ఈస్తటిక్ సెన్స్ కథకు వ్యాఖ్యానం అందించిన - డా.గీతాంజలి భారతి గారికి ధన్యవాదములు .
తెలుగు సాహిత్యం లో రచయిత్రుల పరిమితి స్రీవాద పరిమితిని దాటి సమాజంలో మానవ జీవితం చుట్టూ అలుముకున్న అనేక సంక్షోభాలను కుల, మతతత్వాలు ,ప్రాంతీయ సమస్యలు మొదలుకొని , రైతుల దళితుల ఆదివాసీల జీవితాల మీద ప్రపంచీకరణ ప్రభావం, పోస్ట్ మోడర్నిజం ., విప్లవోద్యమం కథా వస్తువులుగా స్వీకరించి రాయడం మొదలై చాలా కాలం అయ్యింది. భిన్న అస్తిత్వాలకు, వర్గాలకు చెందిన స్రీల విషయంలో పురుషాధిక్యత., గృహ హింస., అణిచివేత ,అవిద్య, మూఢనమ్మకాలు ., స్రీల పునరుత్పత్తి హక్కుల మీద., సాంస్కృతిక., రాజకీయ.మానసిక ఆర్థిక కారణాలను విశ్లేషిస్తూ కూడా చాలా సాహిత్యం వచ్చింది. స్రీల శరీరాల చుట్టూ అల్లుకున్న పురుష లైంగిక రాజకీయాల మిత్ ని బద్ధలు కొడుతూ స్రీలను చైతన్యవంతం చేసిన సాహిత్యం చాలా వచ్చింది. ఈ సాహిత్య ప్రభావం వల్ల పురుషాధిక్యత అనిచివేతలను ఎదిరిస్తూ హింసని ప్రశ్నిస్తూ..కుటుంబ హింసా వలయం నుంచి బయటకు వచ్చి తమ ఆత్మ గౌరవాన్ని కాపాడుకున్న స్రీలేందరో ఉన్నారు.. ఇంటి పని , వంట పని, రెండు పనుల ఆదనపు శ్రమ ,ఉత్పత్తి , పునరుత్పత్తి విషయాల్లో జరిగే దోపిడీ గురంచి స్రీవాధులు విస్తృతంగా రాస్తూనే ఉన్నారు ఒక్క కథా రూపంలోనే కాదు కవిత్వం., నవలలు చాలా వచ్చాయి.అయితే మూసి వున్న పడక గదుల్లో దాంపత్యం.,సంసారం,శృంగారం, సరసం పేర్లతో.,ముసుగుతో శ్రీల శరీరాల మీద నిశబ్దంగానో.. శబ్దం చేస్తూనో జరుగుతున్న కనిపించీ., కనిపించని లైంగిక హింస గురించి ఇంకా మరింత సాహిత్యం రావాల్సి ఉంది.1990 సంవత్సరాల ముందు పాత తరానికి చెందిన రచయిత్రులు ఫ్యూడల్ వ్యవస్థలోని పితృస్వామ్య హింసని..గృహ హింసని కథావస్తువు తీసుకునీ రాసినా..లైంగిక హింసని పెద్దగా తీసుకోలేదు. రచయిత్రుల వస్తువుల మీద పురుషు సమాజం లేదా రచయిత్రుల కుటుంబాల్లో సెన్సార్ షిప్ ఉండేది.. కథా వస్తువు ఎన్నిక పట్ల పరిమితులు ఉండేవి. కానీ 1990 తరువాత ఈ పరిమితులు దాటి రచయిత్రులు ముఖ్యంగా స్రీవాదులు విస్తృతి పెంచుకున్నారు. స్రీల లైంగికత కి సంబంధించి భిన్నమైన అంశాలను ధైర్యంగా రాస్తూ వచ్చారు. ఇప్పుడు చాలా స్వేచ్ఛగా సెక్స్ & సెక్సువాలిటీ మీద గొప్ప , సమాజానికి కావలసిన కథలు రాస్తున్నారు.
అయితే ప్రస్తుత వర్తమాన కాలంలో స్త్రీల సమస్యల మూలాలు పితృస్వామ్య భూస్వామ్య విలువల నుంచి వేళ్ళూనుకొని ఇప్పటి ఆధునిక కాలపు టెక్నాలజీతో వికృతంగా విస్తరించి మరీ ముఖ్యంగా వైద్యం, వ్యాపార మీడియా రంగాల్లో స్త్రీల మనశ్శరీరాలపై అత్యంత దారుణమైన పద్దతుల్లో అమానవీయ రూపాల్లో తన ప్రభావాన్ని చూపిస్తుంది.
పితృస్వామ్యం పెట్టుబడీ మూలంగా కొనసాగే కార్పొరేట్ వైద్య వ్యవస్థ రెండూ కలసి స్త్రీల దేహాలను ఒక నిత్య హింసల కొలిమిగా మార్చిపడేసింది. స్త్రీలను ఒక లైంగిక వస్తువుగా చూసే దృష్టి ఈ ఆధునిక సాంకేతికత మరింత పెంచింది. అది అభివృద్ది, వెసులుబాట్లు ముసుగు వేసుకుని. ఈ టెక్నాలజీ ముసుగులోనే స్త్రీలపై పురుషుల అణచివేత. అదే క్రమంలో స్త్రీల లొంగుబాటు అసంకల్పితంగా కొనసాగుతుంది. ఈ సర్ధుబాటు పెనుగులాటల్లో ఆధునిక స్త్రీ డిప్రెషన్ లాంటి మానసిక మనోలైంగిక వ్యాధులకు లోనవుతూనే స్త్రీల లైంగికతను, దేహాలను అణచివేసి లేదా తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశాన్ని కుటుంబం రాజ్యం వ్యవస్థ తమ చేతుల్లోకి తీసుకుంటున్నాయి.
స్త్రీ పురుష సంబంధాల్లో దాంపత్య జీవితంలో లైంగిక హింస అనేది సంసారం శృంగారం సరసం పేరిట ఎన్నెన్ని మోసాలతో కుట్రలతో చొచ్చుకుపోతూ స్త్రీల దాంపత్య జీవితాల్లోని సంక్షోభాన్ని నింపడం గురించి తక్కువ సాహిత్యం వచ్చింది. ముఖ్యంగా స్త్రీల దేహాల్ని మార్కెట్ సరుకుగా మార్చాక, ఆధునిక వైద్య వ్యవస్థలో పురుషుడి ఆనందమే కేంద్రంగా మొదలైన స్త్రీ లైంగిక అవయవాల్లో యోని రొమ్ములు ముఖం పెదవులు ముక్కు నిర్మాణాల్లో పురుషుడిని సంతృప్తి పరచటానికి కావాల్సిన ఖరీదైన సర్జరీలు వచ్చి చేరాయి. స్త్రీ శరీర కొలతలను ఆదేశించే పురుషుల యిష్టాల చుట్టూ స్త్రీల జీవితాలు మానసం పరిభ్రమిస్తూండేలా వైజైనో ప్లాస్టీతో ఎక్స్ట్రా నాట్ యోని ద్వారానికి వేయించుకొని టైట్ చేయించుకోవడం భర్తను ఆనందపరచడానికి చిన్న రొమ్ములలో ప్రమాదకరమైన సిలికాన్ ఇంప్లాంట్స్ వేయించుకుని శరీర కొలతలను కుదించుకోవడం విశాలం చేసుకోవడం, దేహం అందం చుట్టూ తమ వ్యక్తిత్వాలను స్థంబింపజేసుకోవడం వైపుగా స్త్రీల మీద ఒక వేట కొనసాగుతుంది. దీనికి తోడు పురుషులకీ వెసులుబాటు వున్నా స్త్రీల శరీరాల మీద జరిగే అనేక వైద్య చికిత్సా పద్దతులు.
రొమ్ము కేన్సర్ కి దారితీసే మాలా డీ హార్మోన్ ల వాడకం, సిజేరియన్లు, హిస్టెరెక్టమీలు, మగపిల్లాడి కోసం ఆడపిల్లల్ని కంటూనే వుండే నిర్బంధ ప్రసవాలు లేదా అబార్షన్లు, రీ కానలైజేషన్ ఆపరేషన్లు అన్ని కోతలు కుట్లు స్త్రీల కేంద్రంగానే నిర్ణయించబడతాయి. స్త్రీలు, శరీరాలు-జీవితాలు ఈ పురుషాధిపత్య వ్యవస్థలో కార్పోరేట్ వైద్య వ్యవస్థలో ఒక ఎలుక-కుందేలు కప్పల్లా పరిశోధనకు వాడబడే ఎక్స్ పెరిమెంటల్ యానిమల్స్ గా చూడబడుతున్నాయి లేదా వాడబడుతున్నాయి. స్త్రీల లైంగికానందాన్ని నియంత్రించే లేదా పూర్తిగా ఆపివేసే జననాంగాలలోని క్లిటోరిస్ ని కట్ చేసేసే కృూరమైన సర్జరీ ఇప్పటికీ ముస్లిం సమాజంలో చాలా చోట్ల స్త్రీల జీవితాలని శాసిస్తుంది. స్త్రీలు బాహ్య జననాంగాలు లేకపోవడమే అందమూ-సౌశీల్యమూ ప్యూడల్ ఆదిమ పురుష సమాజానికి. కానీ అదే కొనసాగుతున్నది. స్త్రీల వ్యక్తిత్వాలను కుంచింపజేస్తూ పురుషుడి దైహిక అవసరాలకు అనుగుణంగా మార్చుకునే సర్జరీల చుట్టూ కోట్ల వ్యాపారం నడుస్తున్నది. లెక్కకు మించి కాస్మొటిక్స్ నించి రొమ్ములను పెద్దగా మార్చుకునే సిలికాన్ సర్జరీల వరకూ ముక్కును మార్చే రైనోప్లాస్టీ సర్జరీ నుంచి వెజైనా బిగువుచేసే హస్బెండ్ స్టిచ్ లేదా ఎక్స్ట్రా నాట్ వరకూ ఏది అందం? పురుషావసరాలకు తగ్గట్టుగా తమ శరీర నిర్మాణాలను మార్చుకుంటూ కొత్త రూపాల్లోకి మారడమా లేదా తిరస్కరించి తమ వాస్తవ రూపాలని ప్రేమిస్తూ ఆత్మగౌరవంతో నిలబడ్డమా? ఏది ఈస్తటిక్ సెన్స్!?
ప్రముఖ రచయిత్రి వనజ తాతినేని గారు తన ఈస్తటిక్ సెన్స్ కథలో ఈ వస్తువుని లోతుగా చర్చించారు. స్త్రీలతో ఈ సర్జరీలు చేయించి పురుష స్వామ్య వ్యవస్థను నిలదీసి ప్రశ్నించారు. తను సృజించిన మైథిలి పాత్ర ద్వారా ఆమె కొడుకు కోడలితో చేయించబోయే అకృత్యాన్ని నిరశించారు.
స్త్రీల నైనా పురుషుల నైనా aesthetic sense వైపు తరిమింది ఎవరు...వ్యవస్థ. స్రీలను కేవలం సెక్సువల్ ఆబ్జెక్ట్స్ గా మార్చి వ్యాపారం చేసుకుంటున్న ప్రపంచ మార్కెట్ ..ఆర్థిక వ్యవస్థ. కథలో ఈ రెండు అంశాల మీద చర్చ చేస్తూ అనేక ప్రశ్నలను సంధించారు రచయిత్రి వనజ గారు.
మైథిలి ఎమ్మెల్యే. తన ప్రాంతంలో గిరిజన ఆదివాసీల హక్కుల కోసం కోసం పనిచేసే రాజకీయ కార్యకర్త కూడా. మైథిలి స్నేహితురాలి కూతురు ప్రియ. ప్రియ ఫ్రెండ్ పద్మ. ఈ ముగ్గురు స్త్రీలు కథలో ప్రధాన పాత్రలు. ముగ్గురిలో పూర్తి స్థాయి చైతన్యవంతమైన పాత్ర మైథిలి అందరికంటే వయస్సులో పెద్దది. సమాజంలో స్త్రీల స్థితి పట్ల స్పష్టమైన సైద్దాంతిక అవగాహన వున్నది. ప్రతిమాటా హక్కుల విలువల కోణంలోంచి మాట్లాడుతుంది. మైథిలి ప్రియ అమ్మ మంచి స్నేహితురాళ్ళు. ప్రియ తల్లి అందగత్తె. అదే శాపంగా మారి భర్త అనుమానంతో వేగ లేక భర్తతో విడిపోయి ఒంటరి స్త్రీ గా ప్రియ ను కష్టపడి పెంచుతుంది. ప్రియ కు తన తల్లి పట్ల అపరిమిత ద్వేషం. ఎందుకంటే ఆమె తను అందగత్తెనని గర్వం.
తన కూతురికి తన అందం రాలేదని ఎద్దేవా చేస్తుంటుంది. తనను బాడీ షేమింగ్ చేసే తల్లిని మించిపోవాలని ప్రియ రెండు రైనోప్లాస్టీ సర్జరీలు డెంచర్ సర్జరీ చిన్ని గడ్డం కోసం జీనియో ప్లాస్టీ చేయించుకుంటుంది. ఇన్ని కాస్మొటిక్ సర్జరీస్ చేయించుకోవడానికి ప్రియ కు బాగానే ఖర్చవుతుంది. ఎంతంటే ఆరోగ్యం బాగోలేని కన్నతల్లి వైద్యం కోసం డబ్బు మిగలనంత లేదా తన సర్జరీల ఖర్చు కోసం మాత్రమే డబ్బు మిగుల్చుకునేంతగా. ప్రియ ప్రయారిటీస్ లో అమ్మ లేదు అందం తప్ప. సహజంగా లేవమ్మీ! మనసుకు శాంతినిచ్చే అడవిపూల సౌందర్యం లేదు. కుండీలో పెంచిన గులాబీలా ఉన్నావు అంటుంది మైథిలి ప్రియతో.
అమ్మకన్నా నేనే అందం అని మురిసిపోతున్న ప్రియను చూస్తూ.. సౌందర్యంగా లేకపోవడం లోపం కాదు. ఉన్నతమైన విద్యే ఆత్మవిశ్వాసం. అబద్దంలో అందంగా బతకగల్గుతాం అనుకోవడం మూర్ఖత్వం అంటుంది ప్రియతో. అందానికి వున్న విలువ వ్యక్తిత్వాలకు ఎందుకు లేదని బాధ పడుతుంది.
ప్రియ స్నేహితురాలు 43 ఏళ్ళ పద్మ ఇండియాకి ప్రత్యేకించి సిలికాన్ ఇంప్లాంటేషన్ చేయించుకోవడం కోసం వస్తుంది. ఆమెకు పదహారు పదేళ్ళ పిల్లలు వుంటారు. బి టెక్ తర్వాత అమెరికా వెళ్ళి నాలుగేళ్ళు ఉద్యోగం చేసి పెళ్ళి చేసుకుని పిల్లల పెంపకం కోసం ఉద్యోగం మానేస్తుంది. పద్మ భర్తకు భార్య శరీరం పట్ల అసంతృప్తి. ఆమెకున్న చిన్న రొమ్ములు హిస్టెరెక్టిమి తర్వాత పొత్తి కడుపు క్రింద పడ్డ నిలువు కోత. నీతో సంసారం చేయబుద్దవడంలేదు. విడాకులిచ్చి వేరే పెళ్ళి
చేసుకుంటానని నిత్యం బెదిరించే భర్త . సంసారాన్ని కాపాడుకోవడం కోసం సంసారంలో మూడవ మనిషి రాకుండా వుండటం కోసం సిలికాన్ ఇంప్లాంటేషన్ కి సిద్దపడుతుంది. పద్మే కాదు, ప్రియ కూడా మైథిలి కొడుకు శశాంక్ కోసం సిలికాన్ ఇంప్లాంటేషన్ కి సిద్దపడి వస్తుంది. అది విన్న మైథిలి ఆగ్రహంతో కుమిలిపోతుంది.
శశాంక్ లో పద్మ భర్తలో భార్యల శరీరాలను బాడీ షేమింగ్ చేయడం అనే అవకరం వుందని స్త్రీలను అందం మాయాజాలంలో ముంచెత్తి తమ చెప్పుచేతల్లో వుంచుకునే భర్త, మార్కెట్ రెండింటి మాయాజాలాన్ని తిరస్కరించాలని చెబుతుంది.
ఎవరో తమను ప్రేమిస్తేనో.. ఎవరినో తాము ప్రేమిస్తేనో తమకు అస్థిత్వం వుందనుకోవడం తప్పనీ తమను తామే ప్రేమించుకోవాలని అప్పుడే మన జీవితాన్ని జీవించినట్లనీ లేకపోతే పరాధీనమైపోతామని చెప్తూనే
అసలైన సౌందర్యం అంటే మన జీవితాన్ని మనం జీవించే కళ అనీ .. అదే ఈస్తటిక్ సెన్స్ అని చెపుతుంది మైథిలి.
ఎవరో తమను గుర్తించాలన్న సౌందర్యాభిలాష కంటే నిన్ను నీవు ఉన్నతీకరించుకునే సౌందర్యాభిలాషే నిజమైంది. అదే ఈస్తటిక్ సెన్స్ అని రచయిత నొక్కి చెప్పిన కథ ఇది.
ఉల్లిపాయలోని ప్రతి పొరకీ కన్నీరు తెప్పించే గుణం ఉన్నట్లు, పురుషుడి ప్రతి చర్యా స్త్రీ దుఃఖానికి కారణం అవుతుంది. అలాంటి పురుషుల కోసం తమ దేహాల్ని సర్జరీలతో మార్చుకోవడం సౌందర్యకాంక్షకు బలి అయిపోవడం అవసరమా.. సౌందర్యకాంక్ష వెనుక ఎడతెగని హింస వుంది. కార్పోరేట్ వ్యాపారం వుంది. అందంగా లేని స్త్రీలు ఎన్నో విజయాలు సాధించారు అంటూ ఆఫ్రికన్-అమెరికన్ సౌజర్న్ ట్రూత్ తో పోలిస్తే మిస్ ఇండియాలది మిస్ యూనివర్స్ లది ఏ పాటి అస్థిత్వ నిరూపణ అంటూ.. భర్తల సౌందర్యకాంక్షలకు బలై పోవడానికి సిద్దపడిన ప్రియ పద్మలను ఆవేదన కూడిన స్వరంతో మందలిస్తుంది మైథిలి.
స్త్రీలను కాస్మొటిక్ సర్జరీస్ అనే హింసా కూపాల్లోకి తోసేస్తూ వ్యక్తిత్వం లేని మగవాడి చేతుల్లో బాహ్యరూపాలు మారిపోయే బొమ్మల్లా.. కీలు బొమ్మల్లా మార్చేసే ప్యూడల్ పితృస్వామ్య వ్యవస్థ లోని దోపిడీనీ క్రూరత్వాన్ని మాలిన్యాన్ని వికృతాన్ని… కార్పోరేట్ వైద్య వ్యవస్థలోని దోపిడీని క్రూరత్వాన్ని… స్త్రీలు దాంపత్య జీవితాల్లో మౌనంగా అనుభవించే లైంగింక హింసలకు మగవాడి వికారమైన పడగ్గది ఈస్తటిక్ సెన్స్ ని బహిర్గతం చేసే కథలు వనజ తాతినేని గారు మరిన్ని రాయాలని కోరుతూ.. ఈ అవకాశాన్ని నాకిచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ… ఈ కథాసంపుటి లోని మిగతా కథలన్నీ పాఠకుల మనఃచక్షువులు తెరుచుకునే విధంగా వుంటాయని ఆకాంక్షింస్తూ.. వనజ తాతినేని గారికి అభినందనలతో..డా. గీతాంజలి భారతి. హైదరాబాద్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి