20, ఏప్రిల్ 2016, బుధవారం

అయ్యోరమ్మా! రొవొంత ఇటొచ్చి ఉత్తరం ముక్క చదివిపో ..

అయ్యోరమ్మా! రొవొంత ఇటొచ్చి ఉత్తరం ముక్క చదివిపో .
శశీ ఎలా ఉన్నావ్ ?

ప్రేమ నిండిన  నీ పిలుపుతో ప్రియమైన అక్కని చేసావు నన్ను. ఆ పిలుపు నాకెంత సంతోషమో !

నాలుగేళ్ల క్రిందట నువ్వు నన్ను చూడాలని  మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఎంత సంతోషించానో ! నాలుగేళ్ళు అలా అలా..  గడచిపోయాయి . మీ అబ్బాయి నివాస్ చదువు పూర్తయింది కదా !
అమ్మాయి హేమకి   పెళ్ళి చేసినప్పుడు నాకూ ఆత్మీయంగా  ఆహ్వానం పంపావు. నెల్లూరు అనగానే నాకెంత సంబరమేసిందో !   నువ్వు కాకుండా, నాకెంతో ఆత్మీయురాలైన "సామాన్య " ఉంది. ఇంకో సుగుణ ఉన్నారు, ఇంకా కొంతమంది స్నేహితులు ఉన్నారు.  వీలుపడక రాలేకపోయాను కానీ .. ఈ టీచరమ్మ అప్పుడే అమ్మాయికి పెళ్లి చేస్తుంది ఏమిటీ ? అమ్మాయికి చిన్న వయసే కదా ! తను కూడా బాగా చదువుకుని ఉద్యోగంలో చేరి కొంచెం ఆర్ధిక స్వావలంబన  ఆత్మవిశ్వాసంతో నిలకడగా నిలబడినప్పుడు కదా పెళ్లి చేయాలి ? , తనేమో చక్కగా చదువుకుని టీచరమ్మగా ఉంటూ అమ్మాయికి పెళ్లి చేయాలని తొందరపడం బాగోలేదు అనుకున్నాను. మళ్ళీ అంతలోనే అంత మంచి సెబ్బర కనుక్కోకుండా, అన్నీ వివరంగా తెలుసుకోకుండా శశీ తొందరపడదులే అనుకున్నాను.

అమ్మాయికి  బాల్యజ్ఞాపకాల గురించి హేమ మాధురి మధురిమలు పేరిట నువ్వు వ్రాసిన జ్ఞాపకాలు ఎంత మధురంగా ఉంటాయో శశీ ! బిడ్డల ప్రతిదశని, ఆ ముద్దు ముచ్చట్లని అమ్మ గుర్తుంచుకున్నంతగా ఇంకెవరికి గుర్తుండవేమో కదా ! ఇక్కడ సందర్భం కాదు కానీ .. ఒకటి చెప్పుకోవాలి. మంచి విద్యావేత్తగా చక్కని వక్తగా పేరు తెచ్చుకున్న లక్ష్మీ పార్వతి గారు  సవతి కూతురికి పెళ్లి చేసి పంపేసి తను మాత్రం ఉన్నత విద్య చదువుకుందని పత్రికలలో చదివాను. పిల్లలకి కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే శక్తి రావాలి కదా ! తొందర తొందరగా  పెళ్లి చేసి భాద్యత తీర్చేసుకోవాలనుకుంటే తర్వాత అమ్మాయిలకి వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు వస్తే ఇతరులపై ఆధారపడి బ్రతకడం ఎంత కష్టం చెప్పు ?

అందుకే ఆడపిల్లలకి విద్య యొక్క ఆవశ్యకత తప్పని సరిగా తెలియాలి. ఇప్పుడు పిల్లలేమో చదువుకోమని కాలేజీలకి పంపితే ప్రేమ, అవాంచిత గర్భం, మౌనపోరాటం లేదా ఆత్మ హత్య ఎక్కడ చూసినా ఇవే కనబడుతుంటే ఇదా మనం సాధించిన అభివృద్ధి అని దిగులు కల్గుతుంది.

ఒకపక్క స్త్రీలకి విద్య అందుబాటులోకి వచ్చి వందేళ్ళు కూడా కాలేదు అప్పుడే స్త్రీల చదువులపట్ల ఎంతో  వ్యతిరేకం .  ఎంత చదివినా ఇల్లు చక్కబెట్టుకోవడం తప్పదు కదా అని తేలికైన మాటతో తీసిపారేస్తారు. ఇంకో పక్క  భారతీయ స్త్రీల వేష భాషల్లో ఆహార్యంలో ఎంతో  మార్పు వచ్చింది ముఖ్యంగా  వస్త్రధారణలో ఎంతో  మార్పు వచ్చింది.  సంప్రదాయబద్దంగా కట్టే చీరకట్టు, చుడీదార్ స్థానంలో ఫ్యాంట్ షర్ట్ వచ్చేసాయి . మళ్ళీ అక్కడినుండి కూడా డీ గ్రేడ్ అయి నిక్కర్ లలోకి దిగిపోయారు. మా విజయవాడలో కూడా అమ్మాయిలు ఐమాక్స్ దియేటర్స్ లోనూ, షాపింగ్ మాల్స్ లోనూ చాలా అధునాతనంగా కనబడుతున్నారు. నాకేమో ఇదంతా పశ్చిమ దేశాలనుండి దిగుమతి అయిన సంస్కృతి అయినప్పుడు పశ్చిమ దేశాలవాళ్ళు తీసుకున్నంత తేలికగా కొన్ని విషయాలని కొట్టి పారేయలేక పోతున్నాం కదా! అనుకుంటాను. వేష భాషలలో వచ్చినంత ఆధునికత ఆలోచనల్లో రాలేదు కాబట్టే  బయటకి వెళ్ళిన అమ్మాయి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేంతవరకూ అమ్మ చూపులు వీధి చివరనే అతుక్కుని ఉంటున్నాయి.

ఇంకేమిటీ శశీ ... నీ చిన్నప్పటి పొలం కబుర్లు చాలా బావుంటాయి. వ్యాఖ్య పెట్టలేకపోయినా చదివేసి వస్తూ ఉంటాను. మాది కూడా వ్యవసాయమే వృత్తిగా చేసుకుని, దానికే   ప్రాధాన్యతనిచ్చే  కుటుంబం కదా ! మా పంటపొలాలు కూడా వాణిజ్య భూమిగా మారిపోయే రోజులు దగ్గరికొచ్చాయి. అగ్రికల్చర్ జోన్ అంటే రైతులే నిరసన తెలుపుతున్నారు. ఇక పంటలు పండేది ఎక్కడ? అన్నం తినేటప్పుడు చేనుని, దాహంతో నీరు తాగేటప్పుడు నదికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని మా అమ్మ చెప్పేది. ఈ అతివృష్టి అనావృష్టిల దోబూచులాట కాలంలో రైతు కునారిల్లిపోతున్నాడు. ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలు. మనసు వికలమైపోతుంది.  ఈ సంవత్సరం కృష్ణ డెల్టా లో కూడా పంట వేయలేదని 24 ఏళ్ళ తర్వాత మళ్ళీ మళ్ళీ అలాంటి కటకటని చూస్తున్నామని మా ప్రాంత  రైతులు చెపుతున్నారు. కృష్ణ, గోదావరి జలాలన్నీ  ఈ జిల్లాలే మింగేస్తున్నాయని రాయలసీమ ప్రాంత ప్రజల ఆవేదన వింటున్నాం.  ఇలాంటి  వాతావరణ పరిస్థితుల్లో పాలకులు మాత్రం ఏం చేస్తారు ? మనిషి చేసే పర్యావరణ నాశనానికి అంతం ఉందా ?

పత్రికలలో ఒక వార్త చూసినప్పుడు  నువ్వే గుర్తుకు వచ్చావ్ ! తమిళనాడులో శ్రీ వరిని  పండించి అధిక దిగుబడి సాధించిన ప్రసన్న భౌతికశాస్త్ర ఉపాధ్యాయురాలు అంట. అర ఎకరం పొలంలో  నలబై బస్తాలు పండించి రికార్డ్ సృష్టించారు . మహిళలు క్లాస్ రూం లో పాఠాలు చెప్పడమే కాదు పంట పొలంలో దిగి వ్యవసాయం చేసి ఉత్తమ ఫలితాలని అందిస్తున్నారు . వ్యవసాయ ప్రాధాన్యమైన మన దేశంలో పొలం గురించి పరిచయం లేనిదెవరికి?  పచ్చని పైరుని చూసి పొంగిపోవడం,  పాడి పశువులని ప్రేమగా చూడటం మన గ్రామీణులకి సహజంగా అమిరిన గుణం. అది ఒకరు నేర్పాలా ఏమిటీ ?

అయిదవ తరగతి నుండి వ్యవసాయాన్ని కూడా తరగతి పాఠంగా చేర్చి వ్యవసాయ ప్రాధాన్యం గురించి, కుటీర పరిశ్రమల గురించి తెలియజెప్పాల్సిన అవసరముంది శశీ ! మన విద్యావిధానంలో చాలా మార్పులు రావాలి. రాబోయే కొన్ని సంవత్సరాలలో వ్యవసాయ ఉత్పత్తులే పెద్ద పరిశ్రమగా మారే అవకాశం ఉందంట. ఆధునిక వ్యవసాయం పట్ల మనవాళ్ళకి అవగాహన ఏర్పడాలి . మా ఇంటి దగ్గరలోనే ఆర్గానిక్ ఫార్మింగ్ మొదలెట్టారు. ఒక స్టోర్ కూడా పెట్టి కూరగాయలు అమ్ముతున్నారు. ఖరీదు చాలా ఎక్కువ. మనలాంటి మధ్య తరగతి వాళ్లకి అందుబాటులో లేవు. పెరటి తోటలు ఇప్పుడు లేవు కదా ! అలాగే రూఫ్  గార్డెనింగ్  చేసుకోవడానికి అవకాశంలేని అగ్గిపెట్టె గదులున్నఇళ్ళు  అయిపోయాయి. ఇక మొక్కలని ఎలా పెంచుకోగలం ? సూర్యోదయం, సూర్యాస్తమయం, వెన్నెల  ముఖం చూడని బతుకులు అయిపోతున్నాయని దిగులుగా ఉంది.  ఇకపై మా ప్రాంతం వాళ్ళూ ..  ప్రకృతి ఒడిలో సేదతీరాలంటే ... ఓ  పాతిక కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. ఎక్కడ చూసినా బిల్డింగ్ లే ! నెల్లూరు కూడా అంతే కదా ! ఎంత పెరిగిపోయింది! కానీ అంతే ఇబ్బంది ఉంది కదా? మొన్న వర్షాలకి నిండా మునిగి పోయింది కదా, అలాంటి అభివృద్ధి అవసరమా అనిపించడం లేదూ !?

అందరూ పచ్చగా  ఉండాలంటే ... భూమికి పచ్చని  రంగేసినట్టు పాటు పడాల్సింది మనమే కదా ! మా అబ్బాయీ, నేనూ అనుకుంటూ ఉంటాం. ఇంకో అయిదారేళ్ళకి  తను ఇక్కడికి వచ్చేస్తాడు. పాలీ హవుస్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని తెగ ముచ్చట పడుతున్నాడు. భూముల ధరలు చూస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి. గ్రౌండ్ వాటర్ లెవల్స్ పాతాళంలో ఉన్నాయి, పదెకరాలు పొలం కొనాలంటే అమెరికాలో పదేళ్ళు కష్టపడ్డా ఇక్కడ భూమి రాదు ... ఎక్కడో మారుమూల కొనుక్కోవాలి, అక్కడ కూడా మంచినీళ్ళు కొనుక్కుని తాగుతున్నారు. నువ్వేం వ్యవసాయం చేస్తావ్ ? అని వాస్తవాలు చెపుతాను .  అవునా అమ్మా అంటూ  దిగులు పడతాడు.

ఇంకేమి వ్రాయాలబ్బా అని ఆలోచిస్తున్నా. ఉత్తరం వ్రాయకముందు  ఏవేవో వ్రాయాలి అనుకున్నాను కానీ వ్రాయడం మొదలెట్టాక అవేమీ గుర్తులేవు. ఎప్పుడో నువ్వు అడిగిన ప్రశ్న గుర్తుకు వచ్చింది.

ప్రేమంటే ఏమిటని అడుగుతావు కదా శశీ ! నాకు కూడా అదేమిటో తెలియదు. అమ్మ ప్రేమ, బిడ్డపై ప్రేమ, ఒక మంచి భావం పై పుట్టే తాత్కాలిక ప్రేమ తప్ప ప్రేమంటే ఏమిటో నాకూ అనుభవం కాలేదు శశీ !
ప్రేమంటే భాద్యత , మనని నమ్మినవారి భవిష్యత్ ని మనం కలగనడం. అవతలివారు ద్వేషించినా ప్రేమిస్తూనే ఉండటం అని నేను అనుకుంటాను .

నేనున్నానని తోడయ్యేది..నీవే నేనని నీడయ్యేది...అమ్మగా చల్లగా కనిపించేది.. వేటూరి గారి గీత రచన కూడా నాకు చాలా నచ్చుతుంది.

బిడ్డపై తల్లిదండ్రులకి ఉన్న ప్రేమని ఎవరూ శంకించలేరు, అదే జీవిత భాగస్వామి ప్రేమ ఎప్పుడూ శంకతోనే ఉంటుంది.  యువతీ యువకుల ప్రేమ ఎప్పుడూ ఆకర్షణ తోనే ముడిపడి  ఉంటుంది  అందుకే ప్రేమించి పెళ్లి చేసుకున్నవాళ్ళ పెళ్ళిళ్ళూ  విఫలమవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇద్దరూ ఉద్యోగాలు చేయాలి, ఇద్దరూ ఇంటిపని, వంటపని మిగాతాపనులన్నింటిని పంచుకోవాలి.  ఆడ పని మగ పని అంటూ ఏమి ఉండకూడదు. గౌరవం ప్రధానం. పురుషులు ఏమంటారో తెలుసా ! అన్నీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పడేస్తున్నాం అది ప్రేమ కాదా అంటారు . ఆ పడేయడంలో విసుగు,అహంకారం ఉంటాయి.  ప్రకటితం కాని ప్రేమ ఎక్కడో అట్టడుగున తొక్కేసి ఉంటుంది. యాంత్రిక జీవనంలో ప్రేమ దొరికే చాన్స్ ఉంటుందా ?  దొరకని దానికోసం ఆవేదన చెందటం ఎందుకూ అని  అనిపిస్తూ ఉంటుంది.


ఈ మధ్య చాలామంది స్త్రీలు  ముక్కుపచ్చలారని బిడ్డలని ఉరి వేసి చంపేయడమో, నీళ్ళలో తోసేసి చంపేయడమో చేసి వారు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కన్నతల్లికి  బిడ్డలని చంపేసే కర్కశత్వం ఎలా వచ్చింది అని ఆశ్చర్యపడుతున్నాం. కానీ వారి మరణం వెనుక దాగిన  పురుషుల నిర్లక్ష్యాన్ని, ద్రోహ చింతనని మనం అంతగా పట్టించుకోవడం లేదు. వైవాహిక జీవితంలో అసంతృప్తులు మగవాడిని ప్రక్కదారి పట్టించడం జరుగుతుంది. ఆడవాళ్ళు తక్కువేం కాదు. ఇలా కుటుంబ సంబంధ భాంధవ్యాలు దెబ్బతినడం మూలంగా నిరాశతో, నిసృహతో నిలువునా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి మరణాలు సమాజానికి విసురుతున్న  సవాల్ అన్నమాట . భర్త అలా చేస్తే భార్య నేను ఇలా చేసి చూపిస్తాను అని చెప్పడమన్నమాట.

మగవాళ్ళ దుర్వ్యసనాలు, బహుభార్యాతత్వంతో వర్దిల్లుతుంటే ఆ సంసారాన్ని ఈదటం తలకి మించినబరువు. పిల్లల చదువులు గుండెల్లో  పెద్దబండ. పాపం ఇక ఆ స్త్రీ ఏం చేయగల్గుతుంది ? ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే గుండె బరువెక్కుతుంది.  దైర్యంగా బ్రతుకుని ఈడ్వాలని వీరికి ఎవరు చెపుతారు ?  నిజంగా భర్త భార్యని ప్రేమిస్తే బిడ్డలు గుర్తుంటే ఇలా వ్యసనాల పాలవుతారా ? కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తారా?

నాకు తెలిసిన ప్రేమ ఏమిటంటే  జీవిత భాగస్వామిని చచ్చేదాకా ప్రేమించడమే ! అంతకన్నా ఇంకేదైనా ప్రేమ బలమైనది ఏమైనా కల్గితే, ఒకవేళ  ఉంటే ఇతరులని ఎక్కువ కాలం మోసగించకుండా క్లారిటీతో హుందాగా, గౌరవంగా ప్రక్కకి తొలగడమే ! మొదట్లో జీర్ణం చేసుకోవడం కష్టమే కానీ దీర్ఘకాలం మోసపోయి భంగపడటం కన్నా ఇదే మంచిది కదా ! ఓల్గా గారి  మానవి నవలలో  ఇలాగే జరుగుతుంది. పాపం వసంత అని అనిపిస్తుంది. ఆ  నవల  నువ్వు చదివావా?  ఆ నవల చదవబట్టే నేను ఇలా ఉన్నాను శశీ ! ఒక నిజం చెప్పనా ?  నెల్లూరు అంటే నాకు కూడా ఇష్టమే,  పదిహేడేళ్ళు నిండి నిండగానే పెన్నా తీరానికి కొత్తకాపురానికి వచ్చాను. అక్కడ పంటపొలాలు, పచ్చని ప్రకృతి, మంచి మనసులు అన్నీ ఓ మంచి  జ్ఞాపకమే! కాకపొతే ఓచేదు జ్ఞాపకం నా జీవితకాలం  వెంటాడేది కూడా ఉంది. నా జీవితాన్ని కాజేసిన దొంగది ఆ నెల్లూరంటే నాకెందుకో విరక్తి.ఇంకెప్పుడూ నెల్లూరు రాకూదదనుకున్నాను. రాను కూడా !

నాకు పురుషులంటే ద్వేషం ఏమీ లేదు. కానీ మన చుట్టూ ఎంతోమంది పురుష అహంకార పదఘట్టనల క్రింద నలిగి పోతున్నారు. మన తరం స్త్రీలు ఓర్చుకున్నారు. కానీ ఇప్పటి తరం ఓర్చుకునేటట్టు లేరు. అందుకే మగవాళ్ళు తరతరాలనుండి అంటిపెట్టుకున్న భావజాలాన్ని వదిలించుకోవాలి. నేను కథలు వ్రాస్తున్నది కూడా అందుకే ! నేను వ్రాసే కథలన్నీ నిజజీవిత శకలాలపైనుండి  లేచి నిలబడి ఆత్మస్యైర్యంతో ముందుకు సాగాలనే సందేశం ఉండేటట్టు, స్త్రీలు తమ తప్పులు తానూ తెలుసుకునే విధంగానూ ఉండేటట్టు వ్రాస్తున్నాను.

ఈ మధ్య  నేను చదివిన కథలలో నాకు బాగా నచ్చిన కథలు సత్యవతి గారి కథలు. నువ్వు కూడా  తప్పకుండా చదువు శశీ ! దాదాపు ఒక అరవై డెబ్బై ఏళ్ళ నాటి నుండి స్త్రీల జీవితాల్లో వచ్చిన మార్పులని చక్కగా చూపించారు. ఆ పుస్తకంలో ఉన్న కథలన్నీ స్త్రీల అస్తిత్వ పోరాటంలో  విజయం సాధించి తమ కన్నా ముందు తరం స్త్రీలకి మంచి భవిష్యత్ ఇవ్వడానికి ప్రయత్నించి విజయం సాధించిన కథలే ! చాలా సునిశితమైన పరిశీలనతో పురుషులని తిట్టకుండానే వ్యంగంగా వ్రాసిన కథలవి.

మన ముందు తరాలవారికి మనమేం అందించగలమో లేదో .. ఇప్పటి పిల్లలకి ఏం చేపుదామన్నా ..నీకేమీ తెలియదు నువ్వూరుకో అంటారు తేలికగా. మనసు చిన్నబోతుంది అంది ఒక స్నేహితురాలు. తనకి ఇద్దరూ అమ్మాయిలే !  తల్లి అనుభవం, ముందు చూపు పిల్లలకి చాదస్తం అనిపిస్తుంటే ఏం చేయగలం ? ఇది తరానికి తరానికి ఉన్న అంతరమేమో ... అలా అర్ధం చేసుకుని మనసుని ఊరటపరుచుకో అని చెప్పాను. రాలే ఆకుల్లాంటి మనం పిల్లలకి పదే పదే హితబోధ చేసి వాళ్లకి మనపై చులకన భావాన్ని మరీ పెంచి పెద్దది చేయలేము కదా !  నా ఫ్రెండ్ భర్త మరీ భాద్యత లేనివాడు. కుటుంబాన్ని ఏ మాత్రం పట్టించుకోనివాడు. అందుకే ఆమె పిల్లలకి  తల్లి మాటలన్నా విసుగు. బాధ్యత లేని మనుషులని, భాధించే పెద్దలని పిల్లలు ఎలా భరించగలరు, ప్రేమించగలరు   అంటే...  ప్రేమించగలరు.  జన్మ నిచ్చినందుకు తల్లిదండ్రులకి రుణ పడి  ఉంటామంట.  అందుకే వాళ్ళని మనం ప్రేమించి ఆదరించాలి. అనుభవాల ముడుతలు మనుషులకే కాదు ఆకులకి అనుభవమే ! ఆ ముడుతలలో దాగిన అనాదరణ గాయాల గేయాలు,ఈ ముడుతలలో  చీడపీడల దాడులు. ముడుతలని ప్రేమిద్దాం . రాలే ముందు అదే అసలైన మందు అని అనాలనుకుంటాను.

తర్వాత  మనం గురువుకి , సమాజానికి రుణ పడి  ఉంటామంట.  నువ్వు గురువుగా చాలా మంచి గురువు అని నాకు తెలుసు.  తరగతి పాఠాలు కాకుండా  ఎన్నో మంచి మంచి పాఠాలు నవ్వుతూ, నవ్విస్తూ విసుగు కల్గించకుండా చెపుతావ్. నీ క్లాస్ లో  చదువుకున్న పిల్లలందరికీ నువ్వు మంచి టీచర్ వి గా గుర్తుండిపోతావ్. ఆ మాట నిస్సందేహంగా నేనూ చెప్పగలను .   మీ లాంటి టీచర్స్  కి మాత్రమే కాదు నాలాంటి సాధారణ గృహిణికి కూడా సామాజిక భాద్యత ఉంటుంది. ఎవరికీ వారు సమాజానికి మనమేం చేస్తున్నాం అనే ప్రశ్న వేసుకోవాలి .  ఆ భాద్యతతో మెలగాలనే నేను నా శాయశక్తులా కృషి చేస్తాను. ఏం చేస్తాను అంటే ... అదొక పెద్ద వ్రాత అవుతుంది శశీ ! spondylitis వల్ల  ఎక్కువ వ్రాయలేకపోతున్నాను . నేను బ్లాగ్ తక్కువగా వ్రాయడానికి కూడా కారణం అదే ! అయినా వ్రాస్తూనే ఉన్నాను . ఏదో శక్తి నన్నావహించి వ్రాయిస్తూ ఉంటుంది.

ఏ మూర్తి శక్తి చైతన్య ముక్తి
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి...  ఆ శక్తికి ప్రణమిల్లుతూ ...

ఇక ముగిస్తున్నాను . తప్పకుండా లెటర్ వ్రాస్తావు కదూ .. ఎదురుచూస్తూ ఉంటాను .  పిల్లలకి నా ఆశ్శీస్సులు. మీ సార్  గార్కి నా నమస్కారములు తెలియజేయి.

నీ విద్యార్ధులకి ... ప్రపంచం ఇలా ఉండాలని ... బోధించడానికి కంకణం కట్టుకోవాలని నిన్ను కోరుకుంటున్నాను .

ఇక ఉండనా మరి.   ప్రేమతో ... అక్క  వనజ.   

9 కామెంట్‌లు:

malli చెప్పారు...

ఓపిగ్గా మళ్ళీ బ్లాగ్ రచన మొదలుపెట్టారు. వనజ గారూ అభినందనలు. నేనూ పట్టుదల వహించాలిక :)

మధురోహల పల్లకి లో చెప్పారు...

లేఖ చాలా బావుంది వనజ గారూ, ముఖ్యంగా ప్రేమ గురించి ఒక చక్కని అనుభవాత్మక కోణంలోంచి చూస్తూ మీరు చెప్పిన మాటలు ఎంతో నచ్చాయి నాకు. ధన్యవాదాలు

bhuvanachandra చెప్పారు...

చాలా చక్కగా ఎన్నో కోణాలు స్పృశిస్తూ అద్భుతంగా వ్రాసారు. చాలా ఆలోచింపజేస్తుంది. కొన్నిచోట్ల మనసు సైలెంట్ అయినా కొన్నిచోట్ల గతంలోకి జారిపోయింది .....రాస్తూనే వుండండి వనజ గారూ ,,,,,,,నమస్తే

Ramani Rao చెప్పారు...

లేఖ అక్షరం అక్షరం ప్రేమని వ్యక్తం చేస్తూ అలా సాగిపోయింది. అమ్మాయి పెళ్ళి అవ్సరం విధ్య... అన్నిటినీ స్పృశించారు. నైపుణ్యంగా రాసే కళని మీనుండి నేర్చుకోవాలి.

శశి కళ చెప్పారు...

అక్క ! శశి ఏదో ఉత్తిగా అడిగిందిలే అనుకోకుండా నిజంగా
వ్రాశావు చూడు అదేనా ప్రేమంటే . నేను నీకు ఏమవుతాను అని ?
బదులు ఏమి సహాయం చేస్తాను అని ? మేము మీ ఇంటికి
వచ్చినపుడు కాలేజ్ లో చేరబోతున్న మా బాబుకి కులాలు ,
రాజకీయాలు పట్టించుకోకుండా నీ లక్ష్యాన్నే పట్టించుకో ,
అని నువ్వు ఇచ్చిన కౌన్సిలింగ్ వినగానే నాకు అర్ధం అయింది
నీ భావాలు చాలా చక్కటివి , ప్రాక్టికల్ గా మంచి దారిలో
ఆలోచిస్తావు అని . ఇక బ్లాగ్ లోకపు ఉక్కు మహిళ అని జాజి మల్లి
గారు పెట్టిన ఇంటరవ్యూ చదివి నీ భావాలపై నువ్వు ఎంత
స్టిరంగా పోరాడగాలవో తెలిసింది . అక్క అని అప్పుడే పిలవాలి
అనిపించింది . పిల్లల విషయం లో నీ భావాలు నావి ఒక్కటే .
పాప విషయం లో నేను తొందర పడలేదు అక్క . చక్కగా
చదివించాను . బాంక్ కోచింగ్ ఇప్పించాను . అబ్బాయి మంచివాడు
అని తెలుసుకున్నాకే పెళ్లి చేసాను . తను హాయిగా ఉంది .
అదీ కాక నాకు ధ్యానం లో వాళ్ళ పెళ్లి కనిపించింది . నాకు
అనిపించింది అప్పట్లో పెళ్లి మాత్రమె ఆడదాని జీవితం అనుకొనే
రోజుల్లో నేను జాబ్ చేసి కొత్త దారి ఎలా ఏర్పరచానో , మా పాప
హౌస్ మేకర్ అనే పాత దారిని స్తిర పరచడానికి పుట్టింది అనిపించింది .
నేను ఏమి చేస్తున్నాను అనే దాని మీద నాకు క్లారిటీ ఉంటుంది .
అది ఎదుటి వాళ్ళు నేర్చుకోవాల్సిన లెసన్ అయితే ముందు దాని
గురించి చెప్పను . లవ్ యు అక్క . ప్రేమ ఎవరి మధ్య అయినా
ఎంత చక్కగా ఉంటుందో తెలిసింది . మన మీద ప్రయాణిస్తూ
మనకు ఎన్నో ఉద్వేగాలు కలిగిస్తూ అది చేరే చివరి మజిలీ
సమాజం అని తెలిసింది :-

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మరి నాకేది ఉత్తరం :) .. ఓహో సీనియర్లందరికీ రాశాక నాకు రాస్తారన్నమాట. సరే ఐతే .. మీ లేఖలో నన్ను నేను చూసుకోవాలని ఎదురుచూస్తుంటాను .. తప్పక రాస్తారు కదా ..

మీ రాజి..

భారతి చెప్పారు...

వనజగారు,
ఇప్పటికి ఐదుసార్లు చదివానీ లేఖ. రచనా నైపుణ్యత అద్భుతః. అక్షరమక్షరం మదిని కట్టిపడేసింది.

ఇటు అమ్మాయిలకుండాల్సిన స్వావలంబన, స్త్రీలకుండాల్సిన ఆత్మస్థైర్యం అటు వ్యవసాయం, పర్యావరణం, స్వయంకృత అపరాధాలు, తగు సూచనలు, ప్రేమ, సాహిత్యం, నేటి వాస్తవికతలు ... పలు కోణాల్లో అందరి జీవన గమనంలో పలుకరించే కొన్ని కొన్ని అనుభవాలను ప్రస్తావిస్తూ ... అద్భుతంగా వ్రాసారు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

భారతీ గారూ ... ధన్యవాదాలు .
& రాజీ గారూ ... మీకో లేఖ తయారుగా ఉంది . నాలగవ వారు మీరు. :) లేఖ నచ్చినందుకు ధన్యవాదాలు.
& శశీ మీ స్పందన కాళ్ళ నీళ్ళు తెప్పించింది. అమ్మాయి వివాహ విషయం కొంతవరకే ! తర్వాత విషయాలన్నీ జనరలైజ్. మీరు చక్కగా ఓ లేఖ వ్రాయండి. ధన్యవాదాలు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మల్లీశ్వరి గారూ ..ధన్యవాదాలు. మళ్ళీ బ్లాగ్ వ్రాయడం మొదలెట్టండీ !
& భువనచంద్ర గారూ .. ధన్యవాదములు.
& రమణి రాచపూడి ..ధన్యవాదాలు.
& మధురోహల పల్లకీ గారూ ... ధన్యవాదాలు.