14, డిసెంబర్ 2012, శుక్రవారం

ఇంటి పేరు

ఇంటి పేరు  - వనజ తాతినేని

నేను గర్వంగా భాసించే నాపేరు కన్నా

ముందు  దిష్టి పిడత నా ఇంటి పేరు

ఫలానా వారి అమ్మాయినని మాత్రమే 

నాకు గుర్తింపునిచ్చిన ఇంటి పేరు..

పాశాలన్ని తెంచి నన్ను

ఆడనుండి ఈడకి నిర్దాక్షిణ్యంగా నెట్టిసి 

బలవంతంగా లాక్కున్న కర్కశి అది   

మంచి పేరుని మాత్రమే తెమ్మన్న 

పేరాశ మహమ్మారి ఇది  క్రొంగొత్తగా నా పై బడ్డ పెనిమిటింటి పేరు

ఎన్నో బరువులని బాధ్యతల్ని

మోయాల్సిన మెడమీది కాడి అది 

పెదవి విప్పక అన్ని భరించమన్నరాకాసి అది 

నన్ను మేల్కొనీయకుండా

చీకటిలో ఉంచి నాఆలోచనా మ్రొగ్గలని నలిపేసి  

నా  కన్నాముందే నా ఉనికిని చాటేసే 

మూర్చరోగి మెడలో బిళ్ళ అది ఒక ఇరుసులో బిగించి అరిగేదాక  

తిరగాలిసినదేనని తీర్మానించినట్లుంటుంది 

నాకెంతో  బరువనిపించినది  

నేను మోయలేనిదది 

ఆడదో ఈడదో లేకుండా

ఏదో ఒకటి ఉండకుండా

వదిలిందుకోవాలని ఉంది

అది లేకుండా నేను లేనా

నాళాలు తెగేలా ప్రశ్నించాలని ఉందిపైగా ఇప్పుడు కొత్తగా నన్ను

తోటి మనుషులనుండి విడదీస్తుంది.

మూలాలను ద్వేషించలేదు కానీ 

మనిషిని ఎదగనివ్వని మూలాలు 

వద్దనేవద్దని తెంపరితనం నిండుకుంది 

ఎదగాలని ఉంది

నిరూపించుకోవాలని ఉంది

నన్ను నేను నిరూపించుకోవాలని ఉంది

నేనొక వస్తువునో సంస్థనో భూమినో కాదని 

 పితృస్వామ్య చేవ్రాలు నా బతుకు పత్రాలపై 

బలవంతంగా లిఖించ వద్దని నిరసిస్తుంది. 


(ఓ.పదేళ్ళ క్రిందటి కవిత)

11 కామెంట్‌లు:

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

nice andi

అజ్ఞాత చెప్పారు...

వయసుకు తగిన ఆవేశం ఉందిలెండి కవితలో

జయ చెప్పారు...

అసలు పేరుని డామినేట్ చేసే ఇంటిపేరు....బాగా చెప్పారు వనజ గారు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ప్రిన్స్.. థాంక్ యూ వెరీ మచ్.

@ కష్టే ఫలే మాస్టారూ.. ఇప్పుడు కూడా అలాంటి భావ తీవ్రతే ఉందండీ! కానీ నలుగురితో..నారాయణ లా ఉండక తప్పడంలేదు. :)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జయ గారు.. అమ్మయ్య..మీరన్నా అర్ధం చేసుకున్నారు.థాంక్స్ అండీ!
అసలు ఈ ఇంటి పేరు ఉంది చూసారు.చాలా చికాకు కల్గుతుంది
ఇంటి పేరుతొ ప్రసిద్దులయిన వారు ఉన్నారు ఉంటున్నారు.
ఎక్కడికైనా వెళ్ళామా.. వ్యక్తి కన్నా..కొంతమంది ఇంటి పేరు ఏమిటో తెలుసుకోవాలి. అనుకుంటారు. అందువల్ల వారి కులం అంచనా వెయ వచ్చు అనే దిక్కుమాలిన తెలివితేటలూ.

ఒకొకరు ..అమ్మో! మీరు ఫలానా ఇంటి పేరా?! బాగా గడుసరులు,తెలివికలవారు అని అంటారు. ఇంటిపేరు కలవారు అందరూ అలా ఉంటారా?

ఇంకొక చోట మీరు మంచి స్థితిమంతులు మీకేమిటండి అంటారు.
నాకైతే ఇలా అనిపిస్తూ ఉంటుంది. వ్యక్తి మూలాలు అవసరమే! కానీ కులం పేర,మతం పేర మనుషులని విడగొట్టడం దూరంగా ఉండటం..నాగరిక లక్షణం కాదు కదా!

ఇప్పుడు ఇంటిపేరు పేరిట కుంపట్లు మొదలవుతున్నాయి. ఏం చేద్దాం చెప్పండి? అందుకే ఇలా వెళ్ళ గ్రక్కాను

జలతారు వెన్నెల చెప్పారు...

ఇంటి పేరు లేని కొందరిని సమాజం ఆదరించదండి.
కవిత బాగుందండి

మాలా కుమార్ చెప్పారు...

బాగా చెప్పారు వనజగారు . కాని నలుగురితో నారాయణా అనక తప్పదు కదా :)

చెప్పాలంటే...... చెప్పారు...

బాగా చెప్పారు వనజ గారు.

పల్లా కొండల రావు చెప్పారు...

మీ కవిత బాగుంది.

సహజంగా మన పేరులో వంటికి సంబంధించినది ఒకటి , ఇంటికి సంబంధించినది ఒకటి కలిపి రెండు పేర్లుంటాయి.

కానీ కొందరికి ఇంటిపేరుండదు. తండ్రిపేరు మొదట్లోనో చివర్లోనో తగిలించి ఉంటుంది. కొందరికి అది కూడా ఉండదు.

మొత్తానికి ఇంటిపేరు మన సంస్కృతిలో ఎలా భాగమయ్యిందో , ఆడవారికి రెండు ఇంటిపేర్లు సమస్య ఎందుకో చరిత్ర చూడాలనుకుంటాను.

కాకుంటే ఉద్యోగం చేసే వారిలో , ప్రముఖులలో వాళ్ల ఇష్టం వచ్చిన ఇంటిపేరు వాడుతుంటారు.

భవిష్యత్తులో ఇది ఏ రూపు తీసుకుంటుందో చూడాలి.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మాలా గారు.. థాంక్ యు వెరీ మచ్ అండీ!

@పల్లా కొండలరావు గారు.. మీ స్పందనకి ధన్యవాదములు.

ఈ ఇంటి పేరు మోయడం అన్నది చాలా కష్టం అండీ! అంతర్లీనంగా మహిళలపై చాలా భారం వేసే భాద్యత అది.

ఇప్పుడైతే ఇంటి పేరు ని బట్టి మనుషులు విడిపోతున్నారు . పురుషుల మాటున స్త్రీల వ్యక్తిత్వం మరుగునపడిపోతుండటం కూడా చూస్తుంటాం. ఆ ఆలోచనల ప్రభావమే ఈ కవిత.

@జలతారు వెన్నెల గారు.. మీ అభిప్రాయం బాగుంది. పితృస్వామ్య భావజాలం తో మునిగిపోయినవారి భావాలను మోస్తున్న సమాజం మనది. నేను ఇంటి పేరుని వ్యతిరేకించలేదు.

స్త్రీల మనోభావాలని గురించి చెప్పాను. అంతే! థాంక్ యు సో మచ్!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

చెప్పాలంటే మంజు గారు.. నా ఫీలింగ్స్ పట్ల కల్గిన ఏకాభిప్రాయం కి ధన్యవాదములు.