ఈ బస్ మా వూరికి మొక్కుబడిగా వస్తూ వుంటుంది. ఇప్పుడే కాదు 35 యేళ్ళ నుండి యిదే తంతు. ఇటీవల ఒక కథ రాస్తూ.. ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళాను.
మా వూరు కృష్ణాజిల్లా జి.కొండూరు మండలం కుంటముక్కల. నా చిన్నప్పుడు (బహుశా అప్పుడు నాకు పదేళ్ళు వుండవచ్చు). మా వూరికి వెల్లటూరుకు మధ్య మాగాణి పొలాల మధ్య నుండి R&B రోడ్ శాంక్షన్ అయింది. భూ సమీకరణ జరిగింది.తతిమా రైతులందరూ అంగీకరించినా మా పెద్దతాత కుమారుడు తన భూమి ని యివ్వకుండా మోకాలడ్డు వేసారు. ఆ రోడ్డు మార్గం యిలా. (మైలవరం - కుంటముక్కల - వెల్లటూరు- వెలగలేరు- విజయవాడ)
మా వూరికి లోపలికి రావాలన్నా బయటకు వెళ్ళాలన్నా వొకేదారి. మరో మూడు దారులు బండ్ల బాటలు పొలాల మధ్య నుండి చెరువు కట్టల మీదగా వెళ్ళాల్సివచ్చేది.
1984 కి ముందు చదివిన మేమంతా గూడు రిక్షా యెక్కి వెళ్ళే వాళ్ళం. అందులో ఆరుగురు కూర్చుని వెళ్ళేవాళ్ళం. రిక్షా అతను ఉదయం 09:30 కల్లా స్కూల్ దగ్గర దించేసి సాయంత్రం 04:30 కి మైలవరం సెంటర్ లో యెక్కించుకునేవాడు. రిక్షా అతని టైమ్ టేబుల్ అదే! పరీక్షల సమయాలు మార్పులు అతనికి యే ప్రమేయం వుండనట్టు వుండేవాడు. ఏ తరగతికి యెప్పుడు పరీక్ష అయినా.. పొద్దున్నే అందరూ కలిసి వెళ్ళాల్సిందే అందరూ కలిసి తిరిగి రావాల్సిందే!. ఏ మాత్రం ఆలస్యం అయినా యెవరి తిప్పలు వారివే. అన్ని తిప్పలు పడి యిల్లు చేరితే అక్కడ మందలింపులు మొట్టికాయలు.
నేను టెన్త్ క్లాస్ లో వున్నప్పుడు మా నాన్నగారి స్నేహితుడు వారింట్లో మూడు నెలలు ఆశ్రయం యిచ్చారు. వారింట్లో వుండి ట్యూషన్ కి స్కూల్ కి వెళ్లాను. నేను లెక్కలు లో పూర్. టెన్త్ క్లాస్ లో ఉదయం 05:30 కి లేచి రెడీ అయి మూడు కిలోమీటర్లు నడిచి విజయవాడ తిరువూరు రోడ్ లో మా వూరి అడ్డరోడ్డు దగ్గరికి 06:20 కల్లా చేరుకుని విజయవాడ నుండి మైలవరం తిరువూరు వెళ్ళే ప్యాసింజర్ బస్ కోసం యెదురుచూపులు. ఆ టైమ్ లో వొకే వొక ప్యాసింజర్ బస్ వుండేది. ఇంకో రెండు ఎక్స్ ప్రెస్ బస్సులు. జగదల్ పూర్ ఎక్స్ ప్రెస్ వొకటి భద్రాచలం ఎక్స్ ప్రెస్ వొకటి. ప్యాసింజర్ బస్ ఆలస్యం అయినా ముందే వెళ్ళిపోయినా మెటాడోర్ వేన్ లు తిరిగేవి.అవి యెక్కి మైలవరం సెంటర్ లో దిగి ట్యూషన్ కి పరుగు. కన్నుకనబడని మంచులో కూడా యెంత స్పీడ్ గా నడిచి వెళ్ళేదాన్నో వొంటరిగా. ఈ విషయాలన్నీ విని మా నాన్న స్నేహితుడు ఉమా గారు అమ్మాయిని అంత కష్టపెట్టటం యెందుకు? ఆడపిల్లలు వొంటరిగా అంత పొద్దున్నే అలా రావడం కూడా యెందుకు? మా ఇంట్లో వుంటుంది లే! అన్నారు. అలా మూడు నెలలు వారింట్లో వుండి బండి రామారావుగారి ట్యూషన్ కి వెళ్ళి చదువుకున్నాను. ఆ పిన్ని పేరు విజయ. అమ్మలా ఆదరించింది. ఆమె చెల్లెలు స్వర్ణ. తెల్గగా అందంగా వుండేది. నా క్లాస్మేట్. ఇద్దరం కలిసి స్కూల్ కి ట్యూషన్ కి వెళ్ళేవాళ్ళం. టెన్త్ క్లాస్ లో మంచి మార్కులు రావడానికి వారి ఆశ్రయం కారణం.
నేను పద్నాలుగేళ్లకే పదవతరగతి పరీక్షలు రాసాను. నేను మా అన్నయ్య వొకే క్లాసు. తర్వాత ఇంటర్మీడియట్ లో లెక్కలు రావని భయపడి డాక్టర్ చదవాలనే కలలు వుండి బై పి సి తీసుకున్నాను. కానీ నాకు ఫిజిక్స్ అర్థమయ్యేది కాదు.ఎంత చదివినా వచ్చేది కాదు.కాలేజ్ అయ్యాక ట్యూషన్ కి వెళ్దామంటే.. నాతో పాటు రిక్షా లో వచ్చే మిగతా ఐదుగురు నా కోసం వేచివుండరు. ట్యూషన్ అయ్యాక ఏడు గంటలకు మా వూరికి రిక్షాలు తక్కువ వుండేవి. ఆడపిల్ల గనుక అమ్మ భయాలు అమ్మవి.అలా ఆ సబ్జెక్ట్ లో వీక్ అవడం మూలంగా ఇంటర్మీడియట్ అంతా పూర్తైనా మొదటి సంవత్సరం ఫిజిక్స్ అలా వుండిపోయింది.
పల్లెటూర్లకు బస్ సౌకర్యం లేకపోవడం మూలంగా ఆడపిల్లల చదువుకి ఉద్వాసన తప్పదు. మా వూరికి బస్ సౌకర్యం వుండి వుంటే విజయవాడ వరకు పంపి కూడా చదివించేదాన్ని అనేది మా అమ్మ. చదువులేక ఖాళీగా వుంటే పెళ్ళి ప్రయత్నాలు అనివార్యం.ఏడాది తర్వాత పెళ్ళి గండం బారిన పడ్డాను నేను. చదువుకోవాలని బాగా కోరిక వుండేది. అప్పుడే ఆటలు పాటలు స్నేహితులు తగ్గించుకుని వొళ్ళు దగ్గర పెట్టుకుని శ్రద్దగా ఆ ఫిజిక్స్ చదువుకుంటే బాగుండేదని తర్వాత కాలంలో చాలాసార్లు అనుకున్నాను విచారపడ్డాను.
కొన్ని జ్ఞాపకాలు మధురంగానూ బరువుగానూ వుంటాయి. కొందరి రుణం యేమిచ్చినా తీర్చుకోలేము. ముఖ్యంగా విజయ పిన్ని. ఆమెను విజయ గారూ అని పిలిచేదాన్ని. కూటి రుణం కథ చదివినప్పుడు ఆమె యెందుకో అప్రయత్నంగా గుర్తుకొచ్చింది. ఆమె కరోనా ఫస్ట్ వేవ్ టైమ్ లో హైదరాబాద్ లో ఇరుక్కొని లాక్ డవున్ తర్వాత మైలవరం రావడానికి కారులో ప్రయాణిస్తూ యాక్సిడెంట్ లో మరణించారు. ఆమెను కడసారిగా చూడాలని నా మనసు యెంత కొట్టుకుందో! కానీ వెళ్ళలేకపోయాను. ఓ మంచి మనిషి కోసం కాసిని కన్నీళ్ళు వొంపాను తప్ప ఆ రుణం తీరేది కాదు.
*******
బస్ గురించి..
మొట్టమొదటసారి మా వూరికి బస్ వచ్చింది 1984 అనుకుంటా. సరిగ్గా గుర్తు లేదు. మైలవరం ఎమ్మెల్యే జేష్ఠ రమేష్ బాబు సొంత వూరు కాబట్టి బస్ రావడం అనే అదృష్టం దక్కింది లేదా మా వూరు ఆ మాత్రం పుణ్యం జేసుకుంది అనుకునేవారం.
ఇబ్రహీం పట్నం డిపో బస్ వొకటి విజయవాడ-మైలవరం సర్వీస్ లో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కేవలం మూడు సార్లు మాత్రం అదీ మైలవరం స్కూల్ కి కాలేజ్ కి వెళ్ళే పిల్లలను మైలవరం జేర్చటానికి సాయంత్రం తిరిగి యింటికి జేర్చటానికి వీలుగా సర్వీస్ ను నడిపేది. విజయవాడ నుండి రావడానికి రెండుసార్లు విజయవాడ వెళ్ళడానికి ఒకసారి మైలవరం వెళ్ళడానికి రావడానికి రెండుసార్లు ఇలా లిమిటెడ్ ట్రిప్పులతో మా వూరికి బస్ సౌకర్యం వుందని చెప్పుకోవడానికి గొప్పగా నడిచేది. మధ్య మధ్యలో యెప్పుడు వచ్చేదో యెప్పుడు రాదో యెవరూ వూహించని మలుపులు. అలా మా వూరి పిల్లలు బడి కాలేజీ లకు వెళ్ళే ఆ బస్ రానప్పుడు మా వూరి అడ్డరోడ్డు వరకూ నడిచెళ్ళి రిక్షా లెక్కి సైకిలెక్కి వెళ్ళి చదువుకునేవారు.
మేము చదువుకునేటప్పుడు లిటిల్ ప్లవర్ స్కూల్ అని ఒకే వొక ఇంగ్లీష్ మీడియం స్కూల్ వుండేది మైలవరంలో. కొన్ని కాన్వెంట్ లు వుండేవి కానీ అందరూ గవర్నమెంట్ స్కూల్ కే వెళ్ళేవారు. చుట్టుప్రక్కల ఇరవై కిలోమీటర్ల దూరంలో నుండి కూడా హైస్కూల్ కి కాలేజ్ కి వచ్చేవారు.
మా తర్వాత పెరిగిన పిల్లలందరూ బస్ ని పెద్దగా నమ్ముకోక ప్రెవేట్ స్కూల్ వెళ్ళే వారైతే స్కూల్ బస్ కి గవర్నమెంట్ స్కూల్ వెళ్ళే వాళ్ళైతే బస్ పాస్ తెచ్చుకుని ఆ వచ్చి రాని బస్ నే నమ్ముకొని యెలాగోలా చదువుకొని మైలవరం చదువు వొడ్డుని దాటేవారు. తర్వాత విజయవాడ లేదా నూజివీడు గాని వెళ్ళి చదువు కునేవారు. మా వూరి నుండి మైలవరం వెళ్ళే దారిలోనే లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్, మాంటిస్సోరి ఆధ్వర్యంలో నడిచే బి ఫార్మసి కాలేజ్.. (రోడ్డు నుండి కొద్దిగా లోపలికి గుర్రాజుపాలెం) ఏర్పడ్డాయి. ఆ కాలేజ్ లకు కాలేజ్ బస్ లున్నాయి. తర్వాత లకిరెడ్డి హనిమరెడ్డి డిగ్రీ కాలేజ్ వచ్చింది. ఈ మార్పులు రావడానికి 20 to 25 సంవత్సరాలు పట్టిందేమో!
ఎట్టకేలకూ కొద్ది సంవత్సరాల క్రితం మా వూరుకు వెల్లటూరుకు మధ్య తారు రోడ్డు పడింది. అందుమూలంగా.. విజయవాడకి కొండపల్లి ఇబ్రహీంపట్నం మీదగా ప్రయాణించకుండా మైలవరం to విజయవాడ (వయా వెల్లటూరు మీదగా) ఇరవై కిలోమీటర్ల తక్కువ దూరంతో చేరుకోవచ్చు. మేము మా వూరు యెప్పుడు వెళ్ళినా ఈ మార్గంలోనే ప్రయాణించి ఈ రోడ్ వేయడానికి పెద్దనాన్న అప్పుడే భూమి యిచ్చి వుంటే మన వూరు యెంతో అభివృద్ధి చెందేది. చాలామంది చదువుల పేరిట వుద్యోగాల పేరిట వూరు వదిలేసేవారు కాదు అని అనుకుంటాం. నిజంగా చెప్పాలంటే మా వూరిలో వృద్ధులు తప్ప యెవరూ లేరు. మా తరం వాళ్ళంతా పట్టణాలలో వారి పిల్లలంతా విదేశాల్లో వున్నారు. మా బోటి వారికి బస్ తో పనిలేదు. కార్లలో తిరగడమే.
కానీ వూరి పిల్లలు!!?
ఇప్పుడు మా వూరు పిల్లలు స్కూల్ బస్ లు ఆటోలు వ్యక్తిగత వాహనాలలో ప్రయాణించి వెళ్ళి చదువుకుంటున్నారు. ఎప్పుడూ ఆటోలు తిరుగుతుంటాయి. కానీ నా బోటి వారు వూరికి సడన్ గా వెళ్ళాలంటే కారు లేకపోతే బోలెడు కష్టం. ఇప్పటికీ మా వూరికి సరిగా బస్ నడవదు. ఏదో కంటితుడుపు గా వస్తూ వుంటుంది. విజయవాడ నుండి మా వూరి అడ్డరోడ్డు దగ్గర దిగడానికి ప్రయాణించే సమయం కన్నా అక్కడ నుండి వూర్లోకి ప్రయాణించే మూడు కిలోమీటర్లు దూరం ప్రయాణించి యింటికి చేరడానికి రెట్టింపు సమయం పడుతుంది. అంత ఇబ్బంది. మైలవరం వెళ్ళి ప్రత్యేకంగా ఆటో కట్టించుకుని రావాలి. అడ్డరోడ్డు దగ్గర ఆటో ఆగినా యెక్కించుకోరు.
మా వూరుకు మంచి రవాణా సౌకర్యంలేదు అని బాధపడటమే మిగులుతుంది. వచ్చే బస్ సమయానికి రాదు. బస్ ను నమ్ముకుని ప్రయోజనం లేదని అందరూ ఆటోలను నమ్ముకుంటారు. ఆ ఆటోలు సీరియల్ లో తీయాలి. అవి నిండితే కానీ కదలవు. అందరూ తలో దారి చూసుకున్నాక వచ్చే బస్ కు ఆక్యుపెన్సీ వుండదు. ఆ కారణం చూపి సర్వీస్ రద్దు చేస్తారు. మా వూరికే కాదు చాలా వూర్లు ది యిదే పరిస్థితి.
ఇదంతా యెందుకు రాసానంటే యీ నాటికి బస్ సౌకర్యం లేని వూళ్ళు యెన్నో! ఆ మారుమూల ప్రాంతం నుండి కష్టంతో బయటకు నడిచివొచ్చి శ్రద్దగా పట్టుదలగా చదువుకున్న వారెందరో! వారి కష్టం సిటిలో పుట్టి పెరిగిన వారికి తెలియదు. అందుకే పల్లెల్లో పుట్టి రవాణా సౌకర్యం లేని పిల్లలకు పరీక్షల సమయంలోనూ ఆశ్రయం ఇవ్వడం ఆతిధ్యం ఇవ్వగల్గితే బాగుండును అనుకుంటాను నేను. మా ఇంట్లో వుండు అని భరోసా యిస్తాను కూడా. ఉన్నవాళ్ళు వుంటారు. లేనివాళ్ళు లేదు.
ఒక కథ రాస్తూ యిదంతా గుర్తు చేసుకున్నాను. స్త్రీ విద్యకు చేయూత నివ్వడం చాలా అవసరం. ఇప్పుడు డబ్బు పెట్టగల్గితే వసతి గృహాలు చాలా వున్నాయి. కానీ ఆర్థికంగా బలహీనంగా వున్నవారికి .. ఏం చేయగలం!? ఆడపిల్లలు చదువు ఆగిపోవడానికి అనేక కారణాలలో రవాణా సౌకర్యం లేకపోవడం వొకటి.
ఇంకో భాగంలో మరికొన్ని. …
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి