3, జనవరి 2011, సోమవారం

నీ చరణం కమలం మృదులం


ఈ ..పాట చిత్రీకరించిన ఆలయ చిత్రం

నీ చరణం కమలం మృదులం.... నా హృదయం పదిలం పదిలం



నాకు చాలా చాలా... చాలా ఇష్టమైన పాట

నీ  చరణం కమలం  మృదులం నా హృదయం పదిలం పదిలం

ఫ్రెండ్స్! మీరందరూ చాలా ఆసక్తి కరంగా ఫాలో అవుతున్నారు కదా!

అందమైన పాదం మంజీర నాదం వినిపిస్తుంటే ఆ రవళులు చెప్పలేనంతగా ఎన్ని హృదయాలని.. కొల్లగొడుతున్నాయో! అనేగా మీ మదిలోని మాట.  🙂 చూసారా!.. ఎలా క్యాచ్ చేసానో..!

రాఘవేంద్రుడి చిత్రీకరణ మంత్రజాలం అండీ.! ఏదో.. తెలుగు వారి పరిమళం నాకు కొంచెం అబ్బింది కనుక ఈ అందమైన భావన రావడం కోసం చాలా కష్టపడి ఇలా అందంగా మీ ముందుకు ఒక పాట. అదీ నాకు చాలా చాలా చాలా ఇష్టమైన పాటని మీకు పరిచయం చేయబోతున్నాను.

ఇంతకీ పాటని ఊహించారా! మురారి ఆర్ట్స్ చిత్రాలన్నిటికి కే.వి.మహదేవన్ సంగీతమందిచారు..

ఆ బేనర్ పై వచ్చిన చిత్రాలన్నిటిలోనూ అందమైన మన గోదావరి నదిలో అంతకన్నా అందంగా సెట్టింగ్స్ వేసి చిత్రీకరించిన పాటలు మన మనసులని దోచేసాయ్ అనుకోండి..

జానకిరాముడు చిత్రంలో అన్ని పాటలు చాలా.. బాగుంటాయి. అందులో అతిశయోక్తి లేదు కానీ.. అన్ని పాటలలో.. నాకు నచ్చిన పాట మాత్రం”నీ.. చరణం కమలం మృదులం” అనే పాట. 

లేత తమలపాకు లాటి అందమైన పాదాలతో అందమైన కాస్టూమ్స్ తో.. విజయశాంతి రూపం చెరగన ముద్ర వేస్తుంది. పాట చిత్రీకరణలో.. ఎన్ని.. సొబగులున్నాయో! ఆ.. సాహిత్యం,సంగీతం నా హృదయం పై తీయని ముద్ర వేసాయి.ఆ పాటలో.. ఎన్ని రసమయ కోణాలు ఉన్నాయో! ఒక తెలుగు పాటకి నూటికి నూరు శాతం మార్కులు ఇవ్వ వచ్చు అని నాకు అనిపించిన ఆ పాట యిది. 

నాయిక ని దృష్టిలో ఉంచుకుని పాట వ్రాసారో.. సాహిత్యంని బట్టి పాటని చిత్రీకరించారో ఏమిటో.. రాఘవేంద్రుడికి మురారి గారికి ఎరుక.

సాహిత్యం ఆత్రేయ అని వుంటుంది కానీ ఆ..పాట వేటూరి అని నా గట్టి నమ్మకం.ఆ..పద ముద్రలు అచ్చు అలాగే ఉంటాయి. సాహిత్యం గమనించండీ!

మువ్వలు పలికే మూగతనంలో మోమున మోహన రాగాలు..

కన్నులు పలికే కలికితనంలో చూపున సంధ్యా రాగాలు (ము )

అంగ అంగమున అందచందములు ..

వంపు వంపున హంపి శిల్పములు..

ఎదుటే.. నిలిచిన చాలు ఆరారు కాలాలు.. (నీ)

జతులే పలికే జాణ తనంలో జారే పైటల కెరటాలు..

శ్రుతులే కలిసే రాగతనంలో పల్లవించిన పరువాలు..(జ)

అడుగు అడుగున రంగవల్లికలు, పెదవి అడుగున రాగ మాలికలు ..

ఎదురై పిలిచినా చాలు.. నీ.. మౌన గీతాలు.. (నీ)

నీ.. చరణం కమలం మృదులం

నా హృదయం పదిలం పదిలం ..

నీ..పాదాలే రసవేదాలై.. నను కరిగించే..నవనాదాలు..

ఒక సౌందర్య అన్వేషణ, సౌందర్య ఆరాధన జీవనాన్ని ఎంత ఆహ్లాదంగా.. ఉంచుతుందో!  ఇలాటి రస వేదాలు.. నవ నాదాలు మనలని.. కరిగించనీయగల్గితే ఇంకా ఏమి కావాలి అనిపిస్తుంటుంది నాకు..

“ఎ థింగ్ అఫ్ బ్యూటీ ఈస్ జాయ్ ఫర్ ఎవెర్” అన్నారు కదా జాన్ కీట్స్. నిజం కదండీ!
పాట చిత్రీకరణలో వొకటే లోపం అండీ.. హీరోయిన్ గుడి మెట్లు దిగి వస్తున్నప్పుడు అసలుసిసలైన తామరలను అడుగడుగుకి పరచి.. తర్వాత పాట చిత్రీకరణలో కోనేరులో కాగితపు పూలు వుండటం ఎబ్బెట్టుగా అనిపించింది నాకు. అయినా కమలం మన జీతీయపుష్పం కదా..,అలాగే లక్ష్మీ నివాసం అంటారు కదా.. రెండు విధాలుగా హీరోయిన్ చేత ఆ పూలను తొక్కించడం యేదైతే వుందో అది అభ్యంతరంగా అనిపించింది నాకు. కొందరి మనోభావాలు దెబ్బతింటాయేమో కూడా! 

ఈ..పాట స్టార్టింగ్ బీట్ గుండె ఝల్లుమనిపించి.. స్పందన కల్గిస్తుంది.అసాంతం ఒక మధుర భావనని నింపే.. ఈ పాట మీరూ చూసేయండి . కొరియోగ్రపీ అద్బుతః. అందమైన విజయశాంతిని మరింత అందంగా చూపించారు. ఆమె నృత్యం ముద్రలు చాలా బాగున్నాయి. 

ఈ పాట చిత్రీకరణ “పట్టెసం- పట్టిసీమ” గుడి మెట్లు చిత్రీకరించారు.  మిగతా భాగం గోదావరి నదిపై సెట్టింగ్స్  వేసి అద్భుతంగా చిత్రీకరించారు. పట్టిసీమ వెళ్ళాలనే కోరిక అలాగే వుండిపోయింది. తప్పకుండా చూడాలని చాలామంది చెప్పారు. ఎప్పటికి తీరేనో ఆ కోరిక. పాట చూసేయండి మరి..

https://youtu.be/zOu44L3eJHM




కామెంట్‌లు లేవు: