హమ్ సఫర్ -వనజ తాతినేని
పగ్గాలు లేని గుర్రంపై ప్రయాణం సాగుతుంటుంది.
కళ్ళెం వేయాలని తోడు చేస్తారెవరినో
లోపల వున్నవన్నీ పెకలించి పడేసి నమ్మకం తో ప్రయాణం చేద్దాం అనుకుంటాం
అనుసరిస్తాము కానీ నియంత్రించబడతాము
అలవాటు పడిపోతాం
అకస్మికంగా ప్రయాణంలో వొంటరిగా మిగలాల్సివస్తుంది. మనమేమో
జీవితపు కూడలిలో వున్నప్పుడు ఏదో వొకదారి ఎన్నుకోవాలి తప్పదు
అదే మిగిలిన ప్రయాణమంతా చేయాల్సిన దారి అని అదే గమ్యాన్ని చేరుస్తుందని నమ్మాలి.
ఏ రహదారి వొంపుల్లోనో కాస్తంత వొంగుదామని ప్రయత్నించకుండానే సహజంగా వొంగిపోతాం.
కఠినమైన రహదారి సాఫీగా సుందరంగా
వుంటుందని.
సోలి సొక్కిపోకముందే మనం నడుస్తున్న రహదారి మనం అనుకున్న రహదారి వొకటి కాదని సందేశం వస్తుంది.
అదొక మలుపు మాత్రమే నని.
కూలిపోయిన వంతెనలనూ
కాలిపోయిన వంతెనలనూ
ఎవరూ పునరుద్ధరించలేరు
కాస్త ఆగి అలుపు తీర్చుకుని
ప్రయాణపు భారాన్ని నమ్మకంగా వెనుకనున్న అదృశ్యశక్తి పై నుంచి అడుగులు ముందుకు వేయడమే
సంకోచం లేకుండా ప్రయాణం చేయడమే
మలుపు లెన్నో వస్తూవుంటాయి.
మనం స్థిరంగా దృఢంగా గమ్యం పై దృష్టి సారించాలంతే!
ఓ నమ్మకం వుంచండి.
కాంతులీనే సుందరమైన మార్గం మీ కొరకు
సిద్ధపరచబడి వుందేమో
మీరొక మలుపులో నిలబడి వున్నారేమో
ఆ మలుపు భిన్నమైనదేమో!
ఎవరు చెప్పలేం! అద్భుతాలు ఇలాగే జరుగుతుంటాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి