కథా జగత్ విశ్లేషణ పోటీ లో.. నేను ఎన్నుకున్న కథ గోరీమా - అఫ్సర్ గారి కథ
నాకు ఈ కథలో నచ్చిన విషయం .. నచ్చిన పాత్ర గోరీమా. మరియు
గ్రామీణ వాతావరణంలో రెండు మతాల మనుషుల మధ్య పెనవేసుకున్న అనుబంధం ..
పీర్ల పండుగలో ..ఎలా అయితే అందరు కల్సి మమేకమై.. మాతం పాడుతున్నప్పుడు లీనమై పోయేవారో.. అదే విధంగా గణేశ ఉత్సవం లోను అందరు కలసి వేడుకలో పాల్గొనడం అన్నది సర్వ సాధారణ దృశ్యం.అక్కడ ప్రజలు పరస్పర గౌరవంతో,తర తరాలు కలసి మెలిగిన అనుబందం మనకి కళ్ళకి కట్టినట్లు రచయిత చూపించారు. . అయినప్పటికీ .. ఒక కులంకి చెందినవారిలో స్వార్ధం ప్రవేశించి ప్రాణం లేని రాయిని దేవునిగా ప్రతిష్టించి.. గోరీమా..ఇంటి స్థలాన్ని ఆక్రమించడం ..మొక్కులు పేరిట అక్కడ జరుగుతున్న ప్రాణ హింస,ఒక కులపు వాళ్ళ ఆధిపత్య ధోరణి చూసిన పాఠకుడికి కూడా ఏహ్యం కల్గింక మానదు. చిన్న చేపని పెద్ద చేప మింగేసినట్లు చెప్పకనే చెప్పారు రచయిత.
భర్త జ్ఞాపకంగా మిగిలిన ఒకే ఒక్క ఆస్తి.. ఆ ఇంటి కోసం ఆమె చేసిన పోరాటం స్పూర్తిగా ఉంది. అన్వర్ చిన్నతనంవల్ల చేతకాని తనం, సాహెబ్ స్వార్ధం,పలాయనావాదం.. చాలా మందికి ప్రతీక గా కూడా..కనిపిస్తుంది.
సున్నితమైన ,ప్రేమ మూర్తి అయిన గోరీమా .. ఆవేశం,ఆవేదన ..చివరి వరకు కూడా ఇంటిని నిలబెట్టుకోవడానికి ఆమె పోరాడిన విధానం..హృదయాన్ని తడిమి తడి చేస్తాయి.
వ్యక్తులు యెంత ఉన్నత స్థాయికి ఎదిగినా..ఎవరికైనా సొంత ఊరు సొంత ఇల్లు..అనేవి ఒక బలమైన,మధురమైన ముద్రగా ఆ వ్యక్తి జీవితంలో పెనవేసుకుని ఉంటాయి కాబట్టే.. అలీఫ్.. తన కథనంతో..తన ఊరిని,అక్కడి మార్పులతో పాటు..మనుషులమధ్య అనుబందాన్ని..ఇష్టంగా చెపుతూ.. అలీఫా కి వాళ్ళ అమ్మతో ఉన్న అనుబంధం,చిన్న నాటి ముచ్చట్లు తో పాఠకుడిని ఆసాంతం అక్కడ గిరికీలు కొట్టిస్తూ.. మన మధ్య జరిగిన కథ గా జీవం పోసి.. గోరీమా పాత్ర ద్వారా.. ఒక సందేశాన్ని అందించారు.
జీవితంలో..కొంత కాలాన్ని సర్వ శక్తులు కేంద్రీకరించి పోరాటం కి అంకితం చేసి .. ఆఖరికి ఓడినా కూడా.. అక్కడే.. దీనమైన స్థితి లో కూడా నా వూరు అనుకుంటూ.. బ్రతికే ఆమెని చూస్తే.. కళ్ళు చెలమలయ్యాయి. స్త్రీ స్వభావమైన బేలతనం కాకుండా..బలమైన వ్యక్తిత్వం తో..తన అన్నదానికోసం బలవంతులతో..పోరాడి ఓడిన ఆ స్త్రీ మూర్తి ఎందరికో ఆదర్శనీయం.
తండ్రి జ్ఞాపకంగా కూడా. కొద్దిపాటి భూమిని మిగుల్చుకోవాలనే స్వార్ధం లేకుండా... తమకి సంభందించిన భూమిని సొంతం చేసుకోవడానికి ఏ మాత్రం ప్రయత్నం చేయకుండా.. ఎలాగోలా కష్ట పడి తనకున్నఅప్పులు తీర్చుకోవాలి,తల్లి కి నచ్చ చెప్పుకోవాలి అన్న తలంపుతో.. తన వారి క్షేమం కోసం అల్లాని ప్రార్ధించిన మనిషి తత్వం మానవత్వం అలీఫా లో కనిపిస్తాయి. గోరీమా జ్ఞాపకాలతో..గోరీమాని పరిచయం చేసి.. ఆఖరికి గోరీమా గురించి చెప్పకుండా కథ ముగిస్తారేమో అనుకున్న తరుణంలో.. గోరీమాని గుర్తించడం కూడా ..ఓ..విషాద యోగమే! గొరీమా గురించి వర్ణించేటప్పుడు.. మనకి తెలియ కుండానే మనం ఆమె పాత్రలోకి ప్రవేశిస్తాం కూడా.
ఈ కథ లోని ప్రతి సన్నివేశం..చాలా అపురూపంగా తోచాయి.
మనకొక.. గొప్ప దార్శనికతని మిగిల్చే ఈ మాటలు ఆఖరిగా మరపురానివిగా ఉంటాయి.
అందుకే రచయిత అలీఫా తో. ఇలా అనిపించారు
"గోరీమా, ఈ దేశం రాయలేని చరిత్రలో నువ్వొక చరిత్రవి. నువ్వొక తిరుగుబాటువి. నా తరానికి అంతుపట్టని భూపోరాటానివి. సొంత నేలకోసం సంఘాన్నంతా ఎదురొడ్డి నిలిచావు. ఓడినా సరే, నువ్వే గెలిచావు. నీ నేల మీద నువ్వున్నావు. నేను ఈ నేలకి దూరంగా... పిరికిగా పారిపోతున్నాను..."
నిజానికి ఈ దేశ కాలమాన పరిస్థితుల్లో..పోలిస్తే ..
ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్న అందరికి వర్తిస్తుంది.కూడా.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి