4, మే 2011, బుధవారం

వినడానికి మీకు దమ్ముందా?

అమ్మో.. ఎండలు.. విజయవాడని ముందు విజయవాటిక అని, బెజవాడ అని.. ఇంకా ఏమేమి పేర్లు ఉన్నాయో.. కానీ ఇప్పుడు మాత్రం.. బ్లేజ్ వాడ..సరి అయిన పదమండీ! సల సల మరిగే నూనెలో..వడల్లా.. వేగిపోతున్నాము.  వైశాఖం వచ్చింది..వేసవి సెలవలకి.. పిల్లలు ఇళ్ళల్లో  ఉండి ఒకటే అల్లరి.. అంతే..సందడి. పెళ్ళిళ్ళు, పేరంటాలు, గృహప్రవేశాలు.. అన్నీఒకసారే! పిలుపులు అందరివి అందుకుంటూ ఉన్నాం.. ఎవరి ఇళ్ళకి వెళ్లాలబ్బా.! ప్రయాణాలు.. ఎలా చేయాలబ్బా!? అని ఏకధాటిగా మాట్లాడేసిన.. మా పోరుగావిడ మాటలని విని.. స్వయంగా..రోజూ చూస్తూ.. ఈమె కనుక రేడియో..ఎఫ్ ఎమ్ లో తాత్కాలిక ఆర్.జే. ఉద్యోగం కోసం అప్లై చేసిందా!? ..తప్పకుండా సెలెక్ట్ అవుతుంది అనుకుంటూ.. ఉంటాను.

నిమిషానికి కనీసం 160 పదాల నిడివి గల మాటలు మాట్లాడగల్గితే.. చాలట. వీలైతే.. ఎంత వయ్యారంగా  మాట్లాడితే    అంత మంచిదట.  గొంతు ఓ..మోస్తరుగా ఉన్నా.. పర్లేదు.. వీలైనంతగా..మాటలు మింగేసి.. ముక్కలు ముక్కలు చేసేసి.. ఒక వంతు తెలుగు మూడు వంతులు.. ఇంగ్లీషు.. కలిపి మాట్లాడే వారికి మరింత ప్రాధాన్యం  ఏమో!   వింటుంటే.. చెవుల్లో.. సీసం పోసినట్లు ఉంటుంది. మన మాతృ  భాషని  ఖూనీ చేసి  మాట్లాడే..వారికి..  అలామాట్లాడటం రానివారికి  శిక్షణ ఇచ్చి మరీ.. మన చెవిన రుద్దుతున్నారండి. వినలేక చస్తున్నాం.

మా చానల్ ముందు అంటే మా చానల్ ముందు అని..  ఎవరు ఎప్పుడు వస్తే ఎమిటంట.. ఎలా.. ఉన్నాం ఎలా ఇచ్చాం అన్నది లెక్క అని వాళ్ళే లెక్కలు వేసుకుని .. మేమే నెంబర్ వన్ ..  అని సొంత డబ్బాలు కొట్టుకోవడాలు.. ఎక్కువైపోయాయి. అసలు.. ఎప్పుడన్నా పబ్లిక్ లోకి వచ్చి.. మా కార్యక్తమాలు ఎలా ఉన్నాయి అని అడుగుతారేమో.. అని అనుకుంటూ..ఉంటాను..  అబ్బే!.. నేను.. ఏళ్ళ తరబడి. చెవులకి రేడియో కట్టుకుని వింటూ..ఉంటాను. గది గదికి ఒక రేడియో పెట్టుకుని ఎక్కడా మిస్  అవకుండా శ్రద్దగా  వినే నేను ఎప్పుడూ.... కార్యక్తమాలు.. బాగున్న.. బాగోక పోయినా.. ఉత్తరాలు ద్వారా అభిప్రాయం  చెప్పేదాని.. అవన్నీ.. చెత్త బుట్ట దాఖలా అయిన, అవుతున్న విషయం గ్రహించి..ఇక ఇప్పుడు  అభిప్రాయాలు వ్రాసి.. నా సమయం,వ్యయం, శ్రమ వీటన్నిటిని వృధా చేసుకోవడం ఇష్టం లేక ఇష్టమైతే వినడం లేకుంటే ఆఫ్ చేసుకోవడం ..అంతే!

స్థానిక సమాచారం ఎఫ్.ఎమ్ లు వచ్చాక బాగానే లభ్యమవుతుంది.. అంతా.. ఫ్రీ..ఫ్రీ.. ఫుడ్ కూపన్స్,మూవీ టికెట్స్..గిఫ్ట్..లు.. ఎన్నెన్నో! శ్రోతలకి.. వినోదం తో..పాటు..ఇవన్నీ  లభ్యమవుతుంటే.. వినక చస్తారా!?  మూడు రూపాయలు ఖర్చు  పెట్టి మరీ.. పోటీలు పడి మరీ వాళ్ళు వేసే వెర్రి మొర్రి ప్రశ్నలకి.. చాయిస్ ఆన్సర్ లు వినేసి  సమాధానాలు పంపుతూ.. విషెస్ చెపుతూ, సాంగ్స్ డెడికేషన్ చేసుకుంటూ..యువత  పంపే ఎస్ ఎమ్ ఎస్ లు..విలువ? అమ్మో..లెక్క కడితే.. తల్లిదండ్రులకి  నెత్తిమీద తాటికాయ పడినట్లు ఉంటుంది.

పేరు వినబడటం కోసం.. ప్రేమికులకి..సమాచారం అందిచుకోవడం.. ప్రేమలని.. పెంచి పోషించుకోవడం.. అన్ని.. ఎఫ్.ఎమ్ ల లో.. సర్వసాధారణం అయిపోయాయి.  విజ్ఞానమా.. వినోదమా!. కుర్ర ఆర్. జే ల కి.. ఇప్పటి పాటలు తప్ప పాత పాటలు.. తెలియవు.. ఒక వేళ వివరాలు చెప్పి అడిగినా..అబ్బే.. లేదండీ.. నా షో లో..ఇలాటి పాటలా? నా ఇమేజ్  పోతుందండీ..ఇప్పుడంతా..రాక్.. అండీ..మీరు కూడా కాలం తో మారాలి అని మన ఫోన్ బిల్లుతో.. మనకే సుద్దులు చెపుతారు..నిద్ర లేచిన దగ్గర నుండి.. ఉచ్చారణా దోషాలు వినలేక చస్తున్నాం.. ఎప్పుడూ.. వింటూనే ఉన్నాం .. ఉల్లాసంగా..ఉత్సహంగా ఉంటున్నాం (?)  అదరగొట్టేస్తాం అంటారు? వినడానికి మీకు దమ్ముందా? అని సవాల్ విసురుతారు.. పాట ప్లే చేసే దమ్ము వాళ్ళ దగ్గర లేకపోయినా..సరే.!

జీవితం రంగుల మయం ఒక్కటే.. కాస్త బెటర్.. అనుకుంటే.. అక్కడా ముక్కల పాటలు. పదాల విరుగుళ్ళు.. వయ్యారాలు.. గుటకలు.. అమ్మో.. రేడియో.. వినడమా!? మా బెజవాడ ఎండల్లో..నే తిరగడం ఎంత హాయి..ఈ..పగలు.. ఎంత వేడిమి అయినా..ఎఫ్.ఎమ్..  ఆర్ .జే.. నవ్వినా.. మాట్లాడిన దాని కంటే కూడా..ఎంత హాయి.. అని.. పేరడీ..పాట పాడుకుంటూ..( సాయంత్రం  ఏ ఆర్ జే.. నో.. ఈ పోస్ట్ చూసి ఈ.. పాట కి ఒరిజినల్ పాట ఏమిటండీ..అని అడిగినా.. ఆశ్చర్యపోను అని మనవి చేస్తూ..) రోత పుట్టిస్తున్న ఆర్.జే ల మాటల తీరుకి వగచి.. నా.. ఈ.. మాట.  అధికార గణం  కానీ.. యాజమాన్యాలు  కానీ.. ఎప్పుడైనా  ప్రజానీకాన్నిఅడుగుతున్నారా?  సొంత డబ్బా కొట్టుకునే వాళ్ళని శ్రోతలగా.. మార్చి.. లైవ్ లో.. డబ్బా కొట్టించుకుని  నా బోటి శ్రోతలకి.. మేమే సరిగ్గా వినడం లేదు కాబోలు .. కార్యక్రమాలన్నీ.. బాగుంటున్నాయి అన్న మాట అనుకునేలా.. ఎందుకైనా మంచిది..జాగ్రత్తండీ!  .. చెవిలో.. క్యాబేజీ పెట్టి..బిరడా కొట్టినట్లు..తీరున.. వినిపిస్తున్నారు. అమ్మో!! ఎఫ్.ఎమ్..!!??  వద్దు బాబూ!

2 కామెంట్‌లు:

శరత్ కాలమ్ చెప్పారు...

మీ బ్లాగు రంగులు కళ్ళకు ఇబ్బందిగా వున్నాయి. మీకు ఇష్టం అయితే సవరించండి.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ధన్యవాదములు ..శరత్..గారూ.. వ్యక్తిగత అభిరుచి.. ఇతరులకి.. ఇసుమంతైనా ఇబ్బంది కల్గిస్తుందని తెలుస్తుంది. నా.. ఆలోచనలు పంచేకునే అందుకే కదా..! బ్లాగ్.. చూడటానికి ఇబ్బందికరంగా..ఉందని తెలియపరచినందుకు ధన్యవాదములు. ఇంతకు ముందు కూడా.. ఒకరు.. చాలా తీవ్రంగా..కామెంట్ చేసారు. ఆ తీరు నాకు నచ్చక పట్టించుకోలేదు.. ఇప్పుడు.. ఆలోచిస్తాను. సూచన చేసినందుకు..వేరొకరికి, మీకు మరొకసారి ధన్యవాదములు. .