14, అక్టోబర్ 2019, సోమవారం

తండ్రి ప్రణవమై.. తల్లి భ్రమరమై.. శ్రీ గిరి శిఖరాన.



శ్రీశైలం అనగానే క్షణంలో మనసు అక్కడ వాలిపోతుంది. ఇంటి దగ్గరనుండి బయలుదేరినప్పుడు నుండి మాత్రమేనా .. కాదు ప్రయాణానికి నాంది పలికినప్పుడే ..మనసెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళి స్వామి దీవెన తీసుకున్న భావన కల్గుతుంది. అది నాకు నూతన శక్తిని ప్రశాంతతను మొక్కవోని ధైర్యాన్ని యిస్తుంది.

ఇక శరీరమెళ్ళి శ్రీ గిరి పర్వతంపై శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన గోపురం ముందు నిలబడుతుంది.ధూళి దర్శనం కోసం పరుగు పరుగున క్యూ లైన్ లో నిలబడుతుంది.

ఆ గోపురం  క్రింద నుండి లోనికి అత్యంత ఇష్టంగా  ప్రవేశించి ధ్వజస్తంభాన్ని భక్తితో తాకి నందీశ్వరుడి ప్రక్కగా వెళుతూ "నందీశ్వరాయ నమస్తుభ్యం, సాంబానంద ప్రదాయక ,మాహాదేవస్య   సేవార్ధం  అనుజ్ఞాoదాతు మర్హనీ" అని భక్తిగా నమస్కరించుకుని ఆయనను దాటేదాకా  ఆ సుందర మూర్తిని చెక్కిన శిల్పుల చేతిలో ఉలి విన్యాసాలను ప్రశంశించుకుంటూ భక్తిభావం అంకిత భావం లేకపోతే రాతికి ఆ సౌందర్యత్వాన్ని వీరత్వాన్ని ప్రాణత్వాన్ని తేగలరా అనుకుంటూ వీరమండపంలోకి ప్రవేశిస్తాను.  వీరమండపాన్ని చూస్తూ ఇదిగో యిక్కడే కదా భక్తితో కాళ్ళు చేతులను తెగనరుక్కుని స్వామికి సమర్పించుకుంది అలాగే ఇంకొందరు  ఆఖరికి ప్రాణాలను కూడా వీరభక్తితో స్వామికి సమర్పించుకుంది అని తలపోస్తాను. వొళ్ళు జలదరిస్తుంది కూడా.

ముందు తల్లిని దర్శించుకోవాలంట అని పెద్దవాళ్ళు చెప్పిన మాటను గుర్తుకు తెచ్చుకోనట్టే నటిస్తూ తండ్రిని చూసుకోవాలని ఉవ్విళ్ళూరుతాను .  పసి బిడ్డపై తండ్రి కురిపించే  ప్రేమను అనురాగాన్ని తలపించే ఆయన స్పర్శను చెప్పలేని శాంతిని నెమ్మదిని కల్గిస్తుంది. ఆ స్పర్శను  ఆ దీవెనను పొందేదాకా  మనసు పడే ఆరాటం  ఆ ఉద్విగ్నత యిక్కడ అక్షరాలలో చెప్పలేను. ఆ స్పర్శను  అణువణువునా అనుభవించి   గాఢ అనుభూతిని చెంది మైమరుపుతో ఆనందాశ్రువులతో వెనుదిరిగి చూస్తూ మసక మసక గా కనిపిస్తున్న ఆ రూపానికి నమస్కరించుకుంటూ మరల ఎప్పుడు ఈ భాగ్యం కల్గిస్తావు తండ్రీ అనుకుంటూ బయటకు వచ్చేస్తాను. తర్వాత స్వామి వెనక్కి వచ్చి  ధ్వజ స్థంభంకి సమీపంగా కుడిపక్కగా కాసేపు కూర్చుంటాను. బడి లోపలకి  వదిలేసి వెళ్లిన తండ్రిని తలుచుకుని పిల్ల బెంగపడినట్లు బెంగపడుతూ ... కాసేపు గోపుర కలశంపై  ఆ పై  ఎగిరే  తూనీగలను పావురాలను చూస్తూ మనసుకు శాంతి పొందుతాను.


ఆ తర్వాత అమ్మ దర్శనం కోసం కొంచెం పైకి వెళ్ళాలి కదా! పైకి ప్రాకుకుంటూ వెళ్ళిన పసిపిల్లలా నిదానంగా అక్కడికి వెళతామా ... ఎంత చల్లని తల్లి. హడావిడి ఏమీ లేకుండా .. తన చల్లని చూపులతో తడిమి.. రా ..రమ్మంటూ పిలిచి  ఆపైన అక్కునజేర్చుకుంటుంది అక్కుపక్షిలాంటి యీ మానవ దేహాన్ని.  ఆ పరిష్వంగానికీ  సంతసించి .. పులకించి .. అమ్మ పాదాలకు కదా ముందు నమస్కరించుకోవాల్సించింది. అదేమిటి అమ్మను ఇలా హత్తుకున్నాను అని స్ఫురణకు  తెచ్చుకుని "అమ్మా మన్నించు... నీ పాద ధూళిని శిరస్సున ధరిస్తున్నాను తల్లీ, నీ అనంతమైన కరుణ నీడు మిక్కిలి ప్రేమతో  నన్ను నా  బిడ్డలను  నా చుట్టూ వున్న సర్వ ప్రపంచాన్ని చల్లగా కాస్తున్నఅమ్మవు అమ్మలును గన్న అమ్మవు  కదమ్మా"  అనుకుంటూ అక్కడి నుండి చిన్నగా కదులుతూ ..బయటకు వచ్చి నీకు ఎడమ పక్క ఉన్న దేవ గన్నేరు చెట్టును చూడటం అక్కడ కూర్చోవడం కాసిని పూలు యేరుకుని ఆ పూల సౌందర్యాన్ని చూస్తూ పరిమళాన్ని ఆఘ్రాణించాలని మోహపడి మళ్ళీ వెంటనే ... నీ పూజకు పూసిన పూలు కదా యివి అనుకుంటూ గుండెలకు హత్తుకుంటాను. ఈ క్షణాన నా హృదయపుష్పమే నీకు సమర్పించితిని తల్లి అనుకుంటాను.

తర్వాత యెవరూ అభ్యంతర పెట్టకపొతే నీ వెనుకకు వెళ్ళి  గుడి ప్రాకారానికి మధ్యలో  నువ్వు మా అందరిని కరుణించడానికి ఆసీనమైన వెనుక భాగాన రాతి కట్టడాన్ని చీల్చుకుని వచ్చే భ్రమర నాదాన్ని వొంటి చెవి ఆనించి వినడానికి ఉత్సుకత చూపుతాను. నీ దర్శనమైతే తేలికగా యిస్తావుగాని తల్లీ ..నిన్ను అసాంతంగా చేరుకోవడం అంత సులభమా తల్లీ .. ఎన్ని వ్యామోహాలను విడనాడాలి. ఎంత  ఏకాగ్రత కల్గిన చిత్తం ఉండాలి మరి . అంత దుర్లభమైన దారిలో  నేనున్నాను కాబట్టి తేలిగ్గా కరుణించే నాయనను వేడుకోవడం నా అతితెలివి కాదనుకుంటాను. అమ్మంటే క్రమశిక్షణ కదా అనుకుంటాను. ఎంత చల్లని తల్లివైనా క్రమశిక్షణ క్రమశిక్షణే అంటున్నట్టు ఉంటావు కదా నీవు. నీ సామీప్యాన్ని వొదిలి బయటకు వస్తానా,  తమ  ఝుంకారాలనూ వినిపిస్తూ అక్కడే సంచారం చేస్తున్న అనేకానేక భ్రమరములు... వాటితో పాటు నేను సంచరిస్తూ .. మళ్ళీ సాయంత్రానికి నీ దర్శనం కోసం  ఆలోచన చేస్తూ ముందుకు కదులుతాను. మళ్ళీ రేపటి దర్శనం కోసం అనుమతులకై వెతుకులాడతాను.

నా ప్రతి దర్శనానుభవమూ ..నాకొక ఉత్తుంగ తరంగమే!  నా తండ్రి  ప్రణవమై  నాతల్లి భ్రమరమై ... శ్రీ గిరి శిఖరమున ఆసీనులై వుండి తమ కరుణామృత దృక్కులను పంచభూతాలలో ఎనిమిది దిక్కులలో ప్రసరిస్తున్న క్షేత్రం ... నాకత్యంత యిష్టమైన నెలవు. మానసిక దర్శనం చేసుకుని ... ఇలా ఆ భావనను అక్షరీకరించడం కూడా వారి దయాశీస్సులే కదా!

శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామియే నమః. ఓం నమఃశివాయ

ఓం నమః శంభవే చ  మాయో భవే చ   నమః శంకరాయ చ  మయస్కరాయ చ  నమఃశివాయ చ శివతరాయ చ నమః





.ఓం నమః శివాయ  🙏🙏🙏

కామెంట్‌లు లేవు: