రాతి హృదయం
కథలో ఇంతకు ముందు ఏం జరిగిందో మీ వూహకే వదిలేస్తూ .. **********************
అతనక్కడ అలా ఆగిపోయాడు, ఆమె ముందుకు ప్రవహిస్తూ వొకసారి వెనుతిరిగి చూడాలనుకునే బలీయమైన కోర్కె ని బలవంతంగా అణిచి వేసుకుంది.
అతననుకున్నాడిలా .. " అనుభవంలోనూ అనుభూతిలోనూ జీవితం వుంది, సంక్లిష్టతలని అర్ధం చేసుకుంటూ జీవించడంలోనూ జీవితం వుంది. కుముదకి జీవించడం అనే విద్య బాగా తెలుసు " అని.
అతను యింటికి వెళ్ళాక భార్య "యెలా జరిగింది మీ టూర్" అంటూ నవ్వుతూ పలకరించింది.
ఏనాడు వొక్క పరుష వాక్యం పలుకని చల్లని యిల్లాలు కదా యీమె అనుకున్నాడు. స్నానానికి వేన్ణీళ్ళు పెట్టి యిష్టమైన వంటకాలతో కొసరి కొసరి వడ్డించింది. ఇస్త్రీ చేసి పెట్టిన లేతరంగు దుప్పటిని వేసి ఏ సి ఆన్ చేసి పెట్టి తనూ స్నానానికి వెళ్ళింది. ఆ ప్రత్యేక యేర్పాట్లు గమనించి యెంత అభద్రతాభావం యీమెకి? అనుకుంటూ మనసులో నవ్వుకున్నాడు.
కొంచెం శ్రద్దగా అలంకరించుకుని వచ్చి అతని కాళ్ళ దగ్గర కూర్చుని పాదాలని వొళ్లో పెట్టుకుని మోకాళ్ళ నుండి క్రిందకి వొత్తసాగింది. ఆమె యేమి ఆలోచిస్తుందో అర్ధం చేసుకున్నాడతను. అతను లేచి కూర్చుని ఆమెని చేతుల్లోకి తీసుకుంటూ "అతిగా యేవేవో వూహించుకుని భయపడకు, బాధపడకు. నేనెప్పుడూ నీ వాడినే" ..అన్నాడు. అమితాశ్చర్యం నింపుకున్న ఆమె కళ్ళని ముద్దు పెట్టుకుంటూ మెల్లగా వెనక్కి వాలాడు. అతని హృదయంపై ఆమె నమ్మకంగా తలవాల్చింది.అతని చేయి ఆమె ముంగురులని సవరిస్తూ వుండగా పసిపాపలా నిద్రపోయింది.
ఈ నమ్మకమే కదా యే స్త్రీకైనా కావాల్సింది పాపం ! కుముదకి యిలాంటి నమ్మకమైన తోడే కదా లేకపోయింది. ఏం చేస్తూ వుంటుందో యిప్పుడు? లగేజ్ అక్కడ పడేసి స్నానంచేసి పడుకుని వుంటుంది. ఏమైనా తిందో లేదో, మందులు వేసుకుందో లేదో, యెవరున్నారు ఆమెకి? వున్న వొక్క కూతురు యెక్కడో దేశంలో యింకో ప్రక్క . జాలితోనో, గాఢమైన ప్రేమ వల్లనో కళ్ళలో నీళ్ళొచ్చాయి. గోడవైపుకి తిరిగిపడుకుని పదేళ్ళ స్నేహంలో ఆమెప్పుడు యెలా వుందో గుర్తుకు తెచ్చుకోసాగాడు. తొలి సంజెలో జొరబడి వచ్చిన కాంతిలా, పూచిన తంగేడులా వచ్చింది. పారే సెలయేటి వుత్సాహం పరవళ్ళు త్రొక్కేది. ప్రతి కలయికా కళ్ళముందు సినిమా రీలు లాగా తిరుగుతూ వున్నాయి. ఎయిర్పోర్ట్లో వీడ్కోలు సమయం కళ్ళ ముందు మెదిలింది. మలి సంజె లో మరలిపోయిన కాంతిలా కనుమరుగై తనలో చీకటిని మిగిల్చింది. లోపల యేదో అశాంతి, తెలియని బాధ. వెంటనే కుముద దగ్గరికి వెళ్ళాలనిపించింది. గుండె మీద కొండ లాంటి బరువేదో పెరిగి పెద్దదవుతున్న బాధ కల్గుతుంది. మంచం దిగి పచార్లు కూడా చేయలేకపోయాడు. గాంభీర్యమంతా చెదిరి దిండు తడిసిపోతుంది. ఈ గుండెకు ఆ గుండెకు సంకెలలు యెవరు వేసారు! ఇప్పుడెవరు విప్పగలరు? ఈ ప్రాణానికి ఆ ప్రాణం ఎందుకు తాపడం చేయబడింది!? ఆలోచనలు దుఃఖం కలగాపులగం అయిపోయాయి. జీవితంలో యెన్నడూ చవిచూడని దుఃఖం అది.
ఉదయాన్నే లేచి కాలకృత్యాలు ముగించుకుని వచ్చి కాఫీ తాగుతూ పిల్లలతో మాట్లాడుతూ కాసేపు, వాళ్ళు బయటకి వెళ్ళాక పేపర్ చదువుతూ కాసేపు గడిపేసి తొమ్మిది తర్వాత టిఫిన్ చేసి ఆఫీస్ కి రెడీ అవడానికి బెడ్ రూమ్ లోకి వెళ్లి ఫోన్ తీసుకుని కుముద నెంబర్ డయల్ చేయబోయి ఆగిపోయాడు. ఇకపై తనతో మాట్లాడటం కానీ చూడటం కానీ జరగదని మాటివ్వడం యెంత తప్పైపోయిందని చింతిస్తూ రేడియో ఆన్ చేసాడు. సింగ్ యే సాంగ్ లో అతనికెంతో ఇష్టమైన ఆమె గొంతు.. ఆర్ జె తో మాట్లాడుతుంది.
"విడిచి వెయ్యేళ్ళవనీ .. హృదయాన జ్ఞాపకాల దీపం వెలుగుతూనే ఉంటుంది" అన్నట్లు వుంటుందీ పాట. నాకిష్టమైన పాట యిది అంటూ కుముద చరణాన్ని అందుకుంది.
"కురిసేదాకా అనుకోలేదు శ్రావణ మేఘమని
ఆ ఆ ...తడిసేదాక అనుకోలేదు తీరని దాహమని
కలిసేదాకా అనుకోలేదు తీయననీ స్నేహమని "
పాట పాడుతుందా, లేక తన మనసు తెలుపుతుందా ఆలోచించాడు. ఏదైతేనేం హృదయం చుట్టూ రాతి గోడ కట్టుకుని రాతి హృదయం అనిపించుకుంటుంది. ఒక్కసారిగా గుండెల్లో దాగిన వేదనంతా లావాలా ఆలోచనని తాకింది. అబ్బా! అంటూ గుండె పట్టుకుని క్రిందికి వాలిపోబోతుండగా హెర్బల్ టీ తీసుకొచ్చిన భార్య కంగారు పడుతూ కప్ వదిలేసి అతన్ని పట్టుకుని “ఇంతలోనే యేమైంది మీకు? రాత్రంతా నిద్రపోలేదు, నేను గమనిస్తూనే వున్నాను” అంటూ జాగ్రత్తగా బెడ్ పై పడుకోబెట్టింది .
“నా ప్రాణం నన్నొదిలి పోయింది, లేదు లేదు ఆమెని వొదిలేసి నేనే వచ్చేసాను. ఆమె లేకుండా నేను ఒక్కరోజు కూడా బ్రతకలేనని యిప్పుడర్ధమవుతుంది. అందుకే ఈ ప్రాణం మిమ్మల్ని కూడా తృణప్రాయంగా వదిలేసి పోతుంది, నన్ను క్షమించు” భార్యకి చేతులు జోడించి నమస్కారం చేసాడు
ఆమె యేడుస్తూ "అయ్యో అదేం మాటలండీ! పదేళ్లుగా మీకు ఆమె పిచ్చి పట్టింది, ఆమె లేకపోతే మేమంతా లేమా ? మీకేమీ కాదు, నా ప్రాణం అడ్డు వేసైనా మిమ్మల్ని కాపాడుకుంటాను” అంటూ ఆమె 108 కి ఫోన్ చేస్తుంటే..
" నాకేమైనా జరిగితే అందుకు కారణం ఆమే నని యెప్పుడూ యేమీ అనకు, అసలు నేను ఏమో అయిపోయానే సంగతే ఆమెకి తెలియనివ్వనని నాకు మాటివ్వు, మాటివ్వు” అంటూ చేయి చాచాడు. ఏడుస్తూనే ఆ చేతిలో చెయ్యేసింది. కుప్పకూలిన భర్తను చూసి బావురుమంది. అంబులెన్స్ లో వెళుతూ ఈయనకు ఏమైనా అయితే..!? పెళ్ళీడు కొచ్చిన కూతురు, చదువు పూర్తై ఉద్యోగం రాని కొడుకు. తన బతుకు నడి సంద్రంలో నావ అయినట్లేనని వణికిపోయింది.
అదే సమయానికి రేడియోలో వినిపించిన పాటని పూర్తిగా విన్న కుముద "ప్రేమ ముందు మోకరిల్లని మనసు వుంటుందా?” అనుకుంటూ ఫోన్ తీసుకుని నంబర్ టైప్ చేసి డయల్ చేయబోయి మళ్ళీ అంతలోనే గుండె చిక్కబట్టుకుని "ఊహూ.. అతని గురించిన యీ ఆలోచన చాలదా మిగిలిన బ్రతుకునీడ్వడానికి" అనుకుని ఆగిపోయింది. గుండె బరువెక్కింది. నెమ్మదిగా వెళ్ళి హాల్లో సోఫాలో కూర్చుంది. హృదయం భారమైంది. ఏదో అలజడి.మనిషిని అసాంతం వణికిస్తుంది. ఈ నొప్పిని భరించాలి తప్పదు. నొప్పి కొన్నాళ్ళు, లేదా కొన్నేళ్ళు.
“ప్రేమంటే శరీరంతోనో, హృదయంతోనో వేరు వేరుగా జీవించడం కాదు. దూరంగా వున్నప్పటికీ వొకరి మనసు స్పందిస్తే రెండో వారికి గుండె మెలిపెట్టినట్లు వుండటం” అని ఆమెకి అనుభవమైన పాత విషయమే మరొకసారి అనుభవమవుతుంటే.. వొడలెల్లా కన్నీటి సంద్రమే. ఆ సంద్రంలో ఆ క్షణంలోనే తను మునిగిపోతున్నట్లు అనిపించింది ఆమెకు.
ఉదయమనగా సోఫాలో కూర్చున్న తల్లి భంగిమ మారకపోవడాన్ని సి సి కెమెరా క్లిప్స్ లో గమనించిన కూతురు పక్కింటి వారికి ఫోన్ చేసింది. ఇంకో అంబులెన్స్ హాస్పిటల్ వైపు పరుగులు తీస్తుంది.
(ఈ కథ ముగింపు ఇంతే కావచ్చు, తర్వాత యేమైనా కావచ్చు. రచయిత కథకెపుడూ వెలుపలి వైపే )