2, అక్టోబర్ 2012, మంగళవారం

"ఠాకూర్ కా కువా"

సాహిత్యాన్ని  చదవడం వల్ల  ఆ సాహిత్యం వచ్చిన కాలంలో ఆనాటి సామాజిక పరిస్తితులకి అద్దం పట్టే ఎన్నో విషయాలని మనం తెలుసుకుంటూ ఉంటాం. అలాంటి కథే ఈ రోజు నేను  తెలుగు అనువాదంలో  చదవడం  జరిగింది.

నిమ్న జాతి కులస్తులపై అగ్రవర్ణాల ఆధిపత్యం ఇంకా కొనసాగుతుందనే విమర్శలో నిజం ఉందో ..లేదో తెలియదు కానీ .. .

సుమారు వంద సంవత్సరాల క్రితమే ఇందుకు సంబంధించిన చైతన్యాన్ని  జనులలో కల్పించడం కోసం ఉపన్యాస్ సామ్రాట్ గా (ఉపన్యాస్ అంటే నవల అని అర్ధం) పేర్కొనే" ప్రేమ చంద్"   కలం అందించిన 
ఈ కథ లో భారతీయ జాతి వ్యవస్థని పట్టి ఇస్తుంది. 

ప్రాణులన్నిటికినీ  సమముగా చెందవలసిన గాలి,నీరు కేవలం జాతి విశేషత వల్ల కొందరికే పరిమితం కావడం అన్నదానిని జీర్ణించుకోలేక   వ్యతిరేకించ వలసిన విషయాన్ని  ప్రేమ చంద్ ఆలోచనలను మధించి  వచ్చిన రచన.. "ఠాకూర్ కా కువా"




ఆ కథ ఇలా క్లుప్తంగా.. 

జోఖూ నిమ్న జాతి కులానికి చెందిన వ్యక్తి. అతడు మంచి నీళ్ళు త్రాగడం కోసం కుండలో ఉంచిన నీరుని ఒక పాత్రతో తీసుకుని త్రాగబోతుండగా ఆ త్రాగే నీరు దుర్వాసన వస్తుంది భర్త అలాంటి నీరు త్రాగడానికి ఇబ్బంది  పడటం చూసిన   భార్య గంగి కడవతో నీరు తీసుకురావడానికి వెళుతుంది. 

ఆ గ్రామంలో రెండే రేడు బావులు ఉంటాయి. ఒకటి ఠాకూర్ ది ,మరొకటి సాహు ఆనే మరో కుల పెద్దది. 
వీరు అగ్ర కులాలకు చెందినవారు అవడం వల్ల నిమ్న జాతి వారిని నీళ్ళు తీసుకువెళ్ళడానికి ఒప్పుకునేవారు కాదు. అయితే జోఖు భార్య అయినటువంటి గంగి ఆ దుర్వాసన వచ్చే నీరు భర్త తాగకుండా చేయాలని ..
ఎలాగైనా సరే  అయినా సరే బావి నుంచి ఒక కడవ నీరు తీసుకు రావాలని నిర్ణయించుకుని.. బావి వద్దకు వెళుతుంది .

అప్పుడు సమయం రాత్రి తొమ్మిది గంటలు అవుతుంది. గ్రామంలో జనులందరూ  శారీరక శ్రమతో అలసి పోయి  నిద్ర పోతుంటారు.  గంగి ఠాకూర్   ఇంటి సమీపం కి చేరుకునే సరికి ఇంకా  ఆ ఇంటి నుండి వెలుగు కనబడుతూ.. మేల్కునే ఉన్నారని గ్రహించి..  ప్రక్కనే ఉన్న చెట్లు వెనుక నీడలో వేచి ఉంటుంది. అప్పుడు ఓ..ఇద్దరు స్త్రీలు వచ్చి నీరుని తోడ్కొని వెళతారు.  వారు అగ్ర కులానికి చెందినవారు. నిమ్న జాతికి చెందిన వారు  ఆ బావి వైపు తొంగి చూసే సాహసం కూడా చేయరు.  

ఆమె మనసులో ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఠాకూర్ చాలా స్వార్ధ పరుడు. తన ఇంటి పై భాగమును ప్రభుత్వ కార్యాలయానికి కిరాయికి ఇచ్చి.. అవకాశాను సారం లంచాలు తీసుకుని పనులు చేయిస్తూ ఉంటాడు. అగ్ర కులాలు వారు దొంగ తనాలు చేస్తారు.కుతంత్రాలు చేస్తారు. అబద్దాలు ఆడతారు. పండితుడి ఇంట్లో పన్నెండు నెలలు జూద క్రీడ జరుగుతూనే ఉంటుంది. సాహు అయితే నెయ్యిలో నూనె కలిపి అమ్ముతాడు. వీళ్ళు పనులు చేయించుకుంటారు. దానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వడానికి మొండి చేయి చూపెట్టి పనులు చేయించుకోవడం వల్ల హక్కుగా భావిస్తారు. 

ఎప్పుడైనా.. గంగి గ్రామంలో ప్రవేశించినప్పుడు వారు కోరిక నిండిన కళ్ళతో చూస్తూ ఉంటారు. వాళ్ళ చూపులు శర్రేరం పై పాము పాకినట్లు జలదరింపజేస్తుంటాయి అని గుర్తు చేసుకుంది.  కొంచెం సేపటికి ఠాకూర్ ఇంటి తలుపులు మూసుకుంటాయి.  ఆ అవకాశం దొరకడం కోసమే చూస్తున్న ఆమె  వెంటనే మంచి నీటి బావి వద్దకు వెళుతుంది. 

జాగ్రత్తగా తను తీసుకు వచ్చిన తాడుని కడవకి బిగించి అమృతాన్ని దొంగిలించే దొంగలా మెల్లగా కదులుతూ.. మనసులో అనేక దేవుళ్ళని తలచుకుని..కడవని బావిలోకి దింపుతుంది. శబ్దం కాకుండా.. నీరు నింపి నాలుగు చేదలు లాగేసరికి కడవ కళ్ళకి కనబడింది. వంగి  కడవని అందుకునే లోపే భళ్లుమనే శబ్దంతో..ఠాకూర్ ఇంటి తలుపులు తెరుచుకుంటాయి. గంగి భయంతో చేతిలో ఉన్న తాడు వదిలివేసింది. నీటితో నిండి ఉన్న ఆకడవ ధడేలు మన్న శభ్డంతో బావిలో పడిపోయింది. ఆ శబ్దానికి ఎవరు? ఎవరక్కడ !? అంటూ ఠాకూర్ బావి వైపు వచ్చాడు. 

గంగి భయంతో.. పరుగు తీసింది. ఇల్లు చేరుకునే సరికి భర్త జోఖూ.. దుర్వాసన వచ్చే అదే నీటిని త్రాగుతూ కనబడతాడు.  మారాలని కోరుకున్నా మారని వారి జీవితాలని ప్రతి బింబిస్తూ ఈ కథ ఉంటుంది. 

 స్థూలంగా ఇది కథ. ఇలాటి  విషయాలు ఉన్న కథలు మనకి తెలుసు.. 

అయితే.. కథలోని  వర్ణన చాలా బాగుంటుంది. నిమ్న జాతి జనులు పడే కడగండ్లు కళ్ళకు కట్టినట్లు పాఠకుడిని కట్టి పడేస్తాయి. ప్రేమ చంద్ శైలి అటువంటిది.. వారి రచనలలో సమాజంలో పేరుకుని ఉన్న కుసంప్రదాయాలు, అసమానతలు, కార్మిక కర్షక దయనీయ స్థితులు తో పాటు సమాజంలో సామాజిక కట్టుబాట్ల బంధనాలలో బలి అవుతున్న స్త్రీ అంతర్మధనాన్ని సూక్ష్మాతి సూక్ష్మం గా చెప్పడం జరిగింది.

ఈ కథ చదువు తున్నంత సేపు మహీధర రామమోహనరావు గారి "కొల్లాయి గడితేనేమి" మదిలో మెదిలింది. 

మంచి పుస్తకాలు చదవడం వల్ల..మన ఆలోచనలు కూడా పరిణితి చెందుతాయి అనిపించింది. 

2 కామెంట్‌లు:

Padmarpita చెప్పారు...

I will try to read.

సుభ/subha చెప్పారు...

వివరణ బాగుందండీ..