క్రొత్తగా పెళ్లి చేసుకుని విదేశానికి వచ్చి బయటకి కదలకుండా యెప్పుడూ యింట్లోనే వుండాల్సి వచ్చినందుకు విసుగ్గా వుంది స్వాతి కి. అనుకోకుండా వొక ఆహ్వానం అందింది. ఆటవిడుపుగా ఆ కార్యక్రమానికి హాజరైంది. అక్కడ అనేకమంది తెలుగు వారిని చూసి సంతోష పడింది. అందరిని పరిచయం చేసుకుంది. అంతా తెలుగు వారే కావడంతో అది ఆంధ్ర దేశంలో వొక వూరులాగానే తోచింది. అదొక కమ్యూనిటీ హాలు. ఆ రోజు అక్కడ వొక కార్యక్రమం జరగబోతుంది. ప్రత్యేకించి స్త్రీలకి సంబంధించిన కార్యక్రమం. పరాయి భావనలో మూలాలు గుర్తుకు రావడం మూలంగానేమో దేశంలో జరిగే ప్రతిచిన్నవిషయాన్ని కూడా వేడుక చేసుకోవడానికి అలవాటు పడి పోయిన వారికి అదొక అవకాశమే ! వారానికి అయిదు రోజులు యంత్రాలలా పనిచేసి ఆటవిడుపు కోసం వెదుక్కుని నలుగురు కలసే సందర్భం కోసం యెదురు చూస్తున్న వారికి కందుకూరి జయంతి గుర్తుకు వచ్చింది. స్త్రీల పునర్వివాహలు జరిపించడానికి విశేషంగా కృషి చేసిన విధమూ గుర్తుకు వచ్చింది. వెంటనే వొక కార్యక్రమం వారి ఆలోచనల్లో రూపుదాల్చింది. నాటి కాలానికి నేటి కాలానికి వచ్చిన మార్పులు గమనిస్తూ పునర్వివాహాల వల్ల కలిగే మంచి-చెడు పరిణామం గురించి వొక చర్చా కార్యక్రమం నిర్వహించదలచారు. ఒంటరి స్రీలు - పునర్వివాహం అనే అంశం పై యెవరైనా మాట్లాడవచ్చు వారి వారి అనుభవాలని చెప్పవచ్చని ప్రకటించారు రోజంతా అదే విషయం పై కార్యక్రమం జరుగుతుంది కాబట్టి చాలా మంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు.కొందరేమో యిదే౦ పనికిమాలిన కార్యక్రమం అని చిరాకు పడ్డారు. స్వాతి కార్యక్రమాన్ని ఆసక్తిగా చూస్తూ వుంది . కొందరు చక్కటి తెలుగులోనూ, మరి కొందరు ఇంగ్లీష్ లోను వారి అనుభవాలని, అభిప్రాయాలని చెబుతున్నారు. చాలా మంది పునర్వివాహం చేసుకోవడం చాలా మంచి వుద్దేశ్యమని వొంటరి జీవితాలకి తోడూ, ప్రేమ దొరుకుతాయని, మనిషి ఆనందంగా బ్రతకడానికి వివాహం చాలా అవసరమని చెపుతున్నారు. వారి వారి మాటలు వింటున్న స్వాతికి కోపం ముంచుకొస్తుంది. ప్రక్కనే ఉన్న భర్త అనిల్ స్వాతి చేయి పట్టుకుని వారిస్తూనే ఉన్నాడు అయినప్పటికీ భర్త మాటని లక్ష్య పెట్టకుండా లేచి గబా గబా నిర్వాహకుల దగ్గరికి వెళ్ళి తనకి మాట్లాడటానికి అవకాశం యివ్వమని కోరింది. నిర్వాహకులు ఆమె పేరుని నమోదు చేసుకుని వరుస క్రమము లో ఉంచారు. " స్వాతి .. యే౦ మాట్లాడదల్చుకున్నావ్ ? ఆంటీ గురించి చెప్పాలనుకుంటున్నావా ? అలాంటి బుద్ది తక్కువ ఆలోచన మానుకో ! మన గురించి మనమే చాటింపు వేసుకోవడం అవసరమా ? " "మన అనుభవాన్ని ఇతరులతో పంచుకుంటే తప్పేమిటి? ఆ అనుభవం ఇతరులకి మంచి చేయవచ్చు కదా! " "ఇక్కడున్నంత మాత్రాన, స్వేచ్చగా యెవరికీ తోచింది వారు చేసేయవచ్చు అనుకోకు. మనకి అక్కడ వున్నట్లే ఇక్కడ వారిలో కూడా చాలా విషయాలలో మూర్కత్వం వుంది పై పైకి అందరూ నాగరికులే , చదువుకున్నవారే , సంస్కారం ఉన్నవారే! కానీ మన జీవితాలలో వున్న చిన్న లోపం కనిపెట్టినా చెవులు కొరుక్కుంటారు, వెలివేసినట్టు చూస్తారు. ఎవరికీ మనం అనుకున్నంత విశాల హృదయం ఉండదు. ముందు అయ్యో ! అలాగా? అని సానుభూతి చూపించి మన వెనుక మళ్ళీ తాటాకులు కడతారు. ఇతరులు మన గురించి తక్కువగా చూడటం, హీనంగా మాట్లాడటం నాకిష్టం లేదు. నాకిష్టం లేని పని నువ్వు చేస్తావని నేననుకోను ఇకపై నీ ఇష్టం " అని చెప్పాడు. స్వాతి మౌనంగా ఉండి పోయింది. "అక్కడొక ఫ్రెండ్ విష్ చేస్తున్నాడు వెళ్లి వస్తాను. నువ్వు వస్తావా? "అని అడిగాడు. "నేను రాను మీరెళ్ళి రండి" ముభావంగా చెప్పింది. కార్యక్రమంలో పాల్గొనడానికి తన వంతు వచ్చేటప్పటికి స్వాతి లేచి వెళ్ళింది వెళ్ళేటప్పుడు భర్త వైపు చూడనుకూడా చూడలేదు . చూస్తే మరొకసారి చూపులతో అయినా తనని హెచ్చరిస్తాడని. స్వాతి వేదికపైకి వెళ్లి మైక్ తీసుకుని చుట్టూ చూసి ఒకసారి బలంగా గుండెల నిండా గాలి పీల్చుకుని వదిలింది. నా అనుభవాన్ని చెప్పాలంటే కొంచెమెక్కువ సమయమే పడుతుందని అందుకు అనుమతి ఇవ్వాలని అడిగింది. నిర్వాహకుల అనుమతి లభించడంతో స్వాతి చెప్పడం మొదలెట్టింది. నా పేరు స్వాతి . నాకు నా తల్లి అంటే చాలా ఇష్టం . అందరికి అమ్మ అంటేఇష్టమే, కానీ నాకు మరీ ఇష్టం నేను పుట్టి నాలుగు నెలలైనా కాక ముందే నాన్న చనిపోయాడు. భర్త పోయిన బాధని. తనలో ఉబికే దుఃఖాన్ని తనలోనే దాచేసుకుని బిడ్డే ప్రపంచం అన్నట్లు బతుకుతూ అత్తమామలకి, కన్నవాళ్ళకి మధ్య తలలో నాలుకలా మెలుగుతూనే ఆగి పోయిన చదువు కొనసాగించి లెక్చరర్ అయింది అమ్మ. సన్నిహితులు యెవరైనా యెన్నాళ్ళు యిలా మోడులా వుంటావమ్మా ! స్వాతిని చూసుకోవడానికి మేమంతా లేమూ ! నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అని చెవిలో ఇల్లు కట్టుకుని మరీ చెప్పేవారు. " స్వాతికి నాన్న యెలా ఉంటారో తెలియదు నేను పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయి తనకి అమ్మని దూరం చేయమంటారా? అప్పుడు నేను అమ్మని కాను మర బొమ్మని అవుతాను. నా బిడ్డ తోడిదే నా లోకం, అమ్మని అనిపించుకొవడమే నాకు గొప్ప కానుక . మరిక యే కానుకలు వద్దు " అని సున్నితంగా తిరస్కరించేది. నాన్న గురించి అమ్మ చెప్పే టప్పుడు చూడాలి.. ఆమె ముఖం నవ్వుతో మెరిసిపోయేది. నాన్న నాకు స్వాతి అని పేరు పెట్టడం వెనుక కూడా ఒక విశేషం ఉందట . స్వాతి సినిమా వచ్చినప్పుడు నేను పుట్టానట. నాన్నగారికి స్వాతి సినిమా నచ్చి నాకు స్వాతి అని పేరు పెట్టారని అమ్మ చెపుతుంటే విని స్వాతి సినిమాని ఎన్నిసార్లు చూసి ఉంటానో ! సినిమా చూసిన ప్రతి సారి మా అమ్మకి మళ్ళీ పెళ్ళి చేయాలనిపించేది. మా నాన్నకి తను చనిపోతానని ముందే తెలుసేమో! అందుకే నాకీ పేరు పెట్టారేమో! అని తెగ ఆలోచనలు ముంచుకొచ్చేవి. అమ్మని ఆమాటే అడిగితే చప్పున పెదవులపై చూపుడు వేలుంచి "తప్పు అలా మాట్లాడ కూడదు యెవరు యెప్పుడు చనిపోతారో యెవరికి తెలియదు. చనిపోయేలోగా మంచి పనులు చేయాలని అనుకోవాలి " అని చెప్పేది. మరి నీకు పెళ్ళి చేయడం మంచి పనే కదా ! నాకు నాన్న కావాలనుకోవడం మంచి పనే కదా! అని అమ్మని విసిగించేదాన్ని. నేను, అమ్మ, నాయనమ్మ వాళ్ళింట్లో వుండే వాళ్ళం. నాయనమ్మ తాతయ్య ఇద్దరూ కూడా అమ్మని కూతురిలా చూసేవాళ్ళు .మా ఇంటి ప్రక్కనే రాజేశ్వరి టీచర్ ఉండేవారు . ఆమె భర్త కూడా టీచర్. ప్రమోషన్ పై ఆ వూరి స్కూల్ కి హెడ్మాస్టర్ అయ్యారు. ఆయన పేరు మోహన కృష్ణ. పేరుకు తగ్గట్టు మోహనంగా వుండేవారు, యెప్పుడూ నలగని ఖద్దరు సిల్క్ దుస్తులుతో పాటు నలగని నవ్వు కళ్ళకి నల్లద్దాల చలువ కళ్ళ జోడుతో చాలా హుషారుగా కనిపించేవారు స్కూల్లో పిల్లలకి ఆయనంటే యెంత భయమో, అంత యిష్టం కూడా! భార్యభార్తలిద్దరూ వొకే స్కూల్ లో పని చేసేవారు రాజేశ్వరి టీచర్ మాత్రం లావుగా, నల్లగా పళ్ళెత్తుగా, అందవిహీనంగా వుండటమే కాదు యెప్పుడూ దిగులు ముఖంతో కనబడేది , స్కూల్, వంటిల్లు తప్ప ఆమెకి మరో ప్రపంచం వుండేది కాదు. రాజేశ్వరి టీచర్‌కి ఇద్దరు మగ పిల్లలు. వాళ్ళిద్దరూ కూడా మా వూరి హైస్కూల్లోనే చదువుకుంటూ వుండేవారు. అమ్మ రేడియో వింటూ, పుస్తకాలు చదువుతూ, నాతో ఆడుకుంటూ, నన్ను చదివిస్తూ వుండేది. నేనేమో మోహన కృష్ణ మాస్టారు వైపు అదేపనిగా చూస్తూ వుండేదాన్ని. మానాన్న వుంటే అచ్చు యిలానే వుండేవారేమో అనుకునేదాన్ని. మోహన్ కృష్ణ అంకులేమో మా అమ్మ వైపు దొంగ చూపులు చూస్తూ వుండేవాడు. ఆవయసులో అలా ఎందుకు చూస్తున్నాడో అర్ధం కాకపోయినా కూడా ఆ చూపులలో యేదో తప్పు ఉందని నాకు తెలిసిపోయేది. మోహన కృష్ణ మాస్టారి చూపులని గమనించి అమ్మ బయటకే వచ్చేది. కాదు నేను సెవెంత్ క్లాస్ కి వచ్చేటప్పటికి తాతయ్య చనిపోయారు. అమ్మకి మా వూరి నుండి వేరేచోటకి బదిలీ అయింది. మాతో పాటు నానమ్మ , నానమ్మ వాళ్ళ అమ్మ జేజమ్మ కూడా మాతో వచ్చేసారు. అలా ఒక యేడెనిమిది సంవత్సరాల పాటు మా వూరి వైపుకి రాకుండానే గడిపేసాము. నేను ఇంజినీరింగ్ చదువుతూ వుండగా మా జేజమ్మ చనిపోయింది. ఆమె అంత్యక్రియల కోసం అని మళ్ళీ మా వూరు రావాల్సి వచ్చింది. నా చిన్నప్పటిలా ఆరాధనగా కాకపోయినా ఆసక్తిగా మోహన కృష్ణ మాస్టారు వొంక చూస్తూ ఉండి పోయాను వాళ్ళు మా యింటి ప్రక్కనే ఒక పెద్ద బిల్డింగ్ కట్టేశారు . వారి అబ్బాయిలు ఇద్దరూ విదేశాలలో స్థిర పడ్డారని పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయని చెప్పారు. మేము ఒక నెల రోజులు అక్కడ వుండి తిరిగి అమ్మ పని చేస్తున్న వూరికి వచ్చేసాము. కొన్ని నెలలకి మోహన కృష్ణ మాస్టారి భార్య ఉరి వేసుకుని చనిపోయిందని నానమ్మ చెప్పింది. ఎందుకూ అనడిగితే ఏమో తెలియదు అంది. అప్పుడు నాలో యెక్కడో అణచి వేసిన వూహలు మళ్ళీ నిద్ర లేచాయి. నానమ్మ ప్రక్కన జేరి "నానమ్మా ! నాకు నాన్న కావాలి" అని చెప్పాను. ఇరవై రెండేళ్ళ పిల్ల నాన్న కావాలి అంటే అర్ధం చేసుకోకుండా ఉంటుందా? "నీకు నాన్న కావాలని మీ అమ్మకి యెప్పుడో చెప్పాము, తనే వద్దని భీష్మించుకుని కూర్చుంది . తను కావాలంటే నేను వద్దంటానా? మీ అమ్మని వొప్పించు. అయినా ఈ వయసులో వున్న మీ అమ్మకోసం భర్తని యెక్కడని వెదుకుతావు ? వెర్రి మొహం నువ్వూనూ " అని చివాట్లు పెట్టింది. "ఎక్కడో వెతకక్కరలేదు. మన యింటి ప్రక్కన మోహన కృష్ణ మాస్టారు అమ్మకి తగిన జోడు" అని చెప్పాను. నానమ్మ ఆశ్చర్యంగా చూసి " అతనా అతనైతే పర్వాలేదు, వ్యక్తి కూడా మంచి వాడే ననుకుంటాను, పాపం యెందుకో ఆ రాజేశ్వరి టీచర్ ఆ వయసులో అలా ఉరేసుకుని చనిపోయింది " అంది. నాయనమ్మ దగ్గర ఆమోదం లభించడంతో నాకు యేనుగు యెక్కినంత ఆనందం కల్గింది. ఇక అమ్మ దగ్గర నా ఆలోచనలని కార్య రూపంలో పెట్టడానికి ప్రయత్నించాను. అమ్మ ససేమిరా వొప్పుకోలేదు నేను అలిగాను, తిండి తినకుండా బెట్టు చేసాను. ఆఖరి అస్త్రంగా నాకు పెళ్ళి చేసేటప్పుడు కన్యాదానం చేయాలి కదా ! నాకా లోటు లేకుండా వుండాలంటే నువ్వు పెళ్ళి చేసుకోవాలి, నాకు నాన్న కావాలి అని చెప్పాను. నాన్న లేకపోడం ఆస్తుల వాటాల విషయంలో అయినవాళ్ళ వైఖరిలతో విసిగి పోయిన అమ్మ బంధువుల పట్ల విముఖత పెంచుకుంది. అమ్మకి నా పెళ్ళి విషయంలో బంధువుల అండ దండా వీసమెత్తు అయినా తీసుకోవడం యిష్టం లేకపోయింది. పదే పదే అదే విషయాన్ని నేను అడగడం నానమ్మ కూడా నాకు వత్తాసు పలకడం చూసి ఆలోచనలోపడింది. అమ్మ ఆలోచనలని గ్రహించి నేను కార్యాచరణ లోకి దిగాను. మోహన కృష్ణ మాస్టారుతో మాట్లాడి ఆయనని వొప్పించాను ఆయన సులభంగానే వొప్పుకోవడంతో పాటు వెంటనే కొడుకులిద్దరికీ ఫోన్ చేసి మాట్లాడారు. వాళ్ళు కూడా సుముఖంగానే వున్నారని చెప్పారు. రెండు నెలలలో పెళ్ళికి తేదీని నిర్ణయించాము. అమ్మ పెళ్లి రంగ రంగ వైభవంగా చేయాలని అనుకున్నాను. కానీ అమ్మ సున్నితంగా తిరస్కరించి గుడిలో సింపుల్ గా దండలు మార్చుకుంటే సరిపోతుందని, అలాగే తనకి యిష్టమని కూడా చెప్పింది. పెళ్ళికి రెండు మూడు రోజుల ముందు మోహన కృష్ణ మాస్టారు పిల్లలు ఇద్దరూ వచ్చారు. నేను వాళ్ళని అన్నయ్యా అంటూ సంతోషంగా పిలిచాను వాళ్ళు చెల్లెమ్మా.. అంటూ ఆప్యాయంగానే ఉన్నారు అన్నయ్యలుగా నాకు వొక వడ్డాణంని బహుకరించారు. అమ్మకి కొన్ని గిఫ్ట్ లు ఇచ్చారు. అమ్మ నాన్నల పెళ్లి అయిన తర్వాత ఒక పదిరోజులు వరకు ఉన్నారు . మా ఇల్లంతా సందడి సందడిగా ఉంది ఆనందానికి అవధులు లేకుండా అంతా నేనై తిరిగాను . మోహన కృష్ణ గారిని నాన్నా నాన్నా.. అంటూ వదల కుండా తిరిగాను. అన్నయ్య లిద్దరూ అమ్మని "ఆంటీ " అంటూ పిలిచారు . అమ్మకి అది కష్టంగా అనిపించింది "అదేమిటి బాబూ ..స్వాతి నాన్న గారూ అని పిలుస్తుంది మీరు కూడా నన్ను అమ్మా అని పిలవచ్చు కదా " అని అడిగింది . " సారీ ఆంటీ ! స్వాతికి వాళ్ళ నాన్న రూపం తెలియదు కనుక అలా తేలికగా పిలవగల్గుతుంది . మాకు మా అమ్మ అంటే ఏమిటో తెలుసు, ఆమె ప్రేమ తెలుసు, అలాగే ఆమె కష్టాలు తెలుసు. మా కోసం మా అమ్మ పెదవి విప్పకుండా యెన్ని బాధలు భరించిందో మాకే తెలుసు " అని అన్నారు, అమ్మే కాదు ఆ మాటలు వింటున్న నేను స్థాణువులా నిలబడి పోయాను. అన్నయ్యలు యిద్దరూ వాళ్ళ అమ్మకి కష్టాలు అని చెపుతున్నారు అంటే మోహన కృష్ణ మాస్టారు మంచి వ్యక్తి కాదా! ? అనేక అనుమానాలు మొదలయ్యాయి. అన్నయ్యలిద్దరూ తిరిగి వెళుతూ నా పెళ్లి బాధ్యత అంతా వాళ్ళే చూసుకుంటామని నాన్న రిటైర్ అయిన తర్వాత వచ్చే డబ్బు కాని, ఆయన పెన్షన్ డబ్బు కానీ యేవి తమకి యివ్వనవసరం లేదని అన్నీ మాకే చెందుతాయని చెప్పి వెళ్ళారు. రోజులు గడుస్తున్న కొద్దీ చాలా విషయాలు నాకవగతమయ్యాయి. నాన్న అట్టే మంచోడు కాదని భార్యని అనాకారని నిత్యం వేధించుకు తినేవాడని, యే వంట చేసినా నచ్చలేదని పేర్లు పెట్టేవాడని, స్త్రీ లోలత్వం ఉందని అర్ధమైపోయింది.నాకు చచ్చేంత దిగులు ముంచుకు వచ్చింది. హాయిగా పువ్వులా బ్రతుకుతున్న అమ్మని తీసుకొచ్చి వ్యసనపరుడికి జత చేసానేమో అని దిగులు కల్గింది .అమ్మ యేమి చెప్పేది కాదు , "నాన్న మంచి వాడేనమ్మా అని అడిగేదాన్ని " మంచివాడనేగా బలవంత పెట్టావ్" అని నవ్వేది. ఆ నవ్వులో నాకు అనేకర్ధాలు కనిపించేవి. ఒక సంవత్సర కాలంలోనే నాన్న రిటైర్మెంట్. ఆ ఫంక్షన్ కి వెళ్ళాము . అక్కడ అందరూ మోహన కృష్ణ మాస్టారు భార్య చాలా అందంగా వుంది కదూ అని మెచ్చుకుంటూనే కాసేపటి తర్వాత గుస గుసలాడు కుంటున్నారు. వీరిద్దరికీ అదివరకే పరిచయం ఉందట. ఇద్దరి ఇల్లు ప్రక్క ప్రక్కనే కదా! వీళ్ళ గ్రంధసాంగం తెలిసే రాజేశ్వరి టీచర్ వురి వేసుకుని చనిపోయిందని చెప్పుకుంటారంట అనే మాటలు నా చెవిన పడ్డాయి. నాకు దుఖం ముంచుకు వచ్చింది. ఉన్నత చదువులు చదువుకుని గురువుల స్థానంలో ఉన్న వీరు కూడా యెంత నీచంగా ఆలోచించగలరో ! అనుకున్నాను. నిజాలు యేమిటో తెలియకుండా యెందుకిలా మాట్లాడుతున్నారనిపించింది, అసహ్యం వేసింది. నాన్నని , రాజేశ్వరి పెద్దమ్మ యెందుకు చనిపోయింది అని అడిగేశాను .ఆయన నవ్వుతూ " ఆమెకి అందంగా లేనని ఆత్మనూన్యతా భావం. వంట చేయడం సరిగ్గా రాదు. ఇతరులతో స్నేహాన్ని అర్ధం చేసుకునేదే కాదు, నాపై అనుమానం యెక్కువ అందుకే అలా చేసింది" అని చెప్పారు. నాన్న రిటర్మెంట్ అయ్యాక వచ్చే డబ్బుతో అమ్మ పేరు మీద వున్న స్థలంలో యిల్లు కట్టారు. నాన్నతో పాటు నాన్న వాళ్ళ అమ్మ,నాన్నమ్మ నేను, నాన్న,అమ్మ అందరం కలసి వుండే వారిమి. నానమ్మ లిద్దరూ బాగా కలసి పోయారు వారితో యే యిబ్బంది ఉండేది కాదు. ఉదయాన్నే నేను, అమ్మ యెవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే నాన్న యింట్లో వుండేవారు. నాన్నతో పరిచయం ఉన్న అనేక మంది టీచర్స్ మా యింటికి వచ్చి పోతూ ఉండేవారు. అమ్మ వచ్చేసరికి వంట యిల్లంతా కాఫీలు తయారుచేసుకుని , టిఫిన్స్ తయారుచేసుకుని తిని వంట వస్తువులు అన్నీ అడ్డదిడ్డంగా వాడి పడేసే వారు. డైనింగ్ టేబుల్ పైన తిన్న కంచాలు అలాగే పడి వుండేవి . ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పేకాట ఆడటం లాంటివి కనబడుతూ ఉండేవి. అదేమిటని అడిగితే సరదాగా స్నేహితులందరూ కూర్చుని ఆడుకుంటున్నాం అనేవారు నాన్న. ఆయన రకరకాల విన్యాసాలని నాకు కనబడకుండా చేయడానికి అమ్మ నాకు మేడపై గదికేటాయించింది . నాన్నమ్మలిద్దరూ ఓ మూల గదిలో ఉండేవారు.ఒక రోజు నేను నాగదిలో నుండి బయటకి వచ్చి క్రిందికి చూసాను నాన్న తను తినే అన్నం పళ్ళెంని అమ్మ ముఖం పై విసిరి కొట్టాడు, అన్నం అంతా చెల్లాచెదురు అయిపోయింది. పళ్ళెం విసరడం వల్ల అమ్మ కంటి పైభాగంలో దెబ్బ తగిలి వెంటనే బొప్పి కట్టిపోయింది. " ఎంత దైర్యం ఉంటే ఉదయం వండిన కూర వేసి నాకన్నం పెడతావు సిగ్గు లేదూ మొగుడుకి వేడి వేడిగా చేసి వడ్డించాలని తెలియదా!?" అంటున్నాడు. అమ్మ సంజాయిషీగా .. యీ రోజు రావడం ఆలస్యం అవడం వల్ల తలనొప్పి వల్ల ఆ పూట కూరలు చేయలేకపోయానని చెపుతోంది . "నువ్వు మాత్రమే ఉద్యోగం చేస్తున్నావా? రాజేశ్వరి కూడా ఉద్యోగం చేసేది, అయినా నాకేనాడు లోటు చేసేది కాదు. ఎలా చేసినా ఏది పడేసినా తిని ఊరుకుంటాడు లే అని అనుకుంటున్నావేమో " అంటూ యింకా యేదేదో మాట్లాడబోయి నన్ను చూసి ఆగిపోయాడు. ఆ రాత్రి అమ్మని పట్టుకుని యేడ్చేసాను. అమ్మ మౌనంగా కన్నీరు కార్చింది. అమ్మ ప్రతి రోజు కాలేజ్ కి వెళ్ళాలంటే రాను పోను నూటముప్పైకిలోమీటర్లు ప్రయాణం చేయాలి. కనీసం యింటి దగ్గర నుండి రెండు గంటల ముందు బయలుదేరితే తప్ప సమయానికి చేరుకోలేదు . తెల్లవారుఝామునే లేచి యింటిపనులు, వంట పనులు అన్నీ చేసుకుని నాన్నకి అన్ని హాట్ ప్యాక్ లలో సర్ది అప్పుడు కాని అమ్మ బయటకి వెళ్ళాలి. అమ్మ ఒక్కటే వొంటరిగా బయటకి వెళ్ళకూడదు. ఆయనతోనే బయటకి వెళ్ళాలి. జనన, మరణ, పెండ్లి, విందు వినోద కార్యక్రామాలన్నిటికి ఆయనతో ఠంచనుగా వెళ్లి తీరాలి. అక్కడ అందరికీ అమ్మని గర్వంగా చూపాలి .అమ్మ వెళ్ళడం కుదరదంటే ఆ రోజు యింట్లో మరో యుద్ధం జరిగేది. ఇవన్నీ చూస్తూ నన్ను యెక్కువకాలం అక్కడ వుంచడం అమ్మకి యిష్టం లేక పోయింది అన్నయ్యలతో చెప్పి ఫారిన్ సంబంధం చూసి నిశ్చయం చేసి పెళ్ళి జరిపించారు. నాకెలాంటి భర్త వస్తాడు అనేదానికన్నా అమ్మ జీవితం యెలా గడుస్తుందోనని దిగులుగా వుండేది. నేను అమ్మకి పెళ్ళి చేయాలనుకోవడమే చాలా పొరబాటు చేసాననిపించింది. హాయిగా వున్న అమ్మ బ్రతుకుని కష్టాల పాలు చేసినట్లయ్యింది. స్త్రీ కి పునర్వివాహమనేది అందరికీ సంతోషాన్నివ్వదు. అసలు సంతోషాన్నే యివ్వదు అంటాను నేను . మొదటి వివాహం విఫలమై రెండో వివాహం చేసుకుంటే వాడితో యెందుకు తేడాలు వచ్చాయి? వాడు నాలా వుండేవాడు కాదా ! లేదా వాడు నీకు నచ్చలేదా? అనో, లేదా వాడిని యెందుకు వదిలేసావ్? యెవరినైనా వుంచుకున్నావా? అనే ప్రశ్నలు. మొదటి పెళ్ళైన యిన్నేళ్ళ తర్వాత మళ్ళీ పెళ్ళి అయ్యింది, ఇన్నాళ్ళు మడి కట్టుకునే ఉన్నావా? అనే అవమానకర ప్రశ్నలెన్నో యెదుర్కోవాల్సి వస్తుంది. మళ్ళీ యెందుకు పెళ్ళి చేసుకున్నామా ? అని పశ్చాత్తాప పడుతూ పెనం మీద నుండి పొయ్యిలోకి పడేసినట్లుగా తమ పరిస్థితి అయింది అని అనుకునే వాళ్ళు తక్కువ ఏమి కాదు . అమ్మ తన బాధలన్నింటిని కాకపోయినా కొన్నయినా నాతో చెప్పుకునేది.ఆమెకి నేను తప్ప ఎవరున్నారు? ఎవరితోనైనా పంచుకున్నా పలుచన అయిపోతామంటుంది . అందరి దృష్టిలో మోహనకృష్ణ మంచివాడు. అమ్మకి జీవితాన్ని యిచ్చాడు, యిల్లు కట్టాడు , నాకు బోలెడు నగలు చేయించారు, పెళ్ళి చేసాడని చెప్పుకుంటారు తప్ప ఆయన కొడుకులు కూడా ఆయన బాధ్యతని తెలివిగా అమ్మ పై వేసి తప్పుకున్నారు అని అర్ధం కావడం కష్టం. జీవితంలో అవసరాల కోసమే పెళ్ళి అనుకునే వారే ఎక్కువ. ఇలాంటి పెళ్ళిళ్ళలో ఏ మాత్రం ప్రేమకి, అనుబంధానికి తావే ఉండదు. అందుకు ఉదాహరణ మా అమ్మ వివాహమే.! మగవాడికి యేవయసులొ అయినా వంట వండీ పెట్టడానికి, యింటి అవసరాలు చూడటానికి, ఇంకా శారీరక అవసరాలు తీర్చుకోవడానికి స్త్రీ కావాలి . అందుకు పెళ్ళి అనే అందమైన ముసుగు వేస్తారు. పురుష అహంకారాన్ని ప్రదర్శిస్తారు. అలాగే వొంటరి తనంతో బ్రతుకున్న స్త్రీలు ఆర్ధిక అవసరాల కోసమో సామాజిక భద్రత కోసమో తోడు కోరుకుంటారన్నమాటే కానీ వారికి యే మాత్రం ప్రేమానురాగాలు లభింపక పోగా యెన్నో అవమానాలు, అనుమానాలు యెదుర్కొవాల్సివస్తుంది. ఆ వివాహాన్ని తెగతెంపులు చేసుకునే దైర్యం రాదు. ఒకవేళ అలా తెగింపు నిర్ణయం తీసుకున్నా మరొకసారి విఫలమైన వివాహాం తో సగం చచ్చి వున్నవారిని చుట్టుప్రక్కల వారు వారి మాటలతో పూర్తిగా చంపేస్తారు. స్త్రీ జీవితం అడుగడుగునా వేదనాభరితమే! అంతకు ముందు వివాహం వల్ల పిల్లలు ఉంటే స్త్రీకి అనేక సర్దుబాట్లు వుండాలి . ముందు వివాహం వల్ల కల్గిన బిడ్డలని పూర్తిగా వొదులుకోవాలి. పురుషుడికి వుండే పిల్లలకి అలాంటి వొప్పందాలు ఉండవు . ఎంత బాగా చూసుకున్నా సవతి తల్లి అనే ముద్ర ఉందనే వుంటుంది. ఒక్కో వివాహంలో భర్త మొదటి పిల్లలకి రెండో భార్యగా వచ్చినామెపై సదభిప్రాయమే ఉండదు. కనీస గౌరవానికి అనర్హురాలన్నట్లు చూస్తారు. రెండో పెళ్ళి విఫలం అయితే తమలోనే లోపం ఉందని అనుకుంటారని స్త్రీలు అన్నీ భరిస్తారు. మగవారు సాధిస్తారు అది వారికి పుట్టుకతో వచ్చిన హక్కుఅనుకుంటారు. మా అమ్మకి మళ్ళీ మునపటి జీవితం తిరిగి రానే రాదు. ఇవ్వాలంటే కష్టం కూడా. అమ్మ ని నాదగ్గరకి పిలిపించుకుని ఆమెకి విశ్రాంతి యివ్వడం తప్ప మరో దారి కనబడటం లేదు అలా అమ్మని పిలిపించుకుందామన్నా అతనూ రావడానికి తయారుగా ఉంటారు. అతనిని నాన్న అనడానికి కూడా యిష్టం లేనట్టుగా వుంది. ఇప్పుడు చెప్పండి పునర్వివాహాలు మంచివేనంటారా? ఎంతమంది నిజమైన తోడు కావాలనుకుని పెళ్ళి చేసుకుంటారంటారు " అని అడిగింది స్వాతి. సమాధానంగా అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న హాలంతా చప్పట్లతో దద్దరిల్లింది ఆ చప్పట్ల మధ్యలోనే " నాలా యెవరూ యెవరినీ కూడా పునర్వివాహం చేసుకోమని బలవంతం చేయకండి, పెళ్ళి అనే బంధంలోకి బలవంతంగా నెట్టకండి. స్వేచ్ఛగా వారికి నచ్చిన విధంగా వారి బ్రతుకుని బ్రతకనివ్వండి. మీరు అలా యెవరినైనా బలవంతం చేయాల్సి వస్తే , అలా చేసేముందు "స్వాతి వాళ్ళ అమ్మ" ని గుర్తుకు తెచ్చుకోండి. ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి " అని ముగించి ధన్యవాదములు చెప్పి క్రిందికి దిగి వస్తూ వుంటే తల్లి గుర్తుకువచ్చింది ఆమె పడే అవస్థ కళ్ళ ముందు మెదిలింది. కన్నీళ్లు ముంచుకొచ్చాయి. “పోయింది యేదైనా మరొకమారు దొరుకుతుతుందా యెప్పుడైనా’.. అని తల్లి ప్రశ్నిస్తున్నట్లే అనిపించి వూరుతున్న కన్నీటిని చేతి రుమాలుతో తుడుచుకుంటూ వచ్చి తను అంతక్రితం కూర్చున్న కుర్చీలో కూర్చుంది. అనిల్ ఓదార్పుగా ఆమె భుజంపై చేయి వేసాడు.
|
30, జూన్ 2013, ఆదివారం
స్వాతి వాళ్ళ అమ్మ
27, జూన్ 2013, గురువారం
అమ్మ చెప్పే కమ్మని కబుర్లు
ఓ.. పది రోజులు పాటు దేశ సంచారం చేద్దామని మా వర్కర్స్ ని కూడా ఇంటికి పంపించి వేసి హాయిగా లేపాక్షి, రాయలసీమ అంతా తిరిగివద్దామని ప్లాన్ వేసుకున్నాం. ఎందుకో ఆ ప్రయాణం వీలు పడక పోయే సరికి నీరసం ముంచుకొచ్చింది. “ఛీ! వెధవ జీవితం” అని తిట్టుకుంటూ తెగ బోర్ కొట్టి చచ్చిపోతున్నాను. వచ్చి ఓ నాలుగు రోజులు ఉండి వెళ్ళు తల్లీ ! అని నా ఫ్రెండ్ ని పిలిచాను. తను వచ్చింది. బోలెడు సినిమాలు, కబుర్లు మధ్య ఇద్దరం కలసి మన బ్లాగర్స్ వ్రాసిన కథలని చదువుతూ ఒక్కొక్కటి వరుస క్రమం లో ఉంచుతున్నాము. చదవడం ఎక్కువైంది. కాబట్టి ఈ మధ్య ఏమి వ్రాయాలని అనిపించడం లేదు. వేరే ఏదైనా చదవాలని ఆసక్తి లేదు, కొన్నాళ్ళపాటు బ్లాగ్ వ్రాతలకి విరామం ప్రకటించాలని అనుకుంటూ ఉన్నాను. ఓ రహస్యం చెప్పాలి, అలా అనుకున్నప్పుడల్లా మంచి మంచి పోస్ట్ లు వ్రాసినట్లు గుర్తు వరుసగా కొన్ని జ్ఞాపకాలు వ్రాసుకోవాలనిపిస్తుంది.
రాత్రి హాల్లో పడుకుని నా ఫ్రెండ్, నేను తక్కువ సౌండ్ తో సరాగమాల (రేడియోలో వచ్చే పాత పాటల కార్యక్రమం) వింటూ ముచ్చట్లు చెప్పుకుంటూ అలా గోడల వైపు చూస్తున్నాను. ఒక ప్రక్క గోడకి నేను చాలా ఇష్టంగా తగిలించిన వాల్ పీస్ కనబడింది. ఆ పీస్ ని అలా గోడకు తగిలించి ఓ పది ఏళ్ళు అయింది. ఆ పీస్ మీద నా చూపులు ఆగిపోయాయి.
ఒక జ్ఞాపకం అలా... నా కళ్ళ ముందు కదిలింది. కొన్ని కన్నీళ్లు కూడా బయటకి వద్దామా- వద్దా అనుకుంటూ మొహమాట పడుతున్నాయి. ఏమిటి ఇంతలోనే ఆ కన్నీళ్లు? అంది నా ఫ్రెండ్.
అదిగో..ఆ వాల్ పీస్ చూసి అన్నాను. నిజానికి అది వాల్ పీస్ కాదు, అలా నేను తయారు చేసుకున్నాను. అది ఒక ఆర్టిఫీషియల్ ఫ్లవర్ బొకే. తను లేచి వెళ్ళి గోడకు తగిలించి ఉన్న దానిని తీసుకువచ్చింది. అది చేతిలోకి తీసుకుని పదేళ్ళ క్రిందటి ఆ సంగతి గుర్తు చేసుకున్నాను.
*********************
సాయంత్రం అయిదింటికి ఆడుకోవడానికి వెళ్ళిన అబ్బాయి ఎనిమిది గంటలు దాటినా ఇంటికి రాలేదు అమ్మ ఇంట్లోకి బయటికి తిరుగుతూ అబ్బాయి కోసం ఎదురు చూస్తుంది. ఒకవేళ క్రికెట్ ఆడటానికి కాలేజ్ గ్రౌండ్స్ కి వెళ్ళారా? లేక రాజేష్ తో కలసి సృజన్ వాళ్ళ ఇంటి దగ్గర క్యారమ్స్ ఆడుతున్నారా? లేక గోరా హరి తో కలిసి సినిమాకి వెళ్ళాడా? ఇంకా ఇంటికి రాడేమిటి ? ఆలస్యం అవుతున్న కొద్ది అమ్మకి లోలోపల కంగారు. ఇంటికి రానీ, వీడి పని చెపుతాను. ఎన్నిసార్లు చెప్పినా పొద్దు పోయిందాకా ఫ్రెండ్స్ తో ఆటలు మానుకోడు, పోనీ వెళితే వెళ్ళాడు కొంచెం లేట్ అవుతుంది అమ్మా! అని ఫోన్ చేసి అయినా చెప్పవచ్చుగా అన్నీ నిర్లక్ష్యమే! అని కోపంగా అనుకుంటూనే ఇంకా రాడేమిటీ అని ఇంటి ముందు గేటు ని దాటుకుని దూరంగా రోడ్డు వైపు చూస్తూనే ఉంది.
నిమిష నిమిషానికి వరండాలోకి వచ్చి చూస్తూనే ఉంది. బిడ్డ వస్తున్న జాడ లేదు. తొమ్మిది,పది,పదకొండు గంటలు అవుతుంది. పదవ నంబరు బస్, 23 వ నంబర్ బస్ లు, ఉయ్యూరు బస్ లు కంకిపాడు బస్ అన్నీ ఒకదాని వెనుక వెళ్ళి పోతూనే ఉన్నాయి. ఏ బస్ లోను అబ్బాయి దిగి రావడం లేదు. వాడి దగ్గర డబ్బులు కూడా ఎక్కువ లేవు. ఎక్కడ ఉన్నాడో ఏమి చేస్తున్నాడో, మొన్నీమధ్య ఎప్పుడో తమ చుట్టాలబ్బాయిని ఎవరో పట్టుకెళ్ళి మద్రాస్ లో వదిలిపెట్టారని విన్నది అలా ఏమైనా జరగలేదు కదా! అమ్మకి ఏడుపు వచ్చేస్తుంది. కొడుకు ఫ్రెండ్స్ లో ఎవరి ఇంటికైనా ఫోన్ చేసి కనుక్కోవాలన్నా వారి నంబర్స్ తన దగ్గర లేవు. ఎప్పుడు ఇలా చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏమో !? అమ్మకు కంగారు.
ఈ మధ్య పెత్తనాలు ఎక్కువైపోయాయి. చెప్పినమాట వినడంలేదు. ఈ రోజు ఇంటికి రానీ, వీడి కాళ్ళు విరకొట్టాలి అనుకుంటూ కారుతున్న కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ కనిపించని దేవుడిని వేడుకుంది. నా బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి వచ్చేటట్టు చేయి తండ్రీ! అని.
పదకొండున్నర దాటింది. అప్పటిదాకా అమ్మ బయట బాల్కనీలో నిలబడే ఉంది. ఇంకో పది నిమిషాలు గడిచాయి బస్ దిగి మెల్లగా నడుచుకుంటూ వస్తున్న కొడుకుని చూసి ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది అమ్మకి. వెంటనే కోపం వచ్చింది. అబ్బాయి మూడు అంతస్తులు మెట్లెక్కి వచ్చేటప్పటికి అమ్మ ఇంట్లోకి వెళ్లి కావాల్సిన వస్తువు కోసం వెదికింది. కోపం, ఏడుపు కలగా పులగం అయిపోయి గబా గబా ఓ వస్తువు పట్టుకుని వరండాలో వచ్చి నిలబడింది. అబ్బాయి చెప్పులు విడిచి స్టాండ్ లోకి పెట్టి అమ్మా! అమ్మా! సారీ అమ్మా! అంటూ ముందుకు వచ్చాడు.
ఏరా! ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్లావు? ఆడుకోవడానికి కదా వెళ్ళావు? ఇప్పుడు టైం ఎంతైంది? నిన్ను నేను ఎక్కడని వెదకాలి? అసలు భయం ఉందా నీకు? అని అడుగుతూనే చేతిలో ఉన్న అట్లకాడతో దబ దబ ఒక అయిదు నిమిషాలు పాటు బాదేసింది. అబ్బాయి అలా నిలబడి దెబ్బలు తింటూనే ఉన్నాడు కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అమ్మ చప్పున చేతిలో అట్లకాడ అక్కడ పడేసి ఎక్కడ వెళ్లావ్ ? ఫోన్ చేసి అయినా చెప్పవచ్చు కదా! నేను ఎంత కంగారు పడుతున్నానో” అని ఏడ్చింది.
అమ్మా! ఫ్రెండ్స్ అందరూ ఎగ్జిబిషన్ కి వెళదామన్నారమ్మా! ఇంట్లో చెప్పలేదు అంటే త్వరగానే వచ్చేద్దాం పర్లేదు వెళదాం అని అన్నారు. అక్కడికి వెళ్ళాక అక్కడ అన్నీ చూస్తూ టైమే తెలియలేదు అన్నాడబ్బాయి.
"నీ దగ్గర ఎక్కువ డబ్బులు కూడా లేవు, ఫ్రెండ్స్ రమ్మన్నారని వెళ్ళి పోవడమేనా? అలా వెళ్లకూడదని నీకు చెప్పానా లేదా! అసలు ఈ మధ్య చెప్పిన మాట వినడం లేదు" అని మళ్ళీ అట్లకాడ తీసుకుని రెండు దెబ్బలు వేసింది.
"నేను అసలు వెళ్ళేవాడిని కాదమ్మా! ఇదిగో..ఇందు కోసం వెళ్ళా" అని వెనుక దాచుకున్న చేతులు చాచి ముందు పెట్టాడు. అప్పటి దాకా కోపంలో ఉన్న అమ్మ గమనించలేదు. ఎన్ని దెబ్బలు వేసినా చేయి కూడా అడ్డు పెట్టకుండా చేతులు వెనుకకు దాచుకున్నాడని. అప్పుడే తెలిసింది. ఆ..సంగతి చప్పున ఆ చేతిలో ఉన్న వస్తువుని చూసింది.
ఏమిటిది? అడిగింది కళ్ళకి ఎదురుగా కనబడుతున్న వస్తువుని చూసి.. అప్పుడు అబ్బాయి ఇలా చెప్పాడు. "అమ్మా! రేపు మదర్స్ డే కదమ్మా! నిన్ను విష్ చేసి నీకు ఇవ్వాలని ఇది తెచ్చాను" అన్నాడు.
అంతే! అమ్మ చేతిలో అట్లకాడ అప్రయత్నంగా కిందపడిపోయింది. కోపంలో బిడ్డ ఒంటిపై పడ్డ ఎర్రటి వాతలని చూస్తూ..అబ్బాయిని దగ్గరకి తీసుకుని గట్టిగా ఏడ్చింది.
“అమ్మా! ఏడవకమ్మా! ఇంకెప్పుడు నీకు చెప్పకుండా బయటకు వెళ్ళను” అంటూ అమ్మ కన్నీళ్లు తుడిచి బుగ్గపై ఓ ముద్దు పెట్టి “హ్యాపీ మదర్స్ డే " అమ్మా! అన్నాడు. అప్పుడు టైం చూస్తే రాత్రి జీరో అవర్స్. ఆ రోజు మదర్స్ డే!
అమ్మ కళ్ళల్లో సంతోషం, దుఃఖం రెండూ పోటీ పడ్డాయి. బిడ్డ ని కొట్టినందుకు తనని తానూ తిట్టుకుంటూనే.. "అవును, ఇది ఎలా కొన్నావ్? నీ దగ్గర డబ్బులు లేవు కదా !?" అడిగింది ఆరాగా.
"మా ఫ్రెండ్ ని అడిగి డబ్బు అప్పుగా తీసుకున్నానమ్మా ! రేపు నువ్వు ఇస్తావుగా ఇచ్చేస్తా " అని చెప్పాడు
ఆ రోజు అబ్బాయి విష్ చేస్తూ అమ్మకిచ్చిన గిఫ్ట్ ఇది.
ఈ.. జ్ఞాపకం నాకు చాలా ఇష్టమైనది అంటూ చెప్పాను. నా ఫ్రెండ్ కి.
నాకు మా అబ్బాయి నుండి ఎన్ని గిఫ్ట్ అందుకున్నా ఈ గిఫ్ట్ చాలా చాలా విలువైనది అపురూపమైనది. చాలా జాగ్రత్తగా చూసుకుంటాను.
ఆ తర్వాత ఓ.. పది మదర్స్ డే లు అయ్యాయి. ఎవరన్నా ఈ రోజు మదర్స్ డే అని గుర్తు చేస్తే " ప్రతి రోజూ మదర్స్ డే" నే అని చెప్పేంతగా ఎదిగిన నా కొడుకుని చూస్తే ఆనందం
ఈ రోజు ఉదయం నా కొడుకు తో మాట్లాడుతూ ..ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ .. రాత్రి కూడా ఏడ్చాను. "చిన్నీ" అంటే .. తనూ నవ్వుకుంటూ “ఇప్పుడు కూడా ఏడుస్తావు కదమ్మా!” అన్నాడు.
నిజంగానే.. ఆ రోజు సంగతి గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూనే మళ్ళీ ఏడ్చాను ఎండావానా కలబోసినట్లుగా. మా అత్తమ్మ, నా ఫ్రెండ్ ఒకటే నవ్వు.
తనతో మాట్లాడుతూనే తర్వాత ఏదో ఒక విషయం పై తనని మందలిస్తూ ఉంటే మారుమాట్లాడకుండా వింటూ.. "మా అమ్మ తిడుతుంది చూడండి" అన్నట్లు చూస్తూ నానమ్మకి ఫిర్యాదు చేస్తూన్నట్లుగా,
(ఈ మధ్య ఒకరు అడిగారు. మీ అబ్బాయి కబుర్లు వ్రాయడం లేదేమిటీ? అని అనుకోకుండా ఇలా మనసు పొరలు చీల్చుతూ వచ్చేసింది. ఈ విషయం పంచుకోవడం మహదానందం. నేను నా కొడుకుని కొట్టిన (దండన) నాలుగు సార్లు లో ఇది ఒక సందర్భం )
24, జూన్ 2013, సోమవారం
మరణించిన ప్రేమ
ఈ మూడు పేర్లు వినగానే నాకు చప్పున .. ఒక జ్ఞాపకం .. ఆ జ్ఞాపకం బాధావీచికం.
ఆ అమ్మాయి ఎలా ఉందో !? అనుకుంటాను . ఎందుకు ఆ అమ్మాయి అలా చేసింది ? ప్రాణ ప్రదంగా ప్రేమించిన భర్తని అంత త్వరగా ఎలా మర్చిపోగల్గింది ? అని ప్రశ్నలు వేసుకుంటాను ఆడవాళ్ళు అంత త్వరగా జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలని, జీవితానికి సంబందించిన మనిషిని అంత త్వరగా మర్చి పోతారా? అలా మర్చిపోవడం అంత సులభమా? అనుకుంటూ మరీ... నేను చాదస్తంగా ఆలోచిస్తున్నానేమో ? అని బలవంతంగా ఆ ఆలోచనల నుండి బయట పడే ప్రయత్నం చేస్తాను .
ఈ రోజు దివ్య భారతిని (సినీ నటి ) ని ఒక వీడియో సాంగ్ లో చూస్తే చప్పున నాకు ఆ అమ్మాయి గుర్తుకు వచ్చింది అచ్చు దివ్యభారతిలా ఉంటుంది కాకపొతే చామానఛాయ రంగు అంతే తేడా.
ఆ అమ్మాయి పేరు చాలా అందమైన పేరు సంజన ( పేరు మార్చాను ) తల్లి దండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు . ముగ్గురూ ఆడపిల్లలే ! సంజన చెల్లెలు నా చెల్లికి స్నేహితురాలు. అలా ఆ కుటుంబం తో నాకు పరిచయం ఉంది
సంజనకి చదువు మీద ఆసక్తి తక్కువ. అందుకనేమో .. ఆ పిల్లని ఒక పంక్షన్ లో చూసి పెళ్లి చేస్తారా అనగానే అడిగిన అబ్బాయి మంచి చెడులు చూసి వెంటనే పెళ్లి జరిపించేసారు. అతని పేరు విజయ్ రాజ్ . తండ్రి లేడు
ఒక్కడే సంతానం. మద్రాస్ లో సినిమాల షూటింగ్‌ల కి కెమెరా మెన్ గా పని చేసేవాడు.అతనికి ఇచ్చి సంజన కి పెళ్లి జరిపించారు. పెళ్ళైన ఏడాదికి ఒక పాప పుట్టింది.విజయ రాజ్ కి సంజయ్ ఖాన్ నిర్మిస్తున్న " టిప్పుసుల్తాన్" కి పనిచేయడానికి అవకాశం వచ్చింది . ఆతను ఆ సంస్థ లో పని చేస్తూ ఉండగానే . ఆ పాపకి సంవత్సరం వయసు ఉండగా ఒక నెలరోజులు పాటు ఖాళీ లేకుండా షూటింగ్ ఉండటం వల్ల సంజన ని చుట్టం చూపుగా పుట్టింటికి పంపి ఆతను షూటింగ్ కి వెళ్ళాడు స్పెషల్ ఎఫెక్ట్స్ తీస్తూ ఉండగా అగ్ని ప్రమాదం జరిగింది. ఎంతో మందిని రక్షించి అతను ఆ అగ్ని ప్రమాదంలో చిక్కుకుని మరణించాడు.
ఆ అగ్ని ప్రమాదం వార్త వినగానే కుటుంబ సభ్యలు అందరూ అక్కడికి పరుగులు తీసారు రెండుమూడు రోజుల తర్వాత గుర్తుపట్టని స్థితిలొఉన్న అతని పార్ధివ శరీరాన్ని అప్పగించారు. మట్టి చేయడం,మిగతా కార్యక్రామాలు పూర్తీ చేసుకుని మరో రెండు రోజులకి మద్రాస్ పట్టణం నుండి ఇల్లు ఖాళీ చేసుకుని బరువైన మనసులతో తిరిగి వచ్చేసారు. విజయ్ రాజ్ తల్లి దుఃఖ భారంతో కృంగి పోయారు కోడలు మనుమరాలుతో సహా కోడలి పుట్టింట్లో ఉంది.కొన్నాళ్ళకు ఆమె కోడలు మనుమరాలుతో కలిసి కోడలి పుట్టింట్లో వారితో కలసి ఉండలేక బంధువుల ఇంట్లో ఉన్నారు. అగ్ని ప్రమాదంలో మరణించాడు కాబట్టి ఇన్స్యూరెన్స్ ద్వారా లభించే డబ్బు విషయంలో తప్ప ఆమెకి కోడలికి అంత అనుబంధం ఉన్నట్లు కనబడేది కాదు.
నేను ఆ అమ్మాయిని పలకరించడానికని వెళ్లాను. సంజన కన్నా ఆమె తల్లి తండ్రి చాలా దిగులుగా కనిపించారు
సంజన వాళ్ళ అమ్మ ఫామిలీ ఆల్బుం తీసి విజయ్ రాజ్ ఫొటోస్ ఆతను భార్య,కూతురు తో దిగిన ఫొటోస్ చూపిస్తూ అతనికి తల్లితో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఆమె బిడ్డపై ఎన్నో ఆశలతొ జీవించారు ఇప్పుడు అతని మరణాన్ని ఆమె తట్టుకోవడం చాలా కష్టమని చెప్పారు
అలాగే ఆ ఇంట్లో మద్రాస్ నుండి ఇల్లు ఖాళీ చేసి వేసుకువచ్చిన వస్తు సామాగ్రి ప్రిజ్ద్ , బీరువా ,టీవి లాంటి వస్తువులపై విజయరాజ్ భార్య పేరు తన పేరు కలిపి స్టిక్కరింగ్ చేసుకుని ఉన్న గుర్తులు అతనికి భార్యపై ఉన్న ప్రేమని ప్రత్యేకంగా చెప్పాయి
సంజన మాత్రం చాలా మాములుగా కనిపించింది. విజయ్ రాజ్ ని పుట్టింటికి వచ్చే ముందు చూడటమే! మళ్ళీ భర్త ముఖాన్ని కూడా ఆమె చూడలేకపోయింది అయ్యో ..పాపం అనిపించింది.
సంజనా ! మళ్ళీ నువ్వు చదువుకోవడం మొదలెట్టు అని చెప్పాను. నాకు ఆ అమ్మాయి పట్ల సానుభూతి కన్నా కూడా విజయ్ రాజ్ పట్ల అభిమానం ఎక్కువైనట్లు అనిపించింది అతనిని నేను అసలు చూడనే లేదు మాట్లాడనూ లేదు. అతని గురించి విన్న మాటలు మూలంగానే అతని మరణం పట్ల బాధ కల్గింది. సంజన ని చూస్తే జాలి కల్గింది అందమైన పిల్ల, పైగా చాలా చిన్న వయసు. మళ్ళీ తనకి ఒక పిల్ల. ప్చ్.. ఏమిటో గాలిబుడగ ల్లాంటి జీవితాలు అనుకున్నాను. విజయ్ రాజ్ మరణం తర్వాత ఆ కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది కదా అని బాధ పడ్డాను
రెండు మూడు నెలల తర్వాత ఒకరి నోటెంట ఒక విషయం విని ఆశ్చర్యపోయాను.సంజన ఒక పోలీస్ కానిస్టేబుల్ తో సన్నిహితంగా మెలుగుతుంది అని
చ.. అలాంటివేవి ఉండవు లెండి, వాళ్ళ ఇంటి ప్రక్కనే అతను ఉంటాడు ..ఏదో మాట్లాడుకుంటూ ఉంటే తప్పేమిటి అని. మళ్ళీ తరువాత ఇంకొకరి నోటి వెంట అలాంటి మాటే విన్నాను స్వయంగా చూసాను కూడా. నేను మా కుటుంబ సభ్యులు సినిమాకి వెళితే సంజన ఆ కానిస్టేబుల్ తో కలసి సినిమాకి వచ్చింది. అతనితో ఆ అమ్మాయి చాలా క్లోజ్ గా మూవ్ అవడం చూసాను. నిజం చెప్పొద్దూ .. నేను ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాను
ఇదేమిటీ .. ఈ పిల్ల భర్త చనిపోయి నిండా నాలుగు నెలలు కూడా కాలేదు అంతగా ప్రేమించే భర్తని మర్చిపోయి అప్పుడే .పరాయి పురుషుడితో అంత సన్నిహితంగా మెలుగుతుంది అని చిరాకు పడ్డాను.
అది అలా జరిగిపోయింది. తర్వాత ఆ అమ్మాయికి ఒక సంవత్సరం లోపే మళ్ళీ పెళ్లి జరిగిందని విన్నాను. సంజనకి ఉన్న బిడ్డని ఆమె తల్లిదండ్రులు పెంచుతున్నారని విన్నాను. కొన్నాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకి కూడా మా వూరు నుండి బదిలీ అయి వెళ్ళిపోయారు
కానీ నేను విజయ్ రాజ్ ని మర్చిపోలేదు. ది స్వోర్డ్ ఆఫ్ టిప్పు సుల్తాన్, దివ్యభారతి,విజయ్ రాజ్ అలా నా మనసులో ఒక జ్ఞాపకంగా మిగిలిపోయారు.
ఆ అమ్మాయి సంజన గురించి ఇప్పటికీ అనుకుంటాను, మనుషుల మరణాన్ని జీర్ణించుకోవడం అంత సులభమా!? ఆ అమ్మాయికి చిన్న వయసు కావడం వలన అలా చేసిందా? లేక తోడూ కోసం అలా చేసిందా.. అన్నది నాకు అర్ధం కాలేదు. మళ్ళీ వివాహం తప్పు కాకపోవచ్చు. మనుషుల్లో అంత ప్రాక్టికల్ మైండ్ ఉండటం అవసరమేమో కాని నేను ఆ అమ్మాయి చేసిన పనిని ఆమోదించలేకపొయాను. మరీ అంత తక్కువ కాలంలో అలా జరగడం వల్లనేమో నేను ఆమోదించలేకపొయానని అనుకున్నాను. బహుశా నేను కొందరు మారినంత వేగవంతంగా నా ఆలోచనలని, అభిప్రాయాలని మార్చుకోలేక పోవడం వల్లనేమో ! సంజన స్థానం లో నేను లేను కాబట్టి నాకు అలా అనిపించింది ఏమైనా స్త్రీల మనసు సముద్రం కన్నా లోతు అందులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం అంటారు . కదా ! ఇదీ అంతే నేమో !
విజయ్ రాజ్ కూతురు ఇప్పటికి ఇరవై ఏళ్ళ అమ్మాయి అయి ఉంటుంది ఆ అమ్మాయి ఖచ్చితంగా తండ్రి ప్రేమతో పాటు తల్లి ప్రేమని కోల్పోయి ఉంటుందని నేను అనుకుంటాను
కొన్ని ప్రేమలు మనవి కాకపోయినా మన జ్ఞాపకాలలో గాఢంగా అలా నిలిచి ఉంటాయి . కొన్ని ప్రేమలు .వారి మనిషితోపాటు వెంటనే మరణిస్తాయి.
ఒకటి మాత్రం అనుకుంటాను .. ప్రియరాగాలు చిత్రంలో జగపతి బాబుకి సంబంధించి ఒక మాట , భార్య సమాది పై వ్రాసి ఉంటుంది .. " నా ఆత్మ, నీ శరీరం ఇక్కడ సమాధి చేయబడ్డాయి " అని
ఒకవేళ సంజన యాక్సిడెంటల్ గా చనిపోయి ఉంటే ... విజయ్ రాజ్ ఖచ్చితంగా అలాగే బాధపడుతూ ఉండేవాడేమో అని నేననుకుంటూ ఉంటాను. అతని గురించి నేను విన్న కొద్ది మాటల్లోనే నాకు ఏర్పడ్డ అభిప్రాయం అది. అది కేవలం నా ఊహ కావచ్చు.
భార్య చనిపోతే నెల లోపే మళ్ళీ వివాహం చేసుకునవారు ఉన్నప్పుడు సంజన చేసింది తప్పు కాదు. ఆ అమ్మాయి చేసుకున్న వివాహాన్ని నేను వ్యతిరేకించలేదు కానీ ఓ తల్లికి బిడ్డ , ఓ బిడ్డకి తండ్రి రావడం చాలా కష్టం కదా ! ఆలోచిస్తూ ఉంటాను ఇప్పటికి కూడా.
వివాహం అంటే అనుబంధాల అల్లిక మాత్రమే కాదు అవసరాల కోసం కూడానేమో కదా !
( నా ఆలోచనలని ఈ పొస్ట్ లో ఇలా వ్రాసినందుకు "సంజనా .. ఐ యాం వెరీ సారీ )

