14, మే 2011, శనివారం

మాతృ దేవోభవ


అసలు నేను ఈ పోస్ట్ మొన్న మాతృ దినోత్సవం.. అప్పుడు పెట్టాల్సింది.

కానీ ఈ రోజుకి.. పోస్ట్ పోన్ చేసాను. కారణం ఏమంటే.. ఈ రోజు కి ఆమెకి నాకు..సంబంధం ఉంది.. 26 సంవత్సరాల క్రితం నేను.. మా ఇంట ఆమెకి కోడలిని అయ్యాను. ఆమె మా "అత్తమ్మ". 26 సంవత్సరాలలో.. నేను.. ఆమెలో.. తల్లినే చూసాను.

భిన్న సందర్భాలలో.. విభిన్న సమయాల్లో..ఆమె.. నాకు అమ్మ గానే తెలుసు. ఎప్పుడూ.. అత్త గారిలా.. ఉండటం నేను చూడలేదు. అందుకే.. మా ఈ పెళ్లిరోజు.. మా అత్తమ్మ గురించి..మీతో..పంచుకోవాలనిపిస్తుంది

కృష్ణా జిల్లా పెనమలూరు గ్రామంలో.. 1943 వ సంవత్సరంలో.. "పోలవరపు" వారింట పుట్టి..అపురూపం గా పెరుగుతూ.. ఆ వూరిలో..ఉన్న జిల్లా పరిషత్ స్కూల్ లో.. ఏడవ తరగతి చదువుకుంటూ.. తన పద్నాలుగేళ్ళ వయసులోనే.. పక్క ఊరిలోని "తాతినేని" వారింట పెద్ద కోడలిగా అడుగు పెట్టి.. ముగ్గురు బిడ్దల తల్లి అయి అప్పటికి..ఎప్పటికి.. అందరికి "పాపమ్మ" అయి.. అందరికి తలలోనాలుకై, ప్రేమపాత్రురాలై .. పాడిపంటలతో.. సిరిసంపదలతో...ఆనంద జీవనం సాగించిన సాగిస్తున్నస్త్రీ మూర్తి .. మా "అత్తమ్మ."

నా పద్దేనిమిదోయేట ఆ ఇంట కోడలిగా అడుగు పెట్టిన నాకు.. వంటావార్పు..మంచి చెడు అన్నీ.. ఆవిడ నుండే నేర్చుకున్నాను.

అసలు ఒక్క పని కూడా చేతకాని నాకు.. అన్నీ ఆవిడే నేర్పించారు. పద్నాలుగు సంవత్సరాల ఉమ్మడి కుటుంబ జీవనంలో.. ఆవిడకి నాకు ఉన్న అనుబందం అంతా ఇంతా కాదు.

వనజా..ఏం కూర వండుకుందాం ? అని ఆవిడ అడగటం...నుండి.. మా ఇద్దరికి కుదిరినంత సఖ్యత ..ఆమె కున్నమరో.. ఇద్దరి కోడళ్ళతో..ఉండదు ఎందుకో..నాకు అర్ధం కాదు. షాపింగ్ కి వెళ్ళడం.. కావాల్సినవి కొనుక్కోవడం ..మంచి చెడు మాట్లాడుకోవడం.. అన్ని విషయాలు.. ఆమె తో..నిరభ్యతరంగా మాట్లాడుతుంటాను.

వ్యవసాయ ప్రధాన వృత్తి గా కల మా కుటుంబాలలో.. పని పాట ఎప్పుడు ఎక్కువే! ఉమ్మడి కుటుంబంలో ఆమె ఎప్పుడూ..పని పాటలు.. అత్తగారి ఆరళ్ళు.. అన్నీ అనుభవించినా.. కోడళ్ళని ఎప్పుడూ.. ఏమి అనడం ఇప్పటికి ఆవిడకి రాదు. మగ పిల్లల తల్లిగా కోడళ్ళు అవి తేలేదు ఇవి తేలేదు..మంచి మర్యాదలు జరుపలేదు..అని అనడం అసలు ఆమెకి తెలియదు.. చక్కగా ముగ్గురు కొడుకులకి పైసా కట్నం ఇంటి క్రిందకి ఆశించడం ఆమె ఎరుగదు. ఆడ పిల్లలు లేని ఆవిడ...కోడళ్ళు.. చక్కగా ఉంటే  చాలు అని తలపోసేవారు. ఆవిడలో..గొప్ప సుగుణం. ఎవరిని ఏమి అనరు.గుంభనంగా ఉంటారు.

మా మామయ్యగారు..పది వరకు చదివి బాగా వ్యవసాయం చేసేవారు. ఉమ్మడి కుటుంబం నుండి విడిపోయాక వారికి వచ్చిన వాటా పొలం తో పాటు.. కౌలుకి తీసుకుని పసుపు,చెరకు,అరటి తోటలు,కూరగాయలు తోటలు వేసేవారు.. విపరీతంగా శ్రమించడం.. పంట చేతికోచ్చేసరికి.. ఏ తుఫాను లో రావడం అరటి తోటలు పడిపోవడం,మిగతా పంటలకి గిట్టుబాటు ధర లభించపోవడం.. అన్నీ ఆర్ధిక నష్టాలే! విసిగిపోయి కృష్ణా జిల్లా "తాడిగడప'' లో.. భూములని అమ్ముకుని.. నెల్లూరు జిల్లా లో.. కోవూరు కి సమీపంలో.. వ్యవసాయ భూములు కొని పెద్ద ఎత్తున ఆధునిక వ్యవసాయం ప్రారంభించారు.

ముప్పై ఏళ్ళ క్రితం ప్రారంభమైన ఆ దశ ఆరేళ్ళ క్రితం వరకు కొనసాగింది. ఇరవై రెండు ఎకరాల ఒకే క్షేత్రంలో..ఎన్ని రకాల పంటలు పండిచేవారో! అన్నీ వాణిజ్య పంటలే! అధిక దిగుబడులు..తో.. నాయుడు గారి కుటుంబం అంటే మారుమ్రోగిపోయేది.. (అక్కడ కమ్మ కులస్తులని నాయుడు లని ఉదహరిస్తారు) పంటలు ఎలా పండిస్తున్నారో..చూడటానికి.. ఆ జిల్లా లోని చుట్టుప్రక్కల ఊర్ల వాళ్ళు పదే పదే వచ్చేవారు. వాళ్ళకి ఆతిధ్యాలు ఇవ్వడం మా వంతు.

షుగర్ ఫాక్టరీ నుండి ఫీల్డ్ మాన్స్ వచ్చినా, ఎలక్షన్స్ అప్పుడు ప్రిసైడింగ్ అధికారులు వచ్చినా, ఎలక్త్రసిటి డిపార్ట్మెంట్ వాళ్ళు..ఇలా.. ఎవరికైనా ఆతిద్యం మా ఇంటే! విసుక్కోకుండా చక్కగా వండి వడ్డించేవారు. .. మా పొలం లో.. ఎన్ని రకాల ఫల వృక్షాలు,ఎన్ని రకాల పూల మొక్కలు..ఉండేవో..! నేను ఎప్పుడూ..వాటిమద్యే ఉండేదాన్ని. మా అత్తమ్మ మామయ్య పువ్వులు,కాయలు కోసి స్వయంగా పంచేవారు.

బాగా చదువులు చదివిన ముగ్గురు కొడుకులు కూడా మళ్ళీ వ్యవసాయం లో.. మునిగి తేలడం మా అత్తమ్మ కి ఇష్టం ఉండేదు కాదు.. అయినా ముగ్గురు కొడుకులు..అదే వృత్తిలో.. పీకలదాకా మునిగిపోయారు. నా పెళ్లప్పటికి మా వారు జాబ్ చేస్తూ..ఉన్నారు.. నేను ఆవూరిలో కాపురం ఉండనేమో అనుకునే దాన్ని. విచిత్రంగా అక్కడే ఉండిపోయాం. మూడు జతల ఎద్దులతో వ్యవసాయం ,నలుగురైదుగురు పాలేరులు, ట్రాక్టర్ డ్రైవర్లు..ఎప్పుడు.. వండటాలు,కడగటాలు,పెట్టడాలు.. ఎప్పుడూ పనే!మా అత్తమ్మకి తోడు నేను.

ఎంత విచిత్రం అంటే.. అక్కడికి పేపర్ కూడా ఈ రోజు పేపర్ రేపు వచ్చేది. అసలు బయట ప్రపంచం తో సంబంధం ఉండేది కాదు. రేడియో.. తర్వాత తర్వాత టీ.వి. వచ్చింది.. నెల్లూరు సిటీ కి వెళ్ళాలంటే.. కొంచెం దూరం వెళితే కానీ బస్ లు ఎక్కడానికి కుదిరేది. రోగం, నొప్పి వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలంటే.. ఎంత ప్రయాసో! మా మామ గారంటే అందరికి గౌరవం,భయం. ఆయన ముందు ఎవరు మాట్లాడేవారు కాదు. కారు కాకపోయినా.. ఒక మోటార్ సైకిల్ అయినా కొనమని కొడుకులు గొణుక్కునేవారు.. ఆయన అవేమి పట్టించుకునేవాళ్ళు కాదు.వ్యవసాయం ఎంత బాగా చేశామా..ఎంత దిగుబడులు సాధించామా..?అన్నదే ముఖ్యంగా ఉండేది. వారికి.. కొడుకులకి మద్య మా అత్తమ్మ వారధి. ఇవన్నీ ఇష్టం లేని మా బావగారు..అక్కడినుండి మళ్ళీ విజయవాడకి వచ్చేసినా మేము అక్కడే ఉన్నాం.

తెల్లవారు ఝామునే లేచి పాలు పితకడం..నా డ్యూటీ . అల్లాగే మగవారు బయటికి వెళితే.. కరంట్ రాగానే.. పంపులు వదలడం , ట్రాక్టర్ డ్రైవర్ లెక్కలు చెపుతుంటే వ్రాసుకోవడం.. .. ఇలాటి పనుల మధ్య నాకు రోజు ఎలా గడిచిందో.. తెలిసేది కాదు. అలా పద్నాలుగు ఏళ్ళు గడచిపోయాయి

ఆడ పిల్లలు అంటే.. మా అత్తమ్మ కి ఇష్టం. ఒకొక్కరికి ఒక్క సంతానం చాలని ఆవిడే సూచించారు.. మేము పాటించాం కూడా..

దానికి ఒక కారణం ఉంది. మా కుటుంబాలలో.. అప్పటికి మేమే ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబం కావడం వల్ల అలా భావించేవారు. మా బావ గార్కి ఒక అమ్మాయి. తను డాక్టర్ శిరీష..ఇప్పుడు US లో ఉంది .మా మరిది గారికి ఒక అమ్మాయి.'" భవ్య" తను ఇంజినీరింగ్ చదువుకుంటుంది.వీళ్ళిద్దరూ అమ్మాయిలు కావడం .. పైగా ఎందుకో.. నేను అంటే ఆమెకి ఉన్న ఇష్టం కారణంగా మాకు అబ్బాయి పుట్టడం.. వాడిని అపురూపం గా పెంచడం .. తతిమా అందరికన్నా ఆమెకు నా కొడుకంటే పంచప్రాణాలు. కొడుకులకన్న కూడా ..ప్రేమగా.."అయ్యా!బంగారం ..అని పిలుచుకుంటుంది.. చదువు కునేందుకి కుదరడం లేదని మా అబ్బాయికి పదేళ్ళప్పుడు మేము అక్కడి నుండి విజయవాడకి.. తిరిగి వచ్చేసాం. తర్వాత కూడా వ్యవసాయం జరుగుతూ..ఉండేది. సడన్ గా ఆరేళ్ళ క్రితం మా మామగారు వ్యవసాయం పనులు చేయిస్తూ.. మద్యాహ్నం పూట భోజనం చేసి కూలీలని పిలవటానికి వెళ్లి .. వారి రాక ఆలస్యం అయిందని గుడి ముందు కూర్చుని.. ఆ గుడిలోనే .. హార్ట్ ఎటాక్ తో ఒరిగి పోయారు.

ఆయన మరణం మా అత్తమ్మకె కాదు మా అందరికి ఆశా నిఘాతం.

మనుమడి,మనుమరాళ్ళ అభివృద్ధి ,పెళ్ళిళ్ళు చూడకుండానే చనిపోయారని ఇప్పటికి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది. అందరి ఆడ వారిలాగా .. ఆమె డబ్బు దాచుకోవడం ఉండేది కాదు.. మా మామ గారు..ఇస్తేనే తీసుకోవడం ఆమె అలవాటు.అలాగే..ఆమెని ఈ డబ్బు ఏం చేసావని అడిగేవారు కాదు.. వారిద్దరిని మించిన ఆదర్శం నాకు..ఎవరిలో..కనపడదు.

మా మామగారు ఎవరితోనూ మాట్లాడే వారు కాదు. ఏదైనా అవసరం వస్తే.. వనజ ని అడుగు.. ఇలా చేస్తే.. బాగుంటుందా అని అనేవారు.. అత్తమ్మ వచ్చి.. ఏమే! ఇలా చేస్తే ఎలా ఉంటుంది..? అనేవారు. వారికి సంబంధించి నేను.. వాళ్లకి.. రెండో..కొడుకుని ..కోడలిని.. కూతురిని కూడా.. చాలా క్లిష్ట సమయాలలో.. నాకు.. అండ దండగా ..నిలిచారు. అలా ప్రతి అత్తా-మామ ఉండగలగడం కూడా అదృష్టమేనేమో!

ఇప్పటికి.. ఆమె చేతి వంట నాకిష్టం. నేను పాలు తీసే సమయానికి కుంపటి వెలిగించి .. కాఫీ డికాషన్ వేయడం .. కూరలకి అన్నీ రెడీ చేయడం చేస్తారు. వద్దన్నా వినరు. పప్పులు విసరడం,వడియాలు పట్టడం.. అన్నీ చేస్తారు.

అలాగే.. మనుమడికి రకరకాల పిండివంటలు చేసిపెట్టడం చాలా ఇష్టం. నాలుగు రోజుల నుండి ముదిమనుమరాలు "శ్రీ" కి జ్వరమని ..ఆ..పాపనే అంటి పెట్టుకుని ఉంది. ఆమెకు పిల్లలంటే చాలా ఇష్టం. ఈ మద్య కాశీ క్షేత్రం వెళ్ళారు.అక్కడ మా మామ గారి పేరిట పిండ ప్రదానాలు పెట్టించి.. కాశీ అన్నపూర్ణ ఈశ్వరికి కి..మొక్కి.. ఆమె ముందు..కొంగుచాచి భిక్ష అడిగి తర్వాత అక్కడ జరిగే అన్నదాన కార్యక్రమంలో.. మా అబ్బాయి పుట్టినరోజు న ప్రతి సంవత్సరం అన్నదానం జరిగేలా డబ్బు కట్టివచ్చి. ఆ రశీదులు నాకు ఇచ్చినప్పుడు కోప్పడ్డాను. మామయ్యగారి పేరున కట్టకుండా.. ఇదేమిటి పాపమ్మా.!.అంటే.. నవ్వి ఊరుకున్నారు. మా అబ్బాయంటే అంత ఇష్టం ఆమెకి.

చుట్టరికాలలో.. శుభ కార్యాలకి,మంచి చెడు కార్యక్రమాలకి నేను వెళ్ళడం అంత కుదరదు అంటే వినరు .. వెళ్లి తీరాల్సిందే! అక్కడ అందరికి నన్ను చూపించి.. మా అశోక్.భార్య..మా రెండో కోడలు అని పరిచయం చేస్తారు. మంచి మంచి చీరలు ధరించడం.. నగలు పెట్టుకోవడం ఎక్కువ ఇష్టం. నేను నలుపు ఎక్కువ ఇష్టపడతానని .." ఏమ్మా..ఇంకేదైనా రంగులు కొనుక్కోరాదూ..!" అంటారు తప్ప ఆజ్ఞా పించడం ఉండదు.

మేము అక్కడ నుండి విజయవాడ వచ్చేసిన తర్వాత కూడా అక్కడే ఉండి ..పొలాలు చూసుకునేవారు. మా మామ గారి మరణం తర్వాత.. కొడుకులు.. ఎవరి కారణాలవల్ల వాళ్ళు.. ఆ భూములు అమ్ముకోవడం ఆమెకి తీరని బాధ. అలాగే.. ఉన్న ఇంటిని పడగొట్టి వాటాలుగా విడకోట్టుకోవడం వల్ల ఇప్పుడు అద్దె ఇంట్లో ఉండాల్సిరావడం మాకు మరింత బాధ.

సిరి సంపదలతో,పాడిపంటలతో.. వైభవంగా బ్రతికిన ఆమెని .. జీవన చరమాంకంలో..హాయిగా ఉంచాల్సిన భాద్యత మాకుంది. అప్పుడు.. మేము అమ్మిన భూముల వెల కోట్లాను కోట్లు.

ఇప్పుడు అవన్నీ..లేకున్నా.. ఆమెకి బిడ్డలే ఆస్తులు-అంతస్తులు కూడా.. అందుకే..మా అబ్బాయి అంటూ ఉంటాడు.. ఇలా అని.."పాపమ్మా! ఒక రెండు సంవత్సరాలు ఆగితే .. మన వూర్లో.. మంచి ఇల్లు కట్టి.. మల్లికార్జునరావు గారి ఇల్లు చూడు.. ఎంత బాగుందో.. !! అనుకునేలా కట్టి.. నీకు గిఫ్ట్ గా ఇస్తాను అంటే.. ఆమెకు.. ఎంత సంతోషమో! అది నిజం చేయడానికి.. మా కుటుంబం అంతా.. శ్రమిస్తున్నాం. అది నిజం అవుతుంది కూడా..

పద్నాలుగు సంవత్సరాల క్రితం మా అమ్మ చనిపోతే.. మా అమ్మని నేను.. మా అత్తమ్మలో..చూసుకున్నాను.

ఎన్నో.. సమయాలలో.. కొడుకులకన్నా.. నాకే ప్రాముఖ్యత ఇచ్చి.. నన్నే సపోర్ట్ చేసి.. నాకు అండ దండగా నిలిచి.. ..నన్ను కన్న కూతురిగా కన్నా ఎక్కువగా.. చూసుకున్న అత్తమ్మని.. నేను అమ్మగానే భావిస్తాను. అలా ప్రతి ఒక్క అత్తా గారు తమ కోడలిలో.. కూతురిని చూసుకోవాలని, ప్రతి కోడలు.. అత్తమ్మలో.. అమ్మని చూసుకుంటే.. ఎంత బాగుంటుంది అనుకుంటాను.

ఒకే ఒక కారణం చేత ఆవిడని మా దగ్గర ఉండటం కుధరనందుకు.. నాకు ఎంతో..బాధ. తెలిసి తెలియక నేనేమైనా తప్పు చేసినా ఆ  తప్పిదాల్ని క్షమించి..నాకు ఎంతో.. మార్గదర్శకత్వం చూపిన ఆ తల్లి మనసు.. నిజంగా ఆడ మనసు.

ఆమెలో.. నేను తల్లినే..చూసాను.. తప్పు చేస్తే.. దండించే.. తల్లినే చూసాను కాబట్టే..ఈ..రోజుకి వనజా..ఏం కూర వండుకుందాం అని ఆవిడ అడిగితే..నేను.. పాపమ్మా..! భోజనం చేద్దాం రా... అంటూ.. పిలిచేదాకా .. రోజంతా..  ఆ అనుబంధంతో.. గడుస్తూ..ఉంటుంది.

ఇది.. మా .. అ (త్త)మ్మ..తో నాకున్న అనుబంధం. మళ్ళీ జన్మంటూ ఉంటె ఆమెకే.. కోడలిని అయ్యే భాగ్యం ప్రసాదించు.. తండ్రీ.. అని భగవంతుడిని వేడుకుంటాను.

మాతృ దేవోభవ !!!!! ప్రాతఃస్మరామి పాదాభి వందనం..ఆమెకి..ఎప్పుడూ..కూడా..


Posted by Picasa

13 కామెంట్‌లు:

శరత్ కాలమ్ చెప్పారు...

మీ అత్తగారి పరిచయం బావుంది. సఖ్యంగా వుండాలంటే ఇరువైపులా మంచి మనస్సు వుండాలి. మీ అత్తాకోడళ్ళిద్దరికీ అది వుంది. సంతోషం.

Tejaswi చెప్పారు...

బాగుంది అత్తమ్మగారితో మీ అనుబంధం. మీ, మీ అబ్బాయి లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ...

maa godavari చెప్పారు...

వనజవనమాలి గారూ
మీకు మీ అత్తమ్మ గారికీ అభినందనలు>
నా బ్లాగ్ సందర్శిస్తూ మంచి పాసిటివ్ కామెంట్స్ రాస్తున్నందుకు
ధన్యవాదాలండీ.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Satyavathi..mdm and Tejaswi... Thank you very much..both Two..

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

SARATH.. gaaroo.... THANKYOU..VERY MUCH ..Sir..

పల్లా కొండల రావు చెప్పారు...

అమ్మను మరపించిన ఈ అత్తమ్మ ఎందరికో ఆదర్శం ! అత్తమ్మ లో అమ్మను చూస్తున్న ఈ కోడలూ అంతే !!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Kondalarao gaaru...
Thank you very much.

జలతారు వెన్నెల చెప్పారు...

Mee athayyagaari parichayam , aavidato mee anubandham... Chaalaa baagaa raasaaru.

ranjith redy చెప్పారు...

aunty superb aunty realy ur great great great hats of u to u aunty nenu evaro thelusa ranjith reddy leguntapadu me cheppina aa blog its realy great aunty .................

ranjith redy చెప్పారు...

realy hats of to u aunty ....u r expression about u r aunty(amma) is realy great iam ranjith reddy from leguntapadu....

శ్యామలీయం చెప్పారు...

చాలా సంతోషం‌ కలిగించింది మీ‌ అనుబంధం.

ranivani చెప్పారు...

మీ తల్లీ కూతుళ్ళిద్దరూ చాలా చాలా అదృష్టవంతులు.

bhuvanachandra చెప్పారు...

మా మేన మామగారిది పెనమలూరు ....ఎన్నిసార్లు ఆవూరు వొచ్చానో .....నీకు చాలా ఇష్టమైన వూరు ..మావాళ్ళు ఇంకా ఆవూళ్ళో నే వున్నారు వనజ గారూ ...'''పాపమ్మ'''గారికి నా ____/\_