29, డిసెంబర్ 2022, గురువారం

స్త్రీ జాతికి విముక్తం

ఈస్తటిక్ సెన్స్ కథా సంపుటిలోని “విముక్తం” కథ పై వ్యాఖ్యానం రాసిన పాలగిరి విశ్వప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలతో.. 
 'కాదేదీ కవిత కనర్హం' అని శ్రీ శ్రీ అన్నారు గానీ, కథకు కూడా ఏదీ అనర్హం కాదు - దేన్నైనా కథగా రూపొందించే నైపుణ్యం తగినంత అధ్యయనం రాసేవారికి వుంటే..వనజగారు రాసిన 'విముక్తం' కథలోని వస్తువు అరుదైనది. ఈకాలంలో ఇది అరుదైనదేనా?
అర్దనగ్నంతో అశ్లీలభంగిమల డాన్స్ లతో వున్న ఇప్పటి సినిమాలు, అరచేతిలో పోర్న్ వీడియోలు చూపించగల మొబైల్ ల ప్రభావంతో చాలామంది మగవాళ్ళ బుద్ధి వంకర తిరుగుతోంది - అందువల్ల అరుదైనదనీ చెప్పలేం.
'విముక్తం' లో కరుణ, ఆమె తల్లి సుగుణమ్మ, భర్త రాజు లు కథను నడిపించిన ప్రధాన పాత్రలు. రాజు తల్లిదండ్రులు, కరుణ పనిచేసే హాస్పిటల్ డాక్టరు కథకు సహాయక పాత్రలు.
కరుణ ఒక నర్సు. రాజు ఆసుపత్రి నిర్మాణంలో పనిచేసిన బేల్దారి. రాజును కరుణ ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. పెళ్ళాయ్యాక తెలుస్తుంది - రాజు ఒక సుఖవాసి అనీ, తాగుడు వ్యసనమైన వాడనీ.
కరుణ కాన్పుకు ఆమె తల్లి సుగుణమ్మ చేదోడువాదోడుకు వస్తుంది. రాజు కన్ను సుగుణమ్మ మీదపడి, ఆమె అక్కడున్న మూడునెలల్లో ఆమెను కబళించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తాడు. ఆమె లొంగదు. కూతురికి చెప్పదు. కరుణ తన మొగుడి దుర్నీతిని గ్రహించి మందలిస్తుంది. ఒకరాత్రి తాను పడుకొని వుండగా, రాజు లేచి వెళ్ళి పక్కగదిలోని సుగుణమ్మపై లైంగికహింస చేయబోతాడు. మెలుకువ వచ్చిన కరుణ మూలనున్న గొడ్డలితో నరుకుతుంది.
ఈ సంఘటన అరుదైనదేనా? కరుణ తన మొగుడిని నరకడమనే సన్నివేశం అరుదైనదే కావచ్చు. కథలోని ప్రధాన అంశం....??
కథలో రాజు తన భార్య తల్లిని(అత్త)ను కబలించాలని చూశాడు. సమాజంలో మరొకచోట మరొకరిని కావచ్చు. ఒకచోట పెళ్ళికాని మరదలి(భార్య చెల్లెలి)ని కావచ్చు, పెళ్ళై భర్త పోయిన వదిన(భార్య అక్క)ను కావచ్చు.
మగాడిలో ఇట్లాంటి దుర్నీతికి తమ ఆర్ధిక స్థాయిలేవీ అడ్డురావు. హైక్లాస్ కుటుంబాల్లో, లోక్లాస్ కుటుంబాల్లో అనే తేడా ఏముండదు. ఇదొక దుర్దమ మానసికరుగ్మత. తన తల్లిని కానీ, చెల్లెలిని కానీ, అక్కను కానీ తన భర్త అనేవాడు కబలించాలని చూస్తే ఆ బాధితురాళ్ళ వ్యధతో సమంగా ఆభార్యా వ్యధ పడుతుంది.
ఈ అంశాన్ని 'కథ' గా చేయాలనుకున్న రచయితను అభినందించాలి. ఇది సాధారణ 'కథాంశం' కాదు. మనోవిశ్లేషణతో కూడుకున్న క్లిష్టమైన అంశం. రచయితకు మనోవిశ్లేషణ సామర్థ్యం వుండాలి. పాత్రల మానసిక స్థితి స్వరూపాలు చదువరికి కనిపింపజేయాలి. అప్పుడే అది ఒక రిపోర్ట్(పోలీస్ రిపోర్ట్ లేదా న్యూస్ రిపోర్ట్) కాకుండా 'కథ'గా మారి అనుభూతి నిస్తుంది. అట్లని మనోతాత్వికతనంతా ఏకరువు పరిస్తే మనోవైజ్ఞానిక వ్యాసమయే ప్రమాదమూ వుంది. దాన్ని సమన్వయపరుచుకునే బాధ్యత రచయితదే.
ఈ అంశాన్ని 'కథ' గా రూపొందించడంలో వనజగారు సఫలమయ్యారు. పాత్రల మానసిక స్థితిస్వరూపాలను మనకు ఎరుకపరచడంలో  రచయిత సఫలం అయ్యారు కానీ  ఎక్కడో కొంత కొరత వుంది. రాజు దుర్మార్గంపై ఏవగింపు కలుగుతుంది. అదే సమయంలో కరుణ, సుగుణమ్మలపై సానుభూతి కలుగుతుంది. 
మగవాడి అహంకారానికి  దౌష్ట్యానికి గురవతున్న సమయంలో స్త్రీలందరూ సుగుణమ్మలా మానసిక బలహీనత ఆవరించి ప్రతిఘటించలేని స్థితిలో నైనా వుంటారు లేదా కరుణ లా ఆవేశంతో తెగింపుతో తమను తాము రక్షించుకోవాలన్న సృహలో ఆ పురుషుడిపై ఎదురుదాడి చేసి రక్షించుకోగల దైర్యాన్ని ప్రదర్శిస్తారు. 
ఈ కథలో కరుణలో తెగింపుతో పాటు ఇతరుల ప్రాణాలు చాలా విలువైనవన్న సృహ కల్గినటువంటి స్త్రీ అవటం మూలంగా.. ఆమె పై పాఠకుడికి వ్యతిరేక భావం ఏర్పడకుండా చక్కని వాక్యంతో కథను ముగించారు. అటవిక న్యాయం మానవ సమాజంలో సహజమైనదిగా చిత్రీకరించడం తగదని  రచయిత పాటించాల్సిన విచక్షణను బహుచక్కగా ప్రదర్శించారు. 
ఇటువంటి అంశాన్ని 'కథ' గా రూపొందించిన రచయితకు మనసారా అభినందనలు.
-పాలగిరి విశ్వప్రసాద్ రెడ్డి 


కామెంట్‌లు లేవు: