ఎక్కడ అమ్మా..అన్న పిలుపు విన్నా .. నా బిడ్డ అమ్మా.. ! అని పిలిచినట్లే ఉంటుంది.
నిన్న 600 వ పోస్ట్ లో ఉంచిన పాటలో ఒక చిన్న పిల్లవాడు.. అమ్మా! అంటూ పిలుస్తూ కనిపించాడు.
నేను వెంటనే .. తొలిసారి ఆ పిలుపు విన్న అపురూపమైన రోజులోకి వెళ్ళి పడ్డాను.
తల్లికి మాతృత్వం కన్నా..గొప్ప హోదా ఏదైనా ఉంటుందా ..చెప్పండి.?
నాకైతే అంతే!
ఇప్పుడు చెప్పబోయే విషయం ఏమంటే .. తన ప్రాణమైన బిడ్డ గురించి ఓ..తల్లి ముచ్చట్లు..
ఆ బిడ్డ సుమారు పది నెలల వయసు ఉన్నప్పుడు ఎప్పుడూ .నీళ్ళ వైపు చేతులు చూపించేవాడు. వారి వ్యవసాయ భూమిలో దక్షిణం నైరుతి భాగంలో ఇల్లు ఉండేది. ఈశాన్యభాగంలో భూగర్భ జలంని పైకి తోడే బోరు బావి ఉండేది. 5 హార్స్ పవర్ మోటార్ ఉండేది. కేవలం నలబై అడుగుల లోతు నుండే 5 ఇంచ్ పైపు నిండుగా పుష్కలంగా నీళ్ళు బయటపడుతుంటే.. చుట్టూరా అయిదు ఆరు అడుగుల వైశాల్యంలో రెండు అడుగుల లోతులో చిన్నకుంట ని తలపిస్తూ.. ఉండే ఆ వైపు వెళ్లాలని చేయి చూపిస్తూ ఉండేవాడు.
పనులు చేసుకుంటున్నప్పుడు బాబు ఆ వైపు వెళ్ళే ప్రమాదం ఉందని.. ఇంకా బాబుని ఎత్తుకుని ఆడి పించడా నికని ఒక చిన్న అమ్మాయిని ఇంట్లో పెట్టుకున్నారు. ఆ అమ్మాయి పేరు గీత . ఆ అమ్మాయి కూడా బాబుని పెద్దగా మోసేపనిలేకుండా అమ్మే బాబుని చూసుకునేది . ఆ అమ్మాయిని అందరూ గీతా ..గీతా అని పిలుస్తూ ఉంటె ..బాబు కూడా గీతా అని పిలిచే వాడు. అత్త,తాత, అమ్మ అనకుండా.. గీతా అన్న మాట వచ్చేసింది. ఇంకా గుండు ,గుండు అని కూడా అంటున్నాడు. బాబు నన్నెప్పుడు అమ్మా..అని పిలుస్తాడో..అన్నట్లు ఎదురు చూసేది అమ్మ.
రెండు బక్కెట్లు వేడి నీళ్ళు పోసినా నిద్ర పోడు .. . నిద్రపోతేనే కదా బలం అని అనేది అత్తమ్మ. బాత్ రూమ్‌లో స్నానం చేయించి బయటకి తీసుకు వస్తుంటే.. మోటార్ బావి దగ్గరున్న నీళ్ళ వైపు వెళ్లాలని ఏడ్చేవాడు. అక్కడికి తీసుకుని వెళ్లి రెండు నిమిషాలు నీళ్ళలో దింపి నీళ్ళతో ఆడించి తీసుకు వస్తుంటే అక్కడే ఉండాలని ఏడ్చే వాడు. ఆ ఏడుపు ఆపడానికి మళ్ళీ ఏ ట్రాక్టర్ సీట్ లోనే కూర్చోబెట్టాలి.
అలా ఒకరోజు మోటారు బావి దగ్గర ఉన్న నీళ్ళ కుంటలో కాసేపు ఆడిపించి ఇంట్లోకి తీసుకువచ్చి ఎంత మాయ చేసిననా ఏడుస్తూనే ఉన్న "చంద్ర బాబు" ని తీసుకు వెళ్లి ట్రాక్టర్ సీట్ లో కూర్చో పెట్టి.. ఒంటికి పౌడర్ వ్రాస్తుంది అమ్మ.
అబ్బాయిని మాయ చేయడానికి పౌడర్ పోసి వాడుకునే స్టీల్ డబ్బా మూత తీసి ట్రాక్టర్ బాయ్ నెట్ మీద బొంగరంలా తిప్పి వదిలింది. ఆ మూతకి ఉన్న మరబోడిప ఆధారంగా ..అలా బొంగరంలా ఒక నిమిషం పాటు తిరుగుతూ ఉండిపోయింది.ఏడుస్తున్న బాబు టక్కున ఏడుపు ఆపేసి దానివకే చూస్తూ ఉండి పోయాడు. బాబు ఆసక్తి చూసి అమ్మ మళ్ళీ పౌడర్ డబ్బా మూత ని అలాగే తిప్పివదిలింది. . అలా తిరుగుతూ తిరుగుతూ స్థలం చాలక ట్రాక్టర్ బాయ్ నెట్ పై నుండి క్రిందికి పడిపోయింది
అమ్మ .. అరె పడిపోయింది అనుకుంటూ ఉండగానే ..బాబు..నోటి నుండి ..అమ్మా.. అనే పిలుపు అమ్మకి వినబడింది. వంగి ఆ మూత ని తీయ బోయిన అమ్మ..అలా సంభ్రంగా ఆగిపోయింది.. బాబు..మళ్ళీ అమ్మా..అది అది.. అంటూ.. పిలుస్తూ దాని వైపు చేయి చూపించాడు. అమ్మ వెంటనే .. బాబుని ట్రాక్టర్ సీట్లో నుంచి తీసుకుని ..హృదయానికి హత్తుకుని ముద్దులు కురిపించింది.
బాబు నన్ను అమ్మా..అని పిలిచాడు..అని సంబరంగా అందరితో.. చెప్పింది ఆ రోజంతా..
తన చిన్నప్పటి ముచ్చట్లు, తన చిలిపి పనులు,అల్లరి, ఇలాంటి విషయాలు వినడమంటే బాబుకి చాలా ఇష్టం.
అమ్మ ప్రక్కన పడుకుని ..ఇంకా చెప్పు..ఇంకా చెప్పు ...ఏమి అనేవాడిని అని అడుగుతుంటాడు. అమ్మ చెపుతూ ఉంటుంది.
నేను మాటలు చెప్పిన రోజు ,నడిచిన రోజు,స్కూల్ కి మొదటి సారి వెళ్ళిన రోజు.. ఇలాంటి ముచ్చట్లు అన్నీ వ్రాసి ఉంచు.. నా పిల్లలకి నేను చెప్పాలి అంటూ ఉంటాడు.బాబు. అమ్మ అలాగే అంటుంది.
కానీ "అమ్మ" కి ముఖ్యమైన రోజు .."అమ్మా!" అని పిలిపించుకున్న రోజే కదా!
ఆ అమ్మని నేనే. బిడ్డ ... " మా చిరునవ్వుల చంద్రుడు"
అందుకే ఆ అపురూప క్షణాలని గుర్తు చేసుకుంటూ... '"అమ్మా " అన్న పిలుపు కన్నా వేరొకటి మిన్న కాదు..నాన్నా..!
చిన్ని.. బంగారం .. !
ఈ అమ్మ .. నీ కోసం వ్రాసుకున్న కవిత.. అమ్మ మనసులో ..ఓ..మాట.
బాబు ఫోటో ఎడిట్ లో తయారు చేసుకున్న చిత్రం ఇది. తను యు .ఎస్ వెళ్ళే ముందు సిస్టం పోల్దర్స్ లో జాగ్రత్తగా సేవ్ చేసుకుని ఉన్న ఈ చిత్రం అమ్మకి కనబడింది . ఇదిగో.. ఇలా ఉంది ఆ చిత్రం. అర్ధమైన అమ్మకి...
కనుచెమరింతలు.
4 కామెంట్లు:
తల్లిది నిజంగా ఆనందం, మాటలలో చెప్పలేనిది.
వనజ గారు నాకు మాటలు రావటం లేదు... కవిత చాలా బాగుంది అండి...
'అమ్మ మనస్సు' అనిర్వచనీయం. మీ మాతృహృదయ స్పందనలు అపురూపం. అమ్మ ఆనందం అమూల్యం.
mi 600 postlaku abhinandanalu.....amma manasu chakkagaa chepparu congrats nice post vanaja garu
కామెంట్‌ను పోస్ట్ చేయండి