14, సెప్టెంబర్ 2012, శుక్రవారం

త్యజించు లేదా ప్రేమించు.....

ఈ రోజు హిందీ దివస్ .

హిందీ జాతీయ భాష.

భారతీయులందరూ రాజ భాషగా అమలుపరచు కుంటున్నాం.

ఈ సందర్భంగా ..ఒక మంచి కవిత.

నా కవిత అనుకునేరు.. హిందీ భాషపై నాకంత పట్టులేదు.

హిందీ భాషా కవయిత్రి "సుభద్రా కుమారీ చౌహాన్ " గారిది.

ఈమే కవితలు సరళంగా,సహజంగా ఉంటాయి. ఆమె కవితలలో దేశభక్తి తో పాటు భగవంతునిని ఏ విధంగా ప్రార్ధించ వచ్చో..తెలుసుకోవచ్చును.

నిర్మలమైన హృదయంతో.భగవతారాధన ఆమె కవితలో చూడవచ్చును. ఆ కవితనే నేను ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను.

ఆమె తన కవితతో..ఇలా ప్రార్ధిస్తున్నారు..




టుకరా దో యా ప్యార్ కరో

"ఓ..దేవా..! నిన్ను పూజించే అనేక మంది అనేక రకాల పద్దతులలో నీ వద్దకు వస్తారు.
నీ సేవకై అత్యంత విలువైన కానుకలు అనేక విధాలుగా తెస్తారు.

వారు అంగరంగ వైభవంగా ఆడంబరంగా.. అలంకరణ లతో ఆలయంలోకి వస్తారు.
ముత్యాలు,మణులు విలువైన వస్తువులు తీసుకు వచ్చి నీకు కానుకలుగా సమర్పిస్తారు.

పేదరాలైన నేను ఏమి కూడా నా వెంట తేలేదు.
అయినప్పటికీ ధైర్యం చేసి ఆలయంలోకి పూజించడానికి వచ్చాను.

ధూపదీప నైవేద్యాలు లేవు. అందమైన అలంకరణ లు లేవు.
అయ్యో! నీ మేడలో వేయడానికి కనీసం పూల మాల కూడా లేదు.

నిన్నేవిధంగా స్తుతించగలను? నా స్వరం లో మాధుర్యం కూడా లేదు
మనసులో ఉన్న భావాన్ని వ్యక్తం చేయడానికి నా మాటలలో చాతుర్యం లేదు.

దానం లేదు,దక్షిణ లేదు రిక్త హస్తాలతో వచ్చాను.
పూజించే విధానం కూడా తెలియదు. అయినప్పటికీ ..ఓ... స్వామీ !! నేను వచ్చాను.

పూజా మరియు పూజా సామగ్రి అయి ఉన్న ..ఓ..ప్రభూ.. ! నీకై ప్రార్దించే నన్ను అర్ధం చేసుకో!
దానాలను,దక్షిణ లను త్యజించి ఈ బికారిణిని అర్ధంచేసుకో..

నేను ప్రేమ మైకం కమ్మిన దాహార్తిని. హృదయాన్ని చూపడానికే వచ్చాను.
కేవలం నా దగ్గర ఏదైతే ఉందొ.. అది.. హృదయం మాత్రమే ! దానిని అర్పించడానికి వచ్చాను.

నీ పాదముల యందు అర్పిస్తున్నాను. ఇది నీకు నచ్చినట్లు అయితే స్వీకరించు.
ఈ వస్తువు (హృదయం ) కూడా నీదే కదా! త్యజించు లేదా ప్రేమించు

ఈ ప్రార్ధన ఎంత బాగుందో..కదండీ! ఎంత స్వచ్చమైన హృదయంతో.. ప్రార్ధన చేసింది.

ఈ కవిత.. అప్రయత్నంగా నాకు మొన్ననే నా ఫ్రెండ్ గుర్తు చేసింది. ఎందుకంటే ఆ రోజు ఆమె నా బ్లాగ్ చూసి.. ఈ కవిత చెప్పింది. నాకు చాలా బాగా నచ్చింది. భగవంతునికి భక్తుడు సమర్పించే స్వచ్చమైన హృదయంతో కూడిన ప్రార్దనే కదండీ!

ఈ కవిత పదవతరగతి.. పాఠ్య భాగంగా కూడా ఉంది అట.

సుభద్ర కుమారీ చౌహాన్ కవితలు మరిన్ని చూడాలనుకుంటే ..ఈ లింక్ లో చూడవచ్చు.

4 కామెంట్‌లు:

శ్రీ చెప్పారు...

వనజ గారూ!
ఈ రోజు హిందీ దివస్ సందర్భంగా...
చిత్రం చూసి కవిత వ్రాసే పోటీలో..
శుద్ద్ లేఖన్ లో...
హిందీ అనువాదంలో...
ప్రథమ బహుమతులు అందుకున్నాను
ప్రముఖ సాహితీవేత్త రాజేంద్ర జోషి గారి చేతుల మీదుగా...
మా ఆఫీసు లో...:-)

మీకు కూడా హిందీ దివస్ శుభాభినందనలు...
మీ అనువాదం బాగుంది వనజ గారూ!
@శ్రీ

పల్లా కొండల రావు చెప్పారు...

సందర్భానుసారం గా పోస్టులు వ్రాయడం లో మీ ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. మాకు టెంత్ క్లాస్ లో ఈమె పద్యం ఉంది. హిందీ మాస్టారు యాకూబ్ ఆలీ అని ఉండేవారు. ఈ రచయిత గురించి బాగా పొగిడి చెప్పేవారు. మన జాతీయ భాష గురించి , సుభద్రాకుమారి చౌహాన్ గురించి మరోసారి జ్ఞప్తికి తెచ్చారు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శ్రీ గారు చాలా సంతోషం అండీ!! అభినందనలు. ఇలాగే జాతీయ అభిమానం ని హిందీ భాషాభిమానాన్ని మరిన్ని సార్లు ప్రదర్శించి మరిన్ని బహుమతులు గెలుచుకోవాలని మా కోరిక.
అలాగే మీ వ్యాఖ్యకి .. మీ సంతోషం మాతో పంచుకున్నందుకు ధన్యవాదములు.

@ కొండలరావు రావు గారు.. మీ స్పందనకి ,మీ అభిమాన పూర్వక వ్యాఖ్యకి ధన్యవాదములు. తప్పకుండా సుభద్ర కుమారీ చౌహాన్ గారి కవిత్వం చదవండి చాలా బావుంటుంది. థాంక్ యూ వెరీమచ్..

సామాన్య చెప్పారు...

ఇదే భావం టాగోర్ గీతాంజలి లో కూడా కనిపిస్తుంది .కవిత చాలా బాగుంది .పరిచయానికి ధన్యవాదాలు.