23, డిసెంబర్ 2015, బుధవారం
దేవునికి స్తోత్రము
19, డిసెంబర్ 2015, శనివారం
చెలిని చేరలేక (ఖ )
రాత్రి సమయం మూడున్నర అయింది . రాత్రంతా పడక మార్చుకుంటూనే వున్నాను మనసు బరువుగా వుంది, అస్థిమితంగా వుంది. ఇంకా బాగా చెప్పాలంటే లోపలంతా వుక్కగా వుంది. ఎవరితో పంచుకోవాలో తెలియడంలేదు, సంతోషాన్ని యెవరికైనా పంచగలం. బాధనెవరికి పంచగలం ? ఆప్తులకి మినహా. అందుకే ప్రక్కనే వున్న మన అన్న వారిని వదిలేసి దూరంగా వున్నాసరే వారినే మన ఆప్తులుగా జత చేసుకుంటాం వాసంతి అంతే కదూ ! ఆమె గురించిన ఆలోచనలే నాకీ రాత్రి నిద్రని దూరం చేసాయి మరి కొన్ని రాత్రులు యిలాగే వుండబోతాయనుకుంటా !
ఇప్పుడు తనెలా వుందో అనుకుంటూ మొబైల్ని చేతిలోకి తీసుకున్నాను. ‘whatsaap” లో టింగ్ మంటూ వచ్చిన మెసేజ్. చాట్ ఓపెన్ చేయకుండానే డిస్ ప్లే లో కనబడుతున్న సారాంశం.
” నేస్తం ! నువ్వు దూరంగా వున్నావనేమో రాత్రి నీ స్థానంలో దిండు వచ్చి నన్ను వోదార్చింది” అని. మనసు మరింత బాధకి గురయింది. నిన్న నేను విన్న విషయం మర్చిపోలేకపోతున్నాను. రాత్రి యే౦ జరిగిందో ! అదృష్టవశాత్తూ ఆమె ఆత్మహత్యా ప్రయత్నం విఫలమైంది కాబట్టి తేలికగా వున్నాను లేకపోతే… ఆ వూహే భయంకరంగా వుంది. అయితే నిన్నటి సంభాషణని అప్రయత్నంగానైనా మళ్ళీ గుర్తు చేసుకోవాల్సి రావడం బాధాకరం. ఇది నిత్య గాయాల జ్ఞాపకం కూడానూ .
వ్యధల జీవన సముద్రంలో మరి కొన్ని కన్నీటి చుక్కలు చేరుతున్నాయి. మరి కొన్ని ఆవిరవుతూ వున్నాయి. నిన్నటి నుండి యెడతెరిపి లేకుండా ఆలోచిస్తూనే వున్నాను. ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకినట్టే దొరికి మరికొన్ని ప్రశ్నలని ముందు నిలిపి సవాల్ చేస్తుంది. ప్రశ్నతోనే ఆడదాని జీవితం ముగియాలన్నట్టు. ఇంటి పనులు చేసుకుంటూనే వాసంతికి కొంత ఓదార్పు నివ్వాలనే ఉద్దేశ్యంతో వొక ఉత్తరం వ్రాయాలనుకున్నాను. ఆలోచన రావడమే తరువాయి క్షణంలో చేరుకునే ఈ – ఉత్తరం పెన్నిధిగా కనిపించింది నాకు. మెయిల్ బాక్స్ వోపెన్ చేసి వ్రాయడం మొదలెట్టాను.
వాసంతీ..
నాకవకాశం వుంటే ఈ ఉత్తరానికి బదులు ఉత్తర క్షణంలోనే నీ దగ్గరకి చేరాలని నిన్ను హృదయానికి హత్తుకుని నీ బాధని కొంతైనా పంచుకుని నిన్ను సేదదీర్చాలని ఉంది. నీకు దైర్య వచనాలనివ్వాలని, నీ భవిష్యత్ అగమ్యగోచరంగా మారకూడదని, నీ పిల్లల భవిష్యత్ ని నాశనం చేసే నిర్ణయాలు తీసుకోవద్దని, నీ వ్యక్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని భర్త పాదాల దగ్గరే పెట్టి నిత్యం అగ్ని సీతలా నీ పవిత్రతని నిరూపించుకోమని చెప్పడానికి యీ లేఖ వ్రాయడం లేదు .
అమ్మ నన్ను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది .అమ్మకి బాగొలేదేమో తోడూ తీసుకొచ్చింది అనుకుని అమ్మతో లోపలి వెళ్లాను నన్ను బయటే కూర్చోబెట్టి లోపలి వెళ్లి డాక్టర్ తో మాట్లాడి వచ్చింది. తర్వాత నర్స్ వచ్చి నన్ను లోపలి తీసుకు వెళ్ళి లోపలి గదిలో బల్లపై పడుకోబెట్టింది. “నన్నెందుకిలా పడుకోబెడుతున్నారు నేను బాగానే వున్నాను కదా” అంటూ విదిలించుకుని బయటకి రాబోయాను . డాక్టర్ వచ్చి నా భుజంపై చేయి వేసి మృదువుగా అడిగింది “నీకు మూడు నెలలుగా నెలసరి రావడం లేదని అమ్మ భయపడుతుంది, పరీక్ష చేసి చూడాలి అందుకే నువ్వు బల్లపై పడుకోవాలి ” అని చెప్పి బలవంతంగా పడుకోబెట్టి గ్లవుజ్ తొడుక్కున్న చేయిని లోపలికి పెట్టి కెలికి చూస్తూ .. “నువ్వు యెప్పుడన్నా మగాళ్ళతో పడుకున్నావా ? అలా పడుకుంటే నెలసరి రావు, కడుపు వస్తుంది. అది మీ అమ్మ భయం ” అని ఒక విధంగా నవ్వి చేతిని తీసి తొడుక్కున గ్లవ్స్ తీసి చేతులు కడుక్కుని నాప్కిన్ తో తుడుచుకుంటూ కుర్చీలో కూర్చున్న అమ్మ దగ్గరికి వెళ్లి కంగారు పడకండి అలాంటిదేమీ లేదు వొకో సారి నెలసరిలు ఆలస్యంగా వస్తూ వుంటాయి ” అని చెప్పింది . అమ్మ “అమ్మయ్య మంచి మాట చెప్పారు, యేమైందోనని భయపడి చచ్చాను ” అని తేలికగా వూపిరి పీల్చుకుంది. ఆనాటి పరీక్ష అదొక పెద్ద అవమానంగా తోచింది నాకు . 15 ఏళ్ళ పిల్ల శారీరక సంబంధం యేర్పర్చుకుందేమో అని అనుమానపడే తల్లిదండ్రులు, కాలేజీకి పంపితే చెడు తిరుగుళ్ళు తిరుగుతారని ఆలోచించే వాళ్ళు అసలు శరీరాల కలయిక అంటే యేమిటి , తమకి తెలియకుండానే యేమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి తో సెక్స్ లో పాల్గొనే వాళ్లకి, వంచనకి గురయ్యే ఆడపిల్లలకి గుప్పిట మూసి రహస్యాన్ని దాచినందువల్ల వచ్చే భద్రత కన్నా అనర్ధమే యెక్కువ జరుగుతుందని అనిపించింది. నిజం చెప్పొద్దూ... మూడు నెలలు నెలసరి రాకపోతే ఆదుర్దా పడి అనుమానంగా చూసి , డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి పరీక్ష చేయించడం నా వరకు నాకొక పెద్ద అవమానంగా అనిపించింది.
మరొకరి సంగతి .ఈ మధ్య నాకత్యంత సన్నిహితులురాలైన కుసుమ బాధ విన్నప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకోకుండా బ్రతికి వుండటమే చాలా గొప్పనిపించింది తెలుసా ! ఆమె యెంత ఆవేదనని మనసులో దాచుకుని నవ్వుతూ ఆ విషయాన్ని చెప్పిందో, ఇప్పుడు గుర్తుకు వచ్చినా కన్నీళ్ళు వస్తాయి మరి . అంత పచ్చిగా వుంటుంది ఆమె గాయం .
“అసలు మన బాధని గురించి పట్టించుకోని లోకాన్ని మనమెందుకు లక్ష్య పెట్టాలి . ఎవరి బాధలు యెవరి గాయాలు వారివి. ఎదుటివారికి యివన్నీ యెలా తెలుస్తాయి ? చెప్పినా అర్ధం చేసుకునే సహృదయత వుందంటావా ? సునీతా విలియమ్స్ గురించి కొన్ని చెత్త నోళ్ళు యిలా వాగుతుంటాయి “అంతరిక్షంలో అంతమంది మగాళ్ళ మధ్య అన్నాళ్ళు గడిపివచ్చింది యేమి లేకుండానే వుందంటారా? ” అని. ఆ మాటలు విని మనిషి గా పుట్టినందుకు యెంత విరక్తి కల్గిందో నీకెలా చెప్పగలను. ఇక మన యింట్లో వాళ్ళు మనని అనుమానించడం తక్కువేం కాదు మనం యెవరితో మాట్లాడినా ఆ సంబంధమేదో వున్నట్టు వూహించుకుంటారు,అనుమానంగా చూస్తారు . రహస్యంగా మనం మాట్లాడుకునే ఫోన్ సంభాషణలు వింటూ వుంటారు కూడా. అందుకు నా అత్తగారే ఉదాహరణ అంటూ కృష్ణ ప్రియ చెప్పిన విషయాలు ఇవి . భర్త రాజకీయ నాయకుడి హత్య కేసులో చిక్కుకుని ఆరేళ్ళు జైలు పాలైతే ఒంటరిగా యెoతో పోరాటం చేసింది ఆమె ప్రతి అడుగుని, ప్రతి సంభాషణని కుటుంబం అక్రమ సంబంధం దృష్టితోనే చూసింది. కుటుంబం అండదండలు కావాలని అత్త,మరిది,ఆడపడుచులతో సన్నిహితంగా వుంటూనే వున్నాను. ఒకసారి యే౦ జరిగిందో తెలుసా ? “నా కూతురు విదేశాలకి వున్నత చదువుకి వెళ్ళే సమయంలో మా యింటికెదురుగా వున్న బిల్డర్ నుండి తప్పనిసరై మాట సాయం తీసుకున్నాను . పాపం! అతను కూడా నిస్వార్ధంగా శ్రద్ద తీసుకుని మాట సాయం చేసాడు. అలా నా క్లిష్టమైన పని సులభంగా జరిగిపోయింది. నా కూతురు విదేశానికి పయనమై వెళ్ళేటప్పుడు నాకు మాట సాయం చేసినతను కూడా వాళ్ళ యింటి గేటు ముందు నిలబడి వున్నాడు . అతనికి కూడా వెళ్ళొస్తానని చెప్పి చేసిన సాయానికి థాంక్స్ చెప్పి రా … అని నా కూతురికి చెప్పాను.. నే చెప్పిన మాట విని నా కూతురు అతని దగ్గరకి వెళ్లి వెళ్ళొస్తానని చెప్పి వచ్చింది . అప్పటి నుండి మా అత్తగారికి నా పై యేవో అనుమానం. ఎప్పుడు కలిసినా అతని గురించి ప్రస్తావన తీసుకు వస్తారు, అతని గురించి నేను యే౦ మాట్లాడతానో అని గమనిస్తూ ఉంటారు. ఇంటికి వస్తే సరాసరి బెడ్ రూం లోకి వెళ్లి చెక్ చేస్తూ ఉంటుంది. నా బెడ్ మీద ఒక ప్రక్క ప్రక్క నలిగి వుందా లేక రెండు వైపులా నలిగి వుందా అని పట్టి పట్టి చూడటం నేను గమనించాను. ఒకసారి నా ఫ్రెండ్ వచ్చి రాత్రి వేళ విడిది చేసి వెళ్ళింది. ఇద్దరం కలసి పడుకుని యెన్నో ముచ్చట్లు చెప్పుకున్నాం,అలాగే నిద్ర పోయాం. నాకసలే బద్ధకం ఎక్కువ రోజూ ప్రక్కలు దులిపి నీట్ గా దుప్పట్లు పరిచే అలవాటు లేనితనం కదా! అదే రోజు మా అత్తగారు వచ్చి చెకింగ్ ఒకవైపే నలిగి వుండాల్సిన ప్రక్క రెండవ వైపు నలిగి వుండటం చూసి యెవరు వచ్చారు? అని అడిగింది అప్పుడుకి గాని నాకర్ధమైంది ఆవిడ చెకింగ్ లకి అసలైన అర్ధం ” అని చెప్పింది"కృష్ణప్రియ.
మనిషికి మనిషికి మధ్య యే విధమైన సంబంధం వుండకూడదు వుంటే గింటే ఆ సంబంధం మాత్రమే వుండాలనే ఈ మనుషుల మనస్తత్వాలని చూస్తే జాలి కల్గుతుంది. మనిషికి మనిషికి మధ్య సహజంగా వుండాల్సిన మానవ సంబంధాల స్థానంలో, ఒకరికొకరు యె౦తో కొంత సాయం చేసుకుని ప్రేమాభిమానాలు పెంపొందించుకుని మనుగడ సాగించాల్సింది పోయి ప్రతి సంబంధాన్నీ ఆర్ధిక సంబంధం గాను, శారీరక సంబంధంతో కొలిచే యీ సమాజంలో బతకడం యెంత అవమానకరంగా వుంటుందో తెలుసుకోవడానికి నాకు తెలిసిన సంగతులు చెప్పడం కూడా మంచిదే అనుకుంటున్నాను. నీకవి వుపకరిస్తాయని చెపుతున్నాను తప్ప నిన్ను యింకా యింకా ఆందోళనలోకి నెట్టడానికి కాదని అర్ధం చేసుకుంటావనే నమ్మకంతో వ్రాస్తున్నాను.
ఎవరి ఆలోచనలని బట్టి, మానసికస్థితిని బట్టి వారి ప్రవర్తన బహిర్గతమవుతుంది, అది తెలుసుకో చెలీ ! నీ దుఖాన్ని నేను తీర్చలేను. అలా అని నిన్ను నీ ఖర్మానికి వొదిలి వేయలేను. నేను యే సలహా చెప్పలేను. నా మనసంతా బాధగా, పచ్చిగా వుంది. మన ఈ దుఃఖాలు మనవి మాత్రమే కాదు చెలీ ! సమూహాలవి. ఈ సమూహాలు పెరిగి పెద్దవుతున్నాయి . ఓదార్చే వొడి లేక భూమాత వొడిని వెతుక్కుంటున్నాయి. ఆ వొడిని వెదుక్కునే అవసరం నీకు రానీయకు అని మాత్రం చెప్పదలచాను . ఎందుకంటే ఆర్ధిక స్వాతంత్ర్యం లేని స్త్రీలు , అన్నీ వున్నా కూడా అణువణువునా నిరాశ నింపుకున్న స్త్రీలు ఆవేశంలో క్షణికంలో నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని అంతం చేసుకుంటారు, ఆ బాట వైపు నీ చూపు పడనేకూడదు. తగిలిన గాయాలని గేయం చేసుకుని పాడుతూ సాగిపోవాలి తప్ప గాయం తగులుతుందని శరీరమే లేకుండా చేసుకోవడం ద్రోహం కదా !
ప్రేమతో … నీ నెచ్చెలి “అమృత"
11, డిసెంబర్ 2015, శుక్రవారం
రెండు నాల్కల ధోరణి
ఫ్రెండ్స్ !
రచనలు రచనలు గాను కవిత్వం కవిత్వం గా వ్రాసుకుంటే ఎవరైనా హర్షిస్తారు. బాధితులు పీడితులు ఉంటె సహానుభూతి చెందుతారు. కుల మత జాతులకి అతీతంగా స్పందిస్తారు అందులో ఎలాంటి కుట్రలు సందేహాలు ఉండవు. ఈ మధ్య కొందరు సూడో అభ్యుదయవాదులు ముసుగేసుకుని మరీ వచ్చి వారి అసహనాన్ని వ్యక్తిగత ద్వేషాన్ని రచనల్లో, కవిత్వంలో వ్యక్తీకరిస్తున్నారు. ఒక కులాన్నో లేదా ఒక మతాన్నో ఒక వర్గాన్నో టార్గెట్ చేసుకుని వచ్చి వారి ప్రేలాపనలతో ఇతరులని కించపరుస్తున్నారు. అణచివేతకి గురైతే ఎక్కడ గురయ్యారో అక్కడ ప్రశ్నించండి. వ్యక్తులని వదిలేసి సమూహాలకి ఎందుకు ఆపాదిస్తారు ? ఎవడో ఎక్కడో ఏదో చేస్తారు కూస్తారు. దాన్ని పట్టుకుని కులం మొత్తానికి మతం మొత్తానికి జాతి మొత్తానికి ఆపాదించి కసిదీరా తిట్టి దూలానందం పొందుతున్నారు.
చరిత్రలో చాలా పీడనలు అణచివేతలు ఉన్నాయి. అవి ఇంకా అలాగే ఉన్నాయి అసలేమీ మారలేదు అన్నట్లు ఉంటె ఎలా ? క్రమేపీ సమాజం మారుతుంది మనుషులు మారుతున్నారు. అణచివేయబడిన వర్గాలు తెలివి చదువు ఉద్యోగం బలం పెంచుకుని చట్టాల గురించి తెలుసుకుని ప్రశ్నించే స్థాయికి, తిరిగి ఇతరులని బాధించే స్థాయికి చేరుకున్నట్లే ... ఒక్కప్పుడు బలవంతులమని విర్రవీగినవాళ్ళు సైతం వాళ్ళ మూఢత్వాన్ని ఛాందసవాదాన్ని వొదిలి జనబాహుళ్యంలో కలిసిపోతున్నారు. సామరస్యంతో ఇతరులతొ కలసి పోతున్నారు. ఈ విషయాన్ని మరుగున పరిచి మీ వ్యక్తిగత ద్వేషాలని ఒక కులంలో ఉన్న మొత్తానికో ఒక మతంలో ఉన్న మొత్తానికో అపాదించవద్దు. పదే పదే వ్యక్తులకి బదులు సమూహాలకి సమాజం మొత్తానికి మీ ద్వేషాన్ని అంటకట్టవద్దు. మీకెలా ఒక కులం ఉందో మాకు అలాగే ఒక కులం ఉంది. మీకిష్టమైన మతం మీరెలా పాటిస్తారో మా కిష్టమైన మతాన్ని మేమలాగే పాటిస్తాం. మీరు అవహేళనలకి అన్యాయానికి గురైతే ప్రశ్నించండి మా దృష్టికి వచ్చినప్పుడు ఖండించడం, మీకు మద్దతు పలకడం అన్నీ ఉంటాయి.
అణగారిన వర్గాల తరపున వకాల్తా పుచ్చుకుని (కొందరు ఇలా వకాల్తా పుచ్చుకుని వ్యక్తిగత ప్రయోజనాల కోసం నమ్మిన వాళ్ళని నట్టేట ముంచేసిన వాళ్ళు ఉన్నారు) అందరిని ఒకే గాట కట్టేయడం సబబు కాదు. చీము, నెత్తురు, రోషం, అభిమానం మాకూ ఉన్నాయి. ఎల్లకాలం చూసి చూడనట్లు పోవడం కూడా కుదరదు. దయచేసి వివాదాస్పద వ్రాతలు వ్రాయకుండా ఉంటే మంచిది. చదువుకుని సంస్కారవంతంగా ఆలోచించే రచయితలూ కవులు కళాకారులే ఇలా ఉంటె మిగతావారి సంగతేమిటని ఆలోచిస్తున్నారా ? లేదా !? చాలా విచారంగా ఉంది. అభిప్రాయబేధాలు సహజంగానే వస్తూనే ఉంటాయి. కాదనడంలేదు. ఎవరు ఏమీ మారలేదు అనుకుంటే మాత్రం జాలిపడటం తప్ప ఇంకేమీ మాట్లాడలేం . కానీ వంచన చేయడం ఆత్మ వంచన చేసుకోవడం మంచిది కాదు
."సో కాల్డ్ మేధావులు...స్తీవాదులు....సామాజిక సేవేద్దారకులు ...వారి కిష్టమైనపుడు మాట్లాడతారు ...లేకపోతే. .తేలు కుట్టిన దొంగలలా నో రుమూసుకుంటారు. మరల వారే ఇంకొకరి మతాలను కులాలను విమర్శిస్తారు. రెండు నాలుకల నీతి చాలా ఎక్కువ ఉంది"
పరమత సహనం నా అభిప్రాయం ...
పరమత సహనం భారతీయ ఆత్మ దాని గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. నాయకులు వేరు ప్రజలు వేరు . భిన్న సంస్కృతితో తరతరాలుగా మమేకమైపొయిన జాతి మనది. అయిదేళ్ళు పాటు పరిపాలించే నాయకులోచ్చి ఇది ఒక మతానికి చెందిన దేశమనో లేదా ఈ దేశ వారసత్వానికి ప్రతీకలమనో చెప్పుకున్నంత మాత్రాన మిగతా మతాల వారందరూ ఈ జాతీయులు కాకపోతారా? అలాంటి నాయకులకి బుద్ది చెప్పాలంటే వారి కుళ్ళు కుతంత్రాలు అర్ధం చేసుకున్న వారే నడుంబిగించాలి కానీ కొంత మంది కావాలని మంటలని ఎగదోస్తున్నారు. అందుకు విచారంగా ఉంది.
ఈ మధ్య నా కథ ఒకటి ప్రింట్ మీడియాలో ప్రచురింపబడినప్పుడు పాఠకుల స్పందన కోసం మొబైల్ నెంబర్ ఇచ్చాను. వెంటనే ..దేవుడు మీకు స్వస్థత చేకూర్చుతాడు ప్రార్ధనామందిరమునకి రండి తో మొదలెట్టి ప్రతి రోజు సువార్త వాక్యాలు అందించడం మొదలెట్టారు. మరి ఈ రకమైన మత ప్రచారం పట్ల కూడా సహనం వహిస్తూనే ఉన్నాం. మాకు సమీపంలో ఒక గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో వినాయకుడి గుడి కట్టి పదేళ్ళు అయింది. దానికి దగ్గరలోనే విదేశాల నుండి వచ్చిన సొమ్ముతో ఒక ఇంటిలో చర్చిని నెలకొల్పారు. తెల్లవారుఝామునే పోటాపోటీగా మైకులు పెట్టి మరీ ఆమెన్ - గణేష్ మహారాజ్ కి జై అంటూ వినిపిస్తారు . నిద్ర ఖరాబై ఆరోగ్యాలు పాడై ఏమిటీ శిక్ష అనుకుంటున్నాం తప్ప ఒకరినొకరు తిట్టుకోవడంలేదు.
మనం తల్లి గురించి గొప్ప కవిత్వం వ్రాస్తాం. చెల్లి గురించి కవిత్వం వ్రాస్తాం. ఆలి గురించి అంతకన్నా గొప్పగా కవిత్వం వ్రాస్తాం. ఆకాశంలో సగమంటూ కీర్తిస్తాం. ఆహా .. ఓహో అనే భట్రాజు పొగడ్తలు వందిమగాదులు ఎందఱో ! ఒక మత పెద్ద ఈ ఆడోళ్ళని గడ్డిపోచ లెక్కన జమకట్టినప్పుడు మాత్రం అస్సలు మాట్లాడరు . అది వాళ్ళ మతానికి సంబంధించిన విషయం మాత్రమే ! కలగజేసుకుంటే ఫత్వాలు జారీ చేయబడతాయని భయం .
అదే ఇంకో మతం స్వామీజీ ఎక్కువమంది పిల్లలని కనాలంటే మాత్రం ..ఈ ఆడజాతి మీద అంతులేని సానుభూతి పుట్టుకొస్తుంది. అప్పుడు మాత్రం బాగా మాట్లాడతారు .
అభ్యుదయమంటే కులమతజాతికి అతీతంగా నిర్భయంగా న్యాయంగా మాట్లాడాలి కదా ! నేను ఈ రెండు నాల్కల ధోరణి గురించే మాట్లాడుతున్నాను.
పరమత సహనం హిందువులకి లేదని వక్కాణించే సూడో మేధావులు వారి మతం వారి వ్యక్తిగతం అనుకుంటారు. పరమతం వారి విశ్వాసాలు మాత్రం సమాజం పై బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపణలు చేస్తారు. అసలు ఈ బీఫ్ వివాదాలు లేని గ్రామాలు భారతదేశంలో మూడొంతులు ఉన్నాయంటే నమ్మరు వీళ్ళు.
మా పల్లెటూర్లో హిందూ ముస్లిం క్రిష్టియన్ బేధాలు లేవు ఏమైనా వస్తే అవి అప్పటికప్పుడు సమసిపోయేవే ! మా మధ్య కుహనా మేధావులు లేరు అందుకే మేము ఇంకా స్వచ్చంగా స్వేచ్చగా ఆనందంగా బ్రతకగల్గుతున్నాం అని చెప్పడానికి గర్విస్తున్నాను. జై హింద్ !
24, నవంబర్ 2015, మంగళవారం
జన్మదిన శుభాకాంక్షలు
23, నవంబర్ 2015, సోమవారం
అక్షరాత్మ ఆశ్లేషం
పరిహాసమా ... ఉదార విన్యాసమా
14, నవంబర్ 2015, శనివారం
వెన్నెల పురుషుడు
ఉదయం తొమ్మిది గంటలైనా కాలేదు సూరీడు మహా వేడిమీద ఉన్నాడు. వంట గదిలో విజిల్ వేస్తూన్న కుక్కర్ తో పోటీపడుతూ కిటికి ప్రక్కనే పెరిగిన మామిడిచెట్టుపై కోయిల కూస్తుంది . తనూ స్వరం కలపబోయిన ఆమె తన అత్తమామలు ఉన్నారన్న సంగతి గుర్తుకొచ్చి వుత్సాహాన్ని గొంతులోనే అణిచేసుకుంటూ "వసంతంలో కూయాల్సిన కోయిల ఆషాడం చివరిలో కూడా కూస్తుంది వానకారు కోయిల అంటే యిదేనేమో ! " అనుకుంటూ వాయిస్ రికార్డర్ ఆన్ చేసి కిటికీ ప్రక్కనే పెట్టింది. అప్పటిదాకా తెగ సందడి చేసిన కోయిల కూయడం మానేసింది. ఓపికగా వో అయిదు నిమిషాలు వేచిచూసాక మళ్ళీ కోయిల పాట మొదలెట్టింది కానీ ఆ పాటెందుకో విషాదంగా అనిపించింది, అప్పటిదాకా వగరు చిగురులు తిని గొంతు మంటత్తిందేమో ! రికార్డ్ ని సేవ్ చేయకుండా వదిలేసింది అక్కడ నుండి తన గదిలోకి వచ్చింది వెన్నెల.
విశాలమైన కిటికీ దగ్గర నిలబడి బయటకి చూపు సారించింది ఆమె. చూపు చిక్కుకుపోయిన చోట లేలేత వేపకొమ్మల మధ్య పూచిన పూత. ఆనందంతో మొహం విప్పారింది మళ్ళీ అంతలోనే అరె ! యిప్పుడు పూసింది యేమిటీ ? ఉగాదికి కదా పూయాల్సింది. మొన్నటిదాకా పండిన కాయలు రాలుతూనే వున్నాయి కదా ! తర్వాత అత్తయ్యని అడిగి తెలుసుకోవాలి అనుకుంటూ కనుచూపు మేరా చూసింది . ఇందాకటి కోయిల కాకుండా మరో రాగిరంగు రెక్కల కోయిలొకటి కొబ్బరాకుని చీల్చి యీనెని ముక్కున కరుచుకుని పోయి మామిడి కొమ్మలపై వుంచింది, బహుశా గూడు కడుతుంది కాబోలు. గుడ్లు పొదగని కోయిలకి మురిపెంగా పిల్లలని పెంచలేని కోయిలకీ గూడెందుకో ! నిరాశగా అనుకుంది.
మధ్యాహ్నం యెప్పుడైందో అత్తమామలు యెప్పుడు భోజనం చేసారో ప్రొద్దు పడమటికి యెప్పుడు మారిందో యేమి తెలియదు. జీవితంలో యేర్పడిన స్తబ్ధతని పూరించుకోవడానికి ఆమెకి లభించిన వరం తోటే అన్నట్లు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోతుంది ఆమె.
సాయంత్రం తోటంతా సందడిగా వుంది. ఎటు చూసినా సీతాకోక చిలుకల విన్యాసాలే ! చెట్లపై నివాసముండే రకరకాల పక్షులు అందులో యె౦తో చిన్నవి బుల్బుల్ పిట్టలు యెంత ముద్దుగా వున్నాయో ! క్షణం కుదురుగా ఉండవు వేప చెట్టు మీద నుండి సంపెంగ పూల చెట్టుపైకి సంపెంగ చెట్టుపై నుండి పారిజాతం చెట్టుపైకి చక్కెరలు కొడుతూనే ఉంటాయి. వాటి మధ్య వుడుతలు కిచ కిచమని శబ్దాలు చేస్తూ హడావిడిగా తిరుగుతూ జామకాయలు కొరుకుతూ కాసేపు, నేరుడు పళ్ళని తింటూ కాసేపు జీవన మాధుర్యాన్ని అనుభవిస్తున్నాయి. వేప చెట్టు కొమ్మకి పెద్ద తేనెపట్టు . ఎక్కడెక్కడో తిరిగి సేకరించుకున్న మకరందాన్ని భద్రంగా దాచుకున్నాయి. ఏ స్వార్ధపు కళ్ళు దానిపై పడకపోవడం మూలంగా ఆనందంగా జుర్రుకుంటున్నాయి.ఎంతదృష్టమో ఈ తేనెటీగలకి. అవును యిన్ని వున్నాయి, రామ చిలుకలు లేవేంటి యీ తోటలో ? చిలుకలు వాలని చెట్టెక్కడైనా వుంటుందా ? అలాగే పావురాలు కూడా ! సృష్టిలో మానవుడికి తప్ప అన్ని ప్రాణకోటికి ఆనందాలున్నాయి. ఎటు తిరిగి మానవుడు ప్రకృతిని తన స్వార్ధం కోసం నాశనం చెయ్యనంతవరకూ. తోటకావలి వైపు రోడ్డుకి ఆనుకుని కార్లని బైక్ లని డిస్ట్రిబ్యూట్ చేసే ఓ పెద్ద కంపెనీ వాళ్ళు కార్ డ్రైవింగ్ స్కూల్ పెట్టారు . అంతకు క్రితం ఈ స్థలంలో సర్వీసింగ్ స్టేషన్ వుండేదట . ఈ లోపలికి అంతగా యెవరూ రాక పోవడం మూలంగా యీ మాత్రం ఆనవాలైనా మిగిలింది అంటూ తనలో తనే గొణుక్కుంది.
రాత్రి యింటికొచ్చిన కొడుకుతో పిర్యాదుని వినిపిస్తుంది ఆమె అత్తగారు
"కంటికెదురుగా కరంట్ బోర్డులకి కందిరీగలు అన్ని గూళ్ళు పెట్టి రొదగా తిరుగుతున్నా పట్టించుకోదు, టాయిలెట్ కిటికీకి దోమతెరకి మధ్య ఉడుతలు గూడు కట్టి పిల్లలని పెంచుతున్నా పట్టించుకోదు . పెళ్లై అయిదేళ్ళు నిండింది కడుపున ఒక కాయైనా కాయలేదు. హాస్పటల్ కి వెళ్లి చూయించుకుని మందూ మాకు వాడదాం అని లేనే లేదు. వంట పని అయిపోతే చాలు గదిలోకి వెళ్ళి తలుపులేసుకుంటుంది. ఎప్పుడూ పుస్తకాలు చదవడం పిచ్చిగీతలు గీయడం యిదేనా పని ? కొడుక్కి భోజనం వడ్డిస్తూ విసుక్కుంటుంది.
కాసేపటి తర్వాత లోపలికొచ్చిన శశిధర్ "ఎంత సేపూ ఆ మాను మాకుతో మాటలేనా ! కాస్త మనుషులతో కూడా మాట్లాడొద్దూ ! "
చురుక్కుమంటూ చూసింది
"అమ్మ బాధపడుతుంది కాసేపు బయటకొచ్చి కూర్చోని పెద్దవాళ్ళతో మాట్లాడుతూ టీవి చూడొచ్చుకడా !" అన్నాడు.
" వాళ్ళతోయేనా నేను మాట్లాడటం ? మీరు నాతో మాట్లాడరా, నే చెప్పిన మాటలు వినకూడదా ? అయినా నోట్ల కాయితాల చప్పుడుకి అలవాటు పడిన మీకు నాతో యేమి మాటలుంటాయి లే ! " అందే కాని కిటికీని వొదిలి యివతలకి రాలేదు . ఒక్క క్షణం ఆలోచించినతను చిన్నగా ఆమె ప్రక్కకొచ్చి నిలుచున్నాడు తనూ బయటకి చూసాడు . కటిక చీకటిలో తోటంతా నిశ్శబ్దంగా వుంది కొబ్బరాకుల మధ్య నుండి వేప కొమ్మల పైనుండి కనబడుతున్న ఆకాశంలో వెలుగుతున్న నవమినాటి చంద్రుడు . అక్కడక్కడా కనబడుతున్న చుక్కలు.
" ఈ ఇల్లు చూసినప్పుడు నువ్వెంత సంబరపడ్డావో నాకింకా గుర్తుంది. ఈ మహా నగరం నడిబొడ్డున యిలాంటి తోట, తోట ప్రక్కనే యిల్లూ మూడంతస్తులు యెత్తున పెరిగిన చెట్లు కిటికిలో నుంచి కనబడే చందమామ కాస్త అద్దె యెక్కువైనా నీ కోసం భరించాలనుకున్నాను కదా ! " గుర్తు చేసాడతను. తల వూపింది ఆమె .
ఈ చక్కని చుక్కకి ఆ చంద్రుడితో కబుర్లు ఎందుకు ? ఎదురుగా ఈ చంద్రుడుండగా అంటూ ఆమె మెడ వొంపులో తమకంగా తలాన్చాడు. ఆ మాత్రం సామీప్యతకే ఆమె తనువూ త్రుళ్ళింది మనసూ వొరిగింది. చాలా కాలం తర్వాత ఆమెకి వశమయ్యాడతను. . నువ్వే నా నా వెన్నెల పురుషుడివి అడిగింది లతలా అతన్ని మరో మారు అల్లుకుంటూ .
"నీకొక నిజం చెప్పాలి, విన్నాక నువ్వు బాధ పడకూడదు యెవరికీ చెప్పకూడదు ఆ రహస్యం మన మధ్యనే ఉండాలి " ఆమె ముంగురులు సవరిస్తూ అన్నాడతను .
ఏమిటి అన్నట్లు కళ్ళతోనే ప్రశ్నించింది వెన్నెల
"మనకి ఐ మీన్ నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. అందరూ నీలో లోపం వుందేమోనని అనుమానపడుతుంటే విని నువ్వెక్కడ బాధపడపడతావోనని నేనే అన్ని టెస్ట్ లు చేయించుకున్నాను. ఏ మాత్రం పిల్లలు పుట్టే అవకాశంలేదని డాక్టర్స్ చెప్పేశారు." చెప్పాల్సిన విషయం చెప్పేసి అతను వూపిరి పీల్చుకున్నాడు .
ఆమెలో కల్గిన ఆశాభంగం అతనికి కనబడనీయకుండా అతన్ని అల్లుకున్న చేతులని వదలకుండా అలాగే ఉంచింది
ఆమె మౌనం చూసి "పోనీ యింట్లో వాళ్లకి తెలియకుండా "ఆర్టిఫిషియల్ ఇన్ సెమినేషన్ ద్వారా ట్రై చేద్దామా ! నాకేం అభ్యంతరం లేదు" అన్నాడతను . ఆమె అడ్డంగా తల ఊపింది . కళ్ళల్లో నీళ్ళు కనబడకుండా అతని గుండెల్లో తలదాచుకుంది. ఆమెనలాగే పొదివిపట్టుకున్నాడతను.
తెల్లారిందో లేదో అతని అమ్మ “ అబ్బాయ్ ! ఈ యింట్లో మేముండలేమురా ! ఇంటికి వెళ్లిపోతాము అంటూ ఖండితంగా చెప్పేసింది. “ఎందుకనమ్మా !? నీ కోడలు వల్ల యేమైనా కష్టంగా ఉందా ? బాగా చూసుకోవడం లేదా ?” కంగారుగా అడిగాడు .
మీ ఆవిడకి పలుకే బంగారం . ఓ మాట మంచి లేని యింట్లో సౌకర్యాలెన్ని అమర్చినా, నవకాయ పిండి వంటలు వడ్డించినా వుండలేము రా ! ఇల్లన్నాక ఓ పిల్లా పీచు అన్నా ఉండొద్దా ! ఆమేమో ఆ గదిలో, నువ్వేమో డబ్బు రంధిలో. ఎన్నాళ్ళు గోడలతో, టీవితో మాట్లాడుకుని బ్రతుకుతాము మీ నాన్నకి యిక్కడ తోచుబడి కావడం లేదంట, మేమిప్పుడే వెళ్ళిపోతాం అంది .
వెన్నెలతో యీ విషయం చెప్పినా పెద్దగా స్పందించదు . ఎప్పుడూ తన లోకం తనదే గానీ .. ఎవ్వరిని పట్టించుకోదే ! మనసులో విసుక్కున్నాడు. తల్లి తండ్రి వూరెళ్ళి పోయాక అతను బయటకెళుతూ
వంట చేసుకుని వేళకి తిను . ఎప్పుడు కిటికీ దగ్గరే నిలబడి వుండకుండా రెస్ట్ తీసుకో ! సాయంత్రం పెందలాడే వచ్చేస్తాను మూవీ కెళ్ళి బయటెక్కడన్నా డిన్నర్ చేసి వద్దాం అని చెప్పి వెళ్ళాడు .
శశిధర్ కోసం యెదురు చూసి చూసి అలసిపోయి నిద్రపోయింది . అతనెప్పుడో వచ్చి పడుకున్నాడు . ఎన్నోసార్లు సారీ చెపుతూనే నిన్నటిలా కాదు ఈ రోజు త్వరగా వచ్చేస్తాను . నువ్వు నీ ఆలోచనల ధోరణిలో ఉండి తలుపులు కూడా సరిగ్గా వేసుకోవు కదా ! పోన్లే, నేనే డోర్ లాక్ చేసుకుని వెళతాను అనేవాడు వుదారంగా .
అలా రోజులు, నెలలు గడచి పోతూనే వున్నాయి . వెన్నెలకి కిటికీయే ప్రపంచమూ అయిపపోయింది . కాంతి విహీనమైన కళ్ళు, శుష్కించిన దేహం, మౌనంగా యంత్రంలా మారిపోయింది . ఆమెని చూసి అతను జాలి పడ్డాడు . ఆమెకి యేమివ్వాలో అతనికి తెలుసు, యివ్వలేని నిస్సహాయత తెలుసు . పై పై మెరుగుల కోసం అప్రతిహతం అర్రులు చాస్తూ పరిగెత్తడమే తప్ప నెమ్మళంగా జీవనసారాన్ని జుర్రుకోవడం చేతకానితనంతో సిగ్గుపడుతున్నాడు . ఎలాగోలా నాలుగు రోజులు తీరిక చేసుకుని ఆమెకి ఇష్టమైన సాగర సంగమ ప్రదేశానికి తీసుకు వెళ్ళేటప్పుడు కూడా ప్రయాణంలో చిన్న చిరునవ్వు కూడా లేని ఆమె ముఖం చూస్తే మనసంతా యేదోలా అయిపొయింది . కానీ ఆ నదీ సాగర సంగమం చూడగానే ఆమె ముఖం విప్పారింది. "ఇక్కడికి నిన్ననే నేను అతను వచ్చాం "అంది .
"నిన్నవచ్చావా, యెవరితో ?" అడిగాడు అయోమయంగా .
"అదే అతనే నా వెన్నెల పురుషుడు" అంది ఆమాట చెపుతున్నప్పుడు ఆమె ముఖంలో ఏదో తెలియని వివశత్వం
"అవునా! అది నేనేగా ! "చిన్న నవ్వు అతని పెదాల పై .
"ఊహు నువ్వు కాదు. అతను అతనే ! "
"అతనెలా ఉంటాడు!? యెక్కడ ఉంటాడో తెలుసా ? "
తెలుసు తోటలో వుంటాడు . గుర్తుకు తెచ్చుకున్నట్లు కాసేపాగి చెప్పింది . అవును కొన్నాళ్ళ క్రితం మన యింటెనుక తోటలోకి వొక పురుషుడొచ్చాడు. అతన్ని చూస్తుంటే కవులందరూ మగవాళ్ళని సింహంతో యె౦దుకు పోల్చారో అని చిరాకు కల్గింది . పొడుగు పొట్టి కాని ఎత్తు. క్రిందికి పైకి ఒకే మందంతో తెల్లని బట్టలతో దర్జాగా ఉంటాడు అతని నడక చాలా ఠీవిగా ఉండేది. చందమామ లాంటి గుండ్రటి మొహం,విశాలమైన నొసలు, అందమైన కళ్ళు ఆ కళ్ళని చూస్తే చాలు దీపాలు వెలుగుతున్నట్టు ఉండేవి. ఆ చూపులతో మరి కొన్ని దీపాలు వెలిగించుకోవడం అంటే యేమిటో నా కళ్ళు వెలుగుతుంటే అర్ధమయ్యింది. అతను పెదవి విప్పి మాట్లాడే వాడే కాదు అతనిది దేహబాష . కళ్ళతోటే కథలు చెప్పేవాడు. నాకు చంద్రుడంటే వున్న యిష్టాన్ని యెలా కనిపెట్టాడో ! వెన్నెల వాన రెండు కలసి కురుస్తున్నపుడు నన్ను జలకాలాటకి తీసుకు వెళ్ళేవాడు. అధర రుధిరంలో పట్టు తేనే రుచి చూపిన వాడు. వెన్నెల్లో కల్గిన వేడిని మృగ చూర్ణ లేపనం పూసి సాంత్వన చేకూర్చిన వాడు. నాకు యె౦తగానో నచ్చాడు . మేమిద్దరం భూత భవిష్యత్ కాలాన్ని మరిచి వర్తమానంలో జీవించిన అమృత ఘడియ లవి "
"నువ్వేమైనా కథ చెపుతున్నావా ? లేక కవిత్వం వినిపిస్తున్నావా? నీ భాష అర్ధం కాక చచ్చిపోతున్నా! మామూలు మూడ్ లోకి వచ్చెయ్యి, వింటుంటే చిరాగ్గా ఉంది " విసుక్కున్నాడతను
నేను నిజమే చెపుతున్నా ! మేమిద్దరం కలసి యెన్నో రాత్రులు నదీ విహారానికి వెళ్ళాం . చల్లని రాత్రిలో మంద్రంగా ప్రవహించే నది పాయ ప్రక్కన రెల్లుపూల పొదల మధ్యలో యిసుక తిన్నెలపై ఆ వెన్నెల పురుషుడి సాంగత్యం నాకు బాగా నచ్చింది ! ఎన్నో సార్లు గుజ్జనగూళ్ళు కట్టుకుని ఆడుకున్నాం . జలకాలడుకున్నాం, పడవెక్కి ఆ తీరానికి యీతీరానికి చక్కర్లు కొట్టాము. లంక తోటల్లో పూసిన పూలతో దండలల్లుకుని వొకరినొకరు అలంకరించుకున్నాం. ఆకుల గుసగుసల వింటూ హాయిగా నవ్వుకున్నాం. విరిసయ్యల పై వూసులాడుకున్నాం. ఒకొరికొకరు దేహాన్ని కానుకగా యిచ్చుకున్నాం . స్త్రీ పురుషుల మధ్య అంత కన్నా విలువైన కానుకలేముంటాయి ? మా యిరువురి దేహాలు మాట్లాడుకున్నాయి పోట్లాడుకున్నాయి అలసిపోయాక వొకటినొకటి సేద దీర్చుకున్నాయి ఆ అనుభవం యెంత బావుందో! ఎప్పుడూ వండుకోవడం, తినడం, సంపాదించుకోవడం, పడుకోవడం యింతేనా జీవితం !? కాస్త ఆత్మకి అనుభూతి నైవేద్యం పెట్టోద్దూ !
ఆమెసలు సృహ లో వుండే మాట్లాడుతుందా ? వింటున్న అతనికి యేదో తెలియని భయం కల్గింది . వెనుక తోటలోకి వచ్చే పురుషులతో యెవరితోనైనా పరిచయం పెంచుకుని తను బయటకెళ్ళ గానే నచ్చినతనితో కలసి తిరిగి వస్తుందా ? అనుమానం వచ్చింది . మళ్ళీ అంతలోనే ఛ ఛా.. తనెప్పటకీ అలా చేయదు . అయినా తనేగా రోజూ మెయిన్ డోర్ లాక్ చేసుకుని వెళుతున్నాడు . మళ్ళీ అంతలోనే అనుమానం . డూప్లికేట్ కీ వుందేమో అమ్మనడిగి తెలుసుకోవాలి "అనేకమైన అనుమానాల మధ్య "ఇక వెళ్ళిపోదాం రా " అంటూ ఆమెని బలవంతంగా తీసుకోచ్చేసాడు .
ఇంటికొచ్చాక సరాసరి గదిలోకి వెళ్లి ఆమె నించునే కిటికీ దగ్గరి వెళ్ళి పట్టి పట్టి పరీక్షించాడు . దోమ కూడా దూరే సందు లేదని నిర్ధారించుకున్నాక కొంచెం రిలీఫ్ గా ఫీలయ్యాడు . ఆమె మాములుగానే వంట చేసింది యిద్దరూ కలసి భోజనం చేసారు. ఆమె చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకుంటుంటే కొన్ని నిజంగా జరిగినట్లు అనిపిస్తున్నాయి జరగనట్లు అనిపిస్తున్నాయి . నిద్ర రాక అతను అటునిటు మెదులుతూ వుంటే ఆమె హాయిగా నిద్రపోయింది . నిద్ర పోతున్న ఆమె ముఖం చూసి పాపం పిచ్చిది .. పొద్దస్తమాను కథలు, కవిత్వం చదువుతూ వుంటుంది. అదే లోకంలో వుంటుంది , ఆమె మాటలు పట్టించుకోకూడదు అనుకుంటే కానీ అతనిని నిద్రా దేవి కరుణించలేదు .
ఉదయాన్నే నిద్ర లేచిన అతనికి ఆమె చూపులతో తోటంతా వెదుకుతున్నట్లు కనబడింది . ఏమిటీ యిక్కడే నిలబడి ఉన్నావ్ ? టిఫిన్ రెడీ చేయలేదా ! అడిగాడు .
అతనొచ్చి రాత్రంతా నాకోసం వెతుక్కుని వుంటాడు. మళ్ళీ రాత్రి దాకా అతను కనబడడేమో ... దిగులుగా మంచం మెక్కింది. అతనికి వెంటనే యే౦ చేయాలో అర్ధమైంది .
"డాక్టర్ నేను బాగానే వున్నాను కదా ! నాకు యే వైద్యమూ వద్దు . నాకు నా వెన్నెల పురుషుడు కనిపిస్తే చాలు . అతన్ని వెతుక్కోవడానికి వెళ్ళనీయకుండా నన్ను యిలా బందించివేస్తే ఎలా ?" గిన్జుకుంటూ వొదిలితే చాలు పారిపోయేటట్లు ఉంది
చూడమ్మా వెన్నెలా నిన్ను అతని దగ్గరకే తీసుకు వెళతాను కానీ "అతనెక్కడ వుంటాడో తెలుసా !? " డాక్టర్ ప్రశ్న
" తెలుసు, అతను నేను రెక్కలున్న కారులో యెవరికీ కనబడకుండా అలా నదీ తీరం వెంబడి ప్రయాణం చేసి చేసీ సముద్ర తీరానికి చేరుకున్నాం. పున్నమి వెన్నెల్లో అలలఘోషతో పోటీ పడి పాటలు పాడుకున్నాం కెరటాలతో ఆడుకున్నాం .అలా యీ ప్రపంచంతో పని లేకుండా ఆడి పాడి అలసి పోయే దాకా ఆ వెన్నెల రాత్రుల్లో విహరించాం. తిరుగు ప్రయాణమయ్యాం. అలా పదునాలుగు రోజులపాటు ప్రయాణం చేస్తూ వుండగా వుండగా అలసి పోయానేమో, సోలి అతనిపై వాలిపోయానేమో! ఒక పగలు వొక రాత్రి నాకసలు మెలుకువే రాలేదు కళ్ళు విప్పి చూస్తే నా వెన్నెల పురుషుడు నా ప్రక్కన లేడు యెటు మాయమయ్యాడో యేమో ! ఎంత వెదికినా కనబడలేదు . నా వెన్నెల పురుషుడు నాక్కావాలి కొసరి కొసరి వడ్డించే అతని తీపి ముద్దుల ఆహారం లేకుండా నేను యెలా జీవించేది ? జీవించిన క్షణాలని నేను యెలా మరిచేది ? నేను చచ్చిపోతా, నన్ను వొదిలేయండి, వొదిలేయండి గింజుకుంటుంది ఆమె .
డాక్టర్ ఆమెని మరింత మాట్లాడించే ప్రయత్నం చేస్తూనే వున్నాడు.
"డాక్టర్ గారు నా కోడలి సంగతి ఏమిటి ? ఆమె యె౦దుకలా మాట్లాడుతుంది ? రెండు నెలల నుండి మంచం పై అలా పడి వుండటం పిచ్చి పిచ్చిగా మాట్లాడటం చూస్తుంటే ఏ దెయ్యం పట్టిందోనని భయమేస్తుందండీ ! ఇలా జరుగుతుందని తెలిస్తే వొంటరిగా వుండనిచ్చేదానిని కాదు." అత్తగారు కన్నీళ్ళతో
"మీరేమి కంగారు పడకండి . ఆమెకి మంచి వైద్యం చేస్తున్నాం . మీతో కూడా కొన్ని విషయాలు మాట్లాడాలి. ట్రీట్మెంట్లో భాగంగానే లోపలి రండి అంటూ అత్తగారిని కన్సల్టింగ్ రూమ్ కి తీసుకుని వెళ్ళారు. మీరు శశిధర్ కి తల్లికదా ! “అవునండీ ! నా పేరు విమల ‘అని పరిచయం చేసుకుంది.
మీకొక విషయం చెప్పాలి విమల గారు . మీ కోడలు వొక రకమైన మానసిక వ్యాధితో బాధపడుతుంది. ఆమెకి మీ అబ్బాయి ద్వారా పిల్లలు కలిగే అవకాశమే లేదు. మీ అబ్బాయి కూడా భార్యతో చాలా తక్కువ సమయాలు గడుపుతూ ఆమెని నిర్లక్ష్యం చేస్తున్నాడు. మీరేమో పెళ్ళైన యిన్ని సంవత్సరాలకి కూడా తల్లి కాలేదన్న నెపం వేస్తున్నారు. ఆమె అది తట్టుకోలేక మానసికంగా దెబ్బతింది. ఆమె మాములు మనిషి కావాలంటే మీ సహకారం చాలా అవసరం. అంటూ విషయం వివరించాడు డాక్టర్.
అయ్యో ! నాకవన్నీ యేమీ తెలియదు డాక్టర్ ! మా అబ్బాయి కూడా యీ విషయాన్ని నా వరకూ రానివ్వలేదు. మా అబ్బాయికి పిల్లలు పుట్టే అవకాశంలేకుంటే వేరే మార్గాలు లేవా యేమిటీ !? ఇదేమైనా మా తరమప్పటి సమస్య కాదుగా ! స్త్రీకి ప్రసవ వేదన పడాలని నట్టింట్లో శిశువు రోదన వినాలని యె౦డదుకుండదు చెప్పండి ? మునుపటి తరాల మనుషుల్లా నాకంత చాదస్తం లేదు లెండి. మా అబ్బాయికి లోపం వుందని అసలు పిల్లలని వద్దనుకోలేను కూడా ! ఏవో మార్గాలుంటాయి కదా ! ఆ పద్దతుల్లో మా కోడలి కడుపున ఓ నలుసు పడేటట్లు చూడండి. మా అబ్బాయితో నేను మాట్లాడతాను. ఏది యేమైనా మా యింట్లో పసి పిల్లల బోసి నవ్వులు విరబూయాల్సిందే ! కోడలికి యివేమీ తెలియకుండా ట్రీట్మెంట్ యివ్వండి .. అందుకు హామీ నేను అంది విమల.
మీరు చాలా సహృదయంతో అర్ధం చేసుకున్నారమ్మా, యె౦తోమంది తమ పిల్లల్లో వున్న లోపాలని కప్పిపుచ్చి యెదుటివాళ్ళపై నిందలేసి విడాకుల వరకు వెళ్ళడం చూసాను. మీ నిర్ణయం చాలాబాగుంది. మీ కోడలికి నయమైపోయి త్వరలోనే మీకొక అందమైన, ఆరోగ్యకరమైన బిడ్డని కూడా యిస్తుంది . కొన్నాళ్ళు మా పర్యవేక్షణలో వదిలేయండి చాలు.
"అవునా డాక్టర్ గారు.. చాలా సంతోషకరమైన విషయం చెప్పారు. ఒక చిన్న మాటండీ మీరు యేమీ అభ్యంతర పెట్ట కూడదు. ఈ విషయాన్ని మా కోడలికి తెలియనీయవద్దు తెలిస్తే వొప్పుకోదేమో కూడా “ అనుమానం వ్యక్తం చేసింది.
“శశిధర్ కూడా ఆ మాటే చెప్పాడమ్మా! వెన్నెల ఆరోగ్యంగా, ఆనందంగా వుండటమే కావాలి అందరికి. ఈ విషయాన్ని మాకొదిలేయండి చాలు “అన్నాడు డాక్టర్ .
ఏ గాలి ధూళీ సోకిందో బిడ్డకి . ప్రక్కనే వున్న తోటలో సమాధులు కూడా వున్నాయట. దర్గా దగ్గర కట్టిచ్చుకొచ్చిన యీ తాయెత్తుని ఆమెకి కట్టనీయండి" అని బ్రతిమలాడింది .
డాక్టర్ నవ్వి యేమీ చెప్పకుండానే అక్కడి నుండి వెళ్లి పోయాడు
కోడలి చేతికి తాయెత్తు కడుతూ "అబ్బాయి ! ఈ పిల్లకి బాగవుతుండంటావా ? తల్లి తండ్రి అయి మనమే చూసుకోవాలిప్పుడు " కారే కన్నీటిని కొంగుతో తుడుచుకుంటూ.
"తప్పకుండా బాగవుతుందమ్మా " వొకింత విశ్వాసంతో చెప్పాడతను. అంతే కాదు తొమ్మిది నెలలపాటు ఆమెని పసిపాపలా చూసుకున్నాడు మరో పసిపాపకి జన్మ నిచ్చేదాకా.
హాస్పిటల్ బెడ్ పై ఆమె నీరసంగా కనులు విప్పింది. ఆమె ప్రక్కనే వున్న శశిధర్ "ఇదిగో నీ వెన్నెల పురుషుడు నీ వొడిలోకే వచ్చాడు చూడు" అంటూ వుయ్యాలలో వున్న బిడ్డని జాగ్రత్తగా తెచ్చి ఆమె చేతుల్లో వుంచాడు.
ఆమె ముఖంలో సంతోషం. "అవును పురుషుడు పుత్రుడురూపంలో పుడతాడట కదా వీడే నా వెన్నెల పురుషుడు " అంటూ బిడ్డని గుండెలకి హత్తుకుంది .
"హమ్మయ్య ! యిక యీ బిడ్డ ఆలనా పాలనలో జరిగినవన్నీ మర్చిపోతుంది" అనుకుంటూ విమల వూపిరి పీల్చుకుంది.
"అన్నట్టు నీకో విషయం చెప్పడం మరచాను వెన్నెలా ! మనం తోట ప్రక్కన వున్న యింటి నుండి క్రొత్తింటికి మారిపోయాం, ఇప్పుడు ఆ యింటికే వెళుతున్నాం " .
అక్కడా తోట ఉందా ఆసక్తిగా అడిగిందామె.
"పార్క్ కూడా వుంది. మన బాబుతో పాటు నువ్వూ ఆడుకోవచ్చు" నవ్వుతూ చెప్పాడతను.
( నవంబర్ మాలిక వెబ్ మాస పత్రికలో తరాలు -అంతరాలు శీర్షికన ప్రచురితం )
12, నవంబర్ 2015, గురువారం
ORACLE IN MEMORY
ఇదిగోండి ... ఈలింక్ లో ... ఆ బ్లాగ్ .
ఈ బ్లాగ్ ని సందర్శించండి. మీ విలువైన సూచనలు,అభిప్రాయాలని .. "నిఖిల్ " కి అందించగలరు.
హృదయపూర్వక అభినందనలు ... చిన్నీ బంగారం.
"మనస్సాకాశంలో భావాలు పక్షుల్లా ఎగిరిపోతుంటాయి
ఈలింక్ లో
8, నవంబర్ 2015, ఆదివారం
మర్మమేమి
ఈ కథ గురించి నేనేం చెప్పానో చాలామందికి అర్ధం కాలేదు . ఈ కథపై బోలెడు చర్చ జరగాలి. కానీ నాటకీయంగా ఈ కథను పక్కన పెట్టే ప్రయత్నం జరిగింది. దేశంలో మహిళల వస్త్రధారణ పై ముఖ్యంగా బురఖా ధరించడం పై చర్చ జరిగినప్పుడు ఈ కథ గుర్తుకు రావాలి. చదవండీ. మీ అభిప్రాయం రాయడం మర్చిపోకండీ. అలాగే ఈ కథను ఎవరైనా ఆంగ్లం లోకి అనువదించి ఇవ్వగలరా? అనువాదానికి pay చేయగలను.
మర్మమేమి -వనజ తాతినేని .
ఆ రోజు తెల్లవారుఝామున పిన్ని కొడుకు గృహ ప్రవేశం. విజయవాడ బస్టాండ్ లో గుంటూరు బస్ ఎక్కి కూర్చున్నాను. సమయం ఏడవుతున్నా సూర్యుని పసిడి కిరణాలు పుడమిని తాకడంలేదు . మంచు తెరల మధ్య చలిగా ఉంది. కాస్త కాఫీ తాగితే బావుండుననుకున్నా కానీ బద్ధకం ముందు కాఫీ సెకండరీ అయిపోయింది. మొబైల్ తీసుకుని ఇయర్ ఫోన్స్ తగిలించుకుని ఇష్టమైన పాటల పొదికని తెరిచి ఒక పాటని ఎంపిక చేసుకుని వినడం మొదలెట్టాను. " నేనొక అనామికను ఈ కథలో అభిసారికను" .. ఏదో రిలీజ్ కాని చిత్రంలో పాట. ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. వినడంలో ఇష్టంగా లీనమైపోయాను.
కొంచెం సేపటికి ఒకమ్మాయి వచ్చి నా ప్రక్కన కూర్చోబోతూ .. విండో సీట్ నాకిస్తారా! అనడిగింది. ఏ సీటైతే ఏమిటీ గమ్యస్థానం చేరకపోతామా పైగా కృష్ణమ్మ బిర బిరలు చూసే భాగ్యం కూడా లేదని నాకనిపించి ఎడమ వైపుకి జరిగి కూర్చున్నాను. ఆమె విండో ప్రక్క సీట్లో హమ్మయ్య అనుకుంటూ కూర్చుంది. బస్ బయలు దేరటానికి సిద్ధంగా ఉన్నట్లు స్టార్ట్ చేసి పెట్టుకుని కొంచెం సేపు ప్లాట్ ఫారం మీదే ఉంచడం డ్రైవర్ కి అలవాటనుకుంటా ! ఇంతలోకి ఒక వ్యక్తీ బస్ ఎక్కాడు . డోర్ దగ్గరే నిలబడి బస్ అంతా పరికించి చూసి దిగేసాడు. మళ్ళీ అనుమానంగా బస్ ఎక్కి చూస్తున్నాడు. ఏంటయ్యా ! వస్తావా రావా? మీవాళ్ళు ఎవరైనా రావాలా అని డ్రైవర్ అడుగుతున్నాడు. ఆతను మాట్లాడకుండా దిగేయగానే బస్ కదిలింది.
నా ప్రక్కన కూర్చున్న అమ్మాయి అతన్ని చూస్తూనే ఉంది. అతను క్రిందికి దిగగానే ఆమె చేతిలో ఉన్న ఫోన్ ని సైలెంట్ ప్రొఫైల్ లోకి మార్చడం చూసాను . ఆమెకి ఒక కాల్ వచ్చింది . ఆ కాల్ వంక చూస్తూ ఉండిపోయింది కానీ లిఫ్ట్ చేయలేదు. బేగ్ లో ఉన్న రెండో ఫోన్ తీసి చక చక ఒక నంబర్ డయల్ చేసి తల వంచి " వాడికి అనుమానం వచ్చింది " బస్ స్టాండ్ కి వచ్చి ప్రతి బస్ ని చెక్ చేస్తున్నాడు. నేను బురఖా వేసుకుని ఉన్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే గుర్తు పట్టేసేవాడే! నేను మళ్ళీ చేస్తాను. వాడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు . ఫోన్ తీయక పొతే అనుమానం వస్తుంది అని కట్ చేసి ..." ఆ చెప్పు ఏంటీ! ఫోన్ చేసావ్ ? " అవతల ఏం మాట్లాడుతున్నాడో వినబడదు కదా అప్పటికే బస్ కృష్ణ లంక దాటేస్తుంది. “నేను కాలేజ్ కి వెళుతున్నానని చెప్పాను కదా ! ఇప్పుడే ప్రభాస్ కాలేజ్ వైపు వెళ్ళడానికి ఆటో ఎక్కుతున్నాను. తర్వాత మాట్లాడతాను” అని చెప్పి ఫోన్ కట్ చేసింది.
మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలి అడిగింది. ఏమిటి అన్నట్టు చూసాను నాకొక ఫోన్ వస్తుంది . మీరు నేను కలసి ఒక ఆటోలో సింగ్ నగర్ స్టాప్ లో నుండి ప్రభాస్ కాలేజ్ వైపుకి వెళ్ళే ఆటో ఎక్కామని చెప్పాలి. ప్లీజ్! చాలా ప్రాబ్లం లో ఉన్నాను అంది . ఆమె చెప్పేది వింటూనే నాకు చాలా అయోమయంగా అనిపించింది కానీ పాపం ఏదో ప్రాబ్లం అంటుంది కదా ! అనుకుని అలాగే అని తల ఊపాను నేను అలా అంగీకారం తెలపగానే .. ఒక నంబర్ కి కాల్ చేసి మా ఆయన లైన్ లోకి వస్తాడు మీకు ఇందాక చెప్పినట్లు చెప్పండి అని ఫోన్ నాకిచ్చింది . చెవి దగ్గర పెట్టుకున్నాను అటువైపు నుండి ఒక మాట కూడా అర్ధం కాలేదు. నేను ఒప్పుకున్న విషయం నెత్తి మీద పెద్ద బరువులా తోచి .. నేను మీ ఆవిడ ఇప్పుడే సింగ్ నగర్ దగ్గర ఆటో ఎక్కాం. ప్రభాస్ కాలేజ్ దగ్గర దిగిపోతాం అని గబా చెప్పేసి ఆ అమ్మాయికి ఫోన్ ఇచ్చేశాను. “విన్నావుగా, ఇక సాయంత్రం వరకు డిస్ట్రబ్ చేయకు నేను ఫోన్ స్విచ్ ఆపేస్తున్నా ! క్లాస్ లకి వెళ్ళాలి కదా ! సాయంత్రం ఆన్ చేస్తా.” అంటూ ఆ ఫోన్ స్విచ్ ఆపేసి ఇంకో చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని వేరొక అతనితో మాట్లాడుతుంది . అతనితోనే అని ఎందుకు అనుకున్నానంటే ..” వెధవ! వాడితో ఇక సాయంత్రం దాకా గొడవలేదు నేనెక్కడికి రాను బంగారం” అనడగుతుంది . ఆపకుండా ఒకటే కబుర్లు. నాకైతే ఒంటికి కారం రాసుకున్నట్టు ఉంది .
కాసేపటి తర్వాత తనని ఎవరూ గమనించే వారు లేరనుకుని ముఖానికి కట్టుకున్న నఖాబ్ తీసేసింది. నేను ఉలిక్కిపడ్డాను. నుదుటున ఎర్ర రంగు దోస గింజ ఆకారపు స్టిక్కర్. స్కార్ఫ్ , నఖాబ్ కట్టుకుంటే - మొగుడు కూడా గుర్తు పట్టలేడు. ఈ అమ్మాయిలకి ఏం పోయే కాలం వచ్చింది మరీ ఇలా తయారవుతున్నారు. భర్త తో విభేదాలు ఉంటే పెద్దల మధ్య పరిష్కరించుకోవచ్చు లేదా విడాకులు తీసుకోవచ్చు ..ఎందుకీ ముసుగు నాటకాలు ? ప్ర్రాబ్లం లో ఉన్నానని చెప్పి నాతో అబద్దపు సాక్ష్యం చెప్పించినందుకు కోపం చిరాకోచ్చేసింది నాకు.
ఆ అమ్మాయి వంక కూడా చూడకుండా ప్రక్క సీట్ వైపు చూసాను . అక్కడ ప్రక్క ప్రక్కనే కూర్చున్న అమ్మాయి అబ్బాయి . అమ్మాయి టైట్ జీన్స్ వేసుకుని పైన టీ షర్ట్ వేసుకుంది. శరీరంలో ఒంపుసొంపులన్నీ గీత గీసినట్లు కనబడుతూనే ఉన్నాయి . ముఖానికి మాత్రం స్కార్ప్ కట్టుకుని ఉంది . ప్రక్కన కూర్చున్న కుర్రాడి చేయి ఆమె ఒంటిమీద నాట్యం చేస్తూ ఉంది . నా వెనుక సీట్ లో కూర్చున్న కళ్ళద్దాల పెద్ద మనిషి పేపర్ చదువుకుంటున్నట్లు నటిస్తూనే ఎడమ ప్రక్కన సీట్లో కూర్చున్న జంట రొమాన్స్ ని ఆస్వాదిస్తూ సొంగ కార్చుకుంటున్నాడు. ఛీ.. ఛీ! సభ్యత సంస్కారం లేకుండా పోతుందీ జనాలకి విసుక్కుంటూ నేను వెంట తెచ్చున్న మాస పత్రిక తీసి అందులో మునిగిపోయాను.
కొద్ది సేపటికే నా ఎడమ ప్రక్క సీట్లో కూర్చున్న అమ్మాయి లేచి వాళ్ళ వెనుక సీట్లో కూర్చున్నతనితో గొడవ పడసాగింది . యూ.. రాస్కెల్! ఎన్నిసార్లని చూస్తూ ఊరుకుంటాం. వెనుక సీట్లో కూర్చున్న వాడివి బుద్దిగా కూర్చుని నీ ప్రయాణం నువ్వు చేయి. ముందు సీట్లో ఉన్న నన్ను టచ్ చేస్తావెందుకు ? కోపంగా అడిగింది నిన్ను నేను టచ్ చేసానా, నేను టచ్ చేసానా! సరిగ్గా చూసుకో ఎవరు టచ్ చేసారో. పబ్లిక్ లో ఉన్నామనే సెన్స్ లేకుండా బస్ లో కూర్చుని రొమాన్స్ చేస్తున్న మీకు అందరూ అలాగే కనబడుతున్నరేమో అన్నాడు. ఆ అమ్మాయి రెచ్చిపోయి ఎవరు టచ్ చేసిందో నాకు తెలియదనుకున్నావా ? ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు. అంటూ ఇదిగో అజయ్ ఈ ఉంగరం ఉంచుకో ! ఎవడో బద్మాష్ గాదు పదే పదే నా ఒంటిమీద టచ్ చేస్తూ మైమరుపులో పడిపోతే వాడి వ్రేలి నుండి ఈ ఉంగరం లాగేసా ! కసిగా అని కూర్చుంది. ఆ వెనుక సీట్లో కూర్చున్న పెద్దమనిషి ఎడమచేతి వ్రేలి వైపు చూసుకుంటూ కిక్కురుమనకుండా కూర్చున్నాడు. ఇవన్నీ చూస్తుంటే చాలా అసహ్యమేసింది. లేచి వెళ్ళిపోయి ఆఖరి సీట్ లో కూర్చున్నాను .
నా ప్రక్కనే కూర్చున్న పిల్ల హాయిగా ప్రశాంతంగా పుస్తకం చదువుకుంటూ ఉంది నన్ను చూసి పలకరింపుగా నవ్వి .. ప్రతి రోజు ఈ బస్ లలో ఇలాగే గొడవలు పడుతుంటారు అంది . నేనేమీ మాట్లాడలేదు . యూనివర్సిటీ స్టాప్ వచ్చింది. అక్కడ చాలా మంది ముసుగు వేసుకున్న అమ్మాయిలూ , ఆ జంట కూడా దిగేశారు. వాళ్ళ దారులు వేరైయ్యాయి .
యూనివర్సిటీ లోపలకి వెళుతున్న అమ్మాయిలని చూసాను . సీతాకోకచిలుకల్లా రంగు రంగుల బట్టలు వేసుకుని అందరూ ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని ఉండారు . అమ్మాయిల ముఖం కనబడకుండా దాచుకున్నంత మాత్రాన వాళ్లకి రోడ్ సైడ్ రోమియోల వల్ల ఈవ్ టీజింగ్ తగ్గుతుందా !? అందంగా ముఖం ఉన్నా లేకపోయినా ఆకారం కనబడుతూనే ఉంది గా ! పైగా అవయవ సౌష్టవాన్ని కనబడకుండా బట్టలు వేసుకుంటున్నారా అంటే అదీ లేదు. ఎవరిని మభ్య పెట్టడానికి ఈ ముసుగులు !? ఈ ముసుగులు వల్ల రక్షణ ఏమైనా ఉందా ? తల్లిదండ్రులకి కూడా బిడ్డల ప్రవర్తన పట్ల నమ్మకం పోతుంది. ఏమైనా అంటే మీకేమి తెలియదు మీరు ఊరుకోండి అంటూ విదిలించి పడేస్తారు. దారిపొడవునా ఆలోచిస్తూనే ఉన్నాను .
గుంటూర్ బస్టాండ్ దగ్గరకి రాగానే లోపలకి వెళ్ళకుండానే నేను బస్ దిగుదామని లేచి నిలబడ్డాను. నేను మొదట కూర్చున్న సీట్ లో అమ్మాయి బురఖా వేసుకునే బస్ దిగిపోయి నా ముందు నుండే ఎవరిదో బండెక్కి తుర్రున వెళ్ళిపోయింది. పాపం ఆ మొగుడి అనుమానం నిజమే అయి ఉంటుంది ఈ కాలపు అమ్మాయిలూ మాములుగా లేరు అనుకున్నాను . నా ప్రక్కన కూర్చున్న అమ్మాయి లేచి నింపాదిగా బేగ్ లో పెట్టుకున్న బురఖాని తీసి తొడుక్కుంది . నేను ఆ అమ్మాయి వంక ఆశ్చర్యంగా చూస్తున్నాను. నన్ను చూసి చిన్నగా నవ్వి నాతో పాటు బస్ దిగిపోయింది.
నేను సిటీ బస్స్టాప్ వైపు అడుగులు వేస్తున్నాను ఆ అమ్మాయి నాతొ పాటే నడుస్తూ .. ఎక్కడికి వెళ్ళాలి ఆంటీ అడిగింది చొరవగా. బృందావన్ గార్డెన్స్ అన్నాను . అదిగో ఆ బస్ వెళుతుంది అంటూ ఎక్కేసింది. నేను దిగే స్టాప్ లోనే దిగి నాతో పాటే నడుస్తూ ఎక్కడికి వెళుతున్నారు అంది దగ్గరలోనే నూతన గృహప్రవేశ ఆహ్వానం అన్నాను తనూ అక్కడికే అని చెప్పింది . లోపలకి రాగానే మళ్ళీ బురఖాని విప్పేసి బాగ్ లో కుక్కేసి .. ఇప్పడు హాయిగా ఉంది అని నా వైపు చూసి స్నేహంగా నవ్వింది . నీ పేరేమిటమ్మా అడిగాను . షహనాజ్ మేడం అని చెప్పింది. నా గురించి అడిగింది చెప్పాను. “మీరు నా ఫ్రెండ్ కి ఆంటీ నా !? శృతి ఇక్కడ లేకపోయినా గృహప్రవేశానికి వెళ్ళమని కాల్ చేసి మరీ మరీ చెప్పింది. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ . అందుకే వచ్చాను. శృతి కూడా మీ గురించి అప్పుడప్పుడూ చెపుతూ ఉండేది. ఇలా మిమ్మల్ని కలవడం చాలా సంతోషం” అంది.
షహనాజ్ చాలా కలుపుగోలు మనిషి. ఇంగ్లీష్ టీచర్ గా కూడా పని చేస్తుందట. తన మతాచారాల పట్ల ఎంత గౌరవం ఉందో అంతకి మించి చాందసవాదం పట్ల విముఖత ఉందని గ్రహించాను. మధ్యాహ్నం భోజనాల తర్వాత ఎవరూ అప్పటికప్పుడే ఇళ్ళకి వెళ్ళడానికి ప్రయాణం కట్టకూడని షరతు పెట్టింది మా మరదలు. చుట్టాలందరూ ఉండిపోయారు కూడా ! సరదాగా ఆటాపాటా లతో పాటు రకరకాల పోటీలు నిర్వహించారు కిట్టీ పార్టీల అనుభవం అనుకుంటా ! అందరూ భలే చురుకుగా ఉన్నారు. అందరిలోకి నేనే వెనుకబడి ఉన్నాను. నన్ను గెలిపించి బహుమతి ఇవ్వాలని నా మరదలికి తట్టిందో ఏమో స్త్రీలకి కవితల పోటీ నిర్వహిస్తే బావుంటుంది అని అనౌన్స్ చేసింది ఆ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను కూడా ! నాకన్నా ముందు షహనాజ్ పేరు వచ్చింది. ఆమె "ముసుగెందుకు" అనే కవిత చదివింది. ఆ కవిత నాతో పాటు చాలా మందికి నచ్చింది . హాలంతా కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది. నేను కవిత్వం వినిపించకుండా ముసుగు గురించే మాట్లాడాను . వాతావరణ కాలుష్యం నుండి కాపాడుకోవడానికో చర్మ సంరక్షణ కోసమో అమ్మాయిలూ స్కార్ఫ్ కట్టుకోవడం లేదని ఆకతాయీ అబ్బాయిల నుండి రక్షించుకోవడానికి కూడా ఎక్కువమంది స్కార్ఫ్ కట్టుకోవడం లేదని ఆ రోజు జరిగిన బస్ అనుభవాలని వివరించి ముసుగులు విడనాడాలని నేను కోరుకుంటున్నానని చెప్పాను. అక్కడున్న అమ్మలందరూ నాతో ఏకీభవించారు కూడా ! అలా చాలా చాలా విషయాలు మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా మధ్యాహ్నం అంతా గడచిపోయింది .
చీకటి పడబోతుండగా షహనాజ్ నేను` ఇద్దరం కలిసే తిరుగు ప్రయాణమయ్యాం. దారంతా సంప్రదాయం పేరిట పరదా వెనుక నలిగిపోతున్న తన లాంటి ఆడపిల్లల గూర్చి చెపుతూనే ఉంది. తామెంత స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నామో బురఖాని విడనాడాలని అనుకుంటున్నామో కూడా చెప్పింది. ఆశ్చర్యంగా అనిపించింది నాకు.
షహనాజ్ తన గురించి మరింత వివరంగా చెప్పింది. ఎమ్ ఏ బి ఈ డి చేసాను . ఈ గుంటూరు లోనే ఉద్యోగం చేసేదాన్ని విజయవాడ కి చెందిన బ్యాంకు ఎంప్లాయ్ మ్యాచ్ వచ్చింది బోలెడంత కట్నం ఇచ్చి పెళ్లి చేసారు . ఉద్యోగం చేస్తూనే ఉన్నాను . ఇద్దరు పిల్లలు పుట్టారు . వాళ్ళ పెంపకం అంతా అమ్మ చూసుకునేది. మా ఆయనకీ నెల్లూరు ట్రాన్స్ ఫర్ అయింది. నాకేమో జీతం పెరిగింది . ఉద్యోగం మానేయమన్నారు . నేను మానేయలేదు అమ్మ నాన్న సాయంగా ఉందామని ఉన్న ఊరు వదిలేసుకుని గుంటూరుకి కాపురం వచ్చేసారు. ఒక ఏడాది అలా గడిచిందో లేదో మా మధ్య గొడవలు వచ్చేసాయి. బురఖా లేకుండా కాలేజ్ లో తిరుగుతున్నానని అమ్మానాన్నల అండ చూసుకుని పెట్రేగి పోతున్నానని మా ఆయన కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాననే గర్వంతో ఎవరిని లెక్క జేయడం లేదని మా అత్తగారు గొడవ పెట్టుకునే వాళ్ళు . ఆఖరికి ఉద్యోగం మానేసి అత్తవారింట్లో కాపురం ఉంటేనే నాతోనే కలసి ఉంటానని మా ఆయన పేచీ పెట్టాడు. విసిగిపోయాను. జాబ్ కి రిజైన్ చేసేసి అత్తారింటికి వెళ్ళిపోయాను. జీవితం గురించి ఏవేవో కలలు కంటాం కానీ పీడకలల్లాంటి జీవితం మన ముందు ఉంటుందని ఇప్పుడు తెలుస్తుంది. నలభయ్యి వేల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని ఒదులుకుని ఇప్పుడు ఇంటిప్రక్క స్కూల్ లో ఎనిమిదివేల రూపాయల జీతంతో టీచర్ గా చేస్తున్నా. అదీ అత్తగారు అడుగడుగునా విధించే ఆంక్షలతో అంటూ నవ్వుతూ చెప్పినా అందులో ఉన్న బాధ నాకర్ధమయ్యింది . మెల్లగా ఆమె చేతిని నా చేతిలోకి తీసుకుని ఓదార్పు వచనాన్ని సరఫరా చేసాను .
బస్ టోల్ గేట్ దగ్గరలో ఆగిపోయింది. ముందు చాలా వాహనాలు ఉన్నాయి. అన్నీ కదిలి టోల్గేట్ చెకింగ్ దాటేసరికి వర్షం ప్రారంభమయ్యింది. చలికాలంలో వర్షాకాలం. షహనాజ్ సన్నని కూనీ రాగంతో ఏవో పాటలు పాడుకుంటుంది. భలే పాడుతున్నావే అన్నాను . అవన్నీ ఇంట్లో బంద్. కనీసం మా అమ్మాయి తరానికైనా మా సంప్రదాయాలు మారితే బావుండును. అందుకోసమే నేను పోరాడుతున్నాను మా వాళ్ళని కూడా మార్చాల్సిన అవసరం ఉంది . నేనొక్కదాన్నే మారాలనుకుంటే విడాకులు తీసుకుంటే అయిపోయి ఉండేది మేడమ్, కానీ నేనలా అనుకోవడం లేదు. మా బంధువులందరికీ ఒక్కొకటి అర్ధమయ్యే రీతిలో చెప్పుకుంటూ పోతున్నా ! నా రహస్య అజెండా వారికి తెలియదు అని నవ్వింది. ఆ మాట అర్ధమై నేను నవ్వేసా !
సంప్రదాయాలని విసర్జించి స్వేచ్ఛగా మసలాలని షహనాజ్ లాంటి వారు కోరుకుంటుంటే అదే ముసుగు వేసుకుని పెడదారిన పడుతున్న కొందరిని చూస్తున్నా. మంచికి చెడుకి ఒకే కత్తి లాగా బురఖా, స్కార్ఫ్ మారడం చూస్తూన్నాం అనుకున్నాను. యాసిడ్ దాడులు, ప్రేమోన్మాదులు,ర్యాగింగ్ వికృతాలతో పాటు స్కార్ఫ్ మోసాలు కూడా ! బస్ దిగే టప్పుడు ప్రొద్దున బస్ బస్ వెదుకుతున్న అబ్బాయి మళ్ళీ కనిపించాడు . బహుశా అతని భార్య ఏ వారధి దగ్గరో దిగిపోయి ఆటో ఎక్కేసి ప్రభాస్ కాలేజ్ దగ్గరకి వెళ్ళి పోయిందని తెలుసుకోలేలేడేమో కూడా అనుకున్నాను మనసులో .
వర్షం కురుస్తూనే ఉంది. ఇద్దరం తడుస్తూనే సిటీ బస్టాండ్ వైపు నడుస్తున్నాం. సడన్ గా మా ఇద్దరి ముందు అతను. ఏయ్! ఏమిటిలా దారికి అడ్డం పడుతున్నావ్ .. తప్పుకో అంటూనే ఉన్నా . అతను ప్యాంట్ జేబులో నుండి కత్తి తీసి షహనాజ్ పొట్టలోకి దించేసాడు. భయంతో వెర్రి కేకలు పెట్టాను. మళ్ళీ ఇంకోసారి పొడిచేశాడు. పొడిసిన కత్తిని పైకిలాగి క్రింద పడేసి షహనాజ్ తలకి కట్టుకున్న నఖాబ్ ని లాగిపడేసి అలాగే నిలబడిపోయాడు . క్రింద పడిపోతున్న షహనాజ్ ని పట్టుకుని హెల్ప్ హెల్ప్ అని కేకలు పెట్టాను . రక్తం ధారలుగా కారుతుంది వర్షపు ధారలలో కలసి పారుతుంది అది చూసాక వర్షం నా కళ్ళల్లో కురుస్తుంది.
నా కేకలకి చుట్టూ ఉన్న మనుషులు మమ్మల్ని చుట్టేసి జరిగింది అర్ధమై పారిపోకుండా అతన్ని గట్టిగా పట్టుకున్నారు . పోలీస్ లు వచ్చేసారు , అంబులెన్స్ లో షహనాజ్ ని ప్రక్కనే ఉన్న హాస్పిటల్ కి తీసుకు వెళ్ళారు తనతో నేనూ వెళ్ళాను . కత్తిపోట్లు అంత బలంగా తగల్లేదు కాబట్టి షహనాజ్ కి ప్రాణ భయం ఏమీ లేదు కానీ .. ఆమె ఇంటి వాళ్ళని తలచుకుంటే ఒణుకు వచ్చేసింది. ఈ సంఘటన దేనికి దారి తీస్తుందో అర్థం కాలేదు. ఆమె ఇంటి వాళ్ళందరూ హాస్పిటల్ కి వచ్చారు. నేనేవరనే ఆరాలు అనుమానపు చూపులు. షహనాజ్ మామగారు విషయాన్ని సేకరించుకొచ్చారు. పొడిచినతన్ని కత్తితో సహా టూ టవున్ పోలీస్ స్టేషన్ కి తీసుకు వెళ్ళారని . అతను చెప్పిన మాటలు ఏమిటంటే తన భార్య బురఖా వేసుకుని ప్రియుడితో తిరుగుతూ తనను మోసం చేస్తుందని .. ఆ రోజు ప్రొద్దున్నే ఆ నల్ల చీర కట్టుకున్నామె ప్రక్కన కూర్చుని ప్రయాణం చేస్తుంటే తను చూశానని . . తిరిగి వచ్చేటప్పుడు బురఖా వేసుకుని వచ్చేది కూడా తన భార్యే అనుకుని చంపేయబోయానని చెప్పాడట . ఇంకా ఒణికి పోయాన్నేను.
(2015 నవంబర్ 8 ఆదివారం ఆంధ్రజ్యోతి ప్రచురితం)
2, నవంబర్ 2015, సోమవారం
వస్త్రాపహరణమొక సంస్కృతి
ఏ జాతి అని అడగకండి .
అన్ని పర్వాలు ఇక్కడుంటాయి ఆధునీకరణ చేసుంటాయి
ఇక్కడ జాతులకి కొన్ని ధర్మాలుంటాయి
స్వజాతికే ధర్మం కొమ్ముకాస్తుందన్నట్టు
అనుకుంటే పొరబాటే !
ఒక్క ఓట్ల కాలమప్పుడు తప్ప క్రమంతప్పని ఋతువుల్లా
మతం కులం జాతి లింగ వర్గ పేద ధనిక తారతమ్యం మరీ ఉంటుంది
ఇక్కడధికారం అణువణువునా కాపుకాస్తుంది
పాపమని సొంత రాజ్యాంగం రాసుకున్నారేమో ,
ప్రశ్నించే అధికారాన్ని కాలరాస్తూ కాళ్ళతో మట్టగిస్తూ
బట్టలూడదీస్తారు కళేబరాల్ని ఈడ్చినట్లు నడి రోడ్దున పడేస్తారు
చెత్త మనుషులనుకుని చెత్త ఊడ్చి పడేసినట్లు వదిలేస్తారు
నిశ్చే ష్టులై నడి రోడ్డుపై నిలుచుంటే
నగ్నత్వాన్ని కథలుగా చెప్పుకుంటూ నిలబడిన లోకులు
కాకులు కూడా కాలేకపోయారు
ఇక్కడ కాకులకి కులముంది మతముంది
మౌనంగా ఉపేక్షించే చచ్చుజాతి పుచ్చుజాతికి
నిలబడిన చోట సంఘీభావం తెలపడానికి కూడా భయమే
ఎవరి ఆయుధం వారి చేతిలోనే ఉండాలిప్పుడు
అరువు ఆయుధాలు ఎన్నటికి దొరకవు
చీరకొంగుల్లో చిటికెడు కారమైనా దాచుకోకుండా
చేతిలో చిన్న చురకత్తైనా లేకుండా ..పిర్యాదు చేయడానికి వెళ్ళకండి .
మీ మీద లెక్కలేనన్ని పిర్యాదు లుంటాయక్కడ
బట్టలిప్పుకుని బరి తెగించి దేశం పరువు తీస్తున్నారని
లేదా దేవతా వస్త్రాలు ధరించడం
తోళ్ళు తాటాకులు కూడా రహస్యంగా తీసుకెళ్ళండి
ఏం జరిగినా రహస్యంగా దాచుకోండి.

.jpg)

