17, సెప్టెంబర్ 2025, బుధవారం

అమృతమథనం


బెంగాలీ మూలం కథ తెలుగు అనువాదంలో వినండీ..


మంచి కథ. బెంగాలీ మూలం. 45 నిమిషాలు కష్టపడి ఆడియో రికార్డు చేసాను. వీడియో చేసి అప్లోడ్ చేయడానికి మరో రెండు గంటలు పట్టింది. స్పందన లేదు. చాలా బాగుంది కథ.

ఇక్కడ share చేస్తున్నాను.. ఆసక్తి ఉన్న వారు తప్పకుండా వినండీ.

14, సెప్టెంబర్ 2025, ఆదివారం

పాపాయి మహత్యం

 



 పాపాయి మహత్యం

కొన్నాళ్ళు మనసంతా వరద తీసిన ఏరులా

మూడు నెలల కాలం మూడు క్షణాల్లా పరిగెత్తి 

గాలి రెక్కలమీదకి మళ్ళిపోయింది

పూవులన్నీ కొత్త సుగంధాలు విరజిమ్మాయి

 ప్రతి కొమ్మా మరిన్ని పూవులు ఎక్కువే పూసింది 

ప్రతి పువ్వు మరికొన్ని రేకులు అదనంగా విరిసింది 

తువ్వాయి లాటి పాప కోసం మల్లెల్లో మల్లెగా 

తీవెల్లో లేత నునుపైన చిరు తీ వె గా

పాప తోటంతా కల దిరిగి 

ఆకు ఆకులో ఒక కలను చిత్రించింది 

ఆ చిన్నారి పాదానికి అంటి ఆ తొవ్వలలోని దుమ్ము 

ఎంత బంగారమై మురిసిపోయిందో 

పాపకన్నా సొగసైన పూలు ఎక్కడ 

పాప వెన్నెల నవ్వుకన్నా 

తెల్లని మల్లెలెక్కడ విరిసేయి గనుక 

కలువ లెంతగా కళ్ళు విప్పార్చి విరిసేయని 

పాప నల్లని తుమ్మెదల కళ్ళు చూసి....

పాప లోకంలో పాపయి మైమరచిపోయింది 

ఒక నాయనమ్మ 

పాల నురుగై ఎగసింది

నిండు పౌర్ణమై కల కలా నవ్వింది నాయనమ్మ




సంతకం

 



సంతకం -వనజ తాతినేని 


నేనే నిలువెత్తు సంతకం అంటాను గర్వంతో

కానీ అడ్డంగా పెడతాను సంతకం

కొంతవరకూ పెరగడం నా అభిమతం 

తర్వాత అడ్డంగా పెరగడమే నా బలం బలహీనం 

నిలువు అడ్డం పొడవు వెడల్పు గుండ్రం 

ఎందులోనూ వొదగనిది నా అహం 

ఒక్కసారి గా జారింది ఆ.. పంతం 

అర రోజు బతికే ఈ పువ్వు కెంత  వైభవం 

అందుకేనా ఆకసం వైపు దాని  వీక్షణం

మరి నాకేది.ఇన్నేళ్ళలో ఆ భాగ్యం 

మీకు నచ్చిందా ఛాయాచిత్రం 

మరెందుకు ఆలస్యం.. 

మెచ్చుకోండీ..  అవశ్యం




12, సెప్టెంబర్ 2025, శుక్రవారం

William Wordsworth Daffodils కవిత అనువాదం లో ..





 I Wandered Lonely as a Cloud 

‘by William Wordsworth

Daffodils 


విలియం వర్డ్స్ వర్త్ గారి   ప్రసిద్ధ కవిత... డాఫోడిల్స్ కు యధాతధ యధా శక్తి అనువాదం.... చిత్తగించండి...


.లోయలమీదుగా  గిరుల మీదుగా ఎత్తున తేలుతున్న 

ఒక మేఘం లాగ ఒంటరిగా తిరుగుతూ

అతిథిలా ఎదురైన బంగారు వన్నె డాఫోడిల్ పుష్పాల్ని సరస్సు పక్కగా చెట్లక్రిందుగా గాలిలో నాట్యం చేస్తుండగా చూసినప్పుడు 

ప్రకాశించే నక్షత్రాల చాలులాగ

పాలపుంతలో మిణుకు మిణుకుమంటూ 

నీటి సరస్సు అంచుల్లో ఒక అంతే లేని మడుల్లావిరిసిన 

పదిలక్షల పూలని ఒకేసారి చూడగా 

సుతారంగా తలలుపుతూ సన్నగా నర్తిస్తున్నట్టుగా అవి 

నెమ్మదిగా కదులుతాయి 


వాటికి ప్రక్కనే ఉన్న అలలూ కదులుతాయి 

నాట్యం చేస్తున్నట్టుగా .... కానీ 

వాటిని ఈ పుష్పాలు తమనవ్వులతో

వెనక్కి నెట్టేస్తాయి 

వాటిని ఒక కవి కేవలం దర్శించగలడు తప్ప 

ఇంకేమీ రాయలేదు అటువంటి వాటి మనోల్లాస సాహచర్యంలో 


నేనూ కళ్ళప్పగించి చూస్తూ చూస్తూ ఉండిపోగా 

ఒక చిన్నపాటి ఆలోచనా తరంగం మనసులో కదిలింది 

ఆ దృశ్యం కట్టి ఇచ్చిన సంపద నాకేమిటి ఇచ్చిందో చెప్పాలనే చిన్నపాటి ఊహ మెదిలింది 


తరచుగా నేను వెల్లకిల్లా పడుకుని ఆకాశం వైపు చూస్తానా 

 బాధాకరమైన ఆ మానసిక స్థితిలో అప్పుడు ఆ పుష్పాలు నా అంతర్నేత్రం లో తళుక్కుమంటాయి

ఆ ఒంటరి వేళల్లో అవి మధురమైన దివ్యాశీశ్సులు గా స్ఫురిస్తాయి 

ఇక నా హృదయమంతా ఆనందంతో నిండిపోయి తాను కూడా 

ఆ వేలాది డాఫోడిల్ పుష్పాలతో పాటే నాట్యం చేస్తుంది.


(అనువాదానికి, మాకు ఇంటర్మీడియట్ లో ఈ పద్యం తరగతి గదిలో ఇంగ్లీష్ అధ్యాపకులు శ్రీ మురళి కృష్ణ గారు బోధించినప్పడు కలిగిన స్ఫూర్తి కి, ఆ మాస్టర్ గారికి ఈ అనువాదం అంకితం చేస్తున్నాను.)


అనువాద కర్త: P.సింహాద్రమ్మ. విశాఖపట్టణం

ఈమె నా మిత్రురాలు. ఆమె అనుమతి తో ఈ అనువాదాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాను. ధన్యవాదాలు. 

10, సెప్టెంబర్ 2025, బుధవారం

మధుపంబు నైనా కాకపోతిని..

మధుపంబు నైనా కాకపోతిని

ఆకు ఆకు పైన పూలు రాలాయి అక్షరాల వలె 

పూలన్నీ యేరి దండ గుచ్చాను

అతడు అక్షరాలన్నీ పేర్చి కవితలల్లాడు

అల్లిన దండ వినమ్రంగా గుడికి చేరింది

కవిత అదృష్టవశాత్తు పత్రిక కెక్కింది

అది చూపి కవి గారు విర్రవీగారు 

పూలు రోజూ విరబూస్తూనే వున్నాయి 

పోటీకి వచ్చిన కవిత్వమేమో వెగటు కొడుతుంది. 

పూల సౌందర్యం.. కాంచిన కనులది

కవితా సౌందర్యం.. అంతఃచక్షువుది. 

ఏది మూయాలి!? ఏది తెరవాలి !? 

నేను పూవునైనా కాకపోతిని 

పోనీ..కవితా మధువును గ్రోలే 

మధుపంబు నైనా కాకపోతిని

కవిని కాటేసేందుకు..

  • వనజ తాతినేని. 




అంతన్నారు ఇంతన్నారోయ్ NRI ల అమ్మనాన్నలూ..

 


అంతన్నారు ఇంతన్నారోయ్ NRI ల అమ్మనాన్నలూ.. 


అమెరికాలో అంత ఇల్లు వుండటం గొప్పా!? ఇంతిల్లు వుండటం చులకనా !?  


అమెరికా గొప్పదే! కానీ అదేమీ భూతల స్వర్గం కాదు కుబేరుని ధనాగారం కాదు. ముందుగా ఆ దేశాన్ని గొప్పగా ఊహించుకోవడం పోల్చుకోవడం మానేయాలి. మన జన్మభూమి ఎంత అందమైన దేశం అని పాడుకోకపోయినా ఎవరి మాతృదేశాన్ని ఎవరి మాతృభాషను వారు ప్రేమించుకోవాలి గౌరవించుకోవాలి కదా! 


ఈ మధ్య కొంతమంది తెలుగు వారు అక్కడికి విదేశీ యాత్రకు లేదా పిల్లల దగ్గర కు వెళ్ళి ఇబ్బడిముబ్బడిగా 

వీడియోలు తీసి ఇక్కడ పెడుతున్నారు. సంతోషమే! కానీ అక్కడ H1B వీసా పై ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళందరి జీవితాలు అంత గొప్పగా ఏమీ వుండవు. మన దేశంలో లక్ష రూపాయలు జీతం తెచ్చుకునే వాళ్ళ జీవితం లావే వుంటుంది. . భార్యభర్తలిద్దరూ   ఉద్యోగాలు చేస్తే తప్ప ఇప్పటి మార్కెట్ ని బట్టీ సింగిల్ హోమ్ కొనలేరు. అసలు సొంత ఇల్లు లేకుండా అపార్ట్మెంట్ లో వుండేవాళ్ళు 60 శాతం మంది వుంటారన్న సంగతి మనకు తెలియదు.. 


ఇతర దేశాల నుండి పొట్ట చేతబట్టుకుని వలస పక్షుల్లా వెళ్ళిన వారు రెండు సూట్కేస్ లు చేతబట్టుకుని ఎన్నెన్నో కలలతో వెళతారు. వాళ్ళ వెనకాల లక్షల కొద్దీ ఎడ్యుకేషన్ లోను వుంటుంది. ఏదో కొంతమంది సంపన్న కుటుంబాల  పిల్లలు స్టేటస్ కోసం లేదా సరదాగానూ వెళుతుంటారు. ఒక్క అమెరికా నే కాదు ఏ ఇతరదేశం వెళ్లిన వాళ్ళైనా అక్కడ ఉద్యోగ అవకాశాలను బట్టీ తమకు లభించే జీతం రాళ్ళను బట్టీ అనేక కారణాల బట్టి అక్కడే స్థిర పడటానికి నిర్ణయించుకుంటారు. మన దేశంతో పోల్చుకుంటే అమెరికా ఆస్ట్రేలియా బ్రిటన్ జర్మనీ మొదలైన దేశాల్లో  పరిశుభ్రతకు పెద్దపీట వేస్తారు.పరిసరాల వాతావరణం బాగుంటుంది. వ్యవస్థలన్నీ బాగా పనిచేస్తాయి. విద్య వైద్యం కూడా ఉచితంగా బాగుంటుంది. అందుకే మనవాళ్ళు అత్తెసరు ఆదాయంతోనైనా అక్కడే

స్థిరపడాలనుకుంటారు. 


ఇకపోతే ముందుగా చెప్పుకున్నట్టు అమెరికాలో అందరికీ పెద్ద పెద్ద ఇళ్ళు వుండవు.ఎకరంలోనో అర ఎకరంలోనో నలభై సెంట్లు ముప్ఫై సెంట్లు లో ఇల్లు వుండదు. అలా వుండాలి అంటే వారు ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం వెళ్లిన వారు అయి వుంటారు. ఇప్పటి వాళ్ళకు అంత పెద్ద ఇళ్ళు వున్నాయంటే వాళ్ళు తాము వుండే సిటీకి చాలా దూరంగా వెళ్ళి వుంటారు . ఇప్పటి అప్పటి పరిస్థితుల్లో అయినా నగరం మధ్య అంత పెద్ద ఇల్లు పెద్ద ఖాళీ స్థలం రావడం శక్తి కి మించిన పని. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ కనీసం ఒకరి పూర్తి జీతాన్ని EMI గా చెల్లించాలి. వాళ్ళ జీవితాన్ని 15 నుండి ముఫై ఏళ్ళపాటు బ్యాంకు కి తాకట్టు పెట్టుకోవాలి. పైగా ఆ ఇళ్ళు కమ్యూనిటీ లో వున్నట్లైతే ఇంకా నెలవారీ చెల్లింపులు ఎక్కువగానే వుంటాయి. 


మానవుడికి ఇల్లు మూడు ఫ్రాధమిక హక్కు  తర్వాత వుండే ప్రాధమిక అవసరం కాబట్టి.. సిటీలో వుండాలంటే అద్దె కూడా ఎక్కువే చెల్లించాలి కాబట్టి  అక్కడ వున్నవారు ముందుగా ఇంటి వైపు దృష్టిపెట్టాలి. పెడతారు  కూడా! ఆ క్రమంలో సిటీకి దూరంగా నైనా వాళ్ళ కలలకు అనుగుణంగా ఆర్థిక స్థోమతకి అనుగుణంగా ఇల్లు కొనుక్కొంటారు. ఆ ఇల్లు ఉద్యోగం చేసే చోటుకు గంట గంటన్నర రెండు గంటలు ప్రయాణదూరంలో వుంటుంది. పొద్దున్నే లేచి రాత్రి వండి ప్రిడ్జ్ లో పెట్టిన వాటిని లంచ్ బాక్స్ లో సర్దుకుని ఓ అరగంటపాటు అయినా డౌన్ టవున్ ట్రాఫిక్ లో పడి వెళ్ళి మళ్ళీ అదే మాదిరి ప్రయాణం చేస్తూ ఇంటికి చేరుకోవాలి. ఇవన్నీ తల్లిదండ్రులు చెప్పుకునే  గొప్పలు వినే వాళ్ళ కంటికి కనబడని సత్యాలు. కమ్యూనిటిలో కాకుండా బయట స్థలం కొనుక్కుని ఇల్లు కట్టించుకునే వారు వుంటారు. అసలు ఇంటికి ఫెన్సింగ్ లేనివాళ్ళు వుంటారు. అక్కడ ఫెన్సింగ్ వేయించుకోవడం కూడా ఖర్చు తో కూడిన పని. మా అబ్బాయి ఇల్లు ఇలా పెద్ద గా వుంది మా అమ్మాయి ఇల్లు ఇలా వుంది అని గొప్పగా చెప్పుకుంటూ చూపించుకుంటూ వుండేవారు ఆ ఇల్లు కొనడం వెనుక వున్న కష్టాలు మాత్రం చెప్పరు. ఏం? మన దేశంలో మాత్రం సిటీలకు దూరంగా ఒక ఎకరం పొలం కొని ఓ రెండు అంతస్తుల ఇల్లు కట్టుకుని అక్కడి ప్రశాంత వాతావరణం లో జీవిస్తూ కోళ్ళు  కుక్కలు కుందేళ్లు పెంచుకుంటూ కూరగాయలు పండించుకుంటూ .. ప్రశాంతంగా జీవించకూడదా? అక్కడ లాగే రెండు గంటలు పాటు కారులో ప్రయాణించి వచ్చి కూడా ఉద్యోగం చేసుకోవచ్చు తిరిగి ఇంటికి పోవచ్చు. . మనదేశంలోనూ బ్యాంకులు సొంతింటి కోసం అప్పు  కూడా ఇస్తారు. మనకి వచ్చే ఆదాయ వనరులను బట్టే కదా బ్యాంకులు లోను ఇచ్చేది. 


నేను చెప్పేది ఏమిటంటే.. వాళ్ళు యూట్యూబ్ లో చూపించే వాటిని చూసి మనం కూడా అలా వుండాలి అని యువత భ్రమ పడవద్దు. అందులో ఇప్పుడు అమెరికా వెళ్ళడం మంచి నిర్ణయం కాదు. తీసుకున్న ఇంటికి లోన్ ఎలా కట్టాలో ముందు ముందు  ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి రావచ్చు. HIB పై జాబ్ చేసేవాళ్ళకు కూడా ఎప్పుడైనా ఉద్యోగం పోవచ్చు రావచ్చు. ఇల్లు EMI కారు EMI  ప్యామిలీ మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వన్నీ పోతే వాళ్ళ జీతాల్లో మిగిలేది చాలా స్వల్పం. రెండేళ్ళ నుండి గ్రాసరీ రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి అంట.  దూరపు కొండలు నునుపు అంటారు కదా! ఆ బాపతు ఇప్పటి అమెరికా లండన్ బతుకులు. . అమెరికాలో పెద్ద ఇల్లు SUV కారు టెస్లా కారు గురించి కలలు కంటూ అతిగా ఆలోచించకండి.ఉద్యోగ భద్రత లేని దేశాలకు నిరుద్యోగం ఎక్కువగా ఉన్న దేశాలకు ఆర్థిక వ్యవస్థ బలంగా లేని దేశాలకు వెళ్ళే ప్రయత్నం ఎందుకు? ఇక్కడే ఉద్యోగ ప్రయత్నాలు చేయమని ఏడేళ్ళ క్రితమే కొంతమందికి సూచిస్తే పైకి ఏమీ అనకపోయినా చాటుగా తిట్టి పోశారు.  తర్వాత వాళ్ళ అనుభవం లోకి వస్తే కానీ విషయం బోధ పడలేదు. కలలు కనడం తప్పు కాదు ప్రయత్నం చేయడం తప్పు కాదు. ఏటికి ఎదురీది కొంతమంది మాత్రమే వొడ్డు చేరగలరు. మిగతావారు? నిండా అప్పుల్లో మునిగి పోతారు.  ఈ దేశంలో వున్న తల్లిదండ్రులు కూడా పరాయి దేశంలో వున్న తోటివారి పిల్లల్ని చూసి బంధువుల పిల్లలను చూసి .. వొత్తిడి పెట్టి తమ పిల్లల్ని పంపించిన వాళ్ళు వున్నారు. అక్కడ ఆ దేశంలో ఈ పిల్లలు నిలదొక్కుకోవడానికి…  ఎన్నో నియమ నిబంధనలు మధ్య వ్యతిరేక పరిస్థితుల మధ్య వొంటరి యుద్ధం చేస్తూ.. నెట్టుకు వచ్చారో!  ఎన్ని కష్టాలు అనుభవించారో!  అవి కూడా చెప్పాలి కదా! . మనకు వున్నవి గొప్ప గా ప్రదర్శించాలి అనే ఉత్సాహం తో మిగతా కష్టనష్టాలు గురించి ఎంత మాత్రం చెప్పరు కొందరు . ఇక్కడ ఆర్థికంగా బాగా వున్నవారు పిల్లలకు తమ ఆస్తులు అమ్మి బదిలీ చేస్తారు. అక్కడ  వ్యాపారాలు చేసేవారు కూడా వున్నారు. వారికి సాధ్యమైంది కాబట్టి అందరికీ  అలా సాధ్యం కాదు. అమెరికాలో టౌన్ హోమ్ ల్లో అద్దె కు వుండేవారు కోకొల్లలు. అవికూడా చూపించాలి. విజ్ఞత లేకుండా మనకున్న వాట్టిని ఎగ్జిబిషన్ పెట్టకూడదు. ఇతరులకు ఈర్ష్య కలిగించకూడదు. అర్థంపర్థం లేని గొప్పలు ప్రదర్శించకూడదు. ఇక అక్కడ వుండే వాళ్ళు మన దేశానికి వచ్చి భారీ ఎత్తున ఫంక్షన్ చేసి నగలు కొనుగోలు చేసి డిజైనర్ దుస్తులు ధరించి ఆర్భాటం ప్రదర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. మనం చూస్తున్న నాణానికి రెండో వైపు కూడా వుంది. వాళ్ళు ప్రదర్శించిన ఆడంబరాలు వెనుక వేల డాలర్ల క్రెడిట్ కార్డ్ వుంటుంది అని మనకు తెలియదు కదా! ముఖ్యంగా మధ్యతరగతి వారు విదేశాల్లో వున్న మన బంధువులతోనో  స్నేహితులతోనో పోల్చుకోవద్దు. వాళ్ళ అమ్మనాన్నలు చెప్పే డంబాసారాలు కూడా తలకెక్కించుకోవద్దు. అసలు వారితో పోల్చుకుని వొత్తిడి కి గురి కావద్దు. మన దేశంలో మనకు చాలా స్వాతంత్ర్యం వుంది. మనకి వుండటానికి ఇల్లు లేకపోతే కనీసం ఆ నీడ నివ్వకపోవచ్చు ప్రభుత్వం. కానీ మనం నిలబడి వున్న ఈ నేల మనం హాయిగా వుండగల్గే స్వేచ్ఛ ఇచ్చింది. చిన్నపాటి ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లో అనాలోచితంగా ప్రవర్తించినా కూడా కఠినంగా వ్యవహరించడం లేదు. మెడపట్టి బయటకు గెంటేయడం లేదు. ఇతర దేశాల జీవనశైలి ప్రమాణాలు మనకు లేకపోవచ్చు ఆకర్షణీయమైన జీతం లేకపోవచ్చు. కానీ స్వేచ్ఛ వుంది. అభద్రత లేదు. ఇతర దేశాల్లో వున్నప్పుడు వారి నియమ నిబంధనలకు తలవొగ్గి ఎలా వుంటామో.. ఇక్కడ కూడా అలా ఉండగలిగితే అది తప్పు కాదు చేతకాని తనం కాదు. 


మై డియర్ ఫ్రెండ్స్..ఆలోచించండి . NRIల అమ్మలు నాన్నలు అమెరికాలో వున్న మీ అబ్బాయి అమ్మాయి ల  ఇళ్ళు కార్లు గొప్పతనం YouTube లో ప్రదర్శించకండి. మీకు వ్యూస్ రావాలనుకుంటే అమెరికా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి జీవనాన్ని వారి వృత్తులను పంటల్ని వారి సంస్కృతి ని విహార ప్రదేశాలను  గొప్ప గొప్ప వ్యక్తులను అమెరికా  చరిత్రను పురాతన సంస్కృతి ని పరిచయం చేయండి. అమెరికన్ సంస్కృతి ని నేను చాలా గౌరవిస్తాను.ప్రేమిస్తాను. అలా అని మన దేశాన్ని నేను తూలనాడను. ఇదంతా నేను అక్కసుతో లేదా ఈర్ష్య మాత్రమే మాట్లాడుతున్నాను అని అనుకోవద్దు. మా అబ్బాయి 15 సంవత్సరాలు నుండి అక్కడే ఉన్నాడు.12 సంవత్సరాల నుండి గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లో..  వుంది. మాకు అక్కడ ఇల్లు వాకిలి కార్లు అన్నీ వున్నాయి. అక్కడికి వెళ్ళి నప్పుడల్లా చాలా ఆనందంగా ఉంటాను. అప్పుడప్పుడు అక్కడికి అతిథిగా వెళ్ళి వస్తూ వుంటాను.ఆ దేశపు నియమ నిబంధనలకు లోబడి ఉంటాను.  తిరిగి వస్తాను. అక్కడ వుంటున్న వారిని నిశితంగా పరిశీలిస్తాను.  రెండు కథలు కూడా రాసాను. “ ఏనుగు అంబారీ”, “చెరగని గీత” అనే కథలు అవి. వీలైతే  ఆసక్తి వుంటే ఆ కథలు వినండీ 


ఒకటి మాత్రం చెబుతాను. 


ఈ కంటెంట్ తో ఎవరిని కించపరచడం నా ఉద్దేశం కాదు. విషయాన్ని సున్నితంగా చెప్పడానికి ప్రయత్నించాను. మాది ఇలా.. నేను ఇలా..  అని ప్రదర్శించడం ఏదైతే ఉందో అది అహం అవుతుంది.ఆడంబరం అవుతుంది. అవి లేని వారికి ఈర్ష్య కల్గించి మన మనుగడ కు ముప్పు కలిగిస్తుంది.నా లైఫ్ స్టైల్ ఇలా వుంటుంది అని ప్రదర్శించడం, నా సంపద ఇదిగో అని ప్రదర్శించడం వెనుక ఒక రకమైన  అహం వుంటుంది. అది వేరొకరికి కంటగింపు అవుతుంది. 

నరుడి కంటికి నాపరాయి బద్దలవుతుందిఅంటారు కదా!  దిష్టి కూడా తగులుతుంది.  మన భారతీయులు నివసించే ప్రాంతాల్లో  బంగారం కోసం దొంగతనాలు జరుగుతున్నాయి అంట. మన వాళ్ళ నే టార్గెట్ చేస్తున్నారు. 


 ఒకటి మాత్రం నిజం. మన పిల్లలు అక్కడ కష్టపడకుండా టాక్స్ చెల్లించకుండా ఎగవేత వేసి ఆర్ధికంగా అభివృద్ధి చెందడం లేదు. నిజం చెప్పాలంటే అక్కడ మన అభివృద్ధి పేకమేడల్లాంటిది. అది ఎప్పుడైనా కూలిపోవచ్చు. అమెరికాలో ఇప్పుడు అదే జరుగుతోంది. అర్ధమైన వారికి అర్ధమైనంత. ఉన్నవాడిని చూసి లేనివాడు నూన్యతా భావానికి గురవుతూ ఉంటారు. అది మానవ స్వభావం. పాలకులు మారినప్పుడల్లా వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు పాలసీలు మారుతూ ఉంటాయి. మన వారి జీవితాల్లో  కూడా పెను మార్పులు వస్తాయి. కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా. 


అమెరికా ఆస్ట్రేలియా బ్రిటన్ జర్మనీ గొప్పలు చెప్పుకోవడం మానేద్దాం. Thousand K నుండి Two thousand K ల మధ్య కొన్న ఇళ్లు సేల్ కి పెట్టి వున్నాయట. జాబ్ లేకపోతే వచ్చే ఇక్కట్లు మాములుగా వుండవు మరి. మనదేశం ఇంకో ఇరవై ముఫ్పై ఏళ్లలో వృద్ద ప్రజలు వున్న  దేశం అవుతుంది అంట. యువతంతా వలసలు పోయి అక్కడెక్కడో ఇబ్బంది పడకుండా ఇక్కడే వుంటే మంచిది. మన దేశం అనేక రంగాల్లో నిపుణుల కొరతతో కొట్టుమిట్టాడుతుంది. ఆ విషయం పై దృష్టి పెడితే మంచిది. ముఖ్యంగా రైతు కరువు రాబోతుంది అంట. రైతు లేని దేశాన్ని ఊహించి చూడండి. 


చివరగా ఒక మాట. 


వలస పక్షులు తమ కష్టాలను లేదా సౌఖ్యాలను ఏ మాత్రం ప్రదర్శించుకోవు. వాటికి Yuotube తెలియదు.అమ్మలూ నాన్నలూ మీరు గొప్పలు ప్రదర్శిండం మానండి ప్లీజ్! 



5 M లు గురించి తెలిస్తే చాలు.. నల్లేరు బండిపై నడక.

  


మనిషి జీవితం  బాగుండాలంటే 5 m ల గురించి కచ్చితంగా తెలిసివుండాలి. 


 Mouth : నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. నోరు అదుపులో లేకుంటే వీపు దెబ్బలు తినాల్సి వస్తుంది అనికూడా  అంటారు కదా! మాటలతో కోటలు కట్టవచ్చు. హృదయాలను కూడా గెలవవచ్చు. సందర్భోచితమైన మాట మనిషికి ప్లస్ అవుతుంది. నేను నిజాలే మాట్లాడతాను, మంచే మాట్లాడతాను,  కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతాను అని అనకూడదు అధికార స్వరం ఝళిపించకూడదు. సత్యం కూడా ప్రియంగా మాట్లాడాలి. విమర్శ కూడా సున్నితంగా  వుండాలి. చెడు విషయం కూడా నిదానంగానే చెప్పాలి. పరుషమైన మాట విషం. సున్నితమైన మాట పువ్వులాంటిది. పూలచెండు కొడితే ఊరుకుంటారేమో కానీ ముళ్ల తీగతో కొడితే ఊరుకుంటారా? 

 

Mind: మన ఆలోచనే మన భవిష్యత్ బలం కూడా అవుతుంది.  ఎప్పుడూ సక్రమమైన ఆలోచనలు చేయాలి. ఎప్పుడూ పాజిటివ్ థింకింగ్ తో వుండాలి. నెగిటివ్ థింకింగ్ వల్ల వ్యతిరేక ఫలితాలు ఎదురవుతాయి. నలుగురితో కలవలేరు. మాట్లాడలేరు. మనకన్నా ఉన్నతస్థాయిలో వున్న వారితో పోల్చుకుని మనల్ని మనం బలహీనం చేసుకోకూడదు.  మన మైండ్ కి అద్దం లాంటిది ముఖం. ఆ ముఖమే చెబుతుంది అంట.. అసలు మనం ఎలా వున్నామో!   ప్రతి రోజు మన ఆలోచనలు ప్రక్షాళనం చేసుకోవాలి. నిన్నటి అనుభవాలు నుండి పాఠం నేర్చుకుని  చేదు అనుభవాలను తుడిచి పెట్టేసి నిత్య నూతనంగా రోజు   ప్రారంభించు కోవాలి.  ఒక్కటి గుర్తుంచుకోండి. మన మెదడు కుడితి తొట్టి కాదు. 

 

Moods: బావోద్వేగాలు. మనం  కోపం  ఆవేశం లాంటివి అదుపులో వుంచుకోవాలి. మితిమీరిన బావోద్వేగాలు మనిషి వివేకాన్ని విచక్షణను కోల్ఫోయేటట్లు చేస్తాయి. స్వతహాగా చీమకు కూడా హాని చేయని వ్యక్తులు కట్టలు తెంచుకున్న కోపంలో ఆవేశంలో హత్యలు చేసారని వినడం జరుగుతుంది.

మూడ్స్ బావుంటేనే సరైన నిద్ర పడుతుంది. మానసిక వ్యాధుల బారిన పడకుండా వుంటారు. గుర్తుంచుకోండి..తరచూ moods swing అయ్యే వారు సరైన నిర్ణయాలు తీసుకోలేరు. 

 

 Manner: నీ దగ్గర లక్షలు కోట్ల కొలదీ డబ్బు వుండవచ్చు. కానీ నీకు సాటి మనుషులను గౌరవించడం మర్యాద తెలియకపోతే నువ్వు జీరో లెక్క. పెద్దలు గురువుల యెడల గౌరవభావం బలహీనుల పట్ల  దయ, జాలి మూగజీవాలు పట్ల కరుణ కలిగివుండటం బాధితుల పట్ల సానుభూతి కలిగి వుండటం ముఖ్యం. మర్యాదా పురుషోత్తమ లక్షణాలు ఇవే!  ఇవి పెద్దల ద్వారా పిల్లలకు సంక్రమిస్తాయి.


Money;  ధనం మూలం ఇదం జగత్.  డబ్బు వ్యవహారంలో మనిషి చాలా జాగ్రత్తగా వుండాలి. ఇచ్చిపుచ్చుకోవడం అవసరమే కానీ … డబ్బు ఇచ్చేటప్పుడు వున్న స్నేహాలు. బంధుత్వాలు తిరిగి పుచ్చుకునేటప్పుడు వుండవు. రూపాయి రూపాయి నువ్వు ఏం చేస్తావు!? అంటే రక్తం పంచుకుపుట్టిన వాళ్ళను శత్రువులుగా మారుస్తాను, స్నేహితులను దూరం చేస్తాను అన్నదట. మితిమీరిన ఖర్చు కూడదు. మితిమీరిన నమ్మకంతో అనువుకాని చోట పెట్టుబడి పెట్టడం.. కూడా మంచిది కాదు. డబ్బు లేనప్పుడు నీ విలువ ముప్పాతిక శాతం తగ్గుతుంది. డబ్బు వుంటే నీలో వున్న పది వంకలను కప్పెడుతుంది. 


ఇవి పాటించగల్గితే మనిషి జీవితాన్ని సానుకూలంగా మార్చుకోవచ్చు.