25, నవంబర్ 2018, ఆదివారం

అదే నీవు

నవంబర్ 24.


ఎనిమిదేళ్లు, నువ్వొక చోట నేనొక చోట. ఇన్నేళ్ల తర్వాత  వొకే  గూటిలో మనం.


నాకింకా చిన్న పిల్లాడివే. అమ్మా !  నాకేం చేసి పెడతావ్ అని పొద్దున్నే అడుగుతావు, రాత్రి బాగా పొద్దుపోయాక నా గదికి వచ్చి గాడ్జెట్  పట్టుకుని వుంటే మృదువుగా కోప్పడి దుప్పటి కప్పి మంచినీళ్ల బాటిల్ ప్రక్కన బెట్టి గుడ్నైట్ చెప్పి వెళతావ్.


అమ్మకి కావాల్సినవన్నీ అమర్చి పెట్టాలని తాపత్రయ పడతావ్, అంతలోనే   బాలుడిలా  అల్లరి చేస్తావ్.


మూడు పదుల వయసొచ్చినా పసి మనసే నీది.


అంతరంగం సముద్రమంతలోతు, ప్రపంచాన్ని చదివిన ఆలోచనలు, నువ్వు నువ్వుగా ఉంటూ అందరికీ నీకేమి తెలియదు అనుకున్నట్లు వుండే సాధారణంగా కనబడే  మంచి అబ్బాయివి. సింపుల్ మేన్ వి.


ఇలాంటి పుట్టిన రోజులు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని ..

చైతన్యవంతమైన జీవన గమనం తో.. 

స్ఫూర్తి కరమైన మార్గంలో నడుస్తూ..

సుఖసంతోషాలతో..ఆయురారోగ్యములతో.. పుత్ర పౌత్రాభివృద్దితో

యశస్విభవ గా దేదీప్యమానంగా వెలుగొందాలని ..

మనసారా దీవిస్తూ..

భగవంతుని కరుణా కటాక్షములు అన్నింటా లభించాలని కోరుకుంటూ...

హృదయపూర్వక శుభాకాంక్షలు ..

నిండు మనస్సు తో.. ఆశ్శీస్సులు .. అందిస్తూ..  ప్రేమతో ..

                                                                                              అమ్మ.   







22, నవంబర్ 2018, గురువారం

సుర్ (సంగీత్)

ఈ సినిమా వచ్చినప్పటి నుండీ వింటూనే వుంటాను. 

ఈ పాట గురించి నేనొక అమ్మాయికి చెప్పినప్పుడు ఆశ్చర్యపోయింది .. యెలా తెలుసు మీకివన్నీ అని. 

నేనేమో ఆమెనవ్వు కథలో కృష్ణ లా .. కొన్ని అట్టాగే తెలుస్తుంటాయి అన్నాను. :)

నాకెలా తెలుసా అని నన్ను నేను ప్రశ్నించుకుంటే మరకతమణి కీరవాణి M M Kreem పేరుతో అందించిన స్వరాలు కదా అని తట్టింది. 

కొన్నాళ్ళు నా కాలర్ ట్యూన్ గా వూరేగిన పాట. 

మళ్ళీ వింటున్నా .. రాత్రి నుండి. మెలుకువ వచ్చినప్పుడల్లా. ఎవరు పాడినా , వాయించినా వింటూనే వున్నాను. 

అన్నింటి కన్నా యిదిగో .. ఇదే బాగా యిష్టం.మంచి సంగీతమే కాదు సాహిత్యం కూడా.

చదివి చదివి యాంత్రికమైపోయినప్పుడు యిలా సంగీత సాగరంలోకి దూకేస్తా.. :) <3 <3


  


18, నవంబర్ 2018, ఆదివారం

మౌన సాక్షి

మౌనంగా వుండనీయని "మౌన సాక్షి " 

చదవడం ఒక దాహం అయితే ఆ  దాహార్తిని తీర్చుకోవడం కోసం నిత్యం కథలు చదవాలి. అలా చదివే క్రమంలో " మౌనసాక్షి " కథా సంపుటి నా చేతికి వచ్చింది. ఆ కథలన్నీ చదువుతుంటే అసలీ కథలన్నీ ఎక్కడినుండి వచ్చాయి మన మధ్యనుండే వచ్చాయి కదా అన్న సృహ కల్గుతుంది. మౌనసాక్షిలో కొన్ని కథలు సందేశాత్మకంగా సుఖాంతగా ముగిస్తే కొన్ని కథలు విషాదంగా ముగిసాయి.  ఐదు డయాస్పోరా కథలు, ఐదు  సాంఘిక కథలు ఒక కథ జానపదకథ లాంటి కథ. మొత్తం పదకొండు కథలు.  ఇందులో ఒక కథ షార్ట్ ఫిల్మ్ గా కూడా రూపొందించబడింది  ఏ కథైనా మనలని ఆలోచింపజేస్తుంది. ఒక్కో కథ చదివాక ఇంకేమి చదవాలనిపించక పుస్తకాన్ని మూసి ఆలోచిస్తూ కూర్చుంటాం.

టైటిల్ కథ "మౌనసాక్షి" చదువుతున్నప్పుడు మన మధ్యనే మనందరిలోనే  ఉన్నకరుణారాహిత్యం యెంత  పచ్చిగా వుందో తెలియజేస్తుంది బలహీనులపట్ల మనం స్పందించకుండా పాషాణాల్లాగా యెలా వున్నామో స్పందించే మనసున్నవాళ్ళు మౌనసాక్షిగా యెలా మిగిలిపోతున్నారో తెలిపే కథ.

నియంతృత్వ ప్రజాస్వామ్యంలో రక్తసిక్తమైన సాక్ష్యాలు యెన్నెన్నో .  "పర్యవసానం " అనే కథ ఇలాంటిదే . పదిమందికి మంచి చేసేవాడ్ని, ప్రశ్నించేవాడిని అక్రమంగా పట్టుకుని కాల్చి పడేస్తే ఆ సంఘటనకి ముందు బస్ లో  తన ప్రక్కనే కూర్చుని ప్రయాణించిన వ్యక్తి   అతనే అని తెలిసినప్పుడు పిల్లలకి పాఠాలు బోధించే  అరుణ అనే టీచర్ సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడితే ఆమె నోరుని బలవంతంగా మూయించిన కథ యిది.

కదిలించే కథ "రైల్వే  సత్యం "  కుటుంబం కోసమే కాదు తోటి కార్మికుల హక్కుల కోసం యాజమాన్యంతో గొడవపడే ఆత్మాభిమానం ఉన్న గూడ్స్ డ్రైవర్ కథ. తన   పిల్లల పట్ల ప్రేమ,బాధ్యత, అంతకుమించి కలలు,   వాళ్ళ భవిష్యత్ పట్ల  ఎన్నో  ఆశలు పెట్టుకున్న అతను వాటికి ఆటంకం కలగకూడదని  ఆఖరికి  ప్రాణ త్యాగం చేస్తాడు. కదిలించే కథ యిది. 

"అశ్రువొక్కటి"  కథ సాయుధపోరాటదళంలో ఒక కొరియర్ గా పనిచేస్తున్న వ్యక్తి  గాయాలతో బయటపడి నగరంలో చికిత్స పొందుతూ కళ్ళముందు కనబడే సత్యాలని  గ్రహిస్తూ ఉద్యమపోరాటానికి  ద్రోహం జరుగుతున్న తీరుకి ఆక్షేపిస్తూ  ఆవేదన పడే కథ. ఆశయాల కోసం అరణ్యాలలో  ఎంతోమంది ప్రాణ త్యాగాలకు సిద్దపడి పనిచేస్తుంటే ఇక్కడ నగరాలలో  ఉద్యమాలకి అనుకూలంగా పని చేస్తున్న వాళ్ళు   చేస్తున్న పనిపట్ల  యెలాంటి  అంకిత భావం లేకుండా ఉద్యమ స్వభావాన్ని తేలికగా తీసుకుంటూ అరకొరగా పనిచేస్తూ నాగరిక జీవనంలో విలాసంగా బ్రతుకుతున్న కుహనా కార్యకర్తల తీరుని తూర్పారబట్టింది. దళాలమధ్య లక్ష్యాలు,భిన్నాభిప్రాయాలు, అంతర్గత శత్రువత్వం గురించి పాఠకులకి పరిచయం చేసింది.      
హిందువైతే యేమిటీ, ముస్లిమ్ అయితే యేమిటీ ? ఎన్ని తలలు తెగితే  అన్ని డబ్బులు అనే మూక వెనుక ఉన్న శక్తుల గురించి భయపడాల్సిన రోజులివి.  "మృగాల మధ్య" కథ వర్తమాన కథ. సమాజాన్ని అద్దం  పట్టి చూపించింది. కులం మతం పట్టింపు లేకుండా  అన్ని మతాలూ దేవుళ్ళు అందరూ మనవాళ్ళే  అందరిలోనూ మనం ఉన్నామనే  కాంతమ్మ లాంటి మనుషులే కావాలిప్పుడు. విలువలు తెలిసి ఉండడమే కాదు వాటిని ఆచరణలో కూడా చూపించగల్గ మనుషులు కావాలి. ఆగి కాస్తంత ఆలోచింపజేసే కథ యిది. 

సప్తసముద్రాల దాటినా మనం మన భావాలనే మోసుకెళతాం అని నాకనిపించింది.  అమెరికా వెళ్లినా  మన ఆలోచనలు యేమీ మారవు అని నిరూపించిన కథ "వేక్ అప్ " పిల్లలపై తల్లి దండ్రుల ఆశలు, వారి చదువులపై మితిమీరిన శ్రద్ద గ్రేడ్ లు  పిల్లలని రెక్కలు విరిచిన సీతాకోకచిలకలని చేస్తున్నాయి.  వాస్తవంగా అమెరికాలో కూడా వరుణ్ లాంటి పిల్లలు యెందరో. వారిని చూస్తే జాలి కల్గుతుంది. ఈ కథ చదివి  తల్లి దండ్రులే  మేలుకోవాలి  తప్పదనిపించింది.

"నాతిచరామి" అనే కథ వారసత్వ వ్యామోహాన్ని నిస్సిగ్గుగా చూపించింది. సుఖదుఃఖాలలో తోడుగా వుండాల్సిన భర్త పిల్లలు పుట్టరు అని తెలిసిన తర్వాత  ఆమెని వొదిలేసి  మరో పెళ్ళికి తయారుకావడం అందుకు తోటి స్త్రీలే  ఒత్తిడి తేవడం వత్తాసు పలకడం మరీ చిత్రం. సహజమైన కథ యిది.   ఈ కథకి పూర్తిగా వ్యతిరేకమైన కథ కౌముది.  జానపద కథ చదివినట్లు ఉంటుంది. మంచి సందేశంతో ముగిసిన కథ. 

సూపర్ హీరో కథ నాస్టాల్జియాతో మొదలై హీరో తనొక సినిమాలో సహనటుడిగా  నటించడానికి చేసిన ప్రయత్నంలో సెలెక్ట్ కావడం ఆ సినిమా హీరో తన బాల్యమిత్రుడే కావడం ఆ హీరో చేతనే సూపర్ హీరో అని కొనయాడించడం వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఈ కథలో అమెరికా  కలలు, కష్టాలు యెలా ఉంటాయో చెప్పిన కథ.  కలలు, కళలు మనిషిని నిరాశలో నుండి, యాంత్రిక జీవనంలో నుండి బయటపడేసి సంతోషపు రంగుని అద్ది జీవనాన్ని శోభానామాయం చేస్తాయనిపించింది. ఇలాంటి పెద్ద కథలు ప్రింట్ మీడియా నుండి రావడం అసాధ్యమనే చెప్పాలి.  రెండు భాగాలుగా ఆదివారం అనుబంధంలో ప్రచురితమైన కథ ఇది.  

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే ! ఆఖరికి ఒక ప్రాణి భూమి మీదకి రావడానికి కూడా  ప్లానింగ్ కావాలి. ఆర్ధిక స్థిరత్వం యేర్పరుచుకుని పుట్టిన పిల్లలని వాళ్ళు స్కూల్ కి వెళ్ళేదాకా యింట్లోనే వుండి చూసుకునే వాళ్ళు వుండాలి. భార్యాభర్తలిద్దరూ యెంతో  కష్టపడి సాధించుకున్న వుద్యోగ స్థానాలని వదిలి పిల్లలని పెంచడానికి తీరిక లేక అమ్మమ్మ తాతయ్యలతో పంపించాలనుకునే ఆలోచనల్లో వుండగా తల్లి గర్భంలో వున్న శిశువు నన్ను నీదగ్గర్నుండి పంపించకమ్మా అని దీనంగా వేడుకునే కథే "పిలుపు". అప్రయత్నంగా కళ్ళు తడిపేసింది  ఈ కథే కాల్ మీ అనే పేరుతో షార్ట్ ఫిల్మ్  గా వచ్చింది.   

" వెలితి "అమెరికా లాంటి దేశంలో ఐటీ ఉద్యోగిగా ఉన్నా మాతృభూమికి దూరమై ఎదో వెలితితో బాధపడే మోహన్ కి  చిన్ననాటి స్నేహితుడు వినిపించిన విజయగాథ ఈ కథ. పదవతరగతితో చదువాపేసి కుటుంబబాధ్యతని తలకెత్తుకుని ఎన్ని కష్టాలు ఎదురైనా నిలబడిన చోటనే నీళ్లు తాగాలనుకున్న  రైతు  రాజు కథ.  వ్యవసాయం కలిసిరాని   సంక్లిష్ట పరిస్థితులలో పట్నానికి ఉపాధికెళ్ళి   ఒక    సినిమా పాట యిచ్చిన స్ఫూర్తి తో  మనసు మార్చుకుని పుట్టిన గడ్డమీదనే  నిలకడగా నిలబడి  వ్యవసాయాన్ని నమ్ముకుని అతివృష్టి అనావృష్టి కాలాలకు ఎదురొడ్డి రైతుగా తన ఉనికిని నిలబెట్టుకుంటూనే తన కలలని బిడ్డల భవిష్యత్ లో చూసుకుని గర్వంగా రైతుని అని చెప్పుకున్న కథ.   

రచయిత కథలన్నీ తన అనుభవం నుండో ఇంకొకరి అనుభం  నుండో తీసుకున్న కథలివి. ఈ కథలలో యేవీ కల్పనగా అనిపించలేదు. మూడు పేజీల కథలు చదవడానికి అలవాటు పడిన ఈ తరం పాఠకులకి కొన్ని కథలు అతి పెద్దవిగా అనిపించినా చివరికంటా చదివించే గుణం వుండటం వల్ల యెక్కడా విసుగనిపించదు.   సూపర్ హీరో కథలో  ఎక్కువగా రచయిత కనబడినట్లు అనిపించింది.ఈ కథలు యెలాంటివో యీ సంపుటికి ముందు  మాట వ్రాసిన నందినీ సిద్దారెడ్డి గారి మాటలు చెపుతాయి. తప్పక చదవవలిసిన కథలు.అన్ని పుస్తకాల షాపులలోనూ, కినిగె ద్వారా లభ్యం.   రచయిత నక్షత్రం వేణు గోపాల్ గారిని మనసారా  అభినందిస్తూ ..  వారి నుండి మరిన్ని మంచి కథలు ఆశిస్తూ ...  
                                                                                                                                                                                                                                                                                                                                           వనజ తాతినేని 





16, నవంబర్ 2018, శుక్రవారం

ప్రేమలేఖ

నీతో కలిసి అడుగులేస్తుంటే  
నడిచే గ్రంధాలయం  తోడున్నట్లు 
నువ్వు పెదవి విప్పితే 
నేను  రాగ దర్బార్ లో ప్రవేశించినట్లు 
కళ్ళు కళ్ళు కలుసుకుంటే కలలు 
సీతాకోకచిలకలై  యెగురుతున్నట్లు 
చేతిలో చెయ్యేసి నడుస్తుంటే 
నిండుగా పూచినవనంలో నిలువెల్లా తడిచినట్లు 
ఎన్నాళ్ళకైనా  
నా అనుభవంలోకి వచ్చిన నిన్ను స్వీకరిస్తూ 
దేహం దేహంలో ముంచినట్లు కలాన్ని సిరాలో ముంచి    
సంపూర్ణ ప్రేమలేఖ వ్రాయాలనుకున్నా... 

నా లోలోపల ఓ  స్వేచ్చా పిపాసి  దాక్కుని
నను  వశీభూతుడుని చేసుకోవాలని పన్నాగం
ఈ ఉద్వేగాలని ఉన్మత్తాన్ని దాటెల్లి 
జీవితాన్ని చూడాలని 
ఉన్నదానితో వుత్సవం చేసుకోవాలని
జీవితాన్ని రసభరితం చేసుకోవడం నేర్చుకోవాలని
ఎల్లప్పుడూ భోధిస్తూ వుంటాడు
తుదకు విజయుడయ్యాడు 

లోనికి రానిదల్లా ఓ అసంపూర్ణ చిత్రపటమేనని   
నిన్ను అనవసరంగా మోస్తున్నానే బాధనుండి విముక్తి కల్గించిన 
ఆ ప్రేమికుడికి కృతజ్ఞత తెలుపుకుంటున్నా 
అందుకే...
నడిచొచ్చిన రాతిమెట్ల కాలానికి వినయంగా  నమస్కరిస్తున్నాను 
 ఇన్నేళ్లు జారకుండా ప్రేమగా హత్తుకున్నందుకు 
ఇకపై అడుగులు కలిసి వేస్తున్నందుకు. 

11, నవంబర్ 2018, ఆదివారం

రాజేష్ చేర్తాల స్వర జన సమ్మోహితం

సంగీతం సర్వ జన సమ్మోహితం.






నాలుగైదు నెలల కాలంగా రాజేష్ చేర్తాల (Rajesh Cherthala Professional Flute Instrumentalist).నన్నావహించాడు.  నిద్ర లేచింది మొదలు నిద్రలోకి జారుకునే వరకూ  వింటూనే వున్నాను. అలసినప్పుడు సేదదీర్చే చిరుగాలి తరగల్లేనూ    నిదురరానప్పుడు అమ్మలా జోలపాడుతున్నట్టు  అశాంతిగా వున్నప్పుడు సాంత్వన కలిగించే ఆప్తమిత్రుడిగానూ .. ఏమీ తోచనప్పుడు సంగీతం వినడమే ప్రాధాన్యమైనట్టూ భలే నా చుట్టూ గాలికిమల్లే తారట్లాడతా వున్నట్టు వుంటున్నాడు . అతని గురించి చెపుతూ  ముందుగా నా సోత్కర్ష కూడా ...

నాకు వేణువు సంగీతం విడదీయరాని వస్తువులుగా నాకనిపిస్తాయి. చిన్నప్పటినుండి వేణునాదం విన్నప్పుడల్లా నాదస్వరానికి కదిలే నాగులా ఊగిపోతుంటాను.  ఎందుకో యేమిటో  అసలు తెలియదు.  మనసు ఆలోచన ఎంతో తేటగా ఉంటాయి. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, భూపేన్ హజారికా, మరకత మణి కీరవాణి నాకత్యంత యిష్టమైన సంగీతకారులు. ఇప్పుడు పండిట్ హరిప్రసాద్ చౌరాసియా శిష్యుడే అయిన రాజేష్ చేర్తాల తన వేణు గానంతో వంశీరవం పట్ల మరింత మోహాన్ని పెంచుతున్నాడు. అతని వేణు గానాన్ని వింటూ ఇతర భాషా చిత్రాల పాటలని వింటూ ఆసక్తిగా ఆ పాటలు గురించి తెలుసుకుంటూ సంతోషంలో వోలలాడుతూ వున్నాను.

నా బ్లాగ్ శీర్షిక కూడా వనజ వనమాలి అని వుంటుంది. ఎందుకంటే వనమాలి అంటే యెవరోకాదు. నా  ఆధ్యాత్మిక గురువు   మానసిక ప్రపంచంలో ఆరాధకుడు మురళీ ధరుడే గావున చటుక్కున ఆ పేరు పెట్టేసుకున్నాను.  నా కథలలో కూడా పిల్లనగ్రోవి ప్రస్తావన బాగానే ఉంటుంది. (పాట తోడు కథ)  నా కలల్లో కూడా వేణు నాదమే కనబడుతూ వుంటుంది. నాకిష్టమైన పాటలు అంటే కచ్చితంగా మురళీరవం వినబడుతూనే వుండాలి. లేకపోతే ఎంత మంచి పాటైనా నాకు  నచ్చదన్నమాట.  అలా వేణువుకి నాకు విడదీయరాని బంధం. కాస్త ఖాళీ దొరికితే చాలు  చైనీయుల వేణు గానాన్ని వెతుక్కుంటూ వుంటాను. వారి సంగీతం ఇంకా పచ్చిగా గాఢంగా హత్తుకుంటుంది కాబట్టి. సంగీతంలో చేరాల్సిన గమ్యం అది. రాజేష్ చేర్తాల వేణు గానంలో అది పూర్తిగా ఉంటుంది.

ఎంతవిన్నా తనివి తీరనిది  వినడానికి మన శక్తి చాలనిదీ  సంగీతం వొక్కటే. వొడలు మరిపించేది పట్టరాని అనుభూతిని కల్గించేది స్పర్శ లేనిదీ  చెవుల ద్వారా హృదయాన్ని తాకేది సంగీతం వొక్కటే. అదియునూ  వేణుగానమొక్కటే నా దృష్టిలో  :) నాకు నచ్చిన పాటల జాబితా  చెప్పాలంటే అది చాలా పెద్దది. నాలుగురాత్రుళ్లు పగళ్లు కూడా చాలవు. పెద్ద పెద్ద గ్రంధాలు,కావ్యాలు చదవలేదు, సంగీతంలో ఓనమాలు నేర్చుకోలేదు కానీ నా సమకాలీనులను నూరులో ఒకవంతు చదువుతూ నాకన్నా ముందుతరం వాళ్ళని రెండొంతులు చదువుతూ యేదో యిలా ఆనందంగా బతికేస్తున్నాను.ఇదిచాలు.
పరమేశ్వరుడుని పుట్ట తేనెతో అభిషేకిస్తే స్వరజ్ఞానం తీయనైన స్వరం లభిస్తాయని మా నాయనమ్మ అనేది. అంతా భగవత్ కృప. ఇలా ఆస్వాదించే అనుభూతి చెందే కాస్త జ్ఞానాన్ని అయినా యిచ్చినందుకు ఆ ఆది సంగీతకారునికి నమస్సులు అందిస్తూ ...

రాజేష్ చేర్తాల ని మీరూ   వినాలని కోరుకుంటూ ...  అతనికి కూడా ఎంతో ఇష్టమైన మరకతమణి సుస్వరాల బాణి శిశిరకాల (దేవరాగం ) https://www.youtube.com/watch?v=TgCHPXxIP9s

బొంబాయి  మ్యూసిక్ థీమ్ + https://www.youtube.com/watch?v=2hVREG9uqrc

https://www.youtube.com/watch?v=iX1OxnyFT4g

https://www.youtube.com/watch?v=wBDPxQXvKEk

.https://www.facebook.com/rajeshcherth...


10, నవంబర్ 2018, శనివారం

కథనం లో ఆమె నవ్వు

కథనం లో  "ఆమె నవ్వు" కథ





 ఎంతో శ్రావ్యంగా ఉంది .. 


కామయ్య తోపు, పోరంకి అన్నపూర్ణ హోటల్,మా బందరు కాలువ, జమలాపురం గుడి మా విజయవాడ నేపథ్యంలో నడిచిన కథ.  ఈ కథ చదివిన తర్వాత కామయ్య తోపు దగ్గర కళ్ళతో టిఫిన్ బండిని వెతుక్కుని ఆమె కనబడటం లేదని అడిగినవాళ్లు వున్నారు. వేలమంది పాఠకులు నాకు కాల్ చేసి అబ్బా .. ఏం వ్రాశారండీ.. అని మెచ్చుకున్న వాళ్ళు వున్నారు. ఇవాళ్టికీ ఈ కథ పై స్పందనలు వస్తూ వుంటాయి. నాకు కూడా యిష్టమైన కథ. నా రెండు కథా సంపుటాలలో యీ కథ వుంది.  

ఇప్పుడీ కథ "కథనం" లో చోటుచేసుకుని నాకు సంతోషాన్నిచ్చింది. భావయుక్తంగా చదవడమే కాదు కథని బట్టి వెనుక నడిచిన నేపథ్య సంగీతం నూనె సుర సురలు పిండి పేలడమూ తో సహా  యెంతో బాగున్నాయి. ధన్యవాదాలు షరీఫ్ గారూ..

మీరూ వినండి ..Like చేయండి Share చేయండి Subscribe చేయండి. 

6, నవంబర్ 2018, మంగళవారం

విదిలించరాదా విభో నీ విబూది

ఓం నమః శివాయ 




సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు శివదర్పణం అనే కావ్యం రచించారని చదివాను. యూ ట్యూబ్ లో వారు స్వయంగా ఆలపించిన గీతం కూడా చూసి .. ఆ సాహిత్యాన్ని వారి గళంలోనే వింటూ వ్రాసుకున్నాను. ఇది బ్లాగ్ లో ప్రచురించడం ద్వారా ఇంకొంతమందిని చేరే అవకాశం ఉంటుంది కదా అనే వుద్దేశ్యంతోనే.  భక్తి భావంతో అర్పించిన సుమాక్షరాలలో  ఆర్తి నెలకొనివుంది. ఆ దేవదేవుడిని వేడుకునే  ఈ గీతం అందరిని అలరిస్తుందన్న నమ్మకం.  


శివదర్పణం లో  సిరివెన్నెల  


విదిలించరాదా విభో నీ విబూది 

విడిపించరాదా విరాగి విపత్తి 

వినిపించలేదా విలాపించు వినతి 

విసుగైనరాదా విరించన విరోధీ 


ఇసుక రేణువుపాటి విసిరితే తరిగేనా 

రసశేవిధీ  నీ వరవార్నిధీ 

దశదిశాళికి చాటి విశదీకరించనా 

గిరిజాపతీ నీ కరుణాకృతీ  

నిరుపేదవైపోవు నడివీధి పడిపోవు || ని || 

కరిగేది కాదు కాణాచి కించిత్ పంచి 

పొందరాదా విపులకీర్తి 

వెలిగించరాదా కృపా కిరణ జ్యోతి 

కలిగించరాదా కపర్దీ విముక్తి 

తొలగించరాదా విషాదా నిశీధీ 

కనిపించలేదా ప్రభో ఈ కబోది  || వి || 


గిరిని పెకిలించేటి  పెంకితనమే 

ప్రీతి కల్గించెనా నన్ను కదిలించెనా 

పెనుగులాడు కిరీటి సింగాణి శిరమంటి 

మురిపించెనా నిను కరిగించెనా 

నాకేవి పదితలలు, లేవు గాండీవములు || నా || 

దయ చూపమంటు కైమోడ్చి యేడ్చె భక్తి 

పనికిరాదా మౌనమూర్తీ... 

వికటించె నాథా వివాదాల వితతి

విషమించెకాదా విషాదార్చి వ్యాప్తి 

వీక్షించరాదా విరూపాక్ష నా..గతి 

వినిపించలేదా శివా నాడు ఆర్తి 


విదిలించరాదా విభో నీ విబూది ||వి||  

విడిపించరాదా విరాగి విపత్తి 

వినిపించలేదా విలాపించు వినతి 

విసుగైనరాదా విరించన విరోధీ ||వి|| 

     



5, నవంబర్ 2018, సోమవారం

పచ్చ బొట్టేసిన పాట

కొన్నిపాటలంతే ! మనసుపై పచ్చబొట్టేసి వుంటాయ్ అలాంటి పాటలలో యిదొకటి. సాహిత్యం మనసు కవి. మనసు అన్న పదం లేని పాటలు అరుదు. రెండు మనసుల పాట యిది.
పాటల ప్రేమికులైన కుసుమ మేడమ్,విజయకుమారి అక్క,  అల్లరి నేస్తం రమా, లక్ష్మి డియర్, పద్మజ సిస్టర్, నాకిష్టమైన పాటలు ప్లే చేయకుండా రేడియో వదిలేసి సంసారబంధంలో చిక్కున్న వైష్ణవి వీళ్ళందరికీ ఈ కానుక. నువ్వెరమ్మా మా చిత్రంలో పాటని కానుకగా యిస్తున్నావ్ అంటారేమో మురారి గారూ.. మీ చిత్రాలలో పాటలన్నీ మనసు దోచే పాటలేనండీ. అందుకే మీ చిత్రాలకి మహిళల అంతులేని ఆదరణ. మామ లేరని మీరు సినిమాలు తీయడం మానేయడమే మాకు బాధ. 

ఇదుగోండి ఆ పాట.. మీరూ చూసేయండి మరి.    


సూర్యుడు చూస్తున్నాడు చంద్రుడు వింటున్నాడు
నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు

సూర్యుడు చూస్తున్నాడు చంద్రుడు వింటున్నాడు
నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు
వాడు నీ వాడూ నేడూ..  రేపు యేనాడూ

సూర్యుడు చూస్తున్నాడు చంద్రుడు వింటున్నాడు
నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు
వాడు నీ వాడూ నేడూ  రేపు యేనాడూ

నిన్ను ఎలా నమ్మను? 
ఎలా నమ్మించను?
ఆ ఆ...
ప్రేమకు పునాది నమ్మకము
అది నదీ సాగర సంగమము

ఆ ఆ.. 
కడలికి ఎన్నో నదుల బంధము
మనిషికి ఒకటే హృదయము
అది వెలిగించని ప్రమిదలాంటిది ఈ..ఈ..
వలచినప్పుడే.. వెలిగేది

వెలిగిందా మరి? 
వలచావా మరి
వెలిగిందా మరి? 
వలచావా మరి
యెదలో యేదో మెదిలింది
అది ప్రేమని నేడే తెలిసింది

సూర్యుడు చూస్తున్నాడు చంద్రుడు వింటున్నాడు
సూర్యుడు చూస్తున్నాడుచంద్రుడు వింటున్నాడు
నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు
వాడు నీ వాడూ నేడూ  రేపు యేనాడూ


ఏయ్.. వింటున్నావా?

ఊ.. ఏమని వినమంటావ్?
ఆ..ఆ.. 
మనసుకు భాషే లేదన్నారు మరి యెవరి మాటలని వినమంటావు?
ఆ..ఆ..
మనసు మూగగా వినపడుతోంది
అది విన్నవాళ్ళకే భాషవుతుంది

అది పలికించని వీణ వంటిదీ.. మీటి నప్పుడే పాటవుతుంది
మీటేదెవరని
పాడేదేమని
మీటేదెవరని 
పాడేదేమని
మాటా మనసు వొక్కటని
అది మారని చెరగని సత్యమని

సూర్యుడు చూస్తున్నాడు చంద్రుడు వింటున్నాడు
నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు
వాడు నా వాడూ నేడూ  రేపు 
ఊ ..యేనాడూ ..

చిత్రం : అభిమన్యుడు
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, సుశీల  



2, నవంబర్ 2018, శుక్రవారం

అడిగి / అడగక


అడిగి / అడగక 

 రాని నవ్వు నవ్వడమంటే..  
వికసించే కాలానికన్నా ముందే 
రేకలు విడదీయడంలా 
బలవంతపు పెళ్ళి చేసుకునే వధువు ముఖంపై 
సంతోషాన్ని  పూయించాలనుకోవడంలా 
ఆజన్మ ఖైదు నుండి   విడుదలిప్పించి 
బానిసగా పడివుండు అన్నట్లుగా   
అలుముకున్నవిషాదపు రంగుపై  
హోళీ రంగులు పూయడంలా      

అడగక పోయినా ఆగని నవ్విలా ...

విత్తనాన్ని చీల్చుకుని వచ్చే చిరు మొలకలా 
దేహం మోడు చిగురించినట్లుగా        
నూగు అంటుకున్న పూమొగ్గ విరియబోతున్నట్లుగా   
నిద్ర పోతున్న పసిపాప నవ్వులా  నగ్నంగా  
హృదయాన్ని తెరవబోతున్న  తాళం చెవిలా 
మొత్తంగా ....
రహస్య స్నేహితుడు  నీ  ఆలోచనల్ని 
హత్తుకున్నప్పుడు కలిగే పరవశంలా..