16, డిసెంబర్ 2011, శుక్రవారం

స్త్రీలని స్త్రీలే ఈర్ష్య పడాలా !?

నేను చెప్పడం మొదలెట్టాను అని అక్కడ చెప్పడం ఆపాను కదా..! అక్కడి నుండి..చెప్పడం మొదలెడతాను.
నాకు చిన్నప్పటి నుండి రేడియో వినడం అలవాటు.

ఇప్పటికి కూడా.. రేడియో వినడం మానలేదు. ఆ ఒక్క ప్రసారసాదనం చాలు..ఇప్పుడు మనకి ఈ బ్లాగ్ లో ఉండని విషయాలు కూడా అక్కడ వింటాం. అవగాహన పెంచుకుంటాం. అనవసర విషయాలు ఉండవు అక్కడఅందుకే రేడియో వినడం నాకు చాలా చాలా ఇష్టం కూడా.. ఆర్.జే గా చేయాలని ఉబలాటం కూడా. అయితే..నాకు వయో పరిమితి ఉన్నప్పుడు ఆ ఆలోచన కలగలేదు.ఈ ఎఫ్.ఎమ్ సందళ్ళు మొదలయ్యాక ఇప్పటి ఆర్.జే లని చూస్తే..వాళ్ళని ఆ సీట్ లోనుంచి ప్రక్కకి తోసి పడేసి..ఆ సీట్లో..కూర్చుంటే..వారికన్నా ఇరగదీసే..పెర్ఫ్హార్మేన్స్ చూప వచ్చు అనుకుంటాను.(వాళ్ళు అంత చెత్తగా చేస్తుంటారు కాబట్టి.) నిజంగా చాలా మంది ఆర్.జే లు అంటూ ఉంటారు "వనజ గారు మీలా ఉంటె..మిమ్మల్ని కలుపుకుని ప్రోగ్రామ్స్ చేస్తే..సూపర్ ఉంటుంది అంటారు."

నాకు ఇష్టం కలుగుతుంది.కానీ..వయో పరిమితి అన్నాను. అప్పుడెందుకు ట్రై చేయలేదు అంటే..అప్పుడు ఆ ఆలోచనలేదు అంటాను. ఇప్పటి మీరు ట్రై చేయండి న్యూస్ రీడర్ గా ఈజీగా సెలెక్ట్ అవుతారు అంటారు. అవును ఇంకో రెండు మూడేళ్ళ వరకు అర్హత ఉంది బుద్ది పుడితే ట్రై చేస్తానులే.. అయినా వార్తలు ఏం చదువుతాం.అంతకన్నా శ్రోతగానే ఎక్కువ కక్క వచ్చు అంటాను ఎక్కెసంగా.

ఫ్రెండ్స్ ..విసుగేస్తుందా!?.. మీరు ఫాలో అవక తప్పదు .. ఎందుకంటే..ఇక్కడే..నేను చెప్పబోయే విషయం ఉంది. సరే ఇలాగే మాట్లాడుతుంటే .మా ఫ్రెండ్స్ చూస్తున్నారు..ఆసక్తిగా..


మేము దాదాపు పదమూడు ఏళ్ళు నెల్లూరు ..కి సమీపంలో.. మా వ్యవసాయ క్షేత్రంలో ఉండేవారం. అక్కడ ఈ రోజు పేపర్ రేపు చూడటం,ఎవరైనా ఉత్తరాలు వ్రాస్తే ఓ..నాలుగు అయిదు రోజులు ఆలస్యంగా చదువుకోవడం, ఇంట్లోవాళ్ళు కట్టి పడేయకుండా దయతలచి విననిస్తే..రేడియో..వినడం దూరదర్శన్ ప్రసారాలు చూడటం ,,ఇలా గడిచిపోయేవి. అలాటి రోజుల నుండి.. సడన్గా..హొం టవున్ లోకి వచ్చి పడ్డాక రేడియో బాగా వినడం, కార్యక్రమాల పై అభిప్రాయాలు తెలుపుతూ..ఉత్తరాలు వ్రాయడం, ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనడం ...అబ్బో..అవన్నీ గోల్డెన్ డేస్. నాకైతే.. ఆ అనుభవాలు పంచుకోవడం అంటే మామిడి కాయ పచ్చడి లో టెంకె నమిలితే వచ్చే జిహ్వానందం తో..పోల్చుకున్నట్లు అన్నమాట.


ఆకాశ వాణి విజయవాడ కేంద్రం వారైతే..నన్ను మెచ్చి..నాకు ఉత్తమశ్రోతగా గుర్తింపు నిచ్చి నాతో .. ఒక పరిచయ కార్యక్రమం ఇప్పించి..పారితోషికం ఇచ్చి ..ఒక ఫోటో తీయించి.. ఆ ఫోటోని నాలుగు నెలలపాటు ఆకాశవాణి ఫోటో ప్రేమ్(విజిటర్ డిస్ప్లే ) లో.. బంధించి ఉత్తమ శ్రోతగా మరింతగా గుర్తింపు ఇచ్చారు. అప్పటి ఆ కార్యక్రమం కి.. మెచ్చి అక్షరాల నూట ఎనిమిది ఉత్తరాలు ఆకాశ వాణికీ వచ్చాయని..ఉత్తరాలు కార్య క్రమం చదివే వారు చెప్పడం నాకు (చాలా ఆనందం ఏమిటి..నా బొంద) ఎవరెస్ట్ ఎక్కిన ఆనందం అంటే నమ్మండి.

నాలో అంతర్లీనంగా ఉన్న రాసే కళని గుర్తించి..ప్రోత్సాహం ని కలిగించారు. నవకవిత వేదిక, సాహిత్య ప్రసంగాలు,కథానికలు, చిన్ని నాటికలు ,సినిమా పాటలు అనుసంధానంగా వ్రాసిన చిన్న కతలు.. ఇలా అన్నిటా నా ఉనికిని చాటుకున్నాను. అక్కడ ఒక నాదంటూ ఒక ముద్ర ఉందనకుంటాను.ఎందుకంటె నాకు ఎక్కడైనా ఆకాశవాణి సిబ్బంది కనబడితే నేను గౌరవంగా విష్ చేసినప్పుడు ..ఆత్మీయంగా అడుగుతుంటారు ..ఏమ్మా..మీరు అసలు రావడం లేదు..స్క్రిప్ట్ లు ఏమి పంపడం లేదా..అని.

నేను నవ్వేసి..అన్నిటికన్నా వినడం అనే కళ నాలో మరుగున పడలేదండీ! వింటూనే ఉంటాను ఇప్పుడు వ్రాసే తీరిక లేదు..అని చెపుతూ ఉంటాను.

వ్రాసే తీరిక లేదు అని చెప్పడం అబద్దం అని నాకు తెలుసు. ఆకాశవాణి పట్ల నేను ఎందుకు విముఖత చూపుతానో..నాకు , నా మరి కొందరు నా ఆత్మీయులకి తెలుసు. కేవలం ఒకే ఒక స్త్రీ వల్ల నేను వ్రాయడం అనే కళని మరుగున పడేసి..నన్ను నేను చంపుకున్నట్లు. అలా అని నేను గొప్పగా వ్రాసుకున్నట్లు బిల్డప్ కాదు.
ఆ పరిస్థితుల్లో..నేను ఉన్న స్థితిలోనుండి నేను బయట పడి..లోకాన్ని కొత్తగా చూసుకుంటూ.. నేను ఆత్మవిశ్వాసంగా ఎదిగిన రోజులవి. ఆ రోజులని విషపూరితం చేసిన ఒక స్త్రీ ఈర్ష్యాద్వేషాలు నేను జీవితంలో ఎప్పటికి మరువలేను.

నాకు ప్రపంచం లో ఎవరైనా శత్రువులు ఉన్నారా..అంటే..నా ప్రధమ శత్రువు.. నా ఆఖరి శత్రువు కూడా ఆమే!.
ఆమె.. కూడా ఒక గృహిణి.ఇద్దరి బిడ్డలా తల్లి.తీరిక సమయంలో రేడియో వింటూ ..కార్యక్రమాలకి ఉత్తరాలు వ్రాస్తూ..ఉంటారు. నాకన్నా ముందు.. రేడియో లో శ్రోతగా ఆమె పేరు సుపరిచితం. రోజు నాలుగైదు వార్తా పత్రికలూ చదువుతున్న అనుభవంలోనుండి.. ఏ టాపిక్ మీదైనా సరే ప్రిపేర్ అయి వ్రాసుకుని మరీ అనర్ఘళంగా.. చెప్పగలదు.

విపరీతమైన ఎయిర్ టైం ..వెస్ట్ అవుతుంటుంది.అని చెపుతున్నా వినిపించుకోదు రోజు..ప్రత్యక్ష ప్రసారాల ప్రోగ్రాం లో ఆమె వాయిస్ రావాల్సిందే! అలా రేడియో రాణిలా అభి వర్ణించుకుంటూ ఉండే ఆమెకు నేను పోటీ పడటం సుతారం ఇష్టం లేదు. నా పై ఆకారణ ఈర్ష్య. ఆకాశవాణికి విమర్శిస్తూ ఉత్తరాలు వ్రాయడం తో పాటు.. వ్యక్తిగతంగా ఆకాశ రామన్న ఉత్తరాలు వ్రాయడం..అందులో..అతి నీచ నికృష్ట పదములతో.. దూషణలకి దిగడం తో..పాటు..
నాకు ఎంతో..ఆత్మీయురాలైన నా స్నేహితురాలు (తను రేడియో అనౌన్సర్) కలిపి తిడుతూ.. ఉత్తరాలు వ్రాయడం.. చేస్తూ ఉండేది.

నేరుగా మాకు ఉత్తరాలు వ్రాయడమే కాకుండా .. ఆకాశవాణికి వ్రాస్తూ ఉండేది. లైవ్ కాల్స్ లో..వివాదాస్పదంగా..అభ్యంతరకరం మాట్లాడటం,మాట్లాడింప జేయడం.. ఆఖరికి ఆమె పేరు వింటేనే.. ఆకాశవాణి లో..వివాదాల రాణిగా గుర్తింపబడి .. అనౌన్సర్ లు ఆమె కాల్ కట్ చేయడానికి కూడా భయపడుతూ ఉంటారు. కట్ చేసారు అంటే చాలు.. ప్రసార భారతికి.. ఆకాశవాణి స్టేషన్ డైరక్టర్ నుండి అనౌన్సర్ ల అందరి పైనా..ఆరోపణలు జొప్పించి లేఖలు వ్రాస్తుంది. ఇక అక్కడినుండి అధికార గణం కి తాఖీదులు రావడం,వీరు వివరణ లి ఇవ్వాల్సి రావడం ఇవన్నీ తల బొప్పి కట్టే వ్యవహారంగా భావించి..ఆమెని ఇష్టారాజ్యంగా వదిలేసి.. రాసిస్తా రా..విల్లు రాసిస్తాం ..రామ్మా అన్నట్లు వ్రాసి ఇచ్చి నీ ఇష్టం వచ్చినట్లు వాగుకోమ్మా..తల్లీ.. అని వదిలేసారు అని చెప్పుకుంటూ నవ్వుకునే వాళ్ళంతా రేడియో..రెగ్యులర్గా వినే శ్రోతలు,వారి అభిప్రాయం అన్నమాట.

విపరీతమైన ఐడెంటీ క్రైసిస్ తో.. ఆమె చేసిన పనులవల్ల.. ఆమె ఈర్ష్యాద్వేషాల వల్ల.. నా ఫ్రెండ్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కుంది. అలాగే.. ఎన్నో అపవాదులని ఎదుర్కొన్నాం. అది ఆమెలో నెలకొని ఉన్న ఈర్ష్యా ద్వేషాల స్థాయి.

ఆఖరిగా నేను ఇచ్చిన స్క్రిప్ట్..:"కవిత్వం పై సామాన్య శ్రోతలకి ఉన్న అవగాహన" 21 నిమిషాల ప్రసంగ వ్యాసం.
ఆ స్క్రిప్ట్ తర్వాత మరెప్పుడు ఆకాశవాణి వైపు అడుగుపెట్టకుండా ఉండాలని కంకణం కట్టుకుందేమో.. ఎంత వికృతంగా ఆకాశవాణి ఉత్తరాల కార్యక్రమానికి ఆకాశరామన్న పేరుతొ.. ఉత్తరం వ్రాసింది.

యేమని రాసింది..చెప్పు చెప్పు అంది..మా ఫ్రెండ్ రమ .

వద్దు ..చెప్పలేను అన్నాను. ఇప్పటికి ఆ విషయం గుర్తుకు తెచ్చుకుంటే..నాకు దుఖం ముంచు కొస్తుంది . అలా అని నేను పిరికిదాన్ని కాదు. కానీ..ఒక మనిషిలో..ఇంత వికృత స్వరూపం ఉంటుందా..అనుకునేదాన్ని. ఇక అప్పటి నుండి రేడియోకి..దూరం జరిగి..పత్రికలకి..వ్రాసాను. నా కవితలు ,వ్యాసాలూ,ప్రచురింప బడినప్పుడు..ఆమెకి కాల్ చేసి మరీ చెప్పేవారు..నా స్నేహితులు.

అందుకు.. తను యేమని అనేదంటే తనలోని గొప్ప రచయిత్రిని..నేను నా ఫ్రెండ్ కలసి పైకి రానీయకుండా చేసామని.. లేకపోతె తను ఎంతగానో..ఎదిగి..విశ్వనాధ సత్యనారాయణ గారి చెల్లెలా ..అన్నంతగా ఎదిగేదానిని అని చెప్పి గుక్కపెట్టి ఏడుస్తుంది అని చెప్పేవాళ్ళు.

ఏమిటి..అంత సీను ఉందా..ఆమెకి..అంది.

ఆమె రచనా పాండిత్యం ఎలా ఉంటుందో.. మన ఆకాశవాణిలో విని చూడు.. ఆనందం విలయ తాండవం చేస్తుంది.భుజంగంలు రెక్కలు విప్పి ఎగురుతున్నాయి.. నీహారిక బిందువులతో ..పంటలు సస్యశ్యామలంగా ఉన్నాయి..అంటూ వర్ణా తీతంగా వర్ణించి..వర్ణించి చంపుతుంది.. అనగానే మావాళ్ళు అందరు.. చేతయి చేతకాని ఈలలు.చప్పట్లు..తో..సందడి చేసారు.

రమ అయితే అందుకేగా నేను ఆమెకి ఘోషా రాణి అని పేరు పెట్టాను అంది.

మిగతా వాళ్ళైతే అర్జంట్గా రేపటి నుండి..ఆమెని వినడానికైనా రేడియో వినాలి అని తీర్మానించుకున్నారు.

అవునా.. !? చచ్చాం బాబోయి..!!!ఆమె వస్తే..మేము రేడియోనే ఆఫ్ చేస్తాం అంది..రమ.

రెండేళ్ళ క్రితం అనుకుంటాను..తీవ్ర అనారోగ్యం చేసి.మంచాన పడి మరలా..ఆరోగ్యం చేకూర్చుకుని.. ఎక్కడైనా పంక్షన్స్ లో కనబడినా..ఎలా ఉన్నారు అని కూడా ఆమెని పలక రించబుద్ది కూడా కాదు. ఎందుకంటే ఆమె నన్ను అంత హర్ట్ చేసింది. నోరుంది కదా అని అవాకులు చెవాకులు పేలడం,రాయడం వచ్చు కదా అని ఆకాశరామన్న ఉత్తరాలు వ్రాయడం.. ఇవన్నీ నాకు నచ్చలేదు. ఆమె వ్రాసినవి అన్నీ తనే స్వయంగా రాసిందని..సాక్ష్యాలతో సహా..నిరూపణ ఇప్పిస్తాను..అంటే.. వదిలేయండి..అంటారు..ఆమెని ని సపోర్ట్ చేసేవాళ్ళు.

ఇక నా ఫ్రెండ్ కుసుమ అయితే.. తన మూలంగా చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఆమె వ్రాతల వల్ల మూడేళ్ళ పాటు ఆకాశవాణి లో.. నుండి ఆమె వాయిస్ ఎయిర్ లోకి రాకుండా జనరల్ డ్యూటి లకి పరిమితం చేసారు. ఆఖరికి విసుగు వచ్చి.. హైదరాబాద్ కి బదిలీ చేయించుకుని వెళ్ళిపోయారు.
అలాటి వికృతమైన మనస్తత్వం నేను ఎవరిలోనూ చూడలేదు.నేను ఎప్పుడు ఏదో.. వ్రాసేస్తూ..గొప్ప రచయిత్రి కావాలని,పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించలేదు. నాకున్న తీరిక సమయంలో..నేను స్పందించిన విషయాన్ని కాగితం పై పెట్టడం..బాగుంది అనుకుంటే పత్రికలకి పంపడం..తప్ప.. నాలో ఉన్న రచనా శక్తి ని పెంపొందించుకోవాలని,రైటర్స్ వర్క్ షాప్ లకి వెళ్లాలని.. పుస్తకాలు అచ్చు వేయించుకుని..పరిచయం చేయాలనుకోవడం కానీ చేయడం ఉండదు.

మా కవిత్వ మిత్రులు అంటూ ఉంటారు.. ఎప్పుడు కవితా సంపుటి..ప్రచురణ చేయిస్తారు అంటారు.వివిధ పత్రికలలో వచ్చిన 46 కవితలు ఉన్నాయి అయినా నేనొక కవయిత్రిని అని నేను చెప్పుకోను.. నా ఆత్మ సంతృప్తి కోసమే.. నా స్పందనని...నాలో మెదిలిన భావాలు వ్రాసుకుంటాను. సాహితీ లోకంలో కూడా ఎన్నో భావ కాలుష్యాలు..భావ చౌర్యాలు చూసాను. ఒక రకంగా నాకు అక్కడ చాలా చేదు అనుభవాలు ఉన్నాయి. ఇతరుల అనుభవాలని వింటూ ఉంటాను. ఎప్పుడైతే మనకి గుర్తింపు రావాలని కోరుకుంటామో..అక్కడే మనలని అణచి వేసే కొందరు తయారుగా ఉంటారు. కొందరి లో..మంచి ప్రతిభ లేకున్నా ఆకాశానికి ఎత్తేస్తారు. అని చెపుతూ.. నా మనసులోని ఆవేదన అంతా వెళ్ళ గ్రక్కాను. అందరు..మౌనంగా వింటూ ఉండిపోయారు. .

ఆమె స్త్రీ యే కదా..స్త్రీకి శత్రువు స్త్రీయే. కదా..అనుకుంటాను. అలా అని పురుషులలో.. ఈర్ష్య ఉండదు అని చెప్పను ..కానీ స్త్రీలలో..ఈర్ష్య ద్వేషాలు ఎక్కువ అనడానికి ఉదాహరణగా.. నా లైఫ్ టైములో..ఈమె ఒక్కరే కనబడ్డారు..అని ముగించాను.

..ఏం కాదు..నేను చెప్పేది వింటే. నువ్వు..స్త్రీలే నయం పురుషులకంటే..అంటావ్..అని.. అంది పద్మ.
పద్మ చెప్పినది..ఇంకో.పోస్ట్ లో.

7 వ్యాఖ్యలు:

రసజ్ఞ చెప్పారు...

ఎప్పుడైతే మనకి గుర్తింపు రావాలని కోరుకుంటామో..అక్కడే మనలని అణచి వేసే కొందరు తయారుగా ఉంటారు. మనకి గుర్తింపు రావాలని కోరుకోనక్కర్లేదు ఎవరయినా మన ప్రతిభను మెచ్చుకుంటున్నారు అని అనిపించినా అక్కడ మొదలవుతుంది అసూయా బీజం.

lalithag చెప్పారు...

"తీవ్ర అనారోగ్యం చేసి.మంచాన పడి మరలా..ఆరోగ్యం చేకూర్చుకుని.. ఎక్కడైనా పంక్షన్స్ లో కనబడినా..ఎలా ఉన్నారు అని కూడా ఆమెని పలరించబుద్ది కూడా కాదు. ఎందుకంటే ఆమె నన్ను అంత హర్ట్ చేసింది. నోరుంది కదా అని అవాకులు చెవాకులు పేలడం,రాయడం వచ్చు కదా అని ఆకాశరామన్న ఉత్తరాలు వ్రాయడం.. " ఇది అర్థం చేసుకోగలుగుతున్నందుకు, అర్థం చేసుకోగలిగే లా చేసే జీవితానుభవం ఎదురైనందుకు బాధపడుతున్నాను.
విచిత్రమైన పరిస్థితి ఏమంటే, అటువైపు వాళ్ళు కూడా సరిగ్గా ఇవే మాటలంటారు. ఏ ఒకరి మాటలైనా ఎవరైనా ఎందుకు నమ్మాలి అనిపిస్తుంది నాకు. అంటే నేను ఇలా అని చెప్తే నమ్మే వారు ఎందుకు నమ్మాలి? అవతలి వాళ్ళు నా గురించి అలానే చెబుతుంటారు కదా, వినేవారు అవి నమ్మకూడదనే అనుకుంటాను కదా? ఎవరి పార్టీ వారు వారి మాటలు నమ్ముతారు. ఒక్కో సారి ఎలా ఉంటుందంటే ఎవరైతే బాధించబడ్డారో, వారి వైపు వారే నాలాగా ఎక్కువ ఆలోచించే వారై ఉంటారు. వారికి నైతిక మద్దతుని కూడా సంపూర్ణంగా ఇవ్వలేరు అటువంటి వారు. ఇలాంటి ధర్మ సందేహాలు రాకుండా ఉండాలంటే మన వారి మాటలు మనం నమ్మడం సులభ మార్గం. లేదా ఒక స్టీరియోటైపు ఏర్పరుచుకోవడం, ఉదాహరణకు 'ఆడ వారు అసూయాపరులు ' వంటివి. అంతే కాకుండా ఇలాంటి స్టిరియోటైపునుంచి తననీ, తమవారినీ exceptions గా అనుకోవడం కూడా అవసరం ఇలా తృప్తిపడగలగడానికి.
ఇంకొకటి కూడా విన్నాను. అది జోకులాగా చెప్పారు కానీ నాకు అనుభవమైన జీవితంలో నాకు ఇది కఠిన నిజం అనిపిస్తుంది. "మా మగవాళ్ళం ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. మరి మీ ఆడవాళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటారు?" అని అడిగితే ఆమె ఇచ్చిన సమాధానం, "ఆడ వాళ్ళ గురించే!" అని. అదేనేమో అనిపిస్తుంది లోకం తీరు.
అసూయ నన్ను చాలా బధపెట్టే విషయం. అసూయ మిగిలిన ఐదిటి లాగే అతి సహజమైన గుణం. ప్రక్క వారిలో తెలిసినంతగా మనవారిలో, మనలో తెలియదు. ప్రక్క వారిలో గమనించినప్పుడు మనం జాగ్రత్తగా మెసులుకోవాలి. confrontaion సమస్యని పెంచుతుంది కానీ తీర్చదు. మనలో గుర్తించుకున్నప్పుడు అది మనకి ఏది కావాలని అనుకుంటున్నామో తెలియచేస్తోందని తెలుసుకుని handle చేసుకోగలిగితే నిజానికి అది మన మీద మనకి విజయాన్నిచ్చి, మన ప్రశాంతతకి, తద్వారా మన భౌతిక విజయాలకి కూడా కారణం కాగలదు. ఇది నాకు ఇంతవరకూ అర్థమైనది.

రాజి చెప్పారు...

ఎదుటి మనుషుల సంతోషాన్ని చూడలేని మనుషుల్లోని వికృతరూపం ఎన్ని దారుణాలకైనా తెగిస్తుందండీ..

RAAFSUN చెప్పారు...

ఆవిడా ఏదేదో చేసింది ...మీ మీద సరే.....కాని మీరు ఎలా బ్లాగులో ఆవిడగురించి రాయడం అసూయా కాదంటారా....ఇది అందరికి ఉన్న రోగమే..."మనం చేస్తే చమత్కారం వాళ్ళు చేస్తే బలాత్కారం" అన్నట్టుగా ఉంటుంది అంతే......

అసూయ ని పాజిటివ్ గా వాడుకుంటే మంచి ఫలితాలని ఇస్తంది....

అయినా నాకెందుకులెండి ఆ గొడవా !!! లేకపోతె నన్ను లాగుతారు ....

వనజ వనమాలి చెప్పారు...

రసజ్ఞ .. మీరన్నట్లు పదుగురు మెచ్చుకునే చోట నుండే అసూయా బీజం పుడుతుంది.నిజం. ఆ అసూయ బీజం నాకు మంచే చేసింది. అందుకు నేను సంతోషంగానే ఉన్నాను. మీ స్పందనకు నా ధన్యవాదములు.

లలితా గారు..స్పందించి నందులకు ధన్యవాదములు. నిజానికి మీరన్నట్లు.నాణేనికి బొమ్మ బొరుసు రెండు ఉంటాయి. అయితే.నా నలబైరెండేళ్ళ జీవన గమనం లో.. అలాటి ఈర్ష్యా భావం వల్ల నేను అమితంగా బాధ పడ్డాను.అయినా ఆ ఈర్ష్య నాకు మంచినే మిగిల్చింది. మీ అభిప్రాయం తో.ఏకీభవిస్తాను. ధన్యవాదములు.
రాజీ గారు..ధన్యవాదములు. మీకు విజయవాడ ..స్టేషన్ బాగా వినబడుతుంది కదా.. లైవ్..ప్రోగ్రామ్స్ వింటూ ఉండండి. నేను చెప్పింది యెంత నిజమో..అర్ధం అవుతుంది.

రాఫ్సున్ గారు..నేను ఆ అసూయని పాజిటివ్ గానే వాడుకున్నాను. అందుకే నేను ఇలా ఉన్నాను అని చెప్పడమే..నా ఈ పోస్ట్. చేదు అనుభవం షేర్ చేసుకోవాలి. మీ ప్రక్కన అలాటి వారు ఉంటారు అని చెప్పడం మంచిదే కదండీ.

కాయల నాగేంద్ర చెప్పారు...

ఈర్ష్యా ద్వేషాలు ప్రభుత్వ కార్యాలయాలలో మరీ ఎక్కువ. ఇలాంటి వికృతమయిన మనస్తత్వాలు స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ కనబడతాయి.ఇలాంటి అసూయపరులను ముందుగా గుర్తించి మనం దూరంగా ఉండడం శ్రేయస్కరం. చాలా బాగా రాసారు. ఇలాంటి వారికి కనువిప్పు కలిగేలా ఉంది.

మౌనముగా మనసుపాడినా చెప్పారు...

ఇందు మూలముగా అందరికి తెలియజేయునది ఏమి అనగ? మేము పేరు మార్చుకొని వచ్చాము మా పేరు మీ అందరికి నచ్చుతుంది అని ఆశతో మీ మౌనముగా మనసుపాడినా బ్లాగ్