నా అనుభవం లోనుండి ఒక వాస్తవ విషయాన్ని తీసుకుని కథలో జొప్పించి ఆ కథని ప్రింట్ మీడియాకి పరిశీలనకి పంపినప్పుడు. ఆ కథ రిజెక్ట్ అయింది. అందులో ఉన్న అంశం .. వివాదాస్పదం అవుతుందని ప్రచురణకు అంగీకరించలేదు.
మతాంతర వివాహాలలో ఉన్న సమస్యల గురించిన విషయమే ఆ కథలో ఉంది. నిజాలని చెప్పుకోవడంలో కూడా భయపడే సమాజంలో, నిజాన్ని చెప్పడం కూడా సాహసం అవుతుందేమో అనుకున్నాను.
ఆ కథ లో విషయం లాంటి ఇంకొక విషయం ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను.
నేను ప్రత్యక్షంగా చూసిన మరొక మతాంతర వివాహం వలన భార్య,పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు...గురించి చెప్పడమే ఈ పోస్ట్.
మా పరిచయస్తులలో ఇద్దరు విద్యాధికులు ప్రేమించుకుని మతాంతర వివాహం చేసుకున్నారు. వారికి ఇరువురు పిల్లలు కలిగారు. ప్రేమించుకుని వివాహం చేసుకున్నంత మాత్రాన వారి మధ్య మత బేధాలు సమసి పోయాయా అంటే అదేమీ లేదు. వాకిట్లో ముగ్గు పెట్టడానికి వ్యతిరేకించడం దగ్గర నుండి ఇంట్లో ఆహారపు పదార్ధాల తయారీ వరకు భర్త చెప్పినట్లు జరగాల్సిందే! ఆమెని మతం మార్చుకోమని ఒత్తిడి తీసుకు రావడం జరిగింది. కానీ అందుకు ఆమె సమ్మతించలేదు. పిల్లల పేర్లు కూడా అతని ఇష్ట ప్రకారమే పెట్టడం జరిగింది. ఆమె ఇంట్లో మాత్రం భర్త చెప్పినట్లు నడుచుకుని బాహ్య ప్రపంచం లోకి అడుగు పెట్టేటప్పుడు నుదుటున ఒక స్టిక్కర్ అతికించుకుని ప్లాస్టిక్ నవ్వులు పులుముకుని తనలోని భావాలని బయట ప్రపంచం కి కనబడకుండా దాచుకుంటుంది.
ఆమెని అలా చూసిన అందరు.. మతాంతర వివాహం చేసుకుంటే మాత్రం ఏమిటి..వారు ఇరువురి మధ్య ఎంతటి అండర్ స్టాండింగ్ ఉందొ !. ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుంటూ వారిని వారు గౌరవించుకుంటూ ఆదర్శప్రాయంగా ఉంటున్నారు అనుకుంటారు.
కానీ నాలుగు గోడల మధ్య జరిగే తంతు ఎవరికీ తెలియదు..మరీ సన్నిహితులైన వారికి తప్ప.
వారి అమ్మాయికి పదమూడు ఏళ్ళు రాగానే తండ్రి తరపు సంప్రదాయం ఆమెని కమ్మేసింది. ఆరేళ్ళ తన కొడుకు తల్లి మతాచారాల వైపు ఆకర్శితుడవుతున్నట్లు గ్రహించిన ఆ తండ్రి బెల్టు దెబ్బలు,అట్లకాడ వాతలతో..తన మతాచారాన్ని బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించాడు . ఆ పిల్లవాడికి తన మతాచారం ప్రకారం ఒక సంప్రదాయ వేడుకని కూడా నిర్వహించి తనకి సంబంధించిన బంధు పరివారానికి విందు ఏర్పాటు చేసాడు.
పాపం ఆ పసివాడు.. తనకి ఇష్టం లేని ఆచారం పాటించడానికి కుళ్ళి కుళ్ళి ఏడవడం చూసాం.
తల్లిని ఆ పిల్లలు ఇద్దరు ప్రశ్నించేవాళ్ళు. నువ్వు ఆచరించని ఆ మతాన్ని మాచేత ఎందుకు బలవంతంగా ఆచరింపజేస్తున్నావు అని.
ఆ తల్లి దగ్గర చెప్పడానికి సమాధానం లేదు. తండ్రి మతంని మాత్రమే బిడ్డలకి వంశ పారంపర్యంగా చెప్పుకోవడం,ఆచరించడం ఆనవాయితీగా ఎందుకు మారింది?
ఆ తండ్రి బయట ప్రపంచం దృష్టిలో ఒక ఆదర్శవాది. సమాజాన్ని ఉద్దరించడానికి కంకణం కట్టుకున్నట్లు మాట్లాడతాడు. కానీ ఇంట్లో భార్య పిల్లల విషయంలో పరమ చాందస వాదాన్ని వినిపిస్తాడు.
మతాంతర వివాహం చేసుకోవాలి అనుకునే వాళ్లకి వాళ్ళని ఉదాహరణగా చూపించాలి అనుకుంటాను.
ఆదర్శాలుగా కనిపించే అన్నీ పై పై పూతలే! చదువులలో అభివృద్ధి సాధించారేమో కానీ మానసికంగా నాగరికంగా మారని ఎంతొ మంది ని చూస్తూ ఉంటాం. మతం గుప్పిటలో వారు కీలు బొమ్మలే!
మతం అంటే ఒక సంస్కారం. ఒక సదాచారం.
పిల్లలపై బలవంతంగా మతాచారాన్ని రుద్దడం,హింసించడం అనేది ఏ విధమైన సంస్కారం? తండ్రిగా తన ఆచారాన్ని పిల్లలకి నేర్పడం ఆ తండ్రి తప్పు కాకపోవచ్చు.
ఈ విషయంలో తప్పు ఎవరిదీ అంటే.. భార్యాభర్తల మధ్య అవగాహనా లోపం.వివాహానికి ముందు వాళ్ళు ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఏర్పర్చుకోకుండా.. వారికి జన్మించిన బిడ్డలని మతం పేరిట హింసించడం క్రూరత్వం కాదా!?
చదువులని,సంస్కారాన్ని మసక బారింపజేసి హృదయాన్ని బండగా మార్చే మతం మత్తు లో జోగుతున్న ఎందఱో.. మతాంతర వివాహం చేసుకోక పోవడమే మంచిది.
ఇలాంటి జంటలని చూస్తే మతాంతర వివాహాలని ఎవరైనా ప్రోత్సహించ గలరా !
9 కామెంట్లు:
వనజవనమాలి గారూ ..
"ఆదర్శాలుగా కనిపించే అన్నీ పై పై పూతలే!"
మీరు చెప్పింది నిజమేనండీ..
ఒక్క ఈ విషయమే కాదండీ,ఏ విషయమైనా ఆదర్శాలను మాట్లాడే వాళ్ళను నమ్మకూడదేమోనండీ..
ఎందుకంటే నిజంగా పాటించే వాళ్ళకు పైకి చెప్పుకోవాల్సిన అవసరం వుండదేమో..
వనజగారు,
నిన్నటి టపా మీద నా వ్యాఖ్య అసంపూర్తే, నా పూర్తి భావం చెప్పలేకపోయా.ఒక టపా రాసేటంత విషయం ఉంది, కాని రాయను. కారణం మీరు ప్రింటు మీడియాలో ఎదుర్కున్నదే.ఇటువంటి మనుషులు గోముఖ వ్యాఘ్రాలు. నా వ్యాఖ్య ఇప్పటికీ అసంపూర్తే.ఈ టపా కూడా అటువంటిదే.
>>> నిజాలని చెప్పుకోవడంలో కూడా భయపడే సమాజంలో, నిజాన్ని చెప్పడం కూడా సాహసం అవుతుందేమో అనుకున్నాను.
నిజం చెప్పారు. :))
వనజ గారూ, నాకు రెండు ప్రశ్నలు ఉన్నాయి. దయచేసి మీ అభిప్రాయం తెలియచేయగలరు.
1. మీరు చెప్పిన వివాహంలో భార్యాభర్తల మతాలు తారుమారు అయి ఉంటె పెద్ద తేడా ఉండేదా?
2. ఇద్దరిదీ ఒకటే మతమయినా, సంప్రదాయాలు/కట్టుబాట్లు/ఆచారాలు వేరే అయితే (ఉ. భర్త పంజాబీ, భార్య తమిళ్ లేదా భర్తది చాందసకుటుంబం, భార్య వైపు వారికి పట్టింపులు తక్కువ) పరిస్తితి దాదాపు ఇలాగే ఉండేది కాదా?
నా ఉద్దేశ్యంలో ఇక్కడ ప్రధాన సమస్య పురుషాదిపత్యమే, భర్త మతం కాదు భర్త మతమౌడ్యం అంత కన్నా కాదు.
ఇకపోతే తల్లి తండ్రుల మతాన్ని పిల్లలపై రుద్దడం సబబా అనేది వేరే విషయం. పిల్లలను తమ ఆస్తిగా భావించే తల్లితండ్రులు మన సమాజంలో అత్యధికం. పిల్లలకు వోటూ లేదు, గొంతూ లేదు.
వనజ గారూ!
కులాంతరం...
మతాంతరం...
మొదట బాగా ఉండి ఆతర్వాత
భిన్న సంప్రదాయాలు, భిన్నమైన ఆహారపు అలవాట్లు...
భిన్నాభిప్రాయాలతో
విభేదించుకున్న సంఘటనలు ఎక్కువ చూసాను...
అందుకని ఆ వివాహాలకి నేను పూర్తిగా వ్యతిరేకం...
@శ్రీ
వనజ వనమాలి గారు బాగుంది .. దాదాపు ఐదారేళ్ళ క్రితం అనుకుంటాను సబ్ చానల్ ( హిందీ ) లో ఇలాంటి అంశం పై పలు జంటలతో చర్చ నిర్వహించారు . జంటలన్నీ మతాంతర వివాహం చేసుకున్నవే ... చర్చలో ఈ మతాంతర జంటలన్నీ ఎట్టి పర్స్థితిలోను మతాంతర వివాహం చేసుకోకండి అని ఎకాబిప్రయం వ్యక్తం చేశాయి . పెళ్లి అంటే ఇద్దరి మధ్య కాదు రెండు కుటుంబాల మధ్య అని అవగహన ఉంటే ఇబ్బందులు ఉండవు . ఉద్యోగి , యజమాని మధ్య సంబంధం వేరు కాబట్టి వేరు మాటలు, వేరు సంస్కృతి ఉన్న ఇబ్బంది ఉండదు కానీ బార్య భర్తల సంబంధం అలా కాదు . ఉడుకు రక్తం తో ఉన్న వారికి అది అర్థం కాదు
రాజీ గారు.. ,ఈ స్పందనకి ధన్యవాదములు. మీరన్నట్లు ఆదర్శ వాదులకు మాటలు కాదు..చేతల ద్వారానే వారంటే ఏమిటో తెలియజేస్తారు.
@కష్టేఫలె ,, గారు..మీ అంతరంగం అర్ధం అయింది. మీరన్నట్లు ఇది అసంపూర్ణ పోస్టే! మీ స్పందనకి ధన్యవాదములు.
@ శిశిర గారు.. మీ మాటే నా మాట. థాంక్ యు!!
జై గొట్టిముక్కల గారు..మీ ప్రశ్నలలోని ఆంతర్యం అర్ధం అయింది. కులాతర వివాహాలలో కూడా అగ్రవర్ణం వారు వారికన్నా తక్కువైన వారి విషయంలో కూడా ఆధిపత్యాన్నే ప్రదర్శిస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ పోస్ట్ లోని విషయంలో పురుషాధిక్యత,పితృస్వామ్యం రెండు ఉన్నాయి. మతం మాత్రమే కాదు,కులాదిక్యత ఉన్న వివాహాలలో కూడా స్త్రీల స్వాతంత్ర్యం ఉండదు అని నేను చెప్పగలను.
పిల్లలకి మత స్వేచ్చ మాత్రమే కాదు.. ఇంకా చాలా లేని సమాజంలోనే మన పిల్లలు పెరుగుతున్నారు. అది విచారించ వలసిన విషయమే!
@ శ్రీ గారు..మీ వ్యాఖ్యకి ధన్యవాదములు. మతాంతర విహాలకి నేను పూర్తీ వ్యతిరేకం కాదు కాని.. స్పష్టత లేకుండా వివాహమాడి తర్వాత వగచే సందర్భాలు లేకుండా చూసుకోవాలి.
ఖచ్చితంగా పిల్లల కి ఇబ్బంది కల్గించే మతాచారాలు వాలా మనసులపై గాఢమైన ముద్ర వేసి అడ్డు గోడలు ఏర్పడటం వల్ల ఆ వివాహాలకి అర్ధం ఏమిటీ..అన్నది నా ఆలోచన.
@ బుద్ధా మురళీ గారు.. మీ వ్యాఖ్య వల్ల మరి కొన్ని విషయాలు తెలిసాయి. ధన్యవాదములు. కొందరి అనుభవాలు మరి కొందరి తొందరపాటు నిర్ణయాలకి బ్రేక్ వేయ గల్గితే అంతకన్నా కావలసినది ఏముంది?
@buddha murali:
పెళ్లి ఇద్దరు మనుషుల మధ్య కాదు రెండు కుటుంబాల మధ్య అని భార్యాభర్తలు అనుకోవాలనే ఆంక్ష సరి కాదేమో. భార్యాభర్తల మధ్య తాము దూరకూడదని ఇరువైపులా తల్లితండ్రులు అర్ధం చేసుకుంటే సంసారం బాగుంటుంది, కుటుంబాల మధ్య మనస్పర్తలు రావు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి