6, ఫిబ్రవరి 2012, సోమవారం

మేరీ లిల్లీయమ్మ టీచర్

మేరీ లిల్లీయమ్మ ..  ఆవిడ పేరు వినగానే.. నాకు ఏర్పడ్డ  గౌరవభావం పెరుగుతుంది.  ఒక ప్రేరణ గా మిగిలిపోయింది. పెరిగిన  సానుభూతి , ఆఖరిగా ఓ..విషాద భావం చుట్టేస్తాయి. చక్కని మాట తీరు,అపరితమైన ఆంగ్ల పాండిత్యం, అలవోకగా తేదీలతో సహా చెప్పే చరిత్ర పాఠాలు, సామాజిక,రాజకీయ అంశాలపై ఆమెకి ఉన్న అవగాహన అబ్బురంగా తోచేవి. ఆమె మాట్లాడుతుంటే..గంటల తరబడి వింటూ ఉండిపోయే దాన్ని.

ఆమె నాకు ఎలా పరిచయం అంటే.. ఆవిడ ఒక రిటైర్డ్ టీచర్. అలా అని ఊరికే ఉండేవారు కాదు. వ్యవసాయం పట్ల ఆసక్తి ఎక్కువ.  తమలపాకు తోటలు,కూరగాయల తోటలు సాగు చేసేవారు. అందరు ఆవిడకి  అవి అన్నీ ఎందుకు ? మగవాళ్ళే  వ్యవసాయం చేయలేక కౌలుకి ఇచ్చి హాయిగా కూర్చుంటుంటే.. డబ్బు నష్టపరచుకుంటూ..ఈమె వ్యవసాయం చేయిస్తుంది.గవర్నమెంట్ వారు ఇచ్చిన డబ్బుని ఇలా వృధా చేస్తుంది అనేవారే   ఎక్కువ ఉండేవారు. ఆమె ప్రతి రోజు సాయంకాలం సమయంలో.. తన ఇంటి అవసరాలకి సరిపడా తాజా కూరగాయలని కొనుక్కుని వెళుతూ.. కాసేపు మా కాంపౌండ్ లో అందరి దగ్గర కాసేపు కూర్చుని మాట్లాడి వెళ్ళేవారు.

ఆమె గురించి చెప్పాలంటే..  మేరీ లిల్లీ యమ్మ  .  ఈ పేరు వినగానే మనం ఏ విదేశీయురాలో అనుకుంటాం.కానీ ఆవిడ అచ్చ తెలుగు ఆడపడచు.
ఆమె తండ్రి బ్రిటిష్ వారి కాలంలో బందరు పట్టణంలో వారి దగ్గర నౌఖరీ చేసేవారట. బ్రిటిష్ వారి అలవాట్లు, వారి మతం అన్నీ బాగా ఒంటబట్టించుకుని ఒక విధంగా జీర్ణం చేసుకుని తన జీవన విధానాన్ని బ్రిటిష్ వారి లాగా మార్చుకున్నారు. అలా ఆయన తనకి పుట్టిన బిడ్డలలో ఆఖరి బిడ్డకి మేరి లిల్లీ అని పేరు పెట్టారట. తర్వాత మనకి స్వాతంత్ర్యం రావడం బ్రిటిష్   వాళ్ళు  దేశం వీడి వెళ్ళిపోయినా వారి ప్రభావం మాత్రం అలాగే నిలిచి పోయింది. మేరి లిల్లీయమ్మ తల్లి హిందువే అయినప్పటికీ భర్త అవలంభించే క్రిస్టీయానిటి  పట్ల వ్యతిరేకం   ఉన్నా  కూడా.. తన పెద్ద కూతుర్లకి హిందూ సంప్రదాయంలోనే వివాహం జరిపించారు.

మేరీ లిల్లీయమ్మ తండ్రి మాత్రం మేరీలిల్లీయమ్మ కి ఆఖరి అమ్మాయి అనేమో  బందర్ హిందూ కాలేజ్ లో చేర్పించి చక్కగా చదివించారు, ఆవిడ బాగా చదువుకుని టీచర్ ఉద్యోగం సంపాదించుకున్నారు. కానీ ఎందుకో వివాహం పట్ల విముఖత ప్రదర్షించేవారట. తాము క్రిస్టియన్స్ మి కాదు.. అచ్చమైన హిందువులమే..మమ్మల్ని క్రిస్టియన్లుగా భావించి మమ్మల్ని దూరంగా నెట్టకండి అనే ఆవేదన ఆమె మాటల్లో బాగా వినిపించేది    మతం పేరిట దూరంగా నెడుతున్నారని వ్యతిరేకభావం పెంచుకుని వచ్చిన క్రిస్టియన్ మతస్తుల పెళ్లి సంబంధాలను తిప్పికొట్టేది అని చెప్పుకునేవారు. ఆమెకి ఆమె పేరు కూడా ఇష్టం ఉండేది కాదు. తనకి రసవిహారి అనే ప్రాణ స్నేహితురాలు ఉండేది అని ఎప్పుడు ఎక్కువగా  చెప్పేవారు. అల్లాగే బూరగడ్డ నిరంజనరావు గారిని కృతజ్ఞతగా తలచుకునేవారు. ఆమెకి ఉద్యోగం ఇప్పించడానికి సాయ పడ్డారని కృతజ్ఞత అన్నమాట.

ఆమె  రిటైర్  అయ్యేటప్పటికి హయ్యర్ గ్రేడ్ టీచర్.  వివాహం చేసుకోకపోవడం వల్ల తన అక్క లిద్దరి పిల్లలని తన పిల్లలుగానే భావించి.. వాళ్ళకి మంచి-చెడు చూస్తూ ఉండేవారు. ఇక అక్క కొడుకు ఎర్రబాబు అని ఒకతను ఉండేవాడు.అతనికి పెద్దగా చదువుసంధ్యలబ్బక.. ఎక్కడ ఎక్కడో ఉంటూ అలాగే వివాహం చేసుకుని ఇతర రాష్ట్రాలలోనే ఉండేవారు.అతనికి ఇద్దరు కూతుర్లు. యెర్ర బాబు బాధ్యతా రాహిత్యం మేరి లిల్లియమ్మ కి అంత నచ్చకపోయినా..అతనంటే ప్రేమ ఉండేది. అలాగే ఇంకో   అక్క కొడుకు అంటే కూడా ప్రేమగా ఉండేది.  ఇంకా అక్కల కూతుళ్ళు మనుమరాళ్ళు గురించి చెప్పేవారు. సురేంద్ర అనే అతనికి  ఒక స్టేషనరీ షాప్  ఉండేది అని చెప్పేవారు.నాకు ఆమె తెలిసేటప్పటికి వృద్దాప్యం లో ఉన్న  తన అక్క ,ఆమె మతి స్థిమితం   లేని కొడుకుకి  ..ఆమె అండగా ఉండేవారు.వంట చేయడం,వారి బాగోగులు చూడటం, నాలుగైదు పేపర్స్   చదవడం ఆమె దిన చర్యగా ఉండేది. నా వద్ద ఉన్న బుక్స్ తీసుకుని వెళ్లి చదివి మళ్ళీ భద్రంగా తెచ్చి ఇచ్చేవారు. పిల్లలకి ఉచితంగా ట్యూషన్స్ చెప్పేవారు. ఆవిడ పాఠం చెపుతుంటే.. యెంత బాగా నాటుకునేదో.అలాగే ఏ విషయమైనా కూడా అంత బాగా  చెప్పేవారు.

ఒక రోజు నేను ఆవిడతో మాట్లాడుతూ ఉండగా .. ముంబాయి వెళ్ళే ట్రైన్ టికెట్స్ రిజర్వేషన్  గురించి ప్రస్తావన వచ్చింది. నేను మీతో కలసి ముంబయి వస్తానమ్మా..అన్నారు. ఎందుకు ఆంటీ..మేము టూర్ కి వెళ్ళడం లేదు. పర్చేజింగ్ కి ఐదుగురు ఆరుగురు కలసి వెళుతున్నాం.అటునుండి..సూరత్ ,వారణాసి కూడా వెళతాం. అన్నాను ఆవిడ స్థితిని దృష్టిలో ఉంచుకుని. నేను ముంబాయి లో టాటా  కేన్సర్ ఇనిస్ట్యూట్ కి వెళ్ళాలి. చెకప్ కోసం. నాకు ఎవరు తోడూ లేరు మీతో కలసి వస్తాను . అని అడిగారు. సరే అని ఆవిడకి టికెట్ రిజర్వ్ చేయించాను. ఆమె టికెట్ కి   రాయితీ కూడా ఇచ్చారు. అలాగే ఆమెకి సహాయంగా వెళుతున్న వారికి రాయితీ ఉంటుందని చెప్పారు.

అలా ఆమెని మాతో కలసి ముంబాయి తీసుకు వెళ్లి కేన్సర్ హాస్పిటల్ లో చెకప్ చేయించుకుని వచ్చే క్రమంలో చాలా ఇబ్బంది పెట్టేవారు. మేము కలసి వెళ్ళిన వాళ్ళందరూ నలబయిల లోపు వారు.  కావలసిన వస్తువులు,వస్త్రాలు కోసం ఎక్కడికైనా పరుగులు తీయడం,వాకబు చేసుకోవడం,వస్త్ర మార్కెట్ లు అన్నీ తెగ చుట్టేయడం ఉండేది. మేము విడిది చేసిన రూమ్లో ఉండండీ అంటే వినేవారు  కాదు, మేము  షాపింగ్ కోసం ముంబాయి నగరం అంతా..ఎక్కువ లోకల్ ట్రైన్ లోనే ప్రయాణం చేయాల్సి రావడం, రైల్వే   స్టేషన్ లో మెట్లు ఎక్కడం దిగడం ఆలస్యం అవడం జరిగేది. మా ఏజంట్ తో సహా అందరు  విసుక్కునేవారు. పెద్దవారికి సహాయం చేయకపోతే.. ఎలా అనేదాన్ని.  పాపం కాస్త వెనుక బడి నడిచేవారు తప్ప  మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టేవారు కాదు.మేము షాపింగ్లో ఏం కొంటున్నా.. ఆమెకి కావాలని తీసుకునే వారు తప్ప. :)

ఆమె బ్రెస్ట్  కేన్సర్ తో బాధపడుతూ అక్కడే ట్రీట్మెంట్ తీసుకోవడం ఆమెకి ముంబాయి చాలా  పరిచయమే! ,ఆమె భాషా పరిజ్ఞానం,అనుభవం మాకు ఉపయోగపడేవి కూడా. అందుకే అందరూ విసుక్కున్నా..మళ్ళీ ఆమెతో ప్రేమగా మాట్లాడేవారు. రెండు సార్లు అయితే మా అందరితో..  కలసి సూరత్ కూడా వచ్చారు. ఆమెని అక్కడే వదిలి ఒక సారి జైపూర్ వెళ్ళాం. వచ్చాక తెగ నసపెట్టారు నేనూ వచ్చీదాన్ని అని. అప్పుడు..మా గ్రూఫ్ లో వాళ్ళంతా.. ఇదిగోండి..వనజ గారు.. ఆమె వస్తే.. మనకి షాపింగ్ కుదరదు. ఈ సారి ఆవిడని తీసుకు రావద్దు అని గట్టిగా చెప్పేశారు.

అలా నాలుగేళ్ళలో టీచర్ గారు అని పిలిచే ఆమె నాకు ఆంటీ అయిపోయారు. చాలా శ్రద్దగా కేన్సర్ ఇనిస్ట్యూట్ లో ఆమెకి చెకప్ చేయించి డాక్టర్లతో వివరంగా మాట్లాడేదాన్ని.అది ఆవిడని కదిలించి వేసేది అనుకుంటాను. పదే పదే కళ్ళు తుడుచుకునేవారు. ఆమె మొదటి సారిగా ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు ఎవరు లేని ఏకాకి తనం ఒక స్నేహితురాలు ఆమెకు తోడు ఉండటం లాటి విషయాలు చెప్పేవారు. టాటా కేన్సర్ ఇనిస్ట్యూట్ చూస్తేనే మనసు విచలితమయ్యి పోయేది. అక్కడ ఉన్న బాధాతాప్త హృదయాలని..చిన్న చిన్న పిల్లలు కేన్సర్ బారినపడి.. వైద్యం కోసం వచ్చిన వారిని చూస్తే..ఏమిటీ జీవితం అనిపిస్తుంది. వైరాగ్యం వచ్చేసేది. నాకైతే మరణం అంటే ఉన్న భయం పోయింది కూడా ఒక రకంగా.

మా అమ్మ సర్వికల్ కేన్సర్ తో బాధపడి మరణించడం నేను ఎప్పుడు మర్చిపోలేను. డబ్బు ఉంది వైద్యం అందు బాటులో ఉంది.. ఓ..డయాగ్నేస్టిక్  లాబ్  వాళ్ళ నిర్లక్ష్యం వల్ల అమ్మకి ఉన్న కేన్సర్ ని  ప్రధమ దశలో  గుర్తించకపోవడం దురదృష్టకరం.  అమ్మ చనిపోతారు అని తెలిసిన తర్వాత ఆమెని ఒదిలి నేను ఒక్క రోజు కూడా ఉండలేదు. చిన్న పిల్లకి సేవ చేసినట్లు సేవ చేసాను. బ్రతకాలన్న ఆమె ఆశ తీరనందుకు ఏడ్చేదాన్ని. అలా నాకు ఆమెలో  చనిపోయిన మా అమ్మ కనబడేదేమో..ఆమెకి ఎప్పుడు అందుబాటులో ఉండి ఏ సాయం కావాలన్నా చేసేదాన్ని.  

వనజా.. అంటూ నేను ఉండే మూడవ అంతస్తుకి వినబడే వరకు కాంపౌండ్   లో నిలబడే గట్టిగా నాన్ స్టాప్ గా పిలుస్తూ ఉండేవారు.  మా అత్తగారు తెగ విసుక్కునేవారు కూడా. ఏమిటి ఆంటీ..అంటే.. రహస్యంగా చేతి వేళ్ళు చూపించేవారు. డబ్బు అవసరపడిందని అర్ధం చేసుకుని.. క్రిందికి దిగి వెళ్లి ఇచ్చేదాన్ని. అది ఆవిడకి మామూలే..వచ్చే పెన్షన్ డబ్బు అంతా.. ఏ అక్క కొడుకు ఆర్ధిక  అవసరాలకి ఎగదన్నుకు  పోయేవారు. లేదా ఏ మనుమడి,మనుమరాలకో వెళ్లిపోయేవి.  ఆ విషయం చెప్పుకోవడం కూడా ఆవిడకి ఇష్టం ఉండేది కాదు. నాకు మెడిసన్ కి యెంత డబ్బు అయినా చాలడం లేదమ్మా..అనేవారు. ముంబై లో చెకప్ అప్పుడు తప్ప ఆవిడ మళ్ళీ తన ఆరోగ్యం కోసం ఎప్పుడు ఖర్చు పెట్టరు అని నాకు తెలుసు. అలా ఉండేది ఆమె జీవితం.

తర్వాత మేము ఇల్లు మారడం వల్ల ఆమెతో నాకు దూరం పెరిగింది. ఎప్పుడైనా తనే వచ్చి నన్ను చూసి వెళ్ళేవారు. మా అబ్బాయిని చూసి మెచ్చుకుంటూ.. వరాల కొడుకుని కన్నావమ్మా.. అనేవారు.అంతలోనే. మా అబ్బాయితో..’’మీ అమ్మ చాలా గ్రేట్ లేడీ. తనకి ఎప్పుడు అండ-దండ ఉండాలి’’ అని చెప్పేవారు.  వాళ్ళ మనుమడుని పోల్చుకుంటూ ఇప్పుడు బాగా చదువుకుంటూన్నాడని   చెప్పేది.

అలా రోజులు జరుగుతూ ఉండగా.. సాయంత్రం ఆరు గంటలప్పుడు మా ఇంటికి వచ్చారు. నేను అప్పుడు స్నానం చేస్తున్నాను. ఇంటికి ఎదురుగా రోడ్డుకి అవతకి వైపునే నిలబడి నన్ను పిలుస్తున్నారట. లోపలకి రమ్మన్నా రారు. ఆవిడ తత్త్వం అంతే! స్వయంగా నేను వెళ్లి ఇంట్లోకి రండి ఆంటీ అని వెంటబెట్టుకుని లోపలకి తీసుకు వస్తే తప్ప రారు. అది నాకు తెలుసు కాబట్టి వెంటనే.. హడావిడిగా చీర కుచ్చెళ్లు పెట్టుకుంటూనే లోపలికి రండి ఆంటీ..అని ఆమె దగ్గరికి వెళ్లాను. ఎక్కడికో  వెళుతున్నావు కదమ్మా..అన్నారు. నా ఒంటిమీద ఉన్న  ఖరీదైన చీర చూసి. 

“అవునాంటీ..ఓ..ఫంక్షన్   కి బయలు దేరుతున్నాను. రండి..కాఫీ.తాగి వెళ్ళవచ్చు. ఏమైనా డబ్బు అవసరమా” అని అడిగాను. “లోపలికి రానమ్మా.. నువ్వే బయలుదేరి  త్వరగా రా.. బస్ స్టాప్ వరకు కలసి వెళదాం” అని అక్కడే నిలబడిపోయారు. నేను అయిదు నిమిషాల్లో బయటపడి.. మాట్లాడుకుంటూ.. బస్ స్టాప్ వైపు కి వెళ్ళే నడకలో..ఆమె చాలా దిగులుగా ఉన్నారని గ్రహించాను. ఏమిటి ఆంటీ..అని అడిగాను. ఏం లేదమ్మా..నిన్ను చూడాలని వచ్చాను అని.. మీరు వెళ్ళిరండి. నేను ఇంటికి వెళతాను అని అన్నారు. బస్ స్టాప్ ల కోసం చెరో వైపు విడిపోయాం.  అదే ఇక ఆవిడని ఆఖరి చూపు చూడటం.

తెల్లవారి సాయంత్రం లిల్లీయమ్మ కనబడటం  లేదంట అన్న వార్తా విన్నాను. అయ్యో..ఇదేమిటి నిన్ననేగా వచ్చారు అని అన్నాను. పరిచయస్తుల అందరి దగ్గర వాకబు చేస్తున్నారు కానీ..ఆమె ఎవరి ఇంట ఉండనే ఉండదు. ఏదో జరిగింది అనుకుంటూ..ఆ రాత్రి అంతా నిద్ర పట్ట లేదు. మిస్సింగ్ కేస్  మాత్రం నమోదు చేసి..వీలైనంత తిట్టుకుని..  అసహనం గా రోజులు లెక్క పెట్టుకుంటున్న ఆమె అక్క కొడుకులని  ఊరి ప్రెసిడెంట్ గారు మందలించి.. మా వూరి ప్రక్కనే ప్రవహిస్తూ   వెళ్ళే బందరు కాలువ వెంబడి వెతికించమని సలహా చెప్పారట. అల్లా వెతుకుండగా.. ఆమె మృతదేహం ఓ ఊరి లాకుల సమీపంలో దొరికింది.

ఆమెకి అంత్య క్రియలు కూడా అంత బాగా జరిపించలేదని తెలిసింది.ఆవిడ తనకున్న ఇంటిని ఆస్థిపాస్తులను.. అక్క కొడుకులకి వివరంగా వ్రాసి వీలునామా వ్రాయించే ఉంచారట, ఆరోగ్యం బాగోక వండి పెట్టె వారు లేక..వాళ్ళకు పెట్టావు అని వీళ్ళు, వీళ్ళకి పెట్టావని వాళ్ళు  డబ్బు కోసం ఆమెని సాధించడం తప్ప ప్రేమ,ఆదరణ పంచని కొడుకులు కాని కొడుకుల పట్ల విరక్తి భావం పెంచుకుని.. ఎవరికి భారం కాకుండా.. బాగా తిరుగుతూ ఉన్న స్థితిలోనే బలవంతంగా తనువు చాలించారు అని నాకు అర్ధమైంది.

తన వంతుగా విద్యా సేవ చేసి.. ఆ సేవలకి లభించిన ఫలితాన్ని జాగ్రత్తగా కొద్దిగా గొప్పో దాచుకున్న డబ్బుని,ఇంటిని అన్నిటిని వారికే పంచి.. తను కనుమరుగయ్యారు అని తలచుకుంటూనే గుండె బరువుగా మారుతుంది.ఆమె పోయి మూడేళ్ళు అయినా సరే  డిసెంబర్ మాసం వస్తే చాలు..ముంబాయి ప్రయాణం టాటా కేన్సర్ ఇనిస్ట్యూట్  మేరీ లిల్లియమ్మ గుర్తుకు వస్తారు. మనసు మూగగా రోదిస్తుంది కూడా.

మేరీ లిల్లియమ్మ అంటే.. ఓ..విజ్ఞానపవనం. ఓ..నిస్వార్ధ ప్రేమ జీవి. ఓ..ఆత్మాభిమాని. ఓ.. పరాయి దేశ, పర మత ద్వేషి. అలాగే ఓ..నాస్తికురాలు. ఓ..స్నేహశీలి .

మేరీ లిల్లియమ్మ అంటే.. సన్నగా పొడవుగా పెద్ద బొట్టు పెట్టుకుని, చక్కని నలగని నూలు చీర ధరించి,హ్యాండ్ బేగ్ తగిలించుకుని కొద్దిగా పక్కకి వంగి నడుస్తూ వెళుతుండటం గుర్తుకు వస్తుంది.

మరణానికి భయపడకుండా..నెమ్మదిగా.. నిండుగా ప్రవహించే..బందరు కాలువలోకి నెమ్మదిగా దిగి..ముందుకు ముందుకు నడచి వెళ్లి.. మునిగి తేలుతూ..శ్వాస వదలిన రూపమే కనులముందు కదలాడి.. మనసు విషాద రాగం ఆలపిస్తుంది.

ప్రేమతో  పెద్దలని బాగా చూసుకోవాలని  తనెరిగిన వారందరికీ ఉద్భోద చేసినట్లు ఉంటుంది.

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Really moving

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"ప్రేమతో.. పెద్దలని బాగా చూసుకోవాలని ఉద్భోద చేసినట్లు ఉంటుంది."
మంచి మాట చెప్పారండీ..

జయ చెప్పారు...

వెరీ హార్ట్ టచింగ్. ఇలాంటి వాళ్ళను తలుచుకున్నప్పుడల్లా మానవత్వం పారిపోయిందేమో అనిపిస్తుంది.

జ్యోతిర్మయి చెప్పారు...

కొన్ని జీవితాలు అంతే, కష్టపడడానికే పుట్టినట్టుంటారు. మా ఇంటి ఎదురు శాస్త్రి గారు అలాంటివారికి ఇది ఆఖరి జన్మ అని చెప్తుంటారు.