"ప్రాతినిధ్య " ముచ్చటగా మూడో సంవత్సరంలోకి అడుగు పెట్టింది . 24 కథలతో మన ముందుకు రాబోతుంది . ఆ కథా ఉత్సవాన్ని మిత్రులందరితో కలసి జరుపుకోవాలనుకుంటుంది. మీరందరూ కూడా .. ఈ ఉత్సవానికి హాజరవుతారని మనసారా కాంక్షిస్తూ ... వివరాలు ఇదిగోండి ... ఆ వేదికపై తప్పకుండా కలుసుకుందాం . కథ ని పరిపుష్టం చేద్దాం .
23, ఏప్రిల్ 2015, గురువారం
కథా ఉత్సవం
"ప్రాతినిధ్య " ముచ్చటగా మూడో సంవత్సరంలోకి అడుగు పెట్టింది . 24 కథలతో మన ముందుకు రాబోతుంది . ఆ కథా ఉత్సవాన్ని మిత్రులందరితో కలసి జరుపుకోవాలనుకుంటుంది. మీరందరూ కూడా .. ఈ ఉత్సవానికి హాజరవుతారని మనసారా కాంక్షిస్తూ ... వివరాలు ఇదిగోండి ... ఆ వేదికపై తప్పకుండా కలుసుకుందాం . కథ ని పరిపుష్టం చేద్దాం .
18, ఏప్రిల్ 2015, శనివారం
నాల్గింట మగనాలి
నాల్గింట మగనాలి
గడప లోపల హింస
గడప బయట ద్వంస
రచించే జ్ఞానపీఠాలు వాళ్ళు
కౌగిళ్ళకారాగారాలు
మోటుసరసాల ధర్డ్ డిగ్రీలు
తప్పని సరి శిక్షలు
అంతెందుకూ కట్టు బానిసవీ
వారసులని కనే ఖార్ఖానావీ
జన్మాంత ఖైదీవీ కూడా నువ్వే !
ఆడపిల్లని అరణంగా రాసిచ్చిన మానవజాతికి
అమ్మవి నువ్వే బొమ్మవి నువ్వే !
********************
మేడమ్, జీ , సోదరీ , అమ్మా అంటూ
గౌరవం ఒలికిస్తూనే
వంకర ఆలోచనలు చేస్తూ ఉంటాడు
దేవతలా పూజించాలంటూనే
అవయవాల కొలతలతో
అంచనా వేస్తాడు
నాతిచరామి అంటూనే
నరకలోకాన్ని సృష్టిస్తాడు
సహభాగంగా గుర్తిస్తే చాలనుకుంటే
తోటి మనిషిగా గుర్తించడానికే
వెన్నుజూపుతాడు.
వాడినని ఏం లాభం ?
***********************
వేడికోళ్ళతో త్యాగనిరతులతో
నిన్ను కీర్తిస్తే కరిగి వరదై కరుణ జూపే
తాయివి నువ్వు.
తనువంతా కరిగించి మనసంతా కుదించి
ఓ పాత్ర లో ఒదిగేస్తావ్
వీడ్కోలు యాత్రలో నీ పై దండలై పూసేది ఈ త్యాగాలే
నీ జన్మ చరితార్ధం చేసిన గాధలని
తామ్రపత్ర లేఖలపై భద్ర పరిచి
యుగయుగాలు పాఠాలు బోధిస్తారు
స్త్రీ జాతి మణిరత్నంగా కీరిస్తారు
*********************
ఆకాశాన సగం మనం
అయినా మనల్నిఆణిచేసేది నిజం
ఆబల లంటూ అల్పంగా చూస్తే
అసహనం అంచులు దాటితే
ఉగ్ర కాళికనై ఉరుములు కురిపిస్తా
రుద్రభూమిలో రుధిరం తాగేస్తా
వేయి తలల ఆదిశేషు నై
విలువల వ్యాకరణం నేర్పిస్తా
నీ ధీరత్వం వీరత్వం అన్నీ
కూకటి వేళ్ళతో పెకిలిస్తా
13, ఏప్రిల్ 2015, సోమవారం
నాకో మనిషి కావాలి
6, ఏప్రిల్ 2015, సోమవారం
గంధపు చెక్క-సానరాయి
అసలే అమ్మాయికి ఆ వయస్సులో ఇష్టం లేని పెళ్లి . పైగా అబ్బాయి బట్టతల. ఎవరో గట్టిగా కట్టేసి బందీని చేసినట్లు ఫీలింగ్. పైగా అమ్మాయి వస్త్రధారణ పట్ల హెయిర్ డ్రెస్సింగ్ పట్ల అల్లుడి అభ్యంతరాలు . ప్రతి తరంలోనూ పెళ్లి తర్వాత స్త్రీకి వచ్చే అనేకానేక సమస్యలు. ఎందుకు అమ్మాయికి పెళ్ళి చేయడంలో తొందరపడ్డానా .. అనిపిస్తుందికూడా . వీటి గురించి ఆలోచిస్తున్నప్పుడు ... పేస్ బుక్ లో నా ఫ్రెండ్స్ లిస్టు లో ఉన్న వారెవరో లైక్ చేసిన పోస్ట్ని చూసాను. భలే ఆసక్తిగా అనిపించింది .అక్కడ ఇలా ఉంది
"మీ పిల్లలకు మీరెప్పుడైనా అన్నం తినిపించారా? లాల పోసారా.. లాలి పాడారా.. టాయిలెట్ నాప్కిన్స్ మార్చారా.. ఈ పనులన్నీ ఆడపనులనుకొని, మీ అమ్మపైనో ... ఆమె అమ్మపైనో ... భారం వేసేసి చక్కగా రెడీ చేసి ఇస్తే ముద్దులాడటం కాదు, పిల్లలు మీ రక్తం పంచుకు పుట్టిన వాళ్ళనీ వారిని పెంచడంలో మీ బాధ్యతా ఉందని తెలుసుకోవాలి కదా ! అమ్మపైనే భారం మోపి క్రెడిట్ అంతా ఆమెకే ఇవటం ఎందుకూ? తెలివిగా తేలికగా ఆ పనులు మీరే చేసేసి ఆ క్రెడిట్ కొట్టేసే ఆలోచన మీకేప్పుడైనా.. వచ్చిందా? ఇప్పటికీ రాకపోతే వెంటనే... ట్రై చెయ్యండి." అని నవ్విస్తూ ఇంకొక రోజు
"మీ బాధ్యతగా మీ భార్య తల్లి తండ్రుల్నిపలరించడానికి ఎప్పుడైనా వెళ్ళారా? వెంటనే ..వెళ్లండీ.. ఆడపిల్లలకు అత్తమామలను చూసుకునే బాధ్యత ఉందని బోధించినట్లు మగవాళ్ళకి మాత్రం బాధ్యత అప్పగిన్చొద్దూ ... దేనికైనా సమ న్యాయం ఉండాలి, సమన్వయం కావాలి. ఇలా చేస్తే మగాళ్ళని తప్పు పట్టే అవకాశమే ఉంటుందంటారా.. జామాతా దశమ గ్రహం అనే అపవాదుని తప్పించకునేందుకు అదొక మంచి అవకాశం. అల్లుడు కొడుకు లాంటి వాడని బిరుదు కొట్టేయోచ్చు అని ఓ శ్రేయాభిలాషి చెప్పినట్లుగా చెప్పే ...మాటలు .
ఎన్నోసార్లు పర్సనల్ మెసేజ్ పెట్టగా పెట్టగా ఒకటి రెండు సార్లు మాత్రమే సమాధానం వచ్చింది. నా వ్యక్తిగత వివరాలు చెపుతూ ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేయగా... ఫోన్ నంబర్ వచ్చింది.
ఒక రోజు అనుమతి తీసుకుని కలవడానికి వెళ్లాను. నాకు ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేసినపుడు మాత్రం పురుష స్వరమే సమాధానం ఇచ్చి అడ్రస్ చెప్పారు. నేను సంశయిస్తూనే... ఆ ఇంటికి వెళ్లాను. అందరిని సున్నితంగా ఒప్పించి, మెప్పించే వ్రాతలని వ్రాసేది ఆ పురుషుడే అనుకుంటూ అతను యంగ్ అండ్ డైనమిక్ గ ఉంటాడని తలపోస్తూనే.. ఆ ఇంటికి చేరాను. కాలింగ్ బెల్ మోతకి తలుపు తీసినతను మాత్రం ఒక.. డెబ్బైఐదు, ఎనభయ్యేళ్లు మధ్య వయసున్న వృద్ధుడు.
"రామ్మా! అంటూ .. నన్ను లోపలికి ఆప్యాయంగా ఆహ్వానించారు.
నవ్వేసి ....."నావెంట లోపలికి రా " అంటూ మరొక గదిలోకి తీసుకుని వెళ్ళారు. ఆయన వెనుకే నడిచిన నేను ఆయన చూపిన ఓ మంచం దగ్గర ఆగిపోయాను. ఆ మంచం పై ఓ వృద్ధురాలు పడుకొని ఉంది అప్పుడాయన ఇలా చెప్పారు " ఈమె నా భార్య దాదాపు పది సంవత్సరాలుగా పక్షవాతంతో బాధ పడుతోంది, నేను చిన్నప్పటినుండి ఏ పని పాట చేయకుండా పెరిగినవాడిని. ఉద్యోగం పురుష లక్షణంగా భావించి ఆఒక్కటి మాత్రమే చేసినవాడిని. ఒళ్ళు, మనసు కూడా అలసిపోయేలా చేసిచేసి అరిగిపోయిన్దావిడ. ఉన్న ఒక్క కూతురికి పెళ్లి చేసి అత్త వారింటికి పంపాము. చుట్టం చూపుగా తప్ప పట్టుమని పదిరోజులపాటు కూడా పుట్టింట్లో ఉండి కన్న తల్లికి సేవ చేయలేని పరిస్థితి ఆమెది. అర్ధాంగి అన్న పదానికి అర్ధంగా నిలిచిన ఆమెకి సేవ చేయాలనే తలంపుతో అన్నీ నేనే అయ్యాను. అప్పుడుకాని నాకు తెలిసి రాలేదు ఇంటి పనులు, వంట పనులు చేస్తూ ఇల్లు చక్కబరుచుకుంటూ ఉద్యోగం కూడా చేయటమంటే మాటలు కాదని. ఇంకొక విషయం చెప్పనా? అని... ఆగి ఆమె వంక చూసారు
ఆమె ఆయన వంక చూస్తుంది . అప్పుడు ఆయన ఇలా చెప్పారు " ఆమెకు మాట కూడా పడిపోయింది.ఫేస్బుక్ పేజీలో షేర్ చేసిన విషయాలన్నీ నా ఆలోచనలు కాదు.. ఆమే చెప్తుంది. కనురెప్పల కదలికలతో తన భావాన్ని నాకు చెప్తుంది, ఆమె చెప్పిన విషయాన్ని యధాతధంగా అక్కడుంచుతాను అంతే ! అని చెపుతుంటే .. అదొక అద్భుత విషయం అనిపించి ఆమె ప్రక్కకి చేరాను .
4, ఏప్రిల్ 2015, శనివారం
ఒక్క మాట - వంద వక్రభాష్యాలు
ఒక్క మాట - వంద వక్రభాష్యాలు
దీపికా పడుకునే మై చాయిస్ నాకేమి అభ్యంత్తరకరంగా అనిపించలేదు. చాలామంది ఎందుకంత ఉల్కిపడుతున్నారో కూడా తెలియదు . ఇదే మాట దీపిక పడుకునే కాకుండా ఓ..సంప్రదాయ నృత్యకళాకారిణి మాట్లాడి ఉంటె వేరే విధంగా వ్యాఖ్యానాలు ఉండవచ్చు కూడా ! ఇదంతా సినిమారంగంలో ఉన్న నటీనటుల విచ్చలవిడి తనంగా తీసుకునే సగటు మనుషుల ఆలోచనా విధానం. నటీనటులు,రాజకీయ నాయకులు,ఇంకా కొంతమంది పబ్లిక్ ఫిగర్ లు . వారిని అసభ్యంగా ఏమైనా అనవచ్చు ఒసేయ్, ఏమే ,ఎవతె ..ఇలా ఎలా అయినా అనవచ్చు అది స్వేచ్చ అనుకుంటారు (సంస్కార లోపం అని తెలియనంతగా ) అలాంటి అల్ప దృషి వారిపై ఉన్నప్పుడు వారి మాటలని అలాగే చూడటంలో ఆశ్చర్యం లేదు అంతకు మించి గౌరవాన్ని మనం ఆశించలేం !
గత ఇరవై ఏళ్ళుగా ఏ ఒక్క హీరోయిన్ అయినా అశ్లీలత లేకుండా నటించగల్గారా! కనీసం పబ్లిక్ లోకి వచ్చినప్పుడైనా సరైన వస్త్రధారణ చేసుకుంటున్నారా !? మన భారతీయ కుహనా సంస్కారుల ఆలోచనలో వారి పట్ల గౌరవభావం లేనప్పుడు వారి వ్యక్తిగత అభిప్రాయాలని ప్రకటించడం పట్ల ప్రజలకి గౌరవం కలుగదు గాక కలుగదు .
అలాగే స్వేచ్చకి విశృంఖలత్వానికి అతిసూక్ష్మాతిసూక్ష్మమైన సరిహద్దు రేఖ ఏమిటో అరకోడి మెదడు వారికి తట్టి చస్తే దీపికా వ్యాఖ్యలపై ఈ వక్రభాష్యాలుండవు.
జెండేర్ ఇన్సెన్సిటివిటి మఱ్ఱి ఊడల్లా విస్తరించి ఉన్న మన దేశంలో దీపిక మాటలు తేనే తుట్టని కదిలించినట్లే ! అంతకి మించి ఉమెన్స్ ఎంపవర్మెంట్ అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం అంతగా పొసగదు కూడా ! స్వేచ్చగా ఉండాలనుకోవడం వేరు - సాధించగల్గడం వేరు .
నా దృష్టిలో సాధికారత అంటే .. దీపిక చెప్పిన మాటలే కాకుండా ... నా మెదడుతో నేనే ఆలోచించి నిర్ణయం తీసుకోగలగడం, నన్ను నేను పోషించుకోవడానికి కావాల్సిన ద్రవ్యాన్ని నేనే సంపాదించుకోవడం , స్త్రీపురుష బేధం లేని చదువు, ఉద్యోగం , వృత్తి,వ్యాపార రంగాలలో నిలదొక్కుకోవడం, నా హక్కులని నేను కాపాడుకోవడం, ఎవరైనా నాపై అధికారం చూపించినట్లయితే వారిని ప్రశ్నించడం ,దౌర్జన్యం జరిపితే ఎదురుతిరిగి వారిని ఎదుర్కోగల సత్తా చేకూర్చుకోవడం, భద్రతగా బ్రతకాలనుకోవడం, పురుష సహకారం పొందగల్గడం, దేశ విదేశాలలో ఒంటరిగా ప్రయాణాలు చేయగలగడం ..ఇలా ఎన్నో !
ప్రపంచవ్యాప్తంగా మహిళాసాధికారత ఎండమావి లాంటిదే ! ఏ దేశానికి సంబంధించి ఆ దేశంలో ఎన్నో అభ్యతరాలు ఉన్నవి . మనదేశంలో అయితే మరీనూ ! మన సాంస్కృతిక వారసత్వాలని మహిళలపై తోసేసి అధిక శాతం పురుషులు మాత్రం పైలా పచ్చీసుగా తిరిగే వారు ఉన్నంతకాలం .. ఒక్క మాట కి వంద వక్రభాష్యాలు తప్పవు మరి .
(అది వ్యాపార ప్రకటన కావచ్చు లేదా అంతరంగ ఆవిష్కరణ కావచ్చు ఏదైనా దాడిని ఎదుర్కోవాల్సిందే )
2, ఏప్రిల్ 2015, గురువారం
దృష్టి కోణం
మన దృష్టి కోణం మారాల్సిన అవసరం ఉంది .
ఈ విషయం చెప్పడం మా ఇంటి నుంచే మొదలెడతాను .
అన్నయ్య - నేను - చెల్లి
మా చిన్నప్పటి సంగతి . నేను 5th class చదువుతున్నపటి సంగతి నాకు బాగా గుర్తు అన్నయ్య నేను ప్రతి రోజూ .. ఉదయాన్నే స్కూల్ కి వెళ్ళడానికి ముందు ప్రెవేట్ కి వెళ్ళే వాళ్ళం. ఉదయాన్నే లేచి పళ్ళు తోముకుని పరగడుపుతో పరుగెత్తేవాళ్ళం. సుమారు ఏడుగంటల వార్తలకి ముందు "మల్లాయ్'అనబడే మల్లికార్జున అన్నయ్యకి పావుసేరు గ్లాసు నిండా చిక్కటి పాలు , అలాంటి గ్లాస్ లోనే అందులో సగభాగం ఉన్న కాఫీని తీసుకుని వచ్చి ఇచ్చి మళ్ళీ మేము తాగేసిన ఖాళీ గ్లాసులని తీసుకుని వెళ్ళే వాడు .
నాకు పాలంటే అసలు ఇష్టం లేదు . nestle డబ్బాలలో వచ్చే కాఫీ పొడి మంచి సువాసనగా ఉండేది కాఫీ కూడా చాలా బావుండేది . అది నాకిష్టమని కాకుండానే .. అమ్మ అన్నయ్యకేమో పాలు,నాకేమో కాఫీ ఇవ్వడంలో తేడా అర్ధమయ్యేది కాదు. కాస్త బుర్రపెట్టి ఆలోచిన్చేదాన్ని . అలా ఆలోచించి ఆలోచించి ..చించి మా అమ్మని ఠపీ మని అడిగేసా ! అన్నయ్యకేందుకు పాలు ఇస్తున్నావ్ ,నాకెందుకు కాఫీ ఇస్తున్నావ్ ..అని
"అన్నయ్య మగపిల్లాడు బలంగా ఉండాలి. నువ్వేమో వాడికన్నా ఇప్పటికే ఎత్తు ఉన్నావ్ బలంగా ఉన్నావ్" ఎంతైనా మగ పిల్లాడేగా ఆన్నిటికి దిక్కు "అనేసింది .కాస్తో కూస్తో పుస్తకాలు చదివి ఆడపిల్లలకి చదువు కావాలి ,చదువు మూడో నేత్రం లాంటిదని బంధువులందరితో వాదనలాడి మా చదువులని అటక ఎక్కించకుండా కాపాడే అమ్మ ...కూడా అలా అందంటే .. ఆడ-మగ పిల్లల మధ్య తేడా ఎంత ఉందొ అప్పుడే అర్ధం అయ్యింది నాకు.
దాదాపు సమాజంలో చాలా మంది అభిప్రాయం ఆడపిల్లలు వేరు మగ పిల్లలు వేరు అని మరికొన్నేళ్ళకి గమనించాను . ఆ తేడాతోనే పెరిగాం కూడా ! నాకు పదహారేళ్ళ వయసప్పుడు కుటుంబ ఆర్ధిక పరిస్థితులు తారుమారైతే మా వాళ్ళకి వెంటనే నాకు పెళ్లి చేయాలనే ఆలోచన ,అన్నయ్య చదువు మానేసి ఏదో ఒక చిన్న ఉద్యోగం చేయడానికి వెళ్ళడం జరిగిపోయాయి ,ఇంకో రెండేళ్ళకి ఇంటర్మీడియట్ చదువు ముగించి డిగ్రీ చదువుకి వెళ్ళడానికి అనేక అభ్యంతరాల మధ్య చెల్లెలు చిన్న పిల్లలకి పాఠాలు చెప్పే పంతులమ్మ అయి కుటుంబానికి సాయపడినప్పుడు పెద్దవాళ్ళ భాధ్యతారాహిత్యాన్ని నిర్మొహమాటంగా ప్రశించినప్పుడు ..నాకు గర్వంగా ఉండేది . ఎందులో ఆడపిల్లలు తక్కువ అని . ఇప్పటికి అదే ప్రశ్న ఉత్పన్నమవుతుంది మా ఇంటి నుండి అందులో ఎలాంటి సందేహం లేదు కూడా !
పిల్లల పెంపకంలో వ్యత్యాసాలు చూపించడం నాకు అస్సలు నచ్చలేదు ,నాకు నచ్చలేదని ఏవీ జరగడం ఆగలేదనుకోండి
smile emoticon
. నేనైతే మాత్రం నాకు ఇద్దరు పిల్లలుంటే ఒకరు ఆడ- ఒకరు మగ అయితే ఇద్దరినీ ఒకే విధంగా పెంచి ఉండేదాన్ని .
ఆడపిల్లలు సైకిల్ తొక్కుతుంటే ,గోలీలాడుతుంటే , చెట్లేక్కుతుంటే ప్రతిసారి నువ్వు ఆడపిల్లవని గుర్తు చేయడం, మగ పిల్లాడని సమర్ధత లేకపోయినా ముందుకు నెట్టడం సమాజంలో ఇప్పటికి ఉన్న తేడాని గర్హించాలి .
అమ్మాయ్ ! నీకేం తెలియదు ,నువ్వూరుకో ..అని నలబైఅయిదేళ్ళు వచ్చిన కూతురిని మందలించే తల్లిదండ్రులు , నువ్వు నోర్మూసుకో ! నిన్నేవడైనా అడిగాడా ..ఉచిత సలహాలు ? అని మొగుడు చించుకోవడం, అమ్మా ! ఇవన్నీ నీకవసరమా ..అని స్మూత్ గా చెప్పే కొడుకులు ..పితృస్వామ్య భావజాలానికి ప్రతీకలు . వీరికి ఆడవాళ్ళు ప్రశ్నిస్తే సహించలేరు , జ్ఞానవంతులైతే సహించలేరు, మీతో మేమూ సమానమంటే భరించలేరు . ఎప్పటికి అణుకువగా ఉండాలి , తమ సహాయాన్ని అర్ధించాలి ,తమ వెనుకే నడవాలి. పొరబాటున కూడా స్వతంత్ర్యభావాలని వ్యక్తీకరించకూడదు. ఇవే భావజాలాలు ఇంకా రాజ్యాలేలుతున్నాయి.
ఎవరైనా ఈ మూసదోరణిని ధిక్కరిస్తే ..వాళ్ళు అసలు ఆడవాళ్ళు కానే కాదు అని ముద్ర వేసేస్తారు . . ఆడుగడుగునా ఆధిపత్య భావజాలంతో తమ మాటే నెగ్గాలనే పంతం ఉన్నవారు ఉన్నప్పుడు ఇంట్లోనే కాదు చట్ట సభల్లోనూ ..స్త్రీల వైఖరి చాలామందికి నచ్చదు.
ఆడవాళ్ళు హుందాగా,అమాయకంగా, అతివినయం చూపిస్తూ ఉంటే వారు మన సంస్కృతికి వారదులు . పురుషుల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తే ,ధిక్కరిస్తే... రౌడీ...లు . సమయమేదైనా, సందర్భమేదైనా ఆడవాళ్ళ బాహ్య ప్రవర్తన వెనుక అతర్లీనంగా వారిపై ఉండే అణచివేత ప్రభావం ఉంటుంది అది ఇల్లు అయినా చట్ట సభలైనా ! ప్రతి ప్రేలుడు వెనుక రాపిడి ఉంటుంది . ఆ కోణంలో మనం చూడటం నేర్చుకోవాలని నేన నుకుంటాను . ఒకవేళ ఆడవాళ్ళ ప్రవర్తన వెనుక అజ్ఞానం,అహంకారం,మితిమీరిన విశ్వాసం కూడా ఉండి ఉండవచ్చు ..నేను కాదని అనలేను. వ్యక్తుల బలహీనతలు అందరి వ్యక్తుల ఆలోచనాదోరణికి,ప్రవర్తనకి కొలమానం కాదు, అందరూ ఒకటి కూడా కాదు . అది గమనించాలి .
ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే .. ఇంకా ఇంకా ఆడ-మగ తేడా ఉంది ఉంటుంది కూడా ! అలాగే నాణేనికి రెండోవైపు ఉంటుంది అది చూడటం మర్చిపోవద్దు . అభిమానం పారదర్శకంగా చూడటానికి అడ్డుపడుతుంది . కనులకి క్రమ్ముకున్న పొరలు విప్పి చూడాలి అప్పుడే తెలుస్తుంది మన దృష్టి కోణం ఏమిటో !.
అలాగే స్త్రీ విద్య గురించి ... మా దగ్గర బంధువు ... ఇలా అన్నారు .
"ఆడాళ్ళు చదివితే మాట వినరు " ఆమాట వినగానే నాకు చప్పున నవ్వు వచ్చింది ఇలా అనే మూర్ఖ శిఖామణులు 60% ఉన్నారు . అలా అనేవారి భార్యలు ఉద్యోగమో.. వ్యాపారమో .. చేస్తూనే ఉంటారు . కానీ సమాజంపై మాత్రం వారి అభిప్రాయం ఇలా ఉంటుంది
ఆర్టికల్ 21 ఎ ప్రకారం 14 సంవత్సరాల వరకు ఉచిత నిర్భంద విద్యాహక్కు ఆర్టికల్ 350(ఎ) ప్రకారం ప్రతి విద్యార్థి మాతృ భాషలో విద్యను అభ్యసించే హక్కు ఉంది.కానీ మన పిల్లలకి మాత్రుబాషలో విద్యావిధానం అమలు జరపడంలేదు . తల్లిదండ్రులే వేలం వెర్రిగా ఆంగ్లమాధ్యమం వైపు పరుగులు తీస్తున్నారు . ప్రభుత్వ పాఠశాలల్లోడ్రాప్ అవుట్స్ లేకుండా చేయడానికి 6- 14 మధ్య ఉన్న పిల్లలకి ఉచిత నిర్భంద విద్య అమలుచేయడానికి విద్యా కమిటీలు ఏర్పాటు అయ్యాయి. అందులో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు, సాంఘికసేవా సంస్థల కార్యకర్తలని భాగస్వామ్యం చేసారు గ్రామీణ ప్రాంతాలలో ఈ విద్యా కమిటీల పనితీరు మెరుగైనదనే చెప్పవచ్చు .
నిరక్షరాస్యతని పారద్రోలాలని అందరికి విద్య అందించాలని ప్రభుత్వం ఇంత కృషి చేస్తుంటే చదువుకుని పెద్ద పెద్ద ఉద్యాగాలు చేస్తూ "ఆడాళ్ళు చదివితే" అంటూ స్టేట్ మెంట్ ఇస్తున్నారు
లింగ బేధం లేకుండా అందరికి చదువు కావాలని కోరుకోవడం పోయి '"ఆడాళ్ళు" అణగద్రోక్కాలి అనే భావన ఎందుకో బొత్తిగా బోధపడటంలేదు . అసలు ఆడవాళ్ళు ఇంతలా చదువుకోవదానికి వెనుక ఎన్నెన్ని అభ్యంతరాలు ఎదుర్కొన్నారో .. తెలుసా? స్త్రీ విద్యాఆవశ్యకత గురించి 112 ఏళ్ళ క్రితమే భండారు అచ్చమాంబ గారు " ధన త్రయోదశి" అనే కథలో చెప్పారంట . వంద ఏళ్ళకే తిరోగమనంలో పడిందా మహిళా విద్య?
అయినా భార్యల చదువులని, సమాజంలో ఇతర స్త్రీల చదువులని ఎద్దేవా చేసే పురుష ప్రపంచం వారి వారి అక్క చెల్లెళ్ళు, వారి పుత్రికా సంతానం చదువుల పట్ల సానుకూల దృక్ఫదంతో ఉండటం కొంత సంతోషం కల్గించే విషయమే!
ఎవరైనా స్త్రీ విద్య గురించి స్త్రీల గురించి హేళనగా మాట్లాడితే ఒప్పుకోకండి . తగిన సమాధానం చెప్పాలి కదా !
స్త్రీ విద్యని ప్రోత్సహిస్తూ,గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ స్త్రీలకి సహకారం అందించాలని కోరుకుంటూ .. ఈ పోస్ట్ .