12, జనవరి 2011, బుధవారం

పిల్లలు.. తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తులా?

పిల్లలు తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తులా? వారిని ఆస్తులను కాపాడుకున్నంత భద్రంగా కాపాడుకోవాలా? అయితే అది సాధ్యమా? న అప్పుడప్పుడూ నన్ను, నా స్నేహితులనూ ,యవ్వనంలో  పిల్లలున్న తల్లిదండ్రులను  కూడా యీ ప్రశ్న వేధిస్తుంది.


 "ఖలీల్ జిబ్రాన్" ఇలా అన్నారని ఎక్కడో  చదివాను. "పిల్లలు ప్రకృతి ప్రసాదించిన వరాలు.నరజాతి భవిష్యత్తుకు ప్రతీకలు. పిల్లలు మననుంచే వచ్చారు..కానీ వాళ్ళు మనకు మాత్రమే సంబంధించిన ఆస్తులు కాదు. మన వ్యక్తిగత ఆకాంక్షల తోను,బలహీనతలతోను పిల్లల  మీద రుద్ది వాళ్ళ జీవితాలను నరకప్రాయం చేయడం అమానుషం. పిల్లలలో శక్తి -సామర్ద్యాలువికసించేలా చేయడం, వ్యక్తిత్వం రూపొందేలా శాయశక్తులా కృషి చేయడం,ఎదిగాక ప్రేమించే స్నేహితులుగా వారికి ఆత్మీయతని పంచడం మన ధర్మం" అని.


 నేను.. ఈ వాక్యాలు చదవడం వల్ల నా ఆలోచనలలో ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. అందు మూలంగా నేను ఎప్పుడు నా కొడుకుకి “ఇలా ఉండు,ఇలాగే చేయి” అని ఎప్పుడు ఆంక్షలు పెట్టలేదు.  తనకి ఇష్టం లేని చదువలని   చదవమని బలవంతం చేయలేదు.  తన ఆలోచనలకి అనుగుణంగానే నడుచుకునేటట్లు సహకారం అందించడం చిన్న చిన్న జాగ్రత్తలు చెప్పడం. అంతే!  చూసే వాళ్లకి పిల్లల్ని అతి గారాభం చేసినట్లు ఉంటుంది.


కానీ ఈ రోజుల వాతావరణం  ఎలా  ఉందంటే.. పిల్లలకి తల్లిదండ్రులు ఏ.టి.ఎమ్..లా ఉండాలి.  మనం చెప్పే జాగ్రత్తలు కానివ్వండి,సలహాలు కానివ్వండి,సూచనలు కానివ్వండి వాళ్ళకి పరమబోరు. చాదస్తం. ఇంకా వీలైతే  కన్నవాళ్లు రాక్షసులు. ఇవి వాళ్ళిచ్చే టాగ్స్. వాళ్ళ ఉన్నతి కోసం తరగతి  తరగతికి వాళ్ళు మెట్లు ఎక్కుతుంటే మెట్టు మెట్టుకి నోట్ల కట్టలని పేర్చుకోవడానికి ఎన్ని కష్టాలు పడుతున్నారు!? ఉద్యోగస్తులైతే పర్లేదు. ముఖ్యంగా పల్లెల నుండి పట్టణాలకి వలస వచ్చి పిల్లల  చదువులు పేరిట పల్లెలు బీడుపోయింది ఇందుకే.


ఏడాదికి ఒక ఎకరా లెక్కన అమ్మి వాళ్ళ బంగారు భవిత కోసం ఆశించి,శ్వాసించిన   తల్లిదండ్రుల మాటకి పిల్లలు విలువ ఇవ్వడం లేదని బాధపడటం  కన్నా ఆ బాధ పడినట్లు పిల్లల కి తెలియజేప్పితే వాళ్ళు అర్ధం చేసుకోరా?  అంటాను నేను.


  

మనం చాలా కస్టపడి పెంచాము. అందుకు బదులుగా వాళ్ళు బాగా చదువుకుని,మంచి ఉద్యోగం చేస్తూ లక్షలు సంపాదిస్తూ లక్షలు సంపాదించే అమ్మాయిని లక్షల,కోట్ల కట్నంతో జీవిత భాగస్వామిని చేసుకుని ఫలానా వారి అబ్బాయి లేదా ఫలానా వారి అమ్మాయి అని  గర్వంగా  చెప్పుకునేటట్లు ఉండాలి. ఇది తల్లి దండ్రుల ఆశ.


ఇక పిల్లల  విషయానికి  వస్తే చదువుల పేరిట బాల్యాన్ని  బంధిఖానా కి చిరునామా చేసి రాంకుల ఒత్తిడిలో ఇష్టాలని మనసులని చంపేసి మేము పిల్లలం కాదు మర బొమ్మలమా? మనం వాళ్ళు  అనుకునట్లు ప్రవర్తించాలా ?  అని  పిల్లలూ వారి అభిప్రాయాలు. ప్రతి ఇంట్లోను ఇదే తరహా వాదన.


కొన్ని  చోట్ల   విభిన్నమైన తల్లిదండ్రులు ఉన్నారు. లేరనుకోవద్దు. విభిన్న మైన పిల్లలు ఉన్నారు. కానీ చాలా చోట్ల పిల్లపై ఆంక్షలు సామజిక భద్రత కోసం స్వేచ్ఛ పేరిట దుర్వ్యసనాలకు  బలి అవుతారనే భయంతో  పిల్లలపై అనేక ఆంక్షలు .  అది పిల్లలకి అర్ధం అయ్యేటట్లు చెప్పడం వారి బాధ్యతే కాదు గురువుల బాధ్యత కూడ..


  తరం తరంకి  మద్య అంతరాలు చాలా సహజం. సహజంగా పిల్లలకి ఉండాల్సింది క్రమశిక్షణ, పెద్దల యెడ గౌరవం. దురదృష్టవశాత్తు  ఇప్పటి పిల్లలకి అవే ఉండటం లేదు. మీకేమి తెలియదు, మీరు నోరు మూసుకుని కూర్చోండి.  అంటూ తల్లిదండ్రుల పట్ల  పిల్లల చిన్న చూపు. పెద్దల అహం దెబ్బతినడంతో పాటు  మా మాటే   విని తీరాలనే పట్టుదలలు. ప్రతి కుటుంబంలో ఘర్షణలు. ముఖ్యంగా  .. పెళ్ళిళ్ళ విషయంలో పెద్దల   ప్రమేయం లేకుండా ప్రేమ వివాహాలు జరుగుతూనే ఉన్నాయి..  ఎక్కడో వ్యతిరేకంగా  ఉన్నా అవి పెద్ద పట్టింపు  కాదు అనే చెప్పాలి.


ఇక్కడ ఒక విషయాన్ని నేను మీతో పంచుకోదలచాను. నా.. ఫ్రెండ్ కి ఒక కూతురు ఉంది. తనది కులాంతర ప్రేమ వివాహం పెద్దల అంగీకారంతోనే జరిగింది. వాళ్లకి ఒక కూతురు. గారాబంగానే పెంచారు. వేలంవెర్రి ఇంజినీరింగ్ చదువులనే  లక్షలు  డొనేషన్ కట్టి  మరీ చదివించారు.. అంతా బాగానే ఉంది. ఆ.. అమ్మాయికి స్నేహితులు ఎక్కువే. ఆడ-మగ ఫ్రెండ్స్.. తేడా అసలే   లేదు.వచ్చిన చిక్కు ఏమిటంటే  అర్ధరాత్రి  వరకు  మొబైల్ ఫోన్ లో ముచ్చట్లు. సినిమాలు, మూన్ లైట్  డిన్నర్స్ ,అర నిమిషానికి  ఒకసారి  ఐ లవ్ యు..లు చెప్పుకోవడాలు.. తల్లిదండ్రులకి  ఒకసారి కాక పోయినా ఒకసారయినా చెవుల్లో పడతాయి కదా!  చదువు పూర్తయ్యింది. ఎలాగోలా మూడుముళ్ళు వేయించి    గౌరవం నిలుపుకుందామని  ప్రేమించిన అబ్బాయి వివరాలు చెప్పమ్మా! వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడదాం, నీ పెళ్లి  చేస్తాం అన్నారట. 


అప్పుడు ఆ.. అమ్మాయి ఎంత అవమానంగానో ఫీల్ అయిందట. ఇంతేనా.. తల్లిదండ్రులుగా మీరు నన్ను అర్ధం చేసుకుంది!!  వాట్ ఏ షేం! వాట్  ఏ షేం !! అని విరుచుకు పడిందట. 


అదేమిటమ్మా! నువ్వు అ..అబ్బాయికి రోజూ “ ఐ లవ్ యు లు చెపుతావుగా, అది ప్రేమ కధ కాదా? అయితే పెళ్లి చేసుకోవా? అతను చేసుకోనన్నాడా?” అని ఆదుర్దాగా  అడిగిందట. 


అప్పుడు ఆ అమ్మాయి సమాధానమేమిటో అన్నది మీరు ఊహించలేరు. “ఓహ్.. మమ్మీ! అతను నాకు.. ఫ్రెండ్ మాత్రమే!  నన్ను అపార్ధం చేసుకుంటున్నారు. మీరు ఈ కాలానికి పనికి రారు.నా దారిన నన్ను వదిలేయండి. నాకు పెళ్లి చేసుకోవాలనిపించినపుడు  చెబుతానులే “ అంటూ తెగ క్లాస్  తీసుకుందట.


 ఈ.. స్వేచ్చ పేరిట ఈ అర్ధరాత్రి తిరుగుళ్ళు ఏమిటో,  ఈ.. ఐ లవ్ యు లకి అర్ధాలు ఏమిటో నాకు అర్ధం కావడం  లేదు.. నువ్వు అయినా  చెప్పవే అంటూ నాతొ  మొరపెట్టుకుంది.

ఆ అమ్మాయి భవిష్యత్తు పట్ల ఆ.. తల్లిదండ్రులకి  ఎంత దిగులో చెప్పలేను. 


పిల్లలు ఎందుకు  తల్లిదండ్రులిచ్చిన స్వేచ్చని దుర్వినియోగం చేసుకుంటున్నారు.? కనీసం వాళ్లకి.. కావాలిసింది ఏమిటో వాళ్ళకైనా తెలుస్తుందా? అమాయిల అబ్బాయిల మద్య నిజంగా ఫ్రెండ్ షిప్  యేనా?   వీళ్ళ  భవిత  అందకారమా ? వాళ్ళ తల్లితండ్రుల ఆశలు అడియాశలేనా? స్నేహమా-ఆకర్షణా?ప్రేమా?  ఎందులోనుండి   ఎందులోకి వెళుతున్నారు?  వాళ్ళు    అయోమయంతో  ఉండి పెద్దలని అయోమయంలో పడేసే.. ఈ. స్నేహాలని ఏమంటారు. ఇది పిల్లలకి ఇచ్చిన స్వేచ్చ ఫలితమా ?  అంటూ దీర్ఘంగా నిట్టూర్పు విడిచింది.


 నేను ఆలోచనలో పడ్డాను. స్వేచ్ఛకు అర్ధం ఏమిటి?  అసలు పిల్లలను ఎలా పెంచాలి? అలా మనం పెంచగల్గుతున్నామా?  చాదస్తం  అని కొట్టిపారేసిన పిల్లలు వాళ్ళు వారు కోరుకున్నట్లు ఉండగల్గుతున్నారా?  ఎక్కడికి ఈ పయనాలు ! నాలో అనంతకోటి  ప్రశ్నలు వేధిస్తున్నాయి..


 అసలు నేను నా కొడుకుని ఎలా పెంచాను ఎలాటి వ్యక్తిత్వం వచ్చింది అనేది మళ్లీ చెపుతాను. ఇంతలో.. నా ఫ్రెండ్ కూతురు లాటి వారి  ఆలోచనా  విధానం ఏమిటో కాస్త మీరైనా చెపుదురూ!  మీ ఆలోచనా కోణాన్ని  గమనిస్తాము.  పిల్లలను ఆస్తులను కాపాడుకున్నంత  తేలికగా కాపాడుకోగాలమా.?  ఖలిల్ జిబ్రాన్  చెప్పినట్లు.. భారతీయ తల్లిదండ్రులు మారగాలరా? స్వేచ్చ  పేరిట  మన పిల్లలు మాయదారి సంస్కృతి ముసుగులో సమిధలు అవుతున్నారా? ఆలోచిద్దాం.  


ఇలాంటి మరికొన్ని ఆలోచనాత్మక వ్యాసాలూ  నా బ్లాగ్ లో  https://vanajavanamali.blogspot.in

2 కామెంట్‌లు:

Shabbu చెప్పారు...

ఇందులో మీ బంగారుకొండ గురించి చదువుతున్నప్పుడు నాకొక పాట గుర్తొచ్చింది. ఆ పాట తనకు కూడా చాలా ఇష్టమైన పాట.

మళ్లీ మళ్లీ రాదాంట ఈ క్షణం,, నచ్చినట్టు నువ్వుండ రా ,
Everybody let pump this party,

నా లాగే నేనుంటాను, నచ్చిన పని నే చేస్తున్నాను
Shabbu(Knr)

శశి కళ చెప్పారు...

వాళ్లకు ఏమి కావాలో వాళ్ళకే తెలీడం లేదు.ఏమి చెప్పాలో తెలీడం లేదు