27, మే 2016, శుక్రవారం

మౌన శతఘ్ని

సినీ గీత రచయితగా జనులందరికి  తెలిసిన "భువన చంద్ర " గారు మంచి రచయిత అని  వెబ్ పత్రికలలో  విరివిగా వస్తున్న వారి రచనలు, ప్రింట్ మీడియాలో వచ్చిన కథల ద్వారా తెలుస్తుంది.   నది మాసపత్రిక జన్మదిన ప్రత్యేక కథా సంచిక లో వచ్చిన "భువన చంద్ర" గారి  "మౌనం " కథని ఇటీవలే చదివాను. చదివిన తర్వాత మనసుకి ఉక్కపోసినట్లైంది. ఆ ఉక్కపోత నుండి బయటపడాలంటే స్పందననే  శీతలపవన పరిమళాలని వెదజల్లడం తప్ప వేరే మార్గం లేదనిపించింది.

"మౌనం" కథ మౌన శతఘ్ని లా పేలింది.  కథ సాధారణమైన కథే కదా అనిపించే అసాధారణమైన కథ. " దేవుడు గారు కాసేపు  నువ్వూ ఇక్కడికొచ్చి పడుకోరాదు. ఒక్క సారైనా నామాట విను ఇలాంటి చోటు నీకు దొరకనే దొరకదు. చావుకి  పుటక్కి అతీతమైన చోటు అది అక్కడికొచ్చి నిద్రపోకూడడూ అని కోరుకుంటాడు. మళ్ళీ అంతలోనే ఈ మనుషులే దేవుడు  ఎప్పుడు నిద్ర పోవాలో నిర్ణయించిన  సమయాలు  గుర్తుకు తెచ్చుకుంటాడు.
మానవుడు వ్యక్తే కానీ వ్యక్తి స్వేచ్చ లేనివాడు ఆత్మ స్వేచ్చ లేనివాడు . దేవుడికి కూడా స్వేచ్చ ఇవ్వనివాడు " అని నిర్మొహమాటంగా మానవరీతిని గర్హిస్తారు.

మనిషి గర్భస్థ శిశువుగా ఉన్నపుడు నుండే ఎందరి  ఆశలో మోపబడినవాడు. నా వంశాంకురం, మా ఇంటి మహాలక్ష్మి అంటూనే పెద్దవారి ఆకాంక్షలని ఆశలని మోసేవాడు. గోరుముద్దలు తింటూ చందమామ వస్తాడని రెక్కల గుర్రం పై ఎగిరిపోవాలని ఆశగా ఎదురుచూసిన వాడు. పెద్దలు చెప్పిన అబద్దాలని మురుగుపాల రుచితో ఆస్వాదించి తర్వాత అబద్దాలని అర్ధమై అసహ్యించుకున్నవాడు. తన వారి ఆశలని తిని తాగి శ్వాసించి విశ్వసించి విసర్జించి మళ్ళీ కొత్త ఆశలతో కొత్త రోజుని ప్రారంభించేవాడు.  తన పుట్టుక,  కులం ,మతం, చదువు , ఉద్యోగం,వివాహం అన్నీ ఇతర ఆశల మేరకు మోస్తున్నమనిషి గురించి మదనపడేవాడు. ఆగి ఆగి కథ చదువుకుంటూ మనం మధనపడే కథ ఇది . కథలో ఎవరికీ వారికి  ఎన్నో రుజువులు దొరుకుతాయి.  ఈ కథలో మనిషి తనవారందరిచేత నియంత్రించబడిన మనిషి. 

అడుగడుగునా తఃల్లితండ్రి తోడ బుట్టినవారు  భాగస్వామ్యి  నియంత్రణ పిల్లల గొంతెమ్మ కోరికలు అవి తీరక పొతే వచ్చే అసంతృప్తుల సెగల ధాటికి కుళ్ళి కునారిల్లే మనిషి  యొక్క మౌనపు ముసుగుని బట్టబయలు చేసిన కథ ఇది. ఈ కథ చదివి ఉల్కి పడ్డాను. అలా ఉల్కి పడకపోతే మన దగ్గర  మనుషుల అనవసర మౌనం ఏమిటో మనకి అర్ధం కానట్టే !  మనసు సంగతి బహిర్గతం కాని ఎన్నో ఊసులు అభిప్రాయాలు అన్నీ గొంతు క్రిందే అణిచి వేయబడతాయి. తల్లిదండ్రుల ఆశలని భార్య ఆకాంక్షలని, బిడ్డల మనసెరిగి కోరికలని తీర్చలేని అసమర్ధ మానవుడి మౌనం ఇది. శిలలా మారిన మనిషి కథ ఇది నువ్వు నేను ఇద్దరం శిలలమే లేదా బండరాళ్ళమే పోనీ గులకరాళ్ళం అంటూ పాఠక  నిశ్చల మానస సరోవరంలో ఒక గులకరాయిలా పడింది . ప్రతి ప్రశ్న ఒక గులకరాయి. ఆలోచనా తరంగాలు వలయాలు వలయాలుగా విస్తరిస్తున్నాయి. ఆ మౌనం  అక్షరాలలో భగ్నమైన కథ ఇది.    చిన్నప్పుడు తల్లి పాడిన చందమామ రావే పాటని గుర్తుకు తెచ్చుకుంటూ  ఎవరైనా అలాంటి  పాటే పాడుతూ నిద్రపుచ్చమని కోరుకుంటూ   సమాధిలో నిద్రపోవడానికి త్వరపడి పోయే పాత్ర.

ఈ కథ ముగిసిన తర్వాత అలా అచేతనంగా ఉండిపోయాను. నాకు జన్మ నిచ్చిన వారిని, నా రక్తం పంచుకు పుట్టిన వారిని, జీవితాన్ని పంచుకున్న వాడిని, కడుపునపుట్టిన బిడ్డని అందరిని తలుచుకున్నాను. వారితో నాకున్న సంబంధ బాంధవ్యాలని సమీక్షించుకున్నాను.   ఆత్మ విమర్శ చేసుకున్నాను.మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే, ఆశా నిఘాతాలే అని అర్ధమైపోయింది. అర్ధంకాని దుఖమేదో తిష్టవేసింది. ఒకటి మాత్రం నిజమనిపించింది.  . తమ ఆజ్ఞాలకి కట్టుబడి ఉండాలని ప్రేమ పేరుతొ ఆదేశించిన ప్రతిసారి మనిషి నియంత్రించబడినట్టే! అలా ఆజ్ఞాపించినవాళ్ళు ఎవరైనా కావచ్చు. ప్రతి నియంత్రణ ఉరి లాంటిదే. నియంత్రణల మధ్యే మనిషి బ్రతుకు ముగిసిపోతుంది.
.
"ఖలీల్ జిబ్రాన్".ఇలా.. అన్నారని ఎక్కడో.. చదివాను."పిల్లలు.. ప్రకృతి ప్రసాదించిన వరాలు.నరజాతి భవిష్యత్తుకు ప్రతీకలు. పిల్లలు మననుంచే వచ్చారు..కానీ వాళ్ళు మనకు మాత్రమే.. సంబంధించిన ఆస్తులు కాదు. మన వ్యక్తిగత ఆకాంక్షల తోను,బలహీనతలతోను పిల్లల  మీద రుద్ది వాళ్ళ జీవితాలను నరకప్రాయం చేయడం అమానుషం. పిల్లలలో.. శక్తి -సామర్ద్యాలువికసించేలా  ..చేయడం, వ్యక్తిత్వం రూపొందేలా..శాయశక్తులా కృషి చేయడం,ఎదిగాక ప్రేమించే స్నేహితులుగా..వారికి ఆత్మీయతని పంచడం మన ధర్మం. " అని.  కానీ మనం మాత్రం అస్సలలా  ఉండలేము . మన వారిని  మనం చేరుకోలేని లక్ష్యానికి చేరే  బాణం గా మార్చే  ధనుస్సులం మనం.


మానవజీవితానికి నైతిక విలువలు ఉత్తమ మానవీయ విలువలు నేర్పడానికి మత గ్రంధాల అవసరాన్ని మనం త్రోసి పుచ్చలేం కానీ   మానవ వారసులని లోకానికి అందించే క్రమంలోనూ  వారి అభివృద్ధిని కాంక్షించడంలోనూ పిల్లలపై  ఆధిపత్యం వహిస్తున్నామేమోనని అనిపించక మానదు. అలాగే భార్య /భర్త కూడా వ్యక్తి స్వేచ్చని హరించి మన మంచి కోసమేగా చెపుతుంది అని తీర్మానించేస్తారు. ఈ కథలో అన్ని పాత్రలున్నాయి. మనిషి మౌన మరణానికి  అందరూ కారకులే !

తనకి కావాల్సింది ఏమిటో తెలిసిన వాడు చొరవగా తీసుకోగల్గినవాడు జీవితాన్ని ఆస్వాదిస్తాడు. ఈ కథలో నాయకుడు  అలాంటి చొరవ చేయలేనివాడు, పిరికివాడు క్షణం క్షణం భయపడుతూ,బాధపడుతూ ,నిసృహతో కాలం వెళ్ళదీస్తాడు తప్ప ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేయడు పాపపుణ్యాల బేరీజులో తనమునకలై ఉంటాడు కాబట్టి. జీవితమంటే జీవితాన్ని ప్రేమించడమే అని తెలియక దశాబ్దాలుగా మౌనం వహించినవాడు. బంధాలన్నీ హింసే అన్న సత్యం ఎరిగినవాడు.  మనసు నిండా  కాలం వేసిన చేదు  గురుతులతో కాలసర్పం కాటుకై ఎదురుచూస్తుండటంతో కథ ముగుస్తుంది .  పిల్లలు మన నుంచి వచ్చిన వాళ్ళే కాని వాళ్ళు ప్రవర్తన తల్లిదండ్రులని అమితంగా బాధిస్తుంది. కృతజ్ఞత లేని పిల్లలు నాగుబాము లాంటి వారంట ఎక్కడో చదివిన వాక్యం గుర్తుకువచ్చింది. మనం మరిచిన బాధ్యతలేమైనా ఉంటే ఆ దిశగా కార్యోన్ముఖులని చేస్తుంది.

మిగిలిన జీవితంలో నేను చేయాల్సిన పనేమిటో నాకు స్పష్టంగా బోధపర్చిన కథ ఇది. చీకటిని చూసి చూసి నొప్పి పుట్టిన కళ్ళకి వెలుతురు నిచ్చిన కథ ఇది .

ఈ కథ చదివిన ఎవరికైనా ఇలాంటి సృహ కలగాలని మనఃస్పూర్తిగా కోరుకుంటూ ... ఇలాంటి కథలు మరెన్నో వ్రాయాలని కోరుకుంటూ ...

భువనచంద్ర గారికి అభినందనలతో ...
మౌనం    కథ ని ఈ లింక్ లో చదవండి .

25, మే 2016, బుధవారం

బయలు నవ్వింది




మాధవయ్య గారు రచ్చబండ పై కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉండాడు. జేబులో పెట్టుకున్న ఫోన్ మోగింది.
అక్క చేసి ఉంటది అనుకుంటూ పచ్చ బటన్ నొక్కి చెవికాడ పెట్టుకున్నాడు.

"మాధవా , నాస్టా చేసావా,కాఫీ తాగావా ? రాజ్యం పెట్టిందా, హోటలికి పోయి తిన్నవా? అని ప్రశ్నలు.

"ఎట్టోగట్టా తిన్నాలే! నువ్వు అమ్మి దగ్గర ఉండాలని వెళ్ళావుగా  .. బాగుందా ఆ పట్టణం ? "

"ఆ ఏం బాగు లేరా  ! పొద్దస్తమానూ ఆ టీవి ముందు  కూకోటం,లేదా ఫోన్లో టికీ టికీ మని నొక్కుకోవడం. ఇదే సంబడం అయిపాయే. కాకపొతే మన వూరుకన్నా ఈ  బెంగులూరే నయమనిపించే,  ఏడ చూసినా  చెట్లే, అగ్గిపెట్టెల్లాంటి గదుల్లోంచి రేపటేల,పయిటేల పద్దతిగా బయటకొస్తారు, పిల్లలని  పార్కులల్లో ఆడిచ్చుకుంటారు. బాగానే ఉండాది గానీ  పక్కనాల్లతో మాట్టాడదామంటే ఆళ్ళ భాష నాకు రాకపాయే ! చిన్నమ్మీ పిల్లలు ఇంటికొచ్చేదాకా బిక్కు బిక్కు మంటా ఉండాలి. పక్కింటాళ్ళతో  కూడా తాళాలేసుకున్న ఇనుపకమ్మీ వరండా  లోనించే   మాట్టాడాలి. కాళ్ళు కట్టేసినట్టు ఉందిరా ! బిన్నా వచ్చేస్తా ! అంటుంటే విని నవ్వుకున్నాడు మాధవయ్య .

కూతురు ఫోన్ తీసుకుని కాసేపు మాట్టాడి .. అత్తమ్మని రిజర్వేషన్  దొరకలేదని ఆపుతున్నా నాన్నా! మనిషి ఇక్కడున్నదన్నమాటే కానీ మనసంతా  ఇంటి మీదే ఉంది.  వచ్చే ఆదివారం తర్వాత పంపుతాలే !  అని చెప్పింది .

అట్టాగేనమ్మా , పిల్లకాయలకి సెలవలు ఇస్తారుగా మీరూ రాకూడదూ , రెండేళ్ళు అయింది వచ్చి. "

సెలవు దొరికితే అల్లాగే వస్తానులే నాన్నా !

ఫోన్ పెట్టేసాక ... అక్క మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు మాధవయ్య.

ఇంటి ముందు మొక్క మాను లేకపోయినా మోటారు బైక్ ఉండాలా , కాడి ఎద్దు లేకున్నా కారు ఉండాలి.   కొట్టాం కారు షెడ్ అయిపోయే . మూడు దినాలకోమారు  పిల్లకాయల్ని చూసే ఒంకతో టౌన్ కి పోవాల చెడీ బడీ కొనేసి భుజం సంచీ దులిపేసుకుని రావడం. గుట్టుగా మట్టంగా కాపురం చేసుకునే పద్దతే లేదాయే, మొగుడు చూస్తే ఆ వరస, పెళ్ళాం చూస్తే ఈ వరస.  పువ్వు నవ్వు, పిట్టల కువ కువ, లే దూడల గెంతులు, పిల్లల అల్లరి అన్నీ పోగొడితిరి.  తోటంతా బయలై పోయింది. ఇల్లంతా మూగవోయింది.బతుకు మీద తీపి ఎట్టా కల్గుతుందిరా!  నేను ఈడ ఉండలేను పది దినాలు చిన్నమ్మి దగ్గరికి పోయోస్తా .. అని వెళ్ళింది కానీ వెళ్ళాక  ఊరొదిలి అక్కడ ఉండలేకపోతుంది.
పూట పూటకి ఫోను . తను ఎట్టాగో సర్దుకుని బతుకుతున్నాడు. అక్క సర్దుకోవడమే కష్టంగా ఉంది. డెబ్బై ఏళ్ళ వయసయ్యే , పుట్టినకాడి  నుండి కళ్ళముందు చూసినయ్యి అన్నీ, పెంచినయ్యన్నీ  గబుక్కున  మాయమై పోతుంటే ఎట్టా తట్టుకుంటుంది. అసలే మెత్తని మనసాయే.. దీర్ఘంగా నిట్టూర్చాడు .

ఇక అదే సమయానికి బెంగుళూరు మహా నగరంలో .. ఓ అపార్ట్మెంట్ లో ... యశోదమ్మ మేనకోడలితో ..
"మోహన్ గాడికి ఈ వాస్తు పిచ్చి పట్టిందేన్టిరా  చిన్నమ్మి ! "

"ఏం జేశాడు  అత్తమ్మా  ! "

చెట్లన్నీ  నరికేయించాడు , ఉత్తరం పక్కన అంతెత్తు పశువుల కొట్టం ఉండకూడదని కూల్చేయించాడు. పశువులన్నింటిని సంతకి అమ్మేశాడు. యెర్ర బర్రె  పాలు ఎంత చిక్కగా ఉండేయ్.  నీకు తెలుసుగా ! ఎన్ని ఈతలు ఈనింది.  మచ్చావు  ఎన్ని కోడి దూడలు ఇచ్చింది. రెండేళ్ళకో  కోడె. ఆటిని అమ్మిన డబ్బులతో కాదు ఈడు ఇజీయవాడ లో ఆరేళ్ళు చదివొచ్చిందీ.   ఈడి  చదువైపోయే నాటికి  కొట్టాం అంతా ఊడ్సుకుపోయింది. చదువుకున్నోడికి చదువుకున్న పిల్ల కావాలని ఒంగోలు పిల్లని చూస్తిరి . ఆ యమ్మికి కసువుజిమ్మటం వచ్చా ముగ్గు పిండి వేయడం వచ్చా ! పాల చెంబు పట్టుకుని కుడిపక్క కూసోవాలో ఎడమపక్క కూసువాలో తెలియదు. ఆమె కాఫీలకి, టీ  నీళ్ళకి,కౌసల్యమ్మ పుణ్యమా అని తెల్లారిపాటికి పాలొచ్చి ఇంటిముందు పడబట్టి సరిపోయింది. . "

"అబ్బ ... ఆపవే తల్లీ ! ఏదన్నా కదిలిస్తే చాలు. వెనుకటి నుండి తవ్వుకొచ్చి మరీ చెపుతావ్. నీ చాదస్తం తట్టుకోలేకే మామ తొందరగా పోయాడు." విసుక్కుంది మోహన.

"నన్ను చెప్పనీయవే తల్లీ!  నీకాడన్నా చెప్పుకోకుంటే ఎవురితో చెప్పుకోవాలి నలుగురిలో చెప్పుకుంటే   పలచబడిపోమూ "

"సరే చెప్పు " అంటూ అత్తమ్మ ఒడిలో పడుకుంది మోహన .

"పిల్లలు తాగడానికి తొలీత పడ్డ నైనా ఉండనీయమని మొత్తుకున్నా ..  ఊరుకుందా. అన్నీ పోయే . నేను పట్టు బట్ట బట్టీ ముసలి బర్రె అయినా మిగిలింది. ఆఖరికి దాన్ని కటికోడికి అమ్మేయడానికి చూసాడు.నేనూరుకుంటానా ? ఈడిట్టా కటికాడు అయిపోయాడేంటి?.  హెచ్చులకి పోయి డబ్బులవసరపడితే  మంచి చెడు గానకుండా మనుషులు ఇట్టాగే తయారవుతారు కాబోలు. చెల్లెలు కూడా కనబడటల్ల ఆడి కళ్ళకి. నువ్వు రాడమే తప్ప ఆడెప్పుడైనా నీ ఇంటికి వచ్చి మంచి సెబ్బర కనుక్కున్నాడా ?"

ఆమాటకి దిగులెక్కువై పోయింది మోహనకి. అత్తమ్మ ఒడిలో నుంచి లేచి నడుం చుట్టూ చేతులేసి మరింత అతుక్కుంది.

"మా అక్కా తమ్ముడి లాగా మీరెందుకు ఉండటల్లేదో అని  దిగులైతది చిన్నమ్మీ. మేము పోయాక ఆ వూరికొచ్చే ప్రాప్తముందో లేదో నీకు. మాటి మాటికి ఆ అమ్మికి అంతెందుకు పెట్టాలి,ఇదెందుకు ఈయాలీ  అని తగవుకి దిగుతాడు. "బిడ్డలు ఇద్దరూ రెండు కళ్ళే కదా! తేడా ఉండకూడదనేగా ఇద్దరి పేర్లు ఒకేలా ఉండేలా పెట్టింది " అని మీ నాయన."

"పంట డబ్బులు కూడా అడగలేదుగా అత్తమ్మా! అయినా  ఆర్నెల్ల కొక్కసారి కూడా ఫోన్ చేసి పలకరించడు. మా ఆయన ఎట్టా పంపుతాడు నన్ను పుట్టింటికి ? "

" మీ ఆయన్ని  అడిగి నిన్నునాకూడా  తీసుకుపోతాలే.. నాలుగు రోజులుంది వద్దువుగాని . "  నేనుండగా నీకేమైనా  లోటూ రానిస్తానా ?'' అంది.

మోహన రెండేళ్ళ క్రిందట ఊరేల్లినప్పటి సంగతి  తలుచుకుంది. అన్నకి  చదువు అబ్బినా సంస్కారమబ్బలేదు, ఉద్యోగానికి  వెళ్ళలేదు. అన్ని వ్యాపారాల్లో  వేలు పెడతాడు. అన్నింటిలోనూ నష్టమే ! తనకి వ్యాపారంలో నష్టం రావడానికి కారణం ఉండే ఇల్లు సరిగా లేదని వాస్తు మార్పులు చేయించేవాడు .  ఈ ఇంట్లోనే కదరా  మేమందరం పెరిగింది. అప్పుడు అందరూ బాగానే ఉన్నాము  కదరా అంటే అప్పుడు మన వారసులే ఉండేవాళ్ళు . అక్కని  అత్త గారింటికి పంపకుండా ఇంట్లోనే తెచ్చి పెట్టుకున్నావ్ కదా ! ఆడపడుచు పైభాగాన ఉంటే  మగ పిల్లాడికి కలిసి రాదంట . ఆ శాఖే నాకు చూపుతుంది అన్నాడు .

"అక్క  ఒంటి మీద నగలతో సహా ఉన్న  ఆస్తి అంతా నీకు, చెల్లికే ఇచ్చింది కదరా  నిన్ను చిన్నప్పటినుండి కన్న తల్లికన్నా ఎక్కువ పెంచింది ఈ వయసులో ఇల్లు ఒదిలి ఏడకి బోతుందిరా? కావాలంటే  ఈ ఇల్లొదిలేసి  నువ్వే పో ! కయ్యల్లో నీ భాగం నీకు రాసిస్తా "  అన్నాడు మాధవయ్య .

"ఈ ఇంట్లో భాగం కూడా  ఇవ్వు , అప్పుడే పోతానన్నాడు. పాత  మండువా ఇల్లు తమకుంచుకుని  డాబా ఇల్లు, ఉత్తరం ప్రక్క స్థలం వాడుకోమని  ఇచ్చాక ఇద్దరికీ మధ్య ఆరడుగుల ఎత్తు గోడ కట్టేశాడు మోహన్.

మోహనకి అన్న వరస చూసి విరక్తి కల్గింది. ఎక్కువ రోజులు ఉందామనుకుని వచ్చి నాలుగు రోజులకే తిరుగు ప్రయాణమైన సంగతి గుర్తొచ్చి మనసు భారమైంది .

నాలుగు రోజులు  సెలవు దొరకగానే  యశోదమ్మ, మోహన,పిల్లలూ అందరూ ఊరికి వచ్చేసారు.  మోహనకి పల్లెని చూస్తుంటే ..తన ఊరేనా ఇది అని ఆశ్చర్యపోయింది. పంటలు లేవు, బావుల్లో నీళ్ళు లేవు, తాగేదానికి  నీళ్ళు కూడా లేవు. పేరుకి పండగ నెలే  కానీ ఎండ మండిపోతుంది. ఆటో దిగుతూనే  బోసి పోతున్న ఇంటి ముందు లేనిదేమిటో క్షణకాలంలో గ్రహించింది. వేప చెట్టు  ఏమైపోయిందత్తమ్మా  అంది ఆశ్చర్యంగా.

"ఏడాది పొడుగూతా ఆకులు,కాయలు రాలుతున్నాయి పని వాళ్ళు రానప్పుడు  కసువు ఊడ్వ లేకున్నానని  కాకుల రొద పడలేకపోతున్నామని చెట్టుని నరికేదాకా ఊరుకోలేదు.  అమ్మితే పాతిక వేలు వచ్చాయంట నీ అన్నకి  "

చల్లటి నీడనిచ్చే, శుభ్రమైన గాలినిచ్చే అంత పెద్ద మానుని నరికి ఎండకి తట్టుకోలేక పోతున్నామని ఏ. సి కొనుక్కొచ్చిన వెర్రినాయాల్ని యేమనాలమ్మా  !" అన్నాడు  మాధవయ్య  .

"ఇప్పుడాళ్ళకి  ఏమీ చెప్పలేం. మీకేమీ  తెలియదు మీరూరుకోండి అని తీసి తీసి  పడేస్తారు. నోరు మూసుకుని ఇట్టా ఉండాము. ఇంతకీ మించీ ఏం చేయగలం చెప్పు తల్లీ ! మాట్టాడుతూనే ఇంటి  పనిలోకి దిగిపోయింది యశోదమ్మ.  

ఇంట్లోకి కూడా  వెళ్ళకుండానే పిల్లలని తీసుకుని  తోటలోకి వచ్చింది . అరెకరం తోట అది.  చెట్లన్నీ కూల్చేశారు. అత్తమ్మ చెప్పిన విషయాలు ఇవే కాబోలు. అప్పుడు పట్టించుకోలేదు. ఎలా ఉండే తోట ఎలా అయిపొయింది ?   ఎన్నెన్ని జ్ఞాపకాలు ఆ తోటతో.

మణుగుల లెక్కన చింత పండు ఇచ్చే చెట్టుని ఇంటిముందు చింత చెట్టుంటే   చింతలు ఎక్కువంట అని కొట్టి పడేసారంట . తన చిన్నప్పుడు పడి  మొలిచిన మొక్క అది.  కంది  పప్పులో  చిగురేసికూర వండేది.  లేత  కుందేలు మాంసంలో చింత చిగురేసి వండమని మామయ్యా  పురమాయించేవాడు. ఆ కుందేళ్ళని చంపడానికి నీకు ప్రాణమెట్టా ఒప్పుదయ్యా! మన ప్రాణం లాంటిదే కదా వాటి ప్రాణం కూడా ! నువ్విట్టా కుందేళ్ళు పట్టి చంపి తెస్తే నేను ఊరుకోను అన్జెప్పింది అత్తమ్మ  .   తనెళ్లి మామయ్యా! బుజ్జి కుందేళ్ళు తెల్లంగా మెత్తంగా   ఎంత బాగుండాయి   వాటిని చంపుతావా ? పాపం గందా,  ఒదిలేయవా అని అడిగిందని  వదిలేసి ..ఇక తర్వాతెప్పుడూ  ఏ మాంసం  తినలేదు!   అత్తమ్మ  చింత పిందలేసి పిత్త పిరకలు కూర చేసినా,  సొరకాయ బజ్జీ చేసినా  ఎంత బాగుండేవని. ఎప్పుడెప్పుడు తిందామా అని నోట్లో నీళ్ళూరు తూండేవి.   దోర చింతకాయల  తొక్కు .... చుట్టాలందరికి సరిపోయే చింతపండు  అన్నీ పోయాయి.

నిమ్మ చెట్టు ఏదత్తమ్మా  అడిగింది మోహన .  ముళ్ళ చెట్టు ఉండకూడదని నిలువునా  కొట్టేసి వాడి పైత్యపు చేష్టని పదిమందికి చాటుకున్నాడు. మీ వదినకి కూడా చెప్పా ! అట్టా  పూచే పూచే వాటిని కాసే చెట్లని నరకకూడదు. ఉణ్ణీయ రాదా అని.  ఆ సంగతి నాకు తెలుసులే అంది ఆ పెడద్దరపు మనిషి. అదసలు ఆడదే కాదు వీసమెత్తు  జాలి, దయ  లేవు  ఏం చేద్దాం అంది యశోదమ్మ. వుసూరుమనిపించింది మోహనకి. పది  గజాల్లో విస్తరించి ఉండేది. ఎన్ని కాయలు కాసేది . రెండేళ్ళ నాడు వేసవి కాలంలో వచ్చినప్పుడు రాజ్యం వదిన  కాయ రూపాయకి లెక్కన అమ్మి సవర  బంగారం కొన్న సంగతి మర్చిపోలేదు.నిమ్మకాయలమ్మటమనేది  ఇంటావంటా లేనిపని  అని అత్తమ్మ చీదరిచ్చుకుంది కూడా !

ఇంటి గోడలు నెర్రలిచ్చుతున్నాయని రావి చెట్టు,  పురుగులు వస్తున్నాయని మునగ చెట్టు ,  ఈశాన్యం ఎత్తు ఉండకూడదని కొబ్బరి చెట్లు,ఉసిరి చెట్టు అన్నీ  మాయం  అయిపోయాయి.  తోటలో మాధవయ్య గారిల్లు అనే పేరుండే తమ ఇల్లు ఇప్పుడు తోటంతా  పోయి ఆరు బయలు మిగిలింది .

" ఏదో  అత్తమ్మ ఉండబట్టి  గుట్టుచప్పుడు కాకుండా నా తిండి తిప్పలు గడిచి పోతుందమ్మా  . లేకపోతే ఆ యమ్మి ఇంత కూరాకేసిన కూడు కూడా పెట్టదు. మొగుడు పెళ్ళాం ఇద్దరూ జల్సాలకి అలవాటుపడ్డారు . ఎక్కెడెక్కడ వాళ్ళు వచ్చి  మనవూర్లో   కేరళ స్కూల్లో పిల్లకాయల్ని చేరిపిచ్చి పోతుంటే వీళ్ళు  నాణ్యమైన చదువులు నెల్లూరు లోనే చదవాలంటూ హాస్టల్ లో జాయిన్ చేరిపిస్తిరి.  చేరిన్దగ్గర్నుండి  వడ్డీ ఏకాడికైనా  అప్పులు తెచ్చి ఫీజులు  కట్టటమే సరిపోయే. సేద్యం లో పైసా మిగలకపోయే, ఏం చేస్తాడో మీ అన్న. కయ్యలు బేరానికి  పెట్టాడు. అమ్మితే ఒక్క దినం కూడా ఇక్కడ నిలవడు. పట్నంలో కాపరం పెడతాడు"

మౌనంగా విని ఊరుకుంది. తనొచ్చింది చూసి కూడా చూసి చూడనట్టున్న అన్న ఇంటికి తనే వెళ్లి పలకరించి వచ్చింది. వదిన ఒక్కపూటయినా భోజనానికి పిల్చి రవిక గుడ్డ పెట్టనందుకు బాధపడింది.  వీలైనప్పుడు  అత్తమ్మని, నాన్నని బెంగుళూరుకి పిలిపించుకోవాలి తప్ప ఇంకెప్పుడూ ఊరికి రాకూడదు అనుకుంది. ఊరొచ్చిన ఆనందం ఏమీ లేకుండానే తిరుగు ప్రయాణం అయింది మోహన.

పదిరోజుల తర్వాత  ఉదయాన్నే యశోదమ్మ కాలు గాలిన పిల్లిలా  ఇంట్లోకి వరండాలోకి తిరుగుతుంది. ఉత్తరపు వైపు గోడకి ఆనుకున్న మామిడి చెట్టుపైకెక్కిన మనుషులు కొమ్మలపై కూర్చుని ముందు భాగాల్ని పదునైన గొడ్డలితో ఒకటి రెండు వేటులతోనే కిందికి కూల్చేస్తున్నారు.  ఇంటి అరుగు పై నిలబడి  ఎదురెండ కళ్ళల్లో పడి గుచ్చుకోకుండా కళ్ళపై చేయుంచి   వీధి మలుపుపై  దృష్టి సారించి  వీడింకా రాడేంటి ? వచ్చేటప్పటికి  చెట్టు మొత్తం నేలపాలు అయిపోయ్యేటట్టు ఉంది . అయినా ఏం పని ఉందని చేనుకి వెళ్ళినట్టో ? అని విసుక్కుంది.

రాత్రి  అన్నం తినేటప్పుడు  తనతో కొడుకు మాట్లాడిన విషయం చెపుతూ ... "నిరుడు తోలిన చెరుకు డబ్బులు ఈ ఏడు చెరుకు నరకడానికొచ్చినా బిల్లులవలేదు.  పెద్దపండగక్కి సెలవులు ఎల్లుండి  నుండి అంట. నలబై వేలు దాకా ఫీజులు కట్టాలంట . ఫీజులు కట్టి పిల్లలని తీసుకుపొమ్మని లెటర్ పంపిచ్చారంట.  నాయనా, డబ్బులేమైనా ఉండాయా అనడిగాడు. నాలుగైదేలైతే ఉండాయి గానీ అన్నెక్కడ ఉండాయిరా అన్నా !   ఏం జేస్తాడో ఏమో ! " అన్నాడు

తెల్లారేటప్పటికి గొడ్డళ్ళు రంపాలేసుకుని మనుషులు  దిగారు.  చుట్టూ  తిరిగి  ఎటువైపుకి చెట్టు పడితే పని తేలికగా ఉంటాదో  అని లెక్కలేసుకుంటున్నారు. గుండెల్లో సన్నగా నొప్పి మొదలైంది యశోదమ్మకి. నరకబోతున్న మామిడి చెట్టు తోటలో ఉన్న ఆఖరి చెట్టు.  వాడు పుట్టినప్పుడు వేసింది. దాయాదుల వాటాల్లో మామిడి తోట  రాకపోయాక  మామిడి చెట్టు లేకుండా ఎట్టా అని అప్పటికప్పుడు వేసిన చెట్టది. రోజూ నీళ్ళు పోసి, వారానికొకసారి ఎరువేసి అపురూపంగా పెంచింది. దాని వయసు నలబయ్యి ఏళ్ళు.   ఎన్ని కాయలు కాసింది.  మామిడికాయ పప్పు , చిన్నముక్కల పచ్చడి , వంకాయ మామిడికాయ కూర ,  మాగాయ పచ్చడి ,ఆవకాయ పచ్చడి, సంవత్సరానికి సరిపోయే ఒరుగు , విదేశంల్లో ఉన్న చుట్టాలకి పంపే ఆమ్ చూర్, పండిన మామిడిపళ్ళ కమ్మటి వాసన. కుటుంబానికి . ఎన్ని అవసరాలు ఉన్నాయో చెట్టుతో. వీడికి మాత్రం అది తెలియనిదా ? అన్ని పొంగు మాలిన పనులకి పూనుకుంటాడు లోలోపల తిట్టిపోస్తుంది.

కూలీలు  మామిడి చెట్టు పైకి ఎక్కి నరకడం మొదలెట్టారు. అడితీ వాళ్ళంట.  మంచి తలుపు చెక్కలు తెగుతై అని చెప్పుకోవడం వినబడింది . అవును మరి రెండు చేతులతో ఇటొకళ్ళు అటొకళ్ళు వాటేసుకున్నా ఇంకా మిగిలిపోద్ది.  దారినపోయేవాళ్ళు ఆగి చూసేంతగా నిండా పూతపూసి ఉంది. అట్టాంటి చెట్టుని నరకడానికి ఆళ్ళకి మనసెట్టా ఒప్పుతుందో ...

అన్ని పట్టింపులు మానుకుని గబా గబా అవతలి వైపుకి వెళ్ళింది . మోహన ఒరే మోహనా ... ఏడ ఉండావురా ! మామిడి చెట్టుని ఉన్నపళాన అట్టా నరికించడానికి నీకు మనసెట్టా అయిందిరా !? ఆ చెట్టు కొమ్మకి ఉయ్యాలేసి ఊగింది, ఊగూతూనే ముప్పూటలా గోరు ముద్దలు తింది ఎట్టా మరిసిపోయేవు రా ! బయటకి రా .అని గట్టిగా కేకలేసింది . ముందు మీరందరూ  చెట్టు దిగండయ్యా ఈ చెట్టు కొట్టేదానికి ఈల్లేదు  అంటూ చెట్టు కిందకి వెళ్లి నిలబడింది. కొమ్మలని గొడ్డలితో కొట్టేవాళ్ళు, రంపంతో  కోసేవాళ్ళు పని మానేసి  ఇదెక్కడి పితలాటకం అన్నట్టు ఆమె ఒంక చూస్తున్నారు

ఏందత్తమ్మా ! రచ్చకి కాసుకూచ్చుండట్టు ఉన్నావ్ ! నీ ఏపుకొచ్చానా, నీ దాంట్లోకి వచ్చానా, నా దొడ్డో చెట్టు,నా ఇష్టం, గమ్ముగా అవతలకి పో,  పయిటేలకల్లా  మొద్దులన్నీ లారీకి ఎక్కి నెల్లూరికి పోవాలి. నువ్వు పో . .. అంటూ వీధి వైపుకి చెయ్యి చూపిచ్చాడు.

"ఎట్టెట్టా ... నీది కాదు పో అన్నట్టు దులపరిచ్చి  మాట్టాడుతున్నావ్ రా ! నాది కాకుండా నీది,నీ బాబుది,  ఎట్టైయిందిరా ? ఈ ఇల్లు ఈ తోట అంతా మా తాత మాయమ్మ కిచ్చిన ఆస్థి గంద. మీ తాత ఈ ఇంటికి ఇల్లరికం వచ్చాడని నీకెరుగు. మా యమ్మ ఆస్తి నాకు గాకుండా నీకెట్టా అయ్యిద్దిరా ! రూల్స్ మాట్టాడుతున్నావ్. అంతలావు రూల్స్ మాకు తెలియకుండా పోలేదులే, నువ్వు నీ పెళ్ళాం కలిసి ఎన్ని అన్నా నేను, నా తమ్ముడు మూసుకు కూర్చున్నామని మరీ ఎగిరెగిరి పడతాన్నావ్ ! ఏమైనా ఈ చెట్టు నరికేదానికి లేదు. ఆ చెట్టు నరకాలంటే నన్ను నరికి ముందుకుపో " అంటూ గబుక్కున చెట్టు మొదట్లో  నేల మీద కూర్చుంది.

"నా పనికి అడ్డం రాబాకు ..తర్వాత నెట్టేసానని గుంజుకోకుండా నువ్వు పో  ఈడనుంచి"  యశోదమ్మ చేయి పట్టుకుని చెట్టు కిందనుండి ఈవలకి లాగబోతూ ఉంటే ఆమె వెనక్కి గుంజుకుంటూ కనబడింది రోడ్డు మీద పోయే మాధవయ్యకి.  బిర బిర నడుచుకుంటూ మామిడి చెట్టుకాడికి  వచ్చాడు . నరికి కిందేసిన కొమ్మలని, చెట్టుపై కూర్చున్న కూలీలని, ఏడుస్తున్న  అక్కని చూసి విషయం అర్ధమైంది. కొడుక్కేసి  చూసాడు. చెట్టుని నరక్కుండా అడ్డమొచ్చిన మేనత్తని నమిలి మింగేసేటట్టు చూస్తున్నాడు.

మాధవా ! ఈడు చెట్టుని నరికిచ్చేస్తున్నాడు రా ! వద్దని చెప్పు " దుఃఖం లో తడిసి పోయింది.

"మోహనా .. ఆళ్ళని పంపిచ్చేయి ముందు"  గట్టిగా కోప్పడ్డాననుకున్నాడు ఆయన.

ఏం నాయానా ! ఎందుకు పంపాలా ? నా చెట్టు గంద, నా ఇష్టం . అన్నాడు.

" ఈ ఆస్తి నీది, నాది ఎట్టవుతుదిరా! మా అమ్మ  అచ్చంగా అక్కకే రాసేసిపోయింది. మా అమ్మ  దాయాదులందరూ  ఆడపిల్లకి మాతో పాటు సమానంగా ఆస్థి ఎందుకెల్లాలని కయ్యలని కాజేయాలని చూత్తే  కొంగు బిగించి కోర్టుల చుట్టూ తిరిగి  పోరాడి తల్లి ఆస్థిని  గెలుచుకుంది నా అక్క . అప్పుడికి నేను పసోడినే ! మా అమ్మ చచ్చిపోతే నన్ను పెంచింది. మీ అమ్మ రోగిష్టి దైతే సంసారాన్ని తన భుజం మీద మోసింది. అత్తమ్మ ని బాధ పెట్టడం బాగోదు,వాళ్ళని పంపేయ్ " అన్నాడు మళ్ళీ .

"బిడ్డలకి ఫీజులు కట్టడానికి డబ్బులు కావాలి.అందుకే చెట్టుని అమ్మేసా, మనుషులే శాశ్వతం కాదు ఇక్కడ. చెట్టేమన్నా శాశ్వతమా ? అయినా ఈ గొడ్డుమోతు మనిషికి   మనుషులమీద లేని ప్రేమ  చెట్టూ చేమ మీద ఎందుకంటా ! "

మాధవయ్యకి  కోపంతో ఊగిపోయాడు.  ఎంత మాట అంటావురా నా అక్కని అంటూ కొడుకుని చెంపకి మళ్ళిచ్చి లాగిపెట్టి కొట్టాడు . తండ్రిలో అంత కోపం ఎప్పుడూ చూడని మోహన్ చెంప పట్టుకుని అట్టాగే నిలబడి పోయాడు. కూలీలు సామాను సర్దుకుని అక్కడి నుండి జారుకున్నారు.

"అక్క  గొడ్డుమోతుదే కావచ్చు. ఈ దొడ్దో పెట్టిన మొక్కలన్నింటిని, పశువులని,మిమ్మల్నీ  తల్లిలా సాకింది.  నువ్వొక్కక్క చెట్టుని మూలకంటా నరికేసినప్పుడల్లా విల విల లాడి పోయింది.   అయిందానికీ కానిదానికి నోరేసుకుని అరిసె అత్తమ్మే తెలుసురా  నీకు, పైకట్టా అరుస్తుంది కాని మీ అత్తమ్మ  మనసు వెన్నని నీకు తెలియదా ?. కళ్ళముందే ఆస్తులన్నీ కరుగుతున్నా కిమ్మనకుండా ఊరుకుంది. ఇప్పుడీ మామిడి  చెట్టుని కూడా నరికిచ్చి అక్కని నిలువెల్లా కూలదోయకురా . తండ్రిగా ఇదొక్కటే నేనిన్నడుగుతున్నా! చేతులు జోడించాడు కొడుక్కి .
మాధవా ! ఊరుకోరా ఆడు చిన్నోడు. నువ్వు మొక్కితే ఆయుష్షు తగ్గిపోద్ది నేలమీద నుండి లేవబోయి మళ్ళీ కూలబడింది.

అక్కా !  నెమ్మళమ్ గా లేయ్, అంటూ దగ్గరికెళ్ళి చేయి ఆసరా ఇచ్చాడు మాధవయ్య.
 అక్కడినుండి కదిలి తమ భాగం వైపు వస్తూ  "మోహనా మళ్ళీ మామిడి చెట్టు జోలికొస్తే మాత్రం  ఊరుకోను. ఇష్టముంటే ఈడ ఉండండి లేకుంటే పోండి. తమ్ముడూ, నేను బతికుండగానే  కయ్యలు  చెట్టు చేమా  అన్ని నాశనమైపోతుంటే చూస్తూ ఊరుకోము  బెదిరించింది యశోదమ్మ.

బెణికిన కాలుకి  జండూబామ్  రాసుకుని మళ్ళీ కాసేపటికే మేనల్లుడి డాబా ముందుకి వచ్చి "ఇగో  రాజ్యం ఇటు రామ్మే ! " అని పిలిచింది. రాజ్యం అడుగుక్కూడా ముందుకు నడవలేదు. "బెదురు  గోడ్డల్లే అట్టా చూస్తా ఉండావ్. నిన్నేమీ  కొండసిలువ మాదిరి మింగబోటంలే,"  అంటూ తనే వెళ్లి రాజ్యం చేయి పట్టుకునిలాగి  అరచేతిలో వస్తువులున్చింది. "మా అమ్మ చేయించిన మూడు వరుసల బుట్టకమ్మలియ్యి. నీ కూతురికి ఇద్దామనే దాపెట్టి  ఉంచా ,  రెండు సవర్లు పైనే ఉంటయి,  ఇయ్యమ్మి  పిల్లకాయలకి ఫీజులు కట్టమను." అన్జెప్పి తన ఇంటికి వచ్చి పడింది.

అంతా చూస్తూనే ఉన్న మాధవయ్య  నిన్ను అర్ధం చేసుకోలేక పోవడం  మోహన్ గాడి దురదృష్టం అక్కా " అన్నాడు. నిజం చెప్పరా తమ్ముడూ!  ఆడు చెట్లన్నిటినీ నరికేసినప్పుడల్లా నీక్కూడా  కాళ్ళు చేతులూ అన్నీ కోసి పారేస్తున్న బాధకలగలేదు ? అంది.

అక్క మనసేమిటో తెలిసిన మాధవయ్య  "అవునక్కా " అన్నాడు అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన  కన్నీళ్ళని తుడుచుకుంటూ.

వంట ఇంటోకి పోయి కాఫీకి నీల్లేసి అరుగు మీద కూర్చుంది. పాల చెంబు తెచ్చిచ్చిన తమ్ముడితో  "మాధవా!
నిదర లేచింకాడి నుండి అమెరికా ఇట్టా  అమెరికా ఇట్టా అని ఒకటే కలవరిత్తారు గందా ! ఆ  దేశంలో చెట్టుని  నరకాలన్నా అనుమతి  ఇయ్యాలంటగా. అనుమతి లేకుండా చెట్టుని నరికితే జరిమానా వేస్తారంట కదా !  అట్టాంటి రూలు  మనదేశంలో ఎందుకు పెట్టలేదంటావ్ ? " అని అడిగింది.

ఈడా  అన్నీ ఉండాయి లేక్కా! పాటించేది ఎవరని ?

ఉండు రేపు పేపరోడికి చెట్టుని నరికితే శిచ్చేమి పడుద్దో  చెప్పమని  ఉత్తరం ముక్క రాస్తా. తోటలో చెట్లన్నీ నరికేసేటప్పుడు ఇయ్యాలడ్డం పడినట్టు అడ్డం బడితే చెట్లన్నీ నేలకూలేయ్ కాదుగా. ఇట్టా అడ్డంబడకపోవటం కూడా మన తప్పే ! ఈ అపరాధానికి శిచ్చ పడాలి మనకి.  ఎనకటి మాదిరిగా  తోటంతా మొక్కలేద్దాం. వాటిని చూసుకుంటా బండి నడిచినన్నాళ్ళూ నడిపిద్దాం . మనుషులు పోతా  ఉంటే పుడతా ఉన్నట్టు  చెట్లని కూడా పెంచుతా ఉండాలి.  ఈ తోటలో మామిడి చెట్టు ఆఖరి చెట్టు అవకూడదు  ధృఢంగా  అంది యశోదమ్మ.

మాధవయ్య గారి  కళ్ళ ముందు  ఎడారి బయలుగా మారిన నేలంతా మొక్కలతో  పచ్చగా కళ కళ లాడుతూన్నట్లు  ఓ సుందర దృశ్యం పారాడింది.


 

16, మే 2016, సోమవారం

యశోదమ్మ సందేహం

వంట ఇంటోకి పోయి కాఫీకి నీల్లేసి  వచ్చి అరుగు మీద కూర్చుంది యశోదమ్మ . పాల చెంబు తెచ్చిచ్చిన తమ్ముడితో  “మాధవా! నిదర లేచింకాడి నుండి అమెరికా ఇట్టా,  అమెరికా అట్టా అని ఒకటే కలవరిత్తారు గందా ! ఆ  దేశంలో చెట్టుని  నరకాలన్నా అనుమతి  ఇయ్యాలంటగా. అనుమతి లేకుండా చెట్టుని నరికితే జరిమానా వేస్తారంట కదా !  అట్టాంటి రూలు  మనదేశంలో ఎందుకు పెట్టలేదంటావ్ ? ” అని అడిగింది.
‘‘ఈడా  అన్నీ ఉండాయి లేక్కా! పాటించేది ఎవరని ?’’
‘‘ఉండు రేపు పేపరోడికి చెట్టుని నరికితే శిచ్చేమి పడుద్దో  చెప్పమని  ఉత్తరం ముక్క రాస్తా... 
ఇదీ యశోదమ్మ గురించి నేను వ్రాసిన కథలో ... ఒక భాగం
పచ్చటి చెట్టుని నరికితే ఎలాంటి శిక్ష వేస్తారు ..అపరాధ రుసుం ఎంత చెల్లించాలి అనే విషయాన్ని నాకు చెప్పగలరా ప్లీజ్ ! ఎందుకంటే నాకా విషయం తెలియదు .
నేను వ్రాసిన సరి కొత్త కథ "బయలు నవ్వింది " అరుగు వెబ్ పక్ష పత్రికలో ప్రచురితం అయింది. ఆ కథ చదివి నా సందేహాలు తీర్చండి ప్లీజ్ !
బయలు నవ్వింది    ఈ లింక్  లో చదవండి ప్లీజ్ !

15, మే 2016, ఆదివారం

"కథలు ఇలా కూడా వ్రాస్తారు "




"కథలు ఇలా కూడా వ్రాస్తారు " చదివిన ఉత్తేజం, మిగిల్చిన అనుభూతి, ఏర్పడిన నా అవగాహన ఇది.

మహ్మద్ ఖధీర్ బాబు గారికి వైభోగం పట్టుకుంది . ఇది నేనన్న మాట కాదు ఆయన మాటల్లోనే! లేకపోతే మిట్ట మధ్యాహ్నం మండి పోయే మా బ్లేజ్ వాడ పుర వీధుల్లో ఏలూరురోడ్ లో విశాలాంధ్రని వెదుక్కుంటూ నేను వెళ్ళడం ఏమిటీ ?
నిజంగా పాఠకులు ఒక పుస్తకం కోసం వెదుక్కుంటూ వెళ్ళడం అంటే కచ్చితంగా అది రచయితకి పట్టిన వైభోగమే! అలా విశాలాంధ్ర లోకి అడుగు పెట్టగానే మొట్టమొదట మాట్లాడిన మాట ఖదీర్ బాబు గారి కొత్త పుస్తకం ఉందా ? ( మనసులో వీళ్ళు గనుక లేవండీ అంటే మళ్ళీ లైన్ లో ఉన్న షాప్ లన్నీ వెతుక్కోవాలి అన్న భయం ఉంది లోలోపల)

"ఉందండీ" అంటూ అందరికీ కనబడేటట్టు పెట్టి ఉంచిన బుక్ తీసుకొచ్చి ఇచ్చారు . హమ్మయ్య ఒక పని అయిపొయింది అనుకుంటూ ఇంకొన్ని పుస్తకాల కోసం వెదుకుతూ ఒక పావుగంట శీతల పవనాలని ఆస్వాదించి కొన్ని కొసరు పుస్తకాలు కొనుక్కుని బయట పడ్డాను.

ఆరోజు సాయంత్రమే చదవడం మొదలెట్టాను .

కథలు ఎవరు వ్రాస్తారు ? జ్ఞాపక శక్తి ఉన్నవాళ్ళు , రోజూ వారి పనులు విషయాలు గుర్తు పెట్టుకోలేని వాళ్ళు , చిలవలు పలవులు ఊహించుకునే వాళ్ళు. నాకు రుజువు దొరికేసింది. చెల్లెలు పుట్టినరోజున ఎదురుగా కొత్తబట్టల్లో కనబడినా ఆ సంగతే గుర్తు ఉండదు, చిన్నప్పుడెప్పుడో నాయనమ్మ చెప్పిన కథ గురించి ఆలోచిస్తూ ఉంటుంది మెదడు.
కథ వ్రాయడానికి ముందు ఏం వ్రాస్తారు? అవును .. నేను ఏమి వ్రాస్తాను ? బ్లాగ్ లో ఏదో ఒకటి వ్రాస్తాను . అలా వ్రాస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక రోజు కథ వ్రాసేస్తాను అనుకుంటూ మళ్ళీ ఆగిన దగ్గరనుండి . చదవడం మొదలెట్టి అప్పటికి ఒకగంట పది నిమిషాలు అయింది. కథలెందుకు రాస్తారు ? నాలుగో అధ్యాయంలోకి వచ్చాను . ఒక్క వాక్యం దగ్గర ఆగి పోయి మళ్ళీ చదివాను .

కనుక మనం ఏదైనా చెప్పాలనుకున్నామంటే ఆ చెప్పేది, చెప్పాలనుకునేది ఏదీ వృధా అయి ఉండకూడదు అన్న వాక్యం చదువుతూ ఆలోచనలో పడ్డాను. ఆలోచిస్తూ ఆలోచిస్తూ వృధా అయినవి ఏమైనా వ్రాయడం అంటే... చెక్ చేసుకోవాలి మనం వ్రాసిన వాటిని వెనక్కి మళ్ళి ...మళ్ళీ ఒకసారి చదువుకోవాలి. అప్పుడు వృధా అయినది తొలగించి వేస్తాం. మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి అదే సెల్ఫ్ ఎడిటింగ్ అనుకుంటూ చిన్నగా నిద్రలోకి జారిపోయాను. ఉలిని శానం మీద సాది సాది ఉలిని పట్టుకోవడమేలాగో తెలిసినవాడు, కొయ్యని తొలిచినట్టు ఇలా వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నాను కూడా !

తర్వాత మళ్ళీ ఇంకొంచెం వెనక్కి వెళ్లి ...

కథ వ్రాయడానికి ముందు ఏదో ఒక రచయిత కథని చూస్తూ మనమూ అదే కథని తెల్లకాగితం మీద వ్రాయాలి అది అనువాద కథైతే మరీ మంచిది అని చదివాను.

అనువాద కథని ఎక్కడనుంచి తేవాలిప్పుడు ? విపుల లో ఏదో ఒక కథని ఉన్నపళంగా వ్రాసేయాలి . అయ్యో ! విపుల ఎక్కడిది ? మంచి ఐడియా తట్టింది .ఆన్ లైన్ పత్రిక ఉంది కదా అని. అలా ఆన్లైన్ పత్రిక తెరిచి ఓ కథని వ్రాస్తున్నప్పుడు ఈ అనువాద రచయిత వ్రాసిన ఈవాక్యాన్ని ఇలా కూడా వ్రాయవచ్చునే, పర్యాయ పదం కూడా వాడవచ్చునే అనే ఆలోచన మనకి వస్తుందన్నమాట. ( అప్పటికప్పుడు ఇది నా అభ్యాసంలో నేర్చుకున్న విషయం )

అలా చదవడం ద్వారా కల్గిన ఒక్కో అనుభవాన్ని ప్రోది చేసుకుంటూ ఆక్టోపస్ లాంటి స్నేహితులకి చిక్కకుండా .. ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టుకుని ఆరు రోజులో ఆ పుస్తకాన్ని చదవడం పూర్తీ చేసాను . ఆ పుస్తకాన్ని చదివేటప్పుడు ప్రయాణం అసలు సరిగ్గా సాగనే లేదు . 28 శీర్షికలున్న అ పుస్తకాన్ని ఒక్కో శీర్షిక చదువుతున్నప్పుడల్లా మధ్యలో ఆగి ఆలోచించడం అనివార్యమైంది.ఎంతమంది రచయితలని ఎన్ని కథలు పరిచయం చేసారు. ఒకోసారి చదువుతున్న ఆ పుస్తకం పక్కన పడేసి అందులో పరిచయం చేసిన కథల కోసం ఆన్ లైన్ లో అన్వేషించాను కూడా !
.
ఇలా ప్రతి అధ్యాయం చదువుతున్నప్పుడు నాకంటూ కల్గిన జ్ఞానోదయాలు, జ్ఞాపకం వచ్చిన విషయాలు, అరె ఈ విషయం భలే వ్రాసారు ఇంతగా మనసులని చదివినట్టు వ్రాయడం ఎలా సాధ్యమవుతుందో !మనం కూడా ఇలా వ్రాయడానికి తగినంత సాధన చేయాలి అనుకోవడం సాధారణం అయిపొయింది. ప్రతి శీర్షిక చదివేటప్పుడు నాకు కల్గిన ఆలోచనలు వ్రాయాలంటే అదొక పుస్తకం అయిపోతుంది కాబట్టి వాటిని దాచేసుకుని ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తున్నాను .

ఈ పుస్తకం చదవడం వల్ల కల్గిన లాభాలు .
.
నేనూ కథలు వ్రాసే ప్రయాణంలో ఉన్నాను కాబట్టి ప్రతి శీర్షిక ఆసక్తిగానూ ఉంది, పాఠం లాగా కూడా ఉంది .ఇంతకు  క్రితం కథలు వ్రాసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలు గురించి రెండు పుస్తకాలూ చదివాను, కొన్ని విషయాలు గ్రహించాను కానీ ఖదీర్ బాబు గారి "కథలు ఇలా కూడా రాస్తారు " అంటూ ఇంకో సరికొత్త పరిచయాన్ని ఇవ్వడం మాత్రం అద్భుతంగా ఉంది . ముఖ్యంగా ప్రతి అధ్యాయం చివర బోర్లా పడుకుని పుస్తకం చదువుకునే బొమ్మైతే చాలా నచ్చింది . పుస్తకం వ్రాయడం కన్నా పుట్ నోట్స్ అందించిన శ్రమ చాలా ఎక్కువని చెప్పారు. అది చాలా చాలా నిజం అనిపించింది. చాలామంది గురించి ఒక్క పుస్తకంలో తెలుసుకోవడం సులభంగా ఉంది.

అలాగే ప్రతి విభాగం చివరా చమక్ మనిపించే ఒక వాక్యం ఉంటుంది. ఆ వాక్యం పట్టుకుని ఆలోచిస్తే చాలు ఎంతో విషయం అవగతమవుతుంది. అలాంటి వాక్యాలని ఒక్కో కొలికి పట్టుకుంటూ వెళితే ఒక గొలుసు అవుతుంది. అదే ఈ పుస్తకం అవుతుంది. అది చదవటం ద్వారా వచ్చిన అవగాహన, జ్ఞానం అవుతుంది అని నేను చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ పుస్తకాన్ని చదివిన ఇంకొకరి అనుభంతో నా అనుభవాన్ని సరిపోల్చుకున్నాను.

ఈ పుస్తకం రావడం వెనుక ఎంతో శ్రమ ఉంది.నాలాంటి వాళ్ళు ఈ పుస్తకం చదివి ఎంత ఉపయుక్తంగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో చెప్పడం కూడా అవసరం . అది ఇచ్చే సంతృప్తి రచయితకి బలం.

ఇంతకు ముందు కథలు వ్రాయడం అలవాటు లేనివాళ్ళు హటాత్తుగా కీ బోర్డ్ ముందు కూర్చోవడం ఆశ్చర్యం కాదు.
నాలా ఎలాగోలా కథలు వ్రాస్తున్నవాళ్ళు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ కథలు వ్రాస్తారు . అది సాహిత్యలోకానికి చాలా మంచిది కదా !

ఇప్పటికే బాగా కథలు వ్రాసి ప్రసిద్ది చెందినవాళ్ళు ఇందులో అంశాలన్నీ భలే ఉన్నాయి . ఇవి మనకి ఒకప్పటి అనుభవమే కదా, అప్పుడు అలా జరిగింది, అలా వ్రాసాను, తర్వాత సరిచేసుకున్నాం అని అనుకుంటారు కూడా .

ఔత్సాహిక రచయితలకి, కొత్తగా పుస్తకం విడుదల చేయాలి అనుకునేవాళ్ళకి ఎన్నో సలహాలు,సూచనలు ఉన్నాయి. వెరసీ ఇది వ్రాసే వాళ్ళకందరికీ ఓ గైడెన్స్ లాంటిది.

నా కథల ప్రయాణంలో మంచి కథలేమైనా వ్రాయగల్గితే "కథలు ఇలా కూడా వ్రాస్తారు " చదివిన అనుభవం తప్పకుండా ఉంటుంది .

ఇంత మంచి పొత్తం అందిందించిన మహ్మద్ ఖదీర్ బాబు గారికి హృదయపూర్వక అభినందనలు,ధన్యవాదాలు తెలుపుతూ ...




13, మే 2016, శుక్రవారం

భారతీయులందరూ ..

ఒకానొక ఆవేశంలో వ్రాసింది ... ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా .  :)

మిత్రమా !
ఒక్కనాడన్నా మనసారా నవ్వావా?
తుమ్మల్లో పొద్దుగుంకినట్టు ముఖానికి ముళ్ళేసుకుని ఉంటావ్ !
 అయినా అమ్మనిన్ను ప్రేమగా ముద్దాడుతూనే ఉంటుంది
అన్నకెక్కువ నాకు తక్కువంటూ యాగీ చేస్తూనే ఉంటావ్
చిన్నవాడివని క్షమిస్తూనే ఉంటుంది
తక్కువ బరువేసుకుని పుట్టావని
అమ్మ నిన్ను నున్నగా రుద్ది రుద్దీ లాలి పోస్తుందే
కడుపునిండా పాలిచ్చి పెంచిందే
అన్నకి చిరుగుల బొంతేసి నీకు పట్టుపరుపునిచ్చిన తల్లినా
నువ్వు ద్రోహివంటున్నావ్

ఎవరితోనైనా మనసు విప్పి మాట్లాడలేవు
ఎవరినీ స్వచ్చంగా ప్రేమించనూ  లేవు
కనీసం నేనున్నాననే భరోసానివ్వలేవు
ధర్మపన్నాలు వల్లిస్తూనే ఉంటావ్
అవసరానికి వేరొకరి దేవుడిని,వాదానికి సమూహాలని
ఇల్లెక్కి కూయడానికి కులాన్ని అవసరానికి వాడుకుంటావ్.
కవిగా వెలగడానికి భాషని చమురుగా మార్చుకుంటావ్
ఏనాడన్నా అక్షరాలకి అనురాగాన్ని నింపావా
ద్వేషాన్ని రంగరించి  శస్త్రాలని గురిపెడుతున్నావ్
దొరకని దానికోసం అన్వేషిస్తూ ఖండాతరాలలో సంచారం చేస్తున్నావ్

వెతుకున్న కొస నీ చేతికందిందా ?
నీ విశ్వాస ఖడ్గం  పరుల విశ్వాసాలన్ని తునకలు చేయమని చెప్పిందా ?
నువ్వు పశ్చిమ మైతే నేను ప్రాగ్దిశ .
మనమాడుకుంటున్న వెలుగుల బంతి
మిగిలిన ఎనిమిది దిక్కులకి అన్యాయం చేసున్నాయని కత్తులు దూయడం లేదే !

తల్లి పాదాల క్రింద స్వర్గముందని నీ దేవుడు చెపితే
శూన్యంలో ప్రయాణించి ఆత్మ పరమాత్మైన  నను  చేరుతుందని నా తండ్రి చెపుతాడు
తల్లీ తండ్రీ ఇద్దరూ నిజమే కదా నీకూ  నాకూ.
రాళ్ళలో మాత్రమే నా  దైవం లేనప్పుడు నీకు ఆ రాతికట్టడాలతో  విశ్వాసమెందుకు!
కూల్చేసినా  బాధెందుకు ?

చెట్టు నుండి ఈ పువ్వుని కోసినట్టే  నిత్యం నీ ద్వేషాన్ని కోసి
భగవంతుని పాదాల దగ్గర పెడుతున్నాను.
పూలివ్వలేక చెట్టు అలిసింది కానీ..
నీ ద్వేషం మాత్రం ఊరుతూనే ఉందని తెలిసీ
కోయడమే మానుకున్నా.

సర్వ మానవ హితమే మన మతం అని చెప్పిన
వివేకానందుడు లాంటి మనిషి
ఎక్కడైనా కనబడతాడేమోనని వెదుకుతున్నా
హితమనే భావన ఉందా ఎక్కడైనా కనబడుతుందా
అని అడగాలని.

మీ ద్వేష దేహాల చుట్టూ గీసుకున్న బలవంతపు రేఖలని చెరిపేసి
ప్రేమపాశంతో   హత్తుకుందామనుకున్నా నువ్వు దూరం జరుగుతుంటే
 మానవ బాంబు వేమో అని అనుమానం రాకుండా ఎవరాపగలరు ?

ధనవంతుడైన దళిత కుటుంబంలో పుట్టాలి బక్క చచ్చిన బ్రాహ్మణ  కుటుంబంలో పుట్టే కన్నా అని విరక్తిగా  ఒకడ నుకుంటే -కూటికి  చస్తే చచ్చాం కానీ దళిత కుటుంబంలో పుట్టి గొడ్డు మాంసం తినడం కన్నా చావడమే మేలు అనుకునే ఇంకొకడుంటాడు.  ఎంత అరిచి గీ పెట్టినా పుట్టుకనేది మన చేతిలో లేని పని. అవకాశాలు కూడా అందరికి దక్కవు  పుట్టుకకి, అవకాశానికి మధ్య రాజకీయం నడుస్తూ ఉంటుంది. జీవులని పావులుగా చేసి ఆదుకునేది కొందరు .  ఎవడైనా బలపడాలనుకునప్పుడు  రెండు తప్పనిసరిగా కావాలి  ఒకటి ఆర్ధికంగా బలపడటం, రెండవది పాలించే స్థాయికి ఎదగ గలగడం. మూలస్థాయిలో అందరిలో ఆ అగ్ని ఉండాలి. లేనప్పుడు ఇలా కొట్టుకు చస్తూనే ఉందాం .

ఈ దేశంలో ...
ఉషోదయం కోసం పూమొగ్గలు ఎదురు చూసినట్లే
రాబందులు ఎదురుచూస్తూ ఉంటాయి
రెండిటికి తేడా ఏమిటో గ్రహిస్తే ... గర్హించాల్సినవి చాలా ఉంటాయి .  ముందుగా మనం ఉండాల్సింది మానవుడిగా ..
చేతిలో చెయ్యేసుకుని నడుద్దాం రా... మనం మనం విశ్వసించుకోవడానికి ... ఇతరులు మనని  విశ్వసించడానికి.

 మనం భారతీయులం. భారతీయులందరూ ... !?  దాయాదులు మాత్రమేనా, సహొదరీ సహోదరులు కారా !?




7, మే 2016, శనివారం

ఇప్పుడు కూడా రావా..అమ్మా!

ఇప్పుడు కూడా రావా అమ్మా ! (కథ)     - వనజ తాతినేని. 

"అస్మా నీతో మాట్లాడిందా ?"
 ఊ ...
"ఏమందీ ?" ఆత్రుత నాలో 

"ఇప్పుడు కూడా రావా అమ్మా ? అని అంది. మాట్లాడకుండా పెట్టి పడేసా ! " చెప్పింది విజయ. 

"మళ్ళీ చెప్పు ! అమ్మా అని పిలిచిందా నిన్ను"  ఎక్కడో ఆశ. సందర్భం ఏదైనా ఓ బిడ్డ తన తల్లిని పిలవడం నా దృష్టిలో ఓ అద్భుతం .

విజయ గుర్తుతెచ్చుకొంటున్నట్లుగా ఓ క్షణమాగి " ఇప్పుడు కూడా రావా అమ్మా !?" అంది

వింటున్న నేను విచలితమైపోయాను. సమాధానం చెప్పకుండా ఫోన్ కట్ చేసుకున్న తల్లి గుండె బండరాయేమీ కాదు మనసున్న మనిషే.  పరిస్థితులే ఆమెనలా  బండరాయిలా మార్చేసాయి.
.
అవతల  విజయ భోజనం చేస్తూనే నాతో  మాట్లాడుతుంది.    అలాంటి పరిస్థితిలోకూడా  అంత నిశ్చలంగా ఉందంటే, మాములుగానే తిండి తింటూ మాట్లాడుతుందంటే, నేను కాకుండా మరెవరైనా ఫోన్ లో మాట్లాడుతూ  ఉన్నట్లయితే    అసలీమె ఆడపుట్టుక ఎలా పుట్టింది ? అని తిట్టుకోవడం,అసహ్యించుకోవడమూ ఖాయం.

 ఈ సంభాషణ వినడానికి ముందు నేనో  గంట వెనక్కి వెళితే ఏం జరిగిందంటే ... 

ఇంట్లో పనై పోయాక కాస్త విశ్రాంతిగా  ఆన్ లైన్ లోకి వెళ్ళి నోటిఫికేషన్స్ చూసుకుంటున్నాన్నేను. విజయ లైన్ లోకి వచ్చింది. క్షేమసమాచారాలు పూర్తయ్యాక .. చెప్పమ్మా ! ఏమిటీ విషయాలు అనడిగాను . నీతో మాట్లాడదామనే కాల్ చేసాను . మళ్ళీ ఇలాంటి అవకాశం నెల రోజులకి గాని రాదు "ముట్టుపండగ మూలంగా బయట కూర్చున్నా " అందుకే తీరుబడిగా ఉన్నా! కాస్తంత స్వేచ్చ, తీరుబడి లభించినందుకు ఆనందం ఆ  గొంతులో.  

" చెప్పు, ఏమిటీ సంగతులు ? "

"నిన్న మధ్యాహ్నం నేను, వాసుగారు  కలిసి భోజనం చేస్తున్నాం. రజియా ఫోన్ చేసింది . నేను తీయలేదు. పోన్ అన్నిసార్లు వస్తుంటే తీయవేంటి అనడిగారు  వాసు.  తీయాల్సిన అవసరం లేదులెండి, తీసే ఇంటరెస్ట్ కూడా లేదు అన్నాను . "ఏంటి మీ ఆయన ఫోన్ చేస్తున్నాడా " అని అడిగాడు. నేను మాట్లాడకుండా ఉండిపోయాను"  అంది విజయ. 

"అదేంటి, మీ ఆయన అంటుంటే ఎలా ఊరుకున్నావ్ ! మీరు నా ఎదురుగానే ఉన్నారు కదా అని అనలేదా ?  అలా మౌనంగా ఎందుకున్నావ్ ? "  నాలో కోపం కట్టలు తెగుతుంది  .

"నీకున్న ఆవేశం, కోపంలో వందో వంతైనా లేవు నాకు. నిత్యం మనసుకి ఎన్నో గాయాలవుతానే ఉంటాయి. ఇదో గాయం అనుకుని  ఊరుకున్నాను." మళ్ళీ బాధ విజయ గొంతులో. 

"రజియా మళ్ళీ ఎందుకు కాల్ చేసింది . అసలా పాత నెంబర్ మార్చమంటే వినవు. ఆ నెంబర్ లేకపోతే వాళ్ళు  నీ వెంటపడటాలు ఉండవుగా?  కోపంగా అరిచాను నేను. 

"అసలు సంగతి విను, ఆ అమ్మాయి కాల్  నేను తీయలేదు కదా ! గుంటూరు పోలీస్ స్టేషన్ నుండి కాల్ వచ్చింది అంది విజయ. ఆ  మాట వినగానే అస్మా కి ఏం  జరగలేదుకదా ! నిత్యం ఆడపిల్లలపై ఏవేవో ఘటనలు జరుగుతున్నాయసలే , భయంవేసింది ఆక్షణంలో.  తర్వాత క్షణంలో విజయ  ఏం  చెపుందోనని వినడానికి చెవులు రిక్కించాను.

"సి ఐ  అంట. మీకొక ఇన్ఫర్మేషన్ చెప్పాలని కాల్ చేసాను.  మీ భర్త  జానీ బాషా ఈ రోజు మధ్యాహ్నం చనిపోయాడు.  శవాన్ని మార్చురీలో ఉంచారు .  యాక్సిడెంట్ కేస్ కదా ! రేపు పోస్ట్మార్టం తర్వాత బాడీని అప్పగిస్తాము. విషయం మీకు చెపుదామని చేసాను, మీ వాళ్ళు  ఫోన్ చేస్తుంటే మీరు  లిఫ్ట్ చేయడం లేదంట.   అని చెప్పాడు . "

"నువ్వేమన్నావ్ ? "నా అసహనమైన ప్రశ్న. 

"అతనితో నాకేమీ సంబంధం లేదండి. మాకు విడాకులు కూడా అయిపోయాయి. నేను అక్కడికి  రాను, నా కోసం ఎదురు చూడవద్దని చెప్పండి" అని చెప్పాను. మళ్ళీ కాసేపాగిన తర్వాత ఇంకో  కానిస్టేబుల్ పోన్ చేసి ఇదే విషయం చెప్పాడు.  అతను మాట్లాడాక  రజియా మాట్లాడింది. "వదినా ఆఖరిసారి చూసుకుంటావని చెపుతున్నాను" అంది.

"నేను రాను, రావాల్సిన అవసరం లేదు, నా కోసం ఎదురు చూడకుండా మీ పనులు మీరు చేసేసుకోండి"  అన్నాను .

"అదేంటి వదినా అలా అంటావు ? పెద్దవాళ్ళు చేసిన పెళ్ళి కూడా కాదు ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు, గొడవలు పడ్డారు, విడిగా ఉంటున్నారు . విడిగా ఉంటున్నంత మాత్రాన నీ భర్త కాకుండా పోతాడా !? కడసారి  చూపు,  వచ్చి చూసుకుని వెళతావని చెపుతున్నా" అంది . ఫోన్ పెట్టేసాను. వాసుగారు  రాత్రి ఇంటికి వచ్చాక ఈవిషయం చెప్పాను . ఆయనేమీ  మాట్లాడలేదు.  "మీరేమి భయపడకండి  నేను వెళతానేమోనని. నాకస్సలు సంబంధంలేని విషయాలవి  అనికూడా చెప్పాను". అంది విజయ. 

"మనిషి ఎలాంటి  వాడైనా మరణం బాధిస్తుంది కదా ! నువ్వెళ్ళవని నేనూ  ఖచ్చితంగా చెప్పగలను. ఎలా జరిగిందట యాక్సిడెంట్ ? తాగి వెళుతూ తనే దేన్నో గుద్దేసి ఉంటాడు, అంతేనా ! "అడిగాను. విజయ మాజీ మొగుడు ఇప్పుడు చనిపోయిన జానీ బాషా పై నాకున్నది   అలాంటి అభిప్రాయమే! నాకే కాదు  అతనేమిటో   తెలిసిన వాళ్ళందరి దృష్టిలో కూడా అతనంతే ! 

 విజయ వివరంగా  చెపుతుంది "ఆటో వాడు కొట్టేసాడంట. రెండు రోజులుగా  హాస్పిటల్ లో  ట్రీట్మెంట్ జరుగుతూనే ఉందట. మూడో రోజు చనిపోయాడంట . ఈ రోజు ఉదయం కూడా రజియా కాల్ చేసింది. " వదినా! మేము మా సంప్రదాయాలవీ పాటించమని అడుగుతామని భయపడొద్దు ఊరికే వచ్చి చూసి వెళ్ళిపో" అంది. 

" తోడుగా రావడానికి మా నాన్నకూడా లేరు, చనిపోయారు.  నేను రానులే, మీరు  కానిచ్చేయండి" అన్నాను.

"ఇదిగో నీ కూతురు మాట్లాడుతుందట " అంది రజియా . 

నా కూతురు ఎందుకవుతుంది ? నా కూతురైతే నా దగ్గరే ఉండేది . నేను అడగగానే మీరే పంపించేసి ఉండేవాళ్ళు.  అలాగే నేను  అమ్మనని అస్మా  అనుకునుంటే  అది నా వెంట కొన్నేళ్ళ క్రితమే  వచ్చేసేది. అలా జరగలేదు కదా !   చిన్నప్పటి నుండి నువ్వే పెంచుకుంటున్నావ్ కనుక అది ఎప్పటికి నీకూతురే ! అని  ఫోన్ పెట్టేసాను. 

 విజయ పై జాలేసింది " అప్పుడైనా చెప్పకపోయావా తల్లీ , నీకు  మళ్ళీ పెళ్ళైంది అని.  మీ ఊరికి ఆ ఊరికి మధ్య  పది పదిహేను కిలోమీటర్ల దూరం కూడా లేదు. వాళ్ళకీ విషయం  తెలియదంటావా !? అడిగాను అనుమానంగా. 

"తెలియదమ్మా ! పిల్లని పంపకపోతే మా వాళ్ళు పెళ్ళి చేస్తానని అంటున్నారని చెప్పానే కానీ పెళ్ళి చేసుకుంటానని చెప్పలేదు. వదిన అలాగే అంటుంటూ ఉంటుందిలే అన్నట్టు తేలిగ్గా తీసుకుంటుంది రజియా.   నేను  అస్మాతో మాట్లాడి రెండేళ్ళు అవుతుంది .   వాళ్ళూ  కాల్ చేయలేదు, నేను చేయలేదు. అలా జరిగిపోయింది ." మాములుగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ అంది విజయ. 

"బాధేస్తుందమ్మా, అస్మాని  రమ్మని, రజియానేమో  పిల్లని పంపమని మనం  వెళ్ళి ఎంతగా బ్రతిమాలాడాం. ఆపిల్లొచ్చి నీదగ్గర వుంటే నీకీ మరోపెళ్ళి  సంసారలంపటం ఏవీ  ఉండేవికాదు. ఆ పిల్లని పెట్టుకుని చక్కగా ఉద్యోగం చేసుకుంటూ బ్రతికేదానివి.  పిల్లకి మంచి భవిష్యత్ లభించేది. ఏమిటో ఇదంతా తలచుకుంటే దిగులేస్తుంది" అన్నాను

"మా నాన్నని వద్దంటే నన్ను కూడా వద్దనుకో అని నిక్కచ్చిగా చెప్పిన  పిల్లని ఎలా తీసుకు రాగలం? తీసుకొచ్చినా ఆ పిల్లని బలవంతంగా ఉంచగలమా !  తండ్రి గురించి  ఆ పిల్లకి తెలియని కోణాలని  చెప్పి అర్ధం చేసుకుంటుందని ఆశించగలమా ? ఆచరించే మతం, ఆహారపు అలవాట్లు, నా పట్ల లేని ప్రేమ ఇన్నింటిమధ్య ఆపిల్లని పెంచడంకూడా కష్టమే ! పోనీ..  పొతే పోనీ అని వదిలేసానందుకే" కూతురు పట్ల ప్రేమ ,తన నిస్సహాయత విజయ గొంతులో తెలుస్తుంది నాకు.  

"బాధపడకు, అలా జరగడంలో నీ తప్పేమీ లేదని అందరికి తెలుసు" ఫోన్ లోనే ఓదార్చాలని చూసాను. 

"ఏం  చేస్తాం? భగవంతుడు నారాత, దాని వ్రాత అలా వ్రాసిపెట్టాడు. నేనిక్కడ ఇలా, అదక్కడ అలా ! అదే మనుషులు, అదే పరిసరాలు,  ఆ మురికి కూపంలోనే కూరుకుపోతుంది  "ఎంతో బాధని, ఆవేదనని గొంతులో అణుచుకుంటూ మాములుగా  చెప్పాననుకునేటట్లు చెపుతుంది.  తన మాటలని కొనసాగిస్తూ "అదే రోజు మళ్ళీ రజియా ఫోన్ చేసింది. నేను తీయ కూడదనుకున్నాను. అక్కడే ఉన్నమా  మేనల్లుడు తీసాడు. అస్మా మాట్లాడతానందని తెచ్చి చెవి దగ్గర పెట్టాడు .   " "ఇప్పుడు కూడా రావా అమ్మా! అంది .  ఏమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేసాను" అంది విజయ. 

 వింటున్న నాకు గుండెలో కలుక్కుమంది.  వేయి మ్రుక్కలై విరిగిపోయిన మనసైనా ఆమాట వినగానే బిడ్డ దగ్గరకి  పరుగులు తీయాలి. మీ నాన్న చనిపోయినా నేనున్నాను కదమ్మా అని హృదయానికి హత్తుకుని ఓదార్చాలి. కానీ విజయ వెళ్ళలేని పరిస్థితులు.  కంటి వెంట చుక్క రాలని అంతర్దుఖాలు ఉంటాయి. బహుశా  విజయ కూడా ఈ క్షణంలో  అలా  దుఃఖపడుతూనే  ఉండి ఉంటుందనిపిస్తుంది నాకు.   

"జీవితంలో మనకి సంబంధించినవి, మనకి సంబంధం లేనివీ ఏవేవో జరిగిపోతూనే ఉంటాయి . ఒక చట్రం  నుండి మరొక చట్రంలోకి  మనం మారిపోతుంటాం కానీ తెంచుకోలేని బంధాలు వెంటాడుతూనే ఉంటాయి అల్లుకుందామనుకున్న బంధాలు  మొగ్గలోనే చిదిమి వేయబడతాయి. వద్దనుకున్నవి కాళ్ళకి పాముల్లా చుట్టుకుంటాయి, జీవితమింతే ! ఇంకా ఏదో చెబుతూనే ఉంది  విజయ. నాకు  వినాలనిపించలేదు.  "కొంచెం ఉండమ్మా ఏదో పని బడింది, మళ్ళీ మాట్లాడుకుందాం "అని ఫోన్ కట్ చేసేసాను .

ఏమిటీ విజయ ఇలా చేస్తుంది?  ఆ పిల్ల అడిగిన తీరు ఎంత బాధగా ఉంది. ఏ రక్త సంబంధంలేనీ నాకే  ఇలాఉంటే విజయ తన మనసుని ఎలా ఉగ్గబట్టుకోగల్గుతుంది, ఈమె అసలు తల్లేనా ? మొన్నటికి మొన్న నాలుగో నెల వచ్చాక అబార్షన్ చేయించుకుని పనిలోపనిగా ట్యూబెక్టమీ కూడా చేయించేసుకుంది. అబార్షన్ వద్దులేమ్మా ! ఈ ఒక్కరిని కని పెంచుకో!  నీ జీవితానికి  ఒక అర్ధం ఉంటుంది. ఆధారం ఉంటుంది అని చెప్పినా  ఈ విజయ  వినలేదు .

"కొడుకులకి పెళ్ళి చేసి తాత అవ్వాల్సిన వయస్సులో పిల్లలేమిటని జనం నవ్వుతారు. ఎంత ఖర్చైనా  పర్వాలేదు అబార్షన్ చేయించుకోమన్నారు వాసు గారు. మా అత్తగారు కూడా ఆయనకి  వంత పాడింది.  ఏదో  పెళ్లి చేసుకున్నానన్న మాటే కానీ నాక్కూడా పిల్లలని కనాలి, పెంచాలనే ఆసక్తి లేదులేమ్మా !   కొన్ని జీవితాలకింతే అని సరిపెట్టుకోవడమే ! " అని వేదాంతం ఒలకబోస్తే ఆమెని ద్వితీయ వివాహం చేసుకున్న వాసు పై నాకు చెప్పలేనంత  కోపం వచ్చింది.

అసలు కొడుకులకి పెళ్ళి  చేసే వయసులో భార్య చనిపోయిన ఏడు నెలలకే  అతను మళ్ళీ పెళ్ళెందుకు  చేసుకున్నట్టో !  విజయ చేస్తున్న ఉద్యోగాన్నిఅంత అవసరం లేదంటూ  మానిపించేశారు.  గర్భం ధరించి కడుపున ఒక కాయ కాస్తుందనుకుంటే పిందెలోనే త్రుంచేసారు.  వాళ్ళిద్దరికీ  పదిహేనేళ్ళకి పైగా  వయసు తేడా ! క్యాన్సర్ తో చనిపోబోతున్న తండ్రి  ఆఖరి కోరిక ప్రకారం  విజయ ఆ పెళ్ళికి తలవంచింది కానీ ఈ రెండో మొగుడి ప్రవర్తన తో ఎంత నరకం అనుభవిస్తుందో ! " మొదటి పెళ్ళి  బావుందా! రెండోది బావుందా? అనే వంకర ప్రశ్నలెదుర్కుంటూ, జీవితంలో గోల్డెన్ డేస్ అంటే గతించిన భార్యతో  గడిపిన ముప్పై ఏళ్ళ జీవితమే అని చెప్పుకుంటూ అడుగడుకుకి మొదటి భార్య జ్ఞాపకాల మధ్య తనతో సరసాలాడే అతన్ని భరిస్తూ, ఇంటికొచ్చే చుట్టపక్కాలని ఆదరిస్తూ అత్తగారి ఆజ్ఞలకి లోబడి ఇంటి పనులు చేస్తూ,  ప్రాణ స్నేహితురాలైన నాతో  కూడా మాట్లాడే తీరిక లేకుండా బ్రతుకుతుంది. ఈ ముదనష్టపు రెండో పెళ్లై  ఏడునెలలు కూడా  పూర్తీ  కాలేదు. విజయ నాన్న బలవంతం లేకుంటే ఆమె ఈ పెళ్ళి  చేసుకునేదే కాదు. ఈ జానీ బాషా ఒక ఏడు  నెలలు ముందు చచ్చి ఉంటే  ఎంత బాగుండేది. అస్మా  తండ్రి ఊసేత్తకుండా తల్లి దగ్గరకి వచ్చేసి ఉండేది కదా " అని మనసులొ తిట్టుకున్నాను.    

ఖచ్చితంగా నాక్కూడా  తెలుసు. తండ్రి  ఆఖరి కోరిక నెరవేర్చే క్రమంలో  విజయకి జరిగిన  రెండో పెళ్ళి ఆమెని   ఓ కాస్ట్లీ పనిమనిషిని చేసింది. ఇంకో తండ్రి మరణంవల్ల ఒకపిల్ల  "అస్మా" అనాధగా మారి ఎవరి దయదాక్షిణ్యాల మీదో పెరుగుతూ  మనసులో తల్లి పట్ల మరింత ఏహ్య భావాన్ని  పెంచుకుంటుంది. తల్లి బిడ్డల మధ్య విధి ఆడిన వింత నాటకమిది.  నా స్నేహితురాలు విజయ తల్లి మనసు "ఇప్పుడు కూడా రావా అమ్మా ? "అనే ప్రశ్నని నిమిషానికొకసారి గుర్తు చేసుకుంటూ, హృదయం తల్లడిల్లిపోతూ కూడా పైకి రాయిలా  బ్రతుకుతుంటుంది.  నాకేమో  విజయని  తలచుకుంటే  కన్నీరు ఉబుకుతుంది. 

(ప్రజాశక్తి ఆదివారం స్నేహ సంచికలో 2016 మే 8 వ తేదీ సంచికలో)