24, డిసెంబర్ 2022, శనివారం

ఋణ బంధాలు

ఈస్తటిక్ సెన్స్  కథాసంపుటిలో

 “ఋణ బంధాలు” కథకు ఆర్ దమయంతి గారూ వ్యాఖ్యానం రాసారు. వారికి ధన్యవాదాలతో 🙏


ఇవ్వడం మాత్రమే తెలిసిన చేతులకి రాగద్వేషాలుండవు..కరుణ తప్ప!' అని చెప్పిన కథ! - 'ఋణ బంధాలు'

 

"వాళ్ళతో నాకున్న పరిచయం, స్నేహం ఈనాటిది కాదు. కొన్నేళ్ళది. నేనంటే వాళ్ళకెంత మర్యాద, ఎంత మన్నన! గడపలోకెళ్తే  ఎంత ఆనందపడిపోతారంటే..'రండి..రండి! ఇవాళెంత సుదినం! మీ రాక మాకెంతో ఆనందం.."-  అంటూ అత్మబంధువులకంటే మిన్న గా ఆహ్వానిస్తారు. 'మనది జన్మజన్మల బంధమన్నంత..' ప్రాణం గా మాట్లాడతారు.  ఇదంతా నిజం గా నిజం. కానీ, ఎప్పటి వరకు అంటే - నాకివ్వాల్సిన డబ్బు తిరిగి ఇవ్వమని అడగనంత వరకే!" - అని అంటాడు ఓ గొప్ప అనుభవజ్ఞుడైన రచయిత. ఇది అక్షర సత్యం. ఆ నగ్నసత్యానికి దర్పణం పట్టిన కథే - శ్రీమతి వనజ తాతినేని గారు రాసిన 'ఋణ బంధాలు' కథ.

మేలైన వ్యసనాలలో అతి ప్రమాదకరమైన వ్యసనం అంటూ ఏదైనా వుందీ అంటే, అది ఖచ్చితం గా - అడిగిన వారికి లేదనకుండా అప్పు లివ్వడం! కొని తెచ్చుకున్న మనో వ్యధ అంటూ ఏదైనా వుంటే..  తీసుకున్న వాడు, ఋణం చెల్లించకుండా పెట్టే బాధలు..ఇతరులతో చెప్పుకోలేక లోలోన కుమిలిపోవడం! ఆ టార్చర్ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. జీవిత కాలం లో ప్రతి మనిషీ ఈ రకమైన అనుభవాన్నుంచి తప్పించు కోలేనివారే!

మనిషి కీ మనిషి కీ మధ్య ఆర్ధిక సంబంధాలు వుండొచ్చు కానీ,  స్నేహితులతో కానీ, అయిన వాళ్ళతో కానీ, రక్త సంబంధీకులతో కానీ పైసా తో కూడిన లావాదేవీలకు దూరం గా వుంటం వల్ల బంధాలు నిలుస్తాయి. కథలో కరుణ కూడా సరిగ్గా ఇలానే అభిప్రాయపడుతుంది.

నీ డబ్బు నీ చేతిలో వున్నంత వరకే అది నీది. పరుల చేతి కిచ్చాక, అది ఇక పరాయిది..నీ సొమ్ము నీకు తిరిగి వచ్చే దాకా..దిగులే మరి.

- కాళ్ళు పట్టుకున్నాడని కరిగిపోయి, స్యూరిటీల మీద సంతకంపెట్టడం,   చేతులు పట్టుకున్నాడని..జాలితో కదిలిపోయి, తల తాకట్టు పెట్టి మరీ డబ్బు తెచ్చివ్వడం - ఆ పైన అతను అడ్రెస్ లేకుండా పోయాక దిగులుతో మంచమెక్కడం..ఇదంతా - సుఖాన వున్న ప్రాణాన్ని కష్టాల పాలు చేసుకోవడం వంటిదే. ఆదుకోబోయి, ఆపదల్లో చిక్కుకోవడం అంటే ఇదే మరి!

మిత్రుడు బాధల్లో వున్నాడని ఇంటి అవసరాలని కూడా పక్కకి పెట్టి దాచుకున్న మొత్తాన్నిఎత్తి ఋణమివ్వడం అంటే అది తనకి మించిన మంచితనం అవుతుంది. కాదు. తన జీవితాన్నే ముంచెత్తేస్తుంది. ఈ రకమైన జాలి ఖచ్చితం గా బలహీనతే! మంచి తనం కూడా నరాల బలహీనతే అని అందుకే అంటారు ప్రఖ్యాత రచయిత గోపీచంద్.  

' నీ స్నేహితునికి డబ్బిచ్చి అతన్నొక మతిమరపు మనిషిని  చేయకు.' అంటూ జోక్ పేల్చాడు ఓ అనుభవజ్ఞుడు.  నిజమే. అప్పు తీసుకున్న వాడికి తిరిగి ఇవ్వాలని గుర్తుండదు మరి.

అసలు అప్పులిచ్చి ఇన్ని అవమానాలు, బాధలు పడే కంటే అదే మొత్తాన్ని శక్తి కొద్దీ దానం గా ఇస్తే ఎంత శాంతి గా వుంటుంది! ఇటు ఇల్లూ, అటు మనసూ, మనిషి కి  కూడా ఎంత ప్రశాంతం గా వుంటుంది! సరిగ్గా ఇదే గీతా బోధన చేస్తాడు, కథలో తల్లికి - ఆ కుమారుడు. ఈ రోజుల్లో యువకులు ఎంత ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు, ఎలా ముందు జాగ్రత్తలు తీసుకుంటారో చెప్పడానికి కథలో ఇతని పాత్ర ఓ నిదర్శనంగా పేర్కొనాలి.

ఇదొక వైనం అయితే, మనిషి ని నమిలేసే మరో ఋణ బాధేమిటంటే..

ఎవరికైనా పైసా బాకీ వున్నా, తీర్చే దాకా నిద్ర పట్టని అస్థిమితం తో కొట్టుమిట్టాడటం.

కథలో సగ భాగం - అప్పులి చ్చి ఆగమైన వారి సంగతైతే, మిగిలిన సగ భాగం, బాకీ తీర్చడం కోసం పరుగులు తీసిన ఓ నిజాయితీ పరురాలి కథనం ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది.  

ఈ రండ సమస్యల ఘర్షణా సంఘర్షణల మధ్య నలిగిన ఓ మంచి మనసున్న మగువ కథ - ఋణబంధాలు.

కూరల బండి వాడి బాగు కోరి అప్పు ఇస్తుంది - కరుణ. అతను తనకివ్వాల్సిన డబ్బుని తిరిగివ్వకుండా మాయమైనప్పటి బాధ కంటేనూ, తను అతనికివ్వాల్సిన చిన్న మొత్తాన్ని చెల్లించడం కోసం పరుగుపరుగున మరీ వెదకి పట్టుకుంటుంది. చివరకి ఆ మొత్తాన్ని అతని చేతికందించి, గుండెల మీదున్న కొండంత భారాన్ని దింపుకుని, హాయిగా నిట్టూర్చుతుంది.  

చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ మంచి గుణాన్ని చూస్తాం. వాళ్ళకి అప్పు అంటే భయం. పైసా బాకీ వున్నా సరే, తీర్చే దాకా నిద్రపట్టదు. తిరిగి ఇచ్చే దాకా మనసుకి చెయిన్ పట్టదు.  

కథలో కరుణ కున్న ఈ పాటి నీతి నిజాయితీలు - వేల కోట్లు అప్పులు చేసి, విదేశాలకు పారిపోయిన బడా దొంగలకు వుంటే ఎంత బావుణ్ణు కదా అనిపిస్తుంది.  

వాస్తవ సంఘటనలని ఆధారం గా చేసుకుని, వినూత్నమైన కథాంశంతో సహజ రీతిలో, తనదైన శైలిలో, కథని రక్తి కట్టించారు - రచయిత్రి. కథ ఆసాంతం ఆసక్తి కరం గా చదివించారు.

సంభాషణలో వినోదం వుంది. దాని వెనకే విషాదమూ దాగుంది.   మనిషి అసలు నైజాన్ని చాటుతూనే, తస్మాత్ జాగ్రత్త సుమా అనే విలువైన సందేశాన్ని కూడా అందచేస్తుంది -కథ.

'ఈ కథ నా కథ లా వుందే చెప్మా!' అని ప్రతి పాఠకుడునీ తన రచనలో   నిమగ్నం చేస్తూ కథ రాయడం రచయిత్రి రచనా ప్రతిభకి ఓ తార్కాణం అని చెప్పాలి.

వనజ గారి కలం నుండి మరెన్నో వినూత్న కథాంశాలతో కూడిన మంచి మంచి కథలు రావాలని, రాయాలని మనసారా కోరుకుంటూ, మరిన్ని కథా సంకలనాలు వెలుగు చూడాలని ఆశిస్తూ..


శుభాభినందనలతో..

ఆర్.దమయంతి.



కామెంట్‌లు లేవు: