29, జనవరి 2025, బుధవారం

బెజవాడ మేల్కొంది

04:20 am  పటమట సెంటర్ 

మంచు తెరలు మనిషిని మనిషి చూసుకోకుండా తెరసెల్లా పట్టినట్టు వున్నాయి.

 నగరం ఇంకా ముడుచుకుని పడుకునే వుంది. 

అడపాదడపా పాల వ్యాను తిరుగుతూనే వుంది

వీధి కుక్క మొరుగుతూనే వుంది 

మూసిన షాపు ముందు పడుకుని వున్న బిచ్చగాడు లేచి వొకసారి చుట్టూ చూసి మళ్ళీ దుప్పటి బిగించాడు

ఉదయపు నడక కోసం బయట పడ్డ నడివయసు మనిషి మిత్రుని కోసం ఎదురుచూపు

దూరం నుండి కాఫీ ఆరోమా ఆస్వాదించమని రెచ్చగొడుతుంది

పేపర్ బోయ్ లు పొదికలను స్కూటీ ముందు సర్దుకుంటున్నారు

దూరంగా 10 వ నెంబర్ బస్ నిండు గర్భిణీ లా కదిలి వస్తుంది

బస్టాప్ లో వున్న ప్రయాణికులు ముందుకు వచ్చి చేతులు పైకి కిందకి ఊపుతున్నారు

ఎదురుచూస్తున్న మిత్రుడు రానే వచ్చాడు 

ఉన్నికోటు తొడుక్కొని చేతులు ఫ్యాంట్ జేబులో పెట్టుకొని గబగబా నడుచుకుంటూ వచ్చాడు 

దగ్గరికి రాగానే నులివెచ్చని కరస్పర్శ అందించి .. 

పద పద హైస్కూల్ రోడ్ లో ఓ గ్రీన్ టీ తాగి

తాడిగడప దాకా వెళ్లి వద్దాం పది కిలోమీటర్లు టార్గెట్ ఈ రోజు అన్నాడు.

తూరుపు ఎదురొస్తుంది పటమట సెంటర్ వెనుకబడుతుంది

చిన్ననాటి కబుర్లు ఊట బావిలో నీళ్ళు లా ఊరుతున్నాయి. 

27, జనవరి 2025, సోమవారం

అర్థ సత్యం

 అర్థ సత్యం - వనజ తాతినేని 


కొన్ని వస్తువులు పని చేస్తున్న శబ్దాలు తప్ప 

మనిషి పిట్ట అలికిడి లేని ఇల్లు

పిల్లలు వారి స్నేహితులతో పార్టీలోనో 

పబ్ లోనో

భార్య తన స్నేహితుల మధ్య నో  షాపింగ్ మాల్ లోనో

ఎవరికీ ఎవరితోనూ సంబంధం లేదు కరెన్సీతో తప్ప. 

సంపాదించే క్రమంలో.. కోల్ఫోయినవి కళ్ళ ముందు సాక్షాత్కారం 


ఇప్పుడు తన కోసం ఎవరూ తీరికగా 

లేరు. తన ఉన్నతికి ఈర్ష్య పడుతున్న శత్రువులు మిత్రులు రూపంలో 

తన చుట్టూ ఈగల్లా మూగే బంధువులు


మధువు మగువ కూడా నిషా నివ్వడం మానేసి చాలా కాలమైంది.

మాటా మంతీ కష్టం సుఖం అనుభూతి అనుభవం

పంచుకోవాల్సిన వాళ్ళు  వేరొకరితో పంచుకోవడం సాధారణమైపోయింది 

అలసినది ఒంటరిది  నా మది 


తెర చాప అనే  ధనం బ్రతుకు పడవకు సౌఖ్యమే కానీ 

కట్టి పడేసే బలమైన లంగరు గొలుసు ఇల్లు మాత్రమే 

కాల నది ప్రవాహంలో  పగులుబారిన ఓటి పడవ నడక ఇది


నడి రేతిరి 

వీధి దీపాలైనా వొకటికొకటి తోడుగా నిలబడి నట్లు వుంటాయి కానీ .. మనిషికి మనిషి తోడు వొక భ్రమ. నడి వయసు యాతన 

పండోరస్ పెట్టె తెరుచుకుంది. లోన దాగిన evil విడుదలకు నోచుకుంది.  

తేనెటీగల్లా చుట్టేసిన జ్ఞాపకాలు 


ఇంకొన్నాళ్ళు వుండకూడదా అని నాన్న నిశ్శబ్దంగా కార్చిన కన్నీరు

తన సౌఖ్యం కోసమే అనుక్షణం తపించిన తల్లి

తన పిలుపు కోసం ఎదురు చూస్తూ చూస్తూనే శాశ్వతంగా మూగబోయిన వారి మొబైల్ ఫోన్లు 

ఆలస్యమైపోయింది.వగచి ప్రయోజనం లేదు

ఏదైనా మాయా తివాచీ దయ తలిస్తే బాగుండును

కరుణ కు కాణాచి అయిన వారి ఒడిలో కాస్తంత సేదతీరడానికి పరుగులు నెమ్మదించడానికి. 




25, జనవరి 2025, శనివారం

బనలతా సేన్ -జీవనానంద దాస్

 జీవితం మరీ నిసృహగా యాంత్రికంగా మారినప్పుడు నాలోనన్ను నేను వెతుక్కుంటాను.అది ఎలా అంటే చలి పాదాల ద్వారా ప్రవహించి నేనున్నానంటూ గుర్తు చేసినట్లు. 

రోజంతా ఏం చేస్తుంటావ్ ఎప్పుడూ తీరికలేనట్టూ హడావిడి సంభాషణ చేస్తావ్ అంటారు. నిజానికి వారితో సంభాషణించడం నాకు మీదు మిక్కిలి ప్రయాస. అనేక వస్తు సంచయాల మధ్య ఆరోపణల బాంధవ్యాల మధ్య వారు అసంతృప్తిగా వుంటారు. వాళ్ళతో మాటలంటే విముఖత నన్ను వారి లోకానికి పరిమితం చేస్తారని. 

నిజానికి నాకు ఇంటి పని వంట పని గంటన్నర సమయంలో ముగిసిపోతుంది. 50+ లోకి వచ్చేసరికే నా కొడుకు రిటైర్మెంట్ జీవితం తీసేసుకో.. అని బలవంత పెట్టాడు. చేయడానికి ఏ పని లేదు. అంతకు ముందు పుస్తకాలు చదవడం కోసం రోజుకు రెండు గంటలు అయినా నిద్రను త్యాగం చేసేదాన్ని. అదృష్టవశాత్తు నాకిప్పుడు బాగా చదువుకునేంత తీరిక. అనేకం చదువుతుంటాను. నా అదృష్టం బావుంటే రోజు మొదట్లోనే నాకు తృప్తి నిచ్చిన రచన నా పాలబడుతుంది. లేదంటే లేదు.. రోజంతా చదువుతూనే వుంటాను. 

ఆఖరుగా నన్ను నేను వెతుక్కోవాలి అనుకున్నప్పుడు.. ఠాగూర్ ని తెరుస్తాను. లేదా ఖలీల్ జీబ్రాను ను తెరుస్తాను. లేదా ప్రకృతిలో నడుస్తాను. 

నిజంగా చెప్పాలంటే ఓ కెమెరా భుజాన వేసుకుని  ఆకలిదప్పులు లేకుండా అలా నడుచుకుంటూ పోవాలని.. వనవాసి లా ఆ గుర్రం మీద కూర్చునే..  ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ మార్మికతను అర్థం చేసుకోవాలని. 

ఊహలు ఆశలు ప్రపంచం లో వున్న సౌందర్యాన్ని వీక్షించాలని  మస్తిష్కంలో గాఢంగా నింపుకోవాలని.. .. నిశ్శబ్దంగా మాయమవ్వాలనీనూ. 

ఎక్కువ ఊహలు కొంచెం అనుభవం మరికొంచెం అనుభూతి. 

గంగిగోవు పాలు గరిటెడైనను చాలు. 

పుస్తకాలకు పాపలకు  సంగీతానికి సన్మిత్రులకూ .. నేను సన్నిహితం. ప్రకృతి కి మరింత సన్నిహితం.

బనలతా సేన్ - జీవనానంద దాస్ కవిత వినండీ.. 


చుట్టూరా ఇంతకు మునుపు లేని  దట్టమైన మంచు కమ్ముకుంది.. నా మనసును వనలతా సేన్ కమ్ముకున్నట్టు. జీవనానంద దాస్ గురించి వింటుంటే  నా హృదయానికి మునుపెన్నడూ తెరుచుకోని కొత్త ద్వారాలు తెరుచుకున్నట్టు వుంది. పసుపు పచ్చని బెంగాలీ నేత చీరలో ఆకుపచ్చ రవికతో వనలతా సేన్ మసక చీకట్లో దడి మీద పూచిన బీర పువ్వులా అనప పువ్వులా దృశ్యాదృశ్యంగా గోచరించింది. జలపాతం లాంటి ఆమె కేశపాశంపై మిణుగురులు తారట్లాడుతున్నట్టు కనిపించింది. ఒక అడవి పువ్వు తన పరిమళంతో పరిసరాలను మత్తులోకి చేయిపెట్టి తీసుకువెళుతున్నట్టు వుంది. వనలతా సేన్ నాకొక పురా సంస్కృతి. ఆధునిక స్త్రీ జాతి ఎప్పుడైనా తనను తాను వెతుక్కుంటూ వెళితే లభించే గుప్తనిధి. నా రాబోయే కథలో వనలతా సేన్ నాయిక. 

జీవనానంద దాస్ గురించి నేస్తం P.సింహాద్రమ్మ గారి మాటల్లో వింటుంటే నాకు కలిగిన అనుభూతి ఇది. 

కవిత్వాన్ని అర్థం చేసుకోవడం ఆకళింపు చేసుకోవడం అన్వయించడం అనుభూతి ని మన మాటల్లో వర్ణించి చెప్పగల్గడం.. అనేది ఒక కళ. ఆ కళాకృతి సింహాద్రమ్మ గారు. నాకు ఎంత నచ్చేసినారో! 

జీవనానంద దాస్ నా పైన ఆకాశంలో ఎగురుతూ వుండొచ్చు.. ఆయన్ని ఈ రోజంతా నా హృదిలోనూ మది లోనూ నింపుకున్నందుకూ.. 

మాట్లాడటం వొక అనుభవం. అనుభూతిని అనుభవంలోకి తెచ్చుకున్న అనుభవం. 

మేడమ్.. P.సింహాద్రమ్మ గారూ.. 

Thank you so much.. నా రోజు ని ఫలప్రదంగా మార్చినందుకు.




22, జనవరి 2025, బుధవారం

డప్పుల బండి

 డప్పుల బండి 

వాడు స్త్రీల దేహాలను తమ  చూపుల భాషలోకి కొలతల్లోకి మార్చుకుంటాడు. ప్రేమకు దర్పణంగా వున్న ఆమె గుండెలను తమ వాడి అయిన  చూపుతో గుచ్చి గుచ్చి చంపుతాడు. 

పచ్చని వనంలా వున్న దేహ ఆవరణలోనికి వాడు బందిపోటు దొంగలా ప్రవేశిస్తాడు. ఆమె అస్థిత్వం పై జులుం ప్రదర్శిస్తూ తన పురుషత్వపు కొరడా ఝళిపిస్తాడు. 

మరులుగొన్న మృగంలా ఉన్మాదంతో దాడి చేయడంతో ఆగక  పైశాచికత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తాడు. నేరాలను కొత్తపుంతలు తొక్కిస్తాడు. 

మరొకచోట..

ఏడడుగులు నడిపించాల్సిన వాడే

ఏడు కట్ల సవారి పై పడుకోబెడతాడు 

మోజు తీరాక ప్రిడ్జ్ లో ముక్కలు ముక్కలుగా 

సర్దేస్తాడు. ప్రెషర్ కుక్కర్ లో ఉడకబెట్టేస్తాడు. 


ఆ వార్తలను మహోగ్రహావేశాలతో డప్పులబండి వాడిలా చానల్స్ వినిపిస్తాయి.

అలసి ఆగిపోతాయి మరొక మేత అందేదాకా.

 స్త్రీ జీవితమంటే ...ఇంత అల్పం స్వల్పం గా మారిపోనున్నాయ్యా ? 

 స్త్రీలు దేహం గేహం మనసు హృదయం లేని ఆట బొమ్మలై పోయారా!? 

వ్యవస్థ లన్నీ వేశ్య కన్నా హీనంగా అమ్ముడు పోయాక.. అతివకు న్యాయం జరిగేది ఎక్కడ?

ఈ ఆక్రోశం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిందా? 

మనుషుల మధ్య 

దయ కరుణ ప్రేమ జాలి లాంటివి కనుమరుగైకామం కోపం ఉద్రేకం ఉన్మాదం పైశాచికం భీభత్సం లాంటివి కులం లా మతంలా వాదంలా జెండా ఎగరేస్తున్నట్టు వుంది. 

ఎంతైనా.. 

డప్పులబండి.. కాలమే నయం. 

లోకం ఇంతగా చేవ చచ్చి లేదు. వెనక్కి పోదాం పదండి. 





21, జనవరి 2025, మంగళవారం

ప్రేమ్ చంద్ కథ .. వినండీ

 చదివి విని అర్థం చేసుకోవాల్సిన కథ.. కథలో  ఆ తండ్రి కొడుకుల పట్ల ఏహ్యభావం కల్గుతుంది. అదే సమయంలో సమాజం తీరుతెన్నులు మనకు అవగతం అవుతాయి. ప్రేమ్ చంద్ కథ “మృత వస్త్రం” (కఫన్) కథ వినండీ.. 



18, జనవరి 2025, శనివారం

పాపాయి బొమ్మ

 పాపాయి బొమ్మ  -వనజ తాతినేని 

అరుణిమ తో  అచ్చెరువు గా వుంది పాపాయి 

ఉదయం. ఆనందంలో తలమునకలై పోయింది. 

ఎవరో పాపాయి బొమ్మను దొంగిలించి విసిరికొట్టారు 

వెక్కి వెక్కి ఏడుస్తూ ముక్కలన్నీ యేరి బుట్టలో భద్రంగా దాచుకుంది 

ఇల్లంతా వెలుగురేకలు. దాచి పెట్టాలన్నా దాగని కాంతులు

అమ్మా..  ఎవరో నా బొమ్మని పగలగొట్టారు అని పిర్యాదు చేసింది

అయినా చూడూ..  ముక్కల వెలుగు ఎలా అలుముకుందో ఇల్లంతా.. అని సంబర పడింది కూడా.

అవును చిట్టితల్లీ.. నేను కూడా నా

చిన్నతనంలో  అమ్మమ్మకు ఇలాగే పిర్యాదు చేసాను నీ లాగే సంబరపడ్డాను 

అద్దం పాపాయి లకు యిష్టమైన బొమ్మ

పగిలినా ముక్కలైనా.. ఇంటిని వెలుగుతో నింపేస్తుంది. 

పాపాయికి ఏం అర్థం అయ్యిందో మరి.. 

 నాకు ఈ వెలుగులే కావాలి కొత్త బొమ్మ వద్దు

అని బొమ్మల బుట్ట ముందు కూర్చుని

బొమ్మరిల్లు కడుతూ వుంది.  

అమ్మ పాపాయి వైపు చూస్తూ ఇంటికి హృదయం లాంటి అద్దం వద్దు.

ముక్కలైన అద్దం సరిపోతుంది అనుకుంది

సాలోచనగా . 

అనాదిగా శపించబడినవి పాపాయిల హృదయాలు 

18/01/2025.  07:07 am



15, జనవరి 2025, బుధవారం

ఏక్ మోకా దేదో

 Old One.. 

నాకో అవకాశం ఇవ్వుసముద్ర తీరంలో నీ పేరు నా పేరు కలిపి రాశాను.

 అల్లరి అల వచ్చి కలిపేసుకుని పోయింది 

ఇసుకలో రాశాను. తుంటరి

గాలి దుమారం వచ్చి చెరిపేసి పోయింది 

నల్లబల్లపై రాశాను

కుళ్ళుబోతు క్లాస్మేట్ తుడిపేసి వెళ్ళాడు

రంగుల సిరాతో కాగితం మీద రాశాను

మాయదారి వానకాడొచ్చి తడిపేసి పోయాడు

ఎలక్ట్రానిక్ పలక రాశాను మతిమరుపు తో

మీట నొక్కగానే మటుమాయమైంది

సంక్షిప్త సందేశం పంపాలనుకున్నాను. 

నెట్ వర్క్ అందుబాటులో రాకుండా ఏడిపించింది. 

కీ బోర్డు పై రాశాను. నా ధ్యాసంతా నీవై

సేవ్ సెండ్ రెండూ చేయడం మర్చిపోయాను.

విద్యుల్లేఖ పంపాలని అనుకున్నాను 

రాంగ్  ఐడి అని చేతులెత్తేసింది 

రాయని ప్రేమలేఖ కు పంపలేని సందేశానికి 

నిండు నూరేళ్ళు అని  డ్రాప్ బాక్స్ లో  పడేసి.. 

గతస్మృతుల అలసట నుండి బయట పడటానికి 

దేహానికి మనసుకి విశ్రాంతి కోరి 

ఏకాంతంవైపుకు  అడుగులేస్తూ... 

కడసారిగా అడుగుతున్నాను

జఢత్వమా చైతన్యమా..

పొద్దు చాలని మనిషినై పోయాను

నా ప్రేమ కి వింత వింత రంగులు అద్దుకుంటూ.. 

నాకో అవకాశం ఇవ్వకూడదూ.. 

మనసుని హృదయాన్ని జుగల్బందీగా మార్చేసి

తుదకు.. ఏకశిలపై శిల్పాల్లా అయినా 

నిలిచి వుందాం. 

(వాచ్యం ఎక్కువైంది. రాసిన కాలం అటువంటిది) కవిత్వ పాఠశాల లో భాగం. 2010/

12, జనవరి 2025, ఆదివారం

హృదయం పాడుతుంది

 నా ఇల్లంతా పరిశుభ్రంగా మెరుస్తుంది 

అంట్ల గిన్నెల తొట్టె పొయ్యి గట్టు తళ తళ మెరుస్తున్నాయి 

బట్టలారేసే తీగలు వెలవెలబోతున్నాయి 

వాకిలి కూడా చిన్నదైన సుద్ద ముక్క ముగ్గుతో ముచ్చటగా వుంది. 

రెండు మూడు రకాల గిన్నెలు నిండుగా తినడానికి సిద్ధంగా వున్నాయి 

పెరట్లో మొక్కలు కూడా కళకళలాడుతూ కబుర్లు చెప్పతుంటాయి

నా పొద్దు గడవడానికి మంచం పక్కన మంచంపై రేడియో పుస్తకాలు కలం ఐ పాడ్ మొబైల్ జీ హుజూర్ అంటాయి. 

అయినా ఏదో వెలితి

అలవాటైన ఏ పనో చేయలేదన్న వెలితి పట్టిపీడిస్తూ వుంటుంది.

నిజానికి ఆపని హృదయం తో ఎప్పుడూ చేస్తూ వుంటాను. 

నేను ఆ పని చేయనందుకు కలిగే అపరాధ భావన ను కూడా తుడిచేయ్.. ఈశ్వరా! 

అనేక పనుల గొలుసు లో  అర్చన ను కలిపి బిగించలేను 

ఎల్లప్పుడూ నా హృదయం పాడుతుందీ.. 

ఓం నమఃశివాయ అని. 

(భక్తి అనేది భావన.  cult అనేది కానే కాదు)


 ఉజ్జయిని మహాకాళ్  భస్మహారతి చిత్రం

11, జనవరి 2025, శనివారం

జీవితాన్ని కొలుద్దాం

 జీవితాన్ని కొలుద్దాం 

-వనజ తాతినేని 

జీవితాన్ని కొలవాలనే బుద్ధి 

వివాహ జీవితానికి పూర్వం  

కొన్ని కలలు  అనేక ఆశలు 

తర్వాత.. 

భారం దూరం లెక్కలేసుకోవడం. 

ముగిసేలోపు రోజూ సింహావలోకనం 

చేసుకోవడం

ఎవరిపై ఆరోపణలు లేవు

 నాపై నాకే ఆరోపణ

నేనేమి ధీర ను కాదు

భీరువు ని. 

బతకలేక చావలేక.. జీవితాన్ని

కాలం చేతిలో పెట్టేసాను. 

మొత్తంగా నేనొక పలాయన వాదిని. 


ఆంగ్లంలో అనువాదం.. 

Let's scale the life 

-Vanaja Tatineni 

The thinking to scale the life 

It's the context before the marriage 

There were some dreams and numerous hopes 

Taking the measures of loads and roads and 

Memorising all before the day gets to cease 

With no alligetions against anyonee

Except myself 

I'm not courageous 

And even not cowardly 

Handed over the life to the time being 

unable to either live or die

And totally.....

I'm an escapist..

Translated by P.Simhadramma 


కన్నడంలో.. అనువాదం 

ಜೀವನಕ್ಕೆ ಚೈತನ್ಯ ತುಂಬೋಣ

ಜೀವನಕ್ಕೆ ಚೈತನ್ಯ ತುಂಬಲೆಂದೇ

ವಿವಾಹ ಜೀವನಕ್ಕೆ ಮುನ್ನ

ಕೆಲವು ಕನಸುಗಳು ಅನೇಕ ಆಸೆಗಳು

ನಂತರ

ಗತಿಸಿದ ದೂರ ಲೆಕ್ಕ ಹಾಕಿಕೊಳ್ಳುವುದು

ಮುಗಿಯೋ ಮುನ್ನ ಪ್ರತಿ ದಿನ ಸಿಂಹಾವಲೋಕನ

ಮಾಡಿಕೊಳ್ಳುವುದು

ಯಾರ ಮೇಲೂ ಆರೋಪಗಳಿಲ್ಲ

ನನ್ನ ಮೇಲೆ ನನಗೇ ಆರೋಪ

ನಾನು ಧೀರನಲ್ಲ

ವೀರನೂ ಅಲ್ಲ

ಬದುಕಲಾಗದೆ, ಸಾಯಲಾಗದೆ ಜೀವನವನ್ನು

ಕಾಲದ ಕೈಗೆ ಕೊಟ್ಟಿರುವೆ 

ಒಟ್ಟಿನಲ್ಲಿ ನಾನೊಬ್ಬ ಪಲಾಯನವಾದಿ

-ವನಜ ತಾತಿನೇನಿ 

Translated by Ashok Pinnamaneni 


My sincerely Thanks to P. Simhadramma and Ashok Pinnamaneni 🙏


5, జనవరి 2025, ఆదివారం

ప్రేమ పాత్ర

 నీ ప్రేమ పాత్ర ను ఎన్నడూ ఖాళీ చేయకు.. 

ఎవరైనా అడిగినప్పుడు ఉదారంగా కొంచెమే చిలకరించు.

నీ ప్రేమే కాదు 

ఏ ప్రేమ శాశ్వతం కాదు. 

ఒకవేళ నీ ప్రేమ పాత్రకు రంధ్రం పడిందే అనుకో…

అది మరొక పాత్రనూ నింపనూవచ్చు 

లేదా భూమి మీద పడి ఇంకి పోవనూవచ్చు. 

ధూళి గా మారి పోవచ్చు. 

ఇతరులకు కొంచెం ఇస్తూ

నిన్ను నీవు నింపుకోగల ప్రేమ మాత్రమే నీదైనది. 

నీతో వుంటుంది. గుర్తుంచుకో … 

ప్రేమదెప్పుడూ విజయగర్వం కాదు కేవలం

పరాజయ కంఠధ్వని మాత్రమే 

మోసుకుంటూ ఈడ్చుకుంటూ 

కూలిపోవల్సిందే! 


టాల్స్టాయ్  “అన్నాకరెనినా” కి ప్రేమతో