3, ఆగస్టు 2013, శనివారం

అనుబంధాల అల్లిక

 నాకు ఏ  మాత్రం పరిచయం లేని ఒక కొత్త ప్రాంతం వైపు  హఠాత్తుగా బయలుదేరి వెళ్ళాలని  నేను ఎప్పుడు కలగనలేదు కలల్లో ఎంతెంత దూరాలో ప్రయాణిస్తాను కానీ ఇలా ఇలలో   ఇంత దూరం ఒంటరిగా ప్రయాణం చేయలేదు. చేసే దైర్యం పుష్కలంగా ఉన్నా ఒంటరి ప్రయాణం అంటే విముఖత.  సరే .. నేను వెళుతున్న ప్రయాణం  కేవలం నా ఆసక్తి మాత్రమె కాకుండా నాతొ పాటు నాకు పరిచయం ఉన్న అందరితో పంచుకోగల   చక్కని అనుభవాన్ని ఇస్తుందని,  మనుషుల పట్ల నమ్మకాన్ని పెంచుతుందనే  విషయం నాకు తెలియదు కాబట్టి.... 
ఈ ప్రయాణం నాకు అవసరమా ? అని  ప్రశ్నించుకుంటూనే  బస్ లో  సీట్ ని వెనక్కి దించుకుని అలా కళ్ళు మూసుకున్నాను. ప్రయాణం రాత్రి కావడం వల్లనేమో  బస్ లో ప్రయాణిస్తూ  వెనక్కి జారుకుంటున్న ప్రకృతి ని ఆస్వాదించే అవకాశం లేదు కాని బస్లో అమర్చిన టీవి లో పెద్ద సౌండ్ తో ఒక మాస్ చిత్రాన్ని ప్రదర్శిస్తూ నరకం తొలిమెట్టు పై ఉన్న బావన కల్గించారు మనకి ఇష్టం లేకుండానే యుద్దవాతావరణం లోకి మనని లాక్కువెళ్ళే  భయంకరమైన హింసాత్మక దృశ్యాలు చూడలేక చెవుల్లో వేళ్ళు  పెట్టుకుని బలవంతంగా  కళ్ళు మూసుకున్నాను.

అలా మూసుకున్న కళ్ళని 7 రోడ్స్ .. 7 రోడ్స్ దగ్గర దిగే వాళ్ళు రావాలండీ...  అని బస్ డ్రైవర్  కేకతో ఉలికిపడి తెరచి చూసాను . ఇంకా త్తెల్లవారలేదు ..టైమ్ చూస్తె నాలుగున్నారే ! .. ఈ చీకట్లో నేను వెళ్ళాల్సిన ప్రదేశం కి ఎలా వెళ్ళడం అనుకుంటూ లగేజ్ తీసుకుని బస్ దిగాను. వెంటనే ఆటో వాళ్ళు చుట్టుమిట్టారు శంభుమియా పేట వెళ్ళాలి వస్తారా !? అడిగాను.  ఆ ఏరియా అంతా తెలిసిన దానిలా అడగటమయితే అడిగాను కాని లోలోపల భయం తన్నుకు వస్తుంది. తెలియని ప్రదేశం. ఈ ఆటోవాడు ఎటు తీసుకువెళతాడో తెలియదు. కానీ ఆ భయం కనబడనీయకుండా ఆ ప్రాంతం చాలా చాలా పరిచయం ఉన్నదానిలా నిలబడ్డాను. శంభుమియా పేట ఎక్కడికమ్మా !? అడిగాడు. శనక్కాయల మిషన్ ఉంది కదా .అక్కడికి  అన్నాను సరే .రండమ్మా  అన్నాడు . ఎంత తీసుకుంటావు చెప్పలేదు అన్నాను ఆటో ఎక్కబోతూ. నలబై రూపాయలు అన్నాడతను. బేరం ఆడాలి లేకపోతె నాకు ఈ ప్రదేశం క్రొత్త అనుకుని కనిపెట్టేస్తాడు అనుకుని 30 రూపాయలు ఇస్తాను. లోపలి రావద్దు .రోడ్డు పైనే దిగేస్తాను అని చెప్పాను. సరే నన్నాడు . ఎక్కి కూర్చుని రోడ్డు మార్గాలని చూస్తూ గుర్తు పెట్టు కుంటూ అక్కడక్కద కనబడుతున్న జనసంచారంని పరిశీలిస్తూ మధ్య మధ్యలో ఆటో అతనివంక అనుమానం చూస్తూ ఒంటిమీద ఆభరణాలని కనబడకుండా జాగ్రత్తగా కప్పుకుంటూ ఉన్నాను . పది  నిమిషాల లోపే కనబడే ఆంధ్రజ్యోతి దగ్గరలో ఆటో ఆపించి దిగేసాను.

ఆ ఇంటి ముందు నిలబడి నేను గుర్తు ఉంచు కున్న  ఆనవాళ్ళు ప్రకారం చూసి అదే ఇల్లని నిర్ణయించుకున్నాను. ఇంత ప్రొద్దు ప్రొద్దుటే అపరిచిత వ్యక్తుల ముందు నిలబడటం బావుండదేమో ! ఈ బస్ ఇంత త్వరగా వచ్చి చావాలా?  ఆ డ్రైవర్ కాస్త నెమ్మదిగా బస్  నడపవచ్చు కదా ! తెల్లవారి పోయేది ... అప్పుడు నాకు బాగుండేది అని నా అనుకూలత కి డ్రైవర్ సమయపాలనని ఖూనీ చేద్దామని చూసాను. ఇంటి  ముందు నిలబడి వెళ్ళాలా  వద్దా ,,,  అనే  సందేహం ఏమిటీ? ... పిచ్చి కాని అనుకుంటూ ..  మూసి ఉన్న తలుపుల పై మునివేళ్ళతో  కొట్టాను  ....

ఈ రోజు కి ..ఇంతే ....

6 కామెంట్‌లు:

జయ చెప్పారు...

మరి తొందరగా చెప్పేయండి, ఎవరింటికెళ్ళరో...ఏం చేసారో!...:)

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

తరువాయి భాగంకోసం చూస్తుంటాను...

ranivani చెప్పారు...

సంధిగ్ధం లో పెట్టేసారు .

భారతి చెప్పారు...

నిరీక్షణలో పెట్టేశారు ...
తదుపరి టపాకై వేచిచూస్తున్నా.

స్నేహదినోత్సవ శుభాకాంక్షలు వనజగారు.

అజ్ఞాత చెప్పారు...

continue plz
మిత్ర దినోత్సవ శుభకామనలు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జయ గారు .. ఇదిగో .. వ్రాసేశాను. చదివేసారనుకుంటాను

@కష్టేఫలే .. మాస్టారూ ... ధన్యవాదములు

@ Avineni Bhaskar gaaru పోస్ట్ పై ఆసక్తిగా వేచిచూస్తున్నదుకు ధన్యవాదములు

@ భారతి గారు .. అనుబంధాల అల్లిక అంత ఆసక్తి కల్గిస్తున్నందుకు ధన్యవాదములు.

@నాగ రాణి గారు ... పోస్ట్ నచ్చినందుకు మరీ మరీ ధన్యవాదములు