24, డిసెంబర్ 2011, శనివారం

పులి -ఆడపులి

పులిని చూసాను - ఆడ పులిని సమీపంగా చూడలేకపోయాను.

బాల్యం  ఎవరికైనా ..ఓ..స్వేచ్చా ప్రపంచం.

  శ్రీ శ్రీ గారన్నట్లు  వాన కురిసినా .పువ్వు విరిసినా,హరివిల్లు ప్రత్యక్ష మైనా ..అవన్నీ తమకు మాత్రమే  సొంతం అనుకునే అందమైన, అమాయకమైన బాల్యం.

నా బాల్యం చాలా మధురంగా గడచి పోయింది. అన్నయ్య చెల్లి మద్యలో..నేను.

ఎనిమి దేళ్ళ వరకు  అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాను. పిన్ని..మామయ్యల ప్రేమతో..పెరుగుతూ..బడికి ఎగనామం పెడుతున్నానని..మా వూర్లో అయితే..ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ పెట్టారని  అమ్మ నన్ను తీసుకొచ్చేసి  మా వూరి కాన్వెంట్లో జాయిన్ చేసింది. మా టీచర్ కి.. మా అమ్మ రెండు పూటలా పాలు పోసేవారు.కూరగాయలు అవి ఇస్తూ ఉండేది.  అందుకని ఆవిడ మాకు   బాగా శ్రద్దగా చదువు చెప్పేవారు.

మా వూరు చుట్టూ ప్రక్కల ఊర్లు అన్నింటిలోను ఘనమైనదిగా మా వూరికి  పేరుంది.అంతా మోతుబరి రైతులే ఉండే వారు.బస్ సౌకర్యం అంతగా ఉండేది కాదు కానీ అందరికి.. ప్రత్యేకంగా ఒక ఎద్దుల బండికి గూడు కట్టి ఉంచేవారు.ఇంట్లో ఎవరైనా బయటకి వెళ్ళాల్సి వస్తే మైలవరం వరకు అందులో వెళ్లి అక్కడినుండి బస్ లో వెళ్ళేవారు.

మైలవరం వెళ్ళే రూట్లో..రోడ్డు నుండి రెండున్నర కిలోమీటర్ల దూరంలో..మా ఇల్లు వచ్చేసేది. . 

మా చిన్నప్పుడు ఆ బండి ఎక్కి మా చిన్నాయనమ్మా, అత్తలు, అమ్మవాళ్ళతో కలసి  ఏడ్చి గీ పెట్టి మరీ   సినిమాకి వెళ్ళేవాళ్ళం. ఎక్కడో..వెల్వడం ప్రక్కనే.. మైలవరం ఊరి చివర ఉన్న విజయలక్ష్మి టూరింగ్ టాకీస్ లో..ఎప్పుడు మంచి మంచి సినిమాలు వచ్చేయి.అశోక్ దియేటర్ లో కానీ తర్వాత కట్టిన  నారాయణ దియేటర్ లో కానీ అంత మంచి సినిమాలు వచ్చేవి   కావు.అలా పెద్దవాళ్ళతో కలసి చూసిన సినిమాలలో..రాము,చిట్టిచెల్లెలు,ముత్యాలముగ్గు  ఉన్నట్లు బాగా జ్ఞాపకం.

రవాణా సౌకర్యం లేకపోయినా పాడి పంటలకి , ఘోషాకి కి నెలవు అని మా ఊరికీ పిల్లనివ్వడానికి ఉరికి వచ్చే వారట. ఘోషా అంటే ఏమిటి..తాతయ్యా ! అని అని అడిగితె.. "చుట్టుప్రక్కల ఊర్లు లో యెంత మోతుబరి రైతు భార్య అయినా పొలంకి వెళ్లి పొలం పనులు చూసుకోవాల్సిందే! మన వూర్లో  ఆడవాళ్ళు అలా వెళ్ళరమ్మా..అందుకే..మన వూరి కోడళ్ళకి..కూతుర్లకి.. నాజూకయిన వారు అని పేరు. పిల్లలని ఇవ్వాలన్నా చేసుకోవాలన్నా.. మన వూరికి ప్రాధాన్యం  ఇస్తారు" అనేవారు.

మా నాయనమ్మ,తాతయ్య ప్రేమ మూర్తులు. మా ఇల్లు ఎప్పుడు చుట్టపక్కాల రాకపోకలతో..చాలా సందడిగా ఉండేది.  నాయనమ్మ ,తాతయ్య తెల్లవారుజ్హామునే లేచి చుట్టపక్కాల విషయాలు చెప్పుకుంటుంటే.  మండువా ఇల్లు మాది..గదులకి పైన గోడలు పూర్తిగా కట్టి ఉండేవి కాదు. వాళ్ళ మాటలు బాగా అందరికి వినబడేయి. అమ్మ విసుక్కునేది. మెలుకువ రావడం ఆలస్యం వీళ్ళకి ఎప్పుడు చుట్టాల కబుర్లే!నేను దుప్పటి ముసుగు తీయ కుండానే..భలే శ్రద్దగా వినేదాన్ని.చాలా సందేహాలు ఉండేయి కూడా! మళ్ళీ తెల్లవారినాక  అడిగితే  చాలా వివరంగా చెప్పడం మా తాతయ్య ప్రత్యేకత.

మావూళ్లో నా చిన్నప్పుడు లైబ్రరి దగ్గర రోజు రాత్రి పూట రామాయణం వినిపించేవారు. నేను రోజు నాయనమ్మ వెంట..ఓ..చాప,దుప్పటి వెంట బెట్టుకుని వెళ్లి అక్కడ చాప పరచుకుని...విసుగు వేస్తే  నాయన్నమ్మ వళ్ళో పడుకుని,చలివేస్తే దుప్పటి కప్పుకుని  ఆవలింతల మద్య ఎలాగోలా విని వచ్చేదాన్ని. ఆంజనేయ స్వామి  సూర్యుడిని మామిడి పండు అని తిన బోయాడట.అందుకే ఆయన మూతి అలా వచ్చినదని చెప్పడం గుర్తు. రామాయణం అంతా విని రాముడంటే భక్తి కల్గింది.అన్నీ   ఉన్న మా వూరిలో..గుడి ఉండేది కాదు..

అంటే అసలు గుడి లేదని కాదు. ఉంది.ఆ గుడిని, రాముడిని పట్టించుకోకుండా .. దేవాలయం భూములన్నీ మింగేసి.. నైవేద్యం కూడా పెట్ట కుండా తాళాలు వేసేసారన్నమాట.ఆ గుడికి ఒక ప్రత్యేకత కూడా ఉందని చెప్పేవారు. భద్రాద్రిలో..సీతా రాములవారి గుడికి ఉన్న ప్రత్యేక వాస్తుతో..అదే మాదిరి ఉందని చెపుతారు. కానీ గుడి ని ఎవరు పర్యవేక్షించక మూసి పెట్టి ఉండేది.

అమ్మా..నేను రాముడిని చూడాలమ్మా..అంటే "వద్దు.. ఏళ్ళ తరబడి పాడుబెట్టి ఉంచారు. అంతా జిల్లేళ్ళు.సీమతుమ్మలు.పురుగు పుట్రా ఉంటాయి..వెళ్ళవద్దు"  అనేది. ఒకవేళ అలా అన్నప్పటికి కూడా  నేను వెళ్ళే తీరతానన్న సందేహం వచ్చేదేమో.. మళ్ళీ వెంటనే అక్కడ ప్రక్కనే ఉన్న మర్రి చెట్టుమీద దెయ్యాలు ఉంటాయి వేళ్ళకు అనేది. అయినా   నేను  దారి చేసుకుని వెళ్ళా ననుకోండి. లోపలి వెళ్లి తలుపుని తీద్దామనుకుంటే అక్కడ ఓ..పెద్ద తాళం వేసి ఉంది.  నిలువెత్తు పెరిగిన జిల్లెల్ల మధ్య నుండి దారిచేసుకుని నైరుతి మూలనున్న మండపం ఎక్కి కూర్చున్నాను. అలా పైకి   చూద్దును కదా..నల్లగా..ఏమిటో..వేలాడుతూ..కనిపించాయి. అవే దెయ్యాలనుకుని   ఒకటే పరుగు. మద్యలో..పడి లేచి వెళ్ళేటప్పటికి అక్కడ పెరిగిన చెట్ల  ముళ్ళు కొమ్మలు గీసుకుపోయి.. స్నానం చేయించేటప్పుడు అమ్మకి కనబడి.. మళ్ళీ రెండు దెబ్బలు వడ్డింపు . "ఎందుకు  వద్దన్న  పనే చేస్తావని..."

స్కూల్కి వెళ్ళడం,చదువుకోవడం సాయంత్రం   అయితే చాలు  పిల్లలందరూ   చేరి ఒకటే..ఆటలు పాటలు. తినడానికి బోలెడు అప్పచ్చులు   సిద్దంగా ఉండేవి. పచ్చీసు ఆటలు,కోతికొమ్మచ్చి,వెన్నెల కుప్పలు, చింత పిక్కలాట..కుందుళ్ళు,కబాడీ..దాగుడుమూతలు. గోలీలాటలు..అన్నీ ఆడేవాళ్ళం. నాతొ మా అన్నయ్య ఉండేవాడు.  పిల్లల మధ్య ఆటల్లో ఆడమగ తేడానే లేదు.      ..

పెద్దవాల్లేమో వాళ్ళ  వాళ్ళ కబుర్లు తో బిజీ గా ఉండేవారు . సెలవల్లో సినిమాలు..మామిడి తోటల్లో..తిరగడం,ఏ రుతువులో వచ్చే కాయ గట్రా.. పిందేలే తెంపడం, జామకాయలు దొంగతనంగా కోయడం,వగరు అని విసిరి కొట్టడం ..మధ్య మధ్యలో..కొట్లాటలు..పిర్యాదులు.. మా అన్నయ్య  గొడవలు వద్దని వెనక్కి లాగిన కొలది..నేను వెళ్లి మరీవాళ్ళని  కొట్టి రావడం మాములుగా ఉండేది.మళ్ళీ తెల్లవారితే.. చేయి చేయి కలపడం  మా బుడమేరు వాగులో ఆడడం,చెలమలు తీయడం పరుగులు తీయడం  ఓహ్..అంతా ఆనందమే! అక్కడ అడ్డుకట్టలే లేవు.

మా పెద్ద నాన్న గారింట్లో రేడియో ఉండేది. అందులో వచ్చే వార్తలు వినేవాళ్ళం .పాటలు వినేవాళ్ళం. ఆదివారం వస్తే మధ్యాహ్నం మూడు గంటలకి..సినిమా వచ్చేది. అందరి రేడియో చుట్టూ కూర్చుని సినిమా వినేవారు." కోరికలే  గురాలైతే" సినిమాని  అలాగే విన్నాను.

మా అమ్మ , అక్క ,.పెద్దమ్మ తలా ఒక వార పత్రిక తెప్పించుకుని.. మార్చుకుంటూ చదువుకునేవారు. వనితా జ్యోతి,ఆంద్ర జ్యోతి,ప్రభ పత్రికలూ వచ్చేవి. జ్యోతిలో  .."రాధాకృష్ణ' సీరియల్ వచ్చేది. నేను ఆ సీరియల్ చదవబోతుంటే "..నీకెందు..నువ్వు చిన్న పిల్లవి.. ఇది చదవకూడదు అని  అక్క కసురుకుంటే.. మా అమ్మ మాత్రం కొన్ని మాచేత చదివించేది. పుస్తకాలు చదవాలని చెప్పేది. మా వూరి లైబ్రరీలో..పుస్తకాలకి.. ముప్పై రూపాయలు డిపాజిట్ కట్టి మరీ పుస్తకాలు తెప్పించి తను చదివే వారు.మా చేత చదివించేది కూడా !.

నాకు తొమ్మిది ఏళ్ళప్పుడు దివిసీమ తుఫాను వచ్చింది.  అంత వర్షం ఉరుములు కి భయమేసింది  నేనా రోజయితే.. పెందలాడే అన్నం తినేసి.. మంచం పై పడుకోకుండా.. మంచం క్రింద దూరి పడుకున్నాను. మేము పడుకునే గదిలో..దక్షిణపు వైపు ఒక పెద్ద  కిటికీ  ఉండేది. ఆ కిటికీ రెక్కలు పెద్దగా వీచే గాలికి కొట్టుకుంటూ.. ఆ తలుపు  సందులో నుండి  పెద్ద పెద్ద మెరుపులు,తర్వాత వచ్చే  ఉరుములు  అంటే..నాకు చచ్చే భయం వేసేది.(ఇప్పటికి ఉరుము అంటే భయమే.) ఇక భయమని అలా పడుకున్నానా..మళ్ళీ  తెల్లవారి లేవడమే.. నాకు..ఉప్పెన బీభత్సం గాని... అసలేమి   తెలియవు.. అగ్ని శిఖలు కనబడినాయి అని చెప్పుకుంటుంటే.. భయమేసింది. కథలు కథలుగా పేపర్లో చూసి చెప్పుకోవడం, వినడం..ఒక నెల రోజులంతా అవే కబుర్లు. బోలెడు  మంది చనిపోయారని ఎక్కడ చూసినా శవాల గుట్టలు కనబడ్డాయని చెప్పుకునే వారు.  మా వూరి నుండి..బట్టలు,బియ్యం,దుప్పట్లు.(క్రొత్తవే) పోగేసి పంపారు కూడా..

ఆ తుఫాను వచ్చిన రోజు ఇందిరా గాంధి పుట్టిన రోజని చెప్పుకున్నారు.

ఇందిరా గాంధి అంటే నాకు అప్పట్లో..చాలా ఇష్టం..జాలితో వచ్చిన ఇష్టం కూడా.ఏమో!.

ఒక రోజు ఆవిడ ఫోటోని..అది ఉయ్యాల బల్లలో..కూర్చుని.. నెత్తిన చీర చెంగు వేసుకుని చాలా దిగులుగా కూర్చున్న ఫోటో.ని .పేపర్ లో వేసారు. అందరూ ఆ పేపర్త చూస్తూ తగిన శాస్తి జరిగిందని చెప్పుకుంటున్నారు. మా అమ్మని అడిగాను "ఎవరమ్మా  ..ఆవిడ" అని .

మన దేశ ప్రధానిగా చేసి మంచి గా నడుచుకోలేదు.అందుకే   అందరూ అందరూ  ఒట్లేయకుండా  ఓడిపోయేటట్లు చేసారు  .అని చెప్పారు . అయినా ఒక ఆడమనిషి దేశ ప్రధానిగా చేయడం కూడా..చాలా గొప్ప.  ఈ సారి మళ్ళీ ఆవిడే ప్రధాని అవుతారు కూడా..అని  అంది. . ఆ పేపర్ తీసి దాచుకుని ఇందిరా గాంధి నే చూస్తూ ఉండేదాన్ని.   .ఇప్పుడు ఇందిరా ప్రసక్తి  ఎందు కంటారా?    ఇంకొంచెం  ముందులో..అదే చెప్పబోతాను కాబట్టి.

ఇక ఆతర్వాత సంక్రాంతి సెలవలు వచ్చినప్పుడు.. అమ్మ వాళ్ళు తెల్లవారుజ్హామునే లేచి ముగ్గులు పెట్టుకుంటుంటే..నేనేమో..మెల్లగా లేచి.. బయటకి పరిగెత్తాను ఎక్కడికంటే  ఊరికి ప్రక్కనే  పెద్ద పెద్ద స్థలాలు ఉండేవి   .వాటిని  వామిలి దొడ్లు అనేవాళ్ళు.. కంది కంప, గడ్డి వాములు వేసుకునే స్థల్లలు.ఆ దొడ్లలోనే..కూరగాయల పాదులు వేసేవారు. హద్దులలో.. చింత చెట్లు ఉండేవి. సంక్రాంతి సమయానికే అక్కడో కాయ ఇక్కడో కాయ చింత కాయలు పండి రాలుతూ ఉండేవి.ఆ కాయలు తింటుంటే..అబ్బ ఎంత పుల్ల పుల్లగా తీయ తీయగా ఉండేవో!  అందరికన్నా ముందు లేచి వెళ్లి  వాటిని ఏరుకుని.. గర్వంగా ఊరించుకుంటూ తినడం గొప్ప,ఆనందం కదా..! చీకట్లో.. ఏం ఆరిపోయింది..అలా..కంపలంపట తిరిగి చింతకాయలు ఏరడం..ఎందుకు?. తర్వాత తెచ్చుకోకూడదా అని అమ్మ కోప్పడుతుందని... అలా మా అమ్మకి కనబడకుండా మెల్లగా జారుకుని..ఇల్లు దాటగానే ఒకటే పరుగులు తీశాను. అప్పుడు చాలా బాగా మంచు కురుస్తుంది.అలా నేను పరుగు పెడుతూ.. పెడుతూ..మా వామిలి దొడ్డి సమీపం లోకి  వెళ్ళబోతూ ఆగి పోయాను.

ఎందుకంటారా? మీరు ఎప్పుడైనా పులిని చూశారా !? జంతు ప్రదర్శన శాలలోనో (ఇప్పుడు యు ట్యూబ్ లోనో ..కాదు)..నిజంగా.. అన్నమాట.

అప్పటకి నేను పులిని బొమ్మగా పుస్తకాలలో..చూసాను. బొమ్మగా చూసినదిగా ఎదురుగా కనబడుతుంటే..

నాకు గుండె ఆగిపోయింది.  ముందు గేదె పడ్డ ఏమో అనుకున్నాను. కానీ బాగా చూసాక  అర్ధం అయింది.అది పులే..అని. బొమ్మలా అలా కదలక మెదలక రాతి స్తంభం అంటారే ఆ మాదిరి గా నిలబడి పోయాను.  నా ఎదురుగా నుండే పులి.. అడ్డంగా నడచుకుంటూ వెళ్ళిపోయింది.అదృష్టవశాత్తు పులి నన్ను చూడలేదు అనుకున్నాను .ఇక అంతే.!. వెనక్కి తిరిగి ఒక్క దూకులో ఇంటికి వచ్చి పడ్డాను. అంత చలి కాలంలోనూ వళ్ళంతా చెమటలు.. వెళ్ళడం వెళ్ళడం..మా తాతయ్య దగ్గరికి వెళ్లి ఆయన పక్కన పడుకున్నాను. అలా అలవాటే కాబట్టి ఆయన ఏమి అనకుండా.. ఏదో..అడుగుతూంటే   అసలు చెప్పలేదు. వణికి పోతుండటం చూసి. ఏమిటని అడిగితే..  పులిని చూసాను అని భయం భయంగా చెప్పాను. నమ్మలేదు. ఎలా ఉంది అంటే  గుర్తుకు తెచ్చుకుని చారలు వేసుకుని పచ్చగా ఉంది తాతయ్యా    ..తోక కూడావేలాడి  మళ్ళి పైకి తిరిగి ఉంది అని చెప్పాను. ఆవు అయిఉంటుందమ్మా ..అన్నారు." ఏం కాదు పులే! "అన్నాను గట్టిగా..'

:సరే..భయపడకు..అటు ఇటు కొండలు ఉన్నాయి కదా! తిరుగుతుంటాయి లే"..ఆన్నారు.

అదే రోజు సాయంత్రానికి ఇంకొందరు పులిని చూసామని చెప్పాక కానీ   తాతయ్య నమ్మారన్నమాట.
అలా వెళ్లబాకు.మనిషి రక్తం మరిగిన  పులి కాదు  కాబట్టి ఎవరిని ఏమి చేయడం లేదు. లేకపోతే చాలా ప్రమాదం అని చెప్పి..మీ అమ్మకి చెప్పకు..అలా తిరగ వద్దని ఇక నీకు రోజు కాళ్ళకి తాళ్ళు కట్టి కట్టిపడేస్తుంది అని.   అదే మాట మళ్ళీ  మళ్ళీ  గట్టిగా చెపితే..అప్పటికి  బుద్దిగా తల  ఊపేసి.. రెండు రోజులకి.ఊర్లో పిల్లలందరికీ కథలు కథలుగా వర్ణించి పులి గురించి చెప్పేసి.. కాలరు (ప్రాక్ కాలరేలెండి)   ఎగరేసాను.ఆ నోటా ఈ నోటా పెద్దాళ్ళ నోట్లో పడి.. మా అమ్మకి తెలియనే తెల్సింది.అప్పుడు అమ్మ  గబుక్కున వాటేసుకుని..ఏడ్చేసి..  అలా దొడ్లేమ్మడా .తోపులలోను ఆడవద్దని ఒట్టు పెట్టిన్చుకుంది. అప్పుడు కొట్టలేదు. చాలా సంతోషం వేసింది కూడా.. అప్పుడలా  నేను పులిని చూసిన అనుభవం యెంత గర్వంగా ఉంటుందో! ఆ పులి ఎంత దర్జాగా..టీవిగా నడచి వెళ్లిందో..నాకు ఇప్పటికీ  గుర్తే!  ఆ తర్వాతెప్పుడు ఇందిరా గాంధి - పులి రెండే గుర్తుకు వచ్చేవి . ఇందిరా గాంధీ  గురించి వివరంగా చదివి తెలుసుకున్నాను కూడా.. ఆమె అంటే నాకు చాలా ఇష్టం ఏర్పడింది.
తర్వాత విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ప్రారంభోత్సవానికి ఇందిరా జీ వస్తున్నారని తెలిసి నాకు చాలా సంతోషం. దగ్గరలోకి వస్తున్న ఆమెని  ఎలాగైనా చూడాలని ఆరాటం.  మా వూరి నుండి..ట్రాక్టర్ల లోను ,లారీలలోను చాలా మంది ఆమెని చూడాలని   వెళుతున్నారు. అప్పుడు . అమ్మ దగ్గరరికి వెళ్లి ".అమ్మా ..నేను ఇందిరని చూడాలమ్మా..వెళతాను "అని అడిగాను .. అమ్మ..ఎప్పుడు మాదిరే.!.వద్దు..ఆడ పిల్లలు అలా వెళ్ళ కూడదు.జనంలో..పిల్లలు నలిగి పోతారు.ఇంకెప్పుడైనా చూడవచ్చులే!అని బుజ్జగించింది.  ఛీ! ఈ అమ్మలు ఎప్పుడూ..ఇంతే! ప్రతి దానికి జాగ్రత్తలు..ఆంక్షలు.. అనుకుని.. వీలైనంత నిజం ఏడుపే ఏడ్చాను..కూడాను. అయినా అమ్మ మనసు కరగనే లేదు. నాకు కోపం వచ్చింది. ఆమెతో..ఓ..రోజంతా మాట్లాడలేదు కూడా. ఆ మర్నాడు..పేపరంతా..ఆమె గురించి వార్తలే.! ఆమె చురుకైన నడక గురించి..నలగని చీర గురించి.. మాట తీరు  గురించి..భలే చెప్పుకుంటుంటే.. మళ్ళీ.. ఏడుపు.. అంత దగ్గరలోకి వస్తే ప్రత్యక్షంగా చూడలేక పోయానే నన్న .ఆ బాధ అంతా ఇంతా కాదు.

తర్వాత  నాకు  ఆమెని చూసే అవకాశం రాలేదు. ఆవిడ లేరు..

ఎప్పుడూ  అనుకుంటూ ఉంటాను.

 "పులిని చూసాను-ఆడ పులి లాటి ఇందిరని చూడలేకపోయాను" అని.

ఇది..నా బాల్యంలోని ..ఓ..నెమలీక.


(ఆంధ్ర జ్యోతి  దిన పత్రిక "నెమలీక ' శీర్షికలో..ప్రచురితమైనది తేది గుర్తులేదు)

6 కామెంట్‌లు:

రసజ్ఞ చెప్పారు...

బాగుందండీ! మీరొక్కసారి బ్యాంకాక్ పులి దేవాలయానికి వెళ్ళాలి అయితే అక్కడ మనం గోసాలలలో గోవుల్ని పెంచినట్టు పులుల్ని పెంచుతారు. మనుషుల మధ్యలో తిరుగుతూ ఉంటాయి!

అజ్ఞాత చెప్పారు...

చిన్న తనం చలా బాగుంటుంది, మరి తిరిగిరాదు

PALERU చెప్పారు...

బాగుందక్కా..నీ బాల్యం......అందరు తిరిగిరాదు అంటున్నారు కాని...వ్రుధాప్యం కుడా బాల్యమే అంటారుగా ....అంటే మళ్ళి వస్తుంది అనే కదా..!!! ఏంటో నాకు చాలా విషయాలు అర్ధమే కావట్లేదు .....ప్చ్

సుభ/subha చెప్పారు...

మళ్ళీ పరిగెత్తుకుని వచ్చిందండీ నా బాల్యం.. మీరు చెప్తున్నది చదూతుంటే..చాలా బాగుందండీ..

buddhamurali చెప్పారు...

వనజవనమాలి గారు మీ బాల్యం గురించి బాగా రాశారు. నేను ఇందిరాగాంధీ నీ చూశాను . ఆమె గురించి రాయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మురళీ గారు.. ధన్యవాదములు. త్వరగా.. ఇందిరా జీ గురించి పోస్ట్ వ్రాయండి. ఎదురు చూస్తూ ఉంటాను.
@ సుభా..గారు బాల్యంలోకి వెల్లిపోయారా ? యెంత బాగుంటుందో కదండీ!!
@ రాఫ్ఫ్సున్ .. ధన్యవాదములు. వృద్దాప్యం బాల్యం కాదు . అనుభవాల సారం . అందుకే వాళ్ళు కల్లాకపటం లేకుండా.. స్వచ్చంగా ఉండాలని.. వారి శక్తి యుక్తులు సన్నగిల్లి ఉంటాయి కాబట్టి..వారిని పిల్లలుగా చూసుకోవాలని చెప్పడమే వృద్దాప్యం ని రెండో బాల్యం అని అంటారని నేను అనుకుంటాను.
@ కష్టేఫలే..గారు.. ధన్యవాదములు. నిజంగా బాల్యం మళ్ళీ తిరిగి రాదు..కదండీ! భగవంతుడు వరమిచ్చి ఏమైనా కోరుకోమంటే..నేను నా బాల్యాన్ని తిరిగి ఈయమని అడుగుతాను.
@ రసజ్ఞ.. మీ చిత్రం యెంత బాగుందో! అమ్మో..మళ్ళీ పులిని చూడటమే! చిన్నప్పటి ధడుపే ఇంకా పోలేదు. ధన్యవాదములు.