16, అక్టోబర్ 2019, బుధవారం

పేరులోనే వున్నది..

చిగురించిన శిశిరం కథ ప్రచురణకు రాకమునుపు ఆ.. కథకు నేను పెట్టిన పేరు .. రాతి హృదయం. అసలు ఈ కథ “చేరేదెటకో తెలిసి” అనే కథకు సీక్వెల్ గా రాసిన కథ. కొద్ది గంటల్లో విరామం తీసుకోకుండా వ్రాసిన కథ. ఆదివారం సంచికలో ప్రచురణకు అనుకూలంగా దాదాపు 1500 పదాలకు కాస్త అటునిటుగా కుదింపబడిన కథ. ఈ కథకు రాతిహృదయం అనే టైటిల్ కన్నా “చిగురించిన శిశిరం” అని పెడితే బావుంటుంది అని సూచిస్తే సరేనన్నాను. ఎందుకంటే మంచి మంచి కథలు వ్రాసి నిత్యం యెన్నో కథలు చదివి పాఠకుల నాడిని గ్రహించగల్గిన వారి అనుభవం కదా..! ఇతివృత్తానికి తగినట్టు అని వారి అంచనా నిజమవుతుంది


ఇక యీ  కథ ప్రచురితమయ్యాక వచ్చిన స్పందన చూసి ఉబ్బితబ్బిబ్బైపోయాను. ఇన్నాళ్ల తర్వాత యీ  వారంలో కూడా నిర్మల్ నుండి ఒక హెడ్మాష్టర్ గారు ఫోన్ చేసి అభినందించి నేను మర్చిపోలేని కథ అందించారమ్మా.. మీరు నాకన్నా చిన్నవారు. కానీ మీ పాదాలకు నమస్కరించాలని వుందమ్మా అన్నారు. ఒకోసారి ప్రశంసలు కూడా యిబ్బంది పెడతాయి. కథలు వచ్చినప్పుడల్లా మెసేజ్ పెట్టండి అని అభ్యర్దన. నెంబరు సేవ్ చేసుకున్నాను. ఫోన్ తీయగానే యదాలాపంగా మాట్లాడుతూ పేరు సరిగా వినం కదా... మీ పేరు సర్.. అని అడగలేకపోయాను. 😞 ఈ సారి కనుక్కోవాలి.
ఇకపోతే ఈ కథ వచ్చాక ఇదే పేరుతో రెండు కథలు వచ్చాయి. అదేమిటో కథలకు పేరు పెట్టుకునే టపుడు  తనిఖీ చేసుకోరా..! నేను కథకు పేరు పెట్టేటపుడు అంతకుముందు యెవరైనా ఆ పేరు పెట్టారో లేదో చూసుకుని మరీ పెడతాను. కాస్త పొయటిక్ గా వుండేటట్లు జాగ్రత్త పడతాను. పేరులో పెన్నిధి వుందంటారే అలాగన్నమాట. కథకైనా కవితకైనా వ్యాసానికైనా శీర్షిక, ఎత్తుగడ, ముగింపు ప్రాణం. అవి బాగుండకపోతే అంతగా పాఠకులను ఆకట్టుకోవని నా అనుభవం కూడా! 
నా కథల టైటిల్స్ కు అభిమానులున్నారు.  ప్రముఖ రచయిత్రి చంద్రలత ... ఫోన్ చేసి కథల గురించి మాట్లాడుతూ టైటిల్స్ గురించి ప్రత్యేకించి అభినందించారు. ఈ మధ్య "పూలమ్మి " టైటిల్ కూడా మరొక చోట కనబడింది. ఇతివృత్తాన్ని బట్టి శీర్షిక పెట్టడంలో సగం విజయం లభించినట్లే అనుకుంటాను. ఆ జాగ్రత్తలు తీసుకుంటూ వుంటాను. ముందు టైటిల్స్ అనుకుని వ్రాసిన కథలు వున్నాయి. అట్లాంటా  వున్న శారద గారు, తిరుపతి లో వున్నా విజయ కుమార్ గారు నా కథల టైటిల్స్ కు పెద్ద అభిమానులు.
ఈ మధ్య వ్రాసిన "నీట చిత్తరువు " టైటిల్ అర్ధం కాని  ఎడిటర్ కూడా వున్నారు . నీటి చిత్తరువు అంటే వాటర్ కలర్స్ తో వేసిన చిత్రమా అని అడిగారు కూడా ! నా తలకాయ అనుకుని నీటి చిత్తరువు కాదండీ .."నీట చిత్తరువు " అంటే నీటిలో కనిపించే చిత్రం అని వివరించాల్సి వచ్చింది. సరే .. ఎలాగూ వాళ్ళు ఆ కథ ప్రచురణకు అంగీకరించలేదనుకోండి. 
ఇప్పటికి తొంబై అయిదు కథలు వెలువడ్డాయి. ఇరవై ఆరేళ్ళ క్రితం రాసుకున్న "జాతర" కథ తర్వాత "వేకువ పువ్వు " అనే కథ వ్రాసాను. ఆ వ్రాసుకున్న ప్రతి కనిపించలేదు కానీ ..కథ గుర్తుంది . మళ్ళీ వ్రాస్తున్నాను. పంతొమ్మిదేళ్ళ క్రితం వ్రాసిన కథానిక "బంగారు " ..ఇలా తొంబై అయిదు  కథలు ఈబ్లాగులో ..మీరు బ్లాగ్ తెరిచిన తర్వాత కిందికి చూస్తూ  కుడివైపున ..ఒకచూపు వేస్తే ... నా కథలు శీర్షికలో అన్ని కథల లంకె లు వున్నాయి. హాయిగా చదువుకోవడానికి నేను శ్రద్ధ తీసుకుని అలా లంకెలు యిచ్చాను. పత్రికలలో వచ్చిన కథలన్నింటిని రెండుమూడు రోజులుగా పిడిఎఫ్ ఫైల్ లోకి మార్చి వుంచాను. ఆ లింక్స్ కూడా ఇవ్వగలను. 
ఇంకా మెదడులో సంక్లిప్తమైన బ్లూ ప్రింట్ లో వున్న అనేకానేక కథలు వున్నాయి . ఓ అయిదు కథలున్నాయి కానీ నాలుగు నెలలుదాకా వాటిని పంచుకునే ఉద్దేశ్యం లేదు . పత్రికలకు పంపే ఆలోచన లేదు . బ్లాగ్ లో రాసిన టపాలలో చాలా అచ్చుతప్పులున్నాయి. వాటన్నింటిని సరిచేసుకోవాలి ముందు. అప్పుడు హడావిడిగా వ్రాసేసాను. కొంత తెలియక తప్పులు వ్రాసేసాను. అజ్ఞానం అలా వర్ధిల్లింది. ఏమైనా ... సహృదయంతో చదివిన మిత్రులందరికీ నమస్సులు. ధన్యవాదాలు.  
నా కథా ప్రయాణం గురించి ఎవరూ నన్ను అడగలేదు. పత్రికలలో పరిచయానికి నాకంత ఉత్సాహం లేదు అనేదానికన్నా ..అసలు అడిగినవారు లేరు. నా కథా ప్రయాణం గురించి నేను చెప్పుకోవడమే తప్ప. నాకు పత్రికలలో పనిచేసేవారిలో స్నేహితులు లేరు. అలాగే నాకొక కోటరీ (గుంపు ) లేదు. నేను వారిని పొగుడుతూ ఉంటే బదులుగా వారొచ్చి నను పొగుడుతూ వుంటారన్నమాట. అందుకు నేనెప్పుడూ దూరం కాబట్టి ... ఎంత ప్రశాంతంగా జరిగిపోతున్నాయో రోజులు.  :) 
మళ్ళీ చెపుతున్నాను ..పేరులోనే పెన్నిధి వుంది ..అనుకోవాలి అనుకుంటుంటే .. పేరులో ఏముంది అన్నారు ఒకరు. ఇదంతా కూడా చెప్పాలిప్పుడు.  :) 
పేరు ఉచ్చరించినప్పుడు వెలువడే వైబ్రేషన్స్ పాజిటివ్ గానూ నెగిటివ్ గానూ కూడా వుంటాయట. శబ్దం కూడా లయాత్మకంగా అర్ధవంతంగా వుండటం వల్ల  వీనులవిందుగా వుంటుంది కదా ! 
నా పేరు పెట్టేటప్పుడు కూడా ..మా అమ్మ చాలా శ్రద్దగా నా పేరు పెట్టారంట. నా  పేరులో వున్న మూడక్షరాలు. హల్లులే కదా ! హల్లులు పలకాలంటే అచ్చులు సహాయం లేకుండా పలకడమే కుదరదు కదా ! నా వరకు నా పేరంటే చాలా యిష్టం కూడా ! 
వనమున జనియించినది , నీటిలో జనియించినది ... నీలి కమలం   కామెంట్‌లు లేవు: