1, జనవరి 2011, శనివారం

హాలికుడా!





                                                                                                                                                           హాలికుడా!

హాలికుడా! సేద్యం చేస్తూనే ఉన్నావు .. ఒక వ్యసనంలా ! 
అనావృష్టి..అతివృష్టి లను   తట్టుకుంటూ..
అరకొర  ఇచ్చే విద్యుత్ సరఫరాని..తిట్టుకుంటూ..
ప్రతి ఏరువాకకి.. నీ..ఆశ.. 
పెటీల్మని చీల్చుకుని  వచ్చిన మొలక లాటిది..
చేదోడు వాదోడు కాలేని..ఎద్దు పుండు లాంటి పంట రుణాలు..
కారం జల్లినట్లు ఉండే.. పంటల భీమాల సాక్షిగా..
నీ..కండల్లోని సారాన్నికరిగిస్తూ.. 
అలవాటైన స్వేదాన్ని..చిందిస్తూ..  .. 
రుతుపవనాలు..  నకిలీ..విత్తనాలు.. 
సముద్రపు నీళ్ళ లాటి   నేతల వాగ్దానాలు.. 
ఎండమావిలాంటి..ప్రాజెక్ట్ నిర్మాణాలు.. 
దోబూచులాడుకుంటున్నా..
మొక్కవోని విశ్వాసంతో.. 
ఆరుగాలం కళ్ళల్లో.. వత్తులు వేసుకుని.. పండించి.. 
దళారీల గాదెలు నింపి..  
నీ..ఇంట దుఖ రాసులు నింపి..
నీ వారికి.. వెన్ను చూపించే..
దేశానికి వెన్నుముకవి..  నీ..ఉనికి పదిలం. 
మొదలంటా.. ఎండిన పైరుని చూసి గుండె తడి ఆరిపోయినా....
నేర్రులువారిన పంటపొలం చూసి..గుండె వ్రక్కలైనా....
భూమిని నమ్ముకున్నావు కనుక.. 
జీవశ్చవంలా   బ్రతుకుతూనే  ఉంటావు .. 
అమ్మకైనా ..వెల  కట్టగల
రియల్  మాయాజాలపు  వలలో  చేపవైనావు .
సెజ్ కుంపట్లు.. నీ..గుండెల్లో..మంటలు రేపితే.. 
కర్ణుని  పిడికిట్లోని.. 
భూమాత కన్నా.. విలవిలలాడినావు.. 
పరిహారం అందించని.. దృత రాష్ట్రుల  పాలనలో..
శిబి చక్రవర్తివైనావు ..
గుత్తకైనా..సాగు చేసుకునే
చిన్న కమతగాడివయ్యావు..
ఎన్ని కష్టాలైన.. నీవు బ్రతుకుతూనే ఉండాలి..
అందరిని బ్రతికిన్చేందుకు.. 
హరిత విప్లవం సాక్షిగా.. 
హరితం కాలేని.. నీ బ్రతుకు..
ఆఖరికి..  ఉరికోయ్యకి.. వేలాడుతుంది..
దుఃఖరాశులు..నింపుతూ.. 
హాలికుడా! జాతి  ప్రేమికుడా..!!
నీకు.. వేనవేల  వందనాలు.   



3 కామెంట్‌లు:

తెలుగు పాటలు చెప్పారు...

ధన్యవాదములు వనజవనమాలి గారు మీ పోస్ట్ చాలా బాగుంది, రైతు కష్టాలు కళ్ళకు కట్టినట్లు చెప్పారు...

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

మీది రైతు కుటుంబం అన్నా కావాలి ! లేదా సామాజిక అవగాహన మెండుగా నయినా వుండాలి.వాస్తవానికి అతి దగ్గరి కవిత
హాలికుడా!
హలాన్ని పట్టి
ఇలాతలాన్ని దున్ని
దేశానికి అన్నం పెట్టి
ఉరికొయ్యకు మెడనుచుట్టి
మరణం తలుపు తట్టి
విశ్రమించే శ్రామికుడా!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రవి శేఖర్ గారు.. తరతరాలుగా మాది వ్యవసాయ ఆధారిత కుటుంబాలు. రైతుల కష్టాలు ఏమిటో.. నాకు తెలుసు. అలాగే సామాజిక అవగాహన కల్గించే అంశాలని నేను చాలా దగ్గరగా పరిశీలించడం పట్ల ఆసక్తి ఎక్కువ, రెండు కలిపి ఈ కవిత. సామాజిక సృహ కల్గిన రచనలు చేయాలని ప్రయత్నం కూడా.

నచ్చినందుకు ధన్యవాదములు.