క్రొత్తగా పెళ్లి చేసుకుని విదేశానికి వచ్చి బయటకి కదలకుండా యెప్పుడూ యింట్లోనే వుండాల్సి వచ్చినందుకు విసుగ్గా వుంది స్వాతి కి. అనుకోకుండా వొక ఆహ్వానం అందింది. ఆటవిడుపుగా ఆ కార్యక్రమానికి హాజరైంది. అక్కడ అనేకమంది తెలుగు వారిని చూసి సంతోష పడింది. అందరిని పరిచయం చేసుకుంది. అంతా తెలుగు వారే కావడంతో అది ఆంధ్ర దేశంలో వొక వూరులాగానే తోచింది. అదొక కమ్యూనిటీ హాలు. ఆ రోజు అక్కడ వొక కార్యక్రమం జరగబోతుంది. ప్రత్యేకించి స్త్రీలకి సంబంధించిన కార్యక్రమం. పరాయి భావనలో మూలాలు గుర్తుకు రావడం మూలంగానేమో దేశంలో జరిగే ప్రతిచిన్నవిషయాన్ని కూడా వేడుక చేసుకోవడానికి అలవాటు పడి పోయిన వారికి అదొక అవకాశమే ! వారానికి అయిదు రోజులు యంత్రాలలా పనిచేసి ఆటవిడుపు కోసం వెదుక్కుని నలుగురు కలసే సందర్భం కోసం యెదురు చూస్తున్న వారికి కందుకూరి జయంతి గుర్తుకు వచ్చింది. స్త్రీల పునర్వివాహలు జరిపించడానికి విశేషంగా కృషి చేసిన విధమూ గుర్తుకు వచ్చింది. వెంటనే వొక కార్యక్రమం వారి ఆలోచనల్లో రూపుదాల్చింది. నాటి కాలానికి నేటి కాలానికి వచ్చిన మార్పులు గమనిస్తూ పునర్వివాహాల వల్ల కలిగే మంచి-చెడు పరిణామం గురించి వొక చర్చా కార్యక్రమం నిర్వహించదలచారు. ఒంటరి స్రీలు - పునర్వివాహం అనే అంశం పై యెవరైనా మాట్లాడవచ్చు వారి వారి అనుభవాలని చెప్పవచ్చని ప్రకటించారు రోజంతా అదే విషయం పై కార్యక్రమం జరుగుతుంది కాబట్టి చాలా మంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు.కొందరేమో యిదే౦ పనికిమాలిన కార్యక్రమం అని చిరాకు పడ్డారు. స్వాతి కార్యక్రమాన్ని ఆసక్తిగా చూస్తూ వుంది . కొందరు చక్కటి తెలుగులోనూ, మరి కొందరు ఇంగ్లీష్ లోను వారి అనుభవాలని, అభిప్రాయాలని చెబుతున్నారు. చాలా మంది పునర్వివాహం చేసుకోవడం చాలా మంచి వుద్దేశ్యమని వొంటరి జీవితాలకి తోడూ, ప్రేమ దొరుకుతాయని, మనిషి ఆనందంగా బ్రతకడానికి వివాహం చాలా అవసరమని చెపుతున్నారు. వారి వారి మాటలు వింటున్న స్వాతికి కోపం ముంచుకొస్తుంది. ప్రక్కనే ఉన్న భర్త అనిల్ స్వాతి చేయి పట్టుకుని వారిస్తూనే ఉన్నాడు అయినప్పటికీ భర్త మాటని లక్ష్య పెట్టకుండా లేచి గబా గబా నిర్వాహకుల దగ్గరికి వెళ్ళి తనకి మాట్లాడటానికి అవకాశం యివ్వమని కోరింది. నిర్వాహకులు ఆమె పేరుని నమోదు చేసుకుని వరుస క్రమము లో ఉంచారు. " స్వాతి .. యే౦ మాట్లాడదల్చుకున్నావ్ ? ఆంటీ గురించి చెప్పాలనుకుంటున్నావా ? అలాంటి బుద్ది తక్కువ ఆలోచన మానుకో ! మన గురించి మనమే చాటింపు వేసుకోవడం అవసరమా ? " "మన అనుభవాన్ని ఇతరులతో పంచుకుంటే తప్పేమిటి? ఆ అనుభవం ఇతరులకి మంచి చేయవచ్చు కదా! " "ఇక్కడున్నంత మాత్రాన, స్వేచ్చగా యెవరికీ తోచింది వారు చేసేయవచ్చు అనుకోకు. మనకి అక్కడ వున్నట్లే ఇక్కడ వారిలో కూడా చాలా విషయాలలో మూర్కత్వం వుంది పై పైకి అందరూ నాగరికులే , చదువుకున్నవారే , సంస్కారం ఉన్నవారే! కానీ మన జీవితాలలో వున్న చిన్న లోపం కనిపెట్టినా చెవులు కొరుక్కుంటారు, వెలివేసినట్టు చూస్తారు. ఎవరికీ మనం అనుకున్నంత విశాల హృదయం ఉండదు. ముందు అయ్యో ! అలాగా? అని సానుభూతి చూపించి మన వెనుక మళ్ళీ తాటాకులు కడతారు. ఇతరులు మన గురించి తక్కువగా చూడటం, హీనంగా మాట్లాడటం నాకిష్టం లేదు. నాకిష్టం లేని పని నువ్వు చేస్తావని నేననుకోను ఇకపై నీ ఇష్టం " అని చెప్పాడు. స్వాతి మౌనంగా ఉండి పోయింది. "అక్కడొక ఫ్రెండ్ విష్ చేస్తున్నాడు వెళ్లి వస్తాను. నువ్వు వస్తావా? "అని అడిగాడు. "నేను రాను మీరెళ్ళి రండి" ముభావంగా చెప్పింది. కార్యక్రమంలో పాల్గొనడానికి తన వంతు వచ్చేటప్పటికి స్వాతి లేచి వెళ్ళింది వెళ్ళేటప్పుడు భర్త వైపు చూడనుకూడా చూడలేదు . చూస్తే మరొకసారి చూపులతో అయినా తనని హెచ్చరిస్తాడని. స్వాతి వేదికపైకి వెళ్లి మైక్ తీసుకుని చుట్టూ చూసి ఒకసారి బలంగా గుండెల నిండా గాలి పీల్చుకుని వదిలింది. నా అనుభవాన్ని చెప్పాలంటే కొంచెమెక్కువ సమయమే పడుతుందని అందుకు అనుమతి ఇవ్వాలని అడిగింది. నిర్వాహకుల అనుమతి లభించడంతో స్వాతి చెప్పడం మొదలెట్టింది. నా పేరు స్వాతి . నాకు నా తల్లి అంటే చాలా ఇష్టం . అందరికి అమ్మ అంటేఇష్టమే, కానీ నాకు మరీ ఇష్టం నేను పుట్టి నాలుగు నెలలైనా కాక ముందే నాన్న చనిపోయాడు. భర్త పోయిన బాధని. తనలో ఉబికే దుఃఖాన్ని తనలోనే దాచేసుకుని బిడ్డే ప్రపంచం అన్నట్లు బతుకుతూ అత్తమామలకి, కన్నవాళ్ళకి మధ్య తలలో నాలుకలా మెలుగుతూనే ఆగి పోయిన చదువు కొనసాగించి లెక్చరర్ అయింది అమ్మ. సన్నిహితులు యెవరైనా యెన్నాళ్ళు యిలా మోడులా వుంటావమ్మా ! స్వాతిని చూసుకోవడానికి మేమంతా లేమూ ! నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అని చెవిలో ఇల్లు కట్టుకుని మరీ చెప్పేవారు. " స్వాతికి నాన్న యెలా ఉంటారో తెలియదు నేను పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయి తనకి అమ్మని దూరం చేయమంటారా? అప్పుడు నేను అమ్మని కాను మర బొమ్మని అవుతాను. నా బిడ్డ తోడిదే నా లోకం, అమ్మని అనిపించుకొవడమే నాకు గొప్ప కానుక . మరిక యే కానుకలు వద్దు " అని సున్నితంగా తిరస్కరించేది. నాన్న గురించి అమ్మ చెప్పే టప్పుడు చూడాలి.. ఆమె ముఖం నవ్వుతో మెరిసిపోయేది. నాన్న నాకు స్వాతి అని పేరు పెట్టడం వెనుక కూడా ఒక విశేషం ఉందట . స్వాతి సినిమా వచ్చినప్పుడు నేను పుట్టానట. నాన్నగారికి స్వాతి సినిమా నచ్చి నాకు స్వాతి అని పేరు పెట్టారని అమ్మ చెపుతుంటే విని స్వాతి సినిమాని ఎన్నిసార్లు చూసి ఉంటానో ! సినిమా చూసిన ప్రతి సారి మా అమ్మకి మళ్ళీ పెళ్ళి చేయాలనిపించేది. మా నాన్నకి తను చనిపోతానని ముందే తెలుసేమో! అందుకే నాకీ పేరు పెట్టారేమో! అని తెగ ఆలోచనలు ముంచుకొచ్చేవి. అమ్మని ఆమాటే అడిగితే చప్పున పెదవులపై చూపుడు వేలుంచి "తప్పు అలా మాట్లాడ కూడదు యెవరు యెప్పుడు చనిపోతారో యెవరికి తెలియదు. చనిపోయేలోగా మంచి పనులు చేయాలని అనుకోవాలి " అని చెప్పేది. మరి నీకు పెళ్ళి చేయడం మంచి పనే కదా ! నాకు నాన్న కావాలనుకోవడం మంచి పనే కదా! అని అమ్మని విసిగించేదాన్ని. నేను, అమ్మ, నాయనమ్మ వాళ్ళింట్లో వుండే వాళ్ళం. నాయనమ్మ తాతయ్య ఇద్దరూ కూడా అమ్మని కూతురిలా చూసేవాళ్ళు .మా ఇంటి ప్రక్కనే రాజేశ్వరి టీచర్ ఉండేవారు . ఆమె భర్త కూడా టీచర్. ప్రమోషన్ పై ఆ వూరి స్కూల్ కి హెడ్మాస్టర్ అయ్యారు. ఆయన పేరు మోహన కృష్ణ. పేరుకు తగ్గట్టు మోహనంగా వుండేవారు, యెప్పుడూ నలగని ఖద్దరు సిల్క్ దుస్తులుతో పాటు నలగని నవ్వు కళ్ళకి నల్లద్దాల చలువ కళ్ళ జోడుతో చాలా హుషారుగా కనిపించేవారు స్కూల్లో పిల్లలకి ఆయనంటే యెంత భయమో, అంత యిష్టం కూడా! భార్యభార్తలిద్దరూ వొకే స్కూల్ లో పని చేసేవారు రాజేశ్వరి టీచర్ మాత్రం లావుగా, నల్లగా పళ్ళెత్తుగా, అందవిహీనంగా వుండటమే కాదు యెప్పుడూ దిగులు ముఖంతో కనబడేది , స్కూల్, వంటిల్లు తప్ప ఆమెకి మరో ప్రపంచం వుండేది కాదు. రాజేశ్వరి టీచర్‌కి ఇద్దరు మగ పిల్లలు. వాళ్ళిద్దరూ కూడా మా వూరి హైస్కూల్లోనే చదువుకుంటూ వుండేవారు. అమ్మ రేడియో వింటూ, పుస్తకాలు చదువుతూ, నాతో ఆడుకుంటూ, నన్ను చదివిస్తూ వుండేది. నేనేమో మోహన కృష్ణ మాస్టారు వైపు అదేపనిగా చూస్తూ వుండేదాన్ని. మానాన్న వుంటే అచ్చు యిలానే వుండేవారేమో అనుకునేదాన్ని. మోహన్ కృష్ణ అంకులేమో మా అమ్మ వైపు దొంగ చూపులు చూస్తూ వుండేవాడు. ఆవయసులో అలా ఎందుకు చూస్తున్నాడో అర్ధం కాకపోయినా కూడా ఆ చూపులలో యేదో తప్పు ఉందని నాకు తెలిసిపోయేది. మోహన కృష్ణ మాస్టారి చూపులని గమనించి అమ్మ బయటకే వచ్చేది. కాదు నేను సెవెంత్ క్లాస్ కి వచ్చేటప్పటికి తాతయ్య చనిపోయారు. అమ్మకి మా వూరి నుండి వేరేచోటకి బదిలీ అయింది. మాతో పాటు నానమ్మ , నానమ్మ వాళ్ళ అమ్మ జేజమ్మ కూడా మాతో వచ్చేసారు. అలా ఒక యేడెనిమిది సంవత్సరాల పాటు మా వూరి వైపుకి రాకుండానే గడిపేసాము. నేను ఇంజినీరింగ్ చదువుతూ వుండగా మా జేజమ్మ చనిపోయింది. ఆమె అంత్యక్రియల కోసం అని మళ్ళీ మా వూరు రావాల్సి వచ్చింది. నా చిన్నప్పటిలా ఆరాధనగా కాకపోయినా ఆసక్తిగా మోహన కృష్ణ మాస్టారు వొంక చూస్తూ ఉండి పోయాను వాళ్ళు మా యింటి ప్రక్కనే ఒక పెద్ద బిల్డింగ్ కట్టేశారు . వారి అబ్బాయిలు ఇద్దరూ విదేశాలలో స్థిర పడ్డారని పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయని చెప్పారు. మేము ఒక నెల రోజులు అక్కడ వుండి తిరిగి అమ్మ పని చేస్తున్న వూరికి వచ్చేసాము. కొన్ని నెలలకి మోహన కృష్ణ మాస్టారి భార్య ఉరి వేసుకుని చనిపోయిందని నానమ్మ చెప్పింది. ఎందుకూ అనడిగితే ఏమో తెలియదు అంది. అప్పుడు నాలో యెక్కడో అణచి వేసిన వూహలు మళ్ళీ నిద్ర లేచాయి. నానమ్మ ప్రక్కన జేరి "నానమ్మా ! నాకు నాన్న కావాలి" అని చెప్పాను. ఇరవై రెండేళ్ళ పిల్ల నాన్న కావాలి అంటే అర్ధం చేసుకోకుండా ఉంటుందా? "నీకు నాన్న కావాలని మీ అమ్మకి యెప్పుడో చెప్పాము, తనే వద్దని భీష్మించుకుని కూర్చుంది . తను కావాలంటే నేను వద్దంటానా? మీ అమ్మని వొప్పించు. అయినా ఈ వయసులో వున్న మీ అమ్మకోసం భర్తని యెక్కడని వెదుకుతావు ? వెర్రి మొహం నువ్వూనూ " అని చివాట్లు పెట్టింది. "ఎక్కడో వెతకక్కరలేదు. మన యింటి ప్రక్కన మోహన కృష్ణ మాస్టారు అమ్మకి తగిన జోడు" అని చెప్పాను. నానమ్మ ఆశ్చర్యంగా చూసి " అతనా అతనైతే పర్వాలేదు, వ్యక్తి కూడా మంచి వాడే ననుకుంటాను, పాపం యెందుకో ఆ రాజేశ్వరి టీచర్ ఆ వయసులో అలా ఉరేసుకుని చనిపోయింది " అంది. నాయనమ్మ దగ్గర ఆమోదం లభించడంతో నాకు యేనుగు యెక్కినంత ఆనందం కల్గింది. ఇక అమ్మ దగ్గర నా ఆలోచనలని కార్య రూపంలో పెట్టడానికి ప్రయత్నించాను. అమ్మ ససేమిరా వొప్పుకోలేదు నేను అలిగాను, తిండి తినకుండా బెట్టు చేసాను. ఆఖరి అస్త్రంగా నాకు పెళ్ళి చేసేటప్పుడు కన్యాదానం చేయాలి కదా ! నాకా లోటు లేకుండా వుండాలంటే నువ్వు పెళ్ళి చేసుకోవాలి, నాకు నాన్న కావాలి అని చెప్పాను. నాన్న లేకపోడం ఆస్తుల వాటాల విషయంలో అయినవాళ్ళ వైఖరిలతో విసిగి పోయిన అమ్మ బంధువుల పట్ల విముఖత పెంచుకుంది. అమ్మకి నా పెళ్ళి విషయంలో బంధువుల అండ దండా వీసమెత్తు అయినా తీసుకోవడం యిష్టం లేకపోయింది. పదే పదే అదే విషయాన్ని నేను అడగడం నానమ్మ కూడా నాకు వత్తాసు పలకడం చూసి ఆలోచనలోపడింది. అమ్మ ఆలోచనలని గ్రహించి నేను కార్యాచరణ లోకి దిగాను. మోహన కృష్ణ మాస్టారుతో మాట్లాడి ఆయనని వొప్పించాను ఆయన సులభంగానే వొప్పుకోవడంతో పాటు వెంటనే కొడుకులిద్దరికీ ఫోన్ చేసి మాట్లాడారు. వాళ్ళు కూడా సుముఖంగానే వున్నారని చెప్పారు. రెండు నెలలలో పెళ్ళికి తేదీని నిర్ణయించాము. అమ్మ పెళ్లి రంగ రంగ వైభవంగా చేయాలని అనుకున్నాను. కానీ అమ్మ సున్నితంగా తిరస్కరించి గుడిలో సింపుల్ గా దండలు మార్చుకుంటే సరిపోతుందని, అలాగే తనకి యిష్టమని కూడా చెప్పింది. పెళ్ళికి రెండు మూడు రోజుల ముందు మోహన కృష్ణ మాస్టారు పిల్లలు ఇద్దరూ వచ్చారు. నేను వాళ్ళని అన్నయ్యా అంటూ సంతోషంగా పిలిచాను వాళ్ళు చెల్లెమ్మా.. అంటూ ఆప్యాయంగానే ఉన్నారు అన్నయ్యలుగా నాకు వొక వడ్డాణంని బహుకరించారు. అమ్మకి కొన్ని గిఫ్ట్ లు ఇచ్చారు. అమ్మ నాన్నల పెళ్లి అయిన తర్వాత ఒక పదిరోజులు వరకు ఉన్నారు . మా ఇల్లంతా సందడి సందడిగా ఉంది ఆనందానికి అవధులు లేకుండా అంతా నేనై తిరిగాను . మోహన కృష్ణ గారిని నాన్నా నాన్నా.. అంటూ వదల కుండా తిరిగాను. అన్నయ్య లిద్దరూ అమ్మని "ఆంటీ " అంటూ పిలిచారు . అమ్మకి అది కష్టంగా అనిపించింది "అదేమిటి బాబూ ..స్వాతి నాన్న గారూ అని పిలుస్తుంది మీరు కూడా నన్ను అమ్మా అని పిలవచ్చు కదా " అని అడిగింది . " సారీ ఆంటీ ! స్వాతికి వాళ్ళ నాన్న రూపం తెలియదు కనుక అలా తేలికగా పిలవగల్గుతుంది . మాకు మా అమ్మ అంటే ఏమిటో తెలుసు, ఆమె ప్రేమ తెలుసు, అలాగే ఆమె కష్టాలు తెలుసు. మా కోసం మా అమ్మ పెదవి విప్పకుండా యెన్ని బాధలు భరించిందో మాకే తెలుసు " అని అన్నారు, అమ్మే కాదు ఆ మాటలు వింటున్న నేను స్థాణువులా నిలబడి పోయాను. అన్నయ్యలు యిద్దరూ వాళ్ళ అమ్మకి కష్టాలు అని చెపుతున్నారు అంటే మోహన కృష్ణ మాస్టారు మంచి వ్యక్తి కాదా! ? అనేక అనుమానాలు మొదలయ్యాయి. అన్నయ్యలిద్దరూ తిరిగి వెళుతూ నా పెళ్లి బాధ్యత అంతా వాళ్ళే చూసుకుంటామని నాన్న రిటైర్ అయిన తర్వాత వచ్చే డబ్బు కాని, ఆయన పెన్షన్ డబ్బు కానీ యేవి తమకి యివ్వనవసరం లేదని అన్నీ మాకే చెందుతాయని చెప్పి వెళ్ళారు. రోజులు గడుస్తున్న కొద్దీ చాలా విషయాలు నాకవగతమయ్యాయి. నాన్న అట్టే మంచోడు కాదని భార్యని అనాకారని నిత్యం వేధించుకు తినేవాడని, యే వంట చేసినా నచ్చలేదని పేర్లు పెట్టేవాడని, స్త్రీ లోలత్వం ఉందని అర్ధమైపోయింది.నాకు చచ్చేంత దిగులు ముంచుకు వచ్చింది. హాయిగా పువ్వులా బ్రతుకుతున్న అమ్మని తీసుకొచ్చి వ్యసనపరుడికి జత చేసానేమో అని దిగులు కల్గింది .అమ్మ యేమి చెప్పేది కాదు , "నాన్న మంచి వాడేనమ్మా అని అడిగేదాన్ని " మంచివాడనేగా బలవంత పెట్టావ్" అని నవ్వేది. ఆ నవ్వులో నాకు అనేకర్ధాలు కనిపించేవి. ఒక సంవత్సర కాలంలోనే నాన్న రిటైర్మెంట్. ఆ ఫంక్షన్ కి వెళ్ళాము . అక్కడ అందరూ మోహన కృష్ణ మాస్టారు భార్య చాలా అందంగా వుంది కదూ అని మెచ్చుకుంటూనే కాసేపటి తర్వాత గుస గుసలాడు కుంటున్నారు. వీరిద్దరికీ అదివరకే పరిచయం ఉందట. ఇద్దరి ఇల్లు ప్రక్క ప్రక్కనే కదా! వీళ్ళ గ్రంధసాంగం తెలిసే రాజేశ్వరి టీచర్ వురి వేసుకుని చనిపోయిందని చెప్పుకుంటారంట అనే మాటలు నా చెవిన పడ్డాయి. నాకు దుఖం ముంచుకు వచ్చింది. ఉన్నత చదువులు చదువుకుని గురువుల స్థానంలో ఉన్న వీరు కూడా యెంత నీచంగా ఆలోచించగలరో ! అనుకున్నాను. నిజాలు యేమిటో తెలియకుండా యెందుకిలా మాట్లాడుతున్నారనిపించింది, అసహ్యం వేసింది. నాన్నని , రాజేశ్వరి పెద్దమ్మ యెందుకు చనిపోయింది అని అడిగేశాను .ఆయన నవ్వుతూ " ఆమెకి అందంగా లేనని ఆత్మనూన్యతా భావం. వంట చేయడం సరిగ్గా రాదు. ఇతరులతో స్నేహాన్ని అర్ధం చేసుకునేదే కాదు, నాపై అనుమానం యెక్కువ అందుకే అలా చేసింది" అని చెప్పారు. నాన్న రిటర్మెంట్ అయ్యాక వచ్చే డబ్బుతో అమ్మ పేరు మీద వున్న స్థలంలో యిల్లు కట్టారు. నాన్నతో పాటు నాన్న వాళ్ళ అమ్మ,నాన్నమ్మ నేను, నాన్న,అమ్మ అందరం కలసి వుండే వారిమి. నానమ్మ లిద్దరూ బాగా కలసి పోయారు వారితో యే యిబ్బంది ఉండేది కాదు. ఉదయాన్నే నేను, అమ్మ యెవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే నాన్న యింట్లో వుండేవారు. నాన్నతో పరిచయం ఉన్న అనేక మంది టీచర్స్ మా యింటికి వచ్చి పోతూ ఉండేవారు. అమ్మ వచ్చేసరికి వంట యిల్లంతా కాఫీలు తయారుచేసుకుని , టిఫిన్స్ తయారుచేసుకుని తిని వంట వస్తువులు అన్నీ అడ్డదిడ్డంగా వాడి పడేసే వారు. డైనింగ్ టేబుల్ పైన తిన్న కంచాలు అలాగే పడి వుండేవి . ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పేకాట ఆడటం లాంటివి కనబడుతూ ఉండేవి. అదేమిటని అడిగితే సరదాగా స్నేహితులందరూ కూర్చుని ఆడుకుంటున్నాం అనేవారు నాన్న. ఆయన రకరకాల విన్యాసాలని నాకు కనబడకుండా చేయడానికి అమ్మ నాకు మేడపై గదికేటాయించింది . నాన్నమ్మలిద్దరూ ఓ మూల గదిలో ఉండేవారు.ఒక రోజు నేను నాగదిలో నుండి బయటకి వచ్చి క్రిందికి చూసాను నాన్న తను తినే అన్నం పళ్ళెంని అమ్మ ముఖం పై విసిరి కొట్టాడు, అన్నం అంతా చెల్లాచెదురు అయిపోయింది. పళ్ళెం విసరడం వల్ల అమ్మ కంటి పైభాగంలో దెబ్బ తగిలి వెంటనే బొప్పి కట్టిపోయింది. " ఎంత దైర్యం ఉంటే ఉదయం వండిన కూర వేసి నాకన్నం పెడతావు సిగ్గు లేదూ మొగుడుకి వేడి వేడిగా చేసి వడ్డించాలని తెలియదా!?" అంటున్నాడు. అమ్మ సంజాయిషీగా .. యీ రోజు రావడం ఆలస్యం అవడం వల్ల తలనొప్పి వల్ల ఆ పూట కూరలు చేయలేకపోయానని చెపుతోంది . "నువ్వు మాత్రమే ఉద్యోగం చేస్తున్నావా? రాజేశ్వరి కూడా ఉద్యోగం చేసేది, అయినా నాకేనాడు లోటు చేసేది కాదు. ఎలా చేసినా ఏది పడేసినా తిని ఊరుకుంటాడు లే అని అనుకుంటున్నావేమో " అంటూ యింకా యేదేదో మాట్లాడబోయి నన్ను చూసి ఆగిపోయాడు. ఆ రాత్రి అమ్మని పట్టుకుని యేడ్చేసాను. అమ్మ మౌనంగా కన్నీరు కార్చింది. అమ్మ ప్రతి రోజు కాలేజ్ కి వెళ్ళాలంటే రాను పోను నూటముప్పైకిలోమీటర్లు ప్రయాణం చేయాలి. కనీసం యింటి దగ్గర నుండి రెండు గంటల ముందు బయలుదేరితే తప్ప సమయానికి చేరుకోలేదు . తెల్లవారుఝామునే లేచి యింటిపనులు, వంట పనులు అన్నీ చేసుకుని నాన్నకి అన్ని హాట్ ప్యాక్ లలో సర్ది అప్పుడు కాని అమ్మ బయటకి వెళ్ళాలి. అమ్మ ఒక్కటే వొంటరిగా బయటకి వెళ్ళకూడదు. ఆయనతోనే బయటకి వెళ్ళాలి. జనన, మరణ, పెండ్లి, విందు వినోద కార్యక్రామాలన్నిటికి ఆయనతో ఠంచనుగా వెళ్లి తీరాలి. అక్కడ అందరికీ అమ్మని గర్వంగా చూపాలి .అమ్మ వెళ్ళడం కుదరదంటే ఆ రోజు యింట్లో మరో యుద్ధం జరిగేది. ఇవన్నీ చూస్తూ నన్ను యెక్కువకాలం అక్కడ వుంచడం అమ్మకి యిష్టం లేక పోయింది అన్నయ్యలతో చెప్పి ఫారిన్ సంబంధం చూసి నిశ్చయం చేసి పెళ్ళి జరిపించారు. నాకెలాంటి భర్త వస్తాడు అనేదానికన్నా అమ్మ జీవితం యెలా గడుస్తుందోనని దిగులుగా వుండేది. నేను అమ్మకి పెళ్ళి చేయాలనుకోవడమే చాలా పొరబాటు చేసాననిపించింది. హాయిగా వున్న అమ్మ బ్రతుకుని కష్టాల పాలు చేసినట్లయ్యింది. స్త్రీ కి పునర్వివాహమనేది అందరికీ సంతోషాన్నివ్వదు. అసలు సంతోషాన్నే యివ్వదు అంటాను నేను . మొదటి వివాహం విఫలమై రెండో వివాహం చేసుకుంటే వాడితో యెందుకు తేడాలు వచ్చాయి? వాడు నాలా వుండేవాడు కాదా ! లేదా వాడు నీకు నచ్చలేదా? అనో, లేదా వాడిని యెందుకు వదిలేసావ్? యెవరినైనా వుంచుకున్నావా? అనే ప్రశ్నలు. మొదటి పెళ్ళైన యిన్నేళ్ళ తర్వాత మళ్ళీ పెళ్ళి అయ్యింది, ఇన్నాళ్ళు మడి కట్టుకునే ఉన్నావా? అనే అవమానకర ప్రశ్నలెన్నో యెదుర్కోవాల్సి వస్తుంది. మళ్ళీ యెందుకు పెళ్ళి చేసుకున్నామా ? అని పశ్చాత్తాప పడుతూ పెనం మీద నుండి పొయ్యిలోకి పడేసినట్లుగా తమ పరిస్థితి అయింది అని అనుకునే వాళ్ళు తక్కువ ఏమి కాదు . అమ్మ తన బాధలన్నింటిని కాకపోయినా కొన్నయినా నాతో చెప్పుకునేది.ఆమెకి నేను తప్ప ఎవరున్నారు? ఎవరితోనైనా పంచుకున్నా పలుచన అయిపోతామంటుంది . అందరి దృష్టిలో మోహనకృష్ణ మంచివాడు. అమ్మకి జీవితాన్ని యిచ్చాడు, యిల్లు కట్టాడు , నాకు బోలెడు నగలు చేయించారు, పెళ్ళి చేసాడని చెప్పుకుంటారు తప్ప ఆయన కొడుకులు కూడా ఆయన బాధ్యతని తెలివిగా అమ్మ పై వేసి తప్పుకున్నారు అని అర్ధం కావడం కష్టం. జీవితంలో అవసరాల కోసమే పెళ్ళి అనుకునే వారే ఎక్కువ. ఇలాంటి పెళ్ళిళ్ళలో ఏ మాత్రం ప్రేమకి, అనుబంధానికి తావే ఉండదు. అందుకు ఉదాహరణ మా అమ్మ వివాహమే.! మగవాడికి యేవయసులొ అయినా వంట వండీ పెట్టడానికి, యింటి అవసరాలు చూడటానికి, ఇంకా శారీరక అవసరాలు తీర్చుకోవడానికి స్త్రీ కావాలి . అందుకు పెళ్ళి అనే అందమైన ముసుగు వేస్తారు. పురుష అహంకారాన్ని ప్రదర్శిస్తారు. అలాగే వొంటరి తనంతో బ్రతుకున్న స్త్రీలు ఆర్ధిక అవసరాల కోసమో సామాజిక భద్రత కోసమో తోడు కోరుకుంటారన్నమాటే కానీ వారికి యే మాత్రం ప్రేమానురాగాలు లభింపక పోగా యెన్నో అవమానాలు, అనుమానాలు యెదుర్కొవాల్సివస్తుంది. ఆ వివాహాన్ని తెగతెంపులు చేసుకునే దైర్యం రాదు. ఒకవేళ అలా తెగింపు నిర్ణయం తీసుకున్నా మరొకసారి విఫలమైన వివాహాం తో సగం చచ్చి వున్నవారిని చుట్టుప్రక్కల వారు వారి మాటలతో పూర్తిగా చంపేస్తారు. స్త్రీ జీవితం అడుగడుగునా వేదనాభరితమే! అంతకు ముందు వివాహం వల్ల పిల్లలు ఉంటే స్త్రీకి అనేక సర్దుబాట్లు వుండాలి . ముందు వివాహం వల్ల కల్గిన బిడ్డలని పూర్తిగా వొదులుకోవాలి. పురుషుడికి వుండే పిల్లలకి అలాంటి వొప్పందాలు ఉండవు . ఎంత బాగా చూసుకున్నా సవతి తల్లి అనే ముద్ర ఉందనే వుంటుంది. ఒక్కో వివాహంలో భర్త మొదటి పిల్లలకి రెండో భార్యగా వచ్చినామెపై సదభిప్రాయమే ఉండదు. కనీస గౌరవానికి అనర్హురాలన్నట్లు చూస్తారు. రెండో పెళ్ళి విఫలం అయితే తమలోనే లోపం ఉందని అనుకుంటారని స్త్రీలు అన్నీ భరిస్తారు. మగవారు సాధిస్తారు అది వారికి పుట్టుకతో వచ్చిన హక్కుఅనుకుంటారు. మా అమ్మకి మళ్ళీ మునపటి జీవితం తిరిగి రానే రాదు. ఇవ్వాలంటే కష్టం కూడా. అమ్మ ని నాదగ్గరకి పిలిపించుకుని ఆమెకి విశ్రాంతి యివ్వడం తప్ప మరో దారి కనబడటం లేదు అలా అమ్మని పిలిపించుకుందామన్నా అతనూ రావడానికి తయారుగా ఉంటారు. అతనిని నాన్న అనడానికి కూడా యిష్టం లేనట్టుగా వుంది. ఇప్పుడు చెప్పండి పునర్వివాహాలు మంచివేనంటారా? ఎంతమంది నిజమైన తోడు కావాలనుకుని పెళ్ళి చేసుకుంటారంటారు " అని అడిగింది స్వాతి. సమాధానంగా అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న హాలంతా చప్పట్లతో దద్దరిల్లింది ఆ చప్పట్ల మధ్యలోనే " నాలా యెవరూ యెవరినీ కూడా పునర్వివాహం చేసుకోమని బలవంతం చేయకండి, పెళ్ళి అనే బంధంలోకి బలవంతంగా నెట్టకండి. స్వేచ్ఛగా వారికి నచ్చిన విధంగా వారి బ్రతుకుని బ్రతకనివ్వండి. మీరు అలా యెవరినైనా బలవంతం చేయాల్సి వస్తే , అలా చేసేముందు "స్వాతి వాళ్ళ అమ్మ" ని గుర్తుకు తెచ్చుకోండి. ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి " అని ముగించి ధన్యవాదములు చెప్పి క్రిందికి దిగి వస్తూ వుంటే తల్లి గుర్తుకువచ్చింది ఆమె పడే అవస్థ కళ్ళ ముందు మెదిలింది. కన్నీళ్లు ముంచుకొచ్చాయి. “పోయింది యేదైనా మరొకమారు దొరుకుతుతుందా యెప్పుడైనా’.. అని తల్లి ప్రశ్నిస్తున్నట్లే అనిపించి వూరుతున్న కన్నీటిని చేతి రుమాలుతో తుడుచుకుంటూ వచ్చి తను అంతక్రితం కూర్చున్న కుర్చీలో కూర్చుంది. అనిల్ ఓదార్పుగా ఆమె భుజంపై చేయి వేసాడు.
|
30, జూన్ 2013, ఆదివారం
స్వాతి వాళ్ళ అమ్మ
లేబుళ్లు:
కథ,
తెలుగు కథ,
తెలుగు కథలు,
రచనలు,
వనజవనమాలికథలు,
VanajaTatineniTeluguStories
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
Wish many women know the value of their freedom 'to decide upon' their marital life and other decisions in life.
కామెంట్‌ను పోస్ట్ చేయండి