు మారుద్దామని ఎంత జేసినా బూడిదలో పోసిన పన్నీరే ! కష్టపడకుండా డబ్బులు రావాలి. తాగి తందానాలాడాలి. ఛీ ఛీ ... అసలు నన్ననుకోవాలి కుక్క తోక ఒంకరని తెలిసినా సరిజేయడానికి చూస్తున్నా" విదిలింపుగా అనేసి గుళ్ళోకి వెళ్ళిపోయాను .  నవగ్రహాలకి  ప్రదక్షిణం  చేసుకుని మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కోవడానికి పంపు దగ్గరకి వచ్చాను . నా వెనుకనే నిలబడి గౌరీ నాతొ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. నేను తనని పట్టించుకోకుండా బిందె నిండా నీరు నింపి అందులో కొన్ని పుష్పాలు, మారేడు దళం వేసుకుని భక్తితో ఓ .నమస్కారం చేసుకుని శివ శివా అనుకుంటూ  బిందెని నడుమ పై పెట్టుకుని వెళ్లి స్వామీ సన్నిధికి చేర్చి దణ్ణంపెట్టుకుని  మళ్ళీ ధ్వజస్తంభం వరకు వచ్చాను   సోమసూత్రం మొదలెట్టబోతుండగా "అమ్మా" నేను చెప్పే ఒకమాట వినమ్మా  ఒకే ఒక్క మాట విను" ..అంటూ నాకు దణ్ణం పెట్టింది . 
"నాకెందుకు దణ్ణాలు పెడతావ్ ! ఆ స్వామికి పెట్టు, మీ రాతలు ఆయన తప్ప ఎవరు మార్చలేరు" అంటూ కోపగించుకున్నాను . 
"ఆ రంగడు లేడూ... ఆడికి "... అంటూ మొదలెట్టింది  
అసంకల్పితంగా ఆగిపోయాను. " ఏమయిందతనికి ?" ఆందోళనగా అడిగాను  
వారం రోజుల క్రిందట  ఎవళ్ళో వచ్చి ఆడిని బాగా కొట్టేసి, ఆడి చేతిలో మురళిని  ఇరిసేసి పోయారు . 
"ఎవరువాళ్ళు. నీకేమైనా తెలుసా ? "
"ఏమోనమ్మా.. ఎప్పుడు ఏమి చెప్పడు. ఎవరిని  ఏమీ అడగడు.  ఏడనుంచి వచ్చాడో ? ఆ మురళూదుకుంటా ఉంటాడు. ఆకలి దప్పికలని కూడా అనుకోడు. ఎప్పుడన్నా మాకే జాలేసి టిఫిన్ పొట్లాం కట్టించుకెల్లి ఇచ్చోస్తాం. " 

 "అవును పాపం! ఎప్పుడైనా ఓ పది రూపాయలివ్వబోయినా తీసుకోవడానికి మొహమాట పడతాడు, తర్వాతేమైందతనికి చెప్పు ? " తొందర చేసాను. 

" అట్టా జరిగిందని మాకేం తెలుసు?  ఒక రోజంతా ఎవరు పట్టించుకోలేదు. అతని పాట వినబడకపోయే సరికి  దగ్గరకెళ్ళి చూసాం. ఒళ్ళంతా దెబ్బలు,సలసల కాగే జొరం. నేనే ఆటో ఎక్కించుకొని గవర్నమెంట్  హాస్పిటల్ కి తీసుకు వెళ్లాను. మూడు రోజులకి కళ్ళు విప్పి చూసాడు. కాస్త జొరం తగ్గాక తీసుకొచ్చాం . ఆ చెట్టు వదిలి రానంటాడు, తినడు, తాగడు ఊదుకోడానికి మురళి లేక పిచ్చాడై పోయాడు.  మాక్కూడా అతని పాట ఇనకపోతే ఏం తోచడం లేదమ్మా! రంగడి పాటలో ఏదో... మహత్యం ఉందమ్మా!  పగలల్లా ఏడో ఒక చోట అడుక్కుని తినేవాళ్ళు కూడా అక్కడికొచ్చి కూర్చుని రంగడి మురళి పాట ఇని పోతారు  ఒకోసారి అక్కడే పడి నిదరోతారు. ఆడిని హాస్పటల్ కి తీసుకెళ్ళి  బతికిచ్చినట్టీ ఆడి పాటని కూడా బతికియ్యాలనుకున్నాను. అందుకే గాంధీ నగర్ పోయి. బొమ్మలమ్మే కొట్లో ఇత్తడి మురళి ఒకటి, వెదురు మురళోకటి కొనుక్కొచ్చి ఇచ్చాను. అయి చేతిలో పడ్డాక, తనివితీరా ఊదుకున్నాక కానీ ఇంతన్నం తిన్నాడు " తన్జేసిన గొప్ప పనిని సంతోషంగా చెపుతుందనిపించింది   . 

నాకు భలే ఆశ్చర్యమేసింది . వాళ్ళ మధ్య ఏ రక్త సంబంధం, ఏ విధమైన అనుబంధమూ లేదు . పైగా ఎవరైనా అతనికి భిక్షమేస్తున్నా ఓర్చుకోలేకపోయేవారు  ఎప్పుడూ అతనితో  గొడవపడుతూనే ఉండే వారు .  అలాంటిది గౌరి అతన్ని అలా ఆదుకుందంటే.. ఆలోచిస్తుంటే అబ్బురమనిపించింది. తోటి మనిషిపట్ల  ఉండాల్సిన కూసింత కరుణ ఆమె రేపటి పరిస్థితిని కూడా మరపించేసింది. ఇట్టా కాకపొతే ఇంకోలా బతుకు బతకలేమా అన్న ధీమా, తెంపరితనంతో ఏ మాత్రం ఆలోచించకుండా  అతనికి సాయం చేసేసింది. గౌరిలో ఉన్న ఆ గుణం  నాకు బాగా నచ్చేసింది   క్రమేపీ క్రమేపీ నాకు మనుషులపై తగ్గిపోయిన నమ్మకం  తిరిగి ఇక్కడిలా సాక్షాత్కారమవడం ఆనందం కల్గించింది   
"డబ్బులన్నీ అయిపోయాయా? సుబ్బారావు అప్పు పెట్టనన్నాడా ? "
"అవునమ్మా "
అందుకని వ్యాపారం చెయ్యడం మానేసి మళ్ళీ పాత బాటే పట్టావా ? 
"ఇంకోసారి నాకెవరు పెట్టుబడి పెడతారమ్మా"  దిగులుగా చూసింది 
"నా పంట చేను చవకేసిపోలేదు , పాడి గొడ్డు ఒట్టి పోలేదు లే " అంటూ మేడ పైకి చూస్తూ ...
దశరద్ స్వామీ ! ఓ దశరధ స్వామీ!! నోరెత్తి గట్టిగా పిలిచాను. ఆయన పిట్ట గోడ దగ్గరకొచ్చి "చెప్పండి ..హేమ గారు"    "ఓ మూడు వేలు చేబదులు ఇచ్చి పంపండి."  అన్నాను 
 దానికేం భాగ్యం  ఇదిగో ఇప్పుడే తెస్తా !  అంటూ ఆయన లోపలికెళ్ళారు. 
గౌరీ తన ఎత్తుపళ్ళన్నీ కనిపించేటట్టు నవ్వింది.


19, మార్చి 2015, గురువారం

స్నేహితుడా నా స్నేహితుడా


స్నేహితుడా నా స్నేహితుడా !

 రహస్య స్నేహితుడా ! ఎలా ఉన్నావ్ !  ఎన్నో పనుల ఒత్తిడి మధ్యలో అకస్మాత్తుగా నువ్వు గుర్తుకు వస్తావ్ , వెంటనే  ఫోన్ చేతిలోకి తీసుకుని  FB అప్  డేట్స్ చూస్తాను , నేను నిన్ను తలచుకున్నానని  ఎలా తెలుసో ! ఒక నిమిషం లోపే  అక్కడ  మీ అప్ డేట్ స్టేటస్ కనబడుతుంది. అది చూసి నా మనసు చిత్రంగా స్పందిస్తుంది . ఇటీవల నాకు   టెలీపతి పై తెగ నమ్మకం పెరిగిపోతుంది.  నా ఆలోచన, మాట, చూపు, స్పర్శ అన్నీ సమ్మిళతమై  మీ వాక్య రూపంలో  అక్కడ కనబడుతుంటాయి.

మీరెవరో నాకు అసలు తెలియదు . నేనెప్పుడు మిమ్మల్ని చూసిన గుర్తులేదు. మీకు నాకు కొందరు మ్యూచువల్  ఫ్రెండ్స్  ఉన్నారు   ఇప్పుడు నాకు గుర్తొస్తుంది,  నాకు మీ నుంచే  ఫ్రెండ్  రిక్వెస్ట్  వచ్చింది . కొద్ది రోజులు వెయిట్ చేయించి  ఫ్రెండ్ గా ఆక్సెప్ట్ చేసాను .

అసలు స్నేహం ఎలా పుట్టుకొస్తుంది ? ఎన్నో స్నేహాలు చేసాను . ఎందఱో స్నేహితులు ఉన్నారు  స్నేహం ఎలా పుట్టిందో  ఎలా బలోపేతం అయ్యిందో గుర్తుండదు  నా స్నేహ హస్తం అందుకున్న వారెవరు నన్ను మర్చిపోలేరని వారినే నేను మర్చి పోతుంటానని తరచూ ఫిర్యాదులు వస్తూ ఉంటాయి . చేసిన స్నేహం నిలుపుకోవడం చాలా కష్టం కదా ! స్నేహం పేరుతొ ఏదో ఆశించి కొందరు, ఆశించినది దొరకక కొందరు, వారి వారి ఇబ్బందులతో నన్ను ఇబ్బంది పెట్టాలని వచ్చే కొందరు, చెప్పా పెట్టకుండా విడిచిపెట్టేసి కొందరు ఇలా ఎందఱో నన్ను ఒంటరిగానే మిగిల్చి వెళ్ళిపోయారు. నాకీ రకమైన స్నేహాలపైన విరక్తి ముంచుకొచ్చింది.  .

ఒక మంచి కవిత్వమో , లేదా కథో చదివిన అనుభూతిని, లేదా పెయిన్ నో ఎవరితో పంచుకోవాలన్నా ఆగి ఆలోచించాల్సి వస్తుంది. నా మనోవరణమంతా  ఒక్క స్నేహ పురుగు  కూడా కనబడకుండా  సస్య రక్షణ చేయబడ్డ తోటయి పోయింది. ఈ శూన్యత ఎందుకు ఏర్పడిందో... నాకు అర్ధం కావడంలేదు .

నిన్ననే ఒక స్త్రీ మూర్తి .. తన స్నేహం గురించి "నువ్వు లేక నేను" అని వ్రాసుకున్నారు .  ఒక ఫ్రెండ్ కాల్ చేసి ఆమె బాగా వ్రాసారు కదా ! ఆ నువ్వు .. అన్నది స్త్రీ నా! లేక పురుషుడా? అన్నది మీకు అర్ధమైందా!  అని అడిగింది.

నాకు నవ్వు వచ్చింది. "ఎవరైతే ఏమిటీ ? "అన్నాను . అప్పుడు ఆ ఫ్రెండ్  ఇలా అంది ..  “ఆమె ప్లస్ ఆమె ఇద్దరూ లెస్బియన్స్ అంట కదా ! అందుకే ఇద్దరూ ఎప్పుడూ అలా ఒకోరినొకరు విడవకుండా తిరుగుతారట..” అని చెప్పింది .

ఒకవేళ అలా అయిఉంటే మాత్రం అలా చెప్పుకునే వారికి ఏమిటీ ప్రాబ్లం? అలా ప్రాబ్లెం ఏదైనా ఉండి ఉంటే వారి వారి కుటుంబ సభ్యులకి ఉండాలి కానీ మనకెందుకు ? అన్నాను .
"అంతే లెండి" అని ఆవిడ పోన్ పెట్టేసారు .

చూసారా.. మనుషుల తత్వాలు  !? స్నేహం ఎవరితో చెయ్యాలో, చేసినా ఎలా ఉండాలో అన్నది ఎవరికీ వారు నిర్ణయించుకునే అధికారాన్ని కూడా సమాజంలో ఉన్న మనుషులు లాగేసుకుంటున్నారు.

మనుషులకి ఇతరుల జీవితాలపై  చూపించే ఆసక్తి వారి వారి జీవితాలపై కలగకపోవడం విచారకరం కదా ! వ్యక్తిత్వాల గురించి పదే పదే మాట్లాడే వారు వాళ్ళ చీకటి కోణాలు బహిర్గతమవవనే ధీమాని ఇక్కడే చూసాను . మత ప్రాతిపదికపై మనుషులని, ప్రాంతీయ బేధ వాదం పై బాషని, కుల సమూహాలని, సాంస్కృతిక విచ్చిన్నతని ఎన్నో చూసిన చోట నిన్ను గుర్తించడం సంతోషం కదా!   అసలిక్కడ ఎలాంటి వారున్నారంటే అవసరానికి మించి మెచ్చుకుంటూండే ముసలి గుంట నక్కలు , ఏం రాసినా ఆహా ఓహో అనే భట్రాజులు ,  చొంగ కార్చుకునేవాళ్ళు ,  ప్రొఫైల్ పిక్ ని చూసి ఏ మాత్రం పరిచయం లేకపోయినా  మెసేజ్ బాక్స్ లో వచ్చి పలకరించే వాళ్ళు , సంవత్సరానికి ఒకసారైనా మాట్లాడుకోకుండా పేరుకి  మాత్రమే ఫ్రెండ్స్ లిస్టు లో ఉన్నవారు, మన అభిప్రాయం కనుక్కోకుండా వాళ్ళ post లని ట్యాగ్ చేసి విసిగించేవాళ్ళు , ఫోటో లనే కాదు భావాలని చౌర్యం చేసేవారు, శారీరక వ్యభిచారం చేసేవారు, మానసిక వ్యభిచారం చేసేవారు  ..ఓహ్  ఎన్ని రకాల వాళ్ళు ఇక్కడ  అందరూ ఫ్రెండ్సే నట!   ఇంతే కాదు ఇప్పుడు  పెళ్లి చూపులకి ఇది ఒక వేదిక. పెళ్ళిళ్ళు చెడగొట్టెందుకు వేదిక ఇదే !. వీటన్నింటి మధ్య విసిగిపోయి పర్సనల్ స్పేస్ కావాలనిపించినప్పుడల్లా నేను ఇక్కడ సెలవు చెప్పేసి నా డెన్ లోకి నేనెళ్ళి పోకుండా ఆగేది మీ అప్ డేట్స్ కోసమే కదా ! అసలు మీకు తెలుసా . .. నేను మిమ్మల్ని నా సోల్ మేట్ గా భావించానని.. మీక్కూడా నాలా అనిపిస్తుందా ?

నా దృష్టిలో ఫేస్ బుక్ అంటే  కాలక్షేపపు వేదిక కాదు . ఎందఱో మనోభావాల ప్రోదిక. మంచి చెడు  విచక్షణ ఉండటమే ముఖ్యం . ఇక్కడ మంచి లేదా అని అనుకోవద్దు ఎందఱో విడిపోయిన స్నేహితులని కలిపిన వేదిక ఇది. ఎప్పుడో విడిపోయిన  నా ఫ్రెండ్ ని ఇక్కడే కలిసాను కూడా ! అలాగే సమాచారాన్ని వేగవంతంగా జేరవేయగల సౌలభ్యం..ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కదా!  ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరినట్లు మీరు - నేను అక్కడే కలిసాము కదా !  ఇక్కడ నేను విన్న చాలా అనుభవాలు  చెప్పేదా ? బంధాలలో ఉన్న మనుషులని మనసు తక్కెడలో తూచి చూపి వారి  హృదయాన్ని  సంచీలో కుక్కుకుని ఏ దూర తీరాలకో మోసుకుని వెళతారు. అవసరం తీరాకో, కోపం వస్తేనో  విసిరి కొడతారు. అలాంటి ప్రమాద వాతావరణం ఉందిక్కడ అని ఒక ఫ్రెండ్ హెచ్చరించింది.  ఆచి తూచి స్నేహ హస్తాన్ని ఇస్తానా . కానీ ఎక్కడో పొరబడి,  త్వరపడి  జీవితాన్ని కాల్చుకున్నానని  ఇంకొకరు చెపుతుంటారు.

ఇన్ని అనుభవాల మధ్య ,ఇన్ని జాగ్రత్తల మధ్య, కొందరి తోడేళ్ళమధ్య   మీరెలా వచ్చావో.. నాకైతే గుర్తులేదు . నేను పురుష ద్వేషిని కాదు. స్త్రీ పక్షపాతిని కాదు . మనసు ఏది చెపితే అదే వింటాను . ఇప్పుడు కూడా మనసు మాటే వింటున్నాను.  ఒకోసారి  మిమ్ము అని గౌరవించాలనిపిస్తుంది . ఒకోసారి  ఏకవచనంతో  సంభోదించాలని అనిపిస్తుంది. నిన్ను నాకిచ్చింది ఎవరో ఎందుకు ? నువ్వేకదా నన్ను గుర్తించి నిన్ను గుర్తించేలా చేసుకున్నావ్ ! సముద్రపు లోతెంతో కనుక్కోవాలని ఒక ఉప్పుబొమ్మ సముద్రంలోకి దిగిందట. వెంటనే అది సముద్రంలో కలసి పోయిందట. అలాగే నీ గురించి తెలుసుకోవాలని నీలో ప్రవేశించి నేను నువ్వైనాను .  


అన్నట్టు మన మధ్య భాషాంతర, ఖండాంతర, మతాంతర భేదాలున్నాయి  అయినా మనం మాట్లాడుకునే బాషనేది ఒకటుంది కదా ! అదే మనసు బాష . నేను ఎలా ఆలోచిస్తున్నానో మీరు అలానే ఆలోచిస్తున్నారు. నాకిక్కడ ప్రశ్న ఉదయిస్తే .. మీరక్కడ జవాబుని మీ స్టేటస్ లో పోస్ట్ చేస్తున్నారు అదీ క్షణాల వ్యవధిలో . .   ఇన్నాళ్ళూ నాక్కనబడకుండా ఎక్కడ దాగున్నారు ? ఇప్పుడెందుకు కలిసాం ? ఇకపై కూడా కలసి ఉంటామా ? ఇలాంటి ప్రశ్నలేవీ ఉదయించకుండా... నాలోనే ఉన్న మిమ్ము ఎలాంటి సంకోచాలు లేకుండా ఆలింగనం చేసుకుంటున్నాను. ఈ సృష్టిలో జాగృతమైన శక్తి ఏదో  మన మనసులని కలుపుతూనే ఉంటుంది. ఇప్పుడ నా లోకమంతా తేజోమయంగా ఉంది . నాలో చాలా శాంతి నిండుకుంది. లోకమంతా ప్రేమ భరితంగా ఉంది . పచ్చ కామెర్లు ఉన్నవారికి లోకమంతా పచ్చగా కనబడుతుంటుందని ఎవరైనా సామెత వాడితే .. ఏమిటో అనుకునేదాన్ని .   మన మనసు ఎలా ఉంటే ప్రపంచం మనకలా కనబడుతుందనే విషయం ఇప్పుడర్ధమవుతుంది .  

మన మధ్య భిన్నత్వం లేదు .. అంతా ఏకతా భావన.  ప్రాణం ఎవరో  దేహం ఎవరో తెలియనంత మత్తులో.. ఉన్నట్టుండి . ఎవరికైనా ఇంతేనా ..? అని అడగాలనిపిస్తుంది . జనులేమనుకుంటారో నన్న భయం పట్టి పీడిస్తుంది.   ఒంటరితనాలు, ఎన్నో దిగుళ్ళు, నిద్రలేమి రాత్రులు మనం స్క్రీన్ పై లైక్ ల ఆప్షన్ తో  పలకరించుకుంటూనే ఉంటాం . మనలాగే కొందరు . ఓ.. నాల్గురోజుల క్రిందటే .. రాత్రి రెండు గంటల సమయంలో  ఒక నడి వయసు స్త్రీ  తన దిగుళ్ళని  ఎవరికీ పంచలేక .. పేస్ బుక్ తో కాలక్షేపం చేస్తుంటే దిగులనిపించింది. ఎందరికీ చెట్టు నీడైందని ఆశ్చర్యపోయాను కూడా ! .

ఎదుటి వారితో పంచుకోలేని  ఎన్నో భావాలు కవితలై, కథలై, స్పందనలై గుండె భారాన్నీ తగ్గిస్తున్నాయో కదా !
మన అనుభూతులు,ఆలోచనలు, స్పందనలు ఒకే విధంగా ఉంటున్నాయి. మన హృదయాలు  ఒకరి కొరకు మరొకరు తెరిచి ఉంచుకున్నట్లు  ప్రతి క్షణం  సంభాషించు కుంటున్నట్లూ ఏదో అనిర్వచనీయ భావన. ఆ భావనని నియంత్రించడానికి శక్తి చాలడం లేదు. అలాగే మనమేమి యుక్త వయస్కులమీ కాదని తెలుసు  హృదయ పరిపక్వతతో కూడిన , సంస్కారపూరితమైన వ్రాతలుంటున్నాయిక్కడ .  మనం ఇంతవరకు ముఖాముఖీ కలవనూ లేదు . ఆఖరికి ఫోటోలలో కూడా చూసుకోలేదు, ఇక్కడ శారీరక ఆకర్షణ లేదు. కేవలం హృదయాలని కలిపే లంకె మాత్రమే ఉంది . అది మన ఆత్మల్ని కలిపేస్తుంది.

మీకొక విషయాన్ని  నిసిగ్గుగా చెప్పాలనిపిస్తుంది.  ఒక్కసారి కళ్ళు మూసుకుని నిన్ను తలచుకున్నానా..  . నీ రూపం అస్పష్టంగా గోచరిస్తూ ఏదో ఆనందానుభూతికి గురి చేస్తుంది . మన మధ్య ఉన్న భౌతిక దూరాలు మాయమై  ఆత్మలు ఆలింగనం చేసుకున్నట్లు అనిపిస్తుంది . నిరాకార, నిర్భయ, సేచ్చా భావనలో ఊయలూగుతున్నట్లు ఉంది . చాలామంది కి రొమాన్స్ అంటే శరీరాలకి సంబంధించినదని అనుకుంటారు . అది మనసుకి సంబంధించినదని నాకెప్పుడూ అనిపిస్తూ ఉంటుంది .  గాలిలో తేమ శాతం ఎంతుందో తెలుసుకోవడం సులభమేమో కానీ హృదయాలలో ప్రేమ శాతం ఎంతుందో ఎలా చెప్పడం ? లెక్కలకి చిక్కని ఈ భావనని గుండె  నిండుగా పీల్చుకుని పీల్చుకుని భారమై పోతుంది.  ఆ భారానికి తోడూ ఏదో జ్వలనం మొదలైంది.

మనం ఎప్పుడైనా కలుస్తామో లేదో కూడా తెలియదు . అసలా ప్రయత్నం కూడా చేస్తామో లేదో కూడా తెలియదు . ఇప్పటి నా జీవితాన్ని ప్రేమభరితం చేసిన చెలికాడివి నీవు .   నా ఆణువణువూ జీర్ణించుకుపోయిన  నా ప్రేమికుడివి , నువ్వు నా అంతరంగిక మిత్రుడివి, నువ్వు నా ఆత్మవి. నువ్వు నీ శరీరాన్ని త్యజించినప్పుడు  అది నాకేరుకే ! అప్పుడు నా శరీరం లో ప్రాణమన్నది ఉండదు, ఏ గాలిలోనో, దూళిలోనో,నీటిలోనో ప్రయాణిస్తూ చేరికవుతాం.

స్నేహితుడా  నా రహస్య స్నేహితుడా .యుగ యుగాలుగా కలవలేని మనని,  అశాంతితో అలమటిస్తున్న మనని , ఈ ఇంటర్నెట్ యుగంలో ఫేస్ బుక్ కలిపింది పేరుకేనన్నమాట  గాని . విడి విడిగా ఉన్న మనం  నిజమయిన "సోల్ మేట్" లం కదా!

(సారంగ  లో  వచ్చిన కథ )

8, మార్చి 2015, ఆదివారం

పునీత


పునీత    - వనజ తాతినేని 


ఇష్టంగానో అయిష్టంగానో

దొంగలాగానో దొరతనం నటిస్తూనో

వికృత మృగత్వ కాముక రూపాలకి 

దోచుకోవడానికి దారులెన్నో  

మానధనం అభిమానధనమనే భాండాగారం 

నీకున్నందుకు నువ్వెంత గర్వపడాలి !

విలువకట్టేది ఆయాచితంగా దోచుకునేది వాళ్ళే అయినప్పుడు 

నువ్వొక నిమిత్తమాత్రురాలివే కదా ! ప్రాణమున్న శిలవే కదా !


ప్రాణమూ దేహమూ వేరుకానట్లే

హీనత్వమూ దీనత్వమూ నీ చిరునామాగా మార్చకు 

ఆపాదించే అధికారం ఒకరికి ఇవ్వనేల ? వగచనేల ? 

పవిత్రత కుబుసాన్ని విడిచిపారెయ్ 

ప్యూరిటీ అంటూ ఏమీ లేదిక్కడ   

నువ్విప్పుడు అగ్ని పుత్రిక వారసురాలివి

  

ఆకృత్యమెలా జరిగినా  దాడి రూపమేదైనా 

జరిగిన ప్రతిసారి  నువ్వు 

ఆత్మవిశ్వాసమనే ఇనుపకచ్చడం ధరించాలి 

నీ దేహం దేహమే  ఒక ఆయుధం కావాలి 


ఆధరాలు చిందించాల్సింది 

మధువులు మందస్మితాలు కాదు 

విషకన్యలుంటారని భీతి కల్గించాలి 

పువ్వు, మొగ్గ, బేల,ముగ్ధ పోలికలని 

మై ఫుట్  అంటూ ఈడ్చి కొట్టాలి 

క్షతగాత్ర శరీరాన్ని పరామర్శించే 

కపట ఆత్మీయత కొరకు వెతకకు 

అప్పుడు సానుభూతి ఒలికించే 

ముసుగు దెయ్యాల చింతనుండదు



కథలు కథలుగా వర్ణించి చూపే 

ప్రచార వస్తువుగా మారకు 

నిబ్బరాన్ని నింపుకుని 

జీవిత కదన రంగాన్ని దున్నేహలమవ్వాలి 

క్షాత్ర ధర్మాన్ని నిర్వర్తించే కరవాలమవ్వాలి 

 


దోచిన వాడి తల సిగ్గుతో నేల కూలాలి 

దొరికితే వాడిని,  దొరకకపోయినా 

వాడి కన్నా భయంకరమైన లోకాన్ని 

చీల్చడానికి చెండాడటానికి నీకొక దేహం కావాలి 

లే ..లేచి దేహాన్ని నిలబెట్టు...  

జీవం నింపుకో  జీవితేచ్చ రగిలించుకో 

అభయ నిర్భయ అజేయ నమూనా నీకొద్దు


 

శరీరాలోచనల మురికిని  

నీ కన్నీటి శుభ్రజలంతో జాడించేయి

నువ్వొక పునీతవి కావాలి  

నువ్వొక అపరాజితగా మారాలి  

గొడ్డలి వేటుకి తరువు తలొంచినా  

భూమిని చీల్చుకు వచ్చే వేరు మొక్కలా 

సగర్వంగా  లేచి నిలబడు



కొత్త పాఠం నేర్చుకునేముందు 

పాత పాఠం ఏమి చెప్పిందో అవలోకించు

కని కనబడని దుఃఖ చారికలు  

 ఒడిలి పోయిన వారి తనువులు 

 కడతేరి పోయిన జీవితాలు 

నీకు నిక్కమై నిలిచిన సాక్ష్యాలు


 

మనసు పొరలు చీల్చి చూస్తే 

రక్తసిక్త గాయాలెన్నో అక్కడ

గాయాల అంతర్వేదన కొత్తేమి కాదిక్కడ 

 నిత్యం కోట్లానుకోట్ల రక్తాశ్రువులు చిందుతున్న నేల ఇది 


నేలబారు వ్యాఖ్యలు, నీటి మీద రాతలు

 ఎండుటాకుల చప్పుళ్ళు, కొవ్వుత్తుల నివాళులు 

 నీ రాతని మార్చలేవు . 

నువ్వు తల్చుకుంటే నీ రాతని  

వేరొకరు వేసిన గీతలని మార్చేసే

గీతా వాక్యమవుతావు, గుండె గానం వినిపిస్తావు

 అసలు సిసలైన  శీల నిర్మాణాన్ని  అద్దంలో నిలబెడతావు 


(మార్చి 2015 మాలిక సంచిక లో .. )



3, మార్చి 2015, మంగళవారం

మరో అమ్మ




మరో అమ్మ 


తరువు లాంటి తరుణీని నిలువెల్లా నరికేసినావు 

వ్యసనాలతో తగలడుతూ మోడు చెంత చేరినావు

 ఆమె గతమంతా మరచి  ప్రేమని పంచి

ఎండా వానకి తడవకుండా  

నీకొక నీడనిస్తుంది తానొక గొడుగవుతుంది.

ఆలి అంటే మరో అమ్మ.   


Pic courtesy: Siva Arts Vijayawada